
పిల్లల పెంపకం
-కందేపి రాణి ప్రసాద్
ఒక అడవిలో గాడిదల కుటుంబం నివసిస్తున్నది. తల్లి, తండ్రితో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నారు. ఇంటి చుట్టుపక్కల కూడా గాడిదలు నివసిస్తున్నాయి. ఇదంతా గాడిదల కాలనీ అన్నమాట.
తండ్రి గాడిద చాలా పని చేస్తుంది. ఉదయం వెళ్ళితే సాయం కాలానికి వస్తుంది. ఒక వ్యాపారస్తుడి దగ్గర పని చేస్తుంది. ఆ వ్యాపారస్తుడు పట్నం నుంచి సరుకులు తెచ్చుకుని పల్లెలో అమ్ముతూ ఉంటాడు. అలా సరుకులు తేవడానికి ఈ గాడిదను వాడతాడు. ఉదయం నుంచి సరుకుల మూటలు మోసి అలిసిపోతోంది. రాత్రికి ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోతుంది. ఇక పిల్లల గురించి పట్టించుకునే తీరిక ఉండదు.
తల్లి గాడిద పిల్లలు పుట్టినపుడు ఉద్యోగం మానేసింది. పిల్లలకు ఏడాది రాగానే మళ్ళీ ఉద్యోగం చేస్తానని పట్టుబట్టింది. తండ్రి గాడిద “అప్పుడు నేను కష్టపడుతున్నాను కదా నువ్వు కూడా ఎందుకు కష్ట పడటం. హాయిగా ఇంట్లో కూర్చుని ఇంటి పనులు, పిల్లల పనులు చూసుకో!” అని భార్యతో అన్నది. ఆ మాటతో భార్య గాడిద గమ్! మని ఇంతెత్తున ఎగిరింది. ఏమిటీ నేను ఉద్యోగం మానేసి, ఇంట్లో కూర్చోవాలా ! ఏమంటున్నావు నువ్వు స్త్రీ స్వేచ్చను హరిస్తున్నావు’’ అంటూ భర్తపై మండిపడింది.
భార్య అరుపులకు చుట్టు పక్కల వాళ్ళు వస్తారేమోనని భర్త గాడిద భయపడింది. తన భార్య గయ్యళి అని అనుకోవటం ఇష్టం లేక మౌనంగా ఊరుకున్నది. భార్య గాడిద ఒక చాకలి దాని దగ్గర పని చేస్తున్నది. ఊర్లో వారందరి ఇళ్ళకు వెళ్ళి మురికి బట్టలు తీసుకుని రేవుకు వెళ్ళడం, మరల సాయంత్రం ఆరిపోయిన బట్టలన్నీ తీసుకొని మళ్ళీ ఇళ్ళకు చేర్చటం చేస్తుంది. పని ఎక్కువగానే ఉంటుంది.
ఇదంతా చూసే భర్త గాడిద “నాకెలాగూ చాకిరీ తప్పదు నువ్వు హాయిగా పిల్లలతో గడపచ్చు కదా అంటే ఇందాకటిలా గయ్యిమని తగులాడుతుంది. తీరా ఇంటికి వచ్చాక అన్నం వండదు అలసిపోయాను అంటూ, బజార్లో కొనుక్కొస్తుంది. బజార్లో దొరికే తిండి తనకు పడదు. అనారోగ్యం కలుగుతుంది అంటే విననే వినదు. తను ఏం మాట్లాడినా ఎదురు చెప్పడమే తప్ప, సరే అనటమే తెలీదు.
ఒక రోజు తండ్రి గాడిద ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ సెల్‌ఫోన్‌లో మునిగిపోయారు. ఇద్దరూ ఫోన్‌లో క్రైమ్ సినిమాలు చూస్తున్నారు. స్కూలు నుంచి వచ్చి బ్యాగులు బయట పడేసి, ఫోన్ చూడడంలో మునిగిపోయారు. తండ్రి వచ్చిన విషయం కూడా గమనించ లేదు. పూర్తిగా సినిమాలు చూడటంలో మునిగిపోయారు. పిల్లల్ని అలా చూసేసరికి తండ్రికి చాలా కోపం వచ్చింది. పిల్లలిద్దరి వీపుల మీద దెబ్బలు వేశాడు.
పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. తల్లి గాడిద అప్పుడే ఇంటికొచ్చింది “ఏంటీ నా మీద కోపాన్ని పిల్లల మీద చూపిస్తున్నావా? ’’అంటూ భర్తపై కోపంగా అరిచింది.’ పిల్లల ముందు గట్టిగా మాట్లాడకు’ అంటూ వాళ్ళెం చేస్తున్నారో తెలుసా అంటూ తనూ కోపంగా అరిచింది.
పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ ఒక మూలన నిలబడ్డారు. చేతిలో ఫోన్ అలాగే ఉన్నది. తల్లి గాడిద పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ భర్తతో వాగ్వాదం చేస్తుంది. తండ్రి గాడిద విసుగుపడి బయటకు వెళ్ళిపోయింది.
మరునాటి ఉదయం స్కూలు నుండి వీరి ఇంటికి పిలుపు వచ్చింది. తండ్రి, తల్లి గాడిదలు ఇద్దరూ కలిసి స్కూలుకు వెళ్ళారు. అక్కడ ప్రిన్సిపాల్ చెప్పింది – మీ పిల్లలు చదవటం లేదు. రాయడం లేదు. ఎప్పుడూ ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు. టీచర్‌కు కనపడకుండా బ్యాగ్‌లో ఫోన్ పెట్టి చూస్తూనే ఉన్నారు. మేం చెప్పే పాఠాలు వినడం లేదు. ఇక పరీక్షల్లో ఏమి రాస్తారు. వాళ్ళకు చదువు రాదు. మీరు ఇంట్లో పిల్లల్ని పట్టించుకోరా?
ప్రిన్సిపాల్ మాటలకు తండ్రి గాడిద తల దించుకుని చెప్పింది. ‘‘నేను రోజూ గాడిద చాకిరీ చేస్తూ ఉంటాను ఇంటికి వచ్చాక పిల్లల్ని పట్టించుకోవడం కుదరదు. నువ్వు పిల్లలను చూసుకో అని చెప్పినా వినటం లేదు” అని అన్నది ‘‘నేను కూడా ఉద్యోగం చెయ్యాలనుకున్నాను. నేను పిల్లల కోసం ఇంట్లో ఎందుకుంటాను. ఇంటికి వచ్చాక తనూ పిల్లల్ని చూసుకోవాలి కదా అంటూ భర్తపై ఫిర్యాదు చేసింది భార్య గాడిద.
“చూడండి మీరిద్దరూ సంపాదిస్తున్నారు. కానీ పిల్లలకు మంచి చెడు ఎవరు నేర్పిస్తారు. స్కూల్లో మేం చెప్పిన పాఠాల్ని మీరు ఇంటి దగ్గర వల్లె వేయించాలి. రాసుకురమ్మన్న హోం వర్కులు చెప్పి రాయించాలి. ఇవన్నీ తల్లికే సాధ్యపడతాయి. మీరు ఉద్యోగం మీద పెట్టే మమకారం పిల్లల మీద పెడితే బాగుంటుంది” అని ప్రిన్సిపాల్, తల్లి గాడిదతో అన్నది.
ఏమిటీ ఇంటి విషయాలు పిల్లల విషయాలు అన్ని నేనే చూడాలా, తండ్రి కూడా పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించడా, స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే అంటూ భార్య గాడిద కోపంతో మండిపడింది.
ప్రిన్సిపాల్‌కు విషయం అర్థమయింది. ఇద్దరూ సమానమే కాదని ఎవరన్నారు. నీ పిల్లలు బాగుంటే నీ ఇల్లే బాగుంటుంది. చదువులు, డబ్బులు మాత్రమే కాదు. మంచితనం, మానవత్వం విలువలు మర్చిపోకుండా నేర్పించాలి. ఇవన్నీ ఇల్లాలే బాగా చేయగలదు. అనవసరమైన పోటీపడి జీవితం నాశనం చేసుకోవద్దు. మహిళలు చేయగలిగే పనులు కొన్ని, పురుషులు చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి. కొంచెం ఖర్చులు తగ్గించుకున్నా పిల్లలు మంచివాళ్లైతే సంతోషమే వేరు కదా.! అనవసర వాగ్వాదాలతో కుటుంబ జీవితం నరక ప్రాయం చేసుకోవద్దు. నీ భర్త బాగానే సంపాదిస్తున్నారు కదా! నీవు ఇల్లు పిల్లల్ని చూసుకుంటే తప్పేముంది. పిల్లలు ఫోన్ చూసి చెడిపోతే ఎవరి బాధ్యత? ప్రస్తుతం క్రైమ్ సినిమాలు చూస్తున్నారు. రేపు పోర్న్ వీడియోలు చూస్తారు? అప్పుడు ఎలా బాగు చేసుకుంటావు. చదువుకున్నావు కదా! సమస్యను అర్థం చేసుకోవాలి.” సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది ప్రిన్సిపాల్.
తల్లి గాడిద అర్ధం చెసుకున్నది. సరే మేడమ్ ‘ఇక నుంచి నా పిల్లల్ని నేను చూసుకుంటాను. మంచి పిల్లలుగా తీర్చిదిద్దుతాను.’ అన్నది ధృడంగా. తండ్రి గాడిద చాలా సంతోషించింది.‘‘ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చెడు అలవాట్లకు లోనవుతారు. పిల్లల పెంపకం తల్లి బాధ్యత’’ అనుకుంటూ తల్లి గాడిద పిల్లల్ని అక్కున చేర్చుకున్నది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
