స్వర్ణపురి గ్రామస్థులు (అనువాదనవల) – 1

– స్వాతీ శ్రీపాద

హృషీకేష్ పాండా ఒరియాలో రాసి స్వయంగా ఆంగ్లంలోకి అనువదించిన నవల (” ద పీపుల్ ఆఫ్ సోనాపుత్  ” )స్వర్ణపురి గ్రామస్థులు నవల దక్షిణ ఒరిస్సాలోని కొండ ప్రాంతాల్లో సునాపుత్ గ్రామ ప్రజల నిష్కపటమైన జీవన కథనం. అక్కడి జన జీవనం, వారి అమాయకత్వం వారి జీవన విధానం ద్వారా అక్కడ జరిగే దోపిడి, ప్రభుత్వ ప్రాయోజిత స్థాన భ్రంశం, అక్కడి వర్గాల  నిర్మూలన, పరాయీకరణ, హింసాత్మక ఉద్యమాల ఆవిర్భావం, ఎదుగుదల, వాటి క్షీణత, కళ్ళకు కట్టినట్టు వివరించడంతో పాటు 1945-1985 మధ్య కాలంలో చరిత్రకు కూడా అద్దం పడుతుంది.
ఏ కాలానికి చెందిన కథ అయినా ఇప్పుడూ చదువుతుంటే ప్రస్థుతం మనమింకా గతంలోనే బ్రతుకుతున్నామేమో అనిపిస్తుంది. కథ, పాత్రలు ఊహాజనితమైనవి కాదు. మన మధ్య బ్రతికే జనాలవే, ఈ కథలు మన ముందు తరాల వాళ్ళు అనుభవించినవే. హృదయవిదారకమైన జీవన సత్యాలు.
మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇటీవల పునరుజ్జీవనం పొందిన హింసాత్మక ఉద్యమాలు  కాస్త  భిన్నంగా ఉన్నాయి.  ఈ సందర్భంలో, ‘ది పీపుల్ ఆఫ్ సునాపుత్’  సాహిత్య పరిధిని దాటి నవ్య-వాస్తవికవాదం వరకు విస్తరిస్తుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా, ఒక సాహిత్య రచనగా దీనికి తిరుగులేని సార్వత్రిక లక్షణం ఉంది. సునాపుత్ ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఉండవచ్చు.  శ్రీ పాండా ఒడియా భాషలో రాస్తారు , అద్భుతమైన రచయితగా పేరు పొందారు. ఆయన అనేక కథా సంకలనాలను ప్రచురించారు. అవి చాలా భారతీయ భాషల్లోకి అనువదించబడి, ఆ రచనలకు విస్తృత పాఠకవర్గం ఉంది. ఆయన రచనలో మౌలికత, ప్రామాణికత, శ్రోతలను ఆకట్టుకోవడం, దూరం చేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. పేదలు, అణగారినవారు, నిస్సహాయుల సమస్యల పట్ల ఆయనకున్న నిబద్ధత, విస్తృత అనుభవం దీనికి కారణం. . రచయిత తన బాల్యాన్ని, ఆ ప్రాంతంలోని అనేక కార్మిక వర్గాలను తన అనుభవాల ఆధారంగా తీర్చిదిద్దుకున్నారు, ఎప్పుడూ పేదల పక్షాన నిలబడ్డారు. అధికార వర్గంతో ఆయన చేసిన పోరాటం అప్పుడప్పుడు సఫలమైంది.  నిరాశ్రయుల పట్ల అతనికి తీవ్రమైన సానుభూతి ఉన్నప్పటికీ, ఈ పరీక్ష రచయిత దూరాన్ని పాటిస్తుంది, అడవి నివాసుల, న్యాయవాదుల తీవ్రవాదాన్ని గౌరవించదు.
ఈ నవల సార్వజనీనకం. అన్ని ప్రాంతాలకూ భాష, రాష్ట్రం ఏదయినా ప్రతి మానవుడికీ వర్తిస్తుంది. ఇలాటి రచనలే మన ఉనికిని మనకు గుర్తు చేస్తాయి. అసలు ఫాండా గారి రచనలే గొప్ప స్ఫూర్తి దాయకాలు. మార్గ దర్శకాలు. మన తెలుగు వారు చదివి తీరవలసిన మచ్చుతునకలు.
ఆ సార్వత్రిక గుణమే ఈ నవలను తెలుగువారికి అందించేందుకు స్ఫూర్తినిచ్చింది.
***

వసంతకాలపు మసక పొగమంచులో ఇంకా భళ్ళున తెల్లవారకముందే పధ్నాలుగేళ్ళ కేశవ్ రామహరి, శుక్రతో కలిసి ఊరి నుండి బయలుదేరాడు. వదిలేసింది ఒక్క ఊరేనా , ఆటలు, పాటలు, సంగీతం నాట్యాలు, పండుగలు పబ్బాలు,  జాతరలు సంబరాలు అన్నింటినీ కూడా వదిలేసి బయలుదేరారు.

మరీ వృద్ధుడు కాకపోయినా గ్రామ పూజారి, చిక్కి శల్యమై, తనకున్న అనుభవాల భారంతోనో, చుట్టూ గ్రామీణ జన సమూహాల అంతులేని సమస్యల బరువువల్లో ఒంగిపోయినట్టుండే అతనిప్పుడు ఆ ఊరి ప్రధాన దారిలో అరుగు మీద కూచుని ఉన్నాడు.

సమావేశాలు జరిగేప్పుడు ఊరిపెద్దలంతా ఆ అరుగుల మీదకే చేరతారు. ఊరిజనం ఎదురుగా నేలమీద సర్దుకుంటారు. అయితే ఇప్పుడా అరుగు మీద ఉన్నది పూజారి ఒక్కడే. తలెత్తి మాటిమాటికీ చుక్కల వంక చూస్తూ నిట్టూర్పులు వదులుతున్నాడు. ఊరి జనమంతా నరభక్షకి పులి తిరుగుతోందన్న భయం గుప్పిట్లో ఉన్నా అది పూజారిని ఏ మాత్రం భయపెట్టడం లేదు. వాళ్ళ భాషలో పూజారిని దిశారి అని పిలుస్తారు.

” మీకు శుభం కలుగుగాక. మీరో మంచి పనిని సంకల్పించుకున్నారు.” అన్నాడు దిశారి.

చిన్నప్పటినుండీ కేశవ్ ఎదిరించే రకమే. అందుకే అతను దిశారిని తన ప్రయాణానికి మంచి ముహూర్తం చూసి చెప్పమని అడగలేదు.

అయినా దిశారి శుభకామనలు అతనికి సంతోషం కలిగించాయి. వాళ్ళ తెగలో దిశారి అతనికి తాతతో సమానం. అందుకే అతనితో మేలమాడగలడు.

“తాతా, వెళ్తున్నాను. నేనంటూ తిరిగి వస్తే మళ్ళీ కలుద్దాం.”

దిశారికి నిరాశ కలిగింది. బహుశా కోపగించుకున్నాడేమో. కేశవ్ పరిహాసానికి కాదు, దయలేని కాలం కౄరత్వానికి.

అతను ఆలోచనలో పడ్డాడు, ” ఇలాటి అనివార్యమైన కౄరత్వం వల్ల దేవుళ్ళకొచ్చే లాభమేమిటి? ”

అయినా నోరు తెరిచి ఏమీ అనలేదు.

గ్రామం పొలిమేరలనుండి అడవులు మొదలవుతాయి . దుప్పి ఒకటి గట్టిగా అరిచింది, ఆ ముగ్గురి చెవుల్లోనే అన్నట్టుగా. ముగ్గురూ తుళ్ళిపడ్డారు.

” వెనక్కు వెళ్దామా?” శుక్ర అడిగాడు. సంచరించే పులి గుర్తుకు వచ్చిందతనికి. దిశారి నిరుత్సాహంగా మౌనంగా మారిపోయే సరికి అతని మనసు సుడిగుండంలో పడిపోయినట్టైంది. శుక్రకు పెళ్ళైంది. మామూలుగానే అతను కాస్త అధైర్యంగా, చంచలంగా ప్రవర్తిస్తాడు. పైపెచ్చు ఇప్పుడతని భార్య గర్భవతి.

“కాస్త ముందుకు నడుద్దాం. అప్పుడు ఆలోచించుకుందువు మాతో రావాలా, వెనక్కు వెళ్ళాలా అనేది.” అన్నాడు కేశవ.

రామహరి జల్సారాయుడు. చాలా సేపటి నుండీ ఏదో పాట కూని రాగం తీస్తూనే ఉన్నాడు. మిగతా ఇద్దరి మాటలు పూర్తవగానే తన కూని రాగం శృతి పెంచాడు.

మిగతా మిత్రులిద్దరూ కూడా గొంతు కలిపి పాటకొనసాగించారు.

తెల్లవారింది. శుక్ర భయాలు పటాపంచలయ్యాయి.

ఆ పాటకు పొసగని ప్రతిధ్వని కిందనుండి కొండ కనుమల సందుల నుండి వెనక్కు వచ్చింది.

అక్కడ కింద అబ్బాయిలు అమ్మాయిల గుంపొకటి ఊరేగింపుగా సాగుతూ అదే పాట పాడుతున్నారు, ఒక సమూహం నుండి మరో సమూహానికి వసంత హేల సంబరాలు జరుపుకుందుకు వెళ్తూ. ఆ కొండ కనుమల్లో దట్టమైన అడవి వ్యాపించి ఉండటంతో ఒకరికొకరు కనబడటం లేదు.

కింద నుండి పాట రూపంలో ఒక ప్రశ్న దూసుకు వచ్చింది,” పైన ఎవరు వెళ్తున్నారో మాకు తెలియడం లేదు. జింక లా కోతులా? మీ పశుస్వరాలు వినిపిస్తారా?”

శుక్ర జింకపిల్లలా అరిచాడు. రామహరి కోతిలా కిచకిచలాడాడు. కింద ఉన్న యువతీ యువకులు పెద్దగా నవ్వారు.

“పిట్టలూ , పిట్టలూ ఏ దేశం నుండి వలస వచ్చారు? మీరే రకమైన పాటలు పాడతారు? మీ పాటలు ఎలాటి తంబురా శ్రుతీ, లయ లేకుండా బృందగానాలుగా లేవసలు.”అని అడిగాడు కేశవ.

” మేం దూరప్రాంతాల పక్షులం ప్రియ మిత్రులారా. ఏ తంబురా కోసం ఎదురు చూడలేం.”అంటూ జవాబు వచ్చింది.

రామహరి స్పందిస్తూ,

” మేం చాలా దూరం, తెలియని ప్రాంతాలకు వెళ్తున్నాం. మీరు మాకు వీడ్కోలు చెప్పరా? ఏ దేవతలనో మా గురించి ప్రార్ధించరా?” అని అడిగాడు.

“దేవతలను ఈ దాడిలోకి, పరిహాస్యాల్లోకి లాగకండి.” శుక్ర గంభీరంగా కోప్పడ్డాడు. అతనికి జవాబు కింద నుండి వచ్చింది, ” మేం మీ గురించి దేవుళ్ళను ప్రార్ధిస్తాం. సుదూర తీరాల నుండి వచ్చిన ఈ అపరిచితుల మాటలు నమ్మండి. గుంటలలో నిలవ నీరు తాగకండి. ప్రవహించే ఊట నీరే తాగండి. నిద్రపోయే ముందు వంతుల వారీగా మెలుకువగా ఉండండి. ఎప్పుడూ విల్లంబులు మీతోనే ఉంచుకోండి.

పాములు, తేళ్ళు ఉంటాయి. బాటను గమనిస్తూ వెళ్ళండి. అడుగు అడుగుకూ చేతికర్ర తాటిస్తూ వెళ్ళండి. పూర్తిగా తినేముందు పళ్ళైనా, దుంపలైనా కాస్త ముక్క రుచి చూడండి. మీదారిన వినబడే ప్రతి చప్పుడూ శ్రద్ధగా వినండి. ఏదైనా చేసేముందు పరిసరాలు బాగా గమనించండి. మీ ఇంటి మనుషులు మీరు తిరిగిరావాలని ఎదురుచూస్తూ ఉంటారని మరచిపోవద్దు. తిరిగివచ్చే మీకోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు.”

హితోక్తులన్నీ పాటలుగానే ఉన్నాయి. లేలేత ఎండ, చుట్టూరా ఆకుపచ్చపరిసరాలు ఉత్సాహాన్నిచ్చాయి. గాలిలో తేలుతూ అడవి పూల సువాసన. పండుగ సంబరాల స్వప్నాలతో శరీరాలు నర్తిస్తూ, పాడుతూ, తాగుతూ వెన్నెల రాత్రులలో ఆటాడుతూ సాగాయి. ఇవన్నీ వదిలేసి ఈ ముగ్గురు యువకులూ ఎక్కడికి వెళ్తున్నట్టు?

కనుమల ఆసాంతం నుండి యువతీయువకుల సంగీత విభావరి మరో బాటపట్టి క్రమంగా దూరమైపోయింది. ఈ ముగ్గురు యువకులూ వాళ్ళను కలుసుకోనేలేదు. వారి పాటలు దూరమై క్రమంగా అదృశ్యమైపోయాయి.

వాళ్ళను చూడలేదని  రామహరి హృదయం ఉసూరుమంది, అతనిలో ఒకరకమైన శూన్యం చోటు చేసుకుంది.

కేశవ్ కు అసహనంగా ఉంది. అతని మిత్రులు చెప్పకపోతే తను మాత్రం ఎలా చెప్తాడు. పైకి చెప్పకపోయినా మిత్రుడు కేశవ్ కోరిక వినబడినట్టు శుక్ర అడిగాడు,

“మనం పనాస్ పుట్ గ్రామం నుండి వెళ్ళడం లేదా?”

” లేదు, లేదు. అంత సమయం లేదు. మనం ఆ ఊరి నుండి వెళ్తే మనకు ఆలస్యమవుతుంది.” కేశవ జవాబు.

కాని దారి వంపులు తిరిగి వారిని పనాస్ పుట్ గ్రామానికి తీసుకు వెళ్ళింది.

ఆ ఊరి దారి పట్టగానే వారి స్వరాలు ఉత్సాహంగా పాటలందుకున్నాయి. ఆ ఊరి ప్రవేశం దగ్గరే కేశవ చెప్పాడు, “మనం త్వరగా వెళ్ళిపోవాలి.”

” ఎంతసేపుండాలో నువ్వే నిర్ణయించు బాబూ, మేమెందుకిక్కడ తచ్చాడతాము చెప్పు. మాకీ ఊళ్ళో ఎవరున్నారు గనక?”

ధనఫుల ఊళ్ళో లేదు. నిజానికి ఒక్క అవివాహిత అబ్బాయి కాని అమ్మాయి కాని ఊళ్ళో కనబడలేదు. మరో గ్రామంలో వసంతోత్సవాలకు వారంతా వెళ్ళారు.

కేశవ చకితుడై మౌనంలోకి జారిపోయాడు. అతని కళ్ళలో నీళ్ళు ఊరాయి. మౌనంగానే అనుకున్నాడు, ” ప్రియమైన ధసఫుల్లా నీ గ్రామానికి ఎప్పుడువస్తానో నీకు ఎప్పటికప్పుడు తెలిసిపోయేదిగా, మరి ఇప్పుడెండుకు తెలుసుకోలేకపోయావు?”

ఆ ఊరి కాలవ పక్కన పెద్దపెద్ద కళ్ళతో ఓ యువతి నిల్చుని ఉండటం కనబడింది. ఆమెకు నెలసరి రావడం వల్ల వసంతోత్సవాలకు వెళ్లలేకపోయింది. రామహరి ఆమెను అడిగాడు,

” మా ఊరి కోడలు ఈ ఊళ్ళో ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా?”

ఆ పిల్ల తల ఊపి జవాబివ్వకుండా ముందుకు కదిలింది.

రామహరి ఆమెను వదిలితే కదా, ఆ పిల్లను పొగుడుతూ, ” నీ నుదుటి కింద అంత పెద్దపెద్ద కళ్లతో మొహాన్ని అలంకరించుకున్నావు, కాని ఏమీ చూడలేవు. యువకులను మాత్రం కాల్చేస్తావు.”

“ఆమెను వదిలెయ్, వెళ్దాం పదండి.”

కాని రామహరి వింటేగా? ఆ పిల్లను  వదలకుండా, ” మమ్మల్ని ఊరిపొలిమేర వరకూ సాగనంపవా?” అని అడిగాడు.

గ్రామం అంచున  పొట్టిగా ఉన్న అశోక వృక్షానికి ఆనుకుని ” నేను ఒంటరిగా రాను.” పెద్దకళ్ళ పిల్ల చెప్పింది.

పక్కన ఓ చిన్న వాగు ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం పక్కన కాలిబాట ఒకటి అడవిలోకి వెళ్ళింది. ఈత చెట్టు మీద విషాదపు చారలా నీరెండ. ఉదయం నుండే ఆమెకు కొంత నిరాశగా ఉంది. అమ్మాయిలంతా వసంతోత్సవాలకు వెళ్ళారు, అబ్బాయిలంతా అడవికి వెళ్ళారు. ఆమెకు దిగులుగా ఉంది. పైగా ఈ ముగ్గురు యువకులూ వచ్చి , మాట్లాడటం, వెళ్ళడం. అది మరింత బాధ జోడించింది, ఏదో పోగొట్టుకున్నట్టు, పోయిందేదో తెలియనట్టు. వసంతం చివరి నెల చైత్రమాసం ఇలాగే ఉంటుంది. ఆడి పాడి హడావిడిగా తిరుగుతూ చతురోక్తులు, పరిహాసాలూ, వ్యంగ్యాస్త్రాలూ విసురుకుంటూ సంబరంగా గడిపినంతవరకూ ఏమీ అనిపించదు. కాస్సేపు విశ్రాంతికోసం చేరగిలబడినా పేగులు మెలితిప్పినట్టు గుండె పిండేసినట్టు అనిపిస్తుంది. వసంత ఋతువులో పరివ్యాప్తమయే వేదన వేడి నుండి తప్పించుకోవాలంటే ఎవరైనా నిరంతరం కొనసాగే ఆటపాటల్లో మమేకం కావలసిందే.

ముగ్గురు యువకులూ గ్రామం వాగు దాటి కాలిబాట పట్టారు. ఉన్నట్టుండి కేశవ ఆ అందమైన పెద్దకళ్ళ పిల్ల వంక తిరిగి ఆమె అరచేతిలో రెండు వరిగింజలు ఒక మహువా విత్తనం ఉంచి ,

” అమ్మాయ్ ఇవి ధనఫూలాకివ్వు” అన్నాడు.

ఆ కానుకలు తీసుకుని ఆ పిల్ల నవ్వుతూ “ఇస్తాను, ధనఫులాకి ఇస్తాను” అంది.

” మళ్ళీ వస్తాను ” అన్నాడు కేశవ.

ఆ ముగ్గురూ అడవిలో కలసిపోయారు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.