రైలుబడి

-అనురాధ నాదెళ్ల

రచన: టెట్సుకో కురొయనాగి

అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్

                      మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి ఉంటారు కదా, అవును అది “రైలుబడి”. చదివిన ప్రతివారూ ఆ బడిలో తాము కూడా చదువుకుంటే ఎంత బావుణ్ణు అని అనుకోకమానరు.

                   1933లో జన్మించిన టెట్సుకో కురొయనాగి ఈ “రైలుబడి” పుస్తకం రచయిత్రి, జపాన్ దేశస్థురాలు. ఈమె రేడియో, టివి. వ్యాఖ్యాతగా పనిచేసారు. పుస్తకం ప్రచురించిన మొదటి సంవత్సరమే నలభై ఐదు లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఇది జపాన్ ప్రచురణా రంగంలో ఒక రికార్డ్. తన పుస్తకానికొచ్చిన పారితోషికాలతో బధిర నటులకు శిక్షణ ఇచ్చేందుకు రచయిత్రి “టొటొ ఫౌండేషన్” స్థాపించారు. తాను చదివిన “టోమో” అనే బడి స్థాపకుడైన “సొసాకు కొబాయాషి” గురించి రాసే ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. 1945లో టోక్యోపై జరిగిన బాంబు దాడిలో టోమో బడి ధ్వంసమైపోయింది.

                    “కొబయాషి” విద్యాబోధనా పధ్ధతులను “రైలుబడి” లో అందంగా వర్ణించారు రచయిత్రి. పిల్లలంతా సహజంగా ఉత్తమ స్వభావంతో జన్మిస్తారని, కానీ ఆ మంచితనం చుట్టూఉన్న వాతావరణం వల్లా, పెద్దల తప్పుడు ప్రభావాల వల్ల సులభంగా చెడిపోతుందని ఆయన అభిప్రాయం. అందుకే పిల్లల్లో ఉన్న మంచిని వెలికి తియ్యటమే తన లక్ష్యం అని చెప్పారాయన. తన కూతురు మియోచాన్ ను చిన్నప్పుడు షికారు కి తీసుకెళ్తూ, “ప్రకృతిలో మోగే శ్రుతిలయల్ని విందాం పద” అని చెప్పేవాడట. చెట్ల ఆకులు, రెమ్మలు గాలికి కదలటం, నదిలో నీళ్లు కదలటం తాను తండ్రితో కలిసి పరిశీలిస్తుండేదాననని చిన్నారి మియోచాన్ బడిలో తన స్నేహితురాలైన ఈ రచయిత్రికి చెప్పింది. 

కొబయాషి అంత చక్కని బడిని నడుపుతూ కూడా ఎలాటి ప్రచారం చెయ్యనిచ్చేవాడు కాదట. అందువల్లనే రెండో ప్రపంచ యుధ్ధ కాలంలో అధికారులెవ్వరికీ ఆ బడి గురించి తెలియలేదు. యుధ్ధ కాలంలో కూడా బడి కొనసాగింది.  

“రైలుబడి” మనం చదివే ఎన్నో పుస్తకాలకంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది ఒక ఆరేడేళ్ల పాప కథ. అందరు చిన్నారుల్లాగే ఈ చిన్నారి టొటొచాన్ కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ, తన పరిశీలనతో, ప్రశ్నలతో అందమైన అనుభవాలను స్వంతం చేసుకుంటుంది. ఏదైనా ఒక కొత్త సంగతి కనిపిస్తే కళ్లు విశాలం చేసుకుని చూస్తుంటుంది. టొటొచాన్ కి తనని అర్థం చేసుకునే అమ్మ, తన ఊహలకి, కలలకి రెక్కలిచ్చే అరుదైన అవకాశాన్నిచ్చిన బడి దొరికాయి.   

                              ప్రతివారికీ జీవితంలో అత్యద్భుతమైన దశ బాల్యం. పెరిగి, పెద్దవుతూ ఎన్నేళ్లొచ్చినా చిన్నప్పటి విషయాల్ని తలుచుకుని మురిసిపోవటం సహజం. అలాటి సహజమైన అమాయకత్వంలోని అందం, ఆనందం ప్రతివారి జీవితంలోను వచ్చే అపురూప ఘట్టం. టొటొచాన్ కథని చదువుతుంటే మనం కూడా  బాల్యంలోకి వెళ్లిపోతాం. 

                             అయితే టొటొ మొదటిసారి బడిలో చేరిన కొద్దిరోజుల్లోనే బడి నుంచి తల్లికి పిలుపొస్తుంది. తరగతి గదిలో డెస్క్ ని పదేపదే తెరవటం, మూయటం చేస్తూ అందరినీ చికాకు పరుస్తోందని టీచర్ ఫిర్యాదు చేస్తుంది. బడిలో చేరిన మొదటిరోజే ఇంటికొచ్చి ఆ డెస్క్ కొత్తరకంగా ఉందని టొటొ చెప్పిన మాట తల్లికి గుర్తొస్తుంది. అదొక్కటే టొటొని బడినుంచి పంపేందుకు కారణమా అని తల్లి విస్తుపోతే, టీచర్ ఇంకా చాలా ఫిర్యాదులున్నాయని వరసగా చెబుతుంది. 

                               తరగతిలో టీచర్ పాఠం చెబుతుంటే టొటొ కిటికీ దగ్గరకు వెళ్లి వీధిలో వెళ్తున్న బాజాల వాళ్లని పిలిచి, వాళ్లని పాటలు వాయించమని అడగటం, తరగతిలో పిల్లలందరినీ కూడా పాఠం వైపు నుంచి దృష్టి మళ్లించటం వంటి ఎన్నో ఫిర్యాదులు టీచర్ చెబుతుంది. ఇంకా, కిటికీ దగ్గర నిలబడి చెట్టుమీద గూడు కట్టుకుంటున్న పిచ్చుకల జంటతో కూడా మాట్లాడుతుంటుందని, పాఠం మీద దృష్టి పెట్టదనీ, అందుచేత  టొటొని మరొక బడిలో చేర్చమని పంపేస్తుంది. 

                               సొసాకు కొబయాషి  అనే హెడ్మాస్టారు పిల్లలపైన అమితమైన ప్రేమతో వారి ఆలోచనలకు, మనస్తత్త్వాలకు అనుగుణంగా ఒక అందమైన బడిని స్థాపిస్తారు. అది టోమో బడి. పిల్లలలో ఉండే సహజమైన కుతూహలం, ప్రేమ, మంచితనం పెంపొందిస్తూ, వారిని ప్రకృతితో సహజీవనం చేయిస్తూ పెంచాలని, వాళ్ల స్వంత ఆలోచనలు, అనుభవాలే వారిని తీర్చిదిద్దాలని ఆశిస్తారు. దానికోసం విదేశాలలో రకరకాల శిక్షణ తీసుకుని టోమో బడిని మొదలుపెడతారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న ఆ బడిలో కేవలం యాభైమంది పిల్లలు ఉంటారు. ఆ బడి ప్రత్యేకత, ఎక్కడా చూడనిది ఇంకోటి ఉంది. అది రైలుపెట్టెల బడి. రైల్వే వారు నిరుపయోగంగా పడేసిన రైలు పెట్టెలని కొనుగోలు చేసి వాటిని తరగతి గదులుగా మార్చుతారు. బడి ముందు కాంక్రీటు గోడలతో కాకుండా పొడవాటి చెట్లను రెండువైపులా పెంచి, వాటినే గేటుగా అమర్చుతారు. ఆ బడికి ప్రహరీగోడ లేనే లేదు. 

                                టొటొచాన్ తన తల్లితో కలిసి రైలెక్కి బడిలో చేరేందుకు బయలుదేరటంతో కథ మొదలవుతుంది. తన పాపని అర్థం చేసుకుని, విద్యాబుధ్ధులు నేర్పే బడికోసం వెతికి,  అందులో చేర్పించేందుకు తల్లి టొటొని తీసుకెళ్లటమే రైలు ప్రయాణానికి కారణం. రైలు ఎక్కటం టొటొకి మొదటిసారి కావటంతో ప్రయాణం అంతా ఉత్సాహంగా గమనిస్తుంటుంది. చేతిలోని టిక్కెట్టును అపురూపంగా పట్టుకుంటుంది, అయితే రైలు దిగి వెళ్లిపోయేప్పుడు టిక్కెట్టును స్టేషన్ మాస్టర్ కి ఇవ్వాల్సి రావటం టొటొ కి నచ్చదు. తాను “ఆ టిక్కెట్టును ఉంచేసుకోవచ్చా” అని ఆయనని అడుగుతుంది. అలా కుదరదు అని చెబితే, తను కూడా పెద్దయ్యాక స్టేషన్ మాస్టర్ అవుదామనుకుంటున్నానని చెబుతుంది. అయిష్టంగానే టిక్కెట్టుని ఆయనకి ఇచ్చేస్తుంది.

                  దారిలో తల్లి అడుగుతుంది, “ఇప్పటిదాకా డిటెక్టివ్ అవ్వాలని కదా అనుకుంటున్నావు” అని. కాస్త ఆలోచించి, “పైకి స్టేషన్ మాస్టర్ లా పని చేస్తూనే డిటెక్టివ్ గా ఉంటానని చెబుతుంది. ఇంకా రోడ్డుమీద బాజాలు వాయించేవాళ్లలాగా కూడా అవుతానని చెబుతుంది. ఈ బాజాలవాళ్లు రోడ్ల మీద తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వారికోసం ప్రచారం చేస్తూంటారు.

                             కొత్తబడి మిగిలిన బడుల్లాగా కాకుండా మొక్కలు, చెట్లూ మధ్య ఉండటం, రైలు పెట్టెలే తరగతి గదులుగా ఉండటం చూసి టొటొ సంబరపడుతుంది. మొదటిసారిగా హెడ్ మాస్టర్ ని కలిసినప్పుడు “ఇన్ని రైలు పెట్టెలున్నాయి, మీరు హెడ్ మాస్టరా లేక స్టేషన్ మాస్టరా” అని అడిగేస్తుంది. టొటొ చురుకుదనం ఆయనకి నచ్చి, “కబుర్లు చెప్పు, వింటాను” అని ఆమెను ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు. అప్పటివరకూ ఎవరూ తనని, తన మాటలని ఇంత శ్రధ్ధగా పట్టించుకోలేదన్న విషయం టొటొకి తెలుసు. అందుకే తనకి తోచిన కబుర్లు అలా ఒక నాలుగు గంటల పాటు చెబుతూనే ఉంటుంది. అంత ఓపిగ్గా సంతోషంగా తనని విన్నహెడ్ మాస్టర్ తెగ నచ్చేస్తారు టొటొచాన్ కి.

                             కొత్త బడి టోమో బడి. అక్కడ తరగతి గదులే కాకుండా మధ్యాహ్నం భోజనాల సమయం  కూడా టొటొ కి భలే నచ్చుతుంది. ప్రతి పిల్ల, పిల్లవాడి దగ్గరకు వెళ్లి హెడ్మాస్టార్ “సముద్రం నుంచి కాస్త, కొండలనుంచి కాస్త తెచ్చుకున్నావా?” అని అడుగుతారు. పిల్లలు తినే ఆహారం సమతులం గా ఉండాలని ఆలోచించి ఆయన అలా అలవాటుచేసారు. సముద్ర ఆహారం ఏమిటి, భూమి మీద ఆహారం ఏమిటీ అనేది ఆలోచించటం టొటొకి రోజూ ఉత్సాహంగా అనిపించేది. పిల్లలు తినేప్పుడు “రో,రో,రో యువర్ బోట్” బాణీలో “నములు, నములు, నములు” అంటూ ఒక పాట కూడా భోజనం ముందు పాడే అలవాటుని హెడ్మాస్టారు చేస్తారు. 

                                  తరగతిలో పిల్లలు పొద్దున్నే కష్టపడి చదువు పూర్తిచేసేస్తే మధ్యాహ్నం వారిని షికారుకి తీసుకెళ్తుంది టీచరు. ఆ షికారులో సెలయేటి గలగలల్ని, చుట్టూ ఉన్న మొక్కల్ని, చెట్లని, పూలని పరిశీలించటం పిల్లలందరికీ తెగ ఇష్టం. అక్కడ గుడి దగ్గర పాత బావిలో ఓసారి ఓ చుక్క తెగి పడిపోయిందని ఒక స్నేహితురాలు చెప్పినప్పుడు, టొటొ బావిలోకి చూసి “చుక్క ఎందుకు వెలగట్లేదో” అని ఆలోచించి “బహుశా నిద్దరోయిందేమో” అనుకుంటుంది. ఎంత కవితాత్మకంగా ఆలోచించిందో ఆ చిన్నారి!

”చుక్కలు నిద్దరపోతాయా?” అని స్నేహితురాలు అడిగినప్పుడు, “పొద్దంతా అవి పడుకుని రాత్రిపూట మేలుకుని వెలుగుతాయి” అని జవాబు చెబుతుంది.

ఎంత అందమైన భావన!

                           తన తరగతిలో ఉన్న యాసువాకి సరిగా నడవలేకపోవటానికి కారణం అతనికి పోలియో రావటం అని తెలుసుకుంటుంది. అతనితో స్నేహం కట్టేస్తుంది. యాసువాకి టి.వి. అనేదొకటి ఉంటుందని, ఇంట్లోనే కూర్చుని సుమో పోటీలు చూడవచ్చని టొటొకి చెబుతాడు. “అంత పెద్ద సుమోవీరులు అంత చిన్న పెట్టెలోకి ఎలా వెళ్తారు” అని టొటొ ఆశ్చర్యపోతుంది.

                          బడికి కొత్త రైలుపెట్టె వస్తుందని తెలిసినప్పుడు, అంత పెద్ద రైలుపెట్టె బడి వరకూ ఎలా వస్తుందో చూడాలనుకుంటున్నామని పిల్లలంతా హెడ్మాస్టర్ ని అడుగుతారు. 

“అది ఆ రాత్రి వస్తుందని, దానిని చూడాలనుకుంటే సాయంకాలం ఇంటికెళ్లి అమ్మతో చెప్పి, ఒక దుప్పటి, నైట్ డ్రెస్ తెచ్చుకొమ్మని” ఆయన పిల్లలకి చెబుతారు. 

వాళ్లంతా అలా వచ్చి రైలుపెట్టె కోసం ఎదురుచూస్తూనే నిద్రలోకి జారుకోవటం, తెల్లవారుఝామున రైలు పెట్టె వచ్చిందని తెలిసి చూస్తే, అది ఒక పెద్ద ట్రెయిలర్ మీద ట్రాక్టర్ సాయంతో రావటం గమనిస్తారు. ఆ రాత్రి పిల్లలంతా కబుర్లు చెప్పుకుంటూ పడుకోవటం వాళ్లకి ఒక మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది. 

                                  ఒకరోజు హెడ్మాస్టర్ పిల్లలందరినీ బడిలోని ఈతకొలనులో ఈత కొట్టమని ఉత్సాహపరుస్తారు. ఎలాటి ఈత దుస్తులు అవసరం లేదని, బట్టలన్నీ విడిచి ఈత కొట్టమని చెబుతారు. అలా చెయ్యటం వల్ల శారీరక అవకరాలు, బలహీనతలు ఉన్నవాళ్లు ఎలాటి ఆత్మ న్యూనతకూ లోనవకుండా మిగిలిన వాళ్లతో కలిసిపోతారని, ఇంకా ఆడపిల్లలు, మగపిల్లలు తమతమ శరీరాలలోని భేదాల పట్ల అనారోగ్యకరమైన ఆసక్తి పెంచుకోకూడదని, అన్ని శరీరాలు అందమైనవే అని పిల్లలకి తెలియజేయాలని హెడ్మాస్టర్ ఆలోచిస్తారు.

                                       పిల్లల్లో దెయ్యాలు అంటే భయం పోగొట్టేందుకు ఒకసారి హెడ్మాస్టర్ చిన్న ఆలోచన చేస్తారు. కొందర్ని దెయ్యలుగా నటించేందుకు ముందుకు రమ్మని ప్రోత్సహించి, వారిని శ్మశానంలో దాక్కోమంటారు. మిగిలిన పిల్లల్ని జట్లుజట్లుగా విభజించి రాత్రివేళలో పాత గుడిలోకి వెళ్లి, అక్కణ్ణుంచి శ్మశానం మీదుగా వెనక్కి రావాలని చెబుతారు. గుడి వరకు వెళ్లిన పిల్లలు చాలామంది ఏదో అర్థంకాని భయంతో శ్మశానం వరకు వెళ్లకుండానే వెనక్కి పరుగెత్తుకొస్తారు. శ్మశానంలో ఎదురుచూసి, ఎదురుచూసి అక్కడున్న పిల్లలు ఆ నిశ్శబ్దానికి భయపడి పరుగెత్తుకొస్తారు. ఈ ప్రయోగంతో పిల్లలందరూ అనుభవపూర్వకంగా దెయ్యాలు లేవన్న విషయాన్ని తెలుసుకుంటారు. 

యురిథమిక్స్ అనే వ్యాయామ సంగీతాన్ని హెడ్మాస్టర్ విదేశాల్లో పరిశీలించి టొమో బడిలో ప్రవేశపెడతారు. శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్పే ఆట అది. సంగీతం చెవితోమాత్రమే వినేదికాదనీ, మనసుతో వినేదిగా, అనుభూతించేదిగా పిల్లలకి నేర్పే ప్రయత్నం చేస్తారు. 

టోమో అంటే కామా ఆకారంలో ఉండే ఒక గుర్తు. తన పాఠశాలకు రెండు టోమోలు కలిపి ఒక చిహ్నాన్ని ఎన్నుకున్నారు హెడ్మాస్టర్. దానికి అర్థం శరీరము, బుధ్ధి సమానంగా అభివృధ్ధి చెంది సంపూర్ణ సమన్వయాన్ని సాధించాలని ఆయన భావం. 

ఒకసారి గుడిలో జరిగే ఉత్సవానికి అమ్మానాన్నలతో వెళ్తుంది టొటొ. అక్కడ లాలిపాప్ లు, బూరు మిఠాయిలు, రకరకాల జంతువుల బొమ్మలు, వెదురు తుపాకులు ఉన్నాయి. అక్కడ ఒక దుకాణంలో పసుపుపచ్చని కోడిపిల్లల్ని చూసి తనకి కొనిపెట్టమని మారాం చేస్తుంది. అమ్మానాన్నలు ఎంతగానో చెబుతారు, “అవి ఎక్కువకాలం బతకవు” అని. అయినా పట్టువదలదు. చివరికి రెండు కోడిపిల్లల్ని కొనిపించుకుంటుంది. అమ్మ వాటికోసం ఒక కటకటాల పెట్టెను కూడా తయారుచేయిస్తుంది. కానీ ఆ కోడిపిల్లలు నాలుగురోజుల్లోనే చనిపోతాయి. ఆ సంఘటనతో కోల్పోవటం, ఎడబాటు అనేవి టొటొకు మొదటిసారిగా అనుభవంలోకి వస్తాయి.

                 హెడ్మాస్టర్ పిల్లల్ని చిరిగిన, మాసిన బట్టలు వేసుకు బడికిరమ్మని ప్రోత్సహించేవారు. అప్పుడు అవి మాసిపోతాయన్న దిగులు, బెంగ ఉండవని, స్వేచ్ఛగా ఆడుకుంటారని ఆయన భావం. టొటొ అందరిపట్లా దయతో ఉండేది. ముఖ్యంగా శారీరక వైకల్యం ఉన్నవారిపట్ల మరింత శ్రధ్ధగా ఉండేది. తనకి కుతూహలం కలిగించే విషయం ఏదైనా సరే, ఎంత ప్రమాదాన్నైనా పట్టించుకోకుండా దాని వెంట పడేది. ఒక్కోసారి చిక్కుల్లో పడేది. అయినా హెడ్మాస్టర్ టొటొని ఎప్పుడూ “నువ్వు నిజంగా మంచిపిల్లవు” అంటూ ప్రశంసిస్తుంటారు. ఆ మాటలు టొటొ ని నిజంగా మంచిపిల్లగా చేసాయని, ఆ స్ఫూర్తి లేకపోయినట్టైతే తాను అల్లరిపిల్లగా పేరు తెచ్చుకుని ఉండేదేమో అని రచయిత్రి చెబుతారు.

బడిలో ఆటల పోటీలు జరిపి, పిల్లలందరికీ బహుమతులుగా బీట్ రూట్లు, ఆకుకూరలు, ముల్లంగి దుంప వంటివి ఇస్తారు. టొటొకి, ఆమె స్నేహితులకి వాటిని ఇంటికి తీసుకెళ్లటానికి అభ్యంతరం అనిపించింది. ఎక్కడో పారేద్దామని అనుకుంటుంటే హెడ్మాస్టర్ విని, “ ఈ కూరల్ని మీరు బహుమతిగా గెలుచుకున్నారు. ఇంటికెళ్లి అమ్మని వండి పెట్టమని చెప్పండి. మీరు స్వయంగా సంపాదించుకున్న దానితో ఈ పూట భోజనం తయారవుతుంది” అని ప్రోత్సహిస్తారు. టొటొ ఉత్సాహంతో తను గెలుచుకున్న కూరగాయలతో ఏమేం వండించుకోవాలనుకుంటోందో హెడ్మాస్టర్ కి చెప్పేస్తుంది.

ఒకసారి రోజూలాగే రైలెక్కి బడినుండి ఇంటికి వెళ్తుంటే ఒక ఐదు సెన్ల నాణెం దొరుకుతుంది టొటొకి. దానిని తాను రైలు దిగేప్పుడు తీసుకోవాలని జాగ్రత్తగా కాలికింద నొక్కిపెట్టి, చివరకి ఎవరికంటా పడకుండా తీసుకుంటుంది. ఇంటికి పట్టుకెళ్తే అమ్మ అడుగుతుందని ఆలోచించి, దారిలో ఒక చోట మట్టిలో కప్పెడుతుంది. కానీ మర్నాడు అది కనిపించదు. బడిలో స్నేహితులకి చూబించాలనుకున్న టొటొ నిరుత్సాహ పడుతుంది. ఇలా చెబుతూ పోతుంటే ఎన్ని సంఘటనలో! ప్రతి దానితోనూ మన అనుభవాల్ని జ్ఞాపకాల్లోంచి తవ్వుకుంటూ ఉంటాం. 

ఒకసారి టోమో బడి గురించి బయట వేరే బడి పిల్లలు కాస్త వెక్కిరిస్తూ 

“టోమో పాఠశాల వెలిసిపోయింది, పాతబడింది

లోపల కూడా అది వెలిసిపోయింది, పాతబడింది”

 అంటూ పాడుతుంటే విని అప్పటికప్పుడు టొటొ ఒక కొత్త పాటను కనిపెడుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి బడి బయట నాలుగు వీధులూ తిరిగి పాడుతుంది. 

‘టోమో బడంటే మా బంగారుబడి,

లోపలైనా, బైటైనా బంగారు బడే” అంటూ.

తన గదిలో కూర్చున్న హెడ్మాస్టర్ ఆపాట విని అమితానందాన్ని పొందుతారు. ఆ పసివాళ్లకు బడి పట్ల ఉన్న మమకారం తలుచుకుని ఆరోజు సాయంత్రం బడిగంట ఆలస్యంగా కొడ్తారు. 

 ఆ బడిలో చదువు ముగించుకుని వెళ్లిపోయే తరగతి పిల్లలతో ఫోటో తియ్యటం టోమో బడిలో ఆనవాయితీ. అయితే ఫోటో సమయంలో ఒక్కరు కూడా నిలబడవలసిన స్థానంలో నిలబడక ఇతర తరగతి పిల్లల్ని కూడా తమతో కలిసి ఫోటోలోకి రమ్మని పిలుస్తూండటంతో, పరుగులు పెడుతూ అందరూ  ఫోటోలోకి చేరిపోయేవారు. హెడ్మాస్టారు ఏమీ అనకుండా పిల్లల్ని స్వేచ్ఛగా అలా వదిలి ఆనందించేవారు.

పెద్దయ్యాక తాను టోమోలో పాఠాలు చెబుతానని టొటొ హెడ్మాస్టారుకి చెబుతుంది. ఆయన ఆనందంగా “మాట తప్పకూడదు” అని చెబుతారు. తాను బడిలో పనిచేసేప్పుడు పాఠ్యాంశాలు ఎక్కువ చెప్పకుండా ఎక్కువ ఆటల దినాలని పెట్టాలని, ఎక్కువగా పిల్లల్ని షికార్లకుతీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది చిన్నారి టొటొ. కానీ యుధ్ధంలో బాంబు దాడికి గురైన టోమో బడి మంటలకి ఆహుతైపోయింది. టొటొ ఆశ నెరవేరనేలేదు. 

ముందుమాటలో రచయిత్రి ఇప్పుడు టోమోలాటి బడులుంటే ప్రపంచంలో ఇంత హింసా ప్రవృత్తి ఉండేదికాదని అంటారు. తనను మొదటి బడిలోంచి తొలగించేసేరన్న విషయాన్నితల్లి తన ఇరవైయ్యో పుట్టినరోజు వరకూ చెప్పనేలేదని, బడిలోంచి తీసివేసినందుకు ఎలాటి కోపం, విసుగూ లేకుండా తనకి తగిన బడిని వెదికిన తల్లి విశాల హృదయానికి ఆమె ఎంతగానో కృతజ్ఞత చెబుతారు.

ఈ పుస్తకం గురించి సమీక్ష రాయబూనుకోవటమే ఒక పెద్ద సాహసం అని తెలుసు. అయినా టోమో బడితోనూ, అందులోని టొటొ లాటి పిల్లలతోనూ ప్రేమలో పడి ఇలా మొదలెట్టేసేను మరి. పుస్తకం ఎంత అద్భుతమైనదో చెప్పేందుకు ఈ సమీక్ష చాలదు. పుస్తకం చదవాల్సిందే. ఒకసారి కాదు మళ్లీ మళ్లీ!


*****

Please follow and like us:

4 thoughts on “రైలుబడి (పుస్తక సమీక్ష)”

  1. Happy to read ideal school atmosphere and innovative ideas of the Headmaster.. Review gave a clear picture prompting the readers to read the novel

  2. Great సమీక్ష on such an interesting story. Thanks for showing us all this wonderful school and little Toto. I wish we have such principals and schools in this world.

Leave a Reply to SC Cancel reply

Your email address will not be published.