
వ్యాధితో పోరాటం-40
–కనకదుర్గ
డాక్టర్ రొసాటోతో అపాయింట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత జోన్ వచ్చి కొన్ని గంటలు పాపను చూసుకునేది. ఆ రోజు చైతన్యకు స్కూల్ లేదు, అందుకని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాము. స్ఫూర్తిని చిన్న స్ట్రోలర్ లో కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళాము. నడుస్తుంది, హాస్పిటల్లో లేచి పరిగెత్తుతుందేమోనని అలా స్ట్రోలర్లో కూర్చోపెట్టల్సి వచ్చింది. మా పేరు పిలవగానే లోపలికి వెళ్తుంటే ఆండ్రియా అనే ఆవిడ తనని తాను డా. రొసాటో దగ్గర నర్స్ ప్రాక్టీషనర్ గా పని చేస్తున్నానని పరిచయం చేసుకుంది. మేము డాక్టర్ రొసాటో ఎగ్జామినేషన్ రూమ్ దగ్గరకు వెళ్ళేవరకు ఆయన రూమ్ బయటే కనిపించారు. ఆండ్రియా మమ్మల్ని పరిచయం చేసింది. ఆయన చెయ్యి చాచి హ్యాండ్ షేక్ ఇస్తూ, “హలో మిసెస్ డింగారి, హలో మిస్టర్ డింగారి,” అన్నారు.
ఆయన దృష్టి స్ఫూర్తి పైన పడింది, “హూ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ యంగ్ లేడీ?” అని కిందకు వంగి దాని చెయ్యి పట్టుకుని అడిగారు. “షీ ఈజ్ మై సిస్టర్ స్ఫూర్తి,” అన్నాడు చైతన్య.
“ఈజ్ ఇట్?” అని చైతన్య వైపు తిరిగారు. “అండ్ హూ ఆర్యూ మై సన్?” అని అడిగాడు. “ఐయామ్ చాయ్,” అన్నాడు వాడు. “చాయ్… దట్ మీన్స్ టీ, రైట్?” అన్నారు. “నో మై నేమ్ ఈజ్ చైతన్య. బట్ ఫ్రెండ్స్ కాల్ మీ చాయ్,”అని చెప్పాడు.
ఇంతలో మరో వైపు నుండి మరో డాక్టర్, మా వెనక నుండి ఇద్దరు ఫైల్స్ పటుకుని వచ్చారు. డా. రొసాటో, మరో డాక్టర్ ని చూసి, “కమాన్ డా. కోచ్మెన్. హావ్ యూ సీన్ సచ్ ఏ బ్యూటిఫుల్ బేబి ఎనీవేర్ ?” అని స్ఫూర్తిని చూపించారు. డా. కోచ్మెన్ అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, వారిద్దరు న్యూట్రిష్యన్స్ అన్నమాట. “లుక్ ఎట్ హర్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ అయిస్, పర్ఫెక్ట్ నోస్, లిటిల్ మౌత్, కర్లీ హేయిర్, హౌ ప్రెట్టీ షీ ఈజ్?”
ఆండ్రియా అన్నది, ” యస్ డా.రొసాటో, షి ఈజ్ ఏ వెరీ ప్రెట్టీ బేబీ,”
“ఎట్లీస్ట్ ఐ హావ్ నెవ్వర్ సీన్ సచ్ ఏ పర్ఫెక్ట్ బేబి. కంగ్రాట్స్ మిసెస్ అండ్ మిస్టర్ డింగారి. యూ హావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. దిస్ యంగ్ లేడీ ఈజ్ సో ప్రెషియస్ (precious). నౌ వియ్ హావ్ టు మేక్ యూ బెటర్ టు టేక్ కేర్ ఆఫ్ దీజ్ కిడ్స్. కమ్ లెట్స్ గో ఇన్ సైడ్ టు చెక్ యూ!” అని లోపలికి నడిచాడు డా. రొసాటో, ఆయనతో అందరం లోపలికి వెళ్తున్నాం, ఆండ్రియా నా పక్కకు వచ్చి, “మీకు తెలుసా డా. రొసాటోకి 11 మంది మనవలు, మనవరాళ్ళున్నారు. కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడలేదు, వాళ్ళ గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఆయనకు మీ కుటుంబం చాలా నచ్చినట్టుంది. డా.రొసాటో వెరీ నైస్ డాక్టర్ అండ్ వెరీ నైస్ పర్సన్.” అని చెప్పింది.
డా. రొసాటో, ఛీఫ్ ఆఫ్ గాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ, ఆయన అంత స్నేహంగా మాట్లాడుతుంటే మాకు చాలా మంచి సర్జనే కాదు మంచి మనిషి, తన పేషంట్స్ సంరక్షణ గురించి చాలా శ్రద్దగా పట్టించుకునే సర్జన్ లా అనిపించాడు. కొంతమంది వయసు కనపడకుండా తలకి రంగు వేసుకుంటారు, కానీ ఈయన ఉన్న కొంచెం జుట్టు తెల్లదయ్యింది, డాక్టర్ కోట్ వేసుకుని, మెళ్ళో స్టెతస్కోప్ వేసుకుని అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు.
ముందుగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని, ఆ తర్వాత న్యూట్రిషనిస్టులను మాకు పరిచయం చేసారు.
“డా. కోచ్మెన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా కొన్ని టెస్ట్స్ చేసి అసలు సమస్య ఏమిటి అన్నది కనుక్కుంటారు, దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. నీ బరువు చాలా తక్కువుంది, ఈ ఇద్దరు న్యూట్రిషనిస్టులు ట్యూబ్ ఫీడింగ్స్ ద్వారా నీ బరువు పెంచడానికి ప్రయత్నం చేస్తారు. నాతో అపాయింట్మెంట్ అయ్యింతర్వాత వాళ్ళు మీతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని. బరువు పెరగడానికి సాయం చేస్తారు.” అన్నారు డా.రొసాటో.
ఆయన మాట్లాడుతుంటే కేవలం ఒక సర్జన్ గానే కాదు, ఒక తండ్రి కూతురితో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది.
డా.కోచ్మెన్, ముందు నాకు చేయాల్సిన పరీక్షల గురించి మాకు వివరించి, ఆండ్రియాకి ఆ పరీక్షలకు అపాయింట్మెంట్ తీసుకొని మాకు ఫోన్ చేయమని చెప్పారు. తర్వాత అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. న్యూట్రిషనిస్టులు డా.రొసాటోతో అపాయింట్మెంట్ అయింతర్వాత వారిని ఎక్కడ కలవాలో చెప్పి, డా. రొసాటోతో సెలవు తీసుకుని వెళ్ళారు.
డా.రొసాటో, “మీరు ఇక్కడ ఎన్నాళ్ళుగా ఉంటున్నారు? ఇండియాలో ఎక్కడ ఉంటారు?” అని అడిగారు.
“దాదాపు ఆరేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము, ఇండియాలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైద్రాబాద్ లో ఉంటాము.” అన్నాడు శ్రీనివాస్.
“మీ కుటుంబం వారు అక్కడ వున్నారా? అంతా ఇక్కడికి వచ్చారా?”
“ఇక్కడ ఎవ్వరూ లేరు, మేమే మా కుటుంబం నుండి మొదటిసారి అమెరికాకు వచ్చినవాళ్ళం.”
“మీరు చదువుకోవడానికి….”
“లేదు, ఇండియాలో మా కంపెనీ ద్వారా ఇక్కడికి వర్క్ పై వచ్చాము. కానీ ఇపుడు ఇక్కడే జాబ్ చేస్తున్నాను.”
“నా కోసం, నా ట్రీట్మెంట్ కోసం ఇక్కడ జాబ్ చూసుకున్నారు…” అన్నాను నేను.
“అది మంచి విషయమా కాదా?” అడిగారు డా.రొసాటో.
” మేం ఇక్కడికి వచ్చినపుడు తను బాగానే వుంది. ఇండియాకి మా అమ్మ చనిపోయినప్పుడు వెళ్ళినపుడు తనకి మళ్ళీ అటాక్ వచ్చింది. అప్పట్నుండి ప్రతి కొన్నినెలలకోసారి రావడం మొదలు పెట్టింది. నేను ఇక్కడికి ఏ ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చానో అది ’99లో అయిపోయింది. కొన్నిరోజులు మా ఇండియన్ కంపెనీ కన్సల్టెంట్ ద్వారా జాబ్ కి ప్రయత్నించాను. కానీ ఏ జాబ్ రాలేదు. నేను ముందు వర్క్ చేసిన కంపెనీ కొలీగ్స్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది. కానీ ముందు మా కన్సల్టెంట్ ద్వారానే నాకు జాబ్ ఇచ్చారు. ఈ కంపెనీ వారు నాకు గ్రీన్ కార్డ్ కి అప్లయ్ చేసిన తర్వాత ఇండియన్ కంపెనీకి రిజైన చేసాను. ఇపుడు మెడికల్ ఇన్స్యూరెన్స్ కోసం వర్రీ అవ్వక్కర్లేదు. తన ట్రీట్మెంట్ అయ్యేవరకు ఇక్కడే వుండాలని ఇలా చేయాల్సి వచ్చింది.” చెప్పాడు శ్రీని.
“మరి ట్రీట్మ్ంట్ అయ్యాక ఇండియాకి వెళ్ళిపోతారా?”
“ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హర్ ట్రీట్మెంట్,” అన్నాడు శ్రీని.
“నీకు ఇండియాకి వెళ్ళాలని ఉందా మిసెస్ డింగరి?”
“మేము ఇక్కడ వుండడానికి రాలేదు. కొన్నాళ్ళు ఇక్కడ ఉండి తన వర్క్ అయ్యాక వెళ్ళిపోవాలని అనుకున్నాము. ఈ ట్రీట్మెంట్ ఎప్పుడయిపోతుందో? అసలు తగ్గుతుందో లేదో? డూ యూ థింక్ యు కెన్ ఫిక్స్ మై ప్రాబ్లెమ్?” అని అడిగాను.
“ఐ థింక్ సో, టెస్ట్స్ రిపోర్ట్స్ చూస్తే కానీ ఏమి చెప్పలేము. డోంట్ వర్రీ, వియ్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు మేక్ యు ఏ నార్మల్ పర్సన్.”
చైతన్య, స్ఫూర్తిని ఆడిస్తున్నాడు.
డా.రొసాటో ఫస్ట్ సర్జరీ ఎవరు చేసారని అడిగినపుడు, డా. బార్బరా అని చెప్పినపుడు, ” ఓ, హౌ ఈజ్ షి? షి వాజ్ మై స్టూడెంట్ అండ్ వర్కడ్ ఫర్ మీ.” అని చెప్పారు.
సర్జరీ తర్వాత నొప్పి మొదటిలానే వస్తుందా, ఏమైనా మార్పుందా అని అంటే, “సర్జరీకి ముందు చాలా వాంతులు, విరేచనాలవుతుండేవి. కానీ సర్జరీ తర్వాత ఆగిపోయాయి.” అని చెప్పాను. ఇలా చాలా ప్రశ్నలడిగారు. ఓ గంట సేపయింతర్వాత అపాయింట్మెంట్ అయిపోయింది. డా.రొసాటో మళ్ళీ నెలకి వచ్చి కలవమన్నారు.
ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గర నెల తర్వాత రావడానికి అపాయింట్మెంట్ తీసుకుని న్యూట్రిషనిస్టుల దగ్గరకు వెళ్ళాము. అక్కడ వాళ్ళు నా బరువు చూసారు. కనీసం 15-20 పౌండ్లు పెరిగితే కానీ సర్జరీకి రెడీ అవ్వనని అన్నారు. “కేవలం జే-ట్యూబ్ తో అన్ని పౌండ్స్ పెరగడం సాధ్యమా? మళ్ళీ టి.పి.ఎన్ పెడ్తారా?” అని అడిగాను. టి.పి.ఎన్ తో నాకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెల్సు. ఒకరోజు ఫోన్ చేసి అన్నీ డిటైల్స్ తీసుకుంది ఒకమ్మాయి.
జే-ట్యూబ్ తోనే ప్రయత్నిస్తామన్నారు. దాంతో పాటు కొద్దిగా లో ఫాట్ (తక్కువ కొవ్వు) వున్న ఆహారం తీసుకోమని ఏమేం ఏ టైంకి తినాలో ఒక లిస్ట్ ఇచ్చారు.
మొత్తం అపాయింట్మెంట్ అయ్యేవరకు నాకు నీరసం ముంచుకొచ్చింది. మేము హాస్పిటల్ ముందు బెంచీలో కూర్చుంటే శ్రీని కార్ పార్కింగ్ దగ్గర వున్న కార్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. బ్యాగ్ లో కొబ్బరినీళ్ళ చిన్న పాకెట్ ఉంటే తీసుకుని త్రాగి, చైతన్యకు స్నాక్స్ ఇచ్చి, స్ఫూర్తికి పాల బాటిల్ ఇస్తే తాగేసింది.
కార్ వచ్చాక ఎక్కి కూచున్నాము.
జే-ట్యూబ్ పెట్టాలంటే నాకెంత కోపం వచ్చిందో, ఇపుడు ఆ జే-ట్యూబే ఇంతగా పనికి వస్తుంది. డా. రిచర్డ్ వచ్చి నన్ను ట్యూబ్ పెట్టించుకోవడానికి ఎలా ఒప్పించారో గుర్తుకు రాసాగింది.
***
డాక్టర్ రిచర్డ్ వచ్చి ముందు పిల్లల గురించి మాట్లాడాడు. “పాప ఎలా వుంది? పాకుతుందా? కూర్చుంటుందా?” అని అడిగారు
“పాప బాగుందండి! పాకుతుంది, కూర్చుంటుంది. మేము పాప పుట్టినప్పుడు బేబీస్ ఫన్ జిమ్ తీసుకున్నాం. ఇది త్రీ ఇన్ వన్. పిల్లలు పుట్టగానే .ఎక్కువ కదలరు కదా, పడుకోబెడితే దానికి పైన బొమ్మలు వేళ్ళాడుతుంటాయి అవి చూసి ఆడుకుంటారు చేతులు, కాళ్ళు ఆడిస్తూ. ఆ తర్వాత దాన్ని పెద్దగా చేస్తే దాని మీద పాకడం, చిన్న చిన్న బొమ్మలు పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇపుడు బాగా పాకుతుంది, కూర్చుంటుంది కదా, దాన్ని ఇల్లు లాగ చేసాము. అమ్మ అక్కడ కూర్చుని ఉంటే ఆ యింటి చుట్టూ తిరుగుతూ, వాటి కిటికీలోనుండి చూస్తుంది. అమ్మ చూసే లోపల తను దాక్కుంటుంది. ఎపుడన్నా అమ్మ గబుక్కున చూస్తే ఒకటే నవ్వులు. ఆ నవ్వు చూస్తే చాలు డాక్టర్ అన్ని మర్చిపోతాను. ఒకోసారి చైతన్య ఆడిస్తాడు, వాడు ఆడితే తనకి ఎంత సంతోషమో! నేనేలా ఉన్నా, పిల్లలిద్దరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాళ్ళు అలాగే పెరగాలి. హాస్పిటల్స్ లో వున్నపుడే చాలా బాధగా ఉంటుంది. ఇంటికెళితే వాళ్ళతోనే సమయం గడిచిపోతుంది.” అన్నాను.
“దట్స్ గుడ్ దుర్గా! చూస్తూ చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళయిపోతారు. నీకు ఓపిక లేనపుడు వాళ్ళతో ఎక్కువ సమయం గడపలేవు. అదే నీకు ఒంట్లో శక్తి వుంటే వాళ్ళతో పరుగులు పెట్టొచ్చు, తెల్సిందా?”
ఆ ఉపోద్ఘాతం ఎందుకో అర్ధం అయ్యింది. నేనేం మాట్లాడలేదు.
” నిన్న వచ్చిన డాక్టర్ ఏం చెప్పారు?”
“నా చిన్న ప్రేవుల్లో ఒక ట్యూబ్ కనెక్షన్ …. అది ఏంటి? జే.ట్యూబ్ పెడితే జీవితాంతం వుంచుకోవచ్చట. దాంతో న్యూట్రిషన్ వస్తుందట నాకు…”
” నీకు జీవితాంతం ఎందుకు? నీకు సర్జరీ అయ్యేవరకు పెడితే చాలు. అది నీకు మంచిదే కదా! మీరు సర్జన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్ట్స్ చేసి ఏం చేస్తారో చెప్పేదాక నువ్వు కనీసం ఊపిరైనా పీల్చుకోగలగాలి కదా! దిస్ ట్యూబ్ హెల్ప్స్ టు గేన్ వేయిట్, విచ్ ఈజ్ నెసెసరీ ఫర్ సర్జరీ! లేకపోతే రికవరీ చాలా కష్టం అవుతుంది. ఎన్ని నెలలో, ఏడాదో, రెండేళ్ళో చెప్పలేం దుర్గా! ఆ చిన్న సర్జరీ చేయడానికి ఇక్కడ సౌకర్యాలు లేవు. అందుకే నిన్ను లాంకెను హాస్పిటల్ కి పంపిస్తున్నాం. ఆ సర్జన్ నాకు మంచి ఫ్రెండ్. చాలా బాగా చేస్తాడు సర్జరీలు. ఐ యాం ష్యూర్ యూ విల్ బి ఆల్రైట్…”
” నాకు తెల్సు ఆ హాస్పిటల్. ఎనిమిదో నెలలో నొప్పులు మొదలయినప్పుడు అక్కడికే పంపించారు. చాలా మంచి నర్సెస్ ఉంటారు అక్కడ. చాలా బాగా చూసుకుంటారు.” అన్నాను.
” సో ఇది నీకు ఓకేనా?”
“నాకు ఇంకేదైనా చాయిస్ వుందా?”
“నో, అన్ ఫార్చునేట్లీ నో చాయిస్. బట్ యూ విల్ గెట్ రెడీ ఫర్ ది సర్జరీ…”
“ఓకే!”
“రేపే నిన్ను ఆ హాస్పిటల్ కి పంపిస్తాము. ఆ ట్యూబ్ పని చేసి, సర్జరీ సక్సెస్ ఫుల్ అయితే అపుడు యూ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్! ఆల్ ది బెస్ట్ విత్ ఎవ్విరిథింగ్ దుర్గా!”
“థ్యాంక్యూ ఫర్ ఎక్స్ ప్లేనింగ్ క్లియర్లీ డాక్టర్ రిచర్డ్.” అన్నాను.
ఆయన వెళ్ళిపోయాడు. నేను ఫోన్ చేసి శ్రీనికి అంతా చెప్పాను. వాళ్ళు సాయంత్రం వస్తామన్నారు.
నేను బాత్రూమ్ కెళ్ళి వచ్చే లోపల ఫోన్ మ్రోగుతుంది. “హలో!”
“చిన్ని అమ్మ నీతో అంబులెన్స్ లో వస్తానంటుంది. నేను వెనక కార్లో వెళ్దామంటున్నాను. నువ్వు మాట్లాడు.” అని ఫోన్ అమ్మకి ఇచ్చాడు.
” అమ్మా వద్దమ్మా! అంబులెన్స్ లో నువ్వెపుడు వెళ్ళలేదు, నీకు అలవాటు లేదు. నాకేం పర్వాలేదు. నాకలవాటే. నువ్వు శ్రీనివాస్ తోనే రామ్మా! పాప్ కార్లో ఏడుస్తుందేమో. నువ్వు దాంతో మాట్లాడుతూ అంటే అది కామ్ గా ఉంటుందేమో అమ్మా! సరేనా?”
“సరేలే! కార్లోనే వస్తాను. అంబులెన్స్ అయితే అందులో నర్సులు, డాక్టరు ఉంటారు. వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారు, నువ్వేం కంగారు పడకు.”
” అలాగే అమ్మా! సాయంత్రం నీకు చేతనయితేనే రా. రేపు హాస్పిటల్లో ఎలాగైనా కలుస్తాము కదా!”అన్నాను.
మర్నాడు లాంకెను హాస్పిటల్ కి వెళ్ళాము. ఎనిమిదో నెలలో వచ్చినపుడు మాటర్నల్ వార్డ్ కి వెళ్ళాము. ఇపుడు గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డ్ కి వెళ్ళాము. రూంలో సెటిల్ అయ్యాక, సర్జన్ వచ్చి చూసి వెళ్ళాడు. “డోంట్ వర్రీ వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ హియర్, ఓకే! డా. రిచర్డ్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. హిజ్ పేషంట్ ఈజ్ మై పేషంట్. ఇది చిన్న ప్రొసీజర్. మీకు పెద్ద ఇబ్బందిగా ఏమీ వుండదు. ఈ ట్యూబ్ ఫీడింగ్స్ కి అలవాటయితే ఏం ప్రాబ్లెం ఉండదు. మీ మేజర్ సర్జరీకి చాలా సాయం చేస్తుంది, మీకు కొంచెం శక్తి వస్తే!” అని స్టెతస్కోప్ తో నన్ను పరీక్ష చేసి, ” ఐ విల్ సీ యూ టుమారో మార్నింగ్ ఇన్ ది ఆపరేషన్ దియేటర్! గెట్ గుడ్ నైట్స్ స్లీప్!” అని చెప్పి వెళ్ళిపోయాడు.
నేను స్నానం చేసి మూడు రోజులయ్యింది. ఇక్కడ షేరింగ్ బాత్రూమ్ అంటే ఇద్దరు పేషంట్స్ కి ఉంది. అటు వైపు ఆపిడ కొంచెం పెద్దావిడ. ఆవిడకి ఏదో టెస్ట్ చేసారట. రిజల్ట్ ని బట్టి ఆవిడ ఈ రాత్రికి ఉంటుందో లేదో తెలియదు. తను నన్ను వెళ్ళి స్నానం చేసుకోమ్మా అని చెప్పింది. అమ్మ ఇంటినుండి నా బట్టలు తీసుకొచ్చింది. హాస్పిటల్ గౌన్ వుంటుంది, టవల్ బాత్రూమ్లో ఉంటుంది కాబట్టి నేను స్నానం చేయడానికి వెళ్ళాను. కొద్దిసేపయ్యాక చూస్తే శ్రీని ఇంటి నుండి తెచ్చిన షాంపు, నా బట్టలు మర్చిపోయి వచ్చాను. అమ్మని పిల్చి ఇవ్వమన్నాను. నేను తనని తలుపు తీసుకొని వచ్చి టవల్స్ షెల్ఫ్ లో పెట్టమన్నాను. నేను ఆలోచించలేదు, అమ్మ నన్ను అంత సన్నగా ఎపుడూ చూడలేదు. నా ఒంటి మీద బట్టలు కూడా లేకపోవడంతో ఒంట్లోని ఎముకలన్నీ లెక్క పెట్టేలా వున్నాయి. అమ్మ వచ్చి ముందు బట్టలు పెట్టి వెళ్ళేపుడు నన్ను చూసింది. నేను అటువైపు తిరిగి నిల్చున్నాను. “అయ్యో! ఇదేంటమ్మా వంట్లో ఏం లేదేంటే? సన్నగా వున్నావనుకున్నా కానీ మరీ ఇంత సన్నగానా? చిన్నపుడు నీకే బుగ్గలెక్కువుండేవి ఎంత ఆరోగ్యంగా వుండేదానివమ్మా!” అని కళ్ళు తుడుచుకుంది.
నేను టవల్ చుట్టుకుని, “అమ్మా మనం ఇక్కడికి ఎందుకొచ్చాం? ఈ ట్యూబ్ పెడితే బరువు పెరుగుతుందనే కదా! కొన్ని వారాల్లోనే నువ్వు మార్పు చూస్తావు, తెలిసిందా! నువ్వు బాధ పడకమ్మా, నువ్వేడిస్తే నాకేడుపొస్తుంది. నువ్వు బయటకు వెళ్ళి కూర్చో. నేను త్వరగా స్నానం చేసి వస్తాను, మనమిద్దరం కల్సి ఏదైనా సినిమా చూద్దాం, సరేనా!” అని మెల్లిగా అమ్మని బయటకు పంపాను.
నేను త్వరగా స్నానం చేసి వచ్చాను. స్నానం చేస్తున్నంత సేపు అమ్మ గురించే ఆలోచిస్తున్నాను. పాపం ఎంత షాకయ్యిందో నన్ను ఇట్లా చూసి. తను వెళ్ళే లోపల కొద్దిగానయినా బరువు పెరిగితే తను కొంచెం ప్రశాంతంగా ఇండియాకి వెళ్ళొచ్చు. అమ్మ ముందరే మొదలొచ్చిన డాక్టర్ చెప్పారు ఈ ట్యూబ్ గురించి. అతను వెళ్ళగానే నేను మొత్తం అమ్మకి అర్ధమయ్యేలా చెప్పాను. తను వెంటనే, “అయితే నేను నీకీ సర్జరీ అయ్యాకే వెళ్తాను. మళ్ళీ పెద్ద సర్జరీ ఎపుడు చేస్తే అపుడు మళ్ళీ వస్తాను.” అంది.
నేను శ్రీనికి చెప్పాను అమ్మ ఏమందో. తను టికెట్ ఎక్స్ టెన్షన్ చేయిస్తానన్నాడు రెండు వారాలకు, అమ్మేమో ఒక నెలకి చేయమంది. అమ్మ ఉంటే ఎంత సాయమో మాకు తెల్సు. అమ్మ ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది,అందుకే ఉండమని అడగలేదు. కానీ తనంత తాను అన్నది కాబట్టి మేము సంతోషించాము.
నేను బయటకు వచ్చాక, అమ్మ వూల్ తో స్ఫూర్తికి స్వెట్టర్ అల్లుతూ కూర్చుంది. నేను టివీలో కామెడీ సినిమా పెట్టాను. అమ్మ కూడా చూడడం మొదలుపెట్టింది. ’సిస్టర్ యాక్ట’, అనే కామెడీ సినిమా. వూపి గోల్డ్ బర్గ్ మంచి ఆఫ్రికన్ అమెరికన్ నటి. ఆమె వుంటే సినిమా అంతా నవ్వులమయమే అలాగే ఆమె అంత సీరియస్ గా నటించగలదు. ఎక్కువగా యాక్షన్ తోనే కామెడి వుంది కాబట్టి అమ్మకు కథ, జోక్స్ కూడా అర్ధం అయ్యింది. “ఆమెని చర్చ్ లోనుండి వెళ్ళిపొమ్మంటున్నారా?” అనడిగితే నేను ఆశ్చర్యపోయాను. “అవునమ్మా,” అన్నాను. నా మనసు కొంచెం తేలికపడింది. అమ్మ నా గురించే ఆలోచిస్తూ బాధ పడ్తూ వుంటుందేమో అనుకున్నాను.
సర్జరీ త్వరగానే అయ్యింది. కానీ నన్ను అడ్మిట్ చేసుకున్నారు కాబట్టి నాకు మెలుకువ వచ్చేవరకు షార్ట్ ప్రొసీజర్ యూనిట్లో వుంచి, మెలుకువ వచ్చింతర్వాత నా రూంలోకి తీసుకొచ్చారు. కడుపుకి ఎడమ వైపు చిన్న కన్నం చేసి దానిలోకి ఒక ట్యూబ్ పెట్టి కొంత భాగం బయటకు వదిలిపెట్టారు, దాన్ని మూసి, తెరుచుకునేలా వుంది. మరో వైపు ట్యూబ్ చిన్న ప్రేవుల్లో పెట్టారు. బయటకు వున్న ట్యూబ్ కి న్యూట్రిషన్ బ్యాగ్ కి వుండే ట్యూబ్ ని పెట్టి గంటకు ఎంత ద్రవం లోపలికి వెళ్ళాలి అనేది చిన్న మెషిన్లో సెట్ చేసి మొదలు పెడితే చిన్న ప్రేవుల ద్వారా నా శరీరానికి కావాల్సిన పోషకాహారం అందిస్తుంది.
మనం తిండి తిన్నా తినకపోయినా ఇక పర్వాలేదు, ఎందుకంటే ఈ జే-ట్యూబ్ ద్వారా పోషకాలు లభించి శరీర బరువు పెరుగుతుంది.
కొంతమందికి కడుపులో క్యాన్సర్ వచ్చి సర్జరీలు, కీమో థెరపీ ట్రీట్మెంట్, రేడియేషన్ల తర్వాత తినే శక్తి పోతుంది. అలాంటివారికి, పాన్క్రియాటైటిస్ వల్ల, మరి కొన్ని ఇతర జబ్బులవల్ల తినలేనివారికి ఇలాంటి ట్యూబ్ ఫీడింగ్స్ పెడుతుంటారు. పెద్దవాళ్ళకే కాదు హాయిగా ఆడుతూ పాడుతూ అన్నీ తింటూ ఆరోగ్యంగా పెరగాల్సిన చిన్న పిల్లలకు, పసివాళ్ళకు, పుట్టుకతోనే భయంకరమైన జబ్బలున్నవారికి కూడా ఈ ట్యూబ్ ఫీడింగ్స్ బ్రతికిస్తాయి, కొంతమందికి ట్రీట్మెంట్ అయ్యేవరకు పేషంట్స్ ని బ్రతికి వుంచుతాయి. నేనూ అందరికీ, “నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అసలు నేనంటూ బ్రతికి వుండాలిగా అందుకే ఈ ట్యూబ్ పెట్టడానికి ఒప్పుకున్నాను.” అని నవ్వేదాన్ని. దాంతో అందరూ, “అమ్మో ఎంత ధైర్యంగా ఉన్నావో, నాకే ఈ పరిస్థితి వస్తే చచ్చిపోయేదాన్ని,” అని అనేవారు. అంటే నేను ధైర్యంగా ఉన్నందుకు నన్ను మెచ్చుకుంటున్నారో, వెక్కిరిస్తున్నారో అర్ధం అయ్యేది కాదు.
“అందరూ అలాగే అంటారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం బ్రతికి వుండడానికి డాక్టర్లు ఏది చెబితే అదే చేస్తాం. అందరం పోవాల్సిన వాళ్ళమే కానీ ఇది పోయే సమయం కాదు నాకు. నా పిల్లలు చిన్నవారు, ఒకవేళ ఈ జబ్బు తగ్గిపోతే నాకు ఇష్టమైన పనులు కూడా చేసుకునే అవకాశం వస్తుందేమో! అందుకే ఈ ప్రయత్నమంతా.” అనేదాన్ని.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
