
శూన్య తత్వం
-గవిడి శ్రీనివాస్
ఆకాశ ఎడారి నుంచి
చూపులు వేలాడేసుకుని
దిక్కులు చూస్తున్నప్పుడు
శూన్య తత్వం బోధపడుతుంది.
కలలకి కన్నీళ్ళకి మధ్య
దూరాన్ని చెరిపి
అతి దగ్గరగా చూసినప్పుడు
నిశ్శబ్దంలోంచి
జీవిత సత్యం అవగతమవుతుంది.
గుప్పెడు కన్నీళ్ళని పట్టుకుని
వేలాడటం కాదు జీవితం.
రాత్రి వెనుక పగలు దాగున్నట్టు
దుఃఖః ఆవల సుఖం
మౌనంగా కాలం కోసం
ఎదురుచూస్తోంది.
ఏమీ తోచనప్పుడు
దిక్కులు చీకట్లతో
మూసుకున్నప్పుడు
మౌనం పరమావధిగా
కాలాన్ని చెక్కు కోవాలి.
ఆనంద తీరం ఎక్కడంటే
ఆలోచనలు కుదురుగా కూచున్న చోట
ప్రశాంతత మాటల్లో
తొణికిసలాడే చోట
కొలవలేని సంతోషొలు
కొలువు ఉంటాయి.
శూన్య తత్వం
పల్లవించిన చోట
పదిలంగా మనసు
అనురాగ రాగాలను వినిపిస్తుంది.
ఆత్మీయ పూలతోటనే
పూయిస్తుంది.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.

“గుప్పెడు కన్నీళ్ళను పట్టుకుని వేలాడటం కాదు జీవితం” గొప్ప పద ప్రయోగం..అద్భుత కవనం. శ్రీనివాస్ గారి కవిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అభినందనలు