వెస్టర్న్ కల్చర్ మై డియర్ !

హిందీ మూలం: స్వాతి తివారీ

అనుసృజన : ఆర్. శాంతసుందరి

ఎవరో తలుపు నెమ్మదిగా తట్టారు. తలుపు గడియపెట్టి పడుకున్న నాకు లేవబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలనీ లేదు.కానీ లేచి తలుపు తెరవక తప్పదు. ప్రణవ్ ఏదైనా మర్చిపోయి వెనక్కి వచ్చాడేమో.కానీ తాళం చెవులూ, రుమాలూ, ఫైళ్ళూ అన్నీ ఇచ్చి పంపించింది ప్రతిమ.అతను వెళ్ళగానే తలుపు గడియ పెట్టేసింది.అదే పనిగా బైటినుంచి తలుపు తడుతూ ఉండేసరికి ఇక తప్పదనుకుని లేచి వెళ్ళి తలుపు తీసింది.ఎదురుగా తనకి పరిచయం లేని ఒక స్త్రీ నిలబడి ఉంది. మొహం చూస్తే తన ఎదుటి ఫ్లాట్ లో ఉన్నావిడే అనిపించింది. ఎప్పుడైనా తలుపు తీసినప్పుడు ఈవిడ బాల్కనీలో కనిపించేది. తలుపు పట్టుకుని నిలబడ్డ ప్రతిమ ఆవిణ్ణి లోపలికి పిలవాలో లేదో తేల్చుకోలేకపోయింది.

హల్లో, నేను మిసెస్ కులకర్ణీ , మీ ఎదురు ఫ్లాట్ లో ఉంటాను,”అంటూ మొదట ఆవిడే మాట కలిపింది.

, అవును , మీరు బాల్కనీలో నిలబడటం చూస్తూనే ఉంటాను.లోపలికి రండి,” అంటూ పక్కకి జరిగి ఆవిడకి దారిచ్చింది ప్రతిమ.ఇంటిని వాళ్ళు సర్దుకున్న తీరుని గమనిస్తూ ఆవిడ డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది.

నెల రోజుల క్రితం మీరు ఫ్లాట్ లో దిగినప్పట్నించీ మిమ్మల్ని కలవాలని అనుకుంటూనే ఉన్నాను.కానీ నాకు తీరిక దొరికినప్పుడల్లా మీ తలుపులు మూసి ఉంటున్నాయి.మీరు పనిలో ఉన్నారేమో, విశ్రాంతి తీసుకుంటున్నారేమో అనుకుని డిస్టర్బ్ చెయ్యటం లేదు,” యోగక్షేమాలేవీ అడక్కుండా ఆవిడ సూటిగా మాట్లాడింది.

నేను కూడా చాలా సార్లు మీ ఇంటికి రావాలనుకుని తాత్సారం చేస్తూనే వచ్చాను.కొన్నాళ్ళుగా ఒంట్లో నలతగా కూడా ఉంటోంది,అందుకే బద్ధకించాను,”అనేసింది కానీ ఆరోగ్యం గురించి చెప్పకుండా ఉండవలసిందని అనిపించింది.

ఏమైంది?” అందావిడ ఆశ్చర్యపోతూ.

అనవసరంగా ఇరుక్కున్నాను ! కానీ ఏదో ఒకటి చెప్పక తప్పదు ‘, అనుకుని, ” ఏం లేదండీ ఈమధ్య కాస్త అలసట అనిపిస్తోందంతే,” అంది ప్రతిమ.

,అర్థమైందిఏదైనా శుభవార్తా? ఇరుగుపొరుగు వాళ్ళకి చెప్పకపోతే ఎలా? అవసరమొచ్చినప్పుడు సాయం చేసేది వాళ్ళేగా?”

నా మొహంలో సంతోషం కనిపించినట్టుంది, ఆవిడ ప్రశ్నకి జవాబు దొరికిపోయింది.

ఎన్నో నెల?” అంది మిసెస్ కులకర్ణీ.

ఐదో నెల,”అని మళ్ళీ సంగతి చెప్పి ఉండవలసిందా అని అనుమానం వచ్చింది ప్రతిమకి. ఆవిడ ధోరణి చూస్తే ఇప్పట్లో తనని వదిలేలా లేదనిపించి కాస్త కంగారు పడింది ప్రతిమ. అనవసరమైన ఆందోళనతో బుర్ర వేడెక్కిపోయిందామెకి.కానీ ఆవిడ అడిగిన తరవాతి ప్రశ్న తన ఆందోళన వ్యర్థం కాదని తేల్చింది.” ఇదే మొదటి కాన్పా?” అందావిడ.

అవును,” అని టీ పెడతానని చెప్పి ప్రతిమ అక్కణ్ణించి లేచి లోపలికి వెళ్ళింది. టీ తెచ్చాక విషయం ఇక మాట్లాడేందుకు తావివ్వకూడదని నిశ్చయించుకుంది.ఆవిడ నా జీవితంలోకి తొంగి చూసే అవకాశం ఇవ్వకూడదు,అది నా వ్యక్తిగత జీవితం.తనది స్వేచ్ఛ కోరే స్వభావం, తనవి విశాలమైన భావాలు.వాటిమీద భయం మబ్బుల్లా పరుచుకోవటం చూసి ఆమె కంగారు పడింది.’కానీ పిచ్చి భయమేమిటి నాకు?’ అనుకుంది. టీ పట్టుకుని అక్కడికి వచ్చేసరికి ఆవిడ కార్నర్ టేబుల్ మీద తనూ, ప్రణవ్ ఉన్న ఫొటో దగ్గర నిలబడి చూస్తూ ఉండటం కనిపించింది ప్రతిమకి. ప్రతిమని చూడగానే, ” ఇది మీ హనీమూన్ ఫొటో లాగుందే?చాలా బావుంది.హనీమూన్ కి ఎక్కడికెళ్ళారు?” అంది ఉత్సాహంగా.

ఇదీ…”అంటూ ప్రతిమ ఆగి మళ్ళీ సర్దుకుని,” సింగపూర్ లో తీసిన ఫొటో.మేమక్కడికి ఒకసారి ఊరికే తిరగడానికి వెళ్ళాం,”అంది కానీ హనీమూన్ కీ డేటింగ్ కీ తేడా అప్పుడు గాని తట్టలేదామెకి.హనీమూన్ ఫొటో అయితే ఎంతో ఉత్సాహంగా అన్ని వివరాలూ చెప్పేదే,కానీ అది డేటింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరూ సింగపూర్ కి వెళ్ళి తీయించుకున్న ఫొటో. తరవాతే తను గర్భవతి అయింది. పుట్టబోయే బిడ్డ కేవలం తనకు మాత్రమే సొంతమనీ, ఒక మగవాడి పేరు చెప్పకుండా కూడా తను తల్లి కాగలననీ  ఎందుకు చెప్పలేకపోయింది ప్రతిమ?  “మీరు ఫ్లాట్ లో ఎన్నాళ్ళుగా ఉంటున్నారు?” అంది ప్రతిమ మాటమారుస్తూ.

కులకర్ణీ గారికీ నాకూ పెళ్ళి కాకముందే ఆయన ఫ్లాట్ బుక్ చేశారు.ఇన్ స్టాల్ మెంట్ లు కడుతూ వచ్చాం. ఐదేళ్ళ క్రితం వరకూ కట్టాం. తరవాత ఇది సొంత ఫ్లాట్ అయింది.”

ఓహో,అలాగా ! పోనీలెండి, బొంబాయిలో అంతకన్నా కావలసినదేముంది?” అంది ప్రతిమ.

నా మొదటి డెలివరీ కూడా ఇక్కడే అయింది. అబ్బాయి పుట్టాడు. తరవాత పై ఫ్లాట్ లో ఉండే వర్మ గారింట్లో కూడా…”ఆవిడ మీరు అనటం మానేసి నువ్వు అని సంబోధించింది.

అలాగా…” అంటూ ప్రతిమ చిన్నగా నవ్వింది.

మీరీ ఫ్లాట్ కొన్నారా, అద్దెకా?”

ప్రస్తుతం అద్దె ఇల్లే.అసలు మాకు జుహూలో ఒక ఫ్లాట్ ఉంది.ఫస్ట్ ఫ్లోర్ లో ప్రణవ్ అమ్మా నాన్నా ఉంటారు, తొమ్మిదో ఫ్లోర్ లో మా అమ్మ ఉంటుంది.”

పుట్టినిల్లూ,మెట్టినిల్లూ ఒకే బిల్డింగ్ లోనా, భలే ! మరి జుహూ వదిలి ఇక్కడ అంధేరీలో ఎందుకుంటున్నారు?కడుపుతో ఉన్నప్పుడు కన్నవాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుంది కదా?”

పెద్ద కారణమేమీ లేదు.ప్రణవ్ ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడని ఇక్కడికి షిఫ్ట్ అయాం.” మరో అబద్ధం చెప్పింది ప్రతిమ.అత్తవారి గొడవ లేదని ఎందుకు చెప్పలేదు? ” అక్కడ ఫ్లాట్ లు చిన్నవి, అందుకే ఇక్కడుంటున్నాం.”అన్నదే కానీ మనసు మీద ఏదో పెద్ద బరువున్నట్టు అనిపించింది.

అత్త,మామ, అత్తవారిల్లుఇలాటి మాటలన్నీ ఇంత బరువుంటాయెందుకో?దొంగతనం చేస్తూ దొరికిపోయినట్టు ఎందుకనిపిస్తోంది తనకి? బంధుత్వాలన్నీ తన జీవితంలో నిజంగా ఉన్నాయా?వాటిని తప్పించుకునేందుకే కదా పారిపోతోంది?బంధుత్వాల బంధాలు తనకి ఇష్టం లేదు ! కానీ ప్రతి బంధుత్వానికీ ఒక పేరుండటం అవసరమా?అవి అంత ముఖ్యమైనవా? తనూ, ప్రణవ్ వద్దనుకున్న బంధుత్వాల గురించి ఎవరైనా అడిగితే అంత భయం వేస్తుందేం?ఎన్ సీ సీ క్యాంపుకెళ్తున్నానని అమ్మకి అబద్ధం చెప్పి ప్రణవ్ వెంట సింగపూర్ కి వెళ్ళింది.ఇరవైనాలుగ్గంటలూ కలిసి గడిపారు ఇద్దరూ. రాత్రి హోటల్ కిటికీ లోంచి చందమామ తొంగిచూస్తే ప్రతిమ,ప్రణవ్ ఇద్దరూ తృప్తిగా, ఒకర్నొకరు వాటేసుకుని హాయిగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు.

ఐదు రోజుల్లోనే ఏదో ఒక క్షణం ఐదు నెలల గర్భానికి దారితీసింది.ఈరోజుల్లో పెళ్ళనేది ఒక ఆచారం, రెండు శరీరాలు కలిసేందుకు జరిగే తంతు.అవేవీ లేకుండానే రెండు దేహాలు ఒకటయేటట్టుంటే ఇక వివాహబంధం దేనికి? ఇష్టమైన చోటికి వెళ్ళి హాయిగా బతుకుతారు.ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుని బంధాలేవీ వద్దనుకున్నారు. కానీ ఇలాటిది అందరూ చెయ్యచ్చనీ, చెయ్యాలనీ తను ఒప్పుకుంటుందా?

అయినా బంధాలు ఉన్నంత మాత్రాన అవి కట్టిపడేయగలుగుతున్నాయా? సమస్య వస్తే వాటిని కాదనుకుని ఎవరి దారి వారు చూసుకోడం లేదా?

ఖాళీ కప్పు బల్లమీద పెడుతూ ఏప్రశ్న అడుగుతుందని ఇంతసేపూ ప్రతిమ భయపడుతోందో ప్రశ్నే అడిగింది మిసెస్ కులకర్ణీ,” పెళ్ళయి ఎన్నేళ్ళయింది?”

ప్రతిమ మొహం తెల్లగా పాలిపోయింది.జావాబు చెప్పకుండా ఉండేందుకు విననట్టు నటిస్తూ లేచి, ” జస్ట్ మినిట్, పాలగిన్నె గ్యాస్ మీద పెట్టి మర్చిపోయినట్టున్నాను, ఒక్కసారి చెక్ చేసి వస్తాను,” అంది. పాలగిన్నె గ్యాస్ మీద లేదని ప్రతిమకి తెలుసు, ఆవిడ అడిగినదానికి జవాబివ్వకుండా ఉండేందుకే సాకు చెప్పింది.తిన్నగా బాత్ రూమ్ లోకెళ్ళి వాష్ బేసిన్ ట్యాప్ తిప్పి చల్లటి నీళ్ళు మొహం మీద జల్లుకుంది.న్యాప్ కిన్ తో మొహం తుడుచుకుంటూ బైటికొచ్చింది.ఆమె మొహం చూస్తూనే మిసిస్ కులకర్ణీ, “ఏమైంది ప్రతిమా, గాభరాగా ఉందా? అలాటప్పుడు నిమ్మకాయరసమో, బత్తాయి రసమో , పాలో, గ్లూకోజ్ నీళ్ళో తాగుతూ ఉండాలి,” అంది.

తాగుతూనే ఉన్నాకానీ రోజూ ఇదే వేళకి నాకు వాంతికొచ్చేట్టవుతుంది. తరవాత అలసట కమ్ముకొచ్చి కాసేపు పడుకుని నిద్రపోవాలనుంటుంది.”

ఓకే,అయితే నేనిక వెళ్తా.నీకు కాస్త బావున్నప్పుడు మా ఇంటికి రా.ఒంటరిగా అవస్థ పడద్దు,సరేనా?అందరికీ ఉండేదే, భర్త ఆఫీసుకెళ్ళగానే ఇల్లు బోసిపోతుంది.అప్పుడు పక్కింటివాళ్ళో, ఎదురింటివాళ్ళో ఖాళీని భర్తీ చేస్తారు.ఊసుపోతుంది, పైగా మొదటి డెలివరీలో నీకన్నా పెద్దవాళ్ళ అనుభవం పనికొస్తుంది. “

ప్రతిమా సోఫా మీద తలవాల్చి కూర్చుంది. ఆమెకి మాట్లాడాలని లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.అయినా మిసెస్ కులకర్ణీ ప్రతిమకన్నా వయసులో పెద్దది, ప్రతిమాలాంటి వాళ్ళ మనసు ఆవిడకి అర్థం కాదు.

ఏదైనా రుచిగా తినాలనుంటే చెప్పు, ఇలాంటప్పుడు ఆకలితో ఉండద్దు, అర్థమైందా?అతను ఇంటికొచ్చేదాకా తినకుండా కూర్చోకు.తినాలనిపిస్తే తినెయ్యి అంతేసరే నేనిక వెళ్ళొస్తా,” అని ఆవిడ లేచింది.

ప్రతిమ దఢాలున తలుపు మూసి మొదలు నరికిన చెట్టులా మంచం మీద పడిపోయింది. గదిలో తనతో బాటు మరెవరో ఉన్నట్టనిపించిందామెకి. ‘తలుపు వేశాను కదా, ఎవరైనా లోపలికి ఎలా వస్తారు‘, అనుకుంది. ఇంతలో ఆమె చెయ్యి పొట్టమీదికి వెళ్ళింది. నవ్వుతూ, ‘ఓహో, నువ్వేనా నా చిన్ని పాపా?’ అనుకుంది. వెంటనే ఆమె ఒళ్ళు పులకరించింది. నా పాప, నా బాబునా కన్నబిడ్డఅనుకునేసరికి ఆమె మనసు లోతుల్లో ఏదో గుబులు లేచింది. ‘నా కన్నబిడ్డఅనేది కూడా ఒక బంధుత్వమే కదా, బంధుత్వాన్ని నేనూ, ప్రణవ్ ఎప్పుడైనా కాదనుకోగలుగుతామా?రేపు ప్రణవ్వీడు నా కొడుకు‘ , అంటే నేను కాదనగలనా? నా గర్భంలో ఉన్నాడు కాబట్టి వాడు నా కన్నబిడ్డ, కానీ ప్రణవ్ వాడిమీద హక్కు చూపిస్తే ఎలా అడ్డు చెప్పగలను? పిల్లవాడికి తండ్రి ప్రణవ్ కదా, మరి స్వేచ్ఛ కోసం దాన్ని వదులుకోమని ఎలా అనగలను? మిసెస్ కులకర్ణి అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పే ధైర్యం నాకు లేకపోయింది. కానీ రేపు ఇవే ప్రశ్నలు నా బిడ్డని ఎవరైనా అడిగితే అప్పుడేమౌతుంది?

పెళ్ళి మాటెత్తకుండా ప్రణవ్ తో సహజీవనం చేస్తున్నా రేపు నా స్వాతంత్ర్యం కోసం అన్నీ వదిలేసుకుని దారి తప్పుతానేమో ? ఆలోచనలతో తల బరువెక్కిపోయింది.అమ్మ ఎంతో నచ్చజెప్పింది,” ప్రణవ్ ని పెళ్ళి చేసుకో, తరవాత నీ ఇష్టం.పెళ్ళి చేసుకోకుండా కలిసి బతకడమనే రివాజు మన దేశంలో లేదు ప్రతిమా.” అమ్మ మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి.అమ్మకీ, ప్రణవ్ వాళ్ళమ్మకీ ఎంత సులభంగా పెద్ద ఉపన్యాసం ఇచ్చింది తను…’పెళ్ళి చేసుకున్నంత మాత్రాన పెద్ద తేడా ఏముంటుంది ? నేను ప్రణవ్ తోనే ఉండాలనుకుంటున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇక మా మధ్య ఉన్నది ప్రేమ సంబంధమే కదా? అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకుని ఏడడుగులు నడవకపోతే మాత్రమేమైంది?నేను ప్రణవ్ చెయ్యి పట్టుకుని నీకు ప్రదక్షిణలు చేస్తే నువ్వు సాక్షివవుతావా లేదా?ఆడంబరంగా వంద మందిని పిలిచి తంతులన్నీ చేస్తేనే అది పెళ్ళా? నేనీ సంప్రదాయాలన్నిటినీ నమ్మను. ‘ ఉషా ఇలా కూర్చో, ఉషా త్వరగా రా,టీవీ కట్టెయ్,మీ అమ్మావాళ్ళింటికి వెళ్ళడానికి వీలేదు,’అంటూ నిన్ను నాన్న తన ఇష్టమొచ్చినట్టు ఆడించాడు,రేపు ప్రణవ్ నా పట్ల అలా ప్రవర్తించేందుకు వీల్లేదు.మా మధ్య భార్యా భర్తల సంబంధం లేదు,’ అంటూ

నీకు పిచ్చి పట్టిందేమిటే ప్రతిమా? ఎవరైనా తండ్రి గురించి ఇలా మాట్లాడతారా?”

లేదమ్మా, నాకేం పిచ్చెక్కలేదు.భార్యగా మారి బానిస బతుకు బతకలేను.నువ్వు చెప్పే పాతచింతకాయ పచ్చడి సంప్రదాయాలు భార్యా భర్తలని ఒకరికొకరు బానిసల్లా బతికేట్టు చేస్తాయి.నేను వాటికి తలవంచను.”

ప్రణవ్, ప్రతిమ ఇద్దరూ తమ తలిదండ్రులకి దూరమయారు.

పెళ్ళి కానివాళ్ళకి ఫ్లాట్ అద్దెకి దొరకడం అంత సులభం కాదు.ప్రణవ్ తన స్నేహితుడు సుధీర్ సాయం కోరాడు. సుధీర్ కి సొంత ఫ్లాట్ ఉంది , దాన్నతను అద్దెకిచ్చేందుకు ఒప్పుకున్నాడు.ప్రతిమ ఆనందం పట్టలేక ప్రణవ్ ని వాటేసుకుంది.

ప్రతిమ పాపిట్లో సిందూరం పెట్టుకోలేదు, మంగళసూత్రాలూ, మట్టెలూ వద్దనుకుంది. చివరికి గోరింటాకు కూడా పెట్టుకోలేదు.అగ్నిసాక్షిగా , కన్యాదానం లాంటి తంతులతో వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోలేదు.అయినా ఆమె ప్రణవ్ జీవితంలోకి ప్రవేశించి అతనికి సంతానాన్నివ్వబోతోంది.ఇదే ఒకవేళ సంప్రదాయబద్ధంగా జరిగుంటే తను కడుపుతో ఉన్నట్టు తల్లికి చెప్పి ప్రతిమ సంతోషించేదిఏడడుగులు ప్రణవ్ తోబాటు నడిచి ఉంటే

తలుపు దగ్గర ప్రణవ్ అడుగుల చప్పుడు వినబడింది.లేచి తలుపు తీసింది ప్రతిమ.ప్రణవ్ లోపలకొస్తూనే ప్రతిమని ముద్దు పెట్టుకుని,” ఎలా ఉంది ఒంట్లో డియర్?” అన్నాడు.

ఆమె జవాబు చెప్పలేదు.

ప్రణవ్ టై విప్పుతూ,”ప్రతిమా, చాలా ఆకలిగా ఉంది, పకోడీలలాంటివేమైనా చేసిపెడతావా?” అన్నాడు.

ప్రతిమకి పకోడీలు చెయ్యాలని లేదు,అయినా వంటింట్లోకెళ్ళి శెనగపిండి డబ్బా తీసి , ఉల్లిపాయలు తరిగి పకోడీలు వేయించటం మొదలెట్టింది. తనకీ, ఒక భార్యకీ తేడా ఏముంది, అనే ఆలోచన వచ్చిందామెకి.

పకోడీలతోబాటు తాగేందుకు ప్రణవ్ గ్లాసులో కొద్దిగా విస్కీ ఒంపుకుంటూ ఉంటే ఆమె అడ్డు చెపుతూ,” తాగద్దు ప్రణవ్,” అంది.

ఒకరి స్వేచ్ఛకి మరొకరం అడ్డు రామని అనే ప్రణవ్, ప్రతిమ నిజంగా స్వేచ్ఛ అనుభవిస్తున్నారా? ఒకరి జీవితంలో మరొకరు జోక్యం కల్పించుకోడం లేదా?

రాత్రి పక్కమీద ప్రతిమ కళ్ళు మూసుకుని పడుకుంది. ప్రణవ్ ఆమెని దగ్గరకి లాక్కున్నాడు , ” ఏమైంది మేడమ్, ఎందుకంత డల్ గా ఉన్నావు? నాకు మూడ్ వచ్చేసింది !” అంటూ ఆమె చెప్పే జవాబుకోసం ఎదురుచూడకుండా ప్రణవ్ అమెని

ప్రతిమ లేచి కూర్చుంది.ఒకే కప్పు కింద, ఒకే మంచం మీద అతనితో కలిసి పడుకుంటూ తను స్వేచ్ఛ అనుభవిస్తోందా? తన అస్తిత్వాన్ని కాపాడుకోడం సాధ్యం కావడంలేదు.ప్రణవ్ కోరిక తీర్చుకున్నాక పక్కకి తిరిగి పడుకున్నాడు.కానీ ప్రతిమ మనసులో రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరుగుతూ ఆమెకి నిద్ర పట్టకుండా చేశాయి.ప్రతిమకీ ప్రణవ్ కీ మధ్య ఉన్న జాగాలో ఒక ప్రశ్న వచ్చి తిష్ఠ వేసింది. పెళ్ళికాకుండా తల్లి అవాలన్న తన నిర్ణయం తప్పా? తనకి ప్రణవ్ తో ఉన్న సంబంధం కేవలం దైహికమైన దాహాన్ని తీర్చుకునే ఒక ఎండమావి కాదా?

మర్నాడు మిసెస్ కులకర్ణీ మళ్ళీ వచ్చింది, “ప్రతిమా, ఈరోజు థాలీపీఠ్ రొట్టెలు చేశాను. తిని ఎలా ఉందో చెప్పు,” అంటూ స్టీల్ డబ్బా అందించింది.ప్రతిమకి బలే విసుగొచ్చింది. ‘ఎంత బోరు మనిషో,అనవసరంగా జోక్యం కలిగించుకుంటుందేమిటి?’అనుకుంది.

మరో రోజు, “బొబ్బట్లు చేస్తున్నాను, పద నాతో వచ్చి ఎలా చేస్తానో చూడు.వేడి వేడి బొబ్బట్లు తిందువుగాని. నీకు ఒంటిగా ఉండడమే ఇష్టమని తెలుసు,కానీ ఏదైనా పిండివంట చేస్తే నువ్వు వెంటనే గుర్తొస్తావు.నేను కడుపుతో ఉన్నప్పుడు మా అత్తగారు ప్రసవం అయేదాకా నాతోనే ఉంది.రోజుకో కొత్త వంటకం చేసి తినమనేది.నువ్విక్కడ స్థితిలో ఒక్కదానివీ ఉన్నావని అనుకోగానే నీకోసం ఏదైనా చెయ్యాలని మనసు పీకుతుంది,” అందావిడ.

లేదండీ మీరిలా నా గురించి తాపత్రయపడడం నాకూ సంతోషంగానే ఉంది,” అంది ప్రతిమ.

ఏడో నెలలో అత్తగార్ని పిలిపించుకో.ఏడో నెలలో కొంత రిస్క్ ఉంటుంది. ఎనిమిదో నెల రాగానే నదులూ అవీ దాటకూడదు సుమా విషయాలు మీ అమ్మ నీకు చెప్పే ఉండాలి,అవునా?”

ప్రతిమ జవాబు చెప్పలేదు.

సరే సాయంత్రం మీ ఆయనకి చెపుతాలే, వాళ్ళమ్మని తీసుకురమ్మని.”

ఆవిడ రాదు.”

ఎందుకు రాదు? ఏమీ కష్టపడకుండానే మనవడు దొరుకుతాడా?”

“…”

కోడలి ముద్దూ ముచ్చటా తీర్చక్కర్లేదా?”

ఆవిడకి మామీద కోపం.”

అయితే మీ అమ్మని రమ్మను.”

ఆవిడ కూడా రాదు.”

ఏం, మీరిద్దరూ పారిపోయి పెళ్ళిచేసుకున్నారా?”

లేదు.”

మరి?”

మాకు పెళ్ళి కాలేదు.ఇన్ ఫాక్ట్, మాది లివ్ ఇన్ రిలేషన్ షిప్.కలిసి ఉండాలని మాత్రమే నిర్ణయించుకున్నాం.” ఇక నిజాన్ని దాచలేకపోయింది ప్రతిమ.దాచినకొద్దీ మనసుమీద భారం పెరిగిపోతూ వచ్చింది.చెప్పడం వల్ల భారం తగ్గింది కానీ మాట గట్టిగా చెప్పలేకపోయింది,గొంతు సన్నగా వణికింది.పెళ్ళి మాటెత్తినప్పుడు తన అమ్మా నాన్నల మధ్య ఉన్న సంబంధాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడినప్పుడు గొంతులో ధ్వనించిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు కరువైంది.

ఏమంటున్నావు?”అంటూ ఆవిడ గ్యాస్ బంద్ చేసింది.కడుపుతో ఉన్న అమ్మాయికి వేడి వేడీ బొబ్బట్లు తినిపించాలన్న ఉత్సాహం హఠాత్తుగా చల్లారిపోయిందని ప్రతిమ గ్రహించింది.

అయితే నువ్వు పెళ్ళి చేసుకోలేదా?”

లేదు.”

ఎందుకని?”

పెళ్ళి ఒక బంధమనీ, అది భార్యాభర్తలని బానిసలని చేస్తుందనీ మా నమ్మకం.పెళ్ళయాక ప్రేమ తగ్గిపోతుంది.మా అమ్మా నాన్నా శత్రువుల్లా పోట్లాడుకోడం చూశాను.”

చాలా పిచ్చిదానివి ప్రతిమా, అన్ని బంధుత్వాలూ ఆచారాలని బట్టే ఏర్పడతాయి.”

స్వేచ్ఛ, అస్తిత్వం, ఇష్టాలూ అయిష్టాలూ అన్నీ పెళ్ళి కాగానే తుడిచిపెట్టుకుపోతాయి.మనకిష్టమైనట్టు బతకడానికుండదు.మా అమ్మని చూశాను, నాన్న కోసం పూజకి అవసరమైన వస్తువులన్నీ ఏర్పాటు చెయ్యడం నుంచీ, బాత్ రూమ్ లో ఆయన అండర్ వేర్ సిద్ధంగా ఉంచడం వరకూ అన్నీ విధిగా చేస్తూ బానిస బతుకు బతుకుతుంది

నేను మోడలింగ్ రంగంలో పనిచేస్తున్నాను.పెళ్ళైన అమ్మాయిలు రంగంలో నిలబడలేరు.”

తప్పు, మోడలింగ్ కెరియర్ కి పెళ్ళితో సంబంధం లేదు,అది వయసుని బట్టి ఉంటుంది.”

ఆర్థికంగా ఇద్దరం ఒకరిమీద మరొకరం ఆధారపడడం లేదు, ఇక బంధాల అవసరమేముంది?”

స్వేచ్ఛ కావాలనీ, బంధాలు వద్దనీ అనుకుంటున్నదానివి మరి అతని అంశని గర్భంలో ఎందుకు ఉంచుకున్నావు? అది మాత్రం బంధం కాదా? అన్ని బంధాల  కన్నా పవిత్రమైనది తలీ బిడ్డల బంధమని తెలుసా నీకు? మరి పవిత్రత పెళ్ళివల్లే వస్తుంది కదా? ఎవరి బిడ్దకి తల్లి కావాలనుకుంటున్నావో అతనికి భార్య అనిపించుకోవడం నీకిష్టం లేదు.పెళ్ళనేది ఒక సంప్రదాయం కాదు ,సంస్కారానికి సంబంధించినది. సంతానాన్ని కనే ముందు దానికి తలవంచాల్సిందే.మీ ఆయనకి నువ్వు భార్యవి కానప్పుడు అతనితో నీకున్న సంబంధం ఒక ఉంపుడుగత్తెదే కదా?పిల్లో, పిల్లవాడో పుట్టే ముందు తంతేదో జరిపించురిజిస్ట్రార్ ఆఫీసులోనో, గుళ్ళోనో పెళ్ళనేది చేసుకోండి. పుట్టబోయే సంతానం అప్పుడే నిన్ను గౌరవిస్తుంది. లేకపోతే రేపు వాడే మిమ్మల్ని ముందుగా బోనులో నిలబెడతాడు.”

పళ్ళెంలో బొబ్బట్లు అలాగే ఉన్నాయి, ఆవిడ ప్రతిమవైపు దాన్ని జరపలేదు, ప్రతిమా దాన్ని వద్దని తోసెయ్యలేదు.

ప్రతిమ గబగబా తన ఫ్లాట్ కి వచ్చేసింది.మంచంమీద వాలిపోయిందిలోపలంతా శూన్యంగా, వెలితిగా, దిగులుగా అనిపించింది. బంధాన్ని తొలగించాలా లేక దీనికోసం వద్దనుకున్న బంధాన్ని స్వీకరించాలా?

మిసెస్ కులకర్ణీ సణుగుడు ఇంకా ప్రతిమ చెవులకి వినిపిస్తూనే ఉంది.ఆవిడ దృష్టిలో తను బాగా కిందికి దిగజారిపోయింది. తనని మందలించడమే కాదు, ఆవిడ తన భర్తతో,” వాట్ హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ దీజ్ డేస్?” అనడం వినిపించింది. దానికాయన ,” యూ వోంట్ అందర్స్టాండ్, దిస్ ఈజ్ వెస్టర్న్ కల్చర్ మై డియర్, ఇట్ ఈజ్ ఆల్సో రూలింగ్ ఇండియన్స్ నౌ,” అని అన్నాడు. 

ఎదురెదురుగా ఉన్న రెండు ఫ్లాట్ తలుపులూ హడావిడిలో ముయ్యడం మరిచిపోయారు వాళ్ళు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.