క “వన” కోకిలలు  

-నాగరాజు రామస్వామి 

                                                  మాయా ఆంజలోవ్ 

( ఏప్రిల్ 4 , 1928 – మే 28 , 2014 )

“We are more alike than unalike” – Maya Angelou 

పైకి భిన్నంగా కనిపించినా, ప్రపంచ మానవులందరిలో ఒకే అనురూప అనన్యత దాగి ఉందని విశ్వసించే మాయా ఆంజలోవ్ ఒక ప్రసిద్ధ బ్లాక్ అమెరికన్ రచయిత్రి. ఆమె తన తన సుదీర్ఘమైన ఆత్మకథను ఏడు సంపుటాలలో కాల్పనిక సాహిత్య బాణీలో ( Fiction ) ఆవిష్కరించింది. I know why the Caged Bird sings ( 1969 ) ఆమె మొదటి ఆత్మకథ. Caged Bird వర్ణవివక్షతకు గురిఅవుతున్న ఆఫ్రో అమెరికన్ కు ప్రతీక.  మూడు వ్యాస సంకలనాలను, ఎన్నో కవితా సంపుటాలను వెలువరించింది. అనేక పురస్కారాలను, 50 పైచిలుకు గౌరవడిగ్రీలను స్వంతం చేసుకుంది. గొప్ప రచయిత్రి, కవయిత్రి, గాయని, కళాకారిణి, వక్త, క్లబ్ డాన్సర్, స్క్రీన్ డైరెక్టర్, జర్నలిస్ట్ – ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె రచనలలో నల్లజాతీయుల దుర్భర జీవితం చిత్రించబడింది. మార్టిన్ లూథర్ కింగ్ నడిపిన చరిత్రాత్మక పౌర హక్కుల ఉద్యమంలో (Civil Rights Movement ) ప్రముఖ పాత్ర వహించింది. ఆమె అమెరికన్ జాతీయ జీవనాన్ని అత్యంత ప్రభావితం చేసిన విశిష్ట వనిత. 1993 లో బిల్ క్లింటన్ అధ్యక్ష సమారోహణంలో ఆమె కవిత ” On the Pulse of Morning ” చదివేందుకు ఆహ్వానించబడింది. ఆమె 2000 లోజీవిత సాఫల్య పురస్కారాన్ని  పొందింది . 2010లో అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెకు అమెరికా జాతీయ అత్యంత ప్రతిష్టాత్మకమైన “Presidential Medal of Freedom” పురస్కారాన్ని ప్రధానం చేశాడు.

ఆమె జీవిత సింహభాగం (ముఖ్యంగా, బాల్య యవ్వన దశలు) దయనీయమైనది. అమెరికాలో పుట్టినా, ఈజిప్టు, ఘానా లాంటి దేశాలలో శ్రమించక తప్పలేదు. జీవిక కోసం జీవితంలో ఎన్ని ఒడిదొడుకులొచ్చినా ఓటమిని అంగీకరించని తత్వం ఆమెది. నిరంతర రచనా నిరతి. వృద్ధాప్య దశలో సైతం రచనలను చేయడం విరమించలేదు. జీవించడం కేవలం జీవించడానికే కాకుండా, తలెత్తుకు తిరిగేలా జీవించాలన్నది ఆమె ఆదర్శం. ప్రేమ ఉత్కృష్ట మైనదే, కాని స్వేచ్ఛ పరమోత్కృష్టమైనదని ఆమె విశ్వాసం . వర్ణ వివక్షయ రహితమైన అమెరికా ఆకాశంలో స్వేచ్చా విహంగమై విహరించాలని ఆమె ఆశయం. బానిసత్వ విముక్తి ఆమె ధ్యేయం. అవసరమైతే ప్రభంజనమై ప్రతిఘటించాలన్నది ఆమె సందేశం.

ఆమె కవిత్వం రాగానుగుణంగా ఉంటుందంటారు. ఆమె నీలి కలువ. అందుకే ఆమె కవిత్వం నిండా నీలి రాగాలు పరచుకున్నవి.

ఆమె కవితా పటిమను తెలిపే కవితలు కోకొల్లలు. మచ్చుకు, ఈ మూడు కవితలు ఆమెవి – అనువాదాలు నావి.

1 . అప్సరస స్పర్శ .

( Touched by an Angel  )

సంతోషాన్ని బహిష్కరించే సాహసానికి

అలవాటు పడని మనం

ఏకాకి నత్తగుల్లలో ముడుచుకొని బతుకుతుంటాం ;

మనలను జీవితంలోకి విముక్తం చేసేందుకు

తన పరమ పావనమైన కోవెలను విడిచి

‘ప్రేమ’ మనదాకా వచ్చే దాకా.

ప్రేమ శకటాన్ని వెంబడించి వస్తాయి

ఆనంద స్మృతులు, తాదాత్మ్యాలు,

బాధామయ సనాతన చరిత్రలు ;

మనకు ఒకింత ధైర్యముంటే చాలు

మన ఆత్మలోని భయాల సంకెళ్లను

బద్దలు కొడుతుంది ప్రేమ.

కాని, ఒక్కోసారి,

వెల్లువెత్తిన ప్రేమరశ్మిలో

పిరికితనాన్ని పారద్రోలే మన సాహసం

వికటిస్తుంటుంది;

హఠాత్తుగా తెలిసొస్తుంటుంది

మనకున్నదంతా, ఉండనున్నదంతా

ఊడ్చుకుపోయిందని .

అయినా,

మనలను విముక్తులను చేసేది

ప్రేమ ఒక్కటే !

2 . పంజరంలో పక్షి .

( Caged Bird )

స్వేచ్ఛ కలిగిన పక్షి

తేలిపోతున్నది పవన పక్షాల మీద

గాలివాలు చివరి దాకా ;

అది

నారింజ రంగు రవికిరణాలలో

రెక్కలను ముంచుకొని

ఆకాశం నాదేనని సవాలు చేస్తున్నది !

మరొకటి

ఇనుప ఊచల ఇరుకు పంజరంలో

ప్రకోపంతో పరితపిస్తున్న ఉద్విగ్న పక్షి !

కాలికి సంకెలలు పడిన రెక్కలు తెగిన పిట్ట !

చూడలేక పోతున్నది కటకటాల గుండా ;

అందుకే అది గొంతు చించుకొని పాడుతున్నది .

పంజరంలో బంధింప బడిన పక్షి గొంతు

కంపిస్తున్నది భయం భయంగా

తాను కాంక్షించే అజ్ఞాత స్వర్గం అంతుపట్టక ;

దూరపు కొండలలో దాని కంఠస్వరం వినిపిస్తున్నది

అది పాడుతున్నది స్వాతంత్ర్యేచ్ఛ కనుక .

స్వేచ్చా పతంగమేమో

మరోలా ఆలోచిస్తున్నది .

నిట్టూర్పుల నిటారు వృక్షాల గుండా

మందమందంగా వీచే సముద్ర సమీరాల

ఉదయ కాంతిలో

కీటక ఫలహారం సిద్ధంగా ఉన్నదని

కలలు కంటున్నది ;

అందుకే అది

నింగి నా స్వంతమంటున్నది .

కాని,

కాళరాత్రిలో కటకటాల వెనుక రెక్కతెగిన పక్షి !

దాని కలల నీడ

దాని సమాధి మీదే గావుకేకై అరుస్తున్నది ;

అది గొంతెత్తి పాడుతున్నది !

పంజరంలో బంధింప బడిన పక్షి గొంతు

కంపిస్తున్నది భయం భయంగా

తాను కాంక్షించే అజ్ఞాత స్వర్గం అంతుపట్టక .

దూరపు కొండలలో వినిపిస్తున్నది దాని కంఠస్వరం ;

అది పాడుతున్నది స్వాతంత్ర్యేచ్ఛ కనుక .

  1. నేను పైకి లేస్తాను :

( Still I Rise )

నీవు

నీ మెలికల అసత్యాలతో,

నీ వక్ర కథనాలతో

నన్ను చరిత్రలో తొక్కి పెట్టొచ్చు,

మట్టిలో నన్ను తొక్కెయ్యనూ వచ్చు;

అయినా

నేను ఎగిసే ధూళిలా పైకి లేస్తాను .

నిన్ను ధిక్కరించే

నా తలబిరుసుతనం వల్లే కదా

నీకీ ఆక్రోశం ?

నూనె బావులు నా గదిలోకి

వంపబడుతున్నాయన్నంత ధీమాగా,

నా పెరట్లో పసిడి గనులను

తవ్వుకుంటున్నానన్నంత మొండిగా,

నా నడుము వంపులలో

రత్న హారాలను దోపుకున్నంత కన్నె దురుసులా

నేను ఉండటం వల్లే కదా

నీకీ విషాదం ?

నీవు నీ మాటలతో నన్ను కాల్చొచ్చు,

నీ నిశిత దృక్కులతో నన్ను నరుకొచ్చు,

నీ హేయదృక్పథం నన్ను పరిమార్చనూ వచ్చు;

అయినా నేను

సూర్య చంద్రుల్లా, జలధి పొంగుల్లా,

నింగిని నంటే ఆశలా, సుడిగాలిలా

పైకి లేస్తాను .

నేను కుంగి పోవడం,

నేలచూపులతో నీముందు తలవాల్చడం,

రాలనున్న అశ్రువులంటి వాలిన భుజాలతో,

నిస్సత్తువ నిండిన హృదయంతో

నీ ముందు నేను గిలగిల లాడడం

నీవు నానుండి ఆశించి ఉంటావు ;

కాని, నేను

పడిలేచే కడలి కెరటాన్నయి  పైకి లేస్తాను .

సిగ్గుమాలిన గతచరితల పూరిగుడిసెల్లోంచి

పైకి లేస్తాను,

విషాదంలో వేళ్లూనిన నా భూతకాలం లోంచి

పైకి లేస్తాను .

నేను

పొంగి పొరలే తరంగాలను గుండెల్లో దాచుకున్న

నల్ల సముద్రాన్ని !

భయదోగ్ర రాత్రులను వదిలేసి

స్వచ్ఛ ప్రభాతాలలో నిదుర లేస్తాను ,

నేను

పూర్వీకుల కానుకలను మోసుకొస్తున్న

బానిసల ఆశావహ స్వప్నాన్ని !

నేను లేస్తాను !

నేను పైకి లేస్తాను !

నేను పైపైకి లేస్తాను !

అమెరికా వివక్షా విపినాలలో మెటామార్ఫోసిస్ పొందిన సీతాకోకచిలుక ఆంజెలావ్ !

ప్రపంచ ప్రమదావనాలలో ధిక్కార గొంతుక నెత్తిన నల్లకోకిల మాయా ఆంజెలావ్ !

*****

 

Please follow and like us:

One thought on “క“వన” కోకిలలు – మాయా ఆంజలోవ్”

  1. మాయా ఏంజలోవ్ పరిచయంతో పాటు ఆమె విశిష్ట రచనలు అనువదించి ఆమె కవన మధురిమను అందించారు.క’వన’కోకిలలు శీర్షిక ఎంతో సమంజసంగా ఉంది.నెచ్చెలి అంతర్జాల పత్రిక నిర్వాహకురాలు గీతాదేవి గారికి ,రామస్వామి నాగరాజు గారికి అభినందనలు

Leave a Reply to రాంమోహన రావు తుమ్మూరి Cancel reply

Your email address will not be published.