కాదేదీ కథకనర్హం-24

కార్యేషు మంత్రి 2

-డి.కామేశ్వరి 

“నా ఇష్టం అంటే చెల్లిపోతుందా…..పెళ్ళాం ఉన్నవాడు తనిష్టం వచ్చినట్టు తిరుగుతుంటే చచ్చినట్టు నోరు మూసుకోవాలా…..అలా పడి వుండడానికి నీవేం పాతకాలం ఆడదానివా ….అలా తిరిగే హక్కు నీకేం లేదని చెప్పలేవా?”

“ప్రభా…… పాతకాలం ఆడదయినా కొత్తకాలం ఆడదయినా…..ఓ మొగుడు ఓ మగమహారాజు నా ఇష్టం అంటే ….భార్యకి రెండే త్రోవలున్నాయి……ఒకటి – వేరే దారి లేకపోతే చచ్చినట్టు సహించి పడుండటం, రెండు – తెగించి మొగుడ్ని వదిలి పోవడం – ఈ రెండింటిలో ఏది చెయ్యమంటావు నన్ను?”

“మొగుడ్ని వదిలిపోవడం నీకేం ఖర్మ…..ఉండి అతనికి పట్టిన తీట వదిలించాలిగానీ’ కోపంగా అంది ప్రభావతి.

‘అదే…..ఎలా అంటావు….?”

“ఎలాగేమిటి, నీ తిరుగుళ్ళు చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వాలి?”

“ఇస్తాను, అరుస్తాను, అలుగుతాను, తిడతాను – ఏడుస్తాను …..వీటివల్ల నేనేధన్నా సాధించగలుగుతానంటావా- నేను తిట్టినకొద్దీ ఆయనకి నాపట్ల కోపం, ద్వేషం పెరుగుతుంది. అటుపక్క మోజు మరింత పెరుగుతుంది. పెళ్ళాం రాక్షసిలాగ, ప్రియురాలు ప్రేమమూర్తిలా మరింతగా అటు ఆకర్షితులౌతారు.

ఇంకా నేను అరుస్తూ వుంటే, ఉంటే వుండు పాతే పో అనచ్చు. అప్పుడు నా సంగతి ఏమిటి? నాకున్న ఈ డిగ్రీతో ఈ పిల్లలని పోషించి, చదువులు చెప్పించి ప్రయోజకులని చేయగలనా- అటు మావాళ్ళు నన్నేకాక నా పిల్లలని ఆదుకునేంత గొప్పవాళ్ళెం కాదు. ఇన్నాళ్ళూ నేను, పిల్లలూ అందరం ఓ స్థాయికి అలవాటు పడ్డాం. పిల్లలు ఈ సుఖాలకి దూరమై, నేను తెచ్చే వెయ్యో, రెండు వేలతో సరిపెట్టుకుని బతకడానికి ఒప్పుకుంటారా? తండ్రిని దూరం చేసినందుకు ఇంకాస్త పెద్దయ్యాక నన్ను క్షమిస్తారా. ఎదిగీ ఎదగని ఈ పిల్లలని పెట్టుకుని నేను ఒంటరిగా బతకగలనా? నాకా ధైర్యం వుందా? పోనీ పిల్లలని వదిలిపోతే నేను వుండగలనా? ఆవేశంలో పెట్టె సర్దుకు పోవడానికి, మిషను కుట్టి పిల్లలని పోషించడానికి ఇది సినిమానా! ఒకసారి గనక నేను ఇల్లు వదిలి బతకలేక మళ్ళీ వస్తే మరింత లోకువవనా?”

‘అంటే, నీ భర్త ఆఫీసరుహోదా , బంగళా, కారు కోసం అన్నీ తెలిసి కూడా సహించి పడుంటావా….అంతకి దిగజారి సర్దుకు బతుకుతానంటావా”

“ప్రభా ! కోపం తెచ్చుకోకుండా ఆలోచించు. భార్యగా ఆయన ఈ ప్రవర్తన నాకు బాధ కలిగించడం లేదనా నీ ఉద్దేశం. కట్టుకున్న మొగుడు ఇంకో ఆడదాని ఆకర్షణలో పడితే ఆ అవమానం, హింస నాకు లేదంటావా? ఈ పిల్లలు గనక లేకపోతే ఇల్లు కదలడానికి అరక్షణం ఆలోచించేదాన్ని కాదేమో. ప్రభ ఆయన్ని ఎదిరించి బతికే ధైర్యం, అవకాశం నాకు లేనప్పుడు బయటపడి ఆయనచేత మాటలు పడేకంటే తెలియన్నట్లు ఊరుకుంటే ఆయన గిల్టీ ఫీలింగు ఆయన్ని తినేస్తుంది. ఈ పైపై వ్యామోహాలు ఎన్నాళ్ళు ఉంటాయి అంటావు? కొత్త బొమ్మ చేతికొస్తే ముందు రోజు విడవకుండా ఆడతారు పిల్లలు. మర్నాటి నుంచి దాని ముఖం చూడరు. ఈ మగాళ్ళు అంతే, అందనంతవరకే ఆరాటం, ఈ దొంగచాటు వ్యవహారాల థ్రిల్ అంతా అందేవరకూ….’

“ఏమిటి నీ వాదన? ఆయనగారు మోజు తీరి ఎలాగో మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు. నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుందంటావా……ఛీ ….ఛీ కాస్తో కూస్తో చదువుకున్న మనం కూడా అలా ఆలోచించబట్టే మన గతి ఇలా వుంది. పెద్ద సతీసుమతివి. వెళ్ళు మొగుడ్ని ఆవిడ ఇంటికి తీసికెళ్ళి అప్పగించు….’ ప్రభావతి కోపంగా లేచిపోయింది.

‘దాని ఇంటికి ఎందుకు, ఆవిడనే ఇక్కడికి రమ్మందామునుకుంటున్నాను.” చిలిపిగా నవ్వింది. “ఈ దొంగచాటు ఎందుకు…..ఇంటికే తెచ్చుకుంటే సరిపోతుంది అని చెపుతాను”

ప్రభావతి నోరెళ్ళ బెట్టింది. సుమతి నవ్వుతూ ఆ నోరు మూసి –” నాకేం మతి పోలేదే….ఇప్పుడింక నీ నోరు విప్పకు. ఇంకో వారం తరువాత మాట్లాడుదువుగాని నేను చేసింది చూశాక” అంది.

 * * *

‘చూడండి ….మీ పేరు జయ కదా. నేను మిసెస్ రమేష్ ని. అంటే మీ బాస్ గారి భార్యను.” రూములో పుస్తకం చదువుతున్న జయ గాభరాగా లేచింది. “ఫరవాలేదు ఏం భయపడకు. నిన్నేం తిట్టడానికో, కొట్టడానికో రాలేదు. అలా చెమటలు పడుతున్నాయేమిటి? ముందు కూర్చో. మనం సావకాశంగా మాట్లాడుకుందాం.

నువ్వు నాకెలా తెలుసా అన్నది, నీ ఇల్లెలా తెలిసింది లాంటి చిన్న ప్రశ్నలొద్దు. సూటిగా పాయింట్ మాట్లాడుకుందాం.” సుమతి తను కూర్చోని బిత్తరపోయి చూస్తున్న జయ చెయ్యి పట్టుకు కూర్చోబెట్టింది చనువుగా.

‘చూడమ్మా , నీవు నాకంటే చిన్నదానివి. నన్ను నీ అక్క అనుకో. ఇప్పుడు చెప్పేదంతా నీ మంచి కోసమే అన్నది అర్ధం చేసుకో. నీకు…..మావారికి మధ్య జరుగుతున్నది నాకు తెలియదనుకోకు. ఇలాంటి విషయాలు ఎన్నాళ్ళో దాగవు. చూడు జయా! నీవు పెళ్ళి కావాల్సినదానివి. ఇలా పెళ్ళయిన మగాడితో సంబంధం పెట్టుకునే ముందు ఒక్కక్షణం ఆలోచించావా? ఈయన నిన్నేమన్నా పెళ్ళి చేసుకుంటానన్నారా? అని వుండరు.

ఎందుకంటే ఈ మగాళ్ళకి చాటుగా ఓ ఆడదానితో తిరిగి రొమాన్స్ జరపడం ఓ త్రిల్లు గానీ, పెళ్ళాం వుండగా మరొకర్తిని తెచ్చి పెట్టుకుని పెళ్ళాడే దమ్ము లుండవు. వాళ్ళు పరువు ప్రతిష్టలతో పాటు భార్య , పిల్లల సంసారం ఏదీ వదలడానికి ఇష్టపడరు. ఈ రెండో ఆడది ఓ డ్రింక్ లాగానో, ఓ పేకాట లాగానో టైంపాస్ కో, థ్రిల్ లో, కిక్కుకో కావాలి వాళ్ళకి. ఆయనకి భార్య పిల్లలున్నారని తెలిసే ఆయనతో సంబంధం పెట్టుకున్నావనుకుంటాను” సుమతి జయ కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగింది. అప్పటికే జయ బాగా చెదిరిపోయింది. సిగ్గుతో, అవమానంతో, చితికిపోతూ, హఠాత్తుగా అలా రమేష్ భార్య వచ్చి అలా నిలేస్తుంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయింది.

“పిచ్చిపిల్లా, నీ స్థితి నాకర్ధం అయింది. ఆయన స్మార్ట్ నెస్, ఆయన హోదా, అంతస్తు చూసి, ఆయన వల్లించిన కల్ల బొల్లి ప్రేమకబుర్లకి మెత్తపడిపోయావు. ఉద్యోగం నీ అవసరం. బాస్ ని ఇంప్రెస్ చెయ్యాలన్న ఆరాటంతో నీ లిమిట్స్ మర్చిపోయావు. ఈ ఇంటేమసీ పెళ్ళికి దారితీయదని తెల్సినా జరిగినన్నాళ్ళూ జరగనీ అనుకుని దానివల్ల వచ్చే లబ్ధి పొందాలనుకున్నావు. నీవు ఒంటరిగా ఈ ఊర్లో ఉండడం, పెద్ద వాళ్ళ దగ్గర లేకపోవడం, ఈ రోజుల్లో దొరికే ఫ్యామిలీ ప్లానింగ్ లు అందుబాటులో వుండడంతో భయపడ్డానికి ఏమిలేదని స్వేచ్ఛగా తిరిగావు. అంతేనా”

జయ తల దించుకుంది. కళ్ళమ్మట నీరు కారసాగింది. నల్లబడ్డ ముఖం పైకి ఎత్తి ప్రాధేయపూర్వకంగా సుమతి వంక చూసింది. “క్షమించండి…..ప్లీజ్…..పొరపాటయింది….ఇంత దూరం ఆలోచించలేదు నేను…..ఇంక నేను……’ వణుకుతున్న గొంతుతో ఏదో అనబోయింది.

“నా మొగుడ్ని వదిలేయి. నాకు పతిభిక్ష పెట్టు, నా కాపురం నిలబెట్టు అని అడగడానికి వచ్చాననుకుంటున్నావా ? నా మొగుడ్ని కలవద్దు అని ఆంక్షలు పెట్టడానికి రాలేదు జయా” జయ తెల్లబోతూ చూసింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.