
నడక దారిలో-66
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది.నేను హెచ్చెమ్ గా రిటైర్ కావటం, పెద్దక్క మరణం,ప్రత్యేకతెలంగాణా, సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం ,వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం, వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలత అపురూప పురస్కారం,ఆషీకి కాలేజీ ప్రహసనాలూ,ఇంట్లో పెరిగిపోతున్న పుస్తకాలూ, కరోనా విజృంభణ,పల్లవికి కరోనా వచ్చి తగ్గటం,వీర్రాజుగారి పెయింటింగ్స్, సేకరించిన ఆర్ట్ పుస్తకాలు రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్తుకి పంపటం తర్వాత—)
***
ఈ ఏడాది డిసెంబర్ నెల చాలా విశేషాలతో బిజీగా నడిచింది.
ఈ మధ్య కుందుర్తి కవిత తాను రాసిన కవితలు నాకు పంపించింది. బాగారాస్తున్నావని ప్రోత్సహించడమే కాకుండా నెచ్చెలి, కవి సంధ్య ఈ మెయిల్ ఐడీలు ఇచ్చి పంపించమని చెప్పాను. నేనేమైనా సవరణలు చేస్తే సరిదిద్దుకుంటుంది. వాటిని వీర్రాజుగారికి కూడా వినిపించేదాన్ని.
ఇంకో విశేషం ఏమిటంటే నేనూ, పల్లవి కూడా వున్న మనలో మనం వాట్సాప్ సమూహంలో పల్లవి చిన్నచిన్న రచనలూ, కవితలూ రాయటం సంతోషం కలిగించింది. కరోనా సమయంలో సుధామ ప్రారంభించిన” ఒకసారి చూడండి అంతే” అనే వాట్సాప్ పత్రికలో కథలకు చిత్రాలు వేయటమే కాకుండా దాని తరపున సుధామ నిర్వహించిన కవితలపోటీలో పల్లవి రాసిన కవిత ప్రచురణకు ఎంపిక అయ్యింది. అదేవిధంగా విశాలాక్షి నిర్వహించిన కవితలపోటీలో కన్సొలేషన్ బహుమతి వచ్చింది. వాటిని కూడా ఫోనులో చదవటం వీర్రాజుగారికి తెలియదు కనుక వినిపించాను. అవి విని ఆనందంతో వచ్చే ఏడాదికి పల్లవి రాసిన కవితా సంపుటి ప్రచురించాలి అనేవారు.
ఖమ్మంలో డా.సీతారాంగారు తాను పనిచేసే కళాశాలలో కుందుర్తి సాహిత్య సదస్సు నిర్వహించాలనుకుంటున్నానని కుందుర్తి కృతులు పుస్తకం, ఇతర పుస్తకాలు కావాలని ఫోన్ చేసారు. ఒకరోజు పుస్తకాలు కోసం మా ఇంటికి వచ్చారు. కుందుర్తికృతులు అపురూపమైనది కావటాన మళ్ళా జాగ్రత్తగా అందజేస్తామన్నారు. ఆ పుస్తకాలతో పాటు మాయిద్దరి పుస్తకాలు కూడా ఇచ్చాము. అవే కాకుండా విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వమని మా కవితా సంపుటాలు కూడా అందజేసాము.
సీతారాంగారు తన పాఠాలు మాత్రమే చెప్పి పనైపోయింది అనుకోకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల అభిరుచి, ఆసక్తి పెంచేలా పుస్తకాలు చదివించి ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ప్రతీ కాలేజీలోనూ జరుగుతూ వుంటే తెలుగుభాష అంతరించి పోతుందనే దిగులు తగ్గుతుందేమో కదా అనిపించింది.
డిసెంబర్ లో కుందుర్తిగారి శతజయంతి ప్రారంభం ఆవిధంగా ఖమ్మం కాలేజీలో ప్రారంభించటం వీర్రాజుగారికి సంతోషం కలిగించింది. సదస్సు ప్రారంభసభకు డా.సీతారాం మా ఇద్దరినీ ఆహ్వానించారు.” రావాలని ఉంది కానీ మూడుగంటలసేపు కారులో ప్రయాణం చేయలేన”ని వీర్రాజుగారు సీతారాంతో చెప్పారు. “కుందుర్తిగారితో, ఫ్రీవర్స్ ఫ్రంట్ తో మీ అనుబంధాన్ని వీడియో చేసి పంపించండి. అది ప్రారంభసభలో వేస్తాం ” అన్నారు.
ఆ విధంగా ఒక వీడియో చేసి పంపించాను. కుందుర్తి కవిత ఆ సదస్సులకోసం సింగపూర్ నుండి వచ్చింది. కుందుర్తి కుటుంబసభ్యులు ఖమ్మంలో జరిగిన కుందుర్తి సాహిత్య సదస్సులకు హాజరయ్యారు.
కుందుర్తి కవిత ఇండియా ఎప్పుడు వచ్చినా అక్క సమతతో కలిసి మా యింటికి తప్పక వచ్చి కలుస్తుంది. వచ్చిన ‘ప్రతీసారీ సింగపూర్ ఎప్పుడు వస్తారు. తప్పకరండి ‘ అని పిలుస్తుంది కవిత.
” కవితలు బాగా రాస్తున్నావు. వచ్చే ఏడాది చివరికి నీ కవితాసంపుటి వచ్చేలా రాస్తూ వుండు ” అన్నారు కవితతో వీర్రాజుగారు. కవిత నవ్వేసి ప్రయత్నిస్తానంది. నవ్వటం కాదు.’పట్టుదలగా రాయాలి ‘ అని ఖచ్చితంగా చెప్పారు ఆయన.
ఒకరోజు చెన్నయ్యగారు ఫోన్ చేసి ప్రతీ ఏడాదీ రచయిత్రుల మొదటి పుస్తకాలకి సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్ ఆర్థిక సహకారం అందిస్తుంది కదా ఆ పుస్తకాలను ఎంపిక చేయగలరా అని కోరారు. నేను అంగీకారం తెలియజేసిన తర్వాత నలభై రెండు కవితాసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ, ఇరవై వరకూ కథలసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ పంపించారు. వాటిలో ఆంధ్రా నుండి వచ్చినవి కూడా వుండటంతో గంగగారికి ఫోన్ చేసి తెలంగాణావారివే ఎంపిక చేయాలా, ఆంధ్రావాళ్ళవి బాగుంటే చేయొచ్చా’ అని అడిగాను. ఆమె ” బాగుంటే రెండు రాష్ట్రాల నుండి ఏవైనా చేయండి. మాకు తెలంగాణా ఆంధ్రా అనే తేడా లేదు. అంతేకాకుండా ఎన్ని సెలెక్ట్ చేసినా పర్వాలేదు” అని నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అరవైకి పైగా పుస్తకాలు చదవటంతో తీరిక లేకుండా అయింది.
మంచి ఉద్యోగంచేసి పదవీవిరమణ అయ్యాక కాలక్షేపంగా కొత్తగా ఇప్పుడు సాహిత్య సృజన మొదలుపెట్టి ఆర్థికంగా మంచి స్థితిలో వున్నవారు సైతం ఆర్థిక సహాయం కోసం పంపటం నాకు ఆశ్చర్యం కలిగించింది. కొందరు ముందు మాటలు కూడా రాయించి ప్రచురణకు సిద్దంగా వున్న ప్రతులే పంపించారు. అటువంటి వాటిని చాలా వరకూ తీసేసాను. యువతరంవారికి ప్రోత్సాహంగా యిస్తే బాగుంటుంది అనిపించింది. అదే విషయాన్ని గంగగారికి తెలియజేసాను.
కవిత్వంలోనూ, కథల్లోనూ బాగున్నాయి అనిపించినవి పక్కన పెట్టి రెండోసారి చదవాలనుకున్నాను. మొత్తం పంపిన వాటికి అన్నింటికీ నచ్చనివాటికి కూడా నా అభిప్రాయం రాసి పెట్టుకున్నాను. ఫైనల్ సెలక్షన్ మాత్రం వుంది.
సైదాబాద్ కోపరేటివ్ బ్యాంకుకు ఒకరోజు వీర్రాజుగారిని తీసుకుని పల్లవీ, నేనూ వెళ్ళాం. మలక్ పేట ఇంట్లోకి వచ్చిన వెంటనే మొదట దగ్గర కదా అని ఆ బ్యాంకులోనే మేము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరిచాము. సరూర్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అవసరమైనప్పుడు సైదాబాద్ బ్యాంక్ కు రావటం కష్టంగా వుందని వీర్రాజుగారి అక్కౌంట్ క్లోజ్ చేసేసాను. దానితో పాటూ కుందుర్తి సత్యమూర్తితో కలిసి ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం చేసిన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేసాము. ఫ్రీవర్స్ ఫ్రంట్ అక్కౌంట్ లో నలభై అయిదు వేలు ఉందని కుందుర్తి శాంతకు తెలియజేస్తే ‘ మీరే ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం వాడండి. నాకు పంపొద్దని’ అంది.
ఆ డబ్బుని ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచించాము. “ఈ ఏడాది ఎట్లాగూ కుందుర్తి శతజయంతి సంవత్సరం కనుక ఈ నలభై అయిదు వేలకు మనం మరోపదిహేను వేలు కలిపి ఆరుగురికి కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారం పేరున పదివేల చొప్పున ఇచ్చేద్దాము. రెండు తెలుగురాష్ట్రాల నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు రాదగిన సీనియర్ కవుల్ని ఎంపిక చేద్దాం” అన్నారు వీర్రాజు గారు. ఎవర్ని తీసుకోవాలని ఒక జాబితా వేసుకుని నిర్విరామంగా సాహిత్య కృషి చేస్తూ సాహిత్యం రాస్తూ వున్నవారినిగా చూసుకుని డా.రాధేయ, దాట్ల దేవదానం రాజు, అడిగోపుల వెంకటరత్నం, దేవరాజు మహారాజు, డా.సీతారాం, అనిశెట్టి రజితలను ఎంపిక చేసి కుందుర్తి కుటుంబసభ్యులకు తెలియజేసాము. వాళ్ళుకూడా చాలా సంతోషించారు. ఎంపిక చేసిన కవులకు వీర్రాజు గారు ఫోన్ చేసి చెప్పగా ఆరుగురూ చాలా ఆనందించారు.
ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలో కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు ప్రకటించిన వారిగురించి పరిచయం చేసాను. పురస్కారగ్రహీతలకు ఎప్పుడు హైదరాబాద్ రావటానికి కుదురుతుందో సంప్రదించటంతో కొంత కాలయాపన జరిగింది. దాంతో సభ నిర్వహించి ప్రదానం చేయాలా, లేదా జూమ్ సమావేశం ద్వారానే చేయాలా అనేది కూడా ఆలోచించాము.
ఇటీవలే ఖమ్మంలో కుందుర్తి సదస్సులకీ కుందుర్తి కవిత వచ్చి వెళ్ళింది. మళ్ళా దగ్గరలో రావటం కష్టం. అందుకని జూమ్ లోనే అందరి వెసులుబాటూ చూసుకుని నిర్వహించాలని నిర్ణయించాము.
చూస్తుండగానే నెచ్చెలి అంతర్జాలపత్రికలో నా నడక దారిలో బాల్యం వివరాలతోనే ఏడాది గడిచిపోయింది.
ఎన్నికల సమయంలో జరుగుతోన్న సందర్భాలూ, ప్రజల్ని వెర్రివెధవాయిలుగా చేస్తున్న రాజకీయ నాటకాలూ కొంత అసహ్యం కలిగించి నేను దీర్ఘకవితగా రాసాను. అది వీర్రాజుగారికి చదవమని ఇచ్చాను. బాగా రాసాను అన్నారు. కానీ ఏ పత్రికకైనా పంపించటానికి వెనకడుగు వేసాను.
కోరుకొండ అక్క మనవరాలు అంటే కళ్యాణ్ పెద్దకూతురు వసుధకు పెళ్ళి సంబంధం కుదిరింది అని తెలిసింది. వసుధ కోరుకొండ సైనిక పాఠశాలలోనే చదువుకుని చెన్నైలో ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విశేషం ఏమిటంటే సైనిక స్కూల్ లో చదివినప్పటి నుండి సహ విద్యార్ధులు అయిన అభిషేక్, వసుధ ప్రేమించుకుంటున్నారుట. చదువుపూ
“మాకు వున్న పెద్దదిక్కు మీరే కనుక తప్పక సంగారెడ్డి రావాలని ” కళ్యాణ్ అనేసరికి మేమూ బయలు దేరక తప్పలేదు. వీర్రాజుగారు ముందు అన్ని గంటలు కార్లో ప్రయాణం చేయలేనేమో అని వెనకడుగు వేసినా కళ్యాణ్, జయ కోరిక మేరకు బయలుదేరారు.
టిఫిన్లు చేసి ఎనిమిది గంటలకు నలుగురం కార్లో సంగారెడ్డి బయలుదేరాము. సుమారు నాలుగు గంటల ప్రయాణం చేసి సంగారెడ్డిలో వసుధ కాబోయే అత్తగారి ఇల్లు చేరాము. అత్తగారి అక్కాచెల్లెళ్ళు, మామగారి అన్నదమ్ములు మొదలైన వారితో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. వాళ్ళందరూ వచ్చారు.
పెళ్ళి ఎప్పుడు చేయాలనేది చర్చ జరిగింది. ఇల్లూ, ఇంట్లో వస్తువులూ అన్నీ అమర్చుకున్నాకే చేసుకుంటాం అని పిల్లలు ఇద్దరూ అంటారు. ఇప్పటికే చాలా కాలం వేచి వున్నారు, ఇంకా ఆలస్యం చేయవద్దని అందరం అన్నాము.పెళ్ళి అయ్యాక ఇంట్లోకి మీ సంపాదనతో ఒక్కొక్క వస్తువే అమర్చుకోవటంలో చాలా తృప్తి వుంటుందని మేము అనుభవంతో చెప్పాము. ఆఖరికి అంగీకరించారు. ఎప్పుడు మంచి ముహూర్తం వుంటే అప్పుడు వివాహం చేయాలని అందరూ నిర్ణయించారు.
వీర్రాజుగారు ప్రత్యేకంగా వసుధా, అభిలాష్ లతో ” పెళ్ళి అంటే ఒకరిపై ఒకరికి గల నమ్మకం. దానిని జీవితాంతం నిలుపుకోండి” అంటూ చాలా సేపు మాట్లాడారు. ఆయన మాటలకు వాళ్ళిద్దరే కాక వాళ్ళు అమ్మా నాన్నలు కూడా ఫిదా అయిపోయారు.
అభిషేక్ వాళ్ళూ ఇక్కడే స్థిరపడిన కన్నడిగులు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం మగవాళ్ళందరికీ గాంధీటోపీలు పెట్టి అందరికీ బట్టలు పెట్టారు. అదే విధంగా కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకు బట్టలుపెట్టి గౌరవించారు. అవన్నీ పూర్తి చేసుకుని మేము తిరిగి బయలుదేరి ఇంటికి చేరేసరికి పదిగంటలకు దాటింది.
మర్నాడు జయా అక్కాచెల్లెళ్ళు ముగ్గురినీ మా ఇంటికి రమ్మన్నాను.’ భోంచేసి ఇక్కడనుండే స్టేషనుకు వెళ్ళొచ్చు’ అని చెప్పాను. ఉదయమే లేచి రెండు కూరలూ, సాంబారు, ఫ్రైడ్ రైస్ , స్వీట్ చేసి మంచూరియా హొటలు నుండి తెప్పించాము. పెద్దక్క సర్వలక్ష్మి కుటుంబం అటునుంచి అటే కార్లో వెళ్ళిపోయారు. మిగతా ఇద్దరూ రంజనా, జయా వాళ్ళంతా వచ్చారు. అందరితో సరదాగా ఇల్లంతా పెళ్ళి సందడిలా గడిచింది. వసుధ రాత్రికి డిన్నర్ పేక్ చేసుకుని హాస్టల్ కి వెళ్ళిపోయింది. మిగతావాళ్ళు ఇటు నుండి స్టేషన్ కు వెళ్ళిపోయారు.
“ఇంతదూరం కార్లో బాగానే ప్రయాణం చేయగలిగాను. భయపడ్డాను గానీ ఖమ్మంలో జరిగిన కుందుర్తి సదస్సుకు కూడా వెళ్ళాల్సింది” అని మర్నాడు వీర్రాజుగారు అన్నారు. మీరు ఊరికూరికే ప్రయాణం చెయ్యలేనేమో అని ముందే భయపడతారు అని ఆయనతో అంటూ నేనూ పల్లవీ నవ్వుకున్నాం.
ఈ ప్రయాణం ఇచ్చిన ధైర్యంతో ఈ సారి ” విజయనగరం వెళ్తే పగలు రైలు ప్రయాణం చేద్దాం కిటికిలోనుండి అంతా చూస్తూ వెళ్ళొచ్చు”అన్నారు. ఆలోచిద్దాంలెండని అన్నాను.
నిడదవోలు మాలతి సాహిత్యం మీద రాస్తున్న వ్యాసాలు ఒక పరిశోధన గ్రంథం మాదిరిగానే జీవితం, కథలు, ఎన్నెమ్మ కథలు, నవలలు, వ్యాసాలు, అనువాదాలుగా చాప్టర్ లు విడదీసాను. ఒక్కొక్క చాప్టర్నీ పీడీఎఫ్ రూపంలో మాలతి గారికి మెయిల్ ద్వారా పంపించే దాన్ని. ఆమె ఏమైనా సవరణలు చేయమంటే మార్చేను. కొన్ని కథలకి నేపథ్యం గురించి అడిగితే సమాధానాలు చెప్పేవారు. దాంతో ఆమెతో చాలా సాన్నిహిత్యం పెరిగింది. “నన్ను మీరు, గారూ అని మన్నించి రాస్తుంటే ఇబ్బందిగా వుంది. మా అక్కయ్య సమకాలీనులు. నన్ను మన్నించనవసరం లేదు. ఏకవచనంలో సుభద్రా అనండి చాలు” అని నేను రాసిన తర్వాత మరింతగా సాన్నిహిత్యం పెరిగింది.
ఒక సందర్భంలో “నా జీవితంలో జరిగినవేవీ నువ్వు అడగలేదు. చెప్పమంటావా” అని రాసారు.
పి.శ్రీదేవి జీవితం నాకు అంతగా తెలియక పోవటం వలన ఆమె మోనోగ్రాఫ్ రాసేటప్పుడు ఆమె రచనల ఆధారంగానే ఆమె జీవితాన్ని రాసాను. మీకు కూడా అలానే రాస్తాను. అని నేను చెప్తే మాలతిగారు చాలా సంతోషించారు.
నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ మొత్తం పూర్తి అయ్యింది. పేజీలు స్కాన్ చేసి డిటీపీ నరసింహారావుకి ఇచ్చాను. కానీ నేను ఫ్రచురించుకుంటే ప్రచారం చేసుకోగలనా అనిపించింది. ఏదో సందర్భంలో మాట్లాడినప్పుడు అనల్ప బలరాంతో అంటే తానే ప్రచురించుతానని అన్నాడు. అప్పటికే పి.శ్రీదేవి సాహిత్యం అంతా తన పబ్లికేషన్ ద్వారా ప్రచురించాలనుకుంటున్నాననీ నన్ను రచనలన్నీ సేకరించి నన్నే సంపాదకత్వం వహించమని బలరాం అడిగాడు. ఆ పని కూడా మొదలు పెట్టాను. నేను కథానిలయం నుండీ, నా దగ్గర వున్నవీ డిటీపీకి ఇచ్చాను. మిగతా కథలు కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెలుగు స్వతంత్రలు తెచ్చుకుని అందులో చదువుతూ రాసినవి.
అంతకుముందే ఒక అమ్మాయి పి.శ్రీదేవి మీద పరిశోధన చేస్తున్నానని రచనల కోసం అడిగింది. నేను కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెచ్చుకున్నానని చెప్తే వెళ్ళింది. తీరా అక్కడకి వెళ్తే చెదలు పట్టాయని అవన్నీ పాడైపోతే పారేసామని చెప్పారని నాతో చెప్పింది. దాంతో మళ్ళా నాకు శ్రీదేవి కథలసేకరణ ఇక్కట్లు మొదలయ్యాయి. అయితే గౌతమీ గ్రంధాలయం, వేటపాలెం లైబ్రరీలో కొన్ని దొరికాయి. మూడోనాలుగో కథలు తప్ప అన్నీ దొరికాయి. వాటిని డిటీపీ చేయించాను. ఆ పుస్తకానికి సమగ్రమైన ముందుమాట రాయమని పబ్లిషర్ చెప్పటంతో మళ్ళా కథలన్నీ చదివి రాయటం మొదలు పెట్టవలసి వచ్చింది.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
