కథా మధురం  

తాత గారి ఫోటో” -మన్నెం శారద

-ఆర్.దమయంతి


  పురుష అహంకారానికి నిలువెత్తు అద్దం – ‘తాత గారి ఫోటో!’

పంజరం లో బంధించిన పక్షి  ఎందుకు పాడుతుందో .. తెలుసుకున్నంత సులభం గా.. సంసారం లో –   భర్త చేత వంచింపబడిన స్త్రీ  చస్తూ కూడా ఎందుకు బ్రతుకుతుందో – తెలుసుకోవడం చాలా కష్టం.  

ప్రతి ఆడదాని జీవితం లో ఒక శత్రువుంటాడు. వాడు మొగుడే అయినప్పుడు ఆమె జీవితం క్షణం క్షణం  నరకం గానే గడుస్తుంది. 

  కేవలం భర్త వల్ల స్త్రీ జీవితం దుఃఖ  మయమౌతున్నప్పుడు..అతన్ని వొదిలేసి మిగిలిన జీవితాన్ని హాయిగా సంతోషం గా గడిపేయొచ్చు కదా! చలాన్ని వేధించిన ప్రశ్నే ఇదీను  కానీ, అదంత సులువైన మార్గం కాదు. కాదని, బాధితురాళ్ళకీ  తెలుసు.  

 మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటన్నదే ఒక పెద్ద ప్రశ్న..ఎడ తెగని ప్రశ్న!

***

కథేమిటంటే – 

కొన్ని కారణాల వల్ల  కుటుంబానికి దూరమైన మనవరాలు షర్మిల –  తాత గారింటికి వస్తుంది. అక్కడ  హాల్లో గోడకి వేలాడుతూ కనిపించే వాళ్ల తాత గారి నిలువెత్తు ఫోటో ఆమెని అమితంగా ఆకర్షిస్తుంది. మొట్ట మొదటి సారిగా, తాత గారిని ఆ నిలువెత్తు ఫోటో లో చూడటం వల్ల ఆ ఫోటో  ఆమెకెంతో ప్రత్యేకం!

 ఆ ఇంట్లో మసులుతూ –  తాత గారి  గాంభీర్యం, రాజకీయ రంగంలో ఆయన కున్న పలుకుబడి, అధికార బలం…అన్నీ గ్రహిస్తుంది.

అమ్మమ్మ ని మాటల్లో పెట్టి, అసలు తన కుటుంబం –   ఎందుకని  దూరమవడం జరిగిందో అడిగి తెలుసుకుంటుంది.

ఇంతలో..హఠాత్తుగా తాత గారు మరణిస్తారు.  అంత్య క్రియలు పూర్తవుతాయి. ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకుంటారు. ఇల్లంతా సద్దుమణుగుతుంది. 

ఆరోజు –  ఆ  దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంది మనవరాలు. హాల్లో తాత గారి నిలువెత్తు ఫోటో ని పని వాళ్ళ తో దగ్గరుండి తొలగిస్తోన్న  అమ్మమ్మని  మనసూరుకోక  ‘అదేమిటి? ఇలా ఎందుకు చేస్తున్నావ్?” అంటూ  ప్రశ్నిస్తుంది. 

అందుకు ఆమె చెప్పిన కథే – ఈ తాత గారి ఫోటో  వెనక వున్న అసలు ఫ్రేం కథ. 

కథలో  మరో  ట్విస్ట్  కూడా వుంది. – ఆ రహస్యాన్ని ఛేదించే  ప్రయత్నం లో మనవరాలు ఎంత ఆత్ర పడుతుందో అంతే ఆసక్తి గా పాఠకులూ పరుగు లు తీస్తారు అక్షరాల వెంట అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

కథ  పూర్తవగానే, మంచి కథ చదివామన్న తృప్తినిస్తుంది.   

కథ తప్పక చదివి మీ హృదయ స్పందనలను నెచ్చెలితో పంచుకోవలసిందిగా మనవి.

***

కథలో స్త్రీ పాత్రలు, విశిష్తమైన వ్యక్తిత్వాలు :

మనవరాలు  షర్మిల :  ఆంథ్రొపాలొజీ   రీసెర్చ్ పని మీద ఇండియా కొచ్చిన ఈ పిల్ల లో – మనుషుల్ని చదివే అలవాటు మెండు గా కనిపిస్తుంది. పరిశీలన ఎక్కువ. తానకి అర్ధమవుతున్న ది కాకుండా ఇంకేదో అర్ధం కాకుండ మిగిలిన ఆ కాస్త నిజాన్ని తెలుసుకోవాలనే తహ తహ ల కొమ్మ ఈ బొమ్మ. తాను  తాత గారి తో మాట్లాడింది కనిపించదు కానీ, ఆ పాత్ర ఎలాటిదన్నది – ఈ మనవరాలు చేసే సర్వే లో మనకు పూర్తి గా క్లారిటీ వచ్చేస్తుంది.  అమ్ముమ్మతో మాట్లాడుతూ, మెల్ల గా రాబట్టుకున్న సమాచారం లో తాతగారి జీవితం లో అమ్ముమ్మ కాకుండా మరో స్త్రీ వుందన్న విషయం  విని స్తబ్దురలౌతుంది.

ఆ పైని, ఎంతో నిబ్బరం గా –  ఆ వ్యక్తిని వెళ్ళి కలుస్తుంది. చొరవగా  మాట్లాడుతుంది. అక్కడా అంతే.. ఎంతో సమయస్ఫూర్తి గా వ్యవహరిస్తుంది.  

ఈ పాత్రలో మరో గొప్ప విశేషమైన గుణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్! – అదేమిటంటే – ఈ స్త్రీ అనైతికురాలు..అమ్ముమ్మకి అన్యాయం చేసిన ద్రోహి అన్న భావనే ఈంకి వుండదు. పై పెచ్చు ఆవిడ మనసు నొచ్చుకోకుండా అంటుందీ, ‘అమ్ముమ్మకి మీ మీద కోపం లేదు. తాత గారి మీద మాత్రం విరక్తి వుంది ‘ అని అంటుంది. 

అదండీ, చదువుకున్న స్త్రీలలో వుండాల్సిన సంస్కారం! చదువుతో స్త్రీ ఎదగడం అంటే, సాటి స్త్రీల ని అర్ధంచేసుకోవడం.  పరిస్తితుల ప్రభావానికో, విధికో తలొగ్గిన స్త్రీల పట్ల సానుభూతిగా వ్యవహరించడం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం గా ఈ పాత్రని మలిచారు రచయిత్రి.  

రచయిత్రి సంస్కారం – పాత్రల సంస్కారణలలో ప్రైఫలిస్తుందని అందుకే అంటారు పెద్దలు.

అలా, షర్మిల – ఆవిడతో  మాట్లాడుతూనే, ఆవిడ అంతరంగాన్ని  పూర్తి గా చదివి తిరుగు ముఖం పడుతుంది. 

వయసులో చిన్న దే అయినా ఎంతో లోతైన ఆలోచనా పరురాలు. అమ్ముమ్మలో – ఇన్నాళ్ళూ తాను చూడని ఒక వేదనా స్త్రీ మూర్తిని చూసి చలిస్తుంది. అంతే కాదు, అమ్ముమ్మకి తాను తోడుగా నిలవాలని నిశ్చయించుకుంటుంది. ‘ మరి నీ ప్రియుది మాటేమిటి?’ అని అడిగిన తల్లి ప్రశ్నకి, భలే జవాబిస్తుంది. 

ఆడదాన్ని ఆడది కాకుంటే ఇంకెవరు అర్ధం చేసుకుని, అక్కున చేర్చుకుంటారు? అమ్ముమ్మ గుండెలో ని బడ్బాగ్నుల్ని చల్లారడానికి ఇలాటి చల్లని మనసున్న  మనవరాలుంటే బావుణ్ణు కదా అనిపిస్తుంది..కథలో ఈ పాత్రని చదువుతుంటే.

రచయిత్రి సృష్టి కి జోహార్లు. 

***

అమ్మమ్మ పాత్ర : 

అందరి ఆడపిల్లల్లానే, పెళ్ళి చేసుకుంది.  మొగుడితో కాపురం ఎంత అద్భుతమో కదా అనుకుంది. కానీ ఇంత అగాధం అని ఆమె కలలో కూడా ఊహించి లేదు. మొగుడు చెంప మీద కొట్టినా బాధ పడని ఇల్లాలు ..భర్త పరస్త్రీ లోలుడని తెలిసినప్పుడు మాత్రం – విలవిలా కొట్టుకుంది. బ్రతికుండంగానే తన శరీరం కట్టెల్లో కాలుతుంటే మనిషి ఎలా విలవిల మంటాడో అలా..భీతిల్లిపోయింది.   

మెడలో తాళి ఇనప సంకెల లా బరువై, తీసేయడానికి – సమాజం ఒక బారియర్ అయి, చచ్చిపోవడానికి పిల్లలు ప్రతిబంధకమై..ఇన్ని దుఖః లలోనో..పడక గదిలో ఆ మొగుడి పక్కనే చోటుచేసుకుని ఒరగాల్సిన దుర్గతిలో ఏ స్త్రీ పరిస్థితి అయినా ఎలా వుంటుంది? – అచ్చు నరకం లా వుంటుంది. ఈ కథలో ఈమె పరిస్థితీ అంతే.

తెలుగులో ఒక సామెత వుంది. పోయిన నాడున్న దుఃఖం మర్నాడు వుండదుట. అలానే మొగుడి నిర్వాకాలు, నికృష్టాలు, మాటలతో చేసే అవమానాలు అహం కార దూషణలూ అన్నీ అలవాటైపోయాక – ఇక జీవితం అంటే ఇంతే అనే పాయింట్ కి వచ్చేశాక,  ఏ పాటి బాధలూ మనసుని తాకవు.  రాతి మేఘాలై, కళ్ళు కురవమన్నా కురవ్వు. 

నిజానికి ఈ స్థితి కి ఏ ఇల్లాలైనా ఎప్పుడు చేరుతుందంటే – చచ్చి పోయాక, మనసన్నది చచ్చిపోయాక…తనొక మనిషినన్న మాట మర్చిపోయాక ఇక ఏ బాధలూ ఆమెని సోకవు.  దురదృష్టం ఏమిటంటే..అసలామెకి మనసన్నదొకటుందనేమాటే  తెలీని మగాడికి ఆమె భార్య అవడం- ఎంతైనా దౌర్భాగ్యం!

అందుకే ఆత్రేయ కవి అంటాడు – మనిషి తోటి ఏలాకోలం ఆడుకుంటే బావుంటాది, మనసుతోటి ఆడకు మావా..పగిలి పోతే అతకదు మల్లా.. అని. 

ఈ అమ్మమ్మ హృదయం కూడా పగిలిపోయుంది. భర్త అంటే ఆమెకి విరక్తి. అంతకు మించి ఏహ్యం..అంతకు మించి మరో మాట వుంటే…అదీను. కానీ మాటల్లో వ్యక్తపరచలేని ఆ భావాన్ని బయటపడనీకుండా పెదవి దాటనీకుండా సమర్ధించుకుంటూ వచ్చింది. 

ఆయన బ్రతికున్నంత కాలం – తప్పదన్నట్టు భరించిన ఆ సహనశీలి, ఆయన పోయాక అయినా విముక్తురాలు కావాలని కోరుకుంటూ తీసుకున్న నిర్ణయం ఎంతైనా హర్షణీయం. 

ఫెమినిజం – అంటే  ఇదే!  అమ్మమ్మల లోనూ, బామ్మల్లోనూ, అణచి వేయబడే ప్రతి స్త్రీలోనూ ఈ విప్లవ భావాలు వుంటాయి. సమయం వచ్చినప్పుడు బహిర్గతమౌతాయి. 

మరీ ఇన్నాళ్ళ కా ?  అంటూ, మనవరాలు అడగనే అడుగుతుంది. అప్పుడు ఆమె చెప్పే జవాబు – వింటే జాలేస్తుంది. ‘ఈ లోకానికి భయపడో – ఒంటరిగా బ్రతక లేననో యిలా వుండి పోలేదు. ఎక్కడికెళ్ళినా ‘ఒక దుఃఖం నా వెంటే వీడకుండా వస్తుంది. ‘ అని అంటుంది. అందరి ఇల్లాళ్ళ పరిస్థితీ  అలాటిదే మరి. 

కుటుంబ వ్యవస్థకి తల్లివేరు లాటిది –  ఇంటి ఇల్లాలు. అందుకే సహనం తో భర్త లోని లోపాలని, అతను పెట్టె హింసలనీ భరిస్తుంది. తాను ఎండన మాడుతూనే…పిల్లలకి చల్లని నీడనౌతుంది.  

ఇంత శాంతమూ సౌమ్యమూ, సహన గుణమూ వున్నా, లోలోన మాత్రం కట్టుకున్న వాడు రగిల్చిన చిచ్చు  ఆ కట్టె వున్నన్నాళ్ళు కట్టెలా కాల్తూనే వుంటుంది. ఇలా –  జీవమున్న శవాలు గా బ్రతుకునీడ్చే వనితలెందరో!

ఈ కథలో ని అమ్మమ్మకి  ఏ ఫెమినిజమూ తెలీదు. కానీ…తనకు జరిగిన అన్యాయం ఏమిటో ఆమెకి తెలుసు. ఎంతగా అణచివేయబడిందో తెలుసు. తాళీ కట్టించుకున్న పాపాన ఒక జీవిత కాలం ఖైదీ గా మారి బానిస బ్రతుకు బ్రతకాల్సి వచ్చిన దుర్భరం జీవితం ఎలా వుంటుందో తెలుసు. 

బ్రతికుండగా, తన గుండెలో స్థానం సంపాదించుకోలేని మొగుడు..చచ్చాక కళ్ళక్కనిపిస్తూ – గోడ మీద మాత్రమెందుకు? – 

అందుకే ఆమె తీసుకున్న నిర్ణయం అది..నిలువెత్తు ఫోటో ని తీసుకెళ్ళి ఔట్ హౌస్ లో పడేయిస్తుంది.   ‘పోనీ ఆవిడకి ఇస్తావా? అంటూ మనవరాలిని ప్రశ్నిస్తుంది చిత్రంగా! 

***

లావణ్య :

తనిల్లు వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి ని చూసి ముందు గా ఆశ్చర్యపోయినా, సాదరం గా ఆహ్వానిస్తుంది. ‘ఆయన చెప్పారు నీ గురించి..’ అంటూ మాటలో మాట కలుపుతుంది..ఆమెతో. 

తాతగారు పోయారు..’  అంటున్న షర్మిల  మాటలకి తెలుసన్నట్టు తలూపుతుంది. మరి రాలేదు? అనే ప్రశ్న కి ఆమె జవాబు – బాధని కలిగిస్తుంది.

ఒక మగాడి జీవితం లో రెండో స్త్రీ వుంటే – జనం కళ్లన్నీ ఆమె వైపే ఎర్ర గా చూస్తాయి. కుటుంబాన్ని నాశనం చేసిన రాక్షసి గా, హోం బ్రేకర్ గా…అదర్ ఉమన్గా.ఉంపెడు కత్తె గా ..ఇలా  ఎన్ని బిరుదులో!   

ఇన్ని మాటల అవమానాల తాకిడికి గురి అవడానికి మూలకారకుడైన ఆ మగాణ్ణి  మాత్రం విడిచేస్తుంది.

కానీ రచయిత్రి ఈ పాత్రకి పూర్తి న్యాయం చేసారు. 

లావణ్య తన కథని వినిపిస్తున్నప్పుడు, ఈ సమాజం లో మనం మన చుట్టూ కనిపించే ఎందరో ఘరానా పెద్ద మనుషులు కనిపిస్తారు చటుక్కున. 

ఎందరో వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకుల జీవితాల్లో ప్రవేశించే ఆ రెండో స్త్రీ సలహాలు, వ్యూహ రచనల  కారణం గా ఆ ప్రబుధ్ధులు  వెలిగి పోవడం మనం  చూస్తూనే వుంటాం.

అంతవరకెందుకు, ఇలాటి కథలు రాజుల కాలం నాటి నించి మనం వింటూనే వున్నాం.  

ఇలాటి పాత్రలు కథల్లో జొరబడినప్పుడు, సహజం గా  ఆ పాత్ర దుర్మార్గు రాలు అన్నట్టు చిత్రీకరించి చూపాలి. ఎందుకంటే..ఆమె అనైతిక దారిలో వచ్చింది కాబట్టి, నైతికం గా భార్య స్థానంలోని స్త్రీ పూజింపబడే పవిత్ర స్థానాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత రైటర్స్ భుజ స్కందాలపైన ఆ భారం ఎంతైన వుంటుంది కాబట్టి.. అదర్ ఉమన్ ని విలనీ గా దృశ్యీకరిస్తారు – రైటర్స్.

కానీ ఈ కథలో రచయిత్రి ఎంత గొప్ప నిజాయితీనీ నిబద్ధ్ధతని పాటించారూ అంటే, స్త్రీ లలో వుండే సహజమైన ఆత్మాభిమానానికి, గౌరవానికి ఇసుమంత అభ్యంతరమైనా కలగకుండా హుందా గా చిత్రీకరించి, అసలైన దోషి – ఈమె కాదు. వాడు. అంటూ అసలైన దొంగని పట్టించారు. అంతే అతని నిజ  నిజస్వరూపాన్ని నిలువెత్తు ఫోటో గా మార్చి చూపారు.

మన్నెం శారద గారి కథల్లోని స్త్రీ పాత్రల ఔన్నత్యానికి లావణ్య పాత్ర ఒక చిన్న ఉదాహరణ గా పేర్కొనాలి.

ఇంతకీ షర్మిల తీసుకొచ్చిన ఆ ఫోటోని లావణ్య తీసుకుందా? గోడకి తగిలించిందా అని కదా మీ ప్రశ్న.

నేను చెప్పడం కంటేనూ, కథ చదివితే ఈ పాత్ర మనోసంస్కారం  మరింత గా అవగతమౌతుంది.

****

రచయిత్రి స్వీయ పరిచయం :

కాకినాడలో అమ్మగారింటిలో పుట్టాను. నాన్నగారిది ఒంగోలు.

నాన్నగారి ఉద్యోగరీత్యా నా చదువు అనేక ప్రాంతాల్లో సాగింది .నాన్నగారు పోస్టుమాస్టర్ .ఆయన పేరు సీతారామయ్య .పోస్టల్ &టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ యూనియన్ సెక్రటరీ గా పని చేశారు. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ ..ఏ వూరిలో పనిచేసినా ఆయనే రిక్రియేషన్ క్లబ్ సెక్రటరీ గా పని చేసేవారు. చాలామంది బీద విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పి బ్యాడ్మింటన్ ఆడటం నేర్పేవారు.  

అమ్మ గృహిణి. కానీ ఆమె బాగా సాహిత్యం చదివేవారు . కానీ క్రమశిక్షణ పేరుతో చాలా కఠినం గా ఉండేవారు.

చిన్నతనం నుండే నాకు సాహిత్యం పట్ల చిత్రలేఖనం పట్ల , నాట్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది. 

పెద్దలు వీటినేవీ ఇష్టపడేవారుకాదు. చాలా అల్లరి చేసేదాన్నేమో నన్ను మగరాయుడు అనేవారు.

మా అక్కకి , చెల్లెలికి నాట్యం నేర్పించి నాకు వద్దన్నారు. నేను మాస్టారు వచ్చినప్పుడు అక్కడే కూర్చుని చూసి  పెరట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. అలానే నేను మా కాలేజ్ బెస్ట్ డాన్సర్ అయ్యాను .

     పెయింటింగ్ కూడా అంతే , బొమ్మలు వేస్తే దరిద్రం అని మా మామయ్యా ఒకరు నేను వేసిన బొమ్మని ఉండచుట్టి విసిరేస్తే నిస్సహాయంగా ఏడ్చాను. నాగార్జునసాగర్ మోడల్ డాం నిర్మించిన ప్రముఖచిత్రకారుడు చిన్నప్పుడు నాపరాళ్లమీద నేను వేసిన బొమ్మలు చూసి ఏడేళ్ల వయసున్న నన్ను గొప్పచిత్రకారిణి అవుతుందని దీవించి తనదగ్గరకి పంపమన్నారు. కానీ అమ్మానాన్నా ఒప్పుకోలేదు.

 నా విద్యలన్నీ స్వయం కృషే …అదీ దొంగచాటుగా .

 ఇకపోతే నా రచనా వ్యాసంగం గురించి ……

 ప్రకృతి అంటే నాకు విపరీతమైన ఇష్టం. నాన్నగారి ఉద్యోగరీత్యా , అటు పెదనాన్నా గారి ఉద్యోగరీత్యా నేను ప్రకృతికి ఆలవాలమైన ప్రదేశాలు చూసాను. అలాంటప్పుడు ఏదేదో నా భావనలు రాసుకోవడం అలవాటయ్యింది. అలాగే నేను రాసిన మొదటి రచన మంత్రి చేసిన ద్రోహం అనే నాటిక. అది మేమే ఆక్ట్ చేశాము.

  అతి చిన్నతనం నుండి ఆంధ్రప్రభ లో ప్రమదావనం లోని మాలతీ చందూర్ గారి ప్రశ్నలు -జవాబులు శీర్షిక చదివి ఉత్తరాలు రాసేదాన్ని . దేనికీ ఆవిడ నాకు జవాబు ఇవ్వలేదు . 1984 లో జరిగిన వుమన్ రైటర్స్ కాన్ఫెరెన్స్ లో రెండవరోజు జరిగిన సభలో మాలతీచందూర్ గారి పక్కన కూర్చుని స్త్రీ ఉద్యోగినిల సమస్యలపై  మాట్లాడటం నా అదృష్టం. 

అచ్చులో నామొదటికథ “అడవిగులాబీ”.ఆంధ్రజ్యోతి వారపత్రికలో రాసాను .అప్పుడు నాకు పదిహేనేళ్ళు 

రెండవది రూపసి -రూమ్ నెంబర్ 7 …ఒక థ్రిల్లర్ !ఇదీ ఆ వయసులో రాసిందే .

మూడవది ‘దూరపుకొండలు..’ అనే కధ! ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది 

మధువని అని గుంటూరు నుండి వెలువడిన ఒక కథల సంపుటిలో నేను రాసిన కథ చదివి ఆ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖరచయిత శ్రీ గణేశపాత్రో గారు నాకు  ఒక ప్రత్యేకమైన లెటర్ రాసి  నా శైలి, కథ, చెప్పేవిధానం ,చాలా బాగున్నాయని  రచయిత్రిగా మంచి భవిష్యత్తు ఉందని  ఆశీర్వదించారు .నిజానికి అప్పటికి నాకు గణేష్ పాత్రో గారి గురించి సరిగ్గా తెలియదు .

అనేకకథలతర్వాత నేను 1982 లో నా మొదటి నవలరాశాను .”గౌతమి “అనే నా నవలకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో దీపావళి కథలపోటీలో నాకు మొదటి బహుమతి లభించింది .

నా రెండవ నవల”చంద్రోదయం “కి ఆంధ్రజ్యోతి వారపత్రికలో రెండవబహుమతి లభించింది. 

నేను ఆదివారం పక్షపత్రికలో రాసిన [1983]”వానకారుకోయిల “నవల ఎంతోమంది ప్రముఖల ప్రశంసలు పొందింది.  

1986 లో ఆంధ్రజ్యోతివారు పెట్టిన సస్పెన్స్ థ్రిల్లర్స్ నవలల పోటీలో వారుపెట్టిన ఒకే ఒక బహుమతి నాకే వచ్చింది. 

కథల బహుమతులు లెక్కేలేదు.  

దాదాపు ఆరోజుల్లో నేను రాయని పత్రిక దినపత్రిక లేనేలేవు.

ఒకేసారి నాలుగు పత్రికల్లో సీరియల్స్ రాస్తున్నానని నన్ను ప్రముఖ రచయిత మల్లాదిగారు నన్ను ప్రశంసించారు . దాదాపు 46 నవలలు, ఫీచర్స్ అన్నిటితో కలిపి 1000 కథలు రాసి వుంటాను.  

ఆరోజుల్లో నేను ఉదయం దినపత్రిక లో నేను రాసిన “ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ “అనే నవల పెద్ద చరిత్ర సృష్టించింది . పత్రిక సర్క్యులేషన్ పెంచింది . ఇది స్వయంగా దాసరినారాయణరావు గారు నన్ను పిలిపించి చెప్పిన మాట.

నా ఇంటర్వ్యూ రాని పత్రిక లేదు.

ప్రముఖ నేషనల్ మగజైన్ ‘ద వీక్’  నన్ను గర్ల్ విత్ ద గోల్డెన్ పెన్ ‘ అని అభివర్ణించింది .

దక్కన్ క్రోనికల్ దినపత్రిక మల్లాది గారి గురించి, నా గురించి,  యండమూరి గారి గురించి పెద్ద ఆరికల్ రాసింది. 

రెండుసార్లు నేను రాసిన టెలీ సీరియల్స్ కి రాష్ట్ర ప్రభుత్వపు నంది అవార్డ్స్ అందుకున్నాను. 

పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ నుండి  ఉత్తమరచయిత్రి అవార్డు పద్మవిభూషణ్ సి. నారాయణరెడ్డి గారు  చేతులమీదుగా అందుకున్నాను.

ప్రతియేడూ ప్రెస్టీజియస్ గా బహుమతులు ఇచ్చే ప్రముఖ విద్యాసంస్థల అధినేత  అమృతలత గారి నుండి లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు  తీసుకున్నాను .

రెండుసార్లు నంది అవార్డు కమిటీల్లో పని చేసాను. 

అరుదుగా అవకాశమిచ్చే “ఇండియా టు డే” పత్రికలో మూడు కథలు రాయడం చెప్పుకోదగిన విషయం.

అవార్డ్స్ కోసం ఎన్నడూ అభిమానం చంపుకోలేదు. ప్రయత్నించలేదు.

నాటకరంగ పితామహుడు లాంటి శ్రీ చాట్ల శ్రీరాములుగారు నంది అవార్డ్స్ కమిటీలో నన్ను చూసి “రచయిత్రి అంటే ఏంటోలే అనుకున్నాను తల్లీ ..నీ రచనల్లో ఓ  హెన్రీ  ఛాయలున్నాయి. చిన్నదానివని నీకు పాదాభివందనం చేయడం లేదు “అంటూ నమస్కరించారు.

అంతకన్నా అవార్డు ఏముంటుంది ! నేను కధ,  మాటలు రాసిన టెలీ సీరియల్ “ప్రేమిస్తే పెళ్లవుతుందా ?’   నేను 13 కధలు, మాటలు రాసిన స్వాతిచినుకులు – సర్వే  లో  నన్ను నెంబర్ 1  గా నిలబెట్టాయి. 

ఇదంతా నేను ఒక్కరోజులో నల్లేరుమీద బండిలా సాగించిన ప్రగతి కాదు. 

అనేక సమస్యల మధ్య రాజకీయాలమధ్య  అనేక వత్తిడిలు తట్టుకుని, ఎన్నో అన్యాయాల్ని అక్రమాల్ని తట్టుకుని, అకారణంగా రాజకీయం చేస్తున్న వ్యక్తుల్ని చూసి విస్తుపోతూ  మిగుల్చుకున్న చిన్నపాటి విజయం.

 ఈ రోజు నేను రచయిత్రిగా మిగలడానికి నాకు దోహదం చేసిన లబ్ధ ప్రతిష్టులైన సంపాదకులందరికీ నా వందనాలు. 

అన్నట్లూ నేను రోడ్స్ &బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ లో ఇంజినీర్ గా పని చేసి రిటైర్ అయ్యాను .

నా పాఠకాభిమానులే నాకు ఎప్పటికీ శ్రీరామరక్ష!’

*****

తాత గారి ఫోటో 

    – మన్నెం శారద 

ఆ హాల్లోకి ప్రవేశించినప్పుడు నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కారణం అక్కడ గోడకి బిగించివున్న నిలువెత్తు పటం!

ఆ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న వ్యక్తి రాజసం, ఆ గాంభీర్యం లోని అందం, ఆ అందం లోని అహంకారం, ఆ చిరునవ్వు లోని గర్వం వెరసి నన్ను స్తబ్ధురాలిని చేశాయి.

ఆయనే మా తాతగారని గ్రహించడానికి నాకట్టే సమయం పట్టలేదు. నా వయసిప్పుడు ఇరవై రెండు. పుట్టాక నేను తాతగారిని కాని, ఆ యింటిని కాని – అసలు ఇండియాని కూడా చూడలేదు. కనీసం తాతగారితో మాట్లాడి కూడా ఎరుగను.

ఆ హలు ఒక కాన్ఫరెన్సు హాలని అర్థమవుతోంది. ఆయన ఫొటోకి ముందు ఫొటోలోని కుర్చీ – దాని ముందు అలానే నగిషీలు చెక్కిన టేబుల్ దాని మీద ఇత్తడి కుండీలో అమర్చిన తాజా పూలు, ఎదురుగా ఒక ఇరవై కుర్చీలు వున్నాయి.

నేను అలానే నా లగేజ్ పట్తుకుని నిలబడి వుండగా ఆ యింట్లో నౌఖరను కుంటాను – “అమ్మా ఎవరు కావాలి?” అని అడిగాడు. నేను జవాబు చెప్పేంతలోనే ఒక పెద్దావిడ జరీ లేని కంచిపట్టు చీరతో మెరుస్తున్న రవ్వల దుద్దులు, ముక్కుపుడకతో వాటి కన్నా మెరుస్తున్న ఛాయతో ఎడమవైపు గదిలో నుండి వచ్చి నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

ఆమె మా అమ్మమ్మని గుర్తించడానికి నాకెంతో సేపు పట్టలేదు.

నేను ఏదో చెప్పబోయేంతలో “అది షమ్మూ – షర్మిలనుకుంటాను. లోపలికి తీసుకెళ్ళు” అన్న గంభీరమైన కంఠస్వరం ఆ డూప్లెక్స్ మేడ పై నుండి వినిపించింది.

నేను ఆశ్చర్యంగా పైకి చూశాను.

సదరు ఫొటోలోని వ్యక్తి మేడపైన రెయిలింగ్ పట్టుకుని నిలబడి వున్నారు.

ఆయనే మా తాతయ్యని గ్రహించడానికి నాకెంతో సేపు పట్టలేదు. 

నేను వెంటనే చిరునవ్వుతో నమస్కారం పెట్టి “నమస్తే తాతయ్యా” అన్నాను. అమ్మ మరీ మరీ చెప్పింది ఇంగ్లీషు పదాలు దొర్లించవద్దని.

బదులుగా ఆయనేం నవ్వలేదు గాని అమ్మమ్మ మాత్రం “ఇది…ఇది.. ఇందూ కూతురా? మీకు ముందే తెలుసా… ఇది వస్తున్నదని” అంది ఎంతగానో విస్తుపోతూ.

తాతయ్య అలా అనడం నాకూ ఆశ్చర్యాన్ని కల్గించింది. కారణం మమ్మీ డాడీ నేను ఇండియా బయల్దేరుతున్నట్లుగా తాతయ్యకి తెలియజేయలేదు.

“సర్లే. ముందు దాన్ని తీసుకెళ్ళి కావల్సినవి చూడు. సముద్రాలన్నీ ఈదొచ్చింది” అంటూ లోనికి వెళ్ళిపోయారు.

ఆయనలా వచ్చి పరామర్శించకపోవడం నాకేమీ ఆశ్చర్యాన్ని కల్గించలేదు. కారణం ఆయన గురించి అమ్మ ముందే చెప్పడం.

అమ్మమ్మ మాత్రం నన్ను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంది.

“పుట్టి చెట్టంతయ్యేకా మనవరాల్ని చూడడం… అంటే ఎంత ఏడుపొస్తున్నదో! ఏమి అనుబంధాలు ఏమి ప్రేమలివి!” అంటూ వద్దన్నా నాకు సేవలు చేయడం మొదలుపెట్టింది.

“కాసేపు పడుకుంటావా?” అంటూ నన్నో గది లోకి తీసుకెళ్ళింది. లంకంత కొంప. ఖరీదైన ఫర్నిచర్. ఎటు చూసినా దర్పాన్ని చూపిస్తున్న ఇల్లు.

“వద్దు అమ్మమ్మా! ఫ్లయిట్‌లో బాగానే నిద్ర పోయాను” అన్నాను.

“సరే స్నానం చేయి.  నేను టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను” అంటూ వెళ్ళింది. 

నేను స్నానం చేసి డ్రెస్సయ్యేక అమ్మమ్మ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకి రమ్మని తీసుకెళ్ళింది.

అక్కడ ఆల్రెడీ తాతయ్య కూర్చునే వున్నారు.

నేను కూడ వెళ్ళి కూర్చున్నాను.

అమ్మమ్మ నాకు పెసరట్లూ, ఉప్మా పెడుతూ, “ఇవన్నీ నీకు నచ్చుతాయో లేదో!” అంది.

“ఎందుకు, అమ్మ ఇవన్నీ చేస్తుంది. మా ఇంట్లో ఇండియన్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తుంది” అన్నాను టిఫిన్ తింటూ.

“ఇంతకీ వచ్చిన పనేంటి?” తాతయ్య టిఫిన్ తింటూ ప్రశ్నించేరు.

“ఏంత్రోపాలజీలో రీసెర్చి చేస్తున్నాను. ఇండియాలో స్టడీ చేసి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలి.”

తాతయ్య తల పంకించేరు.

ఆ తర్వాత ఆయన విజిటర్స్ రూమ్ లోకి వెళ్ళిపోయారు.

అమ్మమ్మ మాత్రం నన్ను వదలకుండా కూర్చుంది. 

“మీ అమ్మ రాక్షసి” అంది ఒక్కసారి కోపంగా.

నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూసేను.

“మీ అమ్మ నన్నానని నీకు కోపం రావచ్చు.  ముందుగా అది నా కూతురు. ఏదో మీ తాతయ్య పంతానికి పోయారే అనుకో. దానికింత ప్రేమన్నా వుందా మా మీద. అసలు రాకుండా కూర్చుంటుందా ఇన్నాళ్ళు” అంది అమ్మమ్మ కన్నీళ్ళతో.

“అసలేం జరిగింది?” అనడిగేను.

“చిన్నదే. పెద్దది చేసుకున్నారు” అంది అమ్మమ్మ విచారంగా.

“అమ్మది ప్రేమ వివాహమా?”

“సింగినాదం. లక్షణంగా మేము చూసి చేసిందే.”

“మరి?”

“ఏం మీ అమ్మ చెప్పలేదా? మీ నాన్న అసలిక్కడికి రానిచ్చాడా?” అంటూ తిరిగి ప్రశ్నించింది అమ్మమ్మ.

“అమ్మ నన్ను ఇక్కడికే వెళ్ళమని చెప్పినప్పుడు, నాన్న కొంత అభ్యంతరం చెప్పిన మాట వాస్తవమే. నాన్న తన ఫ్రెండ్ ఇంటికి పంపుతానన్నారు. అమ్మ పట్టుబట్టే సరికి సరే నన్నారు” అన్నాను. 

“అదిగో అతగాడికింకా కోపమే నన్న మాట మా మీద. అంతేలే! బయట నుండి వచ్చిన వాడు. రక్తసంబంధమేముంటుంది” అంది అమ్మమ్మ నిష్ఠూరంగా.

నేను అమ్మమ్మ భుజాల చుట్టూ చేతులు చుట్టి “అదేం కాదు. తాతయ్య రానిస్తారో లేదో అని భయం. అసలింతకీ ఏం జరిగిందో అది చెప్పు” అన్నాను గోముగా.

అమ్మమ్మ మెత్తబడింది. “అసలిదంతా ఈయన వలనే. కోపం ఎక్కువ. మీ అమ్మ నిచ్చి చేసినప్పుడు ఇల్లరికం వుండాలి, నా కొక్కగానొక్క కూతురని ఈయన చెప్పలేదు. తీరా పెళ్ళయ్యేక డాక్టరు ఉద్యోగం చేసేవాణ్ణి ఉద్యోగం మానేసి ఇక్కడే వుండి రాజకీయాల్లోకి రమ్మన్నారు. మీ నాన్న ఒప్పుకోలేదు.  ఇంతలో అమెరికా ఛాన్సొచ్చింది మీ నాన్నకి. వెళ్తే మా యింటి గడప తొక్కద్దన్నారు మీ తాతయ్య. అంతే ఎక్కడివాళ్ళక్కడే అయిపోయాం” అంది  బాధగా.

“అమ్మానాన్నా మిమ్మల్ని గురించి తలచుకోని రోజుండదు. ఎప్పుడూ మీ గురించి ఒక చెడు మాట కూడా వాళ్ళు అనగా వినలేదు” అని చెప్పి అమ్మమ్మని ఊరడించాను.

***

పది రోజులు గడిచేసరికి నాకు ఆ యింట్లో పరిస్థితులన్నీ అర్థమయ్యేయి.

తాతయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో వుండరు. ఒక విధంగా చెప్పాలంటే కింగ్ మేకర్. అన్ని పార్టీల వారూ తాతయ్యని కలుస్తుంటారు. సలహాలు సంప్రదింపులూ జరుపుతుంటారు. తాతయ్య రోజూ పేపర్లో కనిపిస్తుంటరు. ఆ వూరు, ఆ ప్రాంతమూ తాతయ్య చెప్పినవారికే ఓటు వేస్తారు. మంత్రులూ, ఆఖరికి సి.ఎమ్. ఆయనతో మంతనాలు జరుపుతుంటారు. అందుకని ఆ యింట్లో ఎప్పుడూ కోలాహలమే. వచ్చీ పోయే జనమే. పార్టీలు, మర్యాదలూ మామూలు తతంగమే.

ఇక అమ్మమ్మ తయారులో, పాటించే పద్ధతుల్లో సనాతనమే కనిపిస్తుంది. వయసు మీద పడినా అందమైన రూపం, అందులో పూజ్యభావమే గోచరిస్తాయి. తాతయ్యకి ఏ లోటూ లేకుండా చూడడం, ఆ యింటి మర్యాదని కాపాడుకోవడం ఆమె బాధ్యత. మాట మీరని స్వభావం, పూజలు పుణ్యాలు ఆమెవి.

నేను వచ్చాక అమ్మమ్మ మొహంలో తళుకులద్దినట్లుగా కనిపిమ్చే మెరపు నా కంటిని దాటిపోలేదు.

తాతయ్య కారు, ఇద్దరు మనుషుల్ని ఇచ్చి నన్ను కావల్సిన ప్రాంతాలకి రీసెర్చి కోసం పంపిస్తుండేవారు. రాత్రి అమ్మకి ఫోనులో అన్ని చేరవేస్తుండే దాన్ని.

***

ఆ రోజు దురదృష్టకర మైనది.

తెల్లవారే సరికి తాతయ్య నిద్రలోనే ప్రాణాన్ని వదిలేసేరు. ఊరూ వాడా గగ్గోలయి పోయింది.

వచ్చే పోయే జనంతో ఇల్లు సముద్రమై పోయ్యింది. ఇల్లే కాదు – రోడ్డంతా పూల తెప్పయి పోయింది.

అమ్మా నాన్నా వచ్చేరు.

కొడుకులు లేనందు వలన నాన్నే తల కొరివి పెట్టేరు.

తతంగమంతా యాంత్రికంగా జరిగిపోయింది.

అమ్మమ్మ మాత్రం ఒక గదిలో మౌనంగా కూర్చుంది.

పదిహేను రోజుల కర్మకాండలు జరిగేక అమ్మా నాన్నా అమ్మమ్మని తమతో రమ్మని అడిగారు. అమ్మమ్మ మౌనంగానే తిరస్కరించింది.

అమ్మమ్మ ఏ వైధవ్యపు చాంధస ధర్మాలు పాటించలేదు. అలా పాటించమని అడిగే ధైర్యం కూడ ఎవరికీ లేదు.

అందుకని నాకు అమ్మమ్మ చాల నచ్చింది.

నాకు ఇండియాలో ఇంకా పని వుండటం వలన నాన్నా అమ్మా వెళ్ళిపోయారు.

***

చుట్టాలూ పక్కాలూ అందరి పలకరింపులూ అయిపోయాక నేను ఏదో నోట్సు రాసుకుంటుండగా హాల్లో ఏదో చప్పుడు వినిపించి బయటకి వచ్చాను.

హాల్లోని నిలువెత్తు తాతయ్య ఫొటోని ఇద్దరు మనుషులు ఊడదీస్తున్నారు. అమ్మమ్మ నిలబడి వుందక్కడ.

“ఎందుకమ్మమ్మా ఫొటో అక్కణ్ణుండి తీయిస్తున్నావు?” అనడిగేను ఆశ్చర్యంగా.

అమ్మమ్మ నాకు జవాబు చెప్పలేదు. “తీసుకెళ్ళి వెనక అవుట్ హౌస్ స్టోర్‌రూమ్‌లో పెట్టండి” అని పనివాళ్ళకి చెప్పి గిర్రున వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మమ్మ.

నేను మరింత ఆశ్చర్యపోతూ అమ్మమ్మ గదిలోకి తన వెంట నడిచాను.

ఫొటోలో తాతయ్య ఎంతో సజీవంగా, అందంగా అచ్చు ఆయనే కూర్చున్నట్టుగా వున్నారు. ఆ ప్రాంతంలో వున్న ప్రముఖ చిత్రకారుడు తాతయ్య మీద మక్కువతో వేసి మరీ యిచ్చారట.

అమ్మమ్మ దించుకున్న కళ్ళు ఎత్తి నా వైపు చూసి, “ఇప్పటిదాకా చూసింది చాలు. నీకు కావాలంటే పట్టుకెళ్ళు. లేదంటే ఆవిడ కిచ్చిరా!” అంది.

నేను తెల్లబోయేను.

ఇన్ని సంవత్సరాలుగా ఎంతో అణకువ కలిగిన ఇల్లాలుగా పేరు తెచ్చుకున్న అమ్మమ్మ మాటల్లో ఏదో తేడా కనిపించింది.

ఇన్ని సంవత్సరాలు చూసింది చాలా?

“ఆవిడ… ఆవిడెవరు?” అని మెల్లిగా అడిగాను. బదులుగా అమ్మమ్మ కళ్ళ నుంచి జలజలా నీళ్ళు రాలాయి.

“ఎన్నో సంవత్సరాలుగా నా గుండెలో దాచుకున్న అగ్నిగుండం యిది. ఆయనకో ప్రియురాలు వుంది. సరస సల్లాపాలూ, ప్రేమలూ అన్నీ ఆమెతోనే. నేను పేరుకి మాత్రమే ఇల్లాలిని. లావాని దాచుకుని మంచు ముసుగేసుకున్న రాతి కొండని. అందుకే ఇకతని మొహం ఫొటోల్లో కూడా చూడటం నాకిష్టం లేదు” అంది అమ్మమ్మ మెల్లిగా నయినా కఠినంగా.

“మరి… మరి ఇన్ని సంవత్సరాలూ ఎందుకు కలిసున్నావు?” అనడిగాను ఆశ్చర్యంగా. ఎంతయినా అమెరికాలో పుట్టి పెరిగినదాన్ని. అక్కడ ఎంత భార్యాభర్తలైనా ఎవరి జీవితాలు వారివి.

తమని తాము కష్టపెట్టుకుంటూ ఎదుటివాడు పెడుతున్న కష్టాల్ని భరించి తమ జీవితాన్ని వృథా చేసుకునే అర్థం లేని త్యాగాలు వాళ్ళు చెయ్యరు.

అమ్మమ్మ శుష్కంగా నవ్వింది.

“ఈ లోకానికి భయపడో – ఒంటరిగా బ్రతక లేననో యిలా వుండి పోలేదు. ఎక్కడికెళ్ళినా ఒక దుఃఖం నా వెంటే వీడకుండా వస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలోనయినా పెళ్ళి స్త్రీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. మనసున్న మనిషి దొరకక పోతే విడాకులు తీసుకున్నా దొరికే సుఖం ఏమీ వుండదు. అందుకే ఇలా వుండి పోయాను. వ్యక్తిత్వమొచ్చిన పిల్లవి కదా – అందుకే ఇవన్నీ చెప్పేను” అంది అమ్మమ్మ.

నాకు అమ్మమ్మ అర్థమైంది.

“సరే అమ్మమ్మా, ఆవిణ్ణి అడిగి చూస్తాను. ఆవిడ పేరు….”

“లావణ్య. లావణ్యంగానే వుంటుంది. డ్రైవర్‌కి తెలుసు. తీసుకెళ్తాడు. వెళ్ళు” అంది అమ్మమ్మ.

***

ఆ యిల్లు చిన్న కుటీరంలా అందంగా వుంది.

చాలా పెద్ద యిల్లు కాకపోయినా పరిసరాలన్నీ మనోహరంగా వున్నాయి. ముఖ్యంగా ఆ తోట, ఆ తోటలో గుభాళించిన పూలు వచ్చేవారి హృదయాలపై ఎక్కుపెట్టిన సమ్మోహన బాణాల్లా వున్నాయి.

గుమ్మాని కిరువైపులా అమర్చిన టెర్రాకోటా బొమ్మలు, కలంకారీ తెరలూ, గోడల కమర్చిన పెయింటింగ్సు హాల్లో తూగుటుయ్యాల అన్నీ… ఆ యింటి యజమానురాలి అభిరుచికి అద్దం పడుతున్నాయి.

నన్ను చూడగానే పనమ్మాయి లోనికి వెళ్ళి చెప్పడంతో ఆమె బయటకి వచ్చింది.

చిరునవ్వుతో నన్ను చూసి “ఎవరమ్మా” అనడిగిందామె.

“నా పేరు షర్మిల. రాయుడి గారి….”

“ఓ నువ్వేనా! ఇండియా వచ్చినట్టు ఆయన చెప్పేరు. రా!” అంటూ చెయ్యి పట్టుకుని లోనికి తీసుకెళ్ళింది.

లోపల రేక్స్‌లో సర్దుకుని కూర్చున్న సాహిత్యం, ఒక నగిషీ బెంచీ మీద పెట్టిన వీణ – అన్నీ ఆమెకి వాటి పట్ల వున్న పాండిత్యానికి ప్రతీకలుగా వున్నాయి.

ఆమె వెళ్ళి స్వయంగా కాఫీ కలుపుకుని వచ్చి నా కో కప్పు యిచ్చి తనో కప్పు తీసుకుని నా గురించి వివరాలడిగి తెలుసుకుంది పరిచయాలకి నాందిగా.

“తాతయ్య పోయారు” అన్నాను ప్రస్తావనకి నాందిగా.

“తెలుసు. వచ్చే పరిస్థితి లేదు.”

చట్ట పరిమితిలో లేని ఆమె సంబంధం ఎంత అవకాశమిస్తుందో నాకూ తెలుసు కాబట్టి మౌనం వహించాను.

“అమ్మమ్మ అంతా చెప్పింది. ఆమె మిమ్మల్ని నిందించలేదు. కాని తాతయ్య మీద ఆమె విరక్తి చెందిందని నిన్ననే తెలిసింది.”

“అది సహజం. ఆమె చాలా ఉత్తమురాలు.”

“కాన్ఫరెన్సు హాలులో వున్న తాతయ్య ఫొటో నిన్న అమ్మమ్మ తీయించేసింది. నిలువెత్తు ఫొటో. తాతయ్యే సజీవంగా వున్నట్లున్నారు. అది స్టోర్‌రూమ్‌లో చేరడం నాకు నచ్చలేదు. మీకిష్టమైతే దాన్ని మీ కిద్దామని వచ్చేను.”

ఆమె కాసేపు తల దించుకుంది.

ఆ తర్వాత “వద్దమ్మా. నాకూ వద్దు” అంది నెమ్మదిగా.

నేను విస్తు పోయాను.

“కాని… అమ్మమ్మ చెప్పింది మీ రిద్దరూ…”

ఆమె తలెత్తి నవ్వి “అదొక నాటకం. అంతే” అంది.

ఈసారి విస్తుపోవడం నా వంతయ్యింది.

“అంటే… నా కర్థం కాలేదు” అన్నాను వింతగా.

“నీకే కాదు. ఎవరికీ అర్థం కానిది. ఇంత వయసొచ్చి పరిణతి చెందేవు కాబట్టి చెబుతున్నాను. ఆయన ఒక రాజకీయవేత్త. ఆయన నరనరాల్లోనూ రాజకీయం వుంది. నా భర్త ఆయన దగ్గర పని చేసేవారు. ఆయనొకసారి నా భర్తతో నన్ను చూశారు. కన్నేసారు. చిన్నగా మా యిద్దరి మధ్యా తగవులు సృష్టించి వాటిని తన పెద్దరికంతో రాజీ పేరుతో రాజేసి పూర్తిగా విడదీసేరు. ఆ తర్వాత నన్ను అమితంగా ప్రేమించినట్లు నటించి, నా సాన్నిహిత్యంలో కొంత భాష నేర్చుకుని తన ఉపన్యాసాలు నా చేత రాయించుకుని పూర్తిగా నన్ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆయనకి నాతోనే కాదు – అనేక మంది స్త్రీలతో సంబధాలున్నాయి.”

“మరెందుకలా ఆయనతో – ఇలా వుండిపోయారు?”

“ఈ పురుషాధిక్య ప్రపంచంలో వినేవారెవరు? మీ తాతని తప్పించుకుని బ్రతకడం అసాధ్యం. ఇంకో సంగతి. నాలోపల ఇంత అసహ్యం, బాధ వున్నాయని ఆయనకి కూడా తెలియదు.”

నా కంతా అర్థమయ్యింది.

ఆమెకి నమస్కరించి యింటికి తిరిగొచ్చేను.

ఆ వెంటనే అమ్మకి ఫోను చేసేను.

“ఎప్పుడొస్తున్నావ్, అమ్మమ్మ వస్తానంటుందా?”

“లేదు. అమ్మమ్మే కాదు – నేను కూడ అమెరికా రావడం లేదు.”

“అర్థం కాలేదు.”

“నేను అమ్మమ్మకి తోడుగా ఇండియాలోనే వుండాలనుకుంటున్నాను.”

“మరి కుమార్ సంగతి?” అమ్మ ప్రశ్న.

కుమార్ నా ఫియాన్సీ.

“అతనికి రాత్రే చెప్పాను. అతను కూడా ఇండియా రావడానికి ఒప్పుకున్నాడు.”

నా మాటలు వింటున్న అమ్మమ్మ కళ్ళు మెరిసేయి. నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

ఆ రాత్రి అమ్మమ్మ పడుకున్నాక మెల్లిగా వెళ్ళి స్టోర్ రూమ్ తలుపు తెరిచి చూసేను.

ఇప్పుడు తాతయ్య మొహంలో క్రౌర్యం, కౌటిల్యం, స్వార్థం తాండవం చేస్తూ కనిపించాయి.

ఆ ఫొటో మీద ఎలుకలు పరుగులు పెడుతున్నాయి.

(సమాప్తం)

*****

లీడ్ : ప్రపంచంలో ఏ దేశంలోనయినా పెళ్ళి స్త్రీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. మనసున్న మనిషి దొరకక పోతే విడాకులు తీసుకున్నా దొరికే సుఖం ఏమీ వుండదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.