రింగ్

-ఎం కె కుమార్

శనివారం సాయంత్రం. పద్మావతిపురం నుండి దీప్తి కేటి రోడ్డులో ఉన్న ఒక కొత్త బేకరీకి వెళ్ళింది. బేకరీ లోపల చాలా ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. గాలిలో వెనీలా ఎసెన్స్, వేడెక్కిన బటర్ వాసన వస్తోంది. కౌంటర్ వెనుక ఒక మధ్య వయస్కుడు ఉన్నాడు. అతను లావుగా ఉన్నాడు. అతని ఆప్రాన్ మీద పిండి మరకలు ఉన్నాయి. అతను ఏమాత్రం ఉత్సాహంగా లేడు.

“నా కొడుకు అయాన్ పుట్టినరోజు సోమవారం. వాడికి ఆరేళ్లు వస్తాయి,” దీప్తి అంది.

“వాడికి ఒక కేక్ ఆర్డర్ ఇవ్వాలి.”

బేకరీ యజమాని ఆమె వైపు ఒకసారి చూసి, తన ముందున్న ట్యాబ్లెట్ స్క్రీన్ వైపు తిరిగాడు.

“ఎలాంటి కేక్ కావాలి?” అతను యంత్రంలా అడిగాడు.

“చాక్లెట్ ట్రఫుల్. పైన ఐరన్ మ్యాన్ బొమ్మ ఉండాలి. దాని కింద ‘హ్యాపీ బర్త్ డే అయాన్’ అని రాయాలి.”

యజమాని ట్యాబ్లెట్ లో టైప్ చేశాడు. అతని వేళ్లు లావుగా, మురికిగా ఉన్నాయి. అతను ఆమె కళ్లలోకి చూడలేదు. దీప్తికి అతని ప్రవర్తన కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. పుట్టినరోజు అనగానే ఎవరైనా ఒక చిన్న నవ్వు నవ్వుతారు, కానీ ఇతని ముఖంలో ఎలాంటి భావం లేదు.

“సోమవారం ఉదయం పది గంటలకల్లా రెడీగా ఉంటుంది. ఎనిమిది వందలు అవుతుంది,” అతను ఒక రసీదు ప్రింట్ తీసి ఆమె వైపు పక్కకు నెట్టాడు.

దీప్తి తన పర్స్ లోంచి గూగుల్ పే స్కానర్ కోసం ఫోన్ తీసింది. పేమెంట్ చేసి, ఆ రసీదు తీసుకుని బయటకు వచ్చింది. బేకరీ యజమాని ఆమె వెళ్లడాన్ని కూడా గమనించకుండా లోపలికి వెళ్లిపోయాడు.

సోమవారం ఉదయం ఎనిమిది గంటలు. అయాన్ స్కూల్ బస్సు ఎక్కడానికి అపార్ట్‌మెంట్ కిందకు వచ్చాడు. వరుణ్ ఇంకా ఇంట్లో రెడీ అవుతున్నాడు. దీప్తి కిచెన్ లో అయాన్ లంచ్ బాక్స్ సర్దుతోంది. బయట రోడ్డు మీద దుమ్ము లేస్తోంది. అయాన్ తన స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, రోడ్డు దాటడానికి ఫుట్‌పాత్ దిగాడు. అప్పుడే ఒక తెల్లటి మారుతి స్విఫ్ట్ కారు వేగంగా లీలా మహల్ సర్కిల్ వైపు నుండి దూసుకువచ్చింది. కారు బ్రేకులు వేసిన శబ్దం గట్టిగా వినిపించింది, కానీ అది ఆగలేదు. కారు ఎడమవైపు బంపర్ అయాన్ ను బలంగా గుద్దింది. అయాన్ గాలిలోకి ఎగిరి రోడ్డు పక్కన ఉన్న మట్టిలో పడ్డాడు. కారు క్షణం పాటు నెమ్మదించింది. డ్రైవర్ అద్దంలోంచి వెనక్కి చూశాడు. ఆ తర్వాత ఇంజిన్ రేస్ చేసి, స్విమ్స్ సర్కిల్ వైపు వేగంగా వెళ్లిపోయాడు.

అయాన్ కు ఏడుపు రాలేదు. వాడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. మోకాలి మీద ప్యాంట్ చిరిగిపోయింది. మోచేతి నుండి రక్తం కారుతోంది. వాడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. స్కూల్ బ్యాగ్ లోని వాటర్ బాటిల్ కింద పడిపోయి ఉంది. వాడు దాన్ని తీసుకోకుండా, వెనక్కి తిరిగి అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు.

వాడి తల లోపల ఒక వింతైన మోత వినబడుతోంది. మూడో అంతస్తుకు చేరుకునే సరికి వాడి కాళ్లు వణకడం మొదలయ్యాయి. తలుపు తెరిచే ఉంది. వాడు లోపలికి అడుగుపెట్టాడు. దీప్తి కిచెన్ లోంచి బయటకు వస్తోంది.

“అయాన్, బస్సు వెళ్లిపోయిందా?” అంటూ వస్తున్న ఆమె, వాడిని చూసి ఆగిపోయింది.

అయాన్ సోఫా దగ్గరకు వెళ్ళాడు. “అమ్మా…” అని పిలిచాడు. వాడు కళ్ళు పైకి తేలేశాడు. వాడు నేరుగా సోఫా మీద పడిపోయాడు. వాడి తల కుషన్ కి తగిలి ఒక పక్కకు వాలిపోయింది.

దీప్తి గట్టిగా అరుస్తూ వాడి దగ్గరకు పరిగెత్తింది. బాత్ రూమ్ లోంచి వరుణ్ టవల్ కట్టుకుని బయటకు వచ్చాడు.

స్విమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్. గాలిలో డెట్టాల్, స్పిరిట్, రక్తం వాసన కలిసి ఉంది. తెలుపు రంగు టైల్స్ మీద లైట్ల వెలుతురు ప్రతిఫలిస్తోంది. అయాన్ ను ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. వాడి బట్టలు విప్పేశారు. ఒక చేతికి సెలైన్, ఇంకో చేతికి బీపీ మానిటర్ కనెక్ట్ చేసి ఉన్నాయి. డాక్టర్ కార్తీక్ వాడి కళ్లలోకి చిన్న టార్చ్ లైట్ వేసి చూస్తున్నాడు. కార్తీక్ ముఖంలో ఎలాంటి భావోద్వేగం లేదు. అతను ప్రతిరోజూ ఇలాంటివి ఎన్నో చూస్తాడు. అతను వరుణ్, దీప్తి వైపు తిరిగాడు.

వరుణ్ ఇంకా వణుకుతున్నాడు. దీప్తి కళ్లెంబడి నీళ్లు కారుతున్నాయి, ఆమె నోటి నుండి మాట రావడం లేదు.

“స్కానింగ్ తీశాం,” కార్తీక్ నెమ్మదిగా, ఒక నివేదిక చదువుతున్నట్లుగా అన్నాడు.

“తల వెనుక భాగంలో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది. లోపల బ్లీడింగ్ ఉందో లేదో చూడాలి. ప్రస్తుతానికి వాడు డీప్ స్లీప్ (గాఢ నిద్ర) లో ఉన్నాడు.”

“డీప్ స్లీప్ అంటే? కోమానా కార్తీక్?” వరుణ్ గొంతు వణికింది. వరుణ్ కి కార్తీక్ తో ముందే పరిచయం ఉంది.

కార్తీక్ పెదవులు బిగించాడు.

“మేము దాన్ని కోమా అనం. శరీరం షాక్ కి గురైనప్పుడు, దానంతట అదే రిపేర్ చేసుకోవడానికి ఇలా నిద్రలోకి వెళ్తుంది. వాడు త్వరలోనే స్పృహలోకి రావాలి. వెయిట్ చేయాలి.”

కార్తీక్ అక్కడి నుండి పక్క బెడ్ దగ్గరకు వెళ్లిపోయాడు.

వరుణ్, దీప్తి అయాన్ మంచం పక్కన రెండు ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నారు. వాడి గుండె చప్పుడు మానిటర్ లో ‘బీప్… బీప్…’ అని వినిపిస్తోంది. ఆ శబ్దం తప్ప అక్కడ మరే శబ్దమూ లేదు. సమయం గడిచిపోతోంది.

ఉదయం వెళ్లి మధ్యాహ్నం అయింది.

మధ్యాహ్నం పోయి సాయంత్రం అయింది.

అయాన్ కదలలేదు. వాడి ముఖం పాలిపోయి ఉంది. దీప్తి తన కొడుకు చేతిని పట్టుకుని అలాగే ఉండిపోయింది. ఆమెకు ఆకలి లేదు, దప్పిక లేదు. ఆమె మనసంతా ఆ తెల్లటి బెడ్ షీట్ మీద, ఆ చిన్న శరీరం మీదే ఉంది. వరుణ్ ఆసుపత్రి కారిడార్ లో అటూ ఇటూ నడుస్తున్నాడు. అతను ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ నిస్సహాయత అతన్ని లోపలి నుండి తినేస్తోంది.

రాత్రి పది గంటలవుతోంది. డాక్టర్ కార్తీక్ రౌండ్స్ కి వచ్చాడు. అయాన్ కనురెప్పలు కొద్దిగా పైకి లేపి చూశాడు. ఏమీ మారలేదు.

“నువ్వు ఇంటికి వెళ్లిరా వరుణ్,” దీప్తి అంది. ఆమె గొంతు పగిలిపోయి ఉంది.

“ఇంటికెళ్లి ఒకసారి స్నానం చేసి, బట్టలు మార్చుకుని రా. ఉదయం నుండి నువ్వు ఆ బట్టలతోనే ఉన్నావు.”

వరుణ్ కు వెళ్లాలని లేదు. కానీ దీప్తి మొండిగా చెప్పడంతో, కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చాడు.

తిరుపతి వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. పద్మావతిపురం అపార్ట్‌మెంట్ కి చేరుకునే సరికి పదిన్నర అయింది. ఇల్లు చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. ఉదయం అయాన్ కింద పడేసిన వాటర్ బాటిల్ ఇంకా ఫ్లోర్ మీదే ఉంది. దాన్ని చూస్తుంటే వరుణ్ కు భరించలేనంత బాధ వేసింది. అతను దాన్ని తీసి టేబుల్ మీద పెట్టాడు. వరుణ్ బట్టలు విప్పి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. షవర్ ఆన్ చేశాడు. వేడి నీళ్లు తల మీద పడుతున్నాయి. నీటి చప్పుడు వాడి ఆలోచనలను కొద్దిగా ఆపింది.

అతను ఒక పది నిమిషాలు ఆ వేడి నీటి కిందే నిలబడి ఉన్నాడు. సబ్బు రాసుకుంటుండగా, మొదటిసారి ఏడుపు వచ్చింది. కానీ ఆ నీటిలో అతని కన్నీళ్లు కలిసిపోయాయి. అతను టవల్ తుడుచుకుని హాల్ లోకి రాగానే, టేబుల్ మీద ఉన్న అతని ఫోన్ రింగ్ అయింది. అపరిచిత నెంబర్. అతను ఫోన్ తీశాడు.

“హలో?” అన్నాడు.

అవతలి వైపు కొద్ది క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక బరువైన గొంతు వినిపించింది.

“కేక్ గురించి ఫోన్ చేస్తున్నాను,” ఆ గొంతు అంది.

వరుణ్ కి ఆ గొంతు ఎవరో గుర్తు రాలేదు.

“ఎవరు మీరు? ఏ కేక్?” వరుణ్ కంగారుగా అడిగాడు.

“ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. పది గంటలకు తీసుకువెళ్తామన్నారు. దాన్ని తీసుకెళ్ళలేదు. కేక్ అలాగే ఉంది.” ఆ మాటలు ఒక రకమైన యాంత్రిక ధోరణిలో, ఎలాంటి భావం లేకుండా వస్తున్నాయి.

వరుణ్ కి ఏమీ అర్థం కాలేదు. వాడి మెదడు మొద్దుబారిపోయి ఉంది.

“మీరు రాంగ్ నెంబర్ కి ఫోన్ చేశారు,” అన్నాడు.

“అయాన్,” అవతలి గొంతు అంది.

“ఇది అయాన్ గురించే కదా?”

వరుణ్ గుండె ఆగిపోయినంత పనైంది.

“ఎవరు మీరు? అయాన్ గురించి మీకేం తెలుసు?” అని అరుస్తూ అడిగాడు. కానీ అవతలి వైపు ఫోన్ కట్ అయిపోయింది.

వరుణ్ కు చెమటలు పట్టాయి. ఆ గొంతు ఎవరిది? అయాన్ పేరు వాడికి ఎలా తెలుసు?

అయాన్ కి ఏమైనా అయిందా? ఎవరో తనను భయపెడుతున్నారా?

వరుణ్ వెంటనే బట్టలు వేసుకుని కారు కీస్ తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. స్విమ్స్ ఐసీయూలో వాతావరణం ఏమీ మారలేదు. దీప్తి అక్కడే అదే కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె జుట్టు చెదిరిపోయి ఉంది. కళ్లు ఎర్రబడ్డాయి. అయాన్ అలాగే పడుకుని ఉన్నాడు. మానిటర్ లో గుండె చప్పుడు లయబద్ధంగా సాగుతోంది.

“ఏమైనా కదిలాడా?” వరుణ్ అడిగాడు, ఆయాసపడుతూ.

దీప్తి తల ఊపింది. లేదు అని అర్థం.
వరుణ్ డాక్టర్ కార్తీక్ కోసం చూశాడు.

కార్తీక్ కౌంటర్ దగ్గర ఒక నర్సుతో మాట్లాడుతున్నాడు. వరుణ్ అటు వెళ్ళాడు.

“కార్తీక్, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా?”

కార్తీక్ అతని వైపు అలసిపోయినట్లు చూశాడు.

“లేదు వరుణ్. వాడు ఇంకా అదే స్థితిలో ఉన్నాడు. మనం ఏమీ చేయలేము. వాడి బాడీ రెస్పాండ్ అవ్వాలి. బహుశా రేపు ఉదయం కల్లా ఏమైనా మార్పు రావచ్చు. లేదా…” కార్తీక్ ఆగాడు.

“చూద్దాం.” కార్తీక్ పొడిగా అన్నాడు.

వరుణ్ తిరిగి దీప్తి దగ్గరకు వచ్చాడు. దీప్తి ముఖం జిడ్డుగా ఉంది. ఆమె నుండి ఆసుపత్రిలోని మందుల వాసన, చెమట వాసన వస్తోంది.

“దీప్తి, నువ్వు వెళ్లిరా,” వరుణ్ అన్నాడు.

“నేను వెళ్లను వరుణ్. వాడు కళ్ళు తెరిచినప్పుడు నేను ఇక్కడే ఉండాలి.”

“లేదు దీప్తి. నువ్వు వెళ్లి స్నానం చెయ్. నీకు కొంచెం రెస్ట్ కావాలి. నువ్వు ఇలా ఉంటే వాడు కళ్ళు తెరిచినా భయపడతాడు. వెళ్లి వేడి నీళ్లతో స్నానం చేసి రా. నేను ఇక్కడే వాడి పక్కన కూర్చుంటాను. నేను వాడిని చూసుకుంటాను.” వరుణ్ ఆమె భుజం పట్టుకుని నచ్చజెప్పాడు.

దీప్తి కొద్దిసేపు నిరాకరించినా, చివరకు ఒప్పుకుంది.

ఆమెకు నిజంగానే చాలా నీరసంగా ఉంది. ఆమె తన పర్స్ తీసుకుని, అయాన్ నుదుటి మీద ఒక ముద్దు పెట్టి బయటకు నడిచింది.

మంగళవారం ఉదయం నాలుగు గంటలు. తిరుపతిలో ఇంకా చీకటిగానే ఉంది. గాలిలో కొద్దిగా చలి మొదలైంది. దీప్తి అపార్ట్‌మెంట్ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. హాల్ లో ఉన్న గడియారం ముల్లు తిరుగుతున్న ‘టిక్… టిక్…’ శబ్దం తప్ప ఏమీ లేదు.

ఆమె పళ్లు తోముకుంది, తలస్నానం చేసింది. కొత్త బట్టలు వేసుకుంది. కొద్దిగా ఫ్రెష్ గా అనిపించింది. బహుశా అంతా సర్దుకుంటుందేమో అని ఒక చిన్న ఆశ. వరుణ్ చెప్పినట్లు, అయాన్ కేవలం ఒక గాఢ నిద్రలో ఉన్నాడు. అతను లేస్తాడు. ఆమె తల తుడుచుకుంటూ హాల్ లోకి వచ్చింది. కిచెన్ లోకి వెళ్లి ఒక గ్లాసు నీళ్లు తాగింది. ఆసుపత్రికి తిరిగి వెళ్లడానికి కారు తాళాలు తీసుకుంటోంది.

సరిగ్గా అప్పుడే టేబుల్ మీద ఉన్న ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ నిశ్శబ్దంలో ఆ ఫోన్ రింగ్ చాలా గట్టిగా, భయంకరంగా వినిపించింది. దీప్తి ఉలిక్కిపడింది.

ఉదయం నాలుగు గంటలకు ఎవరు ఫోన్ చేస్తారు? వరుణ్ ఆసుపత్రి నుండి చేస్తున్నాడా? అయాన్ కళ్ళు తెరిచాడా? లేక… డాక్టర్ కార్తీక్ ఏదైనా చెడు వార్త చెప్తున్నాడా?

ఆమె చేతులు వణుకుతుండగా ఫోన్ తీసింది. స్క్రీన్ మీద ఒక అపరిచిత నెంబర్. ట్రూ కాలర్ లో పేరు లేదు.

ఆమె ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.

“హలో? వరుణ్?” ఆమె గొంతు వణికింది.

అవతలి వైపు ఒక నిశ్శబ్దం. వెనక ఏదో యంత్రం నడుస్తున్న సన్నటి శబ్దం వినిపిస్తోంది. (అది బేకరీలోని ఓవెన్ శబ్దం అని ఆమెకు తెలియదు).

“హలో? ఎవరు?” దీప్తి మళ్ళీ అడిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“అది నీకు గుర్తులేదా?” అవతలి నుండి ఒక బరువైన గొంతు వినిపించింది.

దీప్తికి ఆ గొంతు ఎవరో గుర్తుపట్టలేకపోయింది.

“ఎవరు మీరు? ఉదయం నాలుగు గంటలకు ఫోన్ చేసి ఏంటి ఈ ప్రశ్నలు?” ఆమె కోపంగా, భయంగా అంది.

“ఇది అయాన్ గురించి,” ఆ గొంతు అంది.

ఎలాంటి భావోద్వేగం లేకుండా, చాలా చల్లగా.

“అయాన్ గురించి నువ్వు మర్చిపోయావా?”

దీప్తి నోట్లోంచి మాట రాలేదు. ఫోన్ ఆమె చేతిలోంచి జారిపోయేలా ఉంది. ఆ గొంతు మృత్యువులా అనిపించింది. ఆమె బేకరీని, తను ఇచ్చిన ఆర్డర్ ను పూర్తిగా మర్చిపోయింది. ఆ క్షణంలో ఆమెకు, ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో వింత రాక్షసుడిలా, తమ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడిలా అనిపించాడు.

“ఏంటి… అయాన్ కి ఏమైంది? ఎవరు మీరు?” ఆమె గట్టిగా అరుస్తూ ఏడ్చింది.

కానీ అవతలి వైపు ఫోన్ కట్ అయిపోయింది.

‘టుట్… టుట్… టుట్…’ అనే శబ్దం మాత్రమే వినిపిస్తోంది.

దీప్తి చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. ఆమె భయంతో అలాగే నిలబడిపోయింది. తడి జుట్టు నుండి నీళ్లు చుక్కలు చుక్కలుగా కింద టైల్స్ మీద పడుతున్నాయి. ఇంట్లో నిశ్శబ్దం మళ్లీ ఆవరించింది, కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దం ఒక భయంకరమైన రాక్షసుడిలా ఆమెను కబళించడానికి వస్తున్నట్లుంది. అయాన్ కి ఏమైంది?

ఆసుపత్రిలో ఏమైనా జరిగిందా?

ఆమె వెళ్ళడానికి అడుగు ముందుకు వేయలేకపోయింది.

అక్కడే, ఆ హాల్ మధ్యలో, ఆ ఖాళీ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఆ చీకటి ఆమెను పూర్తిగా మింగేస్తున్నట్లు అనిపించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.