పంతులుగారి ఆగ్రహం 

-ఆదూరి హైమావతి

 ప్రశాంతిపురం   ప్రాధమిక పాఠశాలలో మూడోక్లాస్ తరగతి గది అది.

 ప్రవీణ్    ఇంటిపని నోటు పుస్తకం మాస్టారికి ఇవ్వగానే ,మాస్టారు కోపంగా దాన్నితిరిగి ప్రవీణ్     చేతిలోకి విసిరేసి “ఏరా! ఇది వ్రాతా! పిచ్చి గీతలా! కోళ్ళు గెలికిన ట్లుందిరా నీ వ్రాత, ఛీ  వెళ్ళు. సరిగ్గా వ్రాసి తీసుకురా! జవాబులు తప్పుల్లే కుండా  చెప్పగానే సరిపోదు, దస్తూరీకూడా చక్కగా ఉండాలి.  వెళ్ళు”  అని అరిచారు. 

ప్రవీణ్    కు దిగులేసింది. క్లాసులో అంతా మౌనంగా తలదించుకుని ఉన్నా  డు.వాడు తెలివైన వాడే. అన్నిటికీ సమాధానాలు బాగా చెప్తాడు. వ్రాత దగ్గర కొచ్చేసరికి కాస్త ఒళ్ళుబధ్ధకం. త్వరత్వరగా వ్రాసేస్తే ఐపోతుందని వాని భావన.

స్కూల్  కాగానే ఇంటికొచ్చి దిగాలుగా కూర్చున్నాడు. వాడిని చూసి బామ్మ దగ్గరకొచ్చి” ఏరా! ప్రవీణ్   !అలా దిగాలుగా ఉన్నావ్! స్కూల్లో ఏమైందేం?” అని విచారించగానే  ప్రవీణ్    ఒక్కపెట్టున ఏడుస్తూ బామ్మను చుట్టేసు కున్నాడు.

బామ్మ వాడిని సముదాయించి అడిగాక, స్కూల్లో జరిగింది చెప్పాడు ప్రవీణ్     బామ్మకు.                 

బామ్మ ఒక్కమారు నవ్వేసి ” ఓస్ ! అంతేగా! ఇలారా! నీకోసం పోయిన వారమే ఈ ఫోర్ రూల్డునోట్ బుక్స్ తెచ్చి పెట్టాను.నీ దస్తూరీ  చూస్తూనే ఉన్నాను. వ్రాతలో నీకు తొందరెక్కువని గమనించాను. ఐతే నీకు దానిపై  శ్రధ్ధ కలిగినపుడే ఇద్దామని ఉంచాను. చూడూ నీ దస్తూరీ ఒక్క పక్షంలో  చక్కగా వస్తుంది ఇలా చేశావంటే సరా! “అంటూ బామ్మ పై లైన్ లో –  ‘శ్రధ్ధావాన్ లభతే ఙ్ఞానం’, ‘భారతదేశము నామాతృభూమి’ , ‘పరులసొమ్ము పాము వంటిది’.’ గురువు దైవంతో సమానం ‘  లాంటి వాక్యాలు తన  ముత్యా ల్లాంటి  అక్షరాలతో వ్రాసి , దగ్గరే కూర్చుని కాపీ వ్రాయించింది. 

ప్రతిరోజూ ఉదయం ,సాయంకాలం బామ్మ దగ్గరకూర్చుని శ్రధ్ధగా రెండు వారాల పాటు వ్రాయగానే  ప్రవీణ్    దస్తూరీ బాగు పడింది. వాడే ‘ఇదినా వ్రాతేనా!’అని ఆశ్చర్యపోయాడు. 

ఆరోజు పంతులుగారు వాడి హోంవర్క్ చూసి “ఏరా ప్రవీణ్  ! ఈ దస్తూరీ నీదేనా? ఇంత బాగా ఎలా వ్రాస్తు న్నావురా!”అని అడిగారు చిరునవ్వుతో వాడిని చూస్తూ.   

ప్రవీణ్    జరిగిందంతా చెప్పాడు. మాస్టారు వాడిని దగ్గరకు తీసుకుని  బుగ్గ మీద ముద్దు పెట్టుకుని “నీవు ఇంత మంచి దస్తూరీ సాధించాలనే నోయ్ నిన్ను  ఆరోజు కోప్పడింది.చక్కగా సమాధానాలు చెప్తావు, పాఠాలు బాగా వింటావు. వినయంగా వుంటావు .ఐతే నీదస్తూరీమాత్రం ఎన్నిమార్లు చెప్పినా సరిచేసుకోడంలేదు. పైతరగతులకు వెళితే దస్తూరికీ కూడా మార్కులుం  టాయి.అందుకే నేను ఆరోజు కావాలనే అలా కోప్పడ్డాను. నీకు రోషం వస్తే గానీ దస్తూరీ సరిచేసుకోవని . ఏదైనా లేతవయస్సుల్లో ,చిన్న తరగతుల్లోనే సరిచేసుకోవాలి పెద్దయ్యాక ఏదీ సరికాదు. అంతే. ఇహ నుంచీ  నీవే మన బోర్డుమీద నీతి వాక్యాలూ, తేదీ, వారం అన్నీ వ్రాయాలి తెలిసిందా?” అని మెచ్చుకున్నారు.

ప్రవీణ్   కు ఏనుగునెక్కినంత సంతోష మేసింది. స్కూల్ కాగానే పరుగు పరుగున  ఇంటి కొచ్చి బామ్మను కౌగలించుకుని, బళ్ళో జరిగిందంతా చెప్పాడు. 

అప్పుడు బామ్మ అందికదా!  “ ప్రవీణ్  ! స్కూల్లో మాస్టార్లైనా  ,ఇంట్లో పెద్ద  లైనా ఊరికే కోప్పడరురా! పిల్లలమీద ఎవ్వరికీ కోపం ఉండదు.మీ మంచి కేరా  .చూశావా! పంతులుగారి  కోపం నీమంచి దస్తూరీకి దారితీసింది. ” అంది బామ్మ.   

నీతి– పెద్దలకోపం పిలల్లమంచికే!.             

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.