అనుబంధాలు-ఆవేశాలు – 8

– ప్రమీల సూర్యదేవర

భ్రమరలా మౌనంగా తనపని చూసుకునే తత్వం కాదు అంజమ్మది. అవకాశం ఉన్నంత వరకు తోటి ఖైదీలతో, కారాగార సిబ్బందితో మాటలు కలిపి చమత్కరిస్తుంది. ఒకసారి పారిపోవాలని పట్టుబడి ఫలితం అనుభవించింది.

బిడ్డలు యాదుకొస్తున్నరని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది.

చదువు లేకపోయినా, అడవి, గూడెం తప్ప బయటి ప్రపంచం తెలియక పోయినా ఉట్టిపడే సంస్కారంతో తోటి వారిని పలుకరించే అంజమ్మ—-చదువు, సంస్కారం ఉండి తన కాళ్ళ మీద తను నిలబడకలిగే అవకాశం ఉన్న భ్రమర—ఇరువురు కారాగారంలొ కఠినశిక్ష అనుభవిస్తున్నారు.

తాను సృష్టించిన రాక్షసులు తననే భక్షించడానికి వస్తుండటం గమనించిన బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తిని ప్రార్దిస్తూ , ఓ కరుణారసమూర్తీ కష్టాలు కలిగించే వాడివీ నీవే. ఆ కష్టాలను తొలగించె వాడివి నీవే, మార్గం చూపించు అని వేడుకుంటాడట. విష్ణుమూర్తి బ్రహ్మ ప్రార్దనను మన్నించి కాపాడుతాడట. అదే విష్ణుమూర్తి వీరిని కరుణించి కాపాడగలడా?

చిన్నతనం నుండి నాన్నగారి వద్దకు వచ్చే ఫిర్యాదులు వినటం అలవాటైన నేనే వీరిద్దరి ఫిర్యాదులు చదివి తట్టుకోలేక పోతున్నాను. గదిలొ ఉక్కిరిబిక్కరైనట్లనిపించి కొంచెం చల్లగాలి కోసం తోటలోకి వెళ్దామని బయట అడుగు పెట్టానో లేదో జలజ నా వెనుకే వచ్చింది.

“మీరు ఒంటరిగ బయట తిరగటం ఇక్కడ నిషేధం. దయచేసి లోపలకు వెళ్ళండి” అని మర్యాదగానే చెప్పినా ఖచ్చితంగా చెప్పేసింది.

“గదిలో ఊపిరాడటంలేదు. కొంచెం చల్లగాలికి తోటలో తిరుగుదామనుకున్నా.” నసిగాను.

“మనందరి క్షేమం కొరకు ఇక్కడి నియమాలు చాలా కట్టుదిట్టంగ ఉంటాయి. అవి అతిక్రమించకుండ చూడటం నా బాధ్యత.” ఖరా ఖండిగ చెప్పింది.

నేను వెనుతిరిగి వస్తుంటె సుశీల నావైపు జాలిగ, నిస్సహాయంగా చూసింది. అప్పుడే గదిలోకి అడుగు పెట్టిన కారాగార అధికారిణి కుదిరిందా తిక్క! అన్నట్లు చూసి కళ్ళు త్రిప్పింది.

నేను తిరిగి వచ్చి నా కుర్చీలో కూర్చోగానె, “వీరిద్దరు హంతకులే. 349 తల్లిని, 586 స్నేహితురాలిని హత్య చేశారు. క్షమించండి, మేము వారిపేర్లు వాడ కూడదు. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు శిక్ష పడింది. కారాగారంలొ వీరిద్దరే హంతకులు. మిగిలినవారు వేర్వేరు నేరాలు—హత్యా ప్రయత్నం చేసి కొందరు, దొంగతనాలు చేసి కొందరు, ఇరుగు-పొరుగు వారితొ ఘర్షణపడి, తలలు పగులకొట్టుకున్న వారు——ఇలా వచ్చిన వారిలో మొత్తం పాతిక మంది వరకు ఉన్నారు. ఇక్కడ కూడ అవకాశం దొరికినప్పుడల్లా వారిలో వారికె కొట్లాటలు లేవదీస్తూ, ఒకరి వస్తువులింకొకరు దొంగిలిస్తూ , కలకలం రేపుతూ మా సిబ్బందికి మనఃశ్శాంతి లేకుండ చేస్తుంటారు. కాని వీరిరువురు మాత్రం చాలా పద్దతిగ, క్రమశిక్షణతో ఉంటారు. అధికారులకు ఎంతమాత్రం ఇబ్బంది కలిగించరు. 349, తనకు కొన్ని పుస్తకాలు కావాలని మా అనుమతి తీసుకుని, అవి తెప్పించుకుని చదువుతూ ఎక్కువ కాలం గడుపుతుంది. 586, తన పిల్లలు, వచ్చి వెళ్ళి పోయిన తరువాత వారి గురించి మాట్లాడుతూ వారి గుణగణాలను పొగుడ్తూ మరల వారు వచ్చేవరకు వారి గురించే ఆలోచిస్తూ , ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది. ఆమెకు చదువు రాదుకాని ఎన్నో పురాణాల కధలు చెప్తుంది. చక్కని కంఠంతో పల్లెపదాలు పాడుతుంది. ఆ పదాలు పాడేటప్పుడు ఆమె గొంతులొ విషాదం నిండి ఉంటుంది.

మనస్తత్వశాస్త్రం చదవలేదు కాని వీరి గురించి ఆలోచిస్తుంటాను. ఇంతటి సంస్కారవంతులు ఆ క్షణికోద్రేకాన్ని ఆపుకోగలిగితె వీరి జీవితాలు వేరుగ వుండేవి కదా అని.” ఒక చిన్న నిట్టూర్పు విడుస్తూ అన్నది.

“మరి వాళ్ళ కాళ్ళకు చేతులకు ఆ ఇనుప గొలుసులు”—-అర్దాంతంలోనె ఆపి వేశాను.

“హంతకులను సెల్ దాటి బయటకు అలాగే తీసుకురావాలనె నిబంధనలు.” ఈమాటలంటున్నప్పుడు ఆమెలో పటుత్వం కొంత సడలిందనె చెప్పుకోవాలి.

“ఇచటి నేరస్తులు చేసే పనులపై బహుశ మీకు అవగాహన ఉండి ఉండదు, నాతోరండి”, అని దారి తీసింది. కారాకారానికి వెనుక ఉన్న ఆవరణలో రేకుల షెడ్‌లో యువతులు కొందరు ప్లాస్టిక్ బుట్టలు అల్లుతున్నారు, మరికొందరు రంగురంగుల కాగితాల్తో పూలు తయారు చేసి గుత్తులు కడుతున్నారు, ఇంకా కొందరు జేబురుమాళ్ళ మీద అందమైన డిజైన్లు కుడుతున్నారు.

రేకుల షెడ్‌కి కుడిప్రక్కన చిన్న కూరగాయల తోటలో వంకాయ, బెండకాయ, పచ్చిమిరపకాయ, టొమేటొ మొక్కలు, కాకార, బీర, పొట్ల, సొర పాదులున్నాయి. కొందరు యవతులు పాదులు త్రవ్వి నీరు పెడ్తున్నారు.

తోటలొ మొక్కలు నాటటం, నీరు పోయటం, కలుపు తీయటమేకాక పండిన కూరగాయలు గంపలకెత్తి పట్నానికి తీసుకు వెళ్ళటానికి సిద్దం చేయటం కూడ ఖైదీల బాధ్యత.

వీరందరిని ఆరుగురు రక్షక భటులు పర్యవేక్షిస్తు కనుపించారు.

వారిలో భ్రమర, అంజమ్మ కనుపించ లేదు. నా ఉద్దేశ్యం గ్రహించి, ఆ విభజనలో వారికి అనుమతి లేదని చెప్పింది. కొద్దికాలం పాటు వారి ప్రవర్తన గమనించి వారి వల్ల ఎలాటి ప్రమాదం వాటిల్లదని నమ్మకం కుదిరిన తరువాత అనుమతి లభిస్తుంది.

ఆ రేకుల షెడ్‌కి ఆనుకుని చిన్న గ్రంధాలయం, అందులో చాలా వరకు పాత పుస్తకాలు, అరల్లో సర్దిపెట్టి ఉన్నాయి. ఒక అరలొ విశ్వనాధ సత్యన్నారాయణగారు రచించిన వేయి పడగలు, రవీంద్రనాధ్ ఠాగుర్ కధలు తెలుగులోకి అనువదించిన పుస్తకాలు, శరత్ రచించిన దేవదాస్, పరిణీత నవలలు, ఇవికాక పెద్దబాలశిక్ష , సుమతి శతకంలాంటి శతకాలు ఉన్నాయి.

వేరొక అరలో గాంధీగారి జీవిత చరిత్ర కాక సర్దార్ వల్లభాయి పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రు , బాల గంగాధర తిలక్, సరోజనీ నాయుడు, వంటి దేశనాయకుల జీవిత చరిత్రల పుస్తకాలు, భారత దేశ చరిత్ర ఉన్నాయి.

భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణ గ్రంధాలు అద్దాల బీరువాలో పెట్టి తాళంవేసి ఉన్నది.

గ్రంధాలయం గోడలపై గాంధీ, నెహ్రు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న చిత్రపటం, ఆ పటానికి ఒకవైపు గాంధీగారు రాట్నం వడుకుతున్న పటం, రెండవ వైపు, నెహ్రు పిల్లల్తొ ఆడుకుంటున్న పటం ఉన్నాయి.

సెల్ దాటి బయటకు వచ్చి తోటి ఖైదీలతో కలిసి పనులు చేస్తున్న వారిలో దిగులు, నిరాశ, నిస్పృహలు అంతగా కనిపించ లేదు. ఎవరి పనుల్లొ వారు నిమగ్నమై పోయి ఉన్నారు.

ఇదొక ప్రపంచం, బయట వారు, చూడలేని, ఊహించలేని ప్రపంచం.

ఖైదీలకు పనులు కల్పించి, వారిచేత పనులు చేయించి, తయారు చేసిన వస్తువులను వారు తృప్తిగా చూసుకున్నప్పుడు నా శ్రమకు తగిన ఫలితం కలిగిందని ఆనందం పొందుతాను “మేమీ కార్యక్రమం ఇరవై సంవత్సరాలుగ కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో మొట్ట మొదట ఈ కార్యక్రమం ఆరంభించిన ఘనత మాకే దక్కింది.”అధికారిణి స్వరంలో గర్వం వినిపించింది.

నాక్కూడా జైలు అధికారిణి, చూపుతున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగ వున్నది, మీరు చాలా శ్రమతో సాధించి ఉంటారని గ్రహించానని చెప్పి, శలవు తీసుకున్నాను.

ఆ రోజు ఇక దేనిపైన మనస్సు కేంద్రీకరించ లేక పోయాను. ఆలోచించే శక్తి కూడ లేక పోయింది. కారాగార అధికారిణితో వెళ్ళివస్తానని చెప్పి, “మరల ఎప్పుడు రమ్మంటా”రని అడిగాను.

నా చిరునామా తీసుకుని, “పై అధికారుల నుండి అనుమతి రాగానే మీకు తెలియ జేస్తాను. ఒకవేళ మీరు మీ మనస్సు మార్చుకుంటె మాత్రం మాకు తెలియజేయండి. అని సొరుగులాగి, తనపేరు, కారాగార చిరునామా ఉన్న కార్డ్ తీసి ఇచ్చింది. అప్పుడు చూశాను ఆమెపేరు. రాధాదేవి. నాకెంతో ఇష్టమైన పేరు. నా గదిలో ఉన్న రాధా, కృషుల విగ్రహం జ్ఞప్తికి వచ్చింది.

ఆ రాధ కన్నుల్లో ఆరాధన, కారుణ్యం, ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఆ గుణాల్లో ఒక్కటైనా ఈ కన్నుల్లో కనుపించ లేదు. బదులుగ బాధ్యతతో కూడిన కాఠిన్యం కనుపించింది. బహుశః ఖైదీలతొ ఇన్ని సంవత్సరాలుగ వ్యవహరించి ఆమె హృదయం కరుడు కట్టి పోయి ఉంటుంది. కారాగారాల్లో బాధ్యత చేపట్టాలంటె ఎంతో ధ్యైర్యం, ఆత్మస్థైర్యం కావాలి. అనుక్షణం అప్రమత్తతగ మెలగాలి. ఏమాత్రం కరుణ చూపించి, నిబంధనలను సడలించినా ప్రమాదంలో చిక్కుకుంటారు. వీరి పై అధికారులు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కారాగారాల్లో నిబంధనలు, అచటి సిబ్బంది గురించి నాన్నగారు చాలాసార్లు చర్చించే వారు. అన్నీ విన్న విషయాలే. తెలిసిన విషయాలే ఐనా స్వయంగా అనుభవంలోకి వస్తేగాని తెలిసి రాదు.

రాధాదేవి నుండి వీడ్కోలు తీసుకుని బరువెక్కిన హృదయంతొ బయటకు వచ్చాను. జలజ ముఖద్వారం వరకు తోడు వచ్చింది.

“ఏమైందమ్మా?” ఆత్రంగ అడిగాడు గోవిందు కారు తలుపు తెరిచి పట్టుకుంటూ.

మాట్లాడకుండ కారుమఎక్కాను. అంజమ్మ, భ్రమరల రూపాలు నావెంట వచ్చి నన్ను కలచి వేస్తున్నాయి. ఆ గాజుకళ్ళు నన్ను తరచితరచి చూస్తున్నాయి. ఆపుకోలేని దుఃఖం వచ్చేసింది. రెండు చేతుల్లో ముఖం కప్పుకుని ఏడుస్తున్న నన్నుచూసి, “నీకెందుకమ్మా ఇవన్నీ? నీ మనసు నవనీతం. తట్టుకోలేదు తల్లీ “ బాధగా అన్నాడు గోవిందు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.