
అరుణ వర్ణం
-వజ్జీరు ప్రదీప్
ఆకాశం నిశీవర్ణపు దుప్పటి పరుచుకుంది. మనుషుల అలికిడి సద్దుమణిగింది, దూరంగా కట్టు కాలువ వంతెన మీద నుండి పోతున్న బొగ్గు లారీలు చిన్న చిన్న వాహనాలు తప్ప ఊరి వాతావరణమంతా నిర్మానుషంగా మారింది,
గాలి దుమారానికి ఊరిలో కరెంట్ కూడా లేదు చేతిలో కట్టెను అనుకోసం పట్టుకున్నాడు రాజేందర్, వాడకచ్చు నేస్తాలు ఎవరైనా చూస్తారేమోనని నెమ్మదిగా అటూ ఇటూ పరిశీలించుకుంటూ వాళ్ళ పానాది దాటీ మరో పానాదిలకు గభ గభ నడిచిండు.
దూరంగా తనను పసిగట్టిన కుక్క ఒకటి భౌ.. భౌ..మని మొరగబట్టింది, చేతిలో కర్రతో అదిలించి దొంగల మర్రి చెట్టు మీద కీచురాల్ల శబ్దాలను దాటుకుంటూ గోపాల్ రావు పటేల్ ఏడుమోట బొక్కేనెల బాయి కాడకు వచ్చి కాసేపు ఆగి, దేవయ్య వాళ్ళ ఇంటి వరండాలకు బోయి నిల్చున్నాడు. తలుపు కొట్టంగానే కిర్రుమంటూ మెల్లగా తలుపు తెరుచుకుంది.
“రాజేంద్రం వచ్చినవా బిడ్డా!” అంటూ గుండెలకు హత్తుకున్నాడు దేవయ్య.
అతని కళ్ళల్లో ఒత్తుకున్న కన్నీళ్లు దీపపు లాంతరు వెలుతురులో స్పష్టంగా మెరుస్తూ రాజేందర్ గుండెను తాకాయి.
కూర్చోవడానికి స్టూలు పీట వేసింది నాగమ్మ.
చీకటి మోస్తున్న ఆ గదిలో నిశబ్ధంగా చూస్తున్న భార్యా భర్తలు ఇద్దరి వైపు చూశాడు.
చింత పిక్కల్లాంటి కళ్ళతో వివర్ణమై వడలిన దేహాలతో నిసత్తువగా చూస్తున్నారు. వాళ్ళ మనసులలాగే కిటికి టప టప మని కొట్టుకుంటుంటే దిగుడులో దీపం ఉండాల నిష్క్రమించాల అని చూస్తుంటే నిర్భేద్యమైన మౌనం పల్లవించింది అక్కడ.
నాగమ్మ సూరు గుంజకు ఒరిగి దూరంగా కూర్చుంది. అరుణ చాపలో గోడదిక్కు మొహం పెట్టి పడుకుంది. లోపల నుండి ఒక పాత సందుగా తెచ్చి అందులో రబ్బర్ చుట్టిన బాండ్ పేపర్ తీసి రాజేందర్ చేతిలో పెట్టాడు దేవయ్య.
“ఏంది నాయనా ఇది?” పేపర్ చుట్టా విప్పుతూ అన్నాడు.
“స్టాంప్ పేపర్ బిడ్డా” మెల్లగా అన్నాడు దేవయ్య.
“మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలే నాయనా గీ కాగితాలు ఏం చేస్తయ్” పేపర్ మడుస్తూ అన్నాడు రాజేందర్.
“లేదు బిడ్డా ఈ కాగితం ఉంటే నీకు ధైర్యం ఉంటది, నాకు భయం ఉంటది. ఏ చుట్టాలు, పక్కాలు చెయ్యని సహాయం నువ్వు చేస్తానవ్ అంతకన్నా నాకేం కావాలి బిడ్డా!”
“సరే నీ ఇష్టం”
ఎంతో నమ్మకం ఉన్న వ్యక్తి అయినప్పటికి పేపరు రాసి ఇద్దరు సంతకాలు జేసి ఇచ్చిండ్లు.
రాజేందర్ బ్యాగులో నుండి డబ్బులు తీసీ దేవయ్య చేతిలో పెట్టి “లెక్క చూసుకో నాయనా” అన్నాడు.
“నువ్వే చెప్పినవ్ గద బిడ్డా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలని బరాబర్ వుంటాయ్ తీయ్” అంటూ పసి పిల్లను చేతిలో పట్టుకున్నట్టు పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు దేవయ్య.
నాగమ్మ కూడా అలానే చేసింది. వారి కండ్లు దేదీప్యమానమై రేపు చేయబోయే కార్యంలో మొదటి విజయంగా భావించారు వారు.
జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు గదా! ఎవరి దృష్టి పడ్డదో ఏమో!గాని దురదుష్టం ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళీ మరీ తలుపుతట్టినట్టుగా ఉంది.
ఎన్నో ఆశలతో పట్నంలో చదువుకుంటున్న కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాక చిన్న కొడుకు ఓ అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ జరిగి ఊరు వదిలి ఎక్కడికో పారిపోయాడు.
రోజులు గడిచే కొద్దీ అప్పులతో ఆస్తులు కరిగిపోయాయి, కుటుంబం విచ్చిన్నమై వీధిన పడ్డది,సలహాలకు సంప్రదింపులకు పిలిచే మనుషులంతా దూరమయ్యారు,తన ద్వారా సహాయం పొందిన వాళ్ళయినా మాటవరసకు రాలేదు.
ఒక్కగానొక్క కూతురుకైనా వివాహం చేసి తనకు చక్కటి జీవితం అందీయలని ఆరాటపడబట్టిండ్లు వాళ్ళూ.
***
ఇంటి వెనక జామ చెట్టు కింద మంచం వేసింది సుభద్ర.
పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న పాలేరులకు రేపటి పనిని శ్రద్ధగా చెబుతున్నాడు అంజయ్య.
అన్నచ్చిండని సంబరపడుతూ అన్నకిష్టమైన మొక్కజొన్న కంకులు తెప్పిచ్చి గారెలు చేసింది సుభద్ర.
“ఏం దేవయ్యా! ఎట్లున్నావ్? చాన రోజులకు వచ్చినవ్ చెల్లె,కోడలు ఎట్లున్నారు?” సిగరెట్ పొగను గాలిలోకి వదులుతూ అన్నాడు అంజయ్య.
“బాగానే ఉన్నారు బావ” పరధ్యానంలో నుండి తేరుకొని చెప్పిండు దేవయ్య.
“ఏందే అన్నా ఏమన్నా అడుగుదామని వచ్చి తట పట ఇస్తున్నావా? ఏందో మీ తలరాత ఏం తింటాంలో ఏం జేస్తాండ్లో ఆ దేవుడు నీకు పుట్టెడు కష్టం బెట్టే వానికెప్పుడు మీ మీద దయపుడుతదో ఏమో?” అన్న మనసెరిగి దేవుడిని నిందిస్తూ అంది సుభద్ర.
“ఏం లేదు చెల్లే” అంటూ బావ అంజయ్య దిక్కు జూసిండు దేవయ్య.
“తనకేం ఉంటది సుభద్ర ఉన్న ఒక్క బిడ్డ పెండ్లి జెయ్యాలనుంటది, ఏదో గంతకు తగ్గ బొంత దొరకక పోతుందా చూద్దాంలే” సుభద్ర ఇచ్చిన గారెల ప్లేటు తీసుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు అంజయ్య.
పాల మీద పొంగు చప్పున చల్లారినట్టు తన ఆశలు ఆవిరైనాయి, నిండు కుండలా వున్న కండ్లల్లో నుండి వటవటమని కన్నీళ్ళు భూమిని తాకాయి.
‘నిజమే ఆస్తులు – అంతస్తులు తాహతును త్రాసులో తూకం వేసే ఈ కాలమాన పరిస్థితులను చూసుకోకుండా రావడం నాదే పొరపాటు అయింది’ మనసులో అనుకున్నాడు దేవయ్య.
“ఏందయ్యో! నువ్ మరీను మా అన్నకేం తక్కువ నేను లేనా? అది నా కోడలు” గట్టిగా అంది సుభద్ర.
“గట్లైతే ఎక్కన్నో ఏంది నువ్ నీ కొడుక్కు చేసుకోవచ్చు గదా!” అన్న అంజయ్య వైపు ఇద్దరు జూసిండ్లు.
“భలే చమత్కారంగ జెప్పినవ్ గని వాడేమన్న మన చేతులున్నడా ఏంది?” పెనిమిటి దిక్కు జూసి దాట వేస్తూ అంది సుభద్ర.
“వాడిని నేను ఒప్పిస్తాలే గని ఇంతకు నువ్ ఎంతీయగలవ్ ” దేవయ్య వైపు జూసి అన్నాడు.
గొంతు ఉండ చుట్టుక పోయి ఊపిరి బిగుసుక పొయినంత పనైంది దేవయ్యకు, సుభద్ర మాత్రం పెనిమిటి మనసు గ్రహించి లోలోన మురిసిపోయింది.
‘అన్నీ తెలిసి గిట్లా మాట్లాడుతుండెందుకో’ మనసును తాకిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సంధిగ్ధావస్తలో కొట్టుమిట్టాడుతుా…
“నా దగ్గర మీరు ఆశించినంత అయితే లేదు నా స్థోమతకు తగ్గట్టు లగ్గం జేస్తా బావ” కాళ్ళ మీద బడి అన్నాడు.
“లే దేవయ్యా! నేనేదో పరాష్కానికి అన్న మాకు లెవ్వా అస్తులు మాకున్నది ఒక్కడే కొడుకు మేం ఏం జేసుకుంటం అరుణ ఇక నుండి మీ బిడ్డ గాదు మా బిడ్డ నువ్ ఫికర్ బడకుండా నిశ్చింతగా ఉండు” అని ప్రేమగా మెడ చుట్టూర చేతులు వేసి అన్నడు అంజయ్య.
“నీ ఋణం ఏమిచ్చి తీర్చుకోను బావ”
“ఏం వద్దు గాని గీ శుక్రవారం మంచి ముహుర్తం వున్నదటా మా కోడల్ను చూసుకోడానికి మేమంతా వస్తాం సరేనా” అన్న అంజయ్య వైపు చూసి.
“సరే మంచిది బావ” అన్నాడు దేవయ్య.
ఇంత మంచి మనసున్న చెల్లేకు బావకు కృతజ్ఞతలు చెప్పిండు.ఏ ఆటంకము లేకుండా తానచ్చిన పని అయినందుకు వేములవాడ రాజన్నకు వెయ్యి మొక్కలు మొక్కిండు, ఆ రాత్రంతా బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి డబ్బులు ఎక్కడెక్కడ దేవులాడాలో అని సోంఛాయించిండు.
హఠాత్తుగా వేములవాడ రాజన్న తరికనే చింత కింది రాజేందర్ దేవుని లెక్క కళ్ళల్లో మెదిలిండు.
గీ నడుమ ఊర్లో కానస్తలేడుగని ఊరికి పొంగనే కబురు చేయాలి, బడిపంతులాయే ఎక్కడనో కాళేశ్వరం దగ్గర చిన్న పల్లెటూరీలో డ్యూటీ చేస్తాండనుకుంటాండ్లు, దొరుకుతడో దొరకడో చిన్నప్పుడు వాళ్ల నాయన వ్యవసాయం పనిలో పెడతానంటే నేనే బలవంతనా చదివించమని చెప్పితే చదివించాడు అందుకే నేనంటే గౌరవిస్తాడు ఈ గండాన్ని తానొక్కడే గట్టెక్కించగలడాని గట్టిగా మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు దేవయ్య.
ఉదయవర్ణం గుమ్మంలోకి అడుగు పెట్టింది, వేప చెట్టు మీద పక్షులు సూరు క్రింద ఊరపిచ్చుకలు కిచకిచమంటూ సవ్వడి చేస్తున్నాయి,గడికో సారి గాలి బావ బొండుediమల్లెచెట్టు చుట్టూ చేరి సరసాలు ఆడుతుంటే అది ఒయ్యారం ఒలకబోస్తూ ప్రణయకేలి పరిహాసంతో తన పువ్వులను ముద్దుగా నేల రాల్చుతుంది.
ఆకాశానికి నేలకు మధ్య ఆశల పల్లకి మోసే మధ్యతరగతి వాడికి ఆనందం ఎంతసేపు ఉంటుంది.
సెకన్లు – నిమిషాలు – గంటలు – గడియలతో కాలం గడుస్తుంది.
ఒకింత ఆనంద – ఒకింత భయం – గుండెలో గుబులు – కాళ్లలో వణుకు – ముఖంలో ఆందోళన.
“ఏందయ్యా! ఇంతగా పరెషాన్ అయితానవ్, వాళ్ళు మాటిచ్చిండ్లంటే తప్పెటోళ్ళు కాదు గదా ” కాలుగాలిన పిల్లిలెక్క తిరుగుతున్న దేవయ్యను జూసి అంది నాగమ్మ.
“మొఖం నల్లబడి జనంల చెల్లని రూపాయి తరీఖ ఉన్నోళ్ళం కనీసం ఈ ఒక్క కార్యమన్న సక్కగైతే మనం బిడ్డను కన్నందుకు ఓ అర్థం వుంటదనుకుంటే గిట్ల కాబట్టే” అంటూ కూలబడిన దేవయ్య పక్కన కూర్చుండి ఓదారుస్తుంది నాగమ్మ.
ఇంతలో పక్కింటి పిలగాడు ఫోన్ వచ్చిందని తెచ్చి ఇచ్చాడు.భయంగా ఫోన్ తీసుకుని చెమటపట్టిన నుదురు తుడుచుకుని “హలో…సు..భ…ద్ర…” అన్నాడు, అంతకు మించి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి గడంచలో కూర్చున్నాడు.
పెనిమిటి స్థితిని గమనించిన నాగమ్మ ఆయన భుజం పట్టుకుని పక్కన కూర్చుంది. కాసేపు ఆగి “వాళ్ళేమన్నారయ్యా?” మెల్లగా అంది.
“పిల్లలను కంటాం గాని వాళ్ళ తలరాతను కనలేం గదా! నోరొకటి అనుకుంటే నొసలు ఇంక్కోటీ తల్చినట్టుందంటే గీదే కావచ్చునే ఇంజనీయర్ కు చదివినోడికి ఇంజనీయర్ అమ్మాయే కావాలని పెండ్లి జేసుకొని వచ్చాడట అల్లుడు. అసలు దీనికి పెండ్లి యోగం వుందో లేదో” అంటూ బోరుమన్నాడు దేవయ్య.
“దాని రాత ఎట్లుంటే గట్లనే అయితది నువ్ బుగులు పడితే పాణం నష్టం దప్ప ఏం రాదు ఏదైన మన మంచికే జరిగిందనుకోండ్లి” బుజ్జగిస్తూ అంది.
“నా వెర్రితనం కాకపోతే మనుషులంత డబ్బు చుట్టు తిరుగుతుంటే నేను బాంధవ్యాల చుట్టూ తిరిగాను” నొసలు కొట్టుకుంటూ అన్నాడు దేవయ్య.
“అయినా అన్నా వదినల తప్పేమున్నదయ్యా మనింటిపిల్ల మనకుంటదనుకున్నది ఇట్లైతదని వాళ్ళు మాత్రం కలగంటారా చెప్పు” ఓదార్చుతూ అంది నాగమ్మ.
“వరకట్నం నేరం అంటూ చట్టాలను ప్రచారం చేసినోళ్ళంతా ఎవరి పిల్లల వృత్తికి సరిపడ వారు పిల్లలను ఎంచుకుంటూ తాహతుకు మించిన అప్పులు చేస్తూ చాప కింద నీరులా వరకట్నాల రేట్లను బాహటంగానే పెంచుకుంటూ పోయిండ్లు మనం కట్నం ఇయ్యలేమనే గదా వాడు వాడికి సరిపడ పిల్లను జేసుకున్నాడు,ఇట్లాంటోళ్ళు జెయ్యబట్టే ఆడపిల్లను కనాలంటే భయపడుతాండ్లు జనం. పప్పు, కూరగాయలు!వంటనూనెల లెక్కనే పెండ్లి కొడుకులు మఖిలో నఖిలో తెలుస్తలేదు ఇప్పుడు దీనికి నేను ఏ అంగట్లో పెండ్లి కొడుకును వెతకాలో నాకు సమజైతలేదు” బాధగా తన మనసులోని బాధనంతా వెళ్ళగక్కిండు దేవయ్య.
ఇద్దరు సుధీర్ఘమైన ఆలోచనబడ్డరు,శోఖ సంద్రంను మధించగా పుట్టిన ఆలోచనల అలలేవో వారి మనసు పొరల్లో నుండి ఎగిసినాయి, ఇక ఒకరికి ఒకరు ఏం ఊసులాడుకున్నారో ఏమో! ఈ రాత రాసిన బ్రహ్మను ఖచ్చితంగా నిలదీయాలనుకున్నారు…
ఊరు అవతల పాత బాయికాడికి వచ్చిండ్లు, ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకుని కండ్లు మూసుకుని ఈ జీవన సాగరాన్ని ఈదలేక రూపాయి చుట్టూ తిరిగే మనుషులతో రాజీపడి పరుగులెత్తలేక ఓడిపోయి వెళ్ధామనుకున్నారో ఏమో! ఇద్దరు ఒక్కసారిగా బావిలోకి ఒరిగిండ్లు.
***
“అన్నా!”
స్కూల్ నుండి ఇంటికి వస్తున్న రాజేందర్ కు వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే తిరిగి చూసిండు.
“అరుణమ్మ…”
“అన్నా స్కూల్ బోయి వస్తానవా?”
“అవును రా ఎటుబోయి వస్తున్నవ్ చెల్లే ఇంట్లకు పోదాం పా ” అంటూ ముందు నడిచాడు.
అరుణ రాజేందర్ ను అనుసరించింది.
రాజేందర్ భార్య సీతమ్మ అరుణను జూసి దగ్గరకచ్చి కుర్చి వేసి కూర్చోమంది, తాను కూర్చుంది తనతో పాటు రాజేందర్ పక్కన కూర్చున్నాడు.
అలిసి పాలిపోయిన మొఖంతో అరుణ వదనం చిన్నబోయింది.దుఃఖాన్ని కంట్లోనే అనుచుకుంటున్నప్పటికి అవి లెంపల మీద నుండి జారి నేలమీద పడుతున్నాయి.
“ఇవిగో అన్నా డబ్బులు”కవరులో నుండి తీసి రాజేందర్ చేతిలో పెట్టింది.
“ఈ డబ్బులు ! ”
“నాకేం తెలుసు అనుకుంటున్నారా?”
“హూ” ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు రాజేందర్.
“ఆడపిల్లను గదా అన్నా అప్పులు జేసి పెండ్లి జేస్తుండ్రని ఏడ బాధపడుతుందోనని అనుకున్నాడేమో! అప్పు అంటే భయపడే బాపు అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా పరువు కోసం నీ దగ్గర తీసుకున్న పైసలు అన్నా ఇవి” బాదగా అంది అరుణ.
“అరుణా బాపు గురించి నీకు నాకు తెలుసిందే గదరా బాపే గాదు ఈ దేశంలో వరకట్నం అనే మహమ్మారి వుంది గా అందుకే ఏ తండ్రైనా అలానే చేస్తారు రా” అన్నాడు రాజేందర్.
“కాని మా తండ్రి, మా కుటుంబ పరిస్థితులు వేరు,అందుకే నేను పెండ్లి చేసుకోకుడదని నిర్ణయం తీసుకున్నాను.” కరాకండిగా అంది అరుణ.
“తప్పు చెల్లే ఈ సమాజం కోసమైనా వారి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి గదా”
“ఆడపిల్లెప్పుడు ఆడపిల్లే గాని ఇడ పిల్ల గాదనే ఈ దుష్ట సమాజపు సంకెళ్ళ గొంతులు తెంచుకుని భయటకు రావాలే వేదాలు,పురాణ ఇతిహాసాలు చరిత్రలో ఆడపిల్ల గురించి చాలా గొప్పగా చెప్పాయి, అయినా ఆడపిల్లంటే ఇంకా చిన్న చూపెందుకన్నా ఈ మనుషులకు..” ఆవేషంగా చెబుతుంది అరుణ.
“అరుణా నీ ఆలోచనలో నిజాయితీ వుంది, రేపటి ఆడపిల్లకు నువ్ దారి చూపే మార్గదర్శివి అందరు నీలా ఆలోచిస్తే ఈ కట్నాలు మ్యారేజ్ బ్యూరో బ్రోకర్లు ఇవేవి స్తీ జీవితానికి చీడపట్టేవి కావు” అరుణ కండ్ల నీరు తన చీర కొంగుతో తుడుస్తూ అంది సీతమ్మ.
“ఒకప్పుడు బాపు మాట కోసం ఊరంతా జూసేది ఆర్థికంగా చితికిపోయాకా ఆ మనుషులు దూరమయ్యారు, పెద్దోడు బోయిండు, చిన్నోడు బోయిండు, ఆస్థులు బోయినయ్ ఉన్న నేను నా దారినబోతే వాళ్ళేం అవుతరన్నా?” బాధగా అంది అరుణ.
“చెల్లే మరొక్కసారి బాగా ఆలోచించరా భయట ప్రపంచమంతా పెండ్లి చేయలేని అసమర్ధులుగా వారిని సూటిపోటీ మాటలతో మానసికంగా చంపుకు తింటుంది” లోకరితీని వివరించి చెప్పాడు రాజేందర్.
“అన్నా! నా పెండ్లి కోసం బాపు ఎన్ని గుమ్మాలు తొక్కిండో నాకు తెలుసు,ఎక్కడికి వెళ్ళిన ఒక్కటే ప్రశ్న , ఆ ప్రశ్నకు బదులు చెప్పుకోలేక ఈ సమాజంకు తన మనసుకు జరిగిన సంఘర్షణకు మధ్య నలిగి ఎంత వేదనకు గురైనాడో, ఏ పరిష్కారం దొరకకా ఈ రోజున చావే సరైన పరిష్కారం అనుకున్నారు” అరుణ చెబుతుంటే నీలిమిలితమైన కళ్ళ నుండి వటవట నీళ్ళు రాలుతున్నాయి.
“ఏమైంది చెల్లే?”
“ఏమైంది రా ?” సీత రాజేందర్ చెరోవైపు కూర్చుండి అడిగారు.
అరుణ ఆ రోజంతా జరిగిన సంఘటనలను విషదీకరించింది.
“ఇప్పుడు అమ్మ, బాపు ఎక్కడున్నారు?” ఇద్దరు తన భుజంపై చేయివేసి అన్నారు.
“ఇంట్లోనే వున్నారు” ముభావంగా అంది.
“ఈ సంఘం భయపడితే ఇంకా భయపెడుతుంది, ఎదురు తిరిగితే అది మనకు దాసోహం అంటుంది. నీ ఆలోచనలతో నేను ఏకిభవిస్తున్నాను ఇప్పుడు ఏ దిక్కులేని వారికి నువ్వే దిక్కవ్వాలి” జీవిత పోరాట స్పూర్తి తెలియజేశాడు రాజేందర్.
సీతమ్మ అరుణ మొఖం తుడిచి జుట్టు సరి చేసింది.
“అన్నా నేను ప్రైవేట్ గా ఫీజు కట్టీ ఎక్జామ్స్ రాస్తాను,ఆ వివరాలు నువ్వు చూసుకో నేను వ్యవసాయ పనులలో వారికి చేదోడు వాదోడుగా వుంటూనే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను” ధైర్యంగా అంది అరుణ.
ముగ్గురు కలిసి నాగమ్మ, దేవయ్య దగ్గరకు వచ్చి ఓదార్చారు.
“బాపు అరుణ నీకు కూతురైతే, నేను నీ కొడుకునే నువ్ అప్పుడు మా బాపుతో మాట్లాడి నేను చదువుకోడానికి ప్రోత్సహిస్తేనే నేను ఇలా వున్నాను, రేపు మన అరుణమ్మ కూడా నాలా టీచర్ ను చేసి మీ ముందు నిలబెడతాను” భరోసా ఇస్తూ అన్నాడు రాజేందర్.
అప్పుడు తనను చేసుకోడానికి మహరాజు లాంటి పిల్లవాడు వస్తాడు” సీత అరుణ భుజంపై చేయివేసి అంది.
“దయచేసి అప్పటి వరకు నేనే కాదు తను చెప్పింది గూడా విని ఏ రంది బెట్టుకోకుండా వుండండ్లి” రాజేందర్ దేవయ్య చేయి పట్టుకుని బతిమిలాడుతూ అన్నాడు.
“అమ్మా, బాపు నేను అరుణను అరుణవర్ణాన్ని నేనున్న ప్రతీచోట వెలుగే వుంటుంది మన కష్టాలు తీర్చే మార్గానికి దారులు వెతుక్కుంటూ ముందుకు వెళ్ధాం నాకు మీరు, మీకు నేను సరేనా” ఇద్దరిని దగ్గరకు తీసుకుని అంది అరుణ.
“సరే బిడ్డా! నీ ఆలోచన సరైనదే ఆడపిల్ల చదువుకుని నా ఇంటికి వెలుగు అవుతానంటే నాకదే ఆనందం” దేవయ్య కూతురును దగ్గరకు తీసుకుని అన్నాడు.
పాండవుల గుట్ట మీద నుండి తొంగి చూసిన సూర్యుడు అరుణవర్ణంతో ఆనంద కిరణాలను వారిపై ప్రకాశింపజేస్తూ మురిసిపొయాడు.
*****

వజ్జీరు ప్రదీప్ పరకాల హన్మకొండ జిల్లా నివాసి,
నేను ఇప్పటి వరకు 40 కథల వరకు రాశాను. అందులో 32 కథలు వివిధ పత్రికలలో ప్రచూరించబడినవి. నా మొదటి కథ “వాలిన పొద్దు” నమస్తే తెలంగాణ – బతుకమ్మ, లో 26 ఆగష్టు 2012 లో ప్రచూరించబడినది.
ఇంకా.. నమస్తే తెలఃగాణ బతుకమ్మ, అంధ్రభూమి, నవ తెలంగాణ – సోపతి, ప్రజాశక్తి – స్నేహ, సంచిక వెబ్ మ్యాగ్జీన్, కొలిమి వెబ్ మ్యాగ్జీన్, నేటి నిజం వంటి పత్రికలలో అచ్చు అయినవి.
2022 లో “చుక్కల పందిరి” మొదటి వచన కవితా సంపుటి.
