ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత

(మాలతి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న సీనియర్ డయాస్పోరా రచయిత్రి. తెలుగులో ఆరు కథాసంపుటాలు, నాలుగు వ్యాస సంకలనాలు, ఒక కవితాసంపుటి ప్రచురించారు. “ఎన్నెమ్మ కతలు”  పేరిట నాలుగు సంపుటాలు రాశారు. ఆంగ్లంలో విరివిగా రచనలు, అనువాదాలు  చేశారు. 

2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. 

వీరి రచనలు:

నవలలు

 • మార్పు నవల
 • చాతక పక్షులు

కథాసంకలనాలు 

 •  కథామాలతి 1
 • కథామాలతి 2  
 •  కథామాలతి 3 
 • కథామాలతి 4 
 • కథామాలతి 5
 • కథామాలతి 6
 • ఎన్నెమ్మకతలు మొదటి భాగం
 • ఎన్నెమ్మకతలు రెండో భాగం
 • ఎన్నెమ్మకతలు మూడో భాగం
 • ఎన్నెమ్మకతలు నాలుగో భాగం

కవితాసంపుటి 

కవితామాలతి

వ్యాస సంకలనాలు

 • వ్యాసమాలతి మొదటి భాగము
 • వ్యాసమాలతి రెండవ సంపుటము
 • వ్యాసమాలతి మూడవ సంపుటము
 • వ్యాసమాలతి  నాల్గవ సంపుటము
 • ఇంతే సంగతులు

ENGLISH: 

 • Telugu Women Writers, 1950-1975, Analytical study. (Revised 2021)
 • Eminent scholars and other essays (anthology of articles published on thulika.net.)
 • All I Wanted was to Read (short stories)
 • My Little friend (short stories)

నిడదవోలు మాలతి గారితో డా||కె.గీత రాతపూర్వక ముఖాముఖిని నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. 

 

 • మీ బాల్యం, విద్యాభ్యాసం, జీవిత నేపథ్యం గురించి చెప్పండి. 

 

నాబాల్యం నాకు అట్టే జ్ఞాపకం లేదు. నాకు 10 ఏళ్ళు వచ్చేవరకూ అడయారులో ఉండేవాళ్లం. మానాన్నగారు, నిడదవోలు జగన్నాథరావుగారు, అక్కడ Theosophical Society Schoolలో mathematics teacherగా పని చేసేరు. బహుశా ఆ Society విలువలు మానాన్నగారినీ, అమ్మ శేషమ్మగారినీ ప్రభావితం చేసేయనుకుంటాను. 

ఆరోజులలో చాలామంది ఆడపిల్లలకుండే నిబంధనలు, నాకూ మాఅక్కయ్యకీ లేవు. నువ్వు ఆడపిల్లవి, సైకిలు తొక్కకూడదు, చెట్లెక్కకూడదు, నవ్వకూడదు, చలం పుస్తకాలు చదవకూడదు వంటి ఆంక్షలు లేవు. 

పదేళ్లవరకూ అక్కడ ఉన్నాం అని చెప్పేను కదా. ఆ తరవాత మానాన్నగారు ఆ ఉద్యోగం మానేసేరు. ఎందుకో నాకు తెలీదు. 

అప్పటికి మాఊరు బరంపురం అనే చెప్పుకునేవాళ్లం. మానాయనమ్మ, చిన్నాన్నగారు అక్కడే ఉండేవారు. పొలాలు కూడా ఉండేవనుకుంటాను. మేం ఐదుగురం–ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరం అక్కచెల్లెళ్ళం. నేను నాలుగో సంతానం. ఇంతకీ, చెప్పుకోడం బరంపురం అన్నా, మానాన్నగారు ఉద్యోగం మానేసేక, మేం అక్కడికి వెళ్ళలేదు. 

విశాఖపట్నంలో మాఅమ్మకి తాతగారు కట్టించి ఇచ్చిన మేడకి మారేం. 

ఆ ఏడు నేను ఆరోతరగతిలో చేరాలి కానీ admissions time దాటిపోవడంచేత, ఐదోక్లాసులో చేర్పించింది మాఅమ్మ నన్ను. అలా నేను 5వతరగతి రెండుసార్లు చేసేను.  మిగతాపిల్లలచదువులు ఏమయేయో నాకు జ్ఞాపకం లేదు. 

ఆ మరుసటిసంవత్సరం మానాన్నగారు మంగళగిరిలో ఉద్యోగంలో చేరేరు. మంగళగిరిలో 

నాలుగేళ్ళున్నాం. అంటే 4వ ఫారం (9వ తరగతి)వరకూ. అక్కడే కథల అత్తయ్యగారుగా నాకథలలో ఆవిష్కృతమైన రామడుగు లలితాంబగారు పరిచయమయేరు. ఎలా అయిందో చెప్పలేను కానీ నేను స్కూలికి వేళ్లేదారిలో వాళ్లఇల్లు. లలితాంబగారూ, ఆవిడభర్త నరసింహంగారూ ఉండేవారు. వారికి ఒక అబ్బాయి రాధాకృష్ణమూర్తి బెంగుళూరులో చదువుకుంటూఉండేవాడు. 

నేను రోజూ స్కూలు అయిపోయినతరవాత ఇంటికొచ్చి కాఫీ తాగి వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఆవిడ మడి కట్టుకుని వంట చేస్తూ నాకు కథలు చెప్పేవారు. 

ఆ తరవాత మానాన్నగారు చాలా ఊళ్ళలో ఉద్యోగం చేసేరు. నేను యస్.యస్.యల్.సి పరీక్ష ఫెయిలవడంతో, మాఅమ్మ ఇలా ఊళ్ళు తిరుగుతుంటే పిల్లల చదువులు పాడయిపోతున్నాయని విశాఖపట్నంకి మళ్లీ  మార్చింది కాపురం. నాయూనివర్సిటీ చదువు అయేవరకు అక్కడే ఉన్నాను. 

ఆరోజుల్లోనే మాఅమ్మవెంట తిరుగుతూ రామాయణభాగవతాలవంటి గ్రంథాలలో విశేషాలు నామమాత్రంగా తెలుసుకున్నాను. నేను ఆ గ్రంథాలేమీ చదవలేదు. అంతా శృతపాండిత్యమే. 

 

 •  రాయాలనే  ఆసక్తి  ఎప్పుడు, ఎలా మొదలయ్యింది

నాహైస్కూలు చదువు ముగిసేవేళకి విశాఖపట్నంలో ఉన్నాం. మనకి స్వాతంత్ర్యం వచ్చేక, దేశ పునఃనిర్మాణ కార్యక్రమాలలో భాగంగా స్త్రీవిద్య ప్రోత్సహించేరు అప్పట్లో. అందులో భాగంగా పత్రికలు స్త్రీల రచనలను ప్రోత్సహించేయి. 

నేను రచయిత్రులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలామంది తమ రచనలు పత్రికలను పంపినవి పంపినట్టు వేసేసుకున్నారు అన్నారు. ఒక పత్రిక కాకపోతే మరో పత్రిక – తమరచనలు ఏదో ఒక పత్రికలో ప్రచురణ తథ్యం అన్నారు. ఇది వినగానే మొదట అభినందనీయంగానే వినిపించినా, ఆలోచిస్తే అది స్త్రీలను ప్రోత్సహించడంగా కూడా తోస్తుంది. 

నేను కూడా బహుశా ఆ ఊపులోనే రాయడం మొదలుపెట్టి ఉంటాను. సాధారణంగా పది కథలు చదివితే ఒక కథ తోస్తుంది. ఆకథలగురించి ఆలోచిస్తుంటే అలా కాదు మరోలా  రాసిఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మరోకథకి నాంది అవుతుంది. నేను విశేషంగా పత్రికలు చదివేదాన్ని. కానీ ఆ కథలగురించి చర్చించడానికి నాకు ఇంట్లో కానీ స్నేహితులలో కానీ ఎవరూ లేరు. అంచేత నాకు నేనే ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. 

ఆలోచన వచ్చేక పంచుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. పత్రికలతోనే నాఆలోచనలు పంచుకున్నాననుకోండి. 

 

 • కవిత్వం మీద ఆసక్తి ఎలా కలిగింది?

కవిత్వంమీద ఆసక్తి కలిగిందని చెప్పలేను. కథకి సంఘటనలు కావాలి. కథకి చాలినంత సంఘటనలు లేని ఆలోచనలు ఏదోవిధంగా వ్యక్తం చేయడమే నాకవిత్వం అనుకుంటాను. కొన్ని వాక్యాలు – దేనికదే ఒక భావాన్ని వ్యక్తం చేస్తూనే – సమష్టిగా మరొక విస్తృత భావాన్ని వెలికి తెస్తాయి. కథకి కావలసినంత సరుకు లేకపోతే కవితలా రాసేననుకోండి. 

నిజానికి నాకవితలని కవితలు కావు అన్నవారు కూడా ఉన్నారు. నా ఈ ప్రక్రియకి మరేదేనా పేరు ఉంటే బాగుండు.

 

 • తొలికథ నుండి తొలి కథా సంపుటి వరకు మీ ప్రస్థానం చెప్తారా?

తొలికథ ఊరికే ఏదో రాయాలనిపించి రాసిందే. పైన చెప్పినట్టు అనేకకథలు చదివేక, ఏదో ఒక సంఘటన తీసుకుని రాసిందే అనుకుంటా. నేను 5వ ఫారం చదువుతున్నరోజులలో స్కూలు మేగజైనుకి చాదస్తం అని ఒక కథ రాసేనని ఈమధ్యనే ఒక స్నేహితురాలు చెప్పింది. నాకు జ్ఞాపకం లేదు. అతరవాత తొలి కథ, కథ కాదు, చిన్న స్కెచ్ రాద్ధాంతం అని రాసి తెలుగు స్వతంత్రకి పంపించేను. అది 1953లో. వాళ్ళు వెంటనే వేసుకున్నారు. దానితో ఉత్సాహం వచ్చి అలాటివి నాలుగైదు రాసేను. ఈనాటి కార్డుకథలలాటివి. 

తొలి సంపుటం, నిజానికీ ఫెమినిజానికీమధ్య, BSR Publications, విజయనగరం, వారు ప్రచురించేరు. దానిలో నాప్రయత్నం ఏమీ లేదు. నాకథలు చదివిన సాయిపద్మ, వాళ్ల నాన్నగారిపేరుమీద నడుపుతున్న ప్రచురణసంస్థ ద్వారా ప్రచురించేరు. అంతకు పూర్వం నాకు వారితో పరిచయం లేదు. 

 • మీ కథలలో మీకు ఇష్టమైనదేవిటి? ఆ కథా నేపథ్యం చెబుతారా

నేను రాసిన కథలన్నీ నాకు ఇష్టమే. ఏదో ఒకవిషయం మనసుని గట్టిగా తాకితే, దాన్నిగురించి అందరికీ చెప్పాలనిపిస్తే రాసినవే కదా. ఒకొకప్పుడు చాలా చిన్న సంఘటన స్ఫూర్తినివ్వొచ్చు. ఒకొకప్పుడు ఎవరో ఒకరన్నమాట చాలు కథ అల్లడానికి. 

ఉదాహరణలు చెప్పాలంటే, ప్రాప్తం తీసుకోండి. అందులో నిజంగా జరిగిన సంఘటనలేమీ లేవు. మాఇంట్లో సంపెంగచెట్టు ఉండేది. మాఇంట్లో పనిమనిషి ఏవో కబుర్లు చెబుతూండేది. కాలేజీలో ప్యూను ఒకసారి సంపెంగపూలు అడిగేడు. వాళ్లమాటలలో నాకు గోచరించింది మనరచయితలెవరూ వాళ్ళకోణంలోంచి వాళ్ళజీవనవిధానం, ఆలోచనలు గమనించడం లేదని. మధ్యతరగతి విలువలతో వాళ్లకి మంచి బట్టలు లేవు, మంచి ఇళ్ళూ, తోటలూ లేవు అంటూ తమ సాంఘికవిలువలు వాళ్లకి అంటగట్టి వాళ్ళజీవితాలను కొలుస్తున్నారు. ఉన్నదాంతో, ఉన్నదాంట్లోనే వాళ్లు సంతృప్తిగా బతుకుతున్నారని నాకనిపించింది. ఒకరకంగా నన్ను నేను వాళ్ళతో పోల్చుకుంటున్నానేమో కూడా. 

అలాగే విషప్పురుగు. తిరుపతి యూనివర్సిటీ లైబ్రరీలో ఒక ప్యూను ఉండేవాడు. లైబ్రరీ కొండచరియలో ఉంది. లైబ్రరీలో water coolerవెనక పాములు చేరేవి. అతను ఆ పాములను బట్టి దూరంగా తీసుకుపోయి వదిలేసేవాడు. 

ఒకరోజు ఒక పాముని మాయింటికి తీసుకొచ్చేడు అదేమీ చేయదండీ అమ్మగారూ అంటూ. నిజంగా జరిగింది అంతే. నాకథకి అతనే స్ఫూర్తి కానీ కథలో సంఘటనలన్నీ కల్పనే. నాచుట్టూ ఉన్న మనుషులు సాధారణంగా మాటాడుకునే మాటలు విని, నాకథల్లో చొప్పిస్తాను.

చిరుచక్రం కూడా స్కూల్లో ప్యూనుని చూసి రాసేనే కానీ దానికి ప్రత్యేకంగా ఒక ప్యూను కానీ ఒక సంఘటన కానీ స్ఫూర్తి కాదు. సుమారుగా సమాజంలో జరుగుతున్న సంఘటనలూ, ప్రజలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలూ చూసి, ఈ కిందితరగతి జనం అనిపించుకున్నవారు కూడా మనుషులే, ఒకింత ఎక్కువ జీవితాన్ని అర్థం చేసుకున్నవారేమో కూడా అని అనుకుని అదే అభిప్రాయం ఆవిష్కరించడానికి ప్రయత్నించేను. 

 

 చిన్నప్పట్నుంచీ నామటుకు నేను నాలో నేను ఆలోచించుకుంటూ ఓమూల కూర్చోడమే కానీ నలుగురితో ఆటపాటలతో కాలక్షేపం చేయడం లేదు. అందువల్ల జరిగిందేమిటంటే ఇంట్లోనూ స్కూల్లోనూ పనివాళ్ళు నాతో మాటాడేవారు. వాళ్లేం చెప్పినా మాటాడుకుండా వింటానని కావచ్చు. అలా వాళ్లమాటలు విన్నప్పుడు నాకనిపించింది వాళ్లు కూడా మనుషులే, వాళ్లకీ ఇష్టాయిష్టాలు, ఆదరాభిమానాలు అన్నీ ఉంటాయి అని.  

 

 • మీ కథలలో ఈ కథ ఎందుకు రాశానాఅని మథన పడినది (లేదా) “గొప్ప కథఅని సంతృప్తి పడినది ఉన్నాయా? ఉంటే వివరాలు చెప్పగలరా

గొప్పకథ అనను కానీ నాకు సంతృప్తి కలిగించిన కథలు పైన చెప్పేను. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటి, బహుశా ఈ కథలు బాగులేవు అనిపించినవి – బాలతార, ఆడమనసు, మా మే స్త్రీత్వం. 

బాలతార – ఆరోజుల్లో సినిమాల్లో పిల్లలు వయసుకి మించిన మాటలు మాటాడడం, కొన్ని అతిపోకడలు పోవడం చూస్తే, సినిమాలలో నటించడం వాళ్ల మనస్తత్వాలమీద అవాంఛనీయమైన ముద్రలు వేస్తుందేమో అన్నఊహతో రాసినకథ అది. ఇప్పుడు ఆలోచిస్తే ఆకథలో అమ్మాయిమీద అత్యాచారం సరైన అవగాహన లేకుండా రాసేను  అనిపిస్తోంది.

ఆడమనసు, మా మే స్త్రీత్వం కథలలో ఆత్మీయతలు, అభిమానాలు స్త్రీల బలహీనత అన్న ధ్వని కనిపిస్తోంది ఇప్పుడు చూసుకుంటే. అంచేత నాకు నచ్చలేదు. శిల్పందృష్ట్యా మాత్రం నా ఇతరకథలకి తీసిపోవు. 

మరోఅంశం రచనలపట్ల నాదృష్టి కూడా ఇక్కడే చెప్తాను. ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా నాస్థాయి ఏమిటి, పాఠకులస్పందనలు ఎలా ఉన్నాయి, వారు నాకథల్లో ఏమి ఆశిస్తారు అన్న ఆలోచనలు ఉండేవి కావు, రాసి పత్రికకి పంపడంతో నాపని అయిపోయేది. ఇప్పుడు అంతర్జాలంమూలంగా పాఠకులు ఏమనుకుంటున్నారో క్షణాలమీద తెలిసిపోతోంది. అంచేత ఎవరికి ఏవి నచ్చుతాయో, ఎలా రాస్తే ఏ పత్రికలు వేసుకుంటాయో తెలుస్తోంది. అంచేత ఎలా రాస్తే ఎవరు ఎలా స్పందిస్తారు అనుకుంటూ రాయవలసివస్తోంది. అంటే నాపద్ధతి మార్చుకున్నానని కాదు కానీ కొంత సంయమనం పాటిస్తున్నాను. 

ఎవార్డులు, పురస్కారాలు ప్రకటనలు చూసినప్పుడు అవి అందుకున్నవారికథలకి నాకథలు ఏమి తక్కువ అన్న సందేహం కలుగుతోంది. కారణాలు అనేకం ఉండొచ్చు. నా పరిస్థితులూ, జీవితంలోనూ సమాజంలోనూ సాహిత్యరంగంలోనూ వచ్చినమార్పులూ ఇలా ఎన్నో ఉండొచ్చు. జీవితంలో చరమదశకి చేరుకున్నాక నేను సాధించినదేమిటి అన్న ప్రశ్న రావడం సహజమే కదా.

 

 1. మీ రచనల మీద ఎవరి ప్రభావం ఉంది? 

రావిశాస్త్రి, మధురాంతకం రాజారాం రచనలు చదువుతున్నప్పుడు నేను ఇలా రాయగలిగితే బాగుండు అన్న ఆలోచనలు కలిగేవి. వారి కథలలో ఇతివృత్తంకంటె శైలి నాకు చాలా నచ్చుతుంది. నిజానికి వస్తువు కంటె శైలి ఒక మెట్టు పైనే అని నాఅభిప్రాయం. ఉదాహరణకి మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల్లో కొన్ని నాకు వస్తువు నచ్చకపోయినా ఆయన రాసే శైలివల్ల నచ్చేయి. 

రావిశాస్త్రిగారి కథలు వచనకవితలు. అతితేలిక పదాలతో అత్యంతబలంగా మనసులో నాటుకుంటాయి ఆయనకథల్లో వాక్యాలు. ముఖ్యంగా ఏ చదువూ లేని ముత్యాలమ్మ, నూకాలమ్మ మాటాడే మాటలు ఎంతో అర్థవంతం. నేను సృష్టించిన సంద్రాలు పాత్రకి రావిశాస్త్రిగారి స్త్రీపాత్రలే స్ఫూర్తి. ఆయనలాగే నేను కూడా చదువురాదు అని మనం తేలికగా చూసే మనుషులలో ఎంత తెలివితేటలు ఉన్నాయో అనుకుంటాను. అంటే ఆయన ఈ అభిప్రాయం వెలిబుచ్చేరు అని కాదు. చదువురానివారిలో అంతటి మేధ చూపించేరు అంటున్నాను.

 

 • మీరు అమెరికా వచ్చాక మీరు చేసిన రచనలు, భారతదేశంలో వుండగా చేసిన రచనలకి మధ్య వ్యత్యాసం ఏవిటి

నేను ఎక్కడ ఉన్నా, నాచుట్టూ ఉన్న మనుషులతత్త్వాలనూ, జీవనవిధానాలను, నిత్యజీవితంలో వారు ఎదుర్కొనే సమస్యలనూ, వాటిని పరిష్కరించుకునేతీరులో వైవిధ్యాన్ని పరిశీలించి ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. వారి వారి ప్రవర్తనలూ, ఆ ప్రవర్తనలకి వెనక కారణాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను. అంచేత వస్తువుదృష్ట్యా ఈ రెండు సంస్కృతులలో వ్యత్యాసాలు నాకు ప్రధానం అయేయి. 

అమెరికా రాగానే నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది మనవాళ్ళకి అమెరికా అంటే ఉండే అపోహలు. కొంతకాలం అయేక అమెరికనులకి కూడా మనవాళ్ళంటేనూ, మనదేశం అంటేనూ మనవాళ్లలాగే చాలా అపోహలున్నాయని తెలిసింది. 

ఆ అపోహలను నామమాత్రంగానైనా తొలగించాలన్న అభిప్రాయంతో కథలు రాసేను. 

వస్తువు దృష్ట్యా అదే వ్యత్యాసం అనుకుంటాను. 

నేను అమెరికా జీవనస్రవంతిలో మమైక్యం అవలేదు. అంచేత ఇక్కడి సంగతులు నిజంగా నాకు అట్టే తెలీవు. కేవలం నాపరిధిలో నూతిలో కప్పలా చూసిన జనాన్నిబట్టే నాఅవగాహన. అదే కనిపిస్తుంది నాకథల్లో.

 

శైలిదృష్ట్యా చెప్పాలంటే, ఇండియాలో ఉన్నప్పుడు ఒక విధమైన అమాయకత్వంతో(ఇది ఇక్కడికి వచ్చేక కలిగిన అభిప్రాయం) రాసేను. అప్పట్లో నావ్యక్తిత్వానికి అనువైన ఆలోచనలూ, ఇష్టమైన హాస్యం పంచుకున్నాను పాఠకులతో. అమెరికా వచ్చేక రాసిన కథల్లో సంస్కృతిపరమైన ఆలోచనలతోపాటు, వైయక్తికమైన కోపం వ్యంగ్యాత్మకంగా వ్యక్తమవుతోంది. 

భాష – ఇండియాలో ఉన్నప్పుడు సునాయాసంగా తెలుగుపదాలు దొర్లేవి. ఇప్పుడు శ్రమ పడి జ్ఞాపకం చేసుకోవలసివస్తోంది. తరుచూ నిఘంటువు కూడా చూస్తున్నాను నాకు కావలసిన తెలుగుపదంకోసం.  అనాటి కథల్లో ఇంగ్లీషుపదాలు ఉన్నాయి, ఈ కాలపురచయితలు వాడుతున్నంత విస్తృతంగా మాత్రం కాదు. ఇప్పుడు పని గట్టుకు ఇంగ్లీషుపదాలు రాకుండా చూసుకుంటున్నాను. 

 

 • అమెరికా స్థానిక సమాజంలో ఏ కథా/కవితా వస్తువులు మిమ్మల్ని బాగా కదిలించాయి? 

కథా? కవితా? అని కాదు కానీ, స్థూలంగా సంస్కృతిగురించిన ఆలోచనలు చేస్తాను. మనసంస్కృతికీ అమెరికాసంస్కృతికీ మధ్య గల తేడాలూ, అంతర్గతంగా ఉన్న సామ్యాలూ ఎత్తి చూపడానికి ప్రయత్నించేను. వారిదో మనదో గొప్పసంస్కృతి అని కాక, అవగాహనకోసం మాత్రమే రాసేను. మనుషులందరికీ మనోవికారాలూ, ఈతిబాధలూ ఒకటే. ఆశలూ, ఆశయాలూ, ఆకలీ, కోపం ఇవన్నీ అందరికీ ఉంటాయి. తేడాలు వాటిని పరిష్కరించే విధానంలో కనిపిస్తాయి. ఈ అంశం నాకథల్లో ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. తగినన్ని సంఘటనలు ఉంటే కథవుతుంది. కేవలం ఆలోచనలపుట్ట అయితే కవిత అవుతుంది. 

 

 • అమెరికా రచయితలు స్థానిక సమస్యల మీద కంటే నాస్టాల్జియా మీదే ఎక్కువగా రచనలు చెయ్యడానికి కారణం ఏవిటి

ఈ నాస్టాల్జియామీద చాలా చర్చలే జరుగుతున్నాయి కానీ నాకు అదొక చర్చనీయాంశంగా తోచదు. కథలో ప్రధానాంశాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించారా లేదా అన్నదే చూస్తాను నేను. 

ఎందుకంటే ఈ నాస్టాల్జియా అనబడే వస్తువు ఏమిటి? గతానికి సంబంధించిన ఆలోచనలు. ఇది మరొకదేశానికే పరిమితం కాదు. నాచిన్నప్పుడు అంటూ మొదలుపెట్టి మనదేశంలోనే గతాన్ని స్మరించుకునే కథలు చాలా ఉన్నాయి కదా. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అని పాడుకుంటే, ఎందుకీ నాస్టాల్జియా? అని ఎవరూ అడగడం లేదు కదా! 

గతాన్ని వర్తమానంతో పోల్చుకోడం మానవులరక్తంలో ఇంకిపోయి ఉంది. ఏ రచయిత అయినా వస్తువు ఎన్నుకోడం అన్నది ఆ రచయితకి పరిచితమైన పరిసరాలమీదా, గమనించేవిషయాలమీదా, అవగాహనాస్థాయిమీదా, ప్రతిభమీదా ఆధారపడి ఉంటాయి. అంతర్జాలం మితి లేనంతగా అవకాశాలు కల్పించింది చదవడం, రాయడం వచ్చిన ప్రతివారికీ రాయడానికి. అంచేత ఎవరి అనుభవాలు వారు తమకి అనువైన పద్ధతిలో రాస్తున్నారు. బహుశా నేనిలా అంటే బాగుండదేమో కానీ ఎక్కువ నాస్టాల్జియా కథలు కనిపించడానికి కారణం ఎక్కువమంది రాయడమే. చాలామందికి తమ అనుభవాలు పంచుకోడమే ధ్యేయం. దానికి పత్రికాసంపాదకులు ప్రోత్సహిస్తున్నారు. ఇది తప్పు అనడం లేదు నేను. మీప్రశ్నకి నాకు తోచిన సమాధానం చెప్పేనంతే. స్థానికసమస్యలు చర్చించకపోవడానికి కూడా కొంతవరకూ తమగతంలోని ఆలోచనలు వదిలించుకోలేకపోవడం కావచ్చు. చిన్నప్పట్నుంచీ అలవాటయిన నీతిసూత్రాలు అంత త్వరగా వదలవు. సంప్రదాయవిరుద్ధమైన జీవనసరళిగురించి మాటాడితే ఎవరేం అనుకుంటారో అన్న పిరికితనం కూడా కావచ్చు. 

పాఠకులలో కూడా చాలా మార్పు వచ్చింది కానీ అది నారచనలమీద ఎలాటి ప్రభావం చూపలేదు. నేను నాకలవాటైన పద్ధతిలోనే రాసుకుపోతున్నాను. 

 

 • సీనియర్ డయాస్పోరా రచయిత్రిగా అమెరికాలో మీ అనుభవాలేంటి

నేను డయాస్ఫొరా రచయిత్రిని అవునో కాదో నాకు తెలీదు. అసలు ఈ డయాస్ఫొరాకి నిర్దుష్టమైన నిర్వచనం ఏమిటో నాకు తెలీదు. అమెరికాలో ఉన్నా, నా ఆలోచనలలో అట్టే మార్పు లేదు. మనదేశంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించేనో ఇప్పుడూ అలాగే ఆలోచిస్తున్నాను. నాఆలోచనలమీద స్థానిక జీవనవిధానం తాలూకు ఛాయలు కనిపిస్తే అవి నామమాత్రమే. నాకు నేను కావాలని పని గట్టుకు తెచ్చిపెట్టుకున్నవి కావు.   

అనుభవాలమాటకొస్తే, కథలకి నేను ఎంచుకున్న వస్తువులు, ఆవిష్కరించినవిధానం ఈనాటి పాఠకులని మహోధృతంగా పట్టి ఊపేసేవి కావు అనిపిస్తోంది స్పందనలు చూస్తే. సంపాదకులు, నాపేరు తెలిసినవారే కనక, ప్రచురించుకుంటారు కానీ  ఎంతమంది చదువుతున్నారో తెలీదు. అట్టే వ్యాఖ్యలుండవు. ఈనాడు అందరికీ కావలసిన సాంఘికస్పృహ పేరున గృహహింస, దళితవాదంవంటివి ఆసరా చేసుకు ఆవిష్కరించినకథలు కాకపోవడం ఒక కారణం కావచ్చు.  

 

 • మీరు ప్రత్యేకించి  స్త్రీ సమస్యల మీద రచనలు చెయ్యడానికి కారణం ఏవిటి?

నేను ప్రత్యేకించి ఏదీ స్త్రీలసమస్య గురించి రాయాలనుకుని రాసినది లేదు. స్త్రీలను ప్రధానపాత్రగా చేసి రాసినకథలు కొన్ని ఉన్నాయి. ఉదా. మంచుదెబ్బ, నవ్వరాదు, జీవాతువు, ఫలరసాదుల గురియవే చెప్పుకోవచ్చు. కానీ వీటన్నటిలోనూ నేను ఆవిష్కరించడానికి ప్రయత్నించింది ఆ స్త్రీల మనోదారుఢ్యమే. కష్టాలు అందరికీ వస్తాయి. మీరు ఏమనిషిని కదిలించినా, ఏదో ఓ కష్టం చెప్పకపోరు. 

నేను నాకథల్లో స్త్రీలు తమ కష్టాలను, బాధలను ఎలా ఎదుర్కొన్నారో చూపించడానికి ప్రయత్నించేను. ఈనాటి పాఠకులదృష్టి ఆ కష్టాలమీదా, బాధలమీదా మాత్రమే ఉండడం, తదనుగుణంగా వారు సానుభూతో ఆగ్రహమో ప్రకటించడం జరుగుతోంది. 

  నాదృష్టిలో మార్పు వ్యక్తిద్వారా రావాలి. వస్తుంది. సంఘాలూ, ఏదో ఒకవాదం పుచ్చుకు ఏర్పడ్డ సమూహాలూ చేయగలగింది మరిన్ని వాగ్వాదాలకి దారి తీయడమే కానీ ప్రత్యేకంగా ఏ ఒక్కరికీ ఒరిగేది చాలా తక్కువ. అస్సలు లేదనను కానీ చాలా తక్కువ. 

వ్యక్తులు తమకి తాము ఆలోచించుకుని మనోబలం సంతరించుకోవాలి. ఈనాడు మన విద్యావిధానం కానీ ఈ సంఘసంస్కర్తలు కానీ అది సమకూర్చడం లేదు. నీకిది మంచిది, నువ్విలా చేయాలి అని తామే నిర్ణయాలు చేస్తున్నారు. అది ఆరోగ్యకరం కాదనే నాఅభిప్రాయం.

సూక్ష్మంగా చెప్పాలంటే సంఘంకంటె వ్యక్తే బలవంతుడు. విద్యా, తల్లిదండ్రులూ ఇవ్వవలసిన శిక్షణ అదీ.

ఆనందారామంగారు ఒకవ్యాసంలో (సిద్ధాంతవ్యాసం అనుకుంటా, సరిగా జ్ఞాపకం లేదు), స్త్రీలసమస్యలకి తప్పు ఆడవారిదీ కాదు, మగవారిదీ కాదు. సంఘానిది”, అన్నారు. ఆడవాళ్ళూ, మగవాళ్లూ లేకపోతే ఇంక సంఘం ఎక్కడుంది? వారూ వీరూ కలిసినదే కదా సంఘం. సంఘానిదే తప్పు అంటూ తప్పుకోడం పిరికివారిలక్షణం. 

 

 • ఎటువంటి స్త్రీ సమస్యల మీద రచనలు చేశారు?

పైన చెప్పేను ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూపడం నాఉద్దేశం కాదు.  ఆ పరిస్థితులలో వాళ్లేం చేసేరో గమనించడమే ముఖ్యం. ఒక మనిషిగా సంఘంలోనూ, కుటుంబంలోనూ తనకొచ్చిన కష్టాలు ఎలా ఎదుర్కున్నారో చూపిస్తాను నేను. నాధ్యేయం స్త్రీని ఒక మనిషిగా తనకొచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కొన్నారో చూపడం మాత్రమే.. 

నవ్వరాదు కథలో కమలిని, జీవాతువులో అరుంధతి, మంచుదెబ్బ కథలో వకుళ నానాబాధలూ పడ్డారు. అయితే అప్పుడు వారేం చేసేరు అంటే – కమలిని నవ్వుతోనూ, వకుళ మౌనంతోనూ, అరుంధతి ఉదాసీనతతో భరించడంలోనూ వాళ్ళ బాధలని తమవైన వ్యక్తిత్వాలతో ఎదుర్కొన్నారనే. కానీ పాఠకులకి వాళ్ళంటే జాలే తప్ప, వారి ఆత్మస్థైర్యం కనిపించలేదు. కొందరు అలా కాక ఇలా చేయొచ్చు అంటారు కానీ ఆ రోజులలో పరిస్థితి ఇదీ అని గమనించాలి. ఉదాహరణకి కమలిని కానీ వకుళ కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టు చూపించవచ్చు అంటున్నారు ఈనాటి పాఠకులు. అలా వెళ్ళిపోతే బతకగల సామర్థ్యం ఉండాలి కదా వారికి. ఆరోజులలో అలాటి వసతి ఉందా అని ఆలోచించరు.

 

 •  అమెరికాలో స్త్రీల సమస్యలకి, భారతదేశంలో స్త్రీల సమస్యలకి మధ్య తేడాలు  ఎటువంటివి

తెలీదండి. అక్కడా ఇక్కడా కూడా నూతిలో కప్పలా ఉండిపోయేనే కానీ సంఘంలో హడావుడిగా కలియతిరుగుతూ సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించే పని పెట్టుకోలేదు.

 

 • కుటుంబం, సమాజం స్త్రీ మీద రుద్దుతున్న వత్తిడికి, బలవంతపు పీడనకి పరిష్కారం ఉందా?

ఈప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేను. ముందు చెప్పినట్టు, నాకు మనిషిమీద గౌరవం ఎక్కువ. ఎవరికి వారే ఆలోచించుకుని పరిష్కారాలు వెతుక్కోవాలి. ఎంచేతంటే వారి పరిస్థితులు, శక్తి సామర్థ్యాలూ, అనుభవాలూ వారికి తెలిసినంతగా మరొకరికి తెలియవు. 

 

 • కథకు, నవలకు తేడా ఏవిటి? రెంటిలో మీకు ఏది సులభం

కథలో రెండు మూడు సంఘటనలతో ఒకే ఒక కోణాన్ని ఆవిష్కరిస్తాం. కథ నిర్మాణంలోనూ పాత్రచిత్రణలోనూ రచయితప్రతిభ సూదిమొనంత పదునుగా, తీక్ష్ణంగా కనిపించాలి. నవల విస్తృతపరిధిలో ఆనాటి సమాజాన్ని ప్రతిఫలిస్తుంది. ప్రధానాంశం ఒక మనిషి జీవితం కావచ్చు, ఒక విశ్వాసం కావచ్చు, సమాజంలో ఒక పార్శ్వం కావచ్చు. నవలలో అనేక విషయాలు చొప్పించడానికి ఆస్కారం ఉంది. కథకి లేదు.

 

కథ ఒక వ్యక్తినో ఒక సూక్ష్మవిషయాన్నో కేంద్రం చేసుకుని ఒక అభిప్రాయాన్ని గుచ్చుతుంది సూర్యకిరణంలా. నవల ఒక సమస్యని సమాజంలో ఒక పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది సూర్యకాంతి నలువేపులా ప్రసరించినట్టు. కథ సూర్యకిరణమయితే నవల సూర్యకాంతి. ఒకటి సూదిమొనలాటి పదును, మరొకటి పృథివిలాగే విపులం.

 • మీకు ఏ సాహిత్య ప్రక్రియ అంటే ఇష్టం? ఎందుకు?

నాకు చిన్నకథే ఎక్కువ ఇష్టం. నేను చిన్నవిషయం చిన్నపరిధిలో మాత్రమే ఆలోచించగలను కనక. ప్రతిభావంతులైన రచయితలు సమకాలీనసమాజంలో అనేక విషయాలు సూక్ష్మదృష్టితో పరిశీలించి, నవలలో ఆవిష్కరించగలరు. నాకు ఆ స్థాయి మేధ లేదు. 

 •   తూలిక ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రస్థానం గురించి చెప్పండి

తూలికగురించి చెప్పాలంటే చాలా ఉంది. నిజానికి సుదీర్ఘవ్యాసం ఒకటి రాసేను కూడా. మరో సమాధానంలో చెప్పినట్టు, అమెరికా వచ్చేక, రెండు సంస్కృతులలోనూ గల సామ్యాలూ, వ్యత్యాసాలూ నాదృష్టిని ఆకట్టుకున్నాయి. యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరేక, అమెరికన్లతో పరిచయం అయింది. అక్కడ South Asian Department ప్రశస్తమయినది. ప్రొఫెసర్లకీ విద్యార్థులకీ కూడా మనదేశం అంటే, మనసంస్కృతి అంటే గొప్ప ఆసక్తి. అంచేత వాళ్లు తరుచూ నాతో మాటాడేవారు. వాళ్ళప్రశ్నలు విన్నాక, మనకథలద్వారా మనసంస్కృతి వారికి పరిచయం చేయాలనిపించింది. కొందరు రిసెర్చి స్కాలర్సు కూడా ప్రోత్సహించేరు. అలా మొదలయింది అనువాదాలు చేసి తూలిక.నెట్ ద్వారా పాఠకులకి అందించడం. జూన్ 2001లో ప్రారంభించేను www.thulika.net సైటు. అది నేను విదేశీయులకోసమే ప్రారంభించినా తెలుగువారిని, ముఖ్యంగా ఇంగ్లీషుబడులలో చదువుకున్న తెలుగువారిని ఆకర్షించింది. ఇది నేను అనుకోని పరిణామం.

తూలిక.నెట్ లో వ్యాసాలూ, కథలూ కూడా ఇతరదేశాలలో యూనివర్సిటీస్థాయి పాఠకులను ఆకర్షించేయి. కొందరు తమ research resource గా కూడా వాడుకున్నారు. 

నేను వందకి పైగా అనువాదాలు చేసేను. తరవాత అవి సంకలనాలుగా ప్రచురించడం జరిగింది. వివరాలు నాబ్లాగు తెలుగు తూలిక లో చూడవచ్చు. అయితే ఈ అనువాదాలవిషయంలో నేను ఎదుర్కోవలసివచ్చిన చిక్కు మన రచయితలకి నాధ్యేయం అర్థం కాకపోవడం. ఎంత స్పష్టంగా చెప్పినా, మనదేశంలో ఈకథని చాలామంది మెచ్చుకున్నారు అంటూ అనువాదం చెయ్యమని నాకు పంపుతారే కానీ ఆకథలో విదేశీ పాఠకులకి మనసంస్కృతిగురించి ఏమాత్రం తెలుస్తుంది అన్న ఆలోచన లేదు. నేను చేసిన అనువాదాలన్నీ ఉచితంగానే చేసేను. అది మనరచయితలకి మరింత ఉత్సాహం కలిగించిందేమో. 

నాకు బాధ కలిగించినవిషయం – ఇలా అనువాదం చేయమని అడిగిన రచయితలు నాబ్లాగుగురించి సభల్లోనూ వ్యాసాల్లోనూ ఉపన్యాసాలలోనూ ప్రస్తావించకపోవడం. విదేశీయులు ఆదరించినంత మాత్రమైనా మనవారు ఆదరించకపోవడం శోచనీయం కదా. 

 

 • మీరు చేసిన అనువాదాల గురించి చెప్పండి

దాదాపు 120 కథలు అనువదించేను. కేవలం మనసంస్కృతిని విదేశీపాఠకులకి వివరించగలవి, శిల్పందృష్ట్యా బాగున్నాయి అనిపించినవి అనువాదం చేసేను. రచయిత ఎంత ప్రసిద్ధుడు అన్న దృష్టితో కాక, అట్టే ప్రాచుర్యం లేకపోయినా మంచికథలు రాసినవారి కథలు ఎంచుకున్నాను. ఈ పరిధిలోకి రాకపోయినా మాట ఇచ్చేననో మరో కారణంగానో అనువదించినవి సుమారుగా ఓ పది ఉంటాయి. అలా చేసినందుకు ఇప్పుడు విచారిస్తున్నానుకోండి. అది వేరే కథ. అలాగే కొందరు  అనువాదకులు కూడా నాధ్యేయం గమనించలేదు. 

మరో విషయం అనువాదం చేసేవారు ఇండియనింగ్లీషు నుడికారం వాడడం. అందులో కొన్ని పదాలు నాకే అర్థం కాలేదు. 

 

 • Women Writers, 1950-1975, an analytical study of historical, literary, and social conditions  పుస్తకం తీసుకురావడానికి ప్రేరణ, పడ్డ కష్టం గురించి చెప్పండి.

19వ శతాబ్దంలో బ్రిటన్లో Jane Austen, Bronte Sisters వంటి రచయిత్రులకి విశేషాదరణ లభించింది. అలాగే 1950ల తరవాత మనరచయిత్రులకీ అసాధరణమైన ఆదరణ లభించింది. ఈ రెండు దేశాలలో ఒక శతాబ్దం తేడాతో ఈ రచయిత్రులకు లభించిన ఆదరణ వెనక సామాజిక, రాజకీయ, కౌటుంబిక కారణాలు తులనాత్మకంగా పరిశీలించాలని ప్రారంభించేను. 

ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొ. లంక శివరామకృష్ణ శాస్త్రిగారి పర్యవేక్షణలో పి.హెచ్.డికి రిజిస్టరు చేసుకుని, అందుకు కావలసిన పరీక్ష  కూడా రాసేను. కానీ ఆతరవాత సాగలేదు. 

అప్పటికి కొంత సమాచారం సేకరించేను, నాకు సమకాలీనం కనక నేను కూడా ఆ రచయితలగుంపులో భాగం కనక, కేవలం మనరచయిత్రులమీద పుస్తకం రాద్దాం అని నిర్ణయించుకున్నాను. అప్పటికే నా సైటులో అనువాదాలు చేస్తున్నాను కనక ఈ పుస్తకం కూడా తెలుగుభాష రానివారికోసం ఇంగ్లీషులోనే రాయడానికి నిశ్చయించుకున్నాను. 

మనదేశం వెళ్లి రచయిత్రులని కూడా కలుసుకున్నాను. అలాగే పత్రికా సంపాదకులనీ, కొందరు ప్రముఖ రచయితలనీ, ప్రచురణకర్తలనీ, పాఠకులనీ కూడా కలుసుకుని చాలా సమాచారమే సేకరించేను. ఆరోజుల్లో ఇంకా రికార్డరులు అంతగా లేవు, కనీసం నేను వాడలేదు కనక వాళ్ళు చెప్తుంటే చేత్తో రాసుకోడమే. 

పి. సరళాదేవి, లత వంటి రచయిత్రులు కొందర్ని కలుసుకోడానికి వీలవలేదు. అలాటి రచయిత్రులకి ఉత్తరాలు రాసేను. కొందరు జవాబు ఇచ్చేరు. 

Wisconsinలో Memorial Library, Madison, లో చాలా మంచి లైబ్రరీ ఉండడం చాలావరకూ నాకు ఉపయోగపడింది. 

కష్టాలు అంటే పెద్దగా లేవు కానీ సంప్రదించడానికి, నేను చేస్తున్నది సరిదిద్దడానికీ ఎవరూ లేకపోవడం చెప్పుకోవాలి. పుస్తకం ప్రచురణ మొదట నేనే CreateSpace, Amazon, ద్వారా ప్రచురించేను. 

అప్పట్లో కొందరు నాపుస్తకంలో factual errors ఉన్నాయి అన్నారు. సరే, చెప్పండి, దిద్దుకుంటాను అంటే ఎవరూ చెప్పలేదు. నాకు చిరాకు కలిగించిన రెండో విషయం ఇది. మనవాళ్లందరికీ ఇదే అలవాటయిపోయింది. ఏమీ చెప్పడం చేతకాకనేమో తప్పులున్నాయండీ అంటూ ఓమాట అనేసి ఊరుకుంటారు. నేనయితే ఆ తప్పు ఏమిటో చెప్తాను. 

ఆ తరవాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. జి.వి. సుబ్రహ్మణ్యంగారు అమెరికా ఆటా మహాసభలలో కనిపిస్తే, ఈపుస్తకం ప్రచురిస్తారా అని అడిగేను. ఆయన Proposal పంపండి, చూస్తాను అన్నారు. 5ఏళ్లతరవాత ప్రచురించేరు కానీ ఇప్పుడు వారి సైటులో చూస్తే వారి ప్రచురణలలో నాపుస్తకం లేదు. ఏమయిందో నాకు తెలీదు. 

నా వెబ్ సైటు తూలిక.నెట్ లాగే ఈ పుస్తకానికి కూడా వచ్చిన ఆదరణ తక్కువే. మళ్లీ మీరు ముందుకొచ్చి మీ సైటులో ప్రచురిస్తానంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది. 

 

 •  కొత్త కథకులకు మీరు ఇచ్చే సూచనలు. 

నేను ప్రత్యేకంగా ఇచ్చే సూచనలు ఏమున్నాయండి. ఇప్పటికే కోకొల్లలుగా ప్రముఖరచయితలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. సభల్లో, వ్యాసాలలో అనేకమంది ప్రముఖులు వివరించేరు. 

బహుశా అందరూ చెప్పిందే కావచ్చు, ఓపిగ్గా శ్రద్ధగా 1940, 50 దశకాల రచయితల కథలు చదవమంటాను. చాలామంది చదువుతారు కానీ రచయిత ఏ పదాలు ఎక్కడ ఎలా వాడేరు, ఏ వాక్యంలో పదును ఎలా వచ్చింది, ఏ ఆలోచన ఎలా అభివ్యక్తీకరించేరు అన్న దృష్టితో చదవడంలేదు. గబగబ కప్పదాట్లు వేస్తూ చదివేసి సుమారుగా అర్థం తెలుసుకుని వ్యాఖ్యానాలు చేయడమే ఎక్కువగా కనిపిస్తోంది. 

నేను చదివినంతవరకూ రచనకి మార్గదర్శకులయిన ప్రసిద్ధరచయితలు మధురాంతకం రాజారాం, మల్లాది రామకృష్ణశాస్త్రి, రావిశాస్త్రి. కుటుంబరావు, చలంలాటివారు ప్రసిద్ధరచయితలే కానీ వారి రచనల్లో శైలి లేదు. కేవలం తమ భావాలు అందించడానికే రాసేరు. 

 

 • చివరగా నెచ్చెలి ప్రేక్షకులకు నెచ్చెలి పత్రికతో మీకున్న అనుబంధంపత్రిక గురించి నాలుగు మాటలు చెప్పండి.

నెచ్చెలి.కాం మీరు ప్రతిభావంతంగా నిర్వహిస్తున్నారనడంలో సందేహం లేదు. ఉద్యోగం, సంసారం, స్వీయరచనావ్యాసంగం, ఇంటర్వ్యూలతోపాటు సంపాదకురాలిగా అన్ని వర్గాలతో పత్రిక నడపడం అంత తేలిక కాదు.మీరు వివిధ శాఖలు -స్త్రీవాదం, దళితవాదంవంటివి – ఆహ్వానించడం హర్షనీయం. అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలి. బహుశా స్వల్పకాలంలో అంతపేరు తెచ్చుకున్న జాలపత్రిక అనొచ్చేమో. మీకృషి ఇతోధికంగా కొనసాగాలని నా ఆకాంక్ష. 

మొదటిసారి మీరు నాకవిత అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయేను. అప్పటికి మీతో పరిచయం లేదు కనకనూ, నావి కవితలా అనే సందేహం నాకు ఉండడంచేతనూ. అలాగే నాకథ ప్రాప్తం లక్ష్మణశాస్త్రిగారు ఆడియో చేస్తారన్నప్పుడు, మీరు నానవల చాతకపక్షులు, Telugu Women Writers, 1950-1975, సీరియలుగా వేసుకుంటానన్నప్పుడు మీకృషిమీద నాకు మరింత గౌరవం కలిగింది. అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా  అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.

*****

 

Please follow and like us:

20 thoughts on “ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారితో నెచ్చెలి ముఖాముఖి”

 1. రకరకాల కారణాలవల్ల ఈ ముఖాముఖి నా దృష్టిలోంచి జారిపోయింది .చాలా కాలంనుండి మాలతిగారి మాట వినాలన్న కుతూహలం ఇప్పుడు తీరింది .ధన్యవాదాలు గీతగారూ ,మీరు ఆమె చేత మాట్లాడించిన తీరు చాలా బాగుందండీ. ఇక మాలతిగారు పంచుకున్న విషయాలలో ఎంత వైవిధ్యం ఉందో .120కథలు అనువాదం చేయడమంటే చిన్న సాధన కాదు .అలాగే ఆమె చిన్న కథను ఓ శిల్పిలా మలిచే తీరు నాకు ఎప్పుడూ ఓ అద్భుతంలా కనిపిస్తుంది .
  ధన్యవాదాలు మాలతిగారూ ,గీతగారూ.👍👍

  1. ఈ ముఖాముఖి మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణి నీలారంభం గారూ!

  2. మీ ఆదరాభిమానాలకి మనఃపూర్వక ధన్యవాదాలు కల్యాణిగారూ. ఒక రచయిత్రీ విమర్శకురాలూ అనువాదకురాలిగా మీ ఆప్తవాక్కు నాకు ప్రత్యేకం. ప్రోత్సాహకరం. నమః.

 2. డా. గీత గారూ, ఇక్కడా, నా ఫేస్బుక్ పేజీలోనూ స్పందనలు చూసేక, ఈమాట మీతో చెప్పాలనిపించింది.

  నేను మాటకారిని కాను. రాయగలను కానీ ముఖాముఖీ మాటాడలేను. ఈ ఇంటర్వ్యూ సఫలమయిందంటే ఇందులో మీకృషి గణనీయం.
  ఈమధ్య ఇంటర్వ్యూలలో ఇంటర్వ్యూ చేసేవారు మాటాడడం ఎక్కువ అయింది. అలాటి సమయాల్లో నేను చెప్పదలుచుకున్న నాలుగు మాటలూ కూడా మర్చిపోతాను.
  మీరు మీ ప్రశ్నలు క్లుప్తంగా చెప్పి, నాకు సావకాశంగా మాటాడడానికి అవకాశమిచ్చి, విడియో చక్కగా ఎడిట్ చేసి అందించినందుకు ధన్యవాదాలు. మీకృషి ఇతోధికంగా సాగగలదని ఆశిస్తూ .. – మాలతి

  1. మాలతి గారూ! చాలా థాంక్స్ అండీ. మీ ఇంటర్వ్యూ మీకు, నెచ్చెలి పాఠకులకు, ప్రేక్షకులకు, ఫేస్బుక్ లో…అందరికీ నచ్చడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.

 3. చక్కటి ఇంటర్వూ గీత గారు అభినందనలు…. మాలతి గారు మీ రాతలకి మాటలకి తేడా ఏమీ లేదు..పుస్తకపఠనం పట్ల మీ తల్లిదండ్రులు మీకు కలిగించిన ఆసక్తి వలన మాకు మంచి రచయిత్రి లభ్యం అయ్యారు.మీ చిన్ని చిట్టి కథలు నాకెంతో ఇష్టం..శుభాకాంక్షలు మాలతి గారు..

  1. మీ ఆప్తవాక్కుకి ధన్యవాదాలు వసుధారాణి గారూ. సంతోషం.

 4. ఇప్పటివరకు మాలతిగారి రాతలు చదివాను, ఇప్పుడు వారిని చూస్తూ, వారిమాటల్లో వారిని గురించి తెలుసుకోవడం బావుంది. కొందరి గురించి తెలుసుకున్నాక వారిని ఒకసారి కలిస్తే బావుండు, మాట్లాడితే బావుండు అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం అడిగితే చెప్పలేను. మాలతిగారి పరిచయం ముఖపుస్తకంలో కలిగాక అలాగే అనిపించింది. వారిని ఇలా చూడడం సంతోషంగా ఉంది.

 5. మాలతి గారు మీ ముఖా ముఖి చదువుతున్నంత సేపు కళ్ళముందు జరుగుతున్నట్లు గా అనిపించింది. డాక్టర్ గీత గారు చక్కటి ప్రశ్నలు వేసారు. జవాబుల్లో మీ వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనిపించింది. అది నాకు చాల నచ్చింది. మీ తోటి స్నేహం ,పరిచయం ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని గా మనసుకి ఆహ్లాదా ని కలిగిస్తుంది.

  1. చాలా సంతోషం మణిగారూ. మీ పరిచయం నాకూ ఆనందదాయకం. ధన్యవాదాలు.

 6. మాలతి గారి గురించి ఇంత విపులంగా యిపుడే నేను తెలుసుకోవడం. చాలా విషయాలు ఆసక్తి గా వున్నాయి. రచయితలకు చాలా సూచనలు వున్నాయి. వారు తెలుగు కథలు అనువాదం చేసానని చెప్పారు… ఆ కథల వివరాలు తెలిస్తే ఆ కథలను చదవాలని వుంది. కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదని నిజాయితీగా స్పందించారు. మాలతి గారి లాంటి రచయితను అరుదుగా చూస్తాం. ఆమె శైలి నాకిష్టం. ఇంకా ఆమె కథలను పూర్తిగా చదవలేదు నేను. ఆమె నుండి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ధన్యవాదాలు గీత గారూ… అభినందనలు, గౌరవపూర్వక నమస్సులు మాలతి గారూ.. 💐🙏

  1. వనజ గారూ! మీరు తూలికలో మాలతి గారి అనువాద కథలు చదవవచ్చు. ఇంటర్వ్యూ మీకు నచ్చినందుకు నెనర్లు.

  2. ధన్యవాదాలు వనజగారూ. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నా అనువాదకథలు నా Website http://www.thulika.net చూడవచ్చు, కొన్ని అనువాదాలు పుస్తకరూపంలో వచ్చేయి. ఇప్పుడు బజారులో దొరుకుతున్నాయో లేదో నాకు తెలీదు.

   ఈ అవకాశం నాకు ఇచ్చి, గీతా మాధవిగారు శ్రమ తీసుకుని సమయం వెచ్చించి చక్కగా కూర్చేరు విడియో. గీతా మాధవిగారికి ధన్యవాదాలు.

 7. మాలతిగారంటే నాకు ఎంతో అభిమానము. నెచ్చెలి లో ముందు చూసినదిదే. చాలా హాయిగా సాగింది ఇంటర్యూ. అసలు మా పెద్దమ్మగారు మాట్లాడుతుంటే వింటున్నట్లుగా ఉంది. ‘అంచేత’ అంటూ వారు అంటుంటే అరే ఆ తెలుగు తియ్యదనం హృదయం నిండింది. గీతగారు మీరూ చక్కటి ప్రశ్నలు వేశారు. మీ తియ్యనైన కంఠానికి నేను ఫిదా. ఇంత మంచి ఇంటర్యూ అందించిన మీకు కృతజ్ఞతలు.

  1. ధన్యవాదాలు సంధ్యగారూ మీ ఆత్మీయస్పర్శకి. నేను మాటకారిని కాను. ఆమాత్రం వచ్చిందంటే సంతోషంగా ఉంది. గీతగారి ప్రోద్బలమూ, శ్రమా కూడా ఉన్నాయి ఇందులో.

Leave a Reply

Your email address will not be published.