యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

గెలుపునాదే

జ్యోతి చిన్నప్పటి నుంచీ చాలా హుషారుగా వుండేది. తను నల్లగా వుంటుందని ఎవరైనా అంటే తప్ప పట్టించుకునేది కాదు. చాలా నల్లగా వుండేది. చాలామంది నల్ల పిల్ల అని పిలిచేవారు. జ్యోతీ అని పిలిస్తే తప్ప పలికేది కాదు. ఎవరినీ నోరెత్తి ఏమీ అనేది కాదు. చదువులో ముందరే వుండేది. వాళ్ళమ్మ పాటలు బాగా పాడుతుంది కాబట్టి తనూ నేర్చుకుంది. 

చక్కటి గొంతు. ప్త్రెజు వచ్చినా రాకపోయినా ప్రతి పోటీకి పేరు ఇచ్చేది. వచ్చినప్పుడు ప్రైజులు వచ్చేవి. అయితే ప్రతి ఒక్కళ్ళూ నలుపు, నలుపు అంటుంటేే మాత్రం అప్పుడప్పుడూ చాలా బాధగా అనిపించేది. అయినా ముందుకి చొచ్చుకుని పోతూనే వుండేది. 

బి.టెక్. పూర్తి చేసింది. గూగుల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళమ్మ సుశీలకి కూడా సంతోషం అనిపించింది. అందరూ మాట్లాడే మాటలకి కూతురు నొచ్చుకుని ఎక్కడ డిప్రెషన్ లోకి వెడుతుందోనని ఎప్పటికప్పుడు కూతురుని ప్రోత్సహిస్తూనే వుండేది. 

పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది. అందరూ ఉద్యోగం, వాళ్ళమ్మ ఇచ్చే కట్నం చూసి వచ్చేవారు. కానీ అమ్మాయిని చూడగానే వెనక్కి వెళ్ళిపోయేవారు. సుశీలకి చాలా బెంగగా వుండేది. ఆ బెంగతో మనసంతా పాడుచేసుకుని కూచునేది. దాంతో ఆరోగ్యం పాడయింది. నడవలేని పరిస్థితి. పిల్లలిద్దరూ చాలా కంగారు పడిపోయారు. వారం రోజులు హాస్పిటల్ లో వుంది.   

జ్యోతి “ఎందుకమ్మా… అలా చేస్తున్నావు. నువ్వు నా పెళ్ళి గురించి అంత బెంగ పెట్టుకోవద్దు. నేను బాగా సెటిల్ అయ్యాక చేసుకుంటాను” అని వూరడించింది.

కొంచెం తేరుకున్నాక ఇంటికి వచ్చిన సుశీల ఏమైనా సరే కూతురు పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకుంది. ఎవరేమన్నాసరే పట్టించుకోదలుచుకోలేదు. తన కూతురుకి పెళ్ళి అవ్వాలని మాత్రమే మనసులో గట్టిగా అనుకుంది. 

ఒకాయన వెతుక్కుంటూ ఇంటికి వచ్చి అమ్మా సుమతిగారంటే మీరేనా… అన్నారు.

ఎప్పుడూ చూడని వ్యక్తి అలా పలకరించేసరికి సుమతి చాలా ఆశ్చర్యపోయింది. అవునండీ ఇంతకీ మీరెవరు… ఏమిటిలా వచ్చారు అంది. 

నాపేరు రంగారావమ్మా… మీ అమ్మాయి పెళ్ళికి వుందని విన్నాను. మాట్లాడదామని వచ్చాను అన్నారు. మీ అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తోంది. మా అబ్బాయికి బాగా సరిపోతుంది. ఒకసారి ఫొటో చూపించమ్మా… అన్నీ మాట్లాడుకుందాం అన్నారు. సుమతికి చిరాకేసినా ఇంటికి వచ్చిన సంబంధం కదా… అనుకుంది. 

అక్కడే టీపాయ్ మీద ఉన్న పుస్తకంలోనుంచి ఫొటో తీసి చూపించింది. ఆయన అలాగే చూస్తూ వుండిపోయాడు. ఫోటో సుమతి చేతికి ఇచ్చేసి, ఏమనుకోకమ్మా… మరీ ఇంత నలుపు అనుకోలేదు అని, వెంటనే లేచి బయటికి వెళ్ళిపోయారు. 

సుమతి మళ్ళీ మళ్ళీ బాధపడింది. ఇంటికి వస్తూనే తల్లిని చూసిన సుమతి అమ్మా మళ్ళీ ఎవరైనా సంబంధం అంటూ వచ్చారా… కొన్నాళ్ళు అసలు నిన్ను పట్టించుకోవద్దని చెప్పాను కదా… అంది. సమతి ఏమీ మాట్లాడలేదు. 

నేనెంతో సంతోషంతో ఇంటికి వచ్చాను. నేను చెప్పే విషయం విని నువ్వు చాలా ఆనందిస్తావనుకున్నాను అంటూ తల్లి మీద చేతులేసి పక్కన కూచుంది. 

అమ్మా… నేను కిందటి నెలలో జాతీయ పాటల పోటీకి సెలక్టయ్యానని చెప్పాను కదా… వాటిని ఎల్లుండి తిరుపతిలో పెడుతున్నారు. మనం అక్కడికి వెళ్ళాలి. నువ్వు పిచ్చి ఆలోచనలన్నీ మాని బట్టలు సద్దు అని చెప్పింది. 

సుమతికి అంతవరకూ వున్న ఆవేదనంతా పోయింది. చాలా సంతోషంగా ఇద్దరి బట్టలూ సద్దింది. అనుకున్న రోజు రానే వచ్చింది. ఇద్దరూ పోటీలు జరిగే చోటికి చేరుకున్నారు. ఇంచుమించు ఒక 15 మంది వచ్చివుంటారు. 

హాలంతా పిల్లలతో, తల్లిదండ్రులతో హడావుడిగా వుంది. ఒక పదినిమిషాల్లో పోటీ మొదలు పెట్టారు. జ్యోతిది 8వ నెంబరు. తను నేర్చుకున్న లలితగేయం ‘ఎక్కడనుండో ఈ పిలుపు…’  నదురు బెదురు లేకుండా చక్కగా పాడింది. పాడుతున్నంతసేపు అందరూ చాలా బాగా విన్నారు.  

ఆ రోజు సాయంత్రం గెలిచిన వాళ్ళ పేరు ఎనౌన్స్ చేస్తామన్నారు. సాయంత్రం వరకూ బయట కాసేపు  గడిపి, మళ్ళీ హాలుకి చేరుకున్నారు. 

అందరిలోనూ ఉత్కంఠ. ఎందుకంటే అందరూ బాగా పాడారు. ఎవరికీ ఎవరూ తీసిపోరు. ఒక పదినిమిషాలలో పాటల పోటీకి అధ్యక్షత వహించిన రాజుగారు వచ్చి మీ అందరూ బాగాపాడారు అంటూ – ప్రథమ బహుమతి కుమారి జ్యోతి, ద్వితీయ బహుమతి శరత్, తృతీయ బహుమతి రాగిణి అని ఎనౌన్స్ చేశారు. హాలంతా తప్పట్లతో మారుమ్రోగిపోయింది. జ్యోతి ఆనందానికి అంతేలేదు. వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుని ముద్దులతో ముంచెత్తింది. 

ప్రైజుకోసం స్టేజిమీదకి వెళ్ళింది. అక్కడున్న పెద్దలందరూ అభినందించారు. ప్రైజుతోబాటు, రు. 50,000 చెక్కుని కూడా ఇచ్చారు. జ్యోతి చాలా సంతోషించింది. 

సుమతి దగ్గిరకి వచ్చి, చూశావా అమ్మా… గెలుపు నాదే… నలుపు… తెలుపులలో ఏమీ వుండదు. నువ్వు నిశ్చింతగా వుండూ అన్ని అవే సద్దుకుంటాయి అంది. 

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ద్వితీయ బహుమతి వచ్చిన శరత్, జ్యోతీ మీకు ప్రథమ బహుమతి ఇచ్చి న్యాయం చేశారు. నిజంగా మీరు చాలా గ్రేట్. రేపు నేను మీ ఇంటికి రావచ్చా…? అన్నాడు. నేను ఒక్కడినే కాదు మా అమ్మా వాళ్ళని కూడా తీసుకుని వస్తాను అన్నాడు.

సుమతికి, జ్యోతికి ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. ఇద్దరూ రమ్మని చెప్పారు. 

మర్నాడు పొద్దున్న పదిగంటలకి శరత్ వాళ్ళ అమ్మా నాన్నలతో వచ్చాడు. కాసేపు క్షేమ సమాచారాలు, పుట్టు పూర్వోత్తరాలుు మాట్లాడుకున్నారు.

శరత్ వాళ్ల నాన్న అమ్మా జ్యోతీ నీ పాటలు చాలా సార్లు విన్నాము. మా అబ్బాయి ద్వారా నీ ప్రతిభని కూడా వింటున్నాము. మా అబ్బాయికి నువ్వు నచ్చావు. నీలాంటి అమ్మాయి మా కోడలు అవడం మా అదృష్టం. ఈ విషయం మాట్లాడదామనే మీ ఇంటికి వచ్చాం అన్నారు.

సుమతి చాలా ఆశ్చర్యపోయింది. సంతోషంతో కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. జ్యోతి కూడా ఈ సంబంధానికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఒక మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్ళి చేశారు. ఇద్దరూ చాలా సంతోషంగా వున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక బాబు. 

జీవితంలో గెలవడానికి నలుపు, తెలుపులు అడ్డుకాదనుకుంది సుమతి. 

*****

Please follow and like us:

One thought on “యదార్థ గాథలు-గెలుపునాదే”

Leave a Reply

Your email address will not be published.