రమణీయం

విపశ్యన -4

-సి.రమణ 

రోజులు గడిచిపోతున్నాయి. ఎనిమిదవ రోజు, తొమ్మిదో రోజు కూడా కరిగిపోయాయి. విచిత్రమేమిటంటే, మొదటి 2, 3 రోజులలో నాకు ఆనందం కలిగించిన కోకిల గానం, చల్లగాలులు, పూల తావులు ధ్యాన సమయంలో అసలు తెలియరావడం లేదు. అంతలా ధ్యానం చేయడంలో నిమగ్నమైపోయాను. మరోసారి పగోడా లోని  శూన్యాగారంలో ధ్యానం చేసుకునే అవకాశం కలిగింది. ఈసారి ఎందుకో, నా చుట్టూ ఉన్న స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు తలపుకు వచ్చాయి. బహుశా ఏమీ చేయలేని అశక్తతో, నాకెందుకులే అనే బాధ్యతారాహిత్యమో  తెలియదు కానీ,  ఇన్నాళ్ళు నాలో అణిగిఉన్న ఆలోచనా స్రవంతి, నిక్షిప్తమైన బాధ, స్త్రీల కష్టాలకు కారణమైన పురుషుల మీద ద్వేషం, ఒక్కసారిగా పెల్లుబికాయి. గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన సంవేదనలు కరిగి కన్నీళ్లు గా రాలుతున్నాయి.  అనిత్యమైన వేదనలు రాలిపోగా, ప్రశాంత వాతావరణం ఏర్పడింది. 

మనం ఏ ఇతర ధ్యానమార్గంలో ఉన్నా మంచిదే కానీ ఆయా  ధ్యాన మార్గాలలోచాలా మటుకు ఒక మంత్రంమీదో, దేవుని ప్రతిమ మీదో, లేక ఉచ్ఛ్వాస నిశ్వాస  మీదో, దీపం మీదనో, మనస్సు కేంద్రీకరించి,  ధ్యానం చేస్తాము. అక్కడ కూడా, ప్రశాంతత లభిస్తుంది. ఆనందం కలుగుతుంది. కానీ మనస్సు లోతుల్లోకి వెళ్లి ప్రక్షాళన చేయలేము. విపశ్యన ధ్యాన విధానంలో గొప్పదనం ఏమిటంటే మనలోనికి మనం ప్రయాణం చేస్తాం; అన్వేషిస్తాం; శోధన చేస్తాం. మనసు అట్టడుగు పొరల్లో, చిక్కుకున్న మాలిన్యాలను తొలగించుకొని, నిజమైన ప్రశాంతతను, శాశ్వత ఆనందాన్ని పొందుతాము.

 బయట ప్రపంచం లోని వస్తు సముదాయంతో, లభించే స్వల్ప సంతోషాలలో,  మునకలు వేస్తూ ,  మనలను మనం కోల్పోతుంటాము. సంతోషం, సంతృప్తి అంతా బయట నుండే  వస్తుందని భ్రమ పడతాం. ఆహార, విహారాలలో, వస్తు వినిమయంలో ఉందని తలపోస్తాము. ఎప్పుడూ డబ్బు సంపాదన  మీద, నిరర్ధక ఆస్తులు సమకూర్చుకోవడం మీద, వస్తువులు  కొనడం మీద ఉండే శ్రద్ధను మరల్చి, మన శరీరం మీద, మనలోని మనసు మీద శ్రద్ధ చూపించి మనలను మనం ప్రేమించడం,మనలోని చైతన్యాన్ని అర్థం చేసుకోవడం మొదలెడితే జీవితం చాలా ఇష్టంగా, ఆసక్తికరంగా ఉంటుంది. కష్టాలు, సుఖాలు, దుఖాఃలు, సంతోషాలు  అన్నీ ఉండటమే జీవితధర్మం అని తెలుసుకొని, అనంతమైన ఆనందం, మనలోనే ఉందనే సత్యం గ్రహించగలిగితే, అదే ముక్తి. 

తొమ్మిదవ రోజు మధ్యాహ్నం సామూహిక ధ్యాన సమయంలో, దీర్ఘమైన ధ్యానం లో ఉన్నాము. అంగ అంగాన్ని శోధిస్తూ , కణ కణాన్ని పరిశోధిస్తూ ఉన్నాను. ఒక్కసారిగా, మూసిఉన్న కళ్ళముందు, కూర్చునిఉన్న నా ఆకారం, అణువణువు విడిపోతూ ….. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ, వానచినుకుల్లా రాలిపోతూ, పుడమిమీద పరచు కుంటూ, ప్రకృతిలో కలసిపోయి,  ఒక శూన్య స్థితికి చేరుకుని అనన్యమైన ఆనందానుభూతిని కలిగించింది. ఇది చైతన్యమా, విశ్వప్రేమా? అర్థం కాలేదు. ఏ వినిమయ వస్తువులు, ఎటువంటి మానవ  సంబంధాలు ఇవ్వలేని అమలిన ఆనందమది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజులలో కలిగిన సందేహం, ఈ పది రోజులలో, మనసుని దేనిమీదనైనా నిలపగలనా, ఆలోచనా ప్రవాహాన్ని ఆపగలనా అని. ఆపడమే కాదు, శూన్య స్థితి కూడా సాక్షాత్కరించింది.

పుట్టిన ప్రతిదీ నశిస్తుంది. అది చెట్టు అయినా, జంతువు అయినా, మనిషి అయినా. ప్రకృతిలో అతి చిన్న భాగమైన మనిషి, తన మనుగడ కోసం, ఆనందం కోసం ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా  ఆలోచించి, తదనుగుణంగా ప్రవర్తించి, విశ్వ వినాశనానికి కారణమవుతున్నాడు. ఆనందం తనలోనే ఉందనే విషయం అర్ధం కాక ప్రకృతిని అల్లకల్లోలం చేస్తున్నాడు. శరీరం కాని, ప్రకృతి కాని వాటి ధర్మాన్ని అనుసరించి, అనుక్షణం మార్పు చెందుతూనే ఉంటాయి. శాశ్వతత్వం ఉండదు .అదేవిధంగా సిక్కు ధర్మం, జైన ధర్మం, హిందూ ధర్మం అని వింటూ ఉంటాము. కానీ, ధర్మము ఎప్పుడూ మతాలకు, దేశాలకు అనుగుణంగా మారదు. ఏ మతస్థుడు కైనా శరీర ధర్మం  ఒకటే. ఏ జీవికైనా ప్రకృతి ధర్మం ఒక్కటే. 

విపశ్యన  చెయ్యటానికి నేను ఎంత ఉత్సుకతతో వచ్చానో, అంతకంటే ఎక్కువగా అనుభవాన్ని పొందాను. చెప్పాలంటే చాలా చాలా ఉంది, కానీ ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. ఇక్కడ నిబద్ధతతో సేవలందిస్తున్న ధమ్మ సేవికలు, ప్రేమగా శ్రద్ధగా నేర్పిస్తున్న గురువులు, నియమాలు, సమయపాలన, క్రమశిక్షణ,  అందరూ, అన్నీ నచ్చాయి. నా వల్ల కాదులే, అని పట్టించుకోని నాకు, ఈ ధ్యాన శిబిరం ఎన్నో నేర్పింది. చేతిలో పర్సు, డబ్బులు, సెల్ ఫోన్,  తాళం చెవులు లేకుండా స్వేచ్ఛగా జీవించటం, పదిరోజులు మౌనంగా, నాకోసమే నేను, నాలో నేనై జీవించటం, బయటి ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేకపోయినా ధ్యానం చేసుకుంటూ, మనసంతరాలలో ప్రక్షాళన చేసుకుంటూ, ఆనందంగా ఉండటం నేర్పించింది. 

డబ్బు లేకుండా బ్రతకలేను, సెల్ ఫోన్ లేకపోతే క్షణం గడవదు, టీవీలు, సినిమాలు లేకపోతే కాలం గడవదు, మేడలు, మందీ మార్బలం లేకుండా మనుగడ లేదని దర్పం ప్రదర్శించే  మందభాగ్యులకు, అడవిలో నైనా ఆనందంగా గడపొచ్చు అని అర్థమవుతుంది. చిన్నతనం నుండి అలవడిన మాన్యతలను మార్చుకొని, మానవీయ మూల్యాలను పెంచుకోవటం అంత సులభమైన పనేమీకాదు. కాని, ఈ పది రోజులలో నెమ్మదిగా వచ్చే మార్పులను పరిశీలిస్తే, మనిషిలో మార్పులు తేవటం మరీ అంత కష్టతరంకాదు అనే విశ్వాసం కలుగుతుంది.

ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, విపశ్యన సాధన గురువు సమక్షంలో మాత్రమే జరగాలి. మనంతట మనం యూట్యూబ్ లో చూసి గాని, ఇతరుల నుండి గాని నేర్చుకో రాదు. పది రోజులు శిబిరంలో ఉండి, ప్రామాణికాలను అనుసరించి, అనుభవం కలిగిన గురువు నుండి మాత్రమే నేర్చుకోవాలి. లేకుంటే అనర్థమే జరుగుతుంది; నిరాశ మిగులుతుంది. 

ఈ శిబిరంలో సాధన నేర్చుకోవటానికి, ఎవరూ ఎటువంటి రుసుమూ  చెల్లించనవసరంలేదు. మన తరువాత మనలాగానే జ్ఞాన సముపార్జనకొరకు వచ్చే వారి సౌకర్యాల కోసం, కొంత విరాళం మనకు మనమే తోచినంత ఇవ్వవచ్చు. అందరం ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఆనందంగా సాయం చేసాం. నాకు విరాళం అనే పదం నచ్చలేదు. ఎందుకంటే, దానివల్ల అహంభావం కలగవచ్చు. దీనికి ఇంకా ఏదైనా సరైన పదం ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా, సంవిభాగం (పంచుకోవడం) అనే పదం తట్టింది. మనం ఉద్యోగము, వ్యాపారము చేసి ఈ సమాజం నుండేగా సంపాదిస్తాము. తిరిగి మరల ఆ ధనం సమాజంతో పంచుకోవాలి. ఇక్కడ ఎవరంటే వారు డొనేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళు తీసుకోరు కాబట్టి. ఇక్కడ పది రోజులు శిబిరంలో పాల్గొన్న వారినుండి మాత్రమే తీసుకుంటారు. మనసుకు తోచినంత, నచ్చినంత ఇవ్వవచ్చు. మరి ఏ ఇతర విధానాలు గాను, ధన సంబంధిత లావాదేవీలు అంగీకరించరు.

పది రోజుల శిబిరం ముగించుకుని, గొప్ప సంపద నాతో తీసుకు వెళ్తున్నాను, మౌనంగా. ఆవరణలోని చెట్లకు, పిల్ల గాలులకు, పూల తీగల మీద ఊయల ఊగుతున్న పిట్టలకు, గానకచ్చేరి చేస్తున్న కోకిలకు, వీడ్కోలు చెప్పి బయలుదేరడం, అంత ఇష్టంగా అనిపించలేదు. అలాగని, నేను అనుకున్నంత బాధగానూ లేదు. ఇక్కడకు మళ్లీ మళ్లీ రావచ్చు, శిబిరంలో పాల్గొనవచ్చు. ఇప్పుడు ఉన్నంత సంతోషం, స్పష్టత కాలం గడుస్తున్న కొద్దీ, నెమ్మదిగా తగ్గు ముఖం పట్టవచ్చు, మన పరిసరాల ప్రభావం వల్ల. సంవత్సరానికి ఒకసారి వచ్చి పునశ్చరణ చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడాను. సమాజంలో ప్రతి ఒక్కరూ అనుసరించదగిన జీవనవేదమే ఈ విపశ్యన. 

ఈ విపశ్యనా విధానాన్ని ప్రపంచానికి ప్రసాదించించింది గౌతమ బుద్ధుడు.మరి అంతటి గురువైన బుద్ధుని గురించి కూడా మనము తెలుసుకోవాలి. మరో సంచికలో బుద్ధుడి జీవితం, తాత్వికాలోచనల గురించి కొంత తెలుసుకుందాము.


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.