మిట్ట మధ్యాహ్నపు మరణం- 3

– గౌరీ కృపానందన్

“త్వరగా ఓ మనవడిని కని ఇవ్వు. అడ్డ దిడ్డమైన మాత్రలు మందులు మింగకు. అచ్చు మహాలక్ష్మి లాగా ఉన్నావు. చూడు మీనాక్షీ! నీ కోడలు మన మాలతిలాగానే ఉంది. త్వరలోనే ఇంటివాళ్ళతో కలిసి మెలిసి పోతుంది. చూస్తూనే ఉండు.”

“అంతా ఆ ఏడుకొండల వాడి దయ. నువ్వు కాఫీ తీసుకో ఉమా! మూర్తిని లేపి కాఫీ కలిపి ఇవ్వు. రైలుకు బయలుదేరి వెళ్ళాలి మరి.”

“ఆయన రోజూ ఎన్ని గంటలకి లేస్తారు అత్తయ్యా?”

“ఏడు గంటలకి కానీ లేవడు. కానీ ఈ రోజు త్వరగా లేపెయ్యి.”

మూర్తి గదిలోకి వెళ్ళాలంటేనే సిగ్గుగా అనిపించింది. మేలుకునే ఉంటాడు. దగ్గరికి వెళితే ఏమైనా చేష్టలు చేస్తాడు. స్నానం చేసి వచ్చే వరకు అతని కంట పడకుండా దాగుడుమూతలు ఆడాలి.

“ఇదిగో చూడు ఉమా! నువ్వే పనులు చెయ్యక్కర లేదు. నేను అందరి లాంటి అత్తగారిని కాదు . ఇంటికి వచ్చింది కోడలు కాదు, కూతురు అనే అనుకుంటున్నాను. గదిలోకి వెళ్లి రైలు ప్రయాణానికి సూట్ కేసు సర్దుకో.”

హాల్లోకి వస్తూ ఉండగా మూర్తి తమ్ముడు చెవిలో ట్రాన్సిస్టర్ పెట్టుకుని క్రికెట్ స్కోర్ వింటున్నాడు. అతని దగ్గిరికి వెళ్ళింది.

“స్కోరెంత?”

“ఏమన్నారు?”

“స్కోర్? స్కోర్?”

అతను వాల్యూం తగ్గించి, “మీకు క్రికెట్ లో ఇంటరెస్ట్ ఉందా?” అడిగాడు.

“ఉంది.”

“ఇలా మీ చెయ్యి ఇవ్వండి.” షేక్ హేండ్ కోసం చెయ్యి చాచిన వాడల్లా, “సారీ… మీరు వదిన కదూ. పర్మిషన్ లేకుండా షేక్ హేండ్ ఇవ్వకూడదు కదూ.”

“స్కోరెంత అని అడిగాను.”

“దాన్ని అస్సలు అడక్కండి. మనవాళ్లంతా బాల్చీ తన్నేశారు. అస్సలు హోప్ లేదు.”

“అయ్యో! ఇతని దగ్గర చిక్కుకున్నావా? బాగా బోర్ కొట్టేస్తాడు.” మెట్లు దిగి వస్తూ మూర్తి అన్నాడు.

“అన్నయ్యా! మొదటి సారిగా క్రికెట్ గురించి కాస్త విషయం తెలిసిన మనిషి మన ఇంటికి వచ్చింది. ఈ అన్నయ్య ఉన్నాడే వదినా! బొత్తిగా జ్ఞాన శూన్యం అనుకో.” 

“నీకు క్రికెట్ లో ఇంటరెస్ట్ ఉందా ఉమా?”

“కాలేజీలో ఆడాను.”

“అలాగా!” ఆశ్చర్యపోయాడు మూర్తి.

“అన్నయ్యా! నీ పర్మిషన్ కావాలి. వదినకి షేక్ హేండ్ ఇవ్వాలి.”

“నో అఫెండ్.”

“నా పేరు ఆనంద్! బి.కాం. రెండో సంవత్సరం చదువుతున్నాను. క్రికెట్ కోసం మీకు షేక్ హేండ్ ఇస్తున్నాను.” నాటకీయంగా అన్నాడు.

అతని చెయ్యి ఆరోగ్యంగా, బలంగా ఉంది.

“ఉమా! గదిలోకి రా. ఊరికి వెళ్ళాలి. అన్నీ సర్దుకోవాలి.”

“మీ ట్రెయిన్ ఎప్పుడు?”

“ఏడున్నరకి. బృందావన్ లో వెళుతున్నాం. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వాలి. ఉమా! మీ ఇంటికి వెళ్లి రావడానికి టైం ఉండదనుకుంటాను.”

“వద్దు. వాళ్ళే స్టేషన్ కి వస్తామని అన్నారు.” 

“వెరి గుడ్!”

బృందావన్ ఎక్స్ ప్రెస్ లో కంపార్టుమెంటును వెతుక్కుంటూ భర్త వెనకే నడుస్తున్న ఉమ వాళ్ళని చూసింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.