
మా నాయనమ్మ కథలు-2
చాదస్తం ముసలమ్మ
-లక్ష్మిమదన్
ముసలి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. మనసులో ప్రతి క్షణం ఉంటుంది. మొన్న నాకు చాలా జ్వరం వచ్చింది. అప్పుడు ముసల్ది గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎవరికి ఏదైనా తాను ఎంతో బాధపడేది. బాధపడడమే కాదు, దానికి పరిష్కారం ఆలోచించేది. చాలా దీటైన వ్యక్తిత్వం. ఎంతటి కష్టాన్ని వచ్చినా ఎదుర్కోవాలనే ధైర్యం ఆమెలో ఉండేది. అందుకే ఆమె నాకు ఎక్కువగా గుర్తొస్తుంది అనిపిస్తుంది.
ఆడవాళ్లకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. జ్వరం రాగానే నాకు ఆమె గుర్తుకు రావడం సహజమే ఎందుకంటే, ఎంత హంగామా చేసేదని! దగ్గరికి వచ్చి ఆ మెత్తని చెయ్యితో ముట్టుకుని…
“నీకు దిష్టి అయ్యింది. రోజంతా తయ్య తయ్య( చెంగు చెంగున) ఆడతావ్” అని మంత్రం వేసి తగ్గేవరకు ఆరాట పడేది. తలచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంది. ఎక్కడికి వెళ్లిందో! ఏమో! ఆమె చనిపోతే ఇంత బాధ కలుగుతుందని అప్పుడు తెలియదు. అయినా మేము నాయనమ్మ చచ్చి పోదు ఎప్పటికీ అనుకున్నాము. ఆ ఊహ కూడా రాలేదు. ఎంతకాలం బ్రతికాము అనేది విషయం కాదు. బ్రతికినన్నాళ్లు ఎలా ఉన్నాము అనేది మా నాయనమ్మ నిరూపించింది. కళ్ళు మసకబారలేదు. చెవుల పవర్ తగ్గలేదు. ఆమె వినకుండా ఏదైనా మాట్లాడుకుందామంటే టక్కున ఆమెకే ఆ మాటలు వినిపించేవి. ఇక ఆ తర్వాత అందరికీ తప్పెట్ల భజననే!
అప్పుడు తెలియని మనస్తత్వం అందుకనే ఆమె మాకు అర్థం కాలేదు అనిపిస్తుంది. ఏది చేసినా ఒక దూర దృష్టితో చేసేది.
పెద్దమనిషి కదా! కొన్ని చాదస్తాలు ఉండనే ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను..
ఆ రోజుల్లో రాత్రికి ఇల్లు ఉడ్చడం, తల దువ్వుకోవడం చెయ్యి కూడదు అనే వారు. అత్యవసరమై చేయాల్సి వస్తే, నాయనమ్మ ఒక సలహా చెప్పేది.
“పెళ్లి పెళ్లి” అంటూ..ఇంట్లో ఎవరు పెళ్లికి ఉంటే వారి పేరును తలుచుకుంటూ, ఇల్లు ఊడ్చడం కానీ తల దువ్వుకోవడం కానీ చేయాలి ” అని…
ఇలా ఎన్నో మంచి విషయాలు చెప్పేది. ధైర్యానికి మారు పేరులా ఉండేది. ఎన్నో కష్టాలని ఓర్చుకుని ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచి కుటుంబంను ఒక్క చేతితో నడిపించింది. ఏరోజు ఇది కావాలి అని అడగలేదు. ఎప్పుడూ అందరి క్షేమం కోసం తపించేది. నేను మా ఊళ్ళో బడి చదువు పూర్తికాగానే వేరే ఊరికి కాలేజి కోసం వెళ్లాల్సి వస్తే, ఎంత బాధ పడిందో ఇంకా గుర్తుంది.
మరో చాదస్తం ఏమిటంటే.. ఇంటికి వచ్చిన వాళ్లు ఆమెతో మాట్లాడకుండా లోపలికి వెళ్లి కోడల్ని కలిసిందంటే ఇక ముఖము మూడు వంకరలు చేసి మూతి తిప్పేది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆమెను పలకరించినా..
“నేను మీకు కనపడతానా? నన్ను కాదని లోపలికి వెళ్లారు కదా? నాతో ఇంకేం పని”? అని గద్దించేది.
మాకైతే అలాంటివి చూసి నవ్వు వచ్చేది. ఆ వయసులో అది సహజమే కదా! తనను పలకరించకుండా లోపలికి వెళితే తన అహం దెబ్బతినదా మరి? మా నాయనమ్మకే నా ఓటు.
నాయనమ్మ నువ్వు చాలా గ్రేట్! అది తప్పేం కాదులే! ఇంకా అలక మీద ఉండకు. నీ గురించి అంతా మంచిగానే రాస్తున్నా కదా ఇంకెందుకు నీకు కోపం! ఓ నవ్వుతున్నావా? ఇంకా నీ గురించి బోలెడంత రాయాలి!
*****

