జానకి జలధితరంగం-7

-జానకి చామర్తి

శబరి ఆతిధ్యం

నడిచారుట వారు ఎంతో దూరం .. కొండలు ఎక్కారు, నదులు దాటారు , మైదానాలు గడచి దుర్గమమైన అడవులను  అథిగమించి నడిచారుట వారు ,  అన్నదమ్ములు. కోసల దేశ రాజకుమారులు , దశరథ రాజ పుత్రులు రామలక్ష్మణులు , ఎంతెంతో దూరం నుంచి నడచీ నడచీ వస్తున్నారు.

వారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నది .. శబరి.

వయసుడిగినది జుట్టు తెల్లబడ్డది దేహము వణుకు తున్నది. కంటిచూపు చూడ మందగించినది, వినికిడి తగ్గింది, తడబడుతోంది.

అయినా ఆమె ఆ అడవి దారిలో  ప్రయాణిస్తూ  , తన కుటీరమూ తపోవనం దాటుకు వెళ్ళే బాటసారులకూ,   అతిథి అభ్యాగతులకు ఆకలి తీర్చే తల్లి కాని తల్లి. కుటీరం చుట్టుపక్కల తిరిగే జంతువులకూ, పశుపక్షాదులకు  కడుపు నింపే పెంపుడు తల్లి.

శబరి.. తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ ముసలిది అయిపోయింది, కాని ఆమెలోని తల్లి మనసుకు వయసు రాలేదు. నడుచుకుంటూ అడవిదారిలో పయనించే ప్రయాణికుల కడుపు నింపడం కూడా ఆమె తపస్సు అయింది. ఆమె కుటీరంలో ఆగి శబరి పెట్టిన పళ్ళూ కందమూలాలు ఆరగించి విశ్రాంతి తీసుకుని ప్రయాణం కొనసాగించేవారు,

పంపాసరోవరం  ఒడ్డున ఆమె తపోభూమి , అందులో ఆమె కుటీరం . ఫలాలు కాచే చెట్లూ చేమలూ దాహం తీర్చే తీయని నీరు, కమ్మని సేదదీర్చే శబరి ఆదరాభిమానాలూ పలకరింపులూ.. ఇంకేమి కావాలి .. అలసిన పాంథునికి.

మతంగముని ఆమెకు గురువు. పుణ్యలోకాలకు వెడలిపోయారు. ఆమె సేవయే మంత్రంగా పొందింది. ఆ తపోవనంలో తతిమ్మా బుషులందరనీ సేవించుకుంది. పళ్ళూ ఫలాలు నిర్మల జలాలు తెచ్చిపెట్టింది. ఆశ్రమాలు శుభ్రం చేసింది. కావలసినవి అందించేది, తనూ అలా తపస్సు చేసింది.

మిగతా బుుషులందరూ కూడా వారి వారి తపస్సులు ఫలించి ముక్తి పొందారు.

మతంగముని  చెప్పారు, రామలక్షమణులు డస్సిపోయి , ఈ అడవి దారంట నడుచుకుంటూ వస్తారు, ఆదరించు ఆతిథ్యమివ్వు సేవ చేయి నీ బతుకు పండుతుందని చెప్పారు. అదే శిరోధార్యమయ్యింది ఆమెకు.

ఎదురు చూపులే ఎదురుచూపులు, ఎన్ని అపురూపమైన పళ్ళను ఏరుకొచ్చి జాగ్రత్త చేసింది, ఎన్ని మథుర ఫలాలు పోగుచేసేది రోజూ.

తపస్విని శబరి, తన జీవిత సాఫల్యం కోసమే ఎదురుచూపు. అలసి వచ్చే రాముని కొరకే  తలపు తపస్సు. ఎప్పుడొతాడో.. వస్తాడో రాడో.. అయితే మాత్రం మిగతావారూ నా పిల్లలే అనుకుంది, చుట్టు చుట్టూ చుట్టుకు తిరిగే అడవి లేళ్ళతో సహా

ఆ అడవిలో కాకులు దూరని కారడవిలో దారితప్పిన వాడికైనా దారిన నడిచే వాడికైనా , శబరి ఆశ్రమంలోనే విశ్రాంతి, వారికి కడుపునింపడానికి శబరి పోగేసిన ఆహారం . లేదని చెపుతుందా.. కడుపు నింపేది.  అలా ఎంతో కాలం గడచే పోయింది.

వచ్చారు వారు నడచీ నడచీ ..

ఎదురు చూపులు ఫలించి దయచేసి వచ్చిన రామునికి లక్ష్మణుడికి అతిధిసత్కారం చేసింది తీయ తీయని ఫలాలు సమర్పించింది.  రేగుపళ్ళు దోరవేవో, కసరుపళ్ళేవో కొరికి రుచి చూసి మరీ పెట్టింది. అమాయకంగా తన ఆప్యాయత ఆదరణ  భక్తీ చూపింది ఆ మాత శబరి.

సేవ చేయడంలోనే తన జీవితాన్ని పండించుకుంది. జీవితాంతం సేవ చేసి ఆకలి దాహం తీర్చి సేవ చేసిన  ఆమె , ప్రతిఫలంగా మరణానంతరమూ ఇతరులకు సేవ చేస్తూనే ఉండే అవకాశం పొందింది. నదీమతల్లిగా మారింది, అందరి పొట్ట నింపుతూనే ఉంది.

శబరి.. దాహార్తిని తీర్చిన నీటి చెలమ..ఆమె ఎడతెగక ప్రవహించే

ఒక జీవనది.

మనలోనూ ఉన్నారు ఇటువంటి తల్లులు, కడుపు చూసి అన్నం పెట్టే అమ్మలు. ఆకలితో తలుపు తడితే ఏవేళనైనా కడుపు నింపే మాతలు, అతిథికి ఆదరించి వండి వడ్డించే గృహిణులు. డొక్కా సీతమ్మగారు మన కు వెను వెంటనే గుర్తుకు వచ్చే ఇటువంటి చల్లని తల్లి.

సర్వస్వమూ  ధారపోసి అన్నదానం చేసిన మహానుభావురాలు ఆమె. ఏసమయానికి వచ్చినా లేదనడమే అలవాటు లేకుండా అన్నదానం చేసినది ఆమె.

ప్రస్తుత కాలంలో కూడా సాధారణ గృహిణులు   సంప్రదాయాలను అనుసరిస్తూ అతిధులను ఆదరించేవారు,

ఆకలంటే అన్నం పెట్టి  పేదసాదలను ఆదుకునే కరుణామయ హృదయలు,

మండు వేసవిలో చలివేంద్రాలు పెట్టి దాహార్తిని తీర్చే దయామయ వనితలు, 

వరదలూ, తుఫానులు  లాటి ఇతర ప్రమాదాలు ఏర్పడినపుడు సామూహిక భోజనాలు ఏర్పాటు చేసి నిరాశ్రితుల కడుపు నింపే మహిళామణులు,

తమ ఇంటిలోనే ఉన్న వసతులతోనే ఆహారం తయారు చేసి కావలసినవారికి పంచి పెట్టే వితరణ శీలిలు,

అత్యవసర పరిస్ధితులలో భోజనము దొరకక చిక్కుబడిపోయే సహాయక సిబ్బందికి , వెనుకాడక వండి పెట్టి వారి విధులు సక్రమముగా నిర్వర్తించుటకు సహకరించే  ఇంటియజమానురాళ్ళు

ఎందరో ఎందరెందరో ఉత్తములు , మంచి మనసుగల తల్లులు వారు.

 ఇటీవల కొరోనా పరిస్ధితి కారణంగా తమ తమ సొంత ఊళ్ళకు తరలి వెళిపోతున్న అతిధి కార్మికులకు , ఆహారాన్ని , తాగునీటిని అందించి , నడకదారిలో వారికి సాంత్వన కలిగించిన తల్లులకు ప్రత్యేక అభినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.