యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-15

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

సరిగ్గా ఏడాది కిందట 2023లో మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న  మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి. మొదటి పన్నెండు భాగాలు రాసి దాదాపుగా ఏడాది కావొస్తోంది. మళ్ళీ మొదలుపెట్టడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పటివరకు చదవని వారు వీటన్నిటినీ నెచ్చెలిలో (https://www.neccheli.com/ధారావాహికలు/ట్రావెలాగ్స్/యాత్రాగీతం/) ధారావాహికలుగా త్వరలో చదవవొచ్చు.

***

ఇంగ్లాండ్ (రోజు-3) ఇంగ్లాండ్ దేశ విహారం – స్టోన్ హెంజ్

ఆ రోజు మేం వెళ్తున్న టూరు పేరు “ఒక్క రోజులో ఇంగ్లాండు”(England in One day). “ఒక్కరోజులో ఒక దేశాన్ని చుట్టిరావడం ఏవిటి? “అని సందేహం కలగక మానదు మనకి. నిజానికి విస్తీర్ణం పరంగా చూస్తే ఇంగ్లాండ్ తెలుగు రాష్ట్రాలలో దాదాపు సగభాగం మాత్రమే.

ఇక ఈ టూరులో భాగంగా చారిత్రాత్మకమైన స్టోన్ హెంజ్, రోమన్ బాత్స్, షేక్స్పియర్ పుట్టిన ఊరైన స్ట్రాట్ ఫర్డ్ చూసి వస్తాం.

ఇది బస్సుటూరు. అయితే మా హోటలు దగ్గిరికొచ్చి ఎక్కించుకునేది కాదు. మా బసకు దగ్గర్లో ఉన్న విక్టోరియా స్టేషనుకి మా అంతట మేం వెళ్లి ఎక్కాలి.

అయితే తిరకాసేవిటంటే మేం ముందు అనుకున్నట్లుగా మాకు అయిదు నిమిషాల నడక దూరంలో ఉన్న విక్టోరియా స్టేషను అనబడే రైలు స్టేషను వేరు, విక్టోరియా కోచ్ స్టేషను అనబడే ఈ బస్సు స్టేషను వేరు.

ముందురోజు పడుకునేసరికి అర్థరాత్రయినా, తెల్లారి ఏడున్నరకే బస్సుటూరు కావడం వల్ల అయిదున్నర ప్రాంతంలో లేచి తయారు కావాల్సి వచ్చింది. సిరికి కార్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. మా హోటలు నించి విక్టోరియా కోచ్ స్టేషను అరగంట నడక దూరంలో ఉంది.

ఇక చేసేదేం లేదు కాబట్టి ఆరున్నరకల్లా హోటలు నించి బయలుదేరి నడక మొదలెట్టాం. గూగుల్ లో డైరక్షన్లు పట్టుకుని, వెతుక్కుంటూ వెళ్ళడమేమో వెళ్లాల్సిన తీరం ఎంతకీ రాదేం! పైగా సన్నగా తుంపర్లు పట్టుకున్నాయి.

అలా చల్లని వానలో తడుస్తూ తిరిగితే జలుబు, జ్వరం వగైరా పట్టుకుంటాయేమోనని ఒక పక్క భయంగా ఉన్నా, వీలైనంతవరకు తడవకుండా ఉండడానికి రైన్ పాంచోలు కూడా వేసుకున్నాం. మా సిరిని ఆ ప్రయాణంలో చాలా మెచ్చుకోవాలి. మామూలుగా ఒక్క చుక్క వానలో తడవడానికి కూడా పరుగుదీసే పిల్ల, పాపం వానకి అలవాటు పడిపోయినట్టు ‘కుయ్ కయ్’ అనకుండా బానే భరించింది.

మొత్తానికి తెల్లవారి లేచి లండనులో నడిచే సాహసం చేసినా, బస్టాండుకి చేరే సరికి ఇంకా పదిహేను నిమిషాల వ్యవధి మిగిలింది మాకు.

ఆ వ్యవధిలో నేను, సిరి బస్టాండులో టూరు బస్సు వచ్చే చోట కూచున్నాం. ఇంతలో సత్య కాఫీ కొని తెచ్చుకుందుకు వెళ్లేడు. అక్కడ రకరకాల టూర్ల వాళ్ళు అట్టలు,పెన్నులు పుచ్చుకుని నిలబడి ఉన్నారు. బస్సు వచ్చే సమయానికి అయిదునిమిషాల ముందు లైనులో నిలబడమని, టిక్కెట్లు చెక్ చేసి వారు ముందుండి క్రమపద్ధతిలో తీసుకువెళ్తున్నారు.

ఈ బస్టాండు అమెరికాలో మాదిరి గొప్ప సౌకర్యవంతంగా లేకపోయినా, ఫర్వాలేదు బానే ఉంది. జనం కూడా బానే ఉన్నారు. అమెరికాలోలా కాకుండా, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని జనం బాగా వాడుతున్నారు. అలాగని ఇండియాలో ఉన్నంత రద్దీగా అయితే ఏమీ లేదు.

మా బస్సు టూరు ప్రీమియం టూర్స్ అనే ప్రైవేటు బస్సు టూరు. సమయానికి మమ్మల్ని వెంటబెట్టుకుని తీసుకు వెళ్లిన క్యూలో వెళ్లి బస్సెక్కాం. కార్టు పెట్టడానికి బస్సు కింద లగేజీ కాబిన్ కూడా ఉండడంతో సమస్య కాలేదు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా ప్రయాణంలో ఇలాంటి టూర్లలో కార్టుల వంటివి పట్టుకెళ్ళడం పెద్ద సమస్యగా మారి, పోరాటం చెయ్యాల్సి వచ్చేది. మా టిక్కెట్లు లగ్జరీ టూరు టిక్కెట్లు కావడం వల్ల, సీట్లు బాగా కంఫర్టబుల్ గా ఉన్నాయి. నాకైతే మొదట్నుంచీ ఈ టూరుకి వెళ్లాలన్న ఉత్సాహం బాగా ఉంది. మొదటి సారి ఇంగ్లాండు దేశాన్ని చూస్తున్నామేమో కేవలం లండను మాత్రమే కాక, చుట్టూ ఇతర ప్రాంతాలు ఎలా ఉంటాయో చూడాలని అనుకున్నది ఈ విధంగా నెరవేరింది.

మా గైడు లండను నగర పొలిమేరల వరకు ఉన్న విశేషాల్ని కూడా వివరించాడు. మంచి సరదాగా మాట్లాడుతూ అందరినీ ఇట్టే ఆకట్టుకున్నాడు.

ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండు పెద్ద దేశమేమీ కాదు. అయినా రోడ్లు చిన్నవిగా ఉండడం వల్ల, వేగ పరిమితుల వల్ల ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కువ సమయం పడుతుంది. చుట్టూ పచ్చని గడ్డి మైదానాల మీంచి ఆహ్లాదకరంగా సాగింది ప్రయాణం. దార్లో సలిస్బరీ అనే ఊరు మీదుగా వెళ్లాం. అన్ని చోట్లా ఒక్కలాగే ఉన్నాయి ఇళ్లు. ఇటుక రంగు గోడలు, ఎత్తైన రెండస్తుల ఇళ్ళు, పెంకుల పైకప్పులు.

బస్సు ఎక్కడా ఆగకుండా స్టోన్ హెంజ్ కి చేరుకునేసరికి తొమ్మిదిన్నరయ్యింది.

స్టోన్ హెంజ్ లండను నించి దాదాపు రెండు గంటల దూరంలో ఉంది. విజిటింగు సెంటరు దగ్గిర బస్సు పార్కింగు ఉంది. అక్కణ్ణించి స్టోన్ హెంజ్ ఉన్న ప్రదేశానికి ఉచిత షటిల్ బస్సులు అయిదయిదు నిమిషాలకూ తిరుగుతున్నాయి.

అది ఏప్రిల్ నెల కావడంతో విజిటింగు సెంటరు దగ్గిర మేం బస్సు దిగేసరికి చలిగాలి రివ్వున వీస్తూ ఉంది. మేం ఒకటికి రెండు మూడు లేయర్ల చొప్పున స్వెట్టర్లు తొడుక్కుని, చెవులకి చలి తోపీలు పెట్టుకున్నాం. అయితే అదృష్టం కొద్దీ కొద్దిగా ఎండ వచ్చింది.

స్టోన్ హెంజ్ మానవ చరిత్రలోనే అద్భుతమైన కట్టడం. గడిచిపోయిన చరిత్రకు మూగ సాక్ష్యంగా గుండ్రంగా పెద్ద పలకల గోడ పేర్చినట్టున్న ఆ ప్రదేశాన్ని చూడగానే ఒళ్ళు గగుర్పొడిచింది.
ఆ ప్రదేశాన్ని చూస్తే మానవులు ఎంతటి ఔత్సాహికులో అర్థం అవుతుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడా అంతలేసి పలకలున్న కొండ జాడ లేదు. కనీసం ఒక ఎత్తైన వృక్షం కూడా లేదు. కనుచూపుమేర ఎకరాల తరబడి గడ్డి మైదానం అది.

అయిదువేల సంవత్సరాల కిందట నియోలితిక్ యుగంలో అతిపెద్ద సార్ సెన్ రాళ్లతో నిర్మించబడిన కట్టడం స్టోన్ హెంజ్. దీన్ని కట్టడానికి దాదాపు 1500 వందల ఏళ్ళు పట్టిందని అంచనా. ఎత్తుగా చెక్కిన దాదాపు వంద పెద్ద పెద్ద రాళ్లు గుండ్రంగా పేర్చి కట్టబడింది ఇది. ఈ రాళ్లు ఒక్కొక్కటి 24 అడుగుల ఎత్తులో దాదాపు నలభై టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఎటువంటి రవాణా సౌకర్యాలు లేని పురాతన దినాల్లో 200 మైళ్ళ దూరం నించి అక్కడికి ఇవి ఎలా తీసుకు రాబడ్డాయో ఇప్పటికీ ప్రశ్నార్థకమే!

ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు స్మశాన స్థలమైనా, ఇలా గుండ్రంగా రాళ్లు నిలబెట్టి, అవి పడిపోకుండా క్రమం తప్పకుండా తరతరాలుగా కాపాడుతూ రావడంలోని ఆంతర్యం ఒక గొప్ప మిస్టరీ. ఈ కట్టడం మూడు దఫాలుగా కట్టబడింది. చివరిగా ఈ కట్టడాన్ని క్రీస్తు పూర్వం 1600 ప్రాంతంలో పునర్నిర్మించారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ కట్టడం వేసవి, శీతాకాలపు విషవత్తులను సరిగ్గా గుర్తించడానికి కట్టబడిందని నిరూపించారు.

క్రీస్తు పూర్వం 2000-1500 ప్రాంతంలో ఈ చుట్టుపక్కల దాదాపు 20 ఎత్తైన మట్టి కొండల్లా నిర్మించబడిన సమాధులని ఇప్పటికీ చూడవచ్చు.

స్టోన్ హెంజ్ కట్టడం చుట్టూ నడిచి ప్రదక్షిణ చెయ్యడానికి వీలుగా మట్టి బాట ఉంది. ఒక ప్రదక్షిణ చెయ్యడానికి దాదాపు అరగంట పడుతుంది. అక్కడ ఉన్న రాళ్ళని ముట్టుకోకుండా తాళ్ల కంచె కట్టి ఉంచారు. ఒక ప్రదక్షిణ చేసేందుకు మేం నడవడం మొదలెట్టగానే సిరికి ఉత్సాహం వచ్చేసి, కార్టు లోంచి దిగి పరుగుతీసింది.

ఎట్నుంచి చూసినా ఒకే విధమైన రాతి దృశ్యమే అయినప్పటికీ, కొన్ని రాళ్లు కూలిపోవడం, మరికొన్ని ఒరిగిపోవడం వల్ల దృశ్యం మారుతున్నట్లు అనుభూతి కలిగింది.

విజిటర్ సెంటర్ కి తిరిగి వచ్చి, బస్సు ఎక్కి, వెనక్కి చూడగానే పూర్వీకుల నాటి పురాతన జ్ఞాపకలేవో వెనక్కి పిలుస్తున్న భ్రాంతి కలిగింది.

విజిటర్ సెంటర్ లో ఉన్న గిఫ్ట్ షాపు ఆవరణలో ఒకప్పడు ఇక్కడ నివాసం ఉన్న మనుషుల ఇళ్ల నమూనాలు నిర్మించారు. అవి మన పల్లెటూళ్లలో మట్టి, తాటాకులతో కట్టుకునే పూరిళ్ల వంటివే. అవన్నీ ఇండియా నించి వెళ్ళిన మన లాంటి వాళ్లకి కొత్తేం కాదు.

ఇక అక్కడున్న రాళ్ళని గుండ్రటి చెక్కల మీద దొర్లించుకు వచ్చారనడాన్నికి నిదర్శనంగా అక్కడ ఒక పెద్ద రాతిని ప్రదర్శనకు ఉంచారు. ఈ రోజుల్లో దాన్ని లాగడానికి ఎంత బలవంతులైనా, దాదాపు వంద మంది అవసరమవుతారనుకుంటా. ఇక నేనూ, సిరి కలిసి లాగే కార్యక్రమం పెట్టుకున్నట్టు ఫోటోకి ఫోజులిచ్చి నవ్వుకున్నాం.

గిఫ్ట్ సెంటర్లో స్టోన్ హెంజ్ చిత్రాన్ని కొని తెచ్చుకున్నాం. దాన్ని పటం కట్టి ఇంటి హాల్లో పెట్టుకున్నాం కూడా. దాన్ని చూసినప్పుడల్లా ఈ జ్ఞాపకాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

అన్నట్టు గిఫ్ట్ షాపు హడావిడిలో సిరి తన కోసం కొన్న కొత్త స్వెట్టరు ఎక్కడో పడేసింది. నేను మళ్లీ వెనక్కు పరుగెత్తి, బస్సు దిగంగానే మేం కూచున్న చోటు నించి వెతికి తీసుకొచ్చాను.

విజిటింగు సెంటర్లో గుండ్రంగా ఉన్న పెద్ద హాల్లో గోడల మీదంతా ప్రతిఫలిస్తూ ప్రదర్శించబడే విశేషమైన షో ఒక ప్రధాన ఆకర్షణ. స్టోన్ హెంజ్ ఏర్పాటు చేసిన కాలం దగ్గర్నించి, ఎన్నో తరాలు మారిన సాక్ష్యాల్ని ఈ చిన్న లఘు చిత్రం ద్వారా చూడొచ్చు.

దాదాపు పదకొండు గంటలకి జ్ఞాపకాలు వెంటాడే ఆ ప్రాంతానికి సెలవు తీసుకుని బస్సెక్కాం. ఇంగ్లాండు దేశపు పర్యటనలో తప్పనిసరిగా చూడాల్సిన వాటిల్లో స్టోన్ హెంజ్ ఒకటి.

*****

https://www.facebook.com/geetamadhavikala/posts/

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.