“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష

   -అనురాధ నాదెళ్ల

                                          సుధామూర్తికి వివిధ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, వివిధ వ్యక్తులతో తనకెదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవటం అలవాటు. ఆ అనుభవాలను ఇప్పటికే పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. 

ఈ పుస్తకం కోసం ఆమె కొత్త ఆలోచన చేసారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన కథలను రాయమంటూ పోటీ పెట్టారు. అందులోంచి ఎంపిక చేసిన అద్భుతమైన కథల సంకలనమిది. ఈ వాస్తవ జీవన దృశ్యాలు కల్పనకు అందవు. పుస్తకం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ పూర్తి చేసేవరకూ కట్టిపారేసే గాఢత ఉన్న కథలివి.  

అరుణ పప్పు అనువాదం ఈ కథలకు కొత్త మెరుపునిచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తకంలోని కథలన్నీ మనచుట్టూ ఉన్న జీవితాల్ని చూబిస్తాయి. 

‘’సంతోషి’’ ఒక ట్రాన్స్ జెండర్ కథ. ఆయా పనికోసం వచ్చిన ఆమెను చూసి ఇంట్లో వాళ్లు తర్జనభర్జన పడతారు. ఇంట్లోని పసివాడు మాత్రం ఆమె కళ్లలో, మాటలో స్పష్టమైన ప్రేమను గ్రహించి దగ్గరవుతాడు. ట్రాన్స్ జెండర్ల పై గల చిన్న చూపును, తోటి మనుషులుగా చూడకపోవటం వాళ్ల జీవితాలను ఎంత దుర్భరం చేస్తోందో చెబుతుందీ కథ. వారికి జీవికను చూబించే వాళ్లెవరూ లేక వారి జీవితాలెలా దారిద్ర్యంలో మగ్గిపోతున్నాయో తెలుస్తుంది. ఈ మధ్య ఒక అద్భుతమైన చాయ్ ప్రకటన వీరిపై వచ్చింది. మీలో చాలామంది చూసే ఉంటారు.

                                      ‘’ఎర్ర గులాబి’’ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడైన తాతయ్యను కనిపెట్టుకున్న మనవడు సౌరభ్ కథ. మతిమరుపు వృధ్ధాప్య లక్షణం అని అందరూ తేలిగ్గా అనుకుంటారు. కానీ జీవితాలని తలక్రిందులు చేస్తుందది. ఆత్మీయుల మధ్య ఉండీ ఆ విషయం తెలియని స్థితిలో ఉండటం బాధాకరమైన వాస్తవం. వ్యాధి ఉన్నవారికి, వారి ఆత్మీయులకు కూడా దైనందిన జీవితం ఒక సవాలుగా పరిణమిస్తుంది. కథలో అంతగా చదువుకోని అమ్మమ్మ అల్జీమర్స్ వ్యాధి గురించి అర్థం చేసుకోకుండా ఆయనకేదో అనారోగ్యం అంటూ సాధిస్తుంటుంది. చిన్నప్పుడు తాతతో ఆడుకున్న ఆటలు, చెప్పుకున్న కథలు సౌరభ్ మనసులో గాఢంగా నాటుకుపోయాయి. ఆయనను పసిపిల్లవాడిలా చూసుకోవాలని అమ్మమ్మకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయన్నుచూసుకునే బాధ్యతను ఇష్టంగా తీసుకుని, ఆయన విపరీత ధోరణిలో ప్రవర్తించినా సహానుభూతితో ఆదరిస్తాడు. ఈ సమస్య గురించి మాట్లాడుకోవలసి అవసరం ఉంది.  

‘’చీకట్లో రుతురాగం’’ కథ నాలుగోక్లాసు చదువుతున్న పాప చెప్పేకథ. అది 1947 సంవత్సరం. బడి వదిలిన తర్వాత ఆకాశంలో మబ్బులు చూసి, స్నేహితురాలు మౌనితో కలిసి బడి వెనుక కుంటలో చేపలు పడుతుంది. ఆ రాత్రి భోజనంలో చేపకూరను తలుచుకుంటూ ఇంటిదారి పట్టిన మన కథానాయకి మలుపులో చెట్టు కింద వ్యక్తి ఏడుస్తుండటంతో కారణమడుగుతుంది. అతను గాజుల వ్యాపారి. అమ్మకాలు లేక ఖాళీ చేతులతో ఇంటికెళ్లాలన్న దిగులుతో ఉంటాడు. తనదగ్గరున్న చేపను ఆయనకిచ్చి, మర్నాడు జరిగే ఈద్ పండుగకు తానిచ్చే బహుమతి అంటుంది. ఆయన గాజులు ఇవ్వబోతే కానుక ఇచ్చిన సంతోషాన్ని నువ్వు తీసేసుకుంటూన్నట్టే అని, వద్దంటుంది. దేశవిభజన సమయంలో మత విద్వేషాలు, హింస రేగినపుడు అదే గాజుల వ్యాపారి పాప కుటుంబాన్ని కాపాడి, భారత్ కు వెళ్లే రైలెక్కిస్తాడు. పెద్దయ్యాక ఆ పాప మనవరాలికి ఇదంతా చెబుతూ, చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రేమను ఒక్కసారి పంచాక వృథా పోదంటుంది. ప్రేమకున్న విలువ అది!

                                           ‘’అగ్ని పరీక్ష’’ కథలో మనీషా ఆఫీసులో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదంలో తోటివారంతా మరణించగా తను మాత్రం ప్రాణాలతో బయటపడుతుంది. నెలల తరబడి సాగిన వైద్యం, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి జీవించి ఉన్నందుకు ఒక మంచి దారిని ఎంచుకోవాలనుకుంటుంది. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికోసం కోర్టులో కేసులు నడిపిస్తుంది. చుట్టూ సమస్యలతో ఉన్న ఎందరికో సలహాలనిస్తూ, వారి బాధలను తనవిగా చేసుకుంటుంది. వారికి ఆనందం పంచేందుకే తను పుట్టిందన్నది నమ్ముతుంది. జీవితంలో చిన్న ఆనందాలను ఆస్వాదించటం, అనుభూతులను మరచిపోకుండా ఉండటమే తన విజయరహస్యం అంటుంది. స్ఫూర్తిని నింపే అందమైన కథ.

‘’ప్రేమామృతం’’ కథలో ఒక భూస్వామి కూతురైన అమ్మమ్మ, పేద రైతు కొడుకైన తాతయ్యల 60 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రేమ అనే పదార్థమేదీ లేదనుకుంటాడు వాళ్ల మనవడు. కారణం అమ్మమ్మ తాతయ్య మీద విసిరే వ్యంగ్య బాణాలు. కథానాయకుడి తల్లి మాత్రం అమ్మమ్మ, తాతయ్యల మధ్య గాఢమైన ప్రేమ ఉందంటుంది. తొంభై యేళ్ల వయసులో పక్క తడుపుతున్నాడని ఆయన్ని ఆడిపోసుకుంటూంటుంది గ్లకోమాతో చూపును కోల్పోయిన అమ్మమ్మ. వాళ్లను చూసేందుకు వెళ్లిన కథా నాయకుడు వాళ్లిద్దరూ మౌనంగా తమవైన ప్రపంచాల్లో ఉండటం గమనిస్తాడు. కానీ వారు ఒకరికోసం ఒకరు చూపుతున్న అక్కర చూసి వాళ్ల మధ్య మాటలకు అందని అనురాగం ఉందన్నది గ్రహిస్తాడు. ప్రేమనేది కంటికి కనిపించకుండానే మన చుట్టూ ఉంటుందన్నది అర్థం చేసుకుంటాడు.

                                         ‘’తిరస్కారం విలువ’’ ఒక ప్లాస్టిక్ సర్జన్ కథ. పుట్టుకతో వచ్చిన అవయవాలను తమకు నచ్చినట్టు తీర్చిదిద్దమని కొందరు, సర్జరీ చేసి తమ ఐడెంటిటీని పూర్తిగా మార్చెయ్యమని కొందరు, భార్య వర్జిన్ కాదన్న అనుమానంతో ఆమెను తిరిగి వర్జిన్ గా మార్చమని కొందరు… ఇవి సరైన కారణాలు కావని సర్జరీని నిరాకరిస్తాడు నిజాయితీపరుడైన సర్జన్. వచ్చిన కేసులను పోగొడుతున్నందున తాము ఆర్థికంగా నష్టపోతున్నామని అతని పైవారి ఆరోపణ. దానికి సర్జన్ ‘’తప్పుడు పధ్ధతిని కాదనే హక్కు విలువ అమూల్య’’మంటాడు. నిజాయితీపరులున్నారన్న వాస్తవం సంతోషాన్నిస్తుంది.

‘’కంటిపాప’’ కథలో విభా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్. చిన్నప్పట్నుంచీ ప్రతిదానికీ కోపం తెచ్చుకోవటం, ఎదుటివాళ్లతో యుధ్ధానికి దిగటం అలవాటు. ఇంట్లో తల్లితోనో, అక్కతోనో గొడవ పడుతున్నప్పుడల్లా తండ్రి పిలిచి తన కళ్లద్దాలను వెదికిపెట్టమని అడిగేవాడు. వాటిని వెదికిపెట్టి, తండ్రి మెప్పును పొందుతుంటాడు. పెద్దై ఉద్యోగంలో కుదురుకున్నాక కూడా ధోరణి మారదు. ఒకరోజు తల్లితో ఘర్షణ పడుతున్న విభాని తండ్రి కళ్లద్దాలు వెదకమంటాడు. అకస్మాత్తుగా తండ్రి పిలుపులోని ఆంతర్యం విభాకి తోస్తుంది. తన కోపాన్ని నియంత్రించే ప్రయత్నమని అర్థమవుతుంది. యాంగర్ మ్యానేజ్ మెంట్ వంటి పెద్ద మాటలు కాక తండ్రి అనుసరిస్తున్న సింపుల్ థెరపీ అతనికి నచ్చుతుంది. 

                                        ఆగ్నేయ స్కూల్లో చదువుకుంటున్న ఎనిమిదేళ్ల పాప. ఒకరోజు తన క్లాస్ మేట్ ని గాయపరచిందని తల్లి కొడుతుంది. తండ్రి మాత్రం అలా ఎందుకు చేసేవని అడుగుతాడు. టి.వి.లో చూసిన మహాభారతంలో దుశ్శాసనుడు ద్రౌపది ఆంటీ చీర లాగినపుడు కృష్ణుడు సాయం చేసాడు. క్లాసులో పిల్లవాడు తన గౌను లాగినప్పుడు తనకు తనే సాయం చేసుకున్నానంటుంది పాప. అంతక్రితం మరో పాపకి అలాగే చేసాడని, రేపెవరికీ చెయ్యకుండా తను వాడిని తోసిందని, అనుకోకుండా చేతిలో పెన్సిల్ తో గాయం అయిందని చెబుతుంది. కొత్తతరం అమ్మాయిలు ఇంత ధైర్యంగా ఉన్నందుకు తండ్రి సంతోషిస్తాడు.

‘’నిగూఢ దంపతులు’’ కథలో ఒక పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఒక పడుచుజంటకు మూడేళ్ల పాప ఉంది. అక్కడ ఒక వృధ్ధ దంపతులతో పాప ఇట్టే స్నేహం చేస్తుంది. ఆ వృధ్ధ జంట మిగిలినవారందరితోనూ దూరంగా మసులుతుండటంతో వారు అదోరకం మనుషులని అందరూ విమర్శిస్తుంటారు. ఆ దంపతుల పిల్లలు 1993 బాంబుదాడిలో మరణించారని, దానిని అందరితో పంచుకుని ఆ జాలిని స్వీకరించే ఉద్దేశం లేకనే వారు దుర్ఘటన మరిచి, జీవితాన్ని ముందుకు ధైర్యంగా నడుపుకుంటున్నారనీ పాప తండ్రికి తెలుస్తుంది.

                                          ‘’ఝాన్ను మంకడియా’’ ఆదివాసీ అమ్మాయి ఝాన్ను కథ. ఒరిస్సాలో పేరులేని ఒక గుట్టకింద ఉన్న గ్రామంలో కోతులను చంపి తినే జాతికి ‘’మంకడియా’’ అనేపేరు. ఆ కుటుంబాల్లోని పిల్లలకి హాకీ ట్రైనింగ్ ఇస్తామంటూ పెద్దల్ని ఒప్పించి, తీసుకెళ్లి సౌదీ అరేబియాకు అమ్మే నరరూప రాక్షసుల నుండి బయటపడి తన చొరవతో, తెలివితేటలతో చదువుకుంటుంది. ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి తన తెగలోని పిల్లల్ని చదువుకుందుకు ప్రోత్సహిస్తుంది ఝాన్ను.

‘’సవిత’’ కథలో సవిత, బాధ్యత ఎరుగని త్రాగుబోతు భర్తని భరిస్తూ తన ఒక్కగానొక్క కూతురిని చదివించుకుందుకు ఎంతో శ్రమ పడుతుంటుంది. కానీ కూతురు పదో తరగతి పరీక్షలకి ముందు టైఫాయిడ్ తో చనిపోతుంది. అది సవిత జీవితంలో పెద్ద దెబ్బ. జీవితం నిరాసక్తంగా గడుపుతున్న ఆమెకు పక్కింట్లోని పేద పిల్లవాణ్ని చదివించాలన్న ఆలోచన తిరిగి జీవితం పట్ల ఉత్సాహాన్నిస్తుంది.

                                   ‘’యాసిడ్’’ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా యువతను ఎలా పెడధోరణులకు ప్రేరేపిస్తోందో చెబుతుంది. ఆన్ లైన్ డేటింగ్ సైట్లో పరిచయాలు వ్యక్తిగతంగా కలుసుకోవటం వరకూ నడిచి ఆపైన ఆడపిల్లల్ని నయానోభయానో మోసగించేవరకూ వెళ్లటం చూస్తాం. పరిచయమైన వ్యక్తి అమ్మాయిని ప్రేమించమంటూ బలవంతం చెయ్యటం, కాదంటే యాసిడ్ పోయటం జరుగుతుంది. మోసపోయిన అమ్మాయి కోర్టుకెళ్లి పోరాడి తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకుంటుంది. కానీ కోర్టు సూచించినట్టు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందుకు నిరాకరిస్తుంది.

‘’పునర్జన్మ’’ కథలో ఆఫీసు ముగిసి, సాయంకాలం లోకల్ ట్రైన్ లో బయలుదేరిన అమ్మాయి ప్రమాదవశాత్తూ నడుస్తున్న రైల్లోంచి కిందపడిపోతుంది. సాయం కోసం ఎదురుచూడక, చీకట్లో ధైర్యం తెచ్చుకుని నడక మొదలెడుతుంది. ఎదురొచ్చే రైలుని ఆపి, రైల్వే పోలీసుల సాయంతో హాస్పిటల్ కి చేరుతుంది. క్షేమంగా ఇంటికొస్తుంది. తనకెదురైన ప్రమాదం సంగతి ఎవరు పట్టించుకుంటారనుకున్న తన ఆలోచన తప్పని రుజువవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటవెంటనే జరిగిన సంఘటనలను, వ్యక్తులను తలుచుకుని కృతజ్ఞతతో తనకు ఆ రాత్రి పునర్జన్మ దొరికిందనుకుంటుంది. మనుషులున్నన్నాళ్ళు మానవత్వమూ ఉంటుంది మరి!

‘’మురికి వదిలింది’’ అర్థరాత్రి వానలో ఒక ఇరవై ఏళ్ల అమ్మాయిని భద్రంగా తల్లిదండ్రులకు అప్పగించిన మురికివాడ కుర్రాళ్ల కథ. అటువంటివారి పట్ల ఉండే అపనమ్మకాన్ని బద్దలుకొట్టిన కథ. ‘’అమూల్యమైన ప్రేమ’’ కథలో ఒక తుఫాన్ వెలిసిన సాయంకాలం పదేళ్లలోపున్న ముగ్గురు పిల్లలు రాలిపడిన మామిడికాయలను, జామకాయలను పోగుచెయ్యటం ఒక పెద్దాయన గమనిస్తాడు. వాటిని అమ్మి, ఆ డబ్బుతో తల్లి పుట్టినరోజుకు ఒక బహుమతి కొనాలన్న వారి ఆశను తెలుసుకుంటాడు. మంచిమనసుతో తనకు చేతనైన సాయం వాళ్లకు తెలియకుండానే చేసి తన యాభైరూపాయలకు అంతులేని విలువను పెంచుకుంటాడు.

 ఈ కథలన్నీ ఆర్ద్రత నిండిన కథలు. మనిషి కథలు. మానవత్వంతో గుబాళించే కథలు.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.