“నెచ్చెలి”మాట

ఎదురుచూపు

-డా|| కె.గీత 

ఎంతటి
కార్యసాధకులైనా
కొందరికి
ఎదురుచూపే
జీవితం!

అదేవిటి
అలాగంటారు?
కార్యసాధకులకు
తిరుగులేదు కదా!

తిరుగులేదని
ఎవరు
చెప్పారండీ!!

అంటే
ఏదో
లోకోక్తి కదా
అని…

లోకోక్తులు
ఏ కాలం
నాటివో!
ఈ కాలపు
ఉక్తులు
యుక్తులు
అన్నిటినీ
మార్చేస్తాయి!
రాసుకోండి-
ఎంతటి
కార్యసాధకులకైనా
తప్పని
ఓటమే
జీవితం!
అన్నదే
ఈ కాలపు
లోకోక్తి!

అదేవిటి
మొదట
ఎదురుచూపన్నారు!

అవునండీ
అవును-
అక్కడికే
వస్తున్నాను-
ఓటముల
నించే
ఒక్క
గెలుపు
కోసమైనా
ఒక్క
అవకాశం
కోసమైనా
జీవితకాలపు
ఎదురుచూపు
మొదలవుతుంది!

దేనికి
ఎదురుచూపు
చదువు
ఎప్పుడు
పూర్తవుతుందనా?!
ఉద్యోగం
ఎప్పుడు వస్తుందనా?!
పెళ్లి
ఎప్పుడు అవుతుందనా?!
పిల్లలు
ఎప్పుడు కలుగుతారనా?!
జీవితంలో
ఎదుగుదల
ఎప్పుడు వస్తుందనా?!
ఎప్పటికి
స్థిరపడతామనా?
దేనికి
ఎదురుచూపు??!!

ఆహా!!
అన్నీ
సెలవిచ్చి
ఇంకా
దేనికని
అడుగుతారేవిటి?!
ఇంకా
ప్రేమ
ఫలించడం
కోసమా?!
పరాయిదేశపు
వీసా కోసమా?
నేపాల్
బీభత్సంలో
కొట్టుకుపోయిన
వారికోసమా?
తీరి కూచుని
చేసే యుద్ధాల్లో
అసువులు బాసిన
వారికోసమా?
అని అడుగుతారనుకున్నాను

సరేనండీ
ఏదో
ఒకటి-
అసలు
దేనికంటా
ఎదురుచూపు?!
దేనికీ
తిరుగులేని
కార్యసాధకులకు
పైగా!

ఎంతటి
కార్యసాధకులకైనా
ముగింపు
అనేదొకటి
ఉంది కదా!
దానికి
ఎదురుచూపు
తప్పదు కదా!!

అదా
సంగతి!
ముగింపు కోసం
ఎదురుచూపు
ఎందుకు?

మొదలు
పుట్టినప్పుడే
ముగింపూ
పుడుతుంది
ఎప్పుడూ
వెంటాడుతూనే
ఉంటుంది
వద్దనుకున్నా
ముగిసిపోతుంది
ఈ
మధ్య
మిగిలిన
కాసిన్ని క్షణాలూ
ఎదురుచూపులు
మానేసి
హాయిగా
అనుక్షణమూ
జీవించండి!!
ఎదురుచూపు
చూడకండి!
ముఖ్యంగా
“కార్యసాధకుల”మని
మేకతోలు కప్పుకుని
తిరగకండి

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఆగస్టు, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  చంద్ర మోహన్

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: కొడుకు  (కథ) – వెంపరాల దుర్గా ప్రసాద్

ఇరువురికీ  అభినందనలు!

****

4 thoughts on “సంపాదకీయం-సెప్టెంబర్, 2026”

  1. “ముగింపు కోసం
    ఎదురుచూపు
    ఎందుకు?”
    ప్రశ్న కొత్త గా వుంది. జవాబుని వెదకడమే జీవితాన్వేషణ కదా!
    ఆ ఎదురుచూపులోనే కొన్ని కావ్యాలు పుట్టాయి.
    కొన్ని ఆశలు చిగురులు తొడిగాయి.
    కొన్ని రాత్రులు తెల్లారిపోయాయి.
    కొన్ని కళ్ళు వెలుగుపూలై విచ్చుకున్నాయి.
    మరికొన్ని ఎడారులు దాటిపోయాయి.
    ‘వియోగ వేళల్లో ఎదురుచూపు..విరహాన్ని పెంచుతుంది. నిట్టూర్పుల నిప్పు సెగల క్షణాలన్నీ గోపికల మధుర గాధలైపోయాయి. తిరుప్పావై గీతాలయ్యాయి.
    అసలు జీవన రహస్యమంతా..ఎదురుచూపుల కళ్ళు విభిన్న అంశాల ఇతివృత్తాల కు నిలయాలు.
    రెండు రెప్పల మధ్య దాగిన ఒక సస్పెన్స్ కథ లా..కథలో మలుపులా..మెరుపైన ముగింపేదో తీసుకొస్తుందన్న ఆశా కన్య లా.. అనిపిస్తుంది.

    ‘మొదలు
    పుట్టినప్పుడే
    ముగింపూ
    పుడుతుంది.’ అని అన్నారు.

    ఇది నిజమే అయినా, ఆ రహస్యం తెలుసుకోడానికి కొందరికి జీవితకాలం పట్టొచ్చు. మరికొందరికి మొగ్గలోనే జ్ఞానోదయమూ కల్గొచ్చు. వారి వారి జీవితానుభవాల తీవ్రత ని బట్టి..హృదయవేదనల సాంద్రతని బట్టి వుంటుంది.
    ఎంత పెద్ద పూలమాలకైనా..కొస ని తెంపక తప్పదు కదూ?
    ఒక పగలు – రాత్రి తో..ఒక రాత్రి – ఒక వెలుగుతో ముగించాలి.
    కాలమీనా, కథైనా, జీవితమైనా..అంతే.
    మొదలయ్యాక – ముగియాల్సిందే. కన్ను మూయాల్సిందే. తప్పదు. ఎప్పటికైనా, ఎక్కడైనా..తప్పదు. మీరన్నట్టు ‘వద్దనుకున్నా ముగిసిపోతుంది.’
    లేకపోతే సంపూర్ణత వుండదు. ముగింపు నిజానికి విషాదం కాదు. మరో మొదలు కి శ్రీకారం.
    కానీ..నా విన్నపం ఏమిటంటే.. ఎదురుచూపులు వుండనీయండి.
    జీవితం లో కాసింత ఉత్సాహమూ, ఆశనిరాశల మధ్య ఊగులాటల విన్యాసం,
    గెలిస్తే సంతోషమూ
    ఓడితే దుఃఖమూ
    వుంటేనే బావుంటుంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా అని తెలీని ఎదురుచూపులు బావుంటాయి.
    ఎప్పుడు ముగింపో తెలీని నిజజీవితాలకి సశేష భాగాలు ఎదురుచూపులు..వుండనీండి.
    -ఆర్.దమయంతి.

  2. ఇన్ని నిజాలు అలవోకగా అదితి పదాలలో పరిచేశారు.
    మా మదిలోకి పంపించేశారు, గీతా జీ! మనసులో ఆలోచనలు, కోరికలు అనంతం కదూ! ఎన్ని ఉన్నా… ఇంకా లేనిదే లో వెతుక్కుని మరీ మనశ్శాంతి కి దూరమవుతాం. జరిగే క్షణాలను చాలా చాలా చక్కని పదాలతో మేమే అన్ని చేసేస్తున్నాంఅనుకుంటూ వదిలేయడాన్ని మీరు చూపిన తీరు బాగుంది. కార్యసాధకులమనే మేకతోలు కప్పుకోకండి చక్కని సందేశాన్ని అందించారు ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published.