షర్మిలాం”తరంగం”

-షర్మిల కోనేరు 

పుణ్యం పంచే పూల దొంగలు

నేను మొదటగా అచ్చులో చూసుకున్న ” ఓ పువ్వు పూయించండి “అనే ఆర్టికల్ దూషణ భూషణ తిరస్కారాలకు లోనైంది !

ఇంత భారీ పదం నేను రాసిన ఆ సింగిల్ కాలమ్ కి నిజానికి సూట్ అవ్వదు .

కానీ ఎందరో హేమాహేమీల కన్ను దాని మీద పడడం మాత్రం నాకు భలేగా అనిపిస్తుంది .

ఇది 25 ఏళ్ళ పైమాటే ….

నేను సబెడిటరైన కొత్తల్లో ఒకే ఒక పేరా వుండే ఆ ఆర్టికల్ నవీన కి రాశాను .

అరుణ్ సాగర్ ఆంధ్రజ్యోతి నవీన పేజీ ఇన్ చార్జి .

మిత్రుడు సాంబూ అప్పుడు సబెడిటర్ .

సాంబూ నా అర్టికల్ కి నాలుగయిదు రంగుల టింట్ ఇచ్చి మధ్యలో దండమూడి సీతారాం ( మా బావే ) తీసిన ఒక గులాబీ పువ్వు ఫొటో పెట్టి మేకప్ చేయించాడట!

ఫైనల్ గా పేజీ అప్పటి ఎడిటర్ నండూరి రామ్మోహనరావు గారికి చూపిస్తే నండూరి గారు మొహం చిట్లించారంట .

” ఆ పేజీ మధ్యలో పెట్టిన ఆ సింగిల్ కాలం ఆర్టికల్ కి అంత మేకప్ , దానికి ఒక ఫొటోనా ! , సర్లే పెట్టారుగా ! పేజ్ రిలీజ్ చేసెయ్యండి ” అన్నారంట .

మామూలుగా అయితే ఈ విషయం నాకు తెలియకపోను . సాంబశివరావు నాకు వార్త ట్రైనింగ్ లో పరిచయం .

అప్పుడు ఈ సంగతి చెప్పాడు .

నా ఆర్టికల్ మేకప్ చేయించిన సాంబు ఇప్పుడు టీవీ 9 లో వెలిప్రేమ లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు .

ఇక అరుణ్ సాగర్ గురించి చెప్పేదేముంది .

తను లేడు కానీ తన సాహిత్యం బతికే వుంది .

నాతో నవీన పేజీకి ఎన్నో ఆర్టికల్స్ రాయించాడు .

మూడో ఆయన ఈ ఆర్టికల్ కి ఫొటో అందించిన మా బావ దండమూడి సీతారాం .

ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి ప్రధాన ఫొటో గ్రాఫర్ .

ఇక అసలు ఆయన… అదే ఎడిటర్ నండూరి రామ్మోహనరావు గారు జర్నలిస్ట్ దిగ్గజం .

ఇంత మంది కన్ను అతి చిన్న ” ఓ పువ్వు పూయించండి ” అనే నా పిచ్చి రాత మీద పడడటం భలే థ్రిల్లింగ్ గా వుంటుంది ఇప్పటికీ .

అప్పుడైతే రాసేశాను గానీ ” ఓ పువ్వు పూయించడం ” అంత తేలికైన విషయమేం కాదు .

పైగా పూయించిన పువ్వును ఎవరి కబంధ హస్తాల్లోనూ పడకుండా రక్షించుకోవడం ఎంత ప్రయాసో మా వూళ్ళో పూల చెట్లున్న ప్రతి ఒక్కరికీ తెలుసు .

మా ఊళ్ళో చీకట్లు అలుముకొని వుండగానే నాలుగు గంటల నుంచి కొన్ని ఆకారాలు సంచరిస్తాయి .

కుక్కలు వారిని చూసినా అరవవు .

ఎందుకంటే ఆ ఆకారాలన్నీ వాటికి పరిచయమైనవే కాబట్టి .

ఆ ఆకారాలు ప్రతి ఇంటి ముందున్న పూలు పుటుకూ పుటుకూ తెంచటం , చేతిలో వున్న ప్లాస్టిక్ కవర్ నింపెయ్యడం .

ఇంకేముంది పొద్దున్నే పకపక నవ్వుతూ కనిపించాల్సిన చెట్లు తెల్ల మొహాలేసుకుని ఎక్కడో వాళ్ళకి అందకుండా వదిలేసిన ఒకటీ అరా పూలతో పలకరిస్తాయి .

వీళ్ళ పూజలు సంతకెళ్ళా ! కళ్ళారా ఒక్క నాడంటే ఒక్క నాడు పూలతో విరగబూసిన చెట్టుని చూడనియ్యరు !

పూల చెట్లు పెంచే పిచ్చి మాలోకాలున్నంత వరకూ వాళ్ళ దేముడి మందిరాలు పూలతో కళళలాడుతూనే వుంటాయి .

పోనీ 20 రూపాయలు పెడితే రెండురోజులకు సరిపడా పూలు కొనుక్కో వచ్చు .

అంతే గానీ అందరి గోడలెక్కి పూలు తెంపి పూజలా ?

నేను ఇలా తిట్టుకుంటే మా అమ్మ ” పోన్లేవే పాపం ! అలా తిట్టకు,

వాళ్ళు పూజకేగా కోసుకెళ్తున్నారు.

..నీకూ పుణ్యమేలే ” అని వాళ్ళని అడగకుండానే నాకు పుణ్యంలో వాటా ఇచ్చింది .

అసలు మొక్క నాటడానికి దాన్ని బతికించడానికి ఎంత కష్ట పడలో

ప్రహరీ లోపలకి ఎండ తగలదని క్రోటన్స్ వేసి ప్రహరీ పక్కగా ఒక గులాబీ రంగు పూలు పూసే ఆర్నమెంటల్ మొక్క ఒకటి ,

ఇంటి ముందు ప్రహరీ మీదగా పాకే పసుపుపచ్చ పూలు పూసే మొక్క వేసాను .

మొదట్లో ఎప్పుడో ఓ సారి చెట్టునిండా పూసినప్పుడు చూశాను .

అవి కోస్తే ఒక్క రోజులో వాడిపోతాయి . అదే చెట్టుకి వుంటే మూడు నాలుగు రోజులైనా అలాగే వుంటాయి .

మళ్ళీ ఒక్క నాడన్నా చూస్తే ఒట్టు .

అందరి ఇళ్ళ ముందున్న చెట్లకీ ఇదే గతి .

చక్కగా చెట్లకి పూలు కళకళ లాడుతుంటే దేముడు మాత్రం తన సృష్టి చూసుకుని ఆనందించడూ !

ఏమన్నా చెప్పండి ఒక పూవు పూయించడం , దాన్ని కాపాడుకోవటం ఆర్టికల్ రాసేసినంత వీజీ కాదు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.