కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ఎండ్లూరి మానసతో ఇంటర్వ్యూ

-జ్వలిత

1.జ్వలిత : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ?

మానస ఎండ్లూరి : ఈ పురస్కారం పొందిన అందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అయితే దీన్ని గుర్తింపు అనే కంటే కూడా గౌరవం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తిత్వాన్ని రాసుకునే రచయితలకు వచ్చే గుర్తింపు, గౌరవం ఆ రచయితకే కాదు తన జాతికి తన వర్గానికి వర్తిస్తుందని నమ్మేదాన్ని. ఒక స్త్రీవాదిగా, ఒక బహుజన వాదిగా, ఒక దళిత వాదిగా అట్టడుగు వర్గాల స్త్రీల గురించి ఆ వర్గపు.. ముఖ్యంగా దళిత క్రైస్తవ మనుషుల గురించి నేను రాస్తున్నాను కాబట్టి ఈ పురస్కారం అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందని నేను భావిస్తున్నాను మేడం.

2. జ్వలిత : చాలా గొప్ప భావన, వ్యక్తిగతంగా కాకుండా, అస్తిత్వ స్పృహతో చాలా గొప్పగా ఉంది మీ సమాధానం. విహంగ పత్రిక బాధ్యత, విహంగ పత్రికలో మీ సాహిత్యం గురించి చెప్పండి ?

మానస ఎండ్లూరి : విహంగ అనేది అంతర్జాలంలో మొట్టమొదటి మహిళా సాహిత్య పత్రిక. అది 2011లో కీర్తిశేషులు డాక్టర్ పుట్ల హేమలత మా అమ్మగారు దీనిని మొదలు పెట్టారు. ఈ పత్రిక పెట్టిన ఐదు సంవత్సరాలకు నా మొట్టమొదటి కథ విహంగలో ప్రచురితమైంది. ఆ కథ పేరు ‘గౌతమి’. తెలంగాణ ఆంధ్ర విడిపోతున్న సమయంలో ఎమోషనల్ గా మనం పడ్డ స్ట్రెస్ ని ఆ కథలో చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాను. ఆంధ్రాలో ఉండే అక్క, తెలంగాణలో ఉండే తమ్ముడ్ని సింబాలిక్ గా తీసుకొని రాసాను మేడం. అంటే నిజజీవితంలో కూడా మా నాన్నగారు హైదరాబాదీ అయినా ఉద్యోగరీత్యా రాజమండ్రిలో ఉండడం. నాన్నగారి సొదరులంతా అంటే బాబాయిలందరూ ఇక్కడే హైదరాబాద్లో ఉండడం. నేను హైదరాబాద్ మరియు రాజమండ్రిని దగ్గరగ చూడడం, ఈ రెండింటి మధ్యలో మానసిక దూరం ఎంతో ఇబ్బంది పెట్టింది. జియోగ్రాఫికల్గా మనం వేరైనా, మానసికత కూడా అవసరమే కదా, దీంట్లో మళ్ళీ అసలు మనం విడిపోతున్నామా ? దూరమవుతున్నామా ? మనం వేరు వేరు అవుతున్నామా అన్న దృష్టిలో రాశాను. అయితే స్వతహాగా తెలంగాణ రాష్ట్రం రావడం గొప్ప విషయం. అది రావడం వల్లే వారి కళలకి గానీ భాషకి గానీ వాళ్ళకంటూ ఒక సొంత గుర్తింపు రావడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. సంతోషిస్తున్నాను. అలాగే ‘విహంగ’ మరీ ముఖ్యంగా పరిశోధక వ్యాసాల మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే విహంగ పత్రికకి ISBN నంబర్ ఉన్నది. అది ఉండడంతో పోయిన సంవత్సరం నవంబర్ 25, 26 తేదీల్లో విహంగ తన పది సంత్సరాల ప్రయాణాన్ని సదస్సుల రూపంలో జరుపుకుంది. అంతర్జాలంలో అంతర్జాతీయ సదస్సు (వెబినార్) జరుపుకుంది. దానికీ ఇతరేతర దేశాల నుండి ఎందరో పాల్గొని, పత్ర సమర్పణ చేశారు. త్వరలో అది ఓ పుస్తక రూపంలో రాబోతుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు అంటే ద్విభాషా సదస్సును నిర్వహించాము. ఎందుకంటే నవంబర్ 25 వచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 26 వచ్చేసి Indian constitution day. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ రెండురోజుల సదస్సును నిర్వహించాము. విహంగ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఒక రచయిత, అమ్మ ఈ పత్రికను ప్రారంభించినప్పటి నుండి పని చేస్తున్నారు. విహంగకు రెక్కలు ఇచ్చేది తనే. అమ్మ తర్వాత అఫిషియల్ గా నేను సంపాదకురాలిగా బాధ్యతలు తీసుకున్నాను.

3. జ్వలిత : విహంగ ఒక ప్రత్యేక పత్రిక, నేను కూడా పత్రికలో రచనలు చేశాను. పుట్ల హేమలత గారు నన్ను ప్రోత్సహించారు. ఇప్పుడు మీ బాల్యం గురించి చెప్తారా ?

మానస : మా అమ్మది నెల్లురు, నాన్నది హైదరబాద్. నాన్న ఉద్యోగరీత్యా నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడు రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో డాడీ 28 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా పనిచేశారు, దాంతో నేను నా ఇంటర్మీడియట్ దాకా రాజమండ్రిలోనే చదువుకున్నాను ఆ తర్వాత డిగ్రీకి వచ్చేసి ఏలూరు సెయింట్ ధెరిస్సాసులో సైకాలజీ, ఇంగ్లీషు, సోషల్ వర్క్ లో చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లింగ్విస్టిక్ భాషాశాస్త్రంలో పీజీ చేశాను. అమ్మ నాన్న ఇద్దరు సాహిత్య రంగానికి 

సంబంధించిన వారు కావడం చేత, నేను పుస్తకాలతో పెరిగాను. ఎప్పుడూ ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. పెద్ద పెద్ద రచయితలు వస్తూ ఉండేవారు. వారు తమ పుస్తకాలను అమ్మానాన్నలకు ఇచ్చి వెళ్ళేవారు. అలా పెరిగి పెద్దవుతూన్న కొద్దీ సాహిత్యాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇద్దరు దళిత వాదులే అవడంతో కథలు కవిత్వం అన్ని చదివేదాన్ని. మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దళిత చరిత్ర, బహుజనుల సమస్యలు, వాటి గురించి చర్చిస్తూ ఉండేవారు. ఒక దళిత బిడ్డగా నేను విన్నదే కాదు, నేను చూసిన, అనుభవించిన అనుభవాలను, ఒక దళితురాలిగా నన్ను సమాజం ఏవిధంగా చూస్తుంది. అనే అనుభవాలు కూడా నాకు మెండుగానే ఉన్నాయి. నా ముఖంలో బొట్టు కనిపించకపోవడంతో వాళ్ళ ముఖంలో మారిన మార్పులు గాని రంగులు గాని ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సమాజం నన్ను స్వీకరించ లేకపోవడం కానీ. లేకుంటే క్రిస్టియన్   అని తెలిసినప్పుడు వారిలో కనిపించిన మార్పు గాని, ఇలా నేను చాలా రకాల వివక్షను ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ చాలా స్పష్టంగా గమనించాను. బాల్యంనుంచే ఎప్పుడో ఎక్కడో ఏదో రాయాలనే నమ్ముతూ ఉండేదాన్ని. చిన్న చిన్న కవితలు, హైకూలు ఇలా రాస్తూ ఉండేదాన్ని. ఖచ్చితంగా, ఇంకా బాగా రాయాలని ఇంట్లో ప్రోత్సహించే వారు. అది రాయి, ఇది రాయి అంటూ చాలా ఎంకరేజ్ చేసేవారు. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా డైరీ రాసేదాన్ని. ఎప్పుడు డైరీ రాయడం అలవాటు చేసుకోండి అని చెప్పేది అమ్మ. నాకు రాతలు బాగా ఇంట్రెస్ట్ ఉండేది అలా నా బాల్యం గడిచింది.

4. జ్వలిత : బాల్యం విద్యభ్యాసం రెండు కలిపి చెప్పారు. అయితె మీ మొదటి రచన ఎప్పుడు చేసారు. ఆ ప్రక్రియ ఏమిటి ?

మానస: నేను మొదట్లో కవిత్వమే రాశాను. అప్పటికి నా వయసు ఆరు లేదా ఏడు సంవత్సరాలు ఉంటుంది. మా తాతయ్య చనిపోయారు. నాన్న వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు, “దేవతలారా మా తాతయ్య ఎక్కడున్నాడు చూపించండి/ చూపించి మళ్లీ మీరే దాచేసుకోండి” అంటూ రెండు లైన్లు రాశాను. నిజానికి నాకు అంత స్పష్టంగా గుర్తు లేదు. కానీ నాన్న మాత్రం ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న కవిత్వాలు అంటే భావ కవిత్వాలు రాస్తూ ఉండేదాన్ని. ఎనిమిదో తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు రాస్తూ ఉన్నాను. ఒకటి రెండు కథలు రాశాను. నిజానికి ఏదో అనుకుని సరదాగా చేసిన రచన అని చెప్పొచ్చు. తర్వాత నా జీవితంలో రచన ఒక భాగంగా మారిపోయింది.

5. జ్వలిత : మొట్టమొదటి సీరియస్ కథ ఎప్పుడు రాశారు ?

మానస : మొట్టమొదటి కథ ‘ 2015లో విహంగలో ప్రచురితమైంది. అప్పటి నుండి సీరియస్ గా రాయడం మొదలైందని చెప్పవచ్చు. రాజమండ్రి గోదావరి ఇంజనీరింగ్ కాలేజీలో…  ఆ టైంలో ఇంగ్లీష్ బోధించే దాన్ని, ఎస్.కే.వి.టి.లో మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారికి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు తీసుకునేదాన్ని, సీరియస్ గా ఏ జాబ్స్ చేయలేదు. భాషాశాస్త్రం కావడంతో రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజీలో స్పోకెన్ ఇంగ్లీష్ రెండు సంవత్సరాలు చెప్పాను. అప్పటి నుండి సీరియస్ కథలు రాయడం మొదలు పెట్టాను.

6. జ్వలిత: మీ రచనలకు స్ఫూర్తి ప్రేరణ తల్లిదండ్రులే కదా ?

 మానస: స్ఫూర్తి అంటే నా జీవితంలో నేను ఎదుర్కొన్న నిజజీవిత సంఘటనలు నాకు స్ఫూర్తి అని చెప్తాను. జీవితానుభవాలే నాకు స్ఫూర్తి.

7. జ్వలిత : వివక్ష గురించి మీ వ్యక్తిగతం, సామాజికం, జెండర్ పరంగా కుల పరంగా ?

మానస : వివక్ష అంటే నేను వచ్చిన కుటుంబ నేపథ్యం దళిత క్రిస్టియన్ అని చెప్పొచ్చు. అమ్మ నాన్న ఇద్దరు క్రిస్టియన్స్. ఇద్దరూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వారు. నేను స్కూల్కి బయటికి వెళ్లినప్పుడు గాని, బయటగాని, ఏదైనా పనిమీద ఎటైనా వెళ్లినపుడు గాని, నా బొట్టు లేని మొఖాన్ని చూసే వారు. రాజమండ్రిలో పెరిగాను కదా మేడం, అక్కడ అడుగడుగునా బ్రాహ్మణత్వం హిందుత్వం ఉంటూనే ఉంటుంది. అలాంటి ప్లేస్ లో నేను వెళ్లడం జనాలు బొట్టు లేని నా ముఖాన్ని చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టడం. నేను కొన్ని వందల సార్లు గమనించాను. నా హిందూ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, అందరికీ నమస్కారాలు పెట్టి నా దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ్చర్యపోయినట్లు చూడటం, అంటే ముఖం చూడగానే నువ్వు ఫలానా కులపు దానివని మాకు అర్థం అయిందని ముఖం పెట్టడం, ఇట్లాంటివి నేను చాలా ప్రత్యక్షంగా చూశాను, రాజమండ్రిలో ఉన్నప్పుడు. అయితే మా సీనియర్ ఒక అమ్మాయి వచ్చింది అప్పుడు టెన్త్ స్టాండర్డ్ “

ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్, బట్ ఐ లైక్ యూ” అని అనింది. ఆ మాట విని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మాయి చాలా రాండమ్ గా అని ఉండొచ్చు. లేకుంటే ఆ అమ్మాయిలో కూడా ఎప్పటినుండో కుల వ్యవస్థ ఎంత నిండిపోయిందో అని మనం అనుకోవచ్చు. కాని ఆ అమ్మాయి నన్ను వ్యక్తిగా ఇష్టపడుతుంది. కానీ నా నేపథ్యాన్ని ఒప్పుకోలేక పోతుంది. ఆ అమ్మాయికి నేను నా బిహేవియర్ పరంగా నచ్చినట్లు ఉన్నాను. ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. నా ఫ్రెండ్స్ లో చాలామందికి క్రిస్టియన్స్ అనగానే వారికంటూ ఒక ఒపినియన్ ఉంది. వారు ఎప్పుడు ఇలా అనేవారు క్రిస్టియన్స్ ఇలా ఉండరు. కానీ నువ్వు భలే ఉన్నావ్ అంటూ వుండేవారు. నా సమక్షంలోనే కొంతమంది ముస్లిం మిత్రులను ఇలా అడగడం చూశాను. “మీరు స్నానాలు చేయరంటగా అయినా నువ్వు శుభ్రంగా ఉన్నావులే” అని అనడం, ఇలాంటివన్నీ చూశాను. అగ్రవర్ణ కులాల వాళ్ళకీ ఇది తెలుసు. కానీ వారు దీని గురించి మాట్లాడరు. మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లాంటి వివక్షల్ని చాలా ప్రత్యక్షంగా చూశాను. అందుకే వీటిని “బొట్టు కథలు”గా రాసుకుంటూ వచ్చాను. నిజానికి ఈ బొట్టు కథల మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇంటా బయట, దళితుల్లో కూడా కొంతమంది దీన్ని స్వీకరించ లేకపోయారు. ఈ కాలంలో బొట్టు కాటుక చూసి, అవకాశం ఇవ్వకపోవడం, ఇలాంటివి ఉండవు అని అన్నారు. కానీ ఎంతోమంది దళిత స్త్రీలు క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత, వాళ్ళు క్రైస్తవాన్ని ఇంటి వరకే పరిమితం చేసుకున్నారు. బొట్టు పెట్టుకుని తమ కులాన్ని దాచుకున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు. మనకి తెలిసిన వారైనా ఈ సాహిత్యకారులలో కూడా ఉంటారు. ప్రముఖుల పిల్లల్లో ఉంటారు. కాని ఫస్ట్ సైట్ లో ఒక చిన్న గౌరవం అంటే నేను చెప్పినట్లు అటువంటి వాటిని అధిగమించడానికి బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా.  ఇంతవరకు ఈ విషయాలు నేను చాలా దగ్గరగా చూశాను. ఈ విషయాలు ముందు ఎక్కడా చర్చించబడలేదు, మాట్లాడలేదు కూడా. ఎం ఎం వినోదిని  తన ‘తప్పిపోయిన కుమార్తె’ కథలో దీని గురించి ప్రస్తావించారు.  తర్వాత సతీష్ చందర్ కూడా ‘బొట్టు లేని తనమే నా గుర్తింపు అయింది’ అనే ఒక కవిత కూడా రాశారు.  నేను నాలుగు నుంచి ఐదు దీనికి సంబంధించిన బొట్టు కథలు వ్రాయడం జరిగింది.

8. జ్వలిత: దళిత క్రిస్టియన్ గా మీరు చాలా వివక్షల్ని ఎదుర్కొన్నానన్నారు. అయితే ఒక అమ్మాయిగా జెండర్ పరంగా వివక్ష ఎదుర్కొన్నారా?

మానస : అంటే మేడం మనది భారతదేశం కదా, కులం మతం మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అది ఖచ్చితంగా మనలోకి తొంగి చూస్తూనే ఉంటుంది. ఇంకా అలా  కాకుండా అంటే స్త్రీగా నేను ఎదుర్కొన్న సమస్యలు అంటే నువ్వు ఫలానా, అది చేయలేవు, నువ్వు ఒక ఆడపిల్లవి అని, ప్రతి కుటుంబం నుండి ప్రతి ఒక్కరికీ ఉంటూనే ఉంటుంది. అది మనం గమనించడం మనం గమనించకపోవడం అనేవి మన మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను పెద్ద బండి నడిపిస్తాను అంటే ఆడపిల్లలు నడపకూడదు అని చెప్పడం, ఇంట్లోనూ బయట ఇవి కేవలం చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ఆడపిల్లల్ని ఎంతగా కుంగదీస్తాయి అర్థం చేసుకోరు. ఫలానా టైం కల్లా ఇంటికి వచ్చేయాలి, బయట ఉండకూడదు, ఇలాంటివన్నీ ప్రాథమిక స్థాయిలో విన్నాను. అవకాశాలు ఇవ్వకుండా అడ్డుపడే స్థాయిలో నేను చూడలేదు. అవకాశాన్ని పోగొట్టుకునే స్థాయికి నేను పోలేదు. ఆడపిల్లల్ని helpless beingగా చూస్తున్నారు. ఏ కులమైనా ఏ మతమైనా పైవన్నీ ఎదుర్కోవాల్సిందే. సాధారణంగా ఇదంతా ఇంట్లోనే ముందుగా మనకు తారస పడతాయి. సాహిత్య రంగంలో ఉన్నాను కాబట్టి, స్త్రీల గురించి పురుషులు రాయడం గమనించాను. వారు స్త్రీలు పడి పడి రాస్తారు. స్త్రీలు ఇలా అనుకుంటారు. అలా అనుకుంటారు. వేశ్యలు ఇలా మాట్లాడతారు. అలా అంటూ రాస్తూ ఉంటారు. మొన్న ఒక అబ్బాయి “వేశ్య ప్రతి మగవాడిని ప్రేమిస్తుంది” అని అన్నాడు. అది అతనెందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు. అది చెప్పాలనుకుంటే  వేశ్యే చెప్పవచ్చు కదా. లేదా తన opinionగా చెప్పొచ్చు కదా. మొన్న ఒక పెద్దాయన అన్నారు. జీవితమే స్త్రీ లింగం అని.  అంటే జీవితం ఎట్లా స్త్రిలింగం అవుతుంది. వ్యవస్థ అంతా పురుషులతో నిండి ఉంటే అది స్త్రీ లింగం ఎలా అవుతుంది. ఆకాశంలో సగం స్త్రీ అని చెప్తూ బుజ్జగిస్తూ ఉంటారు. సాహిత్యంలో నేను చూసింది, వేదిక మీద పురుషులే ఉంటారు. కొంతమంది ఏదో అలంకరణగా ఒకరు ఇద్దరో మహిళల్ని వేదిక మీద పెడుతుంటారు. ఈ differentiation మాత్రం కేవలం సాహిత్యంలో నేను బలంగా చూస్తున్నాను. మనకు ఏదైనా ఒక కథ లేక కవితాసంపుటి వస్తూ ఏడాదికి ఒకటి వస్తూ ఉంటుంది. వాటిలో స్త్రీల కంటే పురుషుల రచనలే ఎక్కువగా ఉంటాయి. పోనీ స్త్రీలు లేరా అంటే కచ్చితంగా ఉంటారు. వీళ్ళని ఎక్కడ రానివ్వకపోవడం చూస్తుంటాం. అందుకే నాకనిపిస్తుంది ఏంటంటే స్త్రీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండి ఉంటే… కచ్చితంగా ఎన్నో పెద్దపెద్ద పురస్కారాలు గౌరవాలు దక్కేవని నేను అనుకుంటున్నాను. 

9. జ్వలిత : మీ ‘మిళింద’ కథాసంకలనం మీ మొదటి పుస్తకం కదా ! దీంట్లో కొన్ని కథల గురించి మాట్లాడుకుందాం. ‘Corrective rape’ ఈ కథని ఏ ఆధారం చేత రాశారు ?

మానస : ఈ కథని నేను ప్రత్యక్షంగా చూడలేదు. తెలిసిన వారి జీవితంలో జరిగిన విషయం కూడా కాదు. ఒక టైంలో స్వలింగ సంపర్కులుగా  ఉన్న పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్న కేసులు ఒక టైంలో చాలా వినిపించాయి. ఎక్కువగా వచ్చాయి. కొడుకు స్వలింగ సంపర్కుడు అయితే వాడ్ని కన్నతల్లి sexual గా Harras చేయడం దాని వల్ల అతను స్త్రీలను ఇష్టపడతాడని, లేకుంటే స్ట్రెయిట్ గా మారుతాడని అపోహలో తల్లి ఇలా చేసిన ఉదంతాలూ మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. లేదంటే ఆడపిల్లలు lesbianగా ఉన్నప్పుడు మేనమామలు, తండ్రులు, బాబాయిలు వాళ్ళని రేప్ చేయడం, తద్వారా వారు పురుషులకు అలవాటు పడతారు అన్న అపోహలో వాళ్లను చాలా చిత్రహింసలు పెట్టడం లాంటివి మనదేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ ఉన్నాయి. అలా రికార్డు కానీ కేసులు విషయాలు చాలా ఉంటాయి.

10. జ్వలిత : కథలో స్పందన తల్లికి పేరు పెట్టలేదు. ఆ పాత్ర చాలా విశృంఖలంగా ఉంది ?

మానస : నిజానికి స్పందన తల్లి పాత్ర విశృంఖలంగా చూడలేదు. సమాజంలో స్త్రీలలో ఆమెనీ ఒక స్త్రీగానే భావించాను. భర్తను కోల్పోయి ఇంకొక పురుషుడి దగ్గర స్వాంతన, ప్రేమ కోరుకుంటుంది. ఒక తోడు అది ఏ రకంగా అయినా అయ్యుండొచ్చు శారీరికంగా, మానసికంగా, ఎమోషనల్గా అయినా అయి ఉండవచ్చు. కానీ అతను చివరికి ఆమెను మోసం చేస్తాడని ఆమె ఊహించి ఉండదు. ఆ ఉదంతాన్ని నేను ఈ కథగా రాశాను. ఆడపిల్లల చుట్టూ, ఆమె లెస్బీన్ అయినా, ఆమె స్టైట్ ఉమెన్ అయినా కూడా, మగవాడికి sexualగా ఎలా బలైపోతుందో చెప్పాను. స్పందన వాళ్ళ బావే ముందుకు వచ్చి తనని అలా చేయడానికి ఒప్పుకుంటాడు. తల్లి చెప్పి ఉండడం ఒక విషయం. ఈ విషయాన్ని నేను నా బాధ నుంచి రాసిన కథ ఇది. ఇందులో ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం సినిమాల్లో చూసినట్లయితే మగాడు gay లేదా పాయింట్ ఫైవ్ గా ఉంటే. వారిపై జోకులేసుకుని సెక్స్ కి పనికిరాడని, అతను ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్న కానీ, అతని ఆలోచనలు, అస్తిత్వాలు  ఉంటాయని గుర్తించక. అవన్నీ పక్కన పెట్టేసి,  sex కి పనికి రాని వాడిగా కామెంట్స్ చేస్తాం. వాడి దగ్గరికి సెక్స్/ లవ్ కోసం ఏ ఆడపిల్ల కూడా వెళ్లదు.  పురుషులు కూడా వాడ్ని ఛీ కొడుతూ ఉంటారు. ఎవరో అదే ఇంట్రెస్ట్ ఉన్న గేలు కూడా వెళ్లరు. అదే ఆడపిల్లలు lesbian అయితె. వీళ్ళు ఆ అమ్మాయి తనకు ఇష్టం లేదని చెప్పినా ఆమెను రేప్ చేయడానికైనా వెనకాడరు. ఇదే formula మగవాళ్ళకు కూడా వర్తించాలి కదా. ఆ మగవాడు ఆమెని వదిలి వెళ్ళక పోగ కక్ష తీర్చుకోవడానికి చూస్తాడు. ఈ విధంగా ఆడపిల్లలు చిత్రవధకు లోనౌతున్నారు.

11. జ్వలిత : ఇంకొక కథ మెర్సీ పరిణయం. దీంట్లోని విక్టర్ వంటివారిని సమాజంలో చూస్తూనే ఉంటాము. మెర్సీకి తల్లిదండ్రులు లేనందున అభద్రత ఉంటుంది. మెర్సీ పాత్రను వివరించండి ?

మానస : మెర్సీ పాత్ర తెలుగు సాహిత్యంలో చాలా అరుదైన పాత్ర. ఈ మధ్యకాలంలో సునీల్ కుమార్ గారు అలాంటి క్రిస్టియన్ పాత్రను సృష్టించారు. క్రిస్టియన్ పాత్రని పెట్టడమే అరుదుగా జరుగుతుంది ఎందుకంటే ఆ వర్గం నుండి రచయిత లేరు కాబట్టి. ఉన్నా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన అంత తక్కువ ఉన్నారు. ఒక దళిత క్రైస్తవులు అన్నిటికీ దేవుడి మీద ఆధారపడుతుంటారు. ప్రతి చిన్నదాన్ని మాటకి వెనక ముందు దేవుడి పేరు లేకుండా మాట్లాడరు. వాళ్లకు ఉన్న కష్టాలు గానీ, నష్టాలు గానీ అన్నీ దేవుడి పేరు మీదే మాట్లాడుతారు. ఎప్పుడు చర్చి పాటలు పాడడం, ప్రార్థనలు చేయడం, వారు చదువుకునే ఉద్యోగస్తులైన వారి నిత్య జీవితంలో దేవుడనేవాడు ఉంటూనే ఉంటాడు. అటువంటిదే మెర్సీ పాత్ర. వీళ్లకు పిల్లలు పుడితే కూడా అంతగా క్రిస్టియానిటీ అనేది వారి జీవితంలో భాగమైపోయింది. కేవలం ఆదివారమే కాదు వేరే రోజులు కూడా వీటిలో కొన్ని ఉంటాయి. అటువంటి  ఆమె తల్లిదండ్రులు లేకపోగా అమ్మమ్మ వద్ద ఉంటుంది. అమ్మాయి మంచి పొజిషన్ కి రావాలని, బాగా చదువుకోవాలని, ఒక హోదాలో ఉండాలనే ఉద్దేశంతో ఉన్న స్టూడెంట్. ఆ అమ్మాయికి విక్టర్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. ఆమె ఆ అబ్బాయి తన వెంటపడడం ఇష్టపడదు. నువ్వు ఎట్లాగైనా నన్నే ప్రేమించాలంటాడతను. ఈ అమ్మాయి దేవుడే అంతా అన్నట్లుంటుంది. ఆ అబ్బాయి వెంట పడటం ఇష్టపడదు. ఆ విషయానికి కూడా ప్రార్థన చేస్తా అని అంటుంది. నేను నువ్వు మంచిగా మారాలని ప్రార్థన చేస్తా అని అంటుంది. ఆ తత్వం ఆ అమ్మాయిని అంతగా కట్టిపడేస్తుంది అట్లాంటి పాత్ర అది.

12. జ్వలిత : విక్టర్ పాత్ర బాగా నడిపారు.. “అయితే స్పృహ కోల్పోతే అగ్గిపుల్ల వెలిగించి మానం భగ్గుమనిపించాడు” అని రాశారు ‘మానం’ అనే పదాన్ని మీరు అంగీకరిస్తారా ?

మానస : ఆ రోజుల్లో అమ్మ నేను చాలా చర్చించుకున్నం దీని గురించి. నేనేమో మర్మాంగాన్ని అని రాశాను. నేను ఉన్న జనరేషన్ కి మాకు సాహిత్యంలో ఏపదం వాడాలి వాడకూడదు ఆంక్షలు నాకు తెలీదు. ఏది తలలోకి వస్తే అది రాసే స్థితిలో మేమున్నాం. అయితే అమ్మ ఆ పదాన్ని ఎవరూ రాయట్లేదు అన్నది.. అప్పుడు మానం అని రాశాను. అది శరీరానికి జరిగింది గౌరవానికి సంబంధం లేదనే అంటాను నేను.

13. జ్వలిత : మాథ్యూస్ మోహన్ కథలో కోడ్ లాంగ్వేజ్  ఉపయోగించారు.. ఆ కథలో డీకోడ్ చేయలేదు.. అందుకు నాకు అర్థం కాలేదు అని అడుగుతున్నా..

మానస : దీంట్లో ఏంటంటే క్రైస్తవ కుటుంబం వ్యవస్థ ఎవరికీ పట్టింపు అనేది ఉండదు. ఇది రెండు కోణాల నుండి రాసిన కథ. హిందూ పండుగలు పబ్బాలు హిందూస్ కి తెలిసే ఉంటాయి. క్రైస్తవ జీవితాల నేపథ్యాలు దగ్గరికి వచ్చేటప్పటికి నిర్లక్ష్యం ఉంటుంది. ‘మీలో కూడా ఉంటారంటగా అదే మీ ఏసుప్రభు ఎలా ఉన్నాడు. మీ చర్చి లో పాటలు వస్తున్నాయి’ అని చెప్పి  దూరాన్ని బాగా వ్యక్తం చేస్తూ ఉంటారు. మీరు మేము వేరు వేరు, ఇప్పుడు కూడా మీ వెంకటేశ్వర స్వామి, మీ సాయి బాబా అనే ఆలోచన కూడా రాదు. అదే వాళ్ళని మైనారిటీలుగా మారుస్తుంది క్రైస్తవంలో నుంచి హిందుత్వంలోకి వెళ్ళిన వారు కూడా ఇట్లాగే అంటూ ఉంటారు. ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు ఇటువంటి ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ కద. క్రైస్తవుల్లో తప్పకుండా ఉంటారు ఈ ఇరువురి మధ్య ప్రేమ చరిత్ర ఉంది అది మంచి చేయాలనే ఉద్దేశంతోనే… మన కుల వ్యవస్థ ఎలా ఉంటుందంటే మాల మాదిగ కులం గురించి  మాట్లాడేటప్పుడు తలుపులేసుకుని మాట్లాడుకుంటారు. ప్రత్యక్షంగా చూశాను అందరికీ తెలుసు అయినా భయం. క్రైస్తవ మాల మాదిగ అన్న పదాలను పలకాలంటే భయం అందుకే. కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. కోడ్ లాంగ్వేజ్ లో మాల రెండక్షరాలు మాదిగ మూడు అక్షరాలు. అందుకే కోడ్ లాంగ్వేజ్ అని అంటూ ఉంటారు మా ఇళ్ళలో ఇలా నవ్వుకుంటూ ఉంటాను.

14. జ్వలిత : జెన్నిఫర్ కథ గురించి చెప్పండి చలం ప్రభావం మీ మీద ఉందా ?

మానస : చలాన్ని చదివాను. మైదానం స్కూల్లో ఉన్నప్పుడు చదివాను. అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత మళ్ళీ చదివాను. దాని ద్వారానే నేను చలం ప్రభావంతో ‘మైదానంలో నేను’ అన్న కథని రాసాను. జెన్నిఫర్ కథని అనుకోకుండా రాశాను. కానీ అది నిజంగానే అయ్యింది. మా తాతయ్య చనిపోయినప్పుడు బరియల్ గ్రౌండ్ కి వెళ్ళాను. అది నారాయణగూడ బరియల్ గ్రౌండ్. చాలా అందంగా ఉంటుంది. బ్రిటిషర్లు కట్టించారు. వారికి సంబంధించిన సమాధులు కూడా అక్కడ ఉండేవి. సమాధి మీద శిలువ గుర్తు, పక్కనే ఎగురుతున్న పావురాయి మరియు ఏంజెల్ పక్క పక్కనే ఉన్నాయి. బాగా అందంగా కనిపించేది. అప్పుడు అక్కడికి వెళుతూ ఉండేదాన్ని. చనిపోయిన భార్య కోసమని ఆమె భర్త అక్కడికి వస్తూ ఉండే వాడు. తన చనిపోయిన భార్య సమాధి పై పెట్టడానికి పూలు తెచ్చేవాడు. చిన్నగా ఉన్నప్పుడు అ దృశ్యం నా మనసులో నాటుకు పోయి నట్టు ఉంది. ఆ మధ్య ఈ కథ రాసినాకా గుర్తుకు వచ్చింది. కట్ చేస్తే, నా జీవితంలో అంతా అమ్మ నాన్న నిండిపోయారు. వారు తప్పించి బయటి ప్రపంచంతో పరిచయం తక్కువే, ఇంట్లో అమ్మానాన్న… వారే నా ఫ్రెండ్స్. అమ్మ నాన్న ఈ కథని చదివి బాగా ఎడ్చేసారు. చూశారా ?! అది అమ్మ చనిపోయినట్లు కథ రాసింది. బహుశా ఇప్పుడు నేను ఎలా బతికేది ? అంటూ అమ్మ చాలా ఏడ్చేసింది. తీరా చూస్తే అది నిజంగానే జరిగింది. క్రిస్టియన్ కుటుంబాలలో ఉన్న ఆటుపోట్లను నిజాయితీగా రాశాను. సినిమాల్లోలా కాకుండా నిజాయితీగా చెప్పాలనుకున్నాను.

15.జ్వలిత : ఉల్ఫత్ కథ గురించి వివరించండి ?

మానస : నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ట్రాన్స్ జెండర్ దగ్గరికి స్వయంగా వెళ్లాను. ఇంట్రెస్ట్ ఏంటంటే కుల మత పరంగా మైనారిటీ పరంగా ప్రస్తావించాను. హిజ్రాలు వేరే వారిని పెళ్లి చేసుకుని జీవిస్తున్న వారి ఫోటోలు అవి అన్ని నాకు చూపించారు. అలా వారి జీవితాలను నేను రాశాను.

16. జ్వలిత : మీ మీద చలం ప్రభావం ఉందని అనిపిస్తుంది అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అయితే నాది ఒక అమాయకమైన ప్రశ్న ఏమిటంటే నిజంగా అంతగా ప్రేమిస్తారా ? అంత ప్రేమ ఉంటుందా ? ప్రేమ అంత ఆకర్షిస్తుందా ? ప్రపంచం నుండి వేరు చేస్తుందా ?

మానస : దీంట్లో ఈ ట్రాన్స్జెండర్ని కలిసినప్పుడు, వారు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే?  చాలా వరకు అందరూ పెళ్లిళ్లు చేసుకోలేరు, దాంట్లో అట్లాంటి వాళ్ళు అంటే ఇద్దరు అబ్బాయిలు. ఆ ప్రేమను చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. నేను చూసింది ఏంటంటే మేడం వారిలో విపరీతమైన కేరింగ్. వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఏంటంటే ప్రేమించడంలో మీరు మా ముందు ఎందుకు పనికిరారు. మీకంటే జెండర్, ఇంకేవో సమస్యలు ఉంటాయి. కానీ మాకు దొరికిన వారినే గొప్పగా చూసుకుంటాం. కొందరు సిగరెట్లతో కాల్చడం, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం. ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే దొరికిన వారినే వెంటబడి వెంటబడి ప్రేమిస్తూ ఉంటాము. వేరే గత్యంతరం లేనందున ఉన్నవాళ్లను వదులుకోలేము.

17. జ్వలిత : మిళింద లో చూసుకుంటే అంతగా స్త్రీవాదం కనిపించలేదు, పురుషులను ప్రొటెక్ట్ చేసినట్లు అనిపించింది ?

మానస : అవును నిజమే మేడం. ఎందుకంటే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేది పురుషులే, ప్రేమలోని విఫలమైన పురుషులే కాదు, రైతులు, స్టూడెంట్స్ ఇలా పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో వారే ఉంటారు. మన దేశంలో ఇది ఎక్కువ.

18. జ్వలిత : సాహిత్య అకాడమీ అవార్డు పొందినందుకు నేటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం లేదా సలహా ?

మానస : దిగువ స్థాయి వర్గాల నుండి, వివక్షను ఎదుర్కొంటున్న వర్గాల నుంచి ఆడపిల్లలు రచయితగా రావాలనేది నా కోరిక తపన… అగ్రవర్ణాల నుంచి రావలసిన సాహిత్యం ఎంతో వచ్చింది. అది ఒక విధంగా Misleadకి దారి తీస్తుంది కూడా. వారంతట వారు రాస్తే తప్పించి మనకు కావలసిన సాహిత్యం ఆ స్థాయిలో వస్తుందేమో అని అనుకుంటున్నాను. బహుజన సాహిత్యం కూడా విస్తృతంగా రావాల్సి ఉంది.

19. జ్వలిత : ఆ కోణంలో మీరు ఎటువంటి బాధ్యత తీసుకుంటారు ?

మానస : బాధ్యత అంటే నాకు పరిచయమైన వాళ్ళను, నా కుటుంబీకులను, తరచూ మీరు రాయండి, మీరు ఎట్లా వస్తే అట్ల రాయండి. ఏమైనా ఉంటే సరిచేయవచ్చు అని అడుగుతూ ఉంటాను, అందరూ రాయలేరు అని నాకు అర్థం అయింది. వారికి చెప్పాను కూడా మీరు రాస్తే దాన్ని కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. కానీ నా సాహితీ సర్కిల్ లో ఎవరు కనిపించినా వెంట పడుతున్నాను. ఎన్నో చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వింటున్నాను. టాపిక్ పట్ల ఒక అవగాహన కోసం పలు రకాలుగా ఆలోచిస్తున్నాను. ఇంకా పరిపక్వత రాలేదేమో అనుకుంటున్నాను.

20. జ్వలిత : బహుజనులు, దళితులు అన్న పదాల మధ్య వివాదం నడుస్తోంది. బీసీలను మీరు వేరే పేర్లు పెట్టుకోండి అని అంటున్నారు. దీని పై మీ అభిప్రాయం ఏమిటి ?

మానస : బహుజనులు అన్న ఈ పదం మీద మనం హాస్యాస్పదమైన కామెంట్స్ వింటూనే ఉంటాము. అయితే ఆ మధ్య జూపాక సుభద్ర బహుజని అనే పేరును కూడా తీసుకొచ్చారు. 

21. కాదు ‘బహుజని’ నేను సూచించిన పేరు.. ఎస్.సి, ఎస్.టీ, బీ.సి, మైనార్టీలంతా బహుజనులైతే.. ఆ వర్గాల మహిళలంతా కలిసి బహుజని కదా అందుకే రవీంద్ర భారతిలో 2017సభ జరిగింది కదా.. ఆ సన్నాహాలప్పుడు.

మానస: ఔనా ! మేడం… మళ్ళీ దాంట్లో ఎందరు ఏకమయ్యారో తెలియదు కానీ, బహుజన స్త్రీలు అనేది వాళ్ళ ఉద్దేశం. ఏమో నేనైతే బహుజనులు అని అంటున్నాను. కొందరు నన్ను కరెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు. బహుజనులు కాదు వారు దళితులు అని కొంతమంది, దళితులు కాదు అని ఇంకొందరు అంటుంటారు. దళిత బహుజన అనేది వివక్షకు సంబంధించినది. దీన్ని నువ్వు ‘నేను బాధితురాల్ని’ అని గర్వంగా ఎలా చెప్పగలుగుతావు. ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. మొన్నటిదాకా అగ్రవర్ణాలు అన్నాం. ఇప్పుడు పీడకులు అంటున్నాం., ఉత్పత్తి కులాలను  శ్రామికులు అని అంటున్నాం. కాలంతోపాటు భాష కూడా సవాళ్ళు విసురుతుంది. నేను ఒక వ్యక్తిగా దళితురాలిని అయి ఉండొచ్చు. కానీ యూనివర్సల్ గా నేను బహుజనురాల్ని. నేను దీన్ని సమర్థిస్తాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీరందరూ కలిస్తేనే బహుజనులు కదా. కాబట్టి కులం కులానికి వారివారి సమస్యలు ఉంటాయి. ఒకరితో మరొకర్ని పోల్చలేం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.