
ముంగిట్లో రావిచెట్టు
आंगन का पीपल
హిందీ మూలం – – డా. లతాఅగ్రవాల్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
జర్నలిజంలో ఎం.జె. చదువుతున్న నిషూ ఈసారి పట్నం నుంచి పల్లెటూరికి వచ్చినప్పుడు తనలో కొంచెం మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తన వ్యవహారంలో జర్నలిజం స్పష్టంగా గోచరిస్తోంది. చిన్న చిన్న విషయాలకి కూడా ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ లాంటి ప్రశ్నలు ఇప్పటివరకూ ఆమె మనస్సులోనే ఉండేవి. కాని ఇప్పుడు అవి తన నోట్లోంచి బహిర్గతంకాసాగాయి. అన్నిటికన్నా ఎక్కువ ఔత్సుక్యం తనకి ఆ యింటికి ఆనుకుని ఉన్న ఒక గది… దాన్ని ఒక చిన్నగది అంటేనే బాగుంటుంది… ఆ చిన్నగదిలో నులకమంచం మీద పడుకొని ఉన్న తన నాన్నగారి మేనత్త… అంటే తనకి వరసకి అమ్మమ్మ అయిన పెద్దావిడ గురించి ఉంది. తనకి ఊహ వచ్చినదగ్గరినుంచి అమ్మమ్మని ఒంటరిగా ఉండటమే చూసింది. మొదట్లో మొత్తం ఇల్లంతా ఆవిడ పెత్తనంలోనే నడిచేది. ఆవిడ అనుమతి లేకుండా ఏ పనీ జరిగేదికాదు. కాని, ఆవిడ సామ్రాజ్యం ఎప్పుడు, ఎలా కుదించుకుపోయి ఇంటికి ఆనుకుని ఉన్న ఆ చిన్నగది వరకు వచ్చిందన్నది తెలియనేలేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే తన మనస్సులో ఇంతకుముందెప్పుడూ ఈ సంగతి ఎందుకు రాలేదని. నిజానికి ఈ మార్పు ఎవరూ ధ్యాస ఇవ్వని విధంగా చాలా నెమ్మదిగా జరిగింది. కాని, ఇప్పుడు జర్నలిజంలో స్త్రీ యొక్క దశ, దిశ గురించి సీరియస్ గా చదివి, చూసి, అనుభూతి చెందిన తరువాత ఇది కూడా ఒక స్త్రీకి సంబంధించిన విషయమేకదా అని అనిపించింది. తను తన పాత్రికేయతని ఉపయోగించి సంఘంలోని బూజుపట్టిన ఆలోచనలని మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇది తన ఇంట్లోనుంచే ప్రారంభించాలి కదా అని కూడా తనకి అనిపించింది. ఉదయం తను నిద్ర లేచేసరికి నాయనమ్మ స్నానం చేసుకుని, పూజ చేసుకునే సమయం అయింది. ఆవిడ తులశమ్మకి నీళ్ళు అర్పిస్తోంది.
“నాయనమ్మా! నువ్వు రోజూ తులశమ్మకి నీళ్ళు అర్పించాక, చేతులు జోడించి ఏమని అడుగుతావు?” నిషూ సహజంగానే అడిగింది.
“ఈ యింటి మంచి, క్షేమం, శ్రేయస్సూ నమ్మా,”నాయనమ్మ క్లుప్తంగా జవాబు చెప్పింది.
“తులసి మొక్కకి నీళ్ళు పోస్తే ఇంటికి మంచి జరుగుతుందా నాయనమ్మా?” నిషూ ఏమీ తెలియనట్లుగానే అడిగింది.
“తల్లీ! ఇది కేవలం తులసిమొక్క మాత్రమే కాదు…. ఈ యింటికి బిడ్డ. ఇది ఎంత పచ్చగా కళకళలాడుతుందో ఈ యింట్లో కూడా అంతగానే సుఖసంతోషాలు ఉంటాయి.”
“అలాగా! ఈ సంగతి నాకు ఇంతవరకూ తెలియదు. అంటే దీని అర్ధం కూతుళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో, ఇంట్లో కూడా అంత సుఖశాంతులు ఉంటాయన్న మాట…. అంటే కూతుళ్ళు ఇంటికి లక్ష్మితో సమానం. అంతేనా నాయనమ్మా?”
“ఊఁ!”నాయనమ్మ తులశమ్మకి ప్రదక్షిణ చేసుకుంటూనే తన అంగీకారం తెలుపుతూ తలకాయ ఊపింది.
“అవునా నాయనమ్మా! అటు చూడు. నువ్వు అటువైపు చూసినట్లు లేదు. తులసికోట గోడనుంచి ఆ చిన్న రావిమొక్క నీళ్ళకోసం ఎలా తొంగిచూస్తోందో. కాస్త దానిక్కూడా నీళ్ళు పొయ్యి…అది కూడా పచ్చగా ఉంటే అదికూడా కాస్త దీవిస్తుంది.” నిషూ ఆ చిన్నారి రావిమొక్కని చూస్తూ అంది.
“ఏమిటే పిల్లా. ఏమేమిటో అడుగుతావు…పూజ కూడా సరిగా చేసుకోనివ్వవు.”నాయనమ్మ కొంచెం చిరాకు పడుతూ అంది.
“ఊఁ. నాయనమ్మా నేను చెప్పేది… ఈ చిన్న రావిమొక్క….” నిషూ నవ్వుకుంటూనే రావిమొక్క దగ్గరికి వెళ్ళసాగింది.
“వద్దు, వద్దు, దానిజోలికి వెళ్ళద్దమ్మా. దాన్ని ముట్టుకోకు.”
“ఎందుకని నాయనమ్మా? రావిచెట్టు కూడా పూజించదగిన వృక్షమే కదా…మరి ఎందుకు ముట్టుకోకూడదు ?”
“నీకు ఎలా చెప్పనే తల్లీ, తులశమ్మ ఇంటి ప్రాంగణంలో ఉండటం చాలా మంచిది. కాని ఇలా గోడ ఛేదించుకుని వచ్చిన రావిమొక్క అంత మంచిది కాదు.”
“ఎవరు చెప్పారు నాయనమ్మా…? అలా అయితే దీన్ని పీకి పారేద్దాం…” నిషూ ఒక అడుగు ముందుకి వేస్తూ అంది.
“అయ్యో రామా…ఏంచేస్తున్నావే తల్లీ, ఇది రావిమొక్కమ్మా. దీన్ని పీకకూడదు… ఇది భగవంతుడి నివాసం…దేవుడికి కోపం వస్తుంది.”
“మరేం చేద్దాం నాయనమ్మా… ఇందులో దేవుడు ఉంటాడు, ఇది ఉండటం మంచిదికూడా కాదు, దీన్ని ఉంచకూడదనికూడా అంటావు. మరి పీకిపారెయ్యడానికి కూడా భయపడుతున్నావు…”
“అదంతా నాకు తెలియదమ్మా… నా బుర్ర తినకు. నేను విన్నదేదో చెప్పాను. నేను చెప్పేది విను. కొన్ని మొక్కలు ఇంట్లో ఉండటం కూడా మంచిది కాదంటారు. కాని వీటిని తీసిపారేయడంకూడా చెయ్యకూడదు.” అలా అంటూ నాయనమ్మ లోపలికి వెళ్ళిపోయింది. కాని నిషూ కుతూహలం మాత్రం అలాగే ఉంది. వాకిట్లో కూర్చుని కూరలు కడుగుతున్న అమ్మమ్మ నిషూ అడిగే ప్రశ్నలకి ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది.
నిషూ జర్నలిస్టు మనస్సు మాత్రం ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలనే పట్టుదలతో ఉంది. ఇంక అమ్మమ్మనే అడిగి తెలుసుకోవాలి. ఆవిడే తనకి చిన్నతనంనుంచి వేదాలు-పురాణాల కథలు ఎన్నో చెబుతూ వచ్చింది. ఈ అవాంఛితమైన రావిచెట్టు రహస్యం ఆవిడే చెబుతుంది… కాని ఆవిడ తన కథ ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? విషయాన్ని ఒక చివర పట్టుకుని ఆలోచిస్తున్న నిషూకి మరో చివర చేతుల్లో చిక్కుపడిపోతోంది. ఇంతకీ అమ్మమ్మ జీవితంలో ఈ ఏకాంతం ఎలా వచ్చింది? ఆవిడెప్పుడూ పెళ్ళి చేసుకోవాలని కలలు కనలేదా? ఆవిడని చూస్తే మాత్రం అనిపిస్తుంది ఆవిడ తన వయస్సులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండి ఉంటుందని. ఎవరో తనకి నచ్చిఉంటారు. లేకపోతే ఆవిడకి అసలు పెళ్ళే కాలేదా…?
రావిమొక్క ప్రసక్తి అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు అమ్మమ్మ గురించిన ఆలోచనలు ఎన్నో తన మనస్సులో పరిభ్రమిస్తున్నాయి. ఆరాత్రి తను అమ్మమ్మ దగ్గర పడుకోవాలనే సంకల్పంతో ఆవిడ గదిలోకి చేరుకుంది.
“రా అమ్మా.పట్నంలో ఎలావుంది నీకు?”
“ప్రత్యేకించి ఏంలేదు అమ్మమ్మా… నాకయితే మన వూళ్ళోనే, స్వంతఇంట్లోనే -మన ప్రాంగణంలోనే బాగుంది.”
“మన స్వంతఇల్లు…” ఒక్క క్షణం అమ్మమ్మ మౌనంగా ఉండిపోయింది.
“ఏమిటి అమ్మమ్మా, స్వంతఇల్లు అంటూ ఉలికిపడ్డావెందుకని?”
“అబ్బే…అదేం లేదమ్మా, ఊరికేనే.”
“అదేమిటో నాక్కూడా చెప్పవా అమ్మమ్మా…” అంటూ నిషూ ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి బతిమాల సాగింది.
“చెప్పానుగదమ్మా ఏంలేదని…”
“కాదు. ఏదో ఉంది. నాకు చెప్పడం నీకిష్టం లేదు… చెప్పవా అమ్మమ్మా.”
“చూడమ్మా, ఇల్లు అనేది కోడళ్ళకి చెందుతుంది. కూతుళ్ళకైతే ఇది పుట్టిల్లు… పుట్టింటికైతే కూతుళ్ళు అప్పుడప్పుడూ వస్తూ ఉంటేనే బాగుంటుంది.”
“అలా ఎందుకంటున్నావు అమ్మమ్మా… నువ్వుకూడా ఈయింటికి కూతురువే కదా, అదేదో అంటారు కదా అమ్మమ్మా… కూతురంటే ముంగిట్లో తులశమ్మ లాంటిదని.”
“ఎప్పుడో నేను కూడా ఈ ముంగిట్లో తులసి అన్నట్లుగా ఉండేదాన్ని. ఒకప్పుడు నా నవ్వుల సౌరభంతో ఈ యిల్లు గుబాళిస్తూ ఉండేది.” గతానికి చెందిన వీధుల్లో ఎక్కడో లీనమైపోయిన అమ్మమ్మ గొంతుకలో గాఢమైన నిశ్శబ్దం నెలకొంది.
“ఉండేది అంటే…! దాని అర్ధం ఏమిటి! ఇప్పుడు మాత్రం ఏమయింది…? అమ్మమ్మా నీకు పెళ్ళి అవలేదా?…లేకపోతే నీకు ఎవరూ నచ్చలేదా…? చెప్పవా…నాకు తెలుసుకోవాలని ఉంది.”
“తప్పకుండా చెబుతాను తల్లీ, ఈరోజున ఎన్నో సంవత్సరాల తరువాతైనా ఎవరికన్నా తెలుసుకోవాలని అనిపించింది. నీలాగే నేను కూడా చురుగ్గా, చాలా చలాకీగా ఉండేదాన్ని. అందుకే నేను నీలో నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను. చెప్పదలుచుకున్నదేదో ముఖంమీదనే చెప్పేసేదాన్ని. ఎవరూ నాకు నచ్చలేదని కాదు. సంజవేళ తులశమ్మదగ్గర దీపం వెలిగిస్తూ మౌనంగానే అమ్మకి చెప్పుకోలేని నా మనోభావాలని తులశమ్మకి చెప్పుకునేదాన్ని. మనోదర్పణంలో అస్పష్టంగా ఉన్న ఒక చిత్రం గోచరించేది. కాని ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను… చివరికి ఆ చిత్రంతో కూడా, కేవలం వేపచెట్టు కింద కూర్చుని ఎవరికీ తెలియకుండా ఆ అస్పష్టమైన చిత్రంతో నన్ను నేను జోడించుకుని కలలు కనేదాన్ని. నాలో నేనే సంతోషంతో పొంగిపోయేదాన్ని. తులశమ్మ కూడా నా రహస్యాన్ని రహస్యంగానే ఉంచింది. దాని ఫలితంగా ఆ చిత్రం నాకు తెలియకుండానే ఇంకెవరి ఫ్రేములోనో ఇమిడిపోయి నాకు చాలా దూరంగా వెళ్ళిపోయింది.”
“అప్పుడుకూడా నువ్వు ఎవరికీ చెప్పలేదా…?”
“ఎలా చెబుతాను!అంత ధైర్యం నాకు ఎప్పుడూ లేదు.”
“తర్వాత ఏమయింది?”
“ఇంక తర్వాత… ఏమయినా కూతుళ్ళకి తమ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ జరుగుతుంది తల్లీ, సాధారణంగా ఒక ఆడపిల్లకి జరిగేదే నాకూ జరిగింది. నేను ఈ సగం గీచిన చిత్రాన్ని నాన్న ఇంకెవరి ఫ్రేములోనో బిగించాడు.”
“అలాగా!అంటే దాని అర్థం నీకు పెళ్ళి అయిందన్నమాట!మరి నువ్వు ఇక్కడ…?”
“ఏం చెప్పను తల్లీ, జీవితంలో చెప్పుకోతగినది ఏమైనా ఉంటే కదా, మనోదర్పణంలో ఒకసారి ఏదయినా చిత్రం స్థిరంగా నెలకొని ఉంటే మరో చిత్రానికి చెందిన రూపం దానిమీద నిలబడటం ఎప్పటికీ సాధ్యం కాదు. అంతేకాక ఆ మరోవ్యక్తి కూడా వ్యసనాలకి దాసుడు, ఒక జల్సారాయుడు. `ఇంక కష్టమైనా, సుఖమైనా నీ బతుకంతా ఆ యింట్లోనే గడపాలి.’ అని అమ్మ చెప్పిన హితోపదేశం కొంగున కట్టుకుని నేను ఈ ముంగిటినుండి వీడ్కోలు తీసుకున్నాను.”
“అవతలివాళ్ళు సరైనవాళ్ళు కాకపోయినా కూడానా?”
“అవునమ్మా. అప్పుడుకూడా. ఆ కారణంగానే తల్లీ, ఆ కాలంలో పెళ్ళిచేసుకుని అత్తవారింటికి వెళ్ళిన కూతుళ్లు ప్రతికూల పరిస్థితుల్లోకూడా అక్కడే ఉండేవాళ్ళు. ప్రతిరోజూ అంతర్మథనం చెందుతూ, క్షణంక్షణం చస్తూ-బతుకుతూ… వాళ్ళ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లాగా ఉండేది. వాళ్ళకి కష్టాలతోకూడా తప్పనిసరిగా తమ ఇంటి గుమ్మానికి లోపలే ఉండే నైపుణ్యం ఎలాగో అలా అలవర్చుకోవలసివచ్చేది.”
“మరి నువ్వు…?”
“అయ్యో రాత! నేను ఆ నైపుణ్యం నేర్చుకోలేకపోయాను. ఇక్కడ దీనినే నా ఇల్లుగా భావించి తిరిగి వచ్చేశాను.”
“మంచిపని చేశావు. నువ్వు విడాకులు తీసుకుని ఇంకో పెళ్ళి చేసుకోవలసింది.”
“విడాకులా! ఆ కాలంలో ఒక ఆడదానికి అంతకన్నా పెద్ద నింద అనేది లేదు… తప్పు ఎవరిదైనా అది ఆడదాని నెత్తిమీదనే మోపేవారు. నీకు నేను అహల్య గురించి, సీతమ్మ గురించిన కథలు చెప్పానుకదా. మగవాడు ఎంతమంది స్త్రీలతో సంబంధం పెట్టుకున్నా అతనికి ఎటువంటి దోషమూ అంటదు… కాని, ఒకసారి పెళ్ళి అయిన ఆడపిల్లని వినియుక్తలా భావిస్తారు… అలా భావించి సంఘం అటువంటి పిల్లని స్వీకరించేది కాదు.”
“ఓ షిట్… పూనమ్ మేడమ్ చెప్పేది నిజమే. స్త్రీయొక్క మదింపు చెయ్యడం, ఆమెగురించిన విలువని అంచనా వెయ్యడం అనేది కేవలం ఆమె శీలం ఆధారంగానే…?”నిషూకి పూనమ్ మేడమ్ చెప్పిన ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది.
“ఏమన్నా అన్నావా తల్లీ?”
“ఆఁ… అవునమ్మమ్మా. సంఘం ఎంత నీచంగా ఆలోచించేది.”
“ఆలోచనలో ఇప్పుడుకూడా పెద్దగా తేడా ఏదీ రాలేదమ్మా.”
“అమ్మమ్మా, ముందు నువ్వు అక్కడ అందరితోనూ కలిసి ఉండేదానివికదా, మరి ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నగదిలో ఇలా ఎందుకు ఉంటున్నావు?”
“తల్లీ! శిరీషవృక్షానికి కొత్తగా మొగ్గ తొడిగినప్పుడు అది పాతపువ్వుని తోసేసి కొమ్మనుండి వేరుచేసేస్తుంది… ఇదే ప్రకృతినియమం. ఇప్పుడు అందరికీ వేరు-వేరు గదుల అవసరం వచ్చింది. నేనే ఈ ఇంట్లో పరాయిదాన్ని. అందువల్ల నాకు వేరే గది… ఈరోజు వరకూ నేను అర్థం చేసుకోలేకపోయాను కూతుళ్ళకి పెళ్ళి అయాక పుట్టింటి గుమ్మం అనేది ఇంత ఎత్తుగా ఎందుకు ఉంటుందని!”
అమ్మమ్మ చెప్పేది విని నిషూకి కళ్ళు చెమ్మగిల్లాయి.
నిన్నటినుంచి అమ్మమ్మకి తేలికపాటి జ్వరంగా ఉంది. రాత్రి ఆవిడ అన్నంకూడా తినలేదు. ఎవరూ తినమని ఆవిడని బతిమాలలేదు కూడా. నిషూ ఒక గ్లాసుతో పాలు తీసుకువెళ్ళి ఇచ్చింది. అదే తాగి ఆవిడ పడుకుంది. ఆవిడకి దగ్గరగానే పడుకుని ఆలోచిస్తోంది నిషూ. ఎవరితోనైనా చెప్పుకోవడానికి ఆవిడ మనస్సులో ఎంతగా మథన పడుతోందో. కాని ఆవిడమాత్రం ఎవరితో చెప్పుకోగలదు? ఎవరు వింటారు? ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చునేందుకు ఎవరికీ ఖాళీసమయం లేదు. సాయంత్రం అవుతూనే ఆవిడకి వాంతులు మొదలయ్యాయి.
“నాయనమ్మా! నాయనమ్మా!” నిషూ నాయనమ్మని గట్టిగా పిలిచింది.
“ఏమయిందే… అంత గట్టిగా అరుస్తున్నావు?”అలసట తెలుపుతున్న స్వరంలోనే ఆవిడ అంది.
“నాయనమ్మా, అమ్మమ్మకి వాంతులు అవుతున్నాయి.”
“భగవంతుడా, భలే ఇబ్బందిని తెచ్చిపెట్టావు మా నెత్తిమీదికి.” సణుక్కుంటూనే ఆవిడ ఆ చిన్నగదిలోకి వచ్చింది.
“ఏమయింది వదినా, కాస్త ఎక్కువగానే తిన్నట్టున్నావు. అందుకే వాంతులవుతున్నాయేమో… చూడమ్మా నిషూ, కాస్త ఎలక్ట్రాల్ కలిపి ఇయ్యి. తెల్లారేసరికి సర్దుకుంటుంది.” అలా చెప్పి నాయనమ్మ గదిలోంచి బయటికి వచ్చింది. నిషూ వెంటనే ఆవిడ వెనకాలే వచ్చింది.
“నాయనమ్మా! ఆవిడకి జ్వరంగా ఉంది. డాక్టరుకి చూపించండి.”
“ఓసి తల్లీ! రాత్రి సరిగా నిద్ర పట్టివుండదు. తలకాయ నొప్పి వచ్చిందేమో. అందుకే వాంతులవుతూ ఉండవచ్చు…అలా అవుతుంది అప్పుడప్పుడూ… పొద్దుటికి సర్దుకుంటుంది. ఆవిడకి కాస్త బామ్ బాగా రాయి. అక్కడే తలగడ దగ్గరే ఉంటుంది. తలకి కాస్త గుడ్డ ఏదయినా గట్టిగా కట్టు. బాధ తగ్గుతుంది. మందు బిళ్ళలు తెప్పిస్తాను.” ఇలా అంటూ నాయనమ్మ ఆవలించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.
నిషూ ఆలోచనల్లో లీనమయింది. అమ్మమ్మ ఇంతగా భారంగా ఉందనిపిస్తే ఎవరూ సమయం ఉండగా ఆవిడకి మళ్ళీ పెళ్ళి చెయ్యాలని ఎందుకు ఆలోచించలేదు? పెళ్ళి ఒక్కటే జీవితలక్ష్యం కాదనుకుంటే ఆవిడకి చదువుచెప్పించి తన కాళ్ళమీద తాను నిలబడేలా ఎందుకు చెయ్యలేదు? ఈరోజున ఈవిధంగా తన ఇంట్లోనే నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటూ క్షణం-క్షణం చస్తూ బతకడం ఎంత కష్టం?… సరిగా తన జీవితాన్ని నిలుపుకోవాలనే కాంక్షతో ఒక్కొక్క నీటిబొట్టుకోసం తపిస్తూ ముంగిట్లో ఉన్న ఆ రావిమొక్క లాగా… వచ్చేపోయే ప్రతి వ్యక్తి దాన్ని తిరస్కారభావంతో చూస్తాడు… కాని దాన్ని పీకి పారేయడానికి మనస్సు ఒప్పదు. ధైర్యం చాలదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
ఆరోజు ఉదయం సూర్యభగవానుడు తన కిరణాలు ఆ ప్రాంగణంలో కాస్త ఎక్కువగానే ప్రసరింపజేశాడు. నిషూ పొద్దునే అందరికన్నా ముందుగా లేచి తులసికోటలోంచి దీనంగా తొంగిచూస్తున్న ఆ రావిమొక్కని చాలా జాగ్రత్తగా లాగి ఒక పెద్ద కుండీలో బాగా నాటింది. దానికి కావలసిన నేల లభించడానికి, తులశమ్మతో బాటు దానికి కూడా నీళ్ళు పొయ్యడం వీలు కావడానికి, దాన్ని తులసికోటకి దగ్గరగానే ఉంచింది. నాయనమ్మ తులసిపూజ చెయ్యడానికి అక్కడికి వచ్చినప్పుడు ఇదంతా చూసి కంగారుపడింది.
“అరే! ఈ రావిమొక్కని ఎవరు పీకేశారర్రా… ఓరి భగవంతుడా… ఎవరికి పుట్టింది ఈ దుర్బుద్ధి? రామచంద్రా…”
“నాయనమ్మా, ఇంతగా ఎందుకు దిగులు పడుతున్నావు… రావిమొక్కని ఎవరూ పీకేయలేదు… నేనే దాన్ని తీసి ఈ పెద్ద కుండీలో నాటి ఉంచాను. చూడు తనకి కావలసిన నేల దొరికి ఎలా సంతోషిస్తోందో.”
“నీ మతి మండిపోయినట్టే ఉంది…. నేను వద్దని చెప్పానుకదా నీకు… అర్థం కాలేదా? భగవంతుడా! ఎలా చెప్పనీ పిల్లకి?”
“నాకర్థమయింది నాయనమ్మా, అందుకే నేను రావిమొక్కని పెద్దకుండీలోకి షిఫ్టు చేశాను. మరి పురాణాల్లో రాశారు కదా, రావిచెట్టు ప్రాముఖ్యం తులసి కన్నా తక్కువేం కాదు. పైగా వృక్షాలలో రావిచెట్టు మాత్రమే ఇరవైనాలుగు గంటలపాటు మనకి ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డయాక్సైడ్ ని తనలో సమాహితం చేసుకుంటుంది. అంటే తను మనందరికీ శ్వాసను ఇచ్చి, తను విషపానం చేస్తుంది. నిన్న నువ్వేకదా అన్నావు ఇందులో దేవతలు నివసిస్తారని, ఏదైనా మొక్కుకుంటే ఆ తాడు దీనికి కట్టుకోవచ్చునని. ఇది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సరిగా తులశమ్మలాగానే. ఇది పెరిగి పెద్దదై వృక్షం అయాక మనకి నీడకూడా ఇస్తుంది… ఇప్పుడు చెప్పు నాయనమ్మా, దీని గొప్పతనం ఎలా తక్కువ అవుతుంది?”
“నీతో వాదించి ప్రయోజనం లేదు. ఇంతో అంతో చదువుకున్నదానివి కదా…” తన స్వగతభాషణం కొనసాగిస్తూనే నాయనమ్మ తన పూజాసామగ్రి సర్దుకోసాగింది.
“మా మంచి నాయనమ్మా, తులశమ్మ…ఐ మీన్… కూతుళ్ళు సుఖసంతోషాలతో ఉంటే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది కదా, సరిగా అదే విధంగా రావిచెట్టు కళకళలాడుతూంటే కూడా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మరి నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా లేదా…? మరి తులశమ్మని పూజిస్తే మాత్రమే చాలదు నాయనమ్మా, సుఖం, సమృద్ధి కావాలంటే కూతుళ్ళు తల్లిలాగా వ్యవహరించడం కూడా అవసరమే. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈరోజు నుండి అమ్మమ్మ నా గదిలో ఉంటుంది.” నిషూ నవ్వుకుంటూ నాయనమ్మ మెడకి తన చేతులు చుట్టేసింది. ప్రాంగణంలో కూర్చునివున్న అమ్మమ్మలాగే, కుండీలో నాటిన రావిమొక్క కూడా మందహాసం చేస్తోంది.
***
డా. లతా అగ్రవాల్ – పరిచయం
26 నవంబరు 1966 న షోలాపూర్, మహారాష్ట్రలో జన్మించిన డా. లతా అగ్రవాల్ `తులజ’ ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త. ఎన్సిఇఆర్టీ, భోపాల్ లో లెక్చరర్ గా, వైష్ణవ యూనివర్సిటీ, ఇండోర్ లో బోర్డు మెంబరుగా, భోపాల్ యూనివర్సిటీకి అనుబంధసంస్థ అయిన మిత్తల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, భోపాల్ కి ప్రిన్సిపాల్ గా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కౌన్సెలర్ గా సేవలందించారు. వీరి రచనలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి పుస్తకాలు 16 విద్యకి సంబంధించినవి, 7 కవితాసంకలనాలు, 12 బాలసాహిత్యం, 5 కథాసంకలనాలు, 7 మినీకథాసంకలనాలు, 3 నవలలు, 4 సమీక్షాగ్రంథాలు, 20 నాటికలు, 1 ఇంటర్ వ్యూల సంకలనం ప్రచురితమయ్యాయి. హిందీ కల్చరల్ ఆర్గనైజేషన్, టోక్యో, జపాన్ నుంచి `కళాశ్రీ’ సన్మానం, మారిషస్ హిందీ సాహిత్య అకాడమీ నుంచి `హిందీ సాహిత్యరత్న’ సన్మానం తో సహా అంతర్జాతీయ స్థాయిలో 4 సన్మానాలు పొందారు. 2 సార్లు కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు జాతీయస్థాయిలో ఇంచుమించు 60 కన్నా ఎక్కువగా పురస్కారాలతో సన్మానింపబడ్డారు. ఉత్తమసాహిత్యసృజనకు 14 రాష్ట్రాలనుంచి సత్కారం పొందారు. డా. లతా అగ్రవాల్ భోపాల్ వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
