మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం

సైగ్లో – 20

నేను నా భర్తను కలుసుకున్న కొన్నాళ్ళకే దాదాపు యాదృచ్ఛికంగా నా పుట్టిన ఊరికి, సైగ్లో-20కి వచ్చాను. ఆ ఊరే నాకు పోరాడడం నేర్పింది. నాకు ధైర్యం ఇచ్చింది. ఇక్కడి జనం జ్ఞానమే నేను అక్రమాల్ని స్పష్టంగా చూడడానికి తోడ్పడింది. ఆ ఊరు నాలో రగిల్చిన అగ్నిని ఇక చావు తప్ప మరేదీ ఆర్పలేదు.

పులకాయోలో ఉన్నప్పుడు సైగ్లో-20కి వెళ్ళి చూడాలని నాకెంతో కోరిగ్గా ఉండేది. పులకాయోలో జనం సైగ్లో-20 గురించి ఎంతగానో చెప్పుకునేవారు. పాటలు కూడా పాడేవారు. ఎవరైనా నన్నెక్కడ పుట్టావని అడిగితే సైగ్లో-20 లాలాగువాలో అని చెప్పుకునే దాన్ని. నిజంగా ఈ ఊరినిగూర్చి తెల్సుకుందామని నాకెంతో కుతూహలం ఉండేది.

పెళ్ళయింతర్వాత నేను మొదట ఆలోచించింది అదే. చాలా యాదృచ్ఛికమైన విషయమేమిటంటే నా భర్త జన్మస్థలం కూడా సైగ్లో-20 యే.

అది 1957. మాకు సైగ్లో-20 వెళ్ళేందుకు మొదట అవకాశం వచ్చింది. సెలవు లొచ్చినప్పుడు కొంత డబ్బు పోగేసుకొని మేమిద్దరం సైగ్లో-20కి వచ్చేశాం. ఆ వూరిని ఆయనెంత ఇష్టపడ్డాడంటే ఆయనింక తిరిగి పులకాయోకు రానేలేదు. అక్కడే పని కోసం ప్రయత్నించడం మొదలు పెట్టాడు. నేను మాత్రం కంపెనీ దుకాణంలో మరి కొన్నాళ్ళు పని చేయడానికి పులకాయో కొచ్చేశాను.

సైగ్లో-20కి వచ్చాక ఐదేళ్ళపాటు నేను బైబిల్ చదవడంలో మునిగిపోయాను. మా నాన్న అప్పటికే ‘యెహోవా సాక్షి’గా మారి పోయాడు. నేను వాళ్ళ కూటములకు వెళ్ళేదాన్ని. వాళ్ళు చెప్పేది పాటించేదాన్ని. కాని ఆ తర్వాత ముఖ్యంగా గృహిణుల సంఘంలో చేరాక నేనది వదిలేశాను. నేను ముఖ్యంగా గుర్తించవలసిన వేమిటో నేను తెలుసుకున్నాను. అవి వాళ్ళిప్పుకోలేదు.

నేను నా అవసరం వల్ల సంఘంలో చేరాను. మా భర్తలతో భుజం కలిపి మంచి జీవన పరిస్థితుల కోసం పోరాడుతున్న ఇతర మహిళలతో కల్సి ఉండడానికి నేను సంఘంలో చేరాను. అప్పుడు ఈ యెహోవా సాక్షులు నన్ను దాంట్లో తిరుగొద్దనీ, దాంట్లో సైతాన్ ఉందనీ, మతంతో రాజకీయాలు కలుపొద్దనీ నాకు చెప్పారు.

అయినా సరే నేనిక సంఘంతోనే ఉండిపోయాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను పిలిచి నన్ను శిక్షించబోతున్నామని. నా పాపాలకు విచారిస్తూ నేను ఏడాదిపాటు ప్రాయశ్చిత్తంతో గడపాలనీ చెప్పారు. అంటే నేను సంవత్సరం పాటు వాళ్ళ కూటములకు వెళుతూ ఉండాలి. కాని ఏడాది పాటు వాళ్ళలో ఒక్కరూ నాతో మాట్లాడరు. ఏడాది తర్వాత కూడా నేనింకా చేయగూడని పనులే చేస్తున్నట్టయితే వాళ్ళు నన్ను మతం నుంచి తరిమేస్తారు. నేను సంఘంలో ఉండడం వల్లనే ఈ తప్పుడు పనులన్నీ చేస్తున్నానని వాళ్ళన్నారు.

“మొట్టమొదలు – ఎవరిగురించీ తుది తీర్పుకు రావద్దని దేవుడు చెపుతున్నాడు గదా! మరి నా గురించి ఈ తీర్పివ్వడానికి మీరెవరు? సరే ఏదేమైనా మీరు మీ పద్దతిలోనే ఆలోచిస్తుంటారు. ఎంత సేపటికి మీరు మీ కూటములకు హాజరయ్యేపుంజీడు మంది. గురించే ఆలోచిస్తారు. అందుకే జనంలో ఎంతో మంది ఎట్లా బతుకుతున్నారో మీకేమీ పట్టదు. అసలు మీకుదాంట్లో ఆసక్తి లేదు. ఉందా?”

“ఉదాహరణకు చాలా మంది పిల్లలను సాకాల్సిన ఒక వితంతువు ఉన్నదనుకోండి. వాళ్ళను సాకడానికి ఆమె ఏదో ఒక పని చేయాలి. అబద్దాలాడితే ఆమెక్కావల్సిన తిండి పెడతామని ఎవరో అంటారు. పిల్లలకోసం తిండిలేక ఆమె దొంగతనం కూడా చేయాల్సి వస్తుంది. ఇంతలో ఆమె పిల్లల్లో ఒకరు జబ్బుపడి డబ్బుకెంతో కటకటయి చివరికి దిక్కుతోచనిస్థితిలో పిల్లాడి ప్రాణాలు కాపాడడం కోసం ఒళ్ళమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుందనుకోండి. ఇంతజేస్తే వాళ్ళు చెప్పే ప్రకారం మరో జన్మలో ఈ వేశ్యలు అబద్దాలాడేవాళ్ళు – ఇలాంటి వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని చేరలేరు. ఈ వితంతువు కూడా పరలోకంలో అసలు దేవుని మొఖం చూడనేచూడదు. ఆమెకు స్వర్గం చేరే అవకాశమే లేదు. దీనిని నేనొప్పుకోను.”

అంతేకాదు సైగ్లో-20 లాలాగువాలో యోహోవా సాక్షులు చాలా ధనవంతులు. మాలాగ బాధలనుభవించే వాళ్ళు కారు. ఇతర దేశాల్లో సంగతేమిటో నాకు తెలియదు గాని మా దగ్గరైతే పరిస్థితి ఇది. కనుక నేనేమన్నానంటే: • “బ్రదర్ ఆల్బాకు (ఆ రోజుల్లో ఆయన లాలాగువాలో కెల్లా ధనికుడు) ఈ లోకంలో ఏమీకొరతలేదు. కనుక ఆనందంగా జీవిస్తున్నాడు. దేవుని ఆజ్ఞ తెలుసు కనుక ఆయన వ్యభిచరించడు, అబద్దమాడడు, అలాంటి నీచపు పనులేమీ చేయడు. అందువల్ల చివరికాయన స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. కాని ఈ జన్మలో ఇన్ని కడగండ్లు అనుభవించిన వితంతువుతో మాత్రం చివరికి దేవుడంటాడు గదా – ‘…సరే! నేను చెయ్యొద్దన్న పనులన్నీ చేశావ్, ఇక ఇప్పుడు నరకానికి ఫో…!’ అంతేనా? రేపు జరగబోయేది అదేనా?. పేదగా పుట్టిన మనిషి గతేమిటి? దేవుని దయలోకి బ్రదర్ ఆల్బా మాత్రమే వెళ్లగలుగుతాడు గాని నిరు పేద అక్కడికెన్నడూ చేరడా? బైబిల్ తెల్సినంత మాత్రాన్నే బ్రదర్ ఆల్బా దేవుని దయ పొందుతాడా? ఇది నాకేమీ సవ్యంగా కనబడడం లేదు. అలౌకిక సౌఖ్యమే ఉన్నతమయిందని మీరనుకున్నప్పటికీ ముందు లౌకిక సౌఖ్యాలతో ప్రారంభించాల్సిందేనని నేననుకుంటాను. ఆ వితంతువుకు నేనో ఉద్యోగం గనుక సంపాదించి పెట్టగలిగితే “చూడూ ఈ పని చేసుకో నీ పిల్లలతో ఇక్కడే బతుకు’ అని చెపుతాను.అంతేకాదు, ఆ తర్వాత ‘బైబిల్లో అబద్దం ఆడొద్దనీ, దొంగతనం చేయొద్దనీ, వ్యభిచరించొద్దనీ దేవుడాజ్ఞాపించాడు’ అని కూడా చెప్తాను. కాని నిజానికా సమయానికి ఆవిడకు అంత ముంచుకుపోయే అవసరాలూ ఉండవు. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ మనం చెప్పినట్టే బతుకగల్గుతుంది.” అన్నాను.

అప్పుడు వాళ్ళు నేను కచ్చితంగా సైతాన్ చెప్పినట్టు నడుస్తున్నానని, నేనన్నదానితో వాళ్ళాప్పుకోమనీ చెప్పేశారు. నేను వాళ్ళను వదిలేస్తున్నానని చెప్పేశాను. అట్లా మేం విడిపోయాం .

ఆ తర్వాత వాళ్ళు సామ్రాజ్యవాదులకు ఊడిగంచేసే ఒక చిన్న ముఠా అనే విషయం నేను మెల్లమెల్లగా తెల్సుకోగలిగాను. మతాన్ని రాజకీయాలతో కలపొద్దని వాళ్ళంటూ ఉండేవారు. కాని గుడిలో వాళ్ళెప్పుడూ రాజకీయాలే మాట్లాడుతుండేవారు. వాళ్లు చేసే పనులన్నీ అంతే. వాళ్ళు కొన్ని కరపత్రాలు పంచేవారు. ఓ కరపత్రంలో వాళ్ళు “మత స్వేచ్చ” కావాలని కోరారు. కాని దానికి వేసిన బొమ్మలో మతాన్ని అణగదొక్కుతున్న బూట్లమీద కమ్యూనిజం, మార్క్సిజం అని రాసి ఉంది. ఇంకో కరపత్రంలో మార్క్స్ బొమ్మ (అప్పటికి నాకు మార్క్ తెలియదు ఆ తర్వాత తెల్సుకున్నాను) ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఒక చం పెయ్యవలసిన ఆక్టోపన్లాగా చిత్రించారు. వాళ్ళ సంగతి తెలిసిందా?

కనుక ఇక నేను నిర్ణయించుకోవాల్సి వచ్చింది. కార్మికులతో భుజం కలిపి పోరాడుతున్న గృహిణుల సంఘంలో పనిచేయడమా? యెహోవా సాక్షులతో కల్సి పనిచేస్తూ వాళ్ళ ప్రార్థనలకు పోతూ సైతాన్ పనులని చెప్పబడే వేటితోనూ జోక్యం కల్గించుకోకుండా ఉండడమా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సి వచ్చింది. సైగ్లో-20లో వేరే మతాలు కూడా ఉండేవి. వాట్లో ముఖ్యమైనది కాథలిసిజం. కాని నేను వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో క్రైస్తవులు ముఖ్యంగా ప్రీస్టులూ, నన్లూ మాకు బాగా వ్యతిరేకంగా ఉండేవారు. కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడమని పోప్ పయస్ 12 ఇచ్చిన కార్యక్రమం కింద వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మా బతుకుల్ని మరింత దుర్భరం చేశారు. వాళ్ళు మమ్మల్ని ఎన్నడూ అర్థం చేసుకోలేదు సరిగదా చాలాసార్లు మా పీడకుల పక్షం చేరిపోయారు.

బొలీవియాలో మతం ఎంతగానో బలవంతుల సేవకు అంకితమైపోయింది. పీడకుల దృక్పథాలను మాత్రమే విన్నది. అణగారిన జనాల సేవకోసమే క్రీస్తు బోధనలను అనుసరిస్తున్నామని చెప్పుకునే వాళ్ళందరూ నిజానికి తమ భద్రత మాత్రమే చూసుకున్నారు. తాము సుఖంగా ఉండడానికీ, డబ్బులో ఓలలాడడానికీ, ఏది కావలిస్తే అది సంపాదించుకోడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఈ రకంగా వాళ్ళు మతాన్ని పెట్టుబడిదారులకు ఊడిగం చేసేదానిగా మార్చేశారు. ఇప్పటివరకు బొలీవియాలో నిజంగా ఏం జరుగుతున్నదో తెలుసుకున్న చర్చ్ ప్రతినిధులు చాలా తక్కువమంది. అంతేకాదు కొంతమంది జరుగుతున్న అన్యాయాలు చూసి కూడా తమ సొంత జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉండిపోయారు. అందుకే ఈ మధ్యకాలంలో కొందరు ప్రీస్ట్లూ, నన్లూ, కొందరు బిషప్లు కూడా మా వైపు వచ్చినప్పటికీ గని కార్మికులు సాధారణంగా చర్చిని లెక్కజేయరు. చర్చి ప్రతినిధులలో కొందరు మాతో పాటు దెబ్బలు తిన్నారు. జైళ్ళపాలయ్యారు. ప్రవాసం పంపబడ్డారు. మాతో పాటు ప్రశ్నించబడ్డారు. అయినా చర్చి ప్రధాన స్వభావం – దోపిడీదార్లతో, పెట్టుబడిదార్లతో మిలాఖత్ – మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది.

యెహోవా సాక్షులతో ఘర్షణ తర్వాత నాకు దేవునిమీద నమ్మకం పోనప్పటికీ నేనే మత బృందంలోనూ చేరలేదు. బహుశా నేను మార్క్సిజం గురించి చదివిన పుస్తకాలలో ఉన్నదానితో ఇక్కడే ఏకీభవించననుకుంటాను. ఆ పుస్తకాలలో దేవుని అస్తిత్వాన్ని నిరాకరిస్తారు. లేదా నాకర్థమయిందది. అంతేనా? కాని నాకేమనిపిస్తుందంటే దేవుని ఉనికిని కాదనడమంటే మన ఉనికిని కాదనుకోవడమన్న మాటే.

సరే, మేం సైగ్లో – 20కి వచ్చాక నేనూ నా భర్త ఇద్దరం మాత్రమే కలిసి రెండేళ్ళే ఉన్నాం. ఆ తర్వాత ఒకరి వెనుక ఒకరుగా నా చెల్లెళ్లు నా దగ్గరికి రావడం మొదలెట్టారు. నేను మరోసారి వాళ్ల సంరక్షణ బాధ్యత వహించాల్సి వచ్చింది. వాళ్ళలో ఎవరికీ సవతితల్లితో పొసగలేదు. నేను తప్ప వాళ్ళకు పోవడానికి ఎవరూ లేరు.

రెండేళ్ళ తర్వాత నాకు నా మొదటి బిడ్డ కలిగాడు. ఆకస్మాత్తుగా మా కుటుంబం ఎంతో పెద్దదై పోయింది. నా భర్తకు ఈ కుటుంబంలో పెరిగిన జనాభా ఇష్టం లేకపోయింది. ఈలోగా మా అత్త చనిపోయింది. నా భర్త చాలా విచారంగా కనబడడం మొదలు పెట్టాడు. ఆ రోజుల్లో ఆయనకు కొన్నాళ్లే పని ఉండేది. కొన్నాళ్లు ఊరికే గడపాల్సి వచ్చేది. ఈ అన్ని సమస్యలకు తోడు ఒక్కో రోజు ఆయన తాగి వచ్చేవాడు. తాగివచ్చిన రోజున ఆయన అనే మాటలకు అంతూ పొంతూ ఉండేది కాదు. తాను నా చెల్లెళ్ళను పెళ్ళి చేసుకోలేదని, వాళ్లను పోషించాల్సిన బాధ్యత తనమీదేమీలేదనీ అంటూండేవాడు.

ఏదైనా పనిచూసుకుందామని నా చెల్లెళ్లు ఎంతగానో ప్రయత్నించారు. కాని, పని దొరకడం, మరీ ముఖ్యంగా స్త్రీలకు పనిదొరకడం ఆ రోజుల్లో చాలా కష్టం. ఈ కష్ట కాలంలో మేమెంత దారిద్ర్యంలో బతికామంటే మా అక్కచెల్లెళ్లందరికీ కలిసి ఒకే జత చెప్పులుండేవి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే మేం చెప్పులు వాడేవారం. మా ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించడం మొదలయ్యింది.. మేం సైగ్లో-20కి చేరినప్పుడు ఇద్దరు నాయకుల్ని చూశాం – ఫెడరిక్ ఎస్కోబార్, పిమెంటెల్. పులకాయోలో అందరూ వాళ్ళు గొప్ప నాయకులని చెప్పారు. నేను వాళ్ళను కలుసుకోవాలనుకున్నాను. కంపెనీ వాళ్ళు మా ఇంటిని ఆక్రమించుకున్నప్పుడు నేను ఎస్కోబార్ ను కలిసాను. నేనూ, నా భర్తా మరో కార్మికుని ఇంట్లో ఉంటుండేవాళ్ళం. ఈ లోగా మా అత్త చనిపోతే ఆమె అంత్యక్రియల కోసం నా భర్త పులకాయో వెళ్ళాడు. నేనప్పుడు గర్భిణిని. మా ఇంటాయన రిటైరై ఉన్నాడు. కంపెనీ వాళ్ళు ఆ గదిలో ఉండడానికి నా భర్తకు ఏ హక్కూ లేదని చెప్పి బయటికి తరిమేశారు. నన్నప్పటికప్పుడే ఆ గది ఖాళీ చేయమన్నారు. నేనప్పటికి గర్భిణిని గనుక ఎటూ కదలలేననీ, నా భర్త వచ్చే దాకా ఆగమని వాళ్ళను బతిమిలాడాను. మొత్తానికి మేముండడానికి ఇంకోచోటు చూసుకోవాల్సి వచ్చింది. కంపెనీ ఆ ఉదయంలోపల ఖాళీ చేయాల్సిందిగా నాకు నోటీసు ఇచ్చింది. ఆ తరువాత అక్కడి కాపలాదార్లు వచ్చి నన్ను బయటికిలాగి – నా సామాన్లనూ బయట పారేశారు. ఇక పనిచేయలేని కార్మికులను ఈ కాపలాదార్లుగా నియమిస్తారు. వీళ్ళు ఏదో గని ప్రమాదంలో కన్నో, చెయ్యో, కాలో పోగొట్టుకున్నవాళ్ళో, గని రోగం వచ్చిన వాళ్ళో అయివుంటారు. ఆ తర్వాత వాళ్ళు గని కంపెనీలో ఈ విభాగానికి మారతారు. దీన్ని సాంఘిక సంక్షేమ విభాగం అంటారు. ఈ విభాగంలోని వాళ్ళు ఎక్కువ శారీరక కష్టం లేని పనులు చేయవచ్చు.

అట్లా కాపలాదార్లు వచ్చి నన్ను బలవంతాన బయటకు గెంటేశారు. కిరాయి ఇవ్వనివాళ్ళని ఇల్లు గలాయన ఎట్లా ఖాళీచేయిస్తాడో అట్లా ఖాళీ చేయించారు. నేను బయట ఏడుస్తూ కూచున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ గుమి గూడి చూడడం మొదలెట్టారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మా పక్కింటాయన పని నుంచి తిరిగొచ్చాడు. జరిగిన సంగతి ఇంట్లో వాళ్ళు ఆయనకు చెప్పారు. అప్పుడాయనే నాకు నాయకుల దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాడు.

నేనందుకు ఒప్పుకున్నాను గాని నాకు వాళ్ళు తెలియదు గదా అని భయమూ, సందేహమూ కలిగినయి. మొత్తానికి మేం ఫెడరికో ఎస్కోబార్ ఇంటికెళ్లాం. ఆయన భార్య నన్నెంతో సాదరంగా పలకరించింది. నా వెంట వచ్చిన కార్మికుడు జరిగిన సంగతి చెప్పాడు. అప్పుడావిడ “బాధపడకు నా భర్త నీకు సాయపడతాడు. అంతా సర్దుకుంటుంది” అని ఓదార్చింది. అక్కడ ఉన్నంత సేపూ ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంది. నాకున్న కొన్ని వస్తువులూ ఇంకా నా ఇంటిముందు బజార్లోనే పడి వున్నాయి. ఆ వస్తువులమీద ఒక గుడ్డకప్పి వచ్చాం… అంతే. నా ఇంటిపక్కాయన అవి చూస్తూ ఉంటానన్నాడు.

ఆ రాత్రి ఏడింటికనుకుంటాను, ఎస్కోబార్ పనినుంచి తిరిగొచ్చాడు. ఆయన నేనూహించిన దానికంటే ఎంతో భిన్నంగా ఉన్నాడు. నేను కలుసుకోబోయే మనిషి ఎంతో గంభీరంగా ఎప్పుడూ ఆజ్ఞలిస్తూ ఉంటాడని నేననుకున్నాను. నేనంతవరకూ అంత మామూలుగా ఉండే మంచి మనిషిని చూడలేదు. మేం కలుసుకోవడం అదే మొదటి సారయినా నన్నెంత కాలంనుంచో ఎరిగి ఉన్న వానివలె చేయి అందించాడు. నా సమస్య గురించి మాట్లాడడంకన్నా ముందు అన్నం తిన్నానా లేదా అని శ్రద్దగా అడిగాడు. అప్పుడు పక్కింటాయన ఎస్కోబార్ తో జరిగిన సంగతి చెప్పాడు; “వాళ్లామెను ఇంట్లోంచి తరిమేశారు. ఓ ఏడాదిగా ఆమెవేరేవాళ్ళతోకల్సి ఆ గదిలో ఉంటోంది. ఇప్పుడు ఆవిడ భర్త ఊళ్ళోలేని సమయాన వాళ్ళామెను బజార్లోకి గెంటేశారు.”

ఫెడరికో చాలా కోపానికొచ్చాడు. వెంటనే యూనియన్ వాళ్ళను ఓ కారడిగి కంపెనీ సాంఘిక సంక్షేమ కార్యాలయం ఉండే కాన్కనిరికి బయల్దేరాడు. అక్కడ కాపలాదార్లను పిలిచి నన్ను పెట్టిన బాధలకు చెడా మడా తిట్టాడు. తర్వాత ఆ గది తెరిపించి నా సామాన్లన్నీ వాళ్ళతో లోపల పెట్టించాడు. నా పట్ల అట్లా ప్రవర్తించడానికి వాళ్ళకు చేతులెట్లా వచ్చాయని తిట్టాడు. వాళ్ళలాగానే నా భర్త కూడా ఓకార్మికుడు కాడా అని అడిగాడు. ప్రతి వస్తువునూ వాళ్లతోనే వాటి వాటి స్థానాల్లో పెట్టించాడు.

“ఇక్కడ ఒక స్త్రీ నివసిస్తున్నది. ఇక్కడ ఒక గౌరవనీయ మహిళ నివసిస్తున్నది. స్త్రీలెన్నడూ తమ సామాన్లు అట్లా చెల్లాచెదురుగా పడేయడాన్ని సహించరు. ప్రతి వస్తువునూ దాని స్థానంలో పెట్టండి. మీరు చెడగొట్టిపోతే ఆమె బాగు చేసుకుంటుందా?” అన్నాడు.

నాకు సిగ్గేసింది. “మంచిది. మంచిది, చాలిక. నేనే సర్దుకుంటాను” అన్నాను. “ఒద్దమ్మా నువ్వు విశ్రాంతి తీసుకో” అని నాతో అని ఆయన వాళ్ళను పడక కూడా లోపల వేయనిచ్చి “ఇంకోచోటికి పోలేనిస్థితిలో ఆవిడ ఉన్నదనే సంగతి అయినా మీరాలోచించలేదా” అన్నాడు. నాతో “నువ్వసలే వొట్టిమనిషివి కావు. జాగ్రత్త ఇక విశ్రాంతి తీసుకో” అన్నాడు.

నిజంగానే నాకప్పటికి సరిగ్గా నెలలు నిండాయి. ఈ గొడవ జరిగింది. నవంబర్ 3న. నవంబర్ 7న కొడుకు రోడోలో పుట్టాడు. అందుకే అప్పుడు నేనంత నిస్త్రాణగా ఉన్నాను. అంతేగాక అప్పుడు నేను ఒంటరిగా కూడా ఉన్నాను. ఎస్కోబార్ మొత్తం విషయం గ్రహించాడు గనుకనే కాపలాదార్లతోనే నా సామాన్లన్నీ సర్దించాడు. అప్పుడాయన నాచేతికో కాగితమిచ్చి – “చూడమ్మా నువ్వింక ఇక్కడే ఉండొచ్చు. నిన్ను ఖాళీ చేయించడానికి ఎవరికీ అధికారం లేదు. నీ భర్త కంపెనీ కోసమే శక్తి ధారపోస్తున్నాడు గనుక నిన్నెవడూ గెంటేయలేడు..” అన్నాడు.

ఎస్కోబార్ వెళ్ళిపోయేటప్పుడు పక్కింటి వాళ్ళను పిలిచి నన్నొంటరిగా వదలొద్దనీ నా ప్రసవ సమయం దగ్గరికొస్తుందనీ, అందువల్ల ఎప్పుడూ ఎవరో ఒకరు నాతో పాటు ఉండాలనీ చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఆ నాయకుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. నా వ్యక్తిత్వ పరిణామంలో నేను వాళ్ళకెంతో రుణపడి ఉన్నాను. ప్రజల విజ్ఞానం ఆ రోజుల్లో బొలీవియాలో ఎమ్.ఎన్.ఆర్. పాలన ఉండేది. మొదట పాజ్ ఎస్టెన్సోరో, తర్వాత హెర్నాన్ సైల్స్ జువాజో, ఆ తర్వాత మళ్ళీ పాజ్ ఎస్టెన్ సోరో ప్రభుత్వాలు తమను తాము “విప్లవ జాతీయ” ప్రభుత్వమని చెప్పుకున్నాయి. దాన్ని మేమే గద్దె ఎక్కించినా అది ప్రజలు ఏమంటున్నారో, ఏం కోరుతున్నారో పట్టించుకోవడం మానేసింది. ఉదాహరణకు గనుల జాతీయకరణ అస్తవ్యస్తంగా జరిగింది. నష్టపరిహారాల వల్ల కంపెనీ ఘోరంగా దివాళా తీసింది. ప్రజలు మోసగించబడ్డారు. బొలీవియాకు ఒక సొంత లోహాల కార్ఖానా ఉండాలని మేం కోరాం. ఎందుకంటే మేమెప్పుడూ కస్టమ్స్ ఖర్చులూ, రవాణా ఖర్చులూ పెట్టుకొని ఖనిజాన్ని ఓడల్లో వేసుకొని ఇంగ్లండ్ తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడ దాన్ని కరిగించి మళ్ళీ ఓడల్లో వేసుకొని ఆమెరికాకు తీసుకెళ్ళి యజమానికందజేసే వాళ్ళం. అంటే ఈ ఖర్చులన్నీ మేమే భరించేవాళ్ళమన్నమాట. నిజానికి ఈ ప్రయాణ ఖర్చులన్నింటినీ మా దేశాభివృద్ధికే వినియోగించుకోవచ్చు. కార్మికులకు ఇంకా మంచి జీతాలివ్వవచ్చు. అందుకనే ఈ సమస్యను సొంత కొలుములు స్థాపించుకొని లోహపు కడ్డీలు ఇక్కడే అమ్మడం ద్వారా పరిష్కరించొచ్చునని గని కార్మికులు సూచించారు. అంతేగాక ఎన్నడో నిర్ణయించిన పాత ధరల ప్రకారం అమెరికాకు అమ్మడం కాక “చూద్దాం, ఎవరెక్కువిస్తే వాళ్ళకి” అనాలని వాళ్ళు కోరారు. కాని ఎమ్.ఎన్.ఆర్. ప్రభుత్వం మా మాటలు వినడానికి సిద్దంగా లేదు. దానికి బదులుగా వాళ్ళు అమెరికా దౌత్యకార్యాలయం ద్వారా ప్రణాళికలు తయారు చేసుకొని వాళ్ళ విధానాలను మా మీద రుద్దారు. వాళ్ళు తమ ప్రయోజనాలకు గాను ఒక ద్రవ్య స్థిరీకరణ విధానాన్ని అమల్లో పెట్టారు. ఈ ప్రణాళికలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, పశ్చిమ జర్మనీ, అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంక్ భాగస్థులు. దీని ప్రకారం గని కార్మికుల సంఖ్య తగ్గుతుంది. వేతనాలూ సరిగ్గా ఉండవు. కార్మికుల కార్యకలాపాల మీద యాజమాన్యం అధికారం ఉంటుంది. ఒక ముక్కోణపు ప్రణాళిక తయారు చేశారు. దీనికి కార్మికులు తమ వ్యతిరేకతను ప్రకటించగానే అణచివేత మొదలైంది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.