విత్తనం

-అనసూయ కన్నెగంటి

 

బదిలీ మీద పొరుగు ఊరు నుండి ఆ ఊరు బడికి వచ్చిన సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రామేశంకి పిల్లలన్నా, మొక్కలన్నా ఎంతో ఇష్టం. బడికి వచ్చిన మొదటి రోజే  ఆ బడిలో బోలెడంత ఖాళీ స్ధలం ఉండేసరికి చూసి ఆనంద పడ్డాడు. కానీ  ఆ స్ధలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి ఉండటం చూసి చాల బాధపడ్డాడు. 

     అతను ఎలాగైనా పిచ్చి మొక్కలు పీకేసి..అక్కడ మంచి మంచి మొక్కలు నాటి పెంచి పెద్దవి చెయ్యాలి అనుకున్నాడు. 

     అయితే రామేశం బదిలీపై రావటంతో కుటుంబం అతను అంతకు ముందు పని చేసిన ఊర్లోనే ఉండిపోయింది. పిల్లలు అంతా అక్కడ చదువుకుంటూ ఉండటం వల్ల వాళ్లని  ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక  పరీక్షలు అయ్యాక తీసుకుని రావచ్చని అనుకున్నాడు. దానికి చాల సమయం పట్టవచ్చు. 

   అందుకని అతను ఒక్కడే ఇల్లు తీసుకుని ఉండటంతో  బడి గంటలు ముగిశాకా చాల సమయం ఉండేది. ఆ సమయంలో  ఈ  బడిలో మొక్కలు పెంచాలని అనుకున్నాడు.

      ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులతో చర్చించే సరికి ఆయన రామేశం చెప్పినదానికి సంతోషంగా సరేనన్నారు. 

    దాంతో పిల్లలకు ఈ విషయం చెప్పి..”మీలో ఎవరైనా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే..బడి అయిపోయాకా ఇంటికెళ్ళి ఏదైనా తిని..కాసేపు విశ్రాంతి తీసుకుని ఇంటిపని అయిపోయాకా నాతో కలవచ్చు “ అని చెప్పాడు. 

    దాంతో చాలమంది విద్యార్ధులు రామేశంతో కలసి పనిచేయటానికి ఇష్టపడి సాయంత్రం వేళల్లో బడికి రావటం మొదలు పెట్టారు. 

    కొద్ది రోజుల పాటు రోజూ ఒక గంట కష్టపడేసరికి  బడి ఆవరణలోని పిచ్చి మొక్కలన్నీ పీకెయ్యగలిగారు. 

    ఆ తర్వాత..నిదానంగా ఒకరోజు పిల్లలందర్నీ కూర్చోబెట్టి ఏఏ కాలంలో ఎలాంటి మొక్కలు వేస్తే బాగా కాస్తాయో వివరించి చెప్పాడు. 

      పిల్లలలో ఆసక్తి మరింత పెరిగింది. ఇక విత్తనాలు చల్లటానికి అనుగుణంగా నేలను అనేక భాగాలుగా విభజించి ఏ ఏ విత్తనాలు ఎక్కడెక్కడా వెయ్యాలో పిల్లలతోనే చెప్పించాడు.

    దాంతో పిల్లల్లో మరింతగా శ్రద్ధ పెరిగి ఉత్సాహంగా ఉన్నారు.

       అంతా అయ్యాకా విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనే ఆలోచన వచ్చింది.

    విద్యార్ధులు అందరినీ పిలచి “మీ మీ ఇళ్ళల్లో ఏవైనా విత్తనాలు ఉంటే మీ పెద్దవాళ్లను అడిగి కొన్ని ఇమ్మని తీసుకురండి. నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి. కానీ అవి ఊర్లో మా ఇంట్లో  ఉన్నాయి. నేను వెళ్ళి తేవాలంటే చాలా రోజులు పడుతుంది “ అన్నాడు. 

   “ తప్పకుండా తెస్తామండి.” అంటూ ఆ మర్నాడు ఎవరెవరి దగ్గరా ఏమేమీ విత్తనాలు ఉన్నాయో పొట్లం కట్టి  తీసుకు వచ్చారు. వాటిని నేలలో పాతి నీళ్ళు పోసే సరికి కొన్ని మొలకెత్తాయి. మరి కొన్ని మొలకెత్తలేదు.  ఎన్ని రోజులు ఎదురు చూసినా అవి మొలకెత్తకపోయే సరికి అంతా నిరుత్సాహ పడ్డారు. 

    “ అలా బాధపడకండి. విత్తనాలు మొలకెత్తకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. నేను ఊరెళ్ళినప్పుడు తీసుకు వస్తాను. అప్పుడు వేద్దాం.” అన్నాడు.

    అసలే పిల్లలంతా అప్పుడప్పుడే భూమిని చీల్చుకుని వస్తున్న మొక్కలను చూస్తూ ఉత్సాహంగా ఉన్నారేమో..ఆ ఆలస్యాన్ని భరించలేమన్నట్టు నీర్సంగా సరేనని తలలూపారు.

      అది చూసి ఆ మాత్రం శ్రద్ధ పిల్లల్లో తేగలిగినందుకు సంతోషపడ్డాడు రామేశం. 

     అయితే..

    ఆ మర్నాడు..వాళ్ళల్లో..రఘు అనే కుర్రాడు..ఒక కాకరకాయ, బీరకాయ, వంకాయ, బెండకాయ సంచిలో వేసుకుని తీసుకుని వచ్చి రామేశానికి ఇచ్చాడు.

   “ ఏంటివి?” అనడిగాడు రామేశం.

   “ విత్తనాలండి” అన్నాడు రఘు. 

   “ ఏవి? ఇవా?” అన్నాడు..రామేశం సంచిలోని కాయల వైపు చూస్తూ..

    ఆశ్చర్యపోయి చూస్తున్నారు పిల్లలంతా రఘు వైపూ,రామేశం వైపూ, కూరగాయల వైపూ..

   “ఇవి కాయలు కదరా!” అన్నాడు వాటిని అటూ ఇటూ తిప్పుతూ..రామేశం.

   “కాయలేనండి.కానీ బాగా ముదిరిన కాయలు. వాటిని వలిస్తే విత్తనాలు వస్తాయి.” అన్నాడు నిదానంగా రఘు.

   రామేశంతో పాటు పిల్లలు కూడా తెల్లబోయారు రఘు చెప్పిన దాన్ని విని.

   దాంతో కాకర కాయ వలిచి చూసాడు రామేశం. 

ముదురు గింజలు  దానిలో నుండి బయటకు వచ్చాయి. అలాగే బీరకాయలూ, వంకాయలూ కూడా..

       రామేశానికి చాల  ఆనందం కలిగింది..

  “ భలే పని చేసావు. ఇప్పటికి ఇప్పుడు మనం పట్నం నుండి ఎవర్నయినా కొనుక్కుని రమ్మన్నా మొక్కలు అమ్మే నర్సరీల దగ్గర.. ప్లాస్టిక్ పొట్లాల్లో కట్టి బయట వ్రేల్లాడేసిన వాటిని కొనుక్కొస్తారు. కొన్ని కొన్నిసార్లు అవి తడిచిపోయి, కుళ్ళిపోయి ఉంటాయి. డబ్బులు నష్టం . కానీ ఈ ఆలోచన బాగుంది. ఎక్కడ సంపాదించావు ఈ ముదురు కూరగాయల్ని?” ఆసక్తిగా అడిగాడు అభినందిస్తున్నట్టుగా రఘుని చూస్తూ. 

   “ ..మనకి విత్తనాలు కావాలంటే ఎలాగా అని ఆలోచించానండి.  మన ఊర్లో కూరగాయలు అమ్మే దుకాణం గుర్తొచ్చింది. ఉదయాన్నే వాళ్లు తోటల నుండి కూరగాయలు కొనుక్కొచ్చి పుచ్చులవీ, ముదిరిపోయినవీ పక్కన పడేస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్లను అడిగి తెచ్చానండి. వాళ్లకి ఎలాగూ అవి పనికి రావు. ఏ విత్తనాలు కావాల్సినా వచ్చి పట్టుకెళ్లమని చెప్పాడండి” 

      రామేశం కళ్ళు ఆనందంతో మెరిసాయి రఘుకి వచ్చిన ఆలోచనకి. ఇక ఎప్పటికీ విత్తనాలకి  లోటే లేదని మనసులో ఎంతో సంతోషిస్తూ రఘుకి వచ్చిన ఆలోచనను, అతని తెలివి తేటలను మెచ్చుకుని మొదటి విత్తనాన్ని రఘుతో నాటించాడు.

    అది చూస్తూ పిల్లలంతా చప్పట్లు కొట్టారు.  

                                               

           *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.