దేవి చౌధురాణి

(మూడవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

భవాని ఠాకూర్‌కి సందేశం అందించిన తరువాత రంగరాజు లెఫ్టినంట్ వున్న పడవ వద్దకు తెల్ల జెండా పట్టుకుని వెళ్లాడు. జెండా చూసిన ఇంగ్లీషు సిపాయిలు రంగరాజుని అడ్డగించలేదు.

రంగరాజు ఇంగ్లీషు వాడి పడవ ఎక్కగానే లెఫ్టినెంట్ “మీరందరూ లొంగిపోతున్నారా?” అని అడిగాడు.

“అందరం కాదు, మీరు ఎవరిని పట్టుకోవటానికి వచ్చారో, ఆవిడ మాత్రమే లొంగిపోతున్నది.”

“దేవి చౌధురాణి లొంగిపోతున్నదా?”

“అవును.”

“మరి మీరందరూ?”

“మీరందరు అంటే ఎవరు?”

‘దేవి చౌధురాణి దళం.”

“వాళ్లెవరూ లొంగిపోవటంలేదు.”

“మేము దేవితో బాటు మీ ముఠా మొత్తాన్నీ బంధించటానికి వచ్చాము.”

“ముఠా? ఎంతమంది వున్నారు ఈ ముఠాలో? వేల మంది వున్నారు. ఎంతమందిని పట్టుకుంటారు?”

భవాని ఠాకూర్ తన దళంతో ఇంకా అడవిలోకి పూర్తిగా నిష్క్రమించలేదు. వాళ్లని చూపుతూ లెఫ్టినెంట్ “వీళ్లందరు డాకూలు, మేం అందరినీ పట్టుకుంటాము” అన్నాడు.  అదే సమయంలో భవాని ఠాకుర్ దళం అడవిలోకి వెళ్లటానికి వెనుదిరిగింది.

అది చూస్తూ లెఫ్టినెంట్ అరుస్తూ “మీరు తప్పించుకుని పారిపోవటానికి తెల్ల జెండా చూపించి మోసం చేస్తున్నారు” అన్నాడు.

“ఎవరూ పారిపోవటం లేదు. నీకు చేతనైతే పట్టుకో, బంధించు. నువ్వు అందరినీ పట్టుకుని బంధించగలను అనుకుంటే, అలాగే చెయ్యి. సరే ఎవరు వద్దన్నారు?” అంటూ తెల్ల జెండాని లెఫ్తినెంట్ కాళ్ల దగ్గరకు విసిరాడు రంగారాజు.

ఆ దట్టమైన అడవిలోకి భవాని ఠాకూర్ ముఠాని పట్టుకోటానికి తన సిపాయిలని పంపిస్తే దారి తెన్నూ తెలిక తప్పిపోతారని లెఫ్టినెంటుకు తెలుసు. అందుకని కాసేపు మౌనంగా వుండిపోయాడు. తర్వాత బిగ్గరగా, “అడవిలోకి పొయిన వాళ్ల సంగతి సరే, ఇక్కడ వున్న మీరందరూ, నీతో సహా లొంగింపొతున్నారా?” అన్నాడు.

“లేదు, నేను దేవి వద్దనుండి వచ్చిన దూతను మాత్రమే. కేవలం దేవి మాత్రమే లొంగిపోతున్నది. నేను వేరెవ్వరి విషయం చెప్పటం లేదు.”

లెఫ్టినెంట్ “ఫిష్‌ష్‌ష్” అంటూ చులకనచేస్తూ “దేవి రాణి మాత్రమేనా!? నా దగ్గర ఐదు వందల మంది సిపాయిలున్నారు, మీ మనుష్యలంతా అడవిలోకి పారిపోయారు కదా. ఆ ఓడ పైన వున్న కొద్ది మంది మనుష్యులు మమ్మల్ని ఆపగలరా? నేను నావను కూడా ఆక్రమించుకుంటాను.”

“మీరు నావ పైకి వెళ్లితే ప్రమాదమని హెచ్చరిస్తున్నాను” అని అన్నాడు రంగరాజు.

“నా ఐదు వందలమంది సిపాయిల ముందు ఆ నావపైన వున్న నలుగురు మనుష్యులు ఒక లెక్క కాదు” అంటూ తన చేతిలో వున్న తెల్ల జెండాను విసిరి “ఆ నావను ముట్టడి చెయ్యండి అంటూ ఆజ్ఞాపించాడు లెఫ్టినెంటు.

వెంటనే ఐదు నాగతరులూ ఆ నావను చుట్టుముట్టాయి. లెఫ్టినెంటు గట్టిగా అరుస్తు ఇచ్చిన ఆజ్ఞ నావలో దేవికి వినబడింది. వెంటనే తన నావికులని వాళ్ల ఆయుధాలను నదిలోకి విసరమని ఆజ్ఞాపించింది. వాళ్లు అలాగే చేసారు.

ప్రత్యర్థులు ఆయుధాలని విసిరివేయటం లెఫ్టినెంటు చూసాడు. రంగరాజు కూడా తన ఆయుధాలను విసిరివేసాడు.

“ఇప్పుడు నావ పైకి ఎక్కి ఏముందో చూస్తాను” అన్నాడు లెఫ్టినెంట్.

“మీరు నావ పైకి ఎక్కి బల ప్రయోగం చెయ్యవద్దు. మీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తప్పు నాది కాదు.” అన్నాడు రంగరాజు.

“నీ తప్పని ఎవడన్నాడు” అంటు ఒక తుపాకి భుజాన వేసుకున్న సిపాయితో కలసి నావ పైకి ఎక్కాడు లెఫ్టినెంట్.

లెఫ్టినెంట్ నావ పైకి ఎక్కిన తరువాత అక్కడి కట్టడం దగ్గరకి వెళ్లాడు.  తలుపులకి తాళాలు వేసి ఏమీ లేవు. లెఫ్టినెంట్‌, వెంట వచ్చిన సిపాయితో సహా తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. వెంటనే లోపలి వైభోగం చూసి ఆశ్చర్యపోయారు. గోడలుకు అందమైన చిత్ర రచనలు వేసివున్నాయి. కిటికీలకు అందంగా తెరలు, నేలపై తివాచీలు వున్నాయి. ఒక ముక్కాలిపీటకు వ్రేలాడుతున్న గిన్నెలో అత్తర్లు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఓ బంగారు కలశంలో పూల గుత్తి వుంది. వెండి విగ్రహాలు నలుమూలలా నిలబెట్టి వున్నవి. కప్పు పైనుండి బంగారపు గొలసులతో  వ్రేలాడుతున్న దీపపు గుత్తి కాంతులు వెదజల్లుతున్నది. ఆ రాజమందిరంలో ఎదురుగా రెండు సింహాసనాల మీద ఇద్దరు స్త్రీలు ఘనమైన వస్త్రధారణతో, వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలతో ఠీవీగా కూర్చుని వున్నారు. ఇంగ్లీషు వాడికి అక్కడ కూర్చున్నవారెవరో తెలవదు. రంగరాజుకి మాత్రం వాళ్లిద్దరూ నిశి, దివలని తెలుసు.

వెండి నగిషీతో కూడిన కుర్చీ ఒకటి అతిథి కోసం వేసి వుంది.

మరి దేవి ఎక్కడ? రంగరాజు కళ్లు నలుమూలలకు చూసాయి. దేవి ఒక మూల నిలబడి వుంది. నూలు చీరతో, జుట్టు వెనుకకు వదులుగా ముడి వేసుకుని ఒక సాధారణ దాసీ వలె వినయంగా నిలబడి వున్నది. దేవి చేతులకు మాత్రం రెండు ఇనప కడియాలు వున్నవి.

ఇంగ్లీషువాడు బిగ్గరగా “మీ ఇద్దరిలో దేవి చౌధురాణి ఎవరు? నేను ఎవరితో మాట్లాడాలి?” అన్నాడు.

“నేనే దేవి చౌధురాణిని” అన్నది నిశి.

అది వింటూనే దివ గట్టిగా నవ్వి “ఇది అల్లరి చెయ్యటానికి, ఆటలాడటానికి సమయం కాదు. లెఫ్టినెంట్ సాబ్, ఈ అమ్మాయి వట్టి అల్లరి పిల్ల, పట్టించుకోవద్దు. నేనే దేవి చౌధురాణిని” అన్నది.

నిశి ఆశ్చర్యం ప్రకటిస్తూ “ఎందుకే, నా బదులు ఉరి ఎక్కి నరకానికి వెళ్దామనుకుంటున్నావా?” అన్నది. లెఫ్టినెంట్ వైపుకి తిరిగి “సాబ్, మా చెల్లెలికి నేనంటే చాలా ఇష్టం, తనను తాను త్యాగం చేసుకుని నన్ను కాపాడాలని అనుకుంటున్నది. నాకేమీ భయంలేదు. నన్ను బంధించి తీసుకు వెళ్లండి.”

దివ వెంటనే “లెఫ్టినెంట్, మీ ప్రభువు ఏసు క్రీస్తు మీద వట్టు వేసి చెపుతున్నా, మా అక్కకి ఇందులో భాగం ఏమీ లేదు. నేనే దేవి చౌధురాణిని” అన్నది.

లెఫ్టినెంటుకు కోపం హెచ్చింది. రంగరాజు వైపుకి తిరిగి చిరాకుగా “ఇందులో దేవి చౌధురాణి ఎవరు” అంటూ హూంకరించాడు.

ఏదో తంత్రం జరుగుతోందని రంగరాజు గ్రహించాడు. కాని ఎవరిని దేవి అని చెప్పాలో నిర్ణయించుకోలేక పోయాడు. చివరకు నిశిని చూపించి ఆవిడే దేవి అన్నాడు.

అంతలో ఒక మూల నుంచుని వున్న అసలు దేవి మొత్తానికి నోరు తెరిచి “ఇప్పుడు నేను మాట్లాడటం మంచిదో కాదో, కానీ వెనుకగా నిలబడి అబద్దాలు చెపుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను. ఈ స్త్రీ ఆవిడకు శిష్యురాలు, ఆవిడను మాతా అనటం నేను విన్నాను. ఆవిడను కాపాడాలని తనే దేవి అని చెపుతున్నది” అంటూ దివను చూపింది దేవి.

లెఫ్టినెంటుకి ఈ గడబిడలో ఏం జరుగుతున్నదో అర్థం కావటంలేదు. “ఇంతకీ అసలు దేవి ఎవరు?” అంటూ అరిచాడు.

“నేను” అన్నది అసలు దేవి.

“కాదు, నేను” అన్నారు నిశి, దివలు ఒక్కసారిగా.

రంగరాజు కూడా గొంతుకలిపాడు. నిశి, దివలు నేనంటే నేను అని పోట్లాడుకోవటం మొదలుపెట్టారు.

అందరూ కలసి ఒక్కసారిగా మాట్లాడుతూ గందరగోళం చేసారు.

లెఫ్టినెంటుకి ఈ తమాషా వ్యవహారం చాలానే నడిచింది, ఇంక ఆపాలని అనుకున్నాడు. బిగ్గరగా, “ఆపండి. మీ ఇద్దరిలో ఒకళ్లు దేవి చౌధురాణి. మీ ఇద్దరిలో ఒకళ్లు డాకురాణి. నన్ను మోసం చేద్దామని అనుకుంటున్నారు. నన్ను మోసగించలేరు. ఋజువులు కనుక్కుని అసలు దేవిని ఉరి తీస్తాను. ఋజువులు దొరకకపోతే  ఇద్దరినీ పట్టుకుపోయి ఉరి తీస్తాను” అంటు అరిచాడు.

నిశి, దివలు “ఋజువు కావాలంటే మా గురించి మీకు చాడీలు చెప్పినవాడున్నాడు కదా. వాడిని పిలిపించి మాలో ఎవరు దేవినో గుర్తు పట్టమనండి” అన్నారు.

లెఫ్టినెంటు వెంటనే తనతో వచ్చిన హరివల్లభ రాయ్ గుర్తుకు వచ్చాడు. నిజమే, వాడ్ని పిలిపిస్తే అసలు దేవి ఎవరో గుర్తు చెపుతాడని అనిపించింది. వెంటనే సిపాయితో “చాడీలవాడిని పిలిపించు” అంటు హుకుం జారిచేసాడు.

సిపాయి బయటకి పరెగెత్తి అటు వైపుని నాగతరి మీద వున్న జమేదారుతో “సాబ్ చారుడిని పైకి పంపించమంటున్నారు” అని అరిచాడు.

మరి ఆ చారుడి జాడ ఏది?

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.