ఆకాశమంత శ్వాస

-డా||కె.గీత

నా చిట్టితల్లీ!
ప్రాపంచిక బాధలర్థం కాని
నువ్వు యావత్ప్రపంచానికే యువరాణివి-
లేకపోతే
ఐచ్ఛిక పనులకూ
నువ్వు పనికిరావని
మట్టిబెడ్డలా
విసిరేస్తున్న సమాజాన్ని
నీ జ్ఞానం సరిపోదని
వంకరగా తలతిప్పుతున్న లోకాన్ని
ముద్దబంతి నవ్వుతో
ఎలా అర్థం చేసుకోగలవు?
సెల్ ఫోను నంబరు కంఠతా రాదనో
ఈ-మెయిల్ ఐడీ రాయలేవనో
అమ్మ తోడున్నా
నీకు పనివ్వనన్న
గొప్ప ప్రపంచానికి సమాధానంగా
వెన్నెల విరబూసిన జాబిలమ్మలా
‘థాంక్యూ’ అన్నావు చూడు
నీ లోకాన్ని అర్థం చేసుకోలేని
ఈ లోకపు పనులు నీకక్కరలేదు
అన్నట్టు
గంభీర మార్తాండునిలా
‘మరేం ఫర్వాలేదు’ అని
మర్యాద పూర్వకంగా
వెనక్కి మరలేవు చూడు
అక్కడే నువ్వు గెలిచేవు-
ఏ సిండ్రోమూ
లేదనుకున్న
లోకపు కఠినత్వం
నీకు లేదు
నిన్ను మందబుద్ధిగా
ముద్రవేసిన
బుద్ధిమాలిన్యం
నీకు లేదు
నీకున్న వెన్నలాంటి
ప్రేమ ఈ లోకంలోనే లేదు
నీలా నిజం తప్ప
అబద్ధం చేతకాని
స్వచ్ఛత ఎక్కడా లేదు
ఏ ప్రత్యేకతా లేని
ఈ పాడులోకానికి
అమ్మతోడుగా చెప్పు
చిట్టితల్లీ!
పదిహేనేళ్లొచ్చినా
పసి రెక్కల చిన్నారి తూనీగవి
నీకు పని చెయ్యాలనిపించడమే
ఒక గొప్ప పని అని-
నువ్వు పనిచెయ్యడానికి
ముందుకు రావడమే
ఒక విప్లవమని-
నువ్వు అర్థం చేసుకున్నంత
సులభంగా
నిన్నర్థం చేసుకోని
లోకాన్ని చూసి
నీలాకాశమంత శ్వాసతో
గుండె నిండా స్వచ్ఛంగా
పగలబడి
నవ్వాలని ఉందిరా నాన్నా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.