
ఓటమి
-ఎరుకలపూడి గోపీనాథరావు
సమ ఉజ్జీవుల నడుమ సాగే
హోరాహోరీ స్పర్థలో
ఓటమి కూడ
ఒక్కింత ఆనందంగా,
కొంత గౌరవ ప్రదంగానే ఉంటుంది!
మన తప్పిదాలపై
మన బలహీనతలపైనా,
పొరబాటుకు తావీయని
ఎదుటివారి సత్తువపైనా
నిజాయితీగా సమీక్ష చేసుకునే
సదవకాశాన్ని కల్పించి
లోపాలను సరిదిద్దుకునే
సలహాలను,
రేపటి గెలుపుకు తగిన
క్రొత్త వ్యూహాలనూ
అందించే అపజయం
సాధనకు సానబెట్టి
విజయ సంకల్పానికి
వినూత్న శక్తినిస్తుంది!
యుక్త యుక్తినిస్తుంది!
పరాజయాలను
పరాభవాలను
ప్రతికూల స్థితుల పరంపరలనూ
పరాస్తం చేస్తూ
పట్టుదలతో పొందే
విజయ మకుటం
కఠిన పరిశ్రమకు
ప్రతిఫలంగా దక్కే
కనక మణిమయ కీర్తి కిరీటం!
నిరాశతో క్రుంగక
జడత్వానికి లొంగక
పడిలేచిన తరంగంలా
విహంగంలా
విఫలత నుండి
ఎన్నదగిన ఎత్తులకెదిగే
దీక్షాపరులు
పరులకు మార్గ దర్శకులు!
“కృషితో నాస్తి దుర్భిక్షం “అనే
ఆర్యోక్తిని
అక్షరాలా నిజం చేసే
కార్యశీల కర్షకులు!
పదుగురికీ హర్షకులు!
పరాజయాలకు
ఖచ్చితమైన కారణాలను
పారదర్శకంగా
పరిశీలించకుండానే
ఆడలేక మద్దెల ఓడన్నట్లు
సత్యాన్ని దాచే
సాకులను వెదకడం
ఫక్తు పలాయన వాదం!
ఆటల్లో లాగే
ఆవహంలోనూ
ఎంతటి వారికైనా
అపజయం సహజమని,
దేవేంద్రుడు
సురవర పుత్రులు
రారాజులూ
సమరంలో ఓడిన
సమాచారం నిజమనీ
పురాణాల భాష్యమున్నది!
చారిత్రక సాక్ష్యమున్నది!
*****

