దైవాన్ని మించిన జ్ఞాని

(కేట్ చోపిన్ ఆంగ్ల కథకు అనువాదం)

-పి.జ్యోతి

ప్రేమిస్తూనే విజ్ఞతతో మెలగడం, దైవానికి కూడా అరుదుగా లభించే వరం – లాటిన్ సామెత.

“నువ్వు ఈ పని పట్ల కాస్త అయిష్టతనయినా చూపవచ్చుగా పౌలా” అద్దం ముందు నిలబడి, సాదాసీదాగానే ఉన్న అలంకరణకు చివరి మెరుగులు దిద్దుకుంటున్న కూతురితో లోగొంతుతో సణుగుతున్నట్లు అంది మిసెస్ వాన్ స్టాల్జ్

“దాని వల్ల ప్రయోజనం ఎంటమ్మా? ఇది నాకిష్టమైన పని కాదని ఒప్పుకుంటాను. కాని దాని ఫలితాల విషయంలో మాత్రం నాకు ఎటువంటి సందేహం లేదు. అవి సంతృప్తికరంగా ఉంటాయని నువ్వు కూడా అంగీకరించక తప్పదు.

“కాని మీ నాన్న నీ కోసం ఉద్దేశించిన వృత్తి ఇది కాదు. నిన్ను పూర్తిగా పని పేరుతో తన దగ్గరే ఉంచేసుకుంటున్నారని నేను ఫిర్యాదు చేసినప్పుడల్లా, ఆయన, “పౌలా ఈ రంగంలో ముందుండాలన్నదే నా కోరిక” అని నాతో ఎన్నోసార్లు అంటుండేవారు, అంటూ ఆ తల్లి కిటికీ బైట, బూడిద రంగు నవంబర్ ఆకాశంలోకి, మరణించిన భర్త ప్రస్తుత నివాసమైన ఆ సుదూర ప్రదేశం వైపు కాబోలు అభ్యర్ధన నిండిన చూపులను సారించింది.

మెరుస్తున్న తన బంగారు రంగు జుట్టు పాయల మధ్య గ్రుచ్చిన జడ పిన్నుతో తన కేశాలంకరణలో వచ్చిన నిండుతనానికి సంతోషిస్తూ “ఇది అసలు వృత్తే కాదు అమ్మా, ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే, “అని పౌలా తల్లికి బదులిచ్చింది.” మనం కోరుకుంటున్న వృత్తి దొరికేంత వరకు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, మన జీవనం సాగిపోతూనే ఉండాలి. నీకు అర్ధం అవట్లేదు కాని ఇలాంటి సందర్భాలే నాకు కావాల్సిన అవకాశాలను కల్పించగలవు” .

“నీ ప్రతిభను ఇంత సాధారణ బానిసత్వంలోకి దిగజార్చుకోవడంలో ఉన్న ప్రయోజనమేమిటో నాకు అర్థం కావడం లేదు. అసలు, వాళ్లంతా ఎవరు?” ఓ దగ్గు తెర ఆ తల్లి ప్రశ్నకు అడ్డు పడి, ఆమెను మాట్లాడలేని నిస్సత్తువలోకి నెట్టేసింది.

“అయ్యో! అమ్మా, నిన్ను కిటికీ దగ్గర చాలాసేపు కూర్చోనిచ్చాను,” అంటూ తల్లి చక్రాల కుర్చీని, ఆ సాదాసీదా గది రూపాన్ని తన ఆహ్లాదకరమైన వెలుగుతో వెచ్చగా, నులుస్పర్శతో అందంగా మారుస్తున్న పొయ్యి దగ్గరకు త్వరగా తోసుకుంటూ వచ్చింది పౌలా. “అన్నట్లు…” తల్లిని సాధ్యమైనంత సౌకర్యవంతంగా సర్ది కూర్చోబెట్టి “నువ్వు చెప్పే ఆ సాధారణ బానిసత్వానికి నేను ఇంకా అర్హత  కూడా సాధించలేదు” అంటూ, ఆ గదిలో దూరంగా ఓ మూల ఉన్న పియానో ​​వద్దకు వెళ్లింది. దానిపై చుట్ట చుట్టుకుని పడి ఉన్న స్వరాలను రాసుకున్న కాగితాలను చేతిలోకి తీసుకుని, వాటిని తన ముందు నిటారుగా విప్పింది పౌలా. ఇంతలో తల్లి అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చి, దానికి సమాధానం ఇవ్వడానికి కూర్చున్న స్టూల్ మీదనుండి వెనక్కి తిరిగింది.

“నీకు తెలియదా? వాళ్ళే బ్రైనార్డ్స్ – చాలా గొప్పవాళ్లు, పిచ్చ ధనవంతులు కూడా. వాళ్ళ అమ్మాయి గురించి నేను నీకు చెప్పాను కదా – తన గాత్రాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆమె సంగీత పాఠశాలకు వెళ్ళిందని. అప్పుడు ఆ ముసలి ఎంగ్‌ఫెల్డర్ తన సహజ మొరటు పద్ధతిలో , ‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో; అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి నాకు లేదు,’ అని చెప్పాడని.”

“ఓ వాళ్లా…”
“అవును ఈ చిన్న పార్టీ, వాళ్ళ కొడుకు ఏల్ నుండో లేదా హార్వర్డ్ నుండో మరేదో చోటునించో తిరిగి వచ్చాడన్న గౌరవార్ధం ఇస్తున్నారు.” అంటూ పియానో వైపుకి తిరిగి ఆమె అక్కడ వాయించవలసిన నృత్య గీతాలను ఒక సారి సరి చూసుకోవడంలో మునిగిపోయింది. వాటిని మృదువుగా పియానోపై అభ్యసిస్తుండగా, గదిలో ప్రసరిస్తున్న వెలుగు గాఢతను ఉత్సాహభరితమైన ఆ సంగీతం పెంచుతుంటే, ఆమె తల్లి
నిస్సహాయ విచారంతో తదేకంగా పొయ్యిలో మండుతున్న నిప్పును చూస్తూ ఉండిపోయింది.

“ఇక, దీని గురించీ కూడా ఏ సమస్యా ఉండదు,” నిశ్చింతతో కూడిన ఆత్మవిశ్వాసంతో చివరి వాల్ట్జ్ నృత్యాభ్యాసాన్ని ముగించింది పౌలా, “ఇక్కడ ఏదైనా కొత్తగా ప్రదర్శించడానికి నన్ను ఉత్సాహపరిచేదేదీ లేదు కాబట్టి ఆ ‘హ్యాండ్-ఆర్గన్’ శైలికే కట్టుబడి ఉండటంలో నాకూ ఇబ్బంది ఉండదు.” అంది.

“ఈ కర్ణకఠోరమైన స్వరాలతో నన్ను వదిలి వెల్లకు, పౌలా. బలహీనమైన నా నరాలు వీటిని విని ఉద్రిక్తంగా మారిపోయాయి.”

“అమ్మా, నువ్వు ఈ నాట్యాల పట్ల మరీ కఠినంగా ఉన్నావు. నాకు అక్కడక్కడా కొన్ని రాగాలు బాగున్నట్లే అనిపిస్తున్నాయి.”

“నీ వయసు కారణంగా నీకు అలా అనిపిస్తూ ఉంది. నేను ఆ భ్రమలను దాటేశాను.”

“ఎంత స్థిరం లేని దానివమ్మా నువ్వు!” ఆ అమ్మాయి నవ్వుతూనే కాని ఆశ్చర్యంగా అడిగింది. “నిన్ననే కదా నువ్వు నాతో దైనిక జీవితంలోని సాధారణ సంఘటనల పట్ల అసహనంతో ఉండేది నా యవ్వనమేనని అన్నావు? ఈ వయసు, తన ఆనందాలను వెతుక్కుంటుందని,, తరచుగా ఎవరూ ఊహించని చోట్ల దాన్ని కనుగొంటుందని, సరిగ్గా అదే కదా చెప్పావు?”

“శుష్క ప్రసంగాలు వద్దు పౌలా.. కాస్త సంగీతం కావాలి, కాస్త సంగీతం!”

“ఏం వాయించమంటావు” అడిగింది పౌలా పియానో మెట్లను సుతారంగా మీటుతూ. “ఏదన్నా చిన్నది అడుగు”.

అయితే, ‘చోపిన్ జోలపాట వాయించు. కానీ మీ నాన్నగారు వాయించినట్లుగా, మెల్లగా, మృదువుగా, కొంచెం నెమ్మదిగా…

మిసెస్ వాన్ స్టోల్ట్జ్ తన తలని కుషన్ల మధ్య వెనక్కి వాల్చి, కళ్ళు మూసుకుని, గతం నుండి వచ్చే ఒక దివ్య స్వరంలా వినిపిస్తున్న ఆ అద్భుత రాగాన్ని ఆస్వాదించసాగింది. ఆ రాగాలు ఆమె అంతరాత్మను నిశబ్దంగా మధుర స్మృతులోకి జోకొట్టాయి. చివరి మృదు మధుర స్వరాలు నిశ్శబ్దంలోకి ఇంకిపోయాక, పౌలా తల్లి దగ్గరకువెళ్లి, పాలిపోయిన ఆమె ముఖంలోకి తొంగి చూసింది. ఆమె మూసిన కనురెప్పల కింద నిలిచిన కన్నీళ్లు కనబడ్డాయి..

“అయ్యో! అమ్మా, నేను నిన్ను బాధపెట్టాను,” అంది ఆమె ఆవేదన నిండిన ఏడుపు గొంతుతో.

“లేదు తల్లీ. నువ్వు నాకు, కలలో కూడా ఊహించలేనంతటి ఆనందాన్ని అందించావు. నాకిక ఎటువంటి బాధా లేదు. స్పెయిన్ రాజు ఫిలిప్‌కు ఫారినెల్లి గానం ఎలాంటి మేలు చేసిందో, నీ సంగీతం నాపై అలా పని చేసింది. అది నన్ను నయం చేసింది.”

ఆమె ముఖం ఆనందపు వెచ్చని వెలుగుతో నిండిపోయింది. ప్రకాశవంతమైన ఆరోగ్యంతో, ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. “పౌలా, నేను నిన్ను వింటున్నప్పుడు, నా ఆత్మ నాలోనుండి బయటకు వెళ్లి, ఎప్పుడో గడిచిన ఒక సాయంత్రంలో తిరిగి జీవించింది. లీప్సిక్‌లోని మన అందమైన ఇంట్లో ఉన్నాం మనం. తెరిచి ఉన్న కిటికీ తెరల నడుమ మృదువైన గాలి, వెన్నెల లోపలికి వస్తూ, మెరుస్తున్న మైనపు నేల మీద మెలికలు తిరిగే తీగల అల్లికను సృష్టిస్తున్నాయి. నువ్వు నా చేతుల్లో పడుకుని ఉన్నావు, , బొద్దుగా ఉన్న నీ వెచ్చని చిన్న శరీరం నన్ను ఆనుకుని ఉండడాన్ని నేను మళ్ళీ అనుభూతి చెందాను.
మీ నాన్న పియానో ​​మీద ఇదే జోలపాట వాయిస్తున్నారు. నువ్వు అంతలో నా తలని మీదకి లాక్కుని, ‘ఇది అద్భుతంగా ఉంది కదమ్మా?’ అని గుసగుసలాడావు. అది ముగిసాక, నిద్రపోతున్న నిన్ను, మీ నాన్న నా చేతుల్లోంచి తీసుకుని మంచం మీద జాగ్రత్తగా పడుకోబెట్టారు.”

పౌలా తల్లి పక్కన కూర్చుని ఆమె బలహీనమైన చేతుల్ని సున్నితంగా ముద్దాడింది.

“నువ్వు ఇప్పుడు ఇక వెళ్లాలి కన్నా. బెర్తాని పిలువు. కావలసిన పనులు తను చేస్తుంది. ఈ రాత్రి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. కాని ఇంటికి మరీ ఆలస్యంగా మాత్రం రాకు.”

“నేను వీలయినంత త్వరగా ఆఖరి కారులో ఇంటికి వచ్చేస్తాను అమ్మా. నేను అంతకన్నా ఎక్కువ సమయం అక్కడ ఉండిపోతే ఇంత దూరం నడిచే రావల్సివస్తుంది. ఏదన్నా అవసరం పడితే నాకు కబురు చేయడానికి నీకు ఆ ఇల్లు తెలుసు కదా?”

“ ఆ తెలుసు తెలుసు… కాని ఆ అవసరం రాదులే”.

పౌలా తల్లికి ప్రేమతో ముద్దు పెట్టి, ఆ నవంబర్ చలి రాత్రి చేతిలో పాటల కాగితాలతో బైటకు నడిచింది.

***

బెల్లు కొట్టగానే, రాజసం నిండిన ఆ భవనం తలుపులను తెరిచిన పనివాడు పౌలాను మర్యాదగా లోపలికి ఆహ్వానించి పై అంతస్థులోకి తీసుకువెళ్లాడు.

“జేమ్స్, ఆ యువతిని సంగీత గదిలోకి తీసుకువెళ్ళు,” అంటూ ఇంటి పైభాగం నుండి ఒక స్వరం వినిపించింది; నిస్సందేహంగా, హెర్ ఎంగ్‌ఫెల్డర్ పాడటం అసాధ్యమని తేల్చి చెప్పిన గొంతు అదే అయి ఉంటుంది. అందమైన ఆ ఇంటి గదుల వరుస గుండా లోపలికి వెళుతుంటే బైట వణికించే చల్లటి గాలుల నడుమ వచ్చిన పౌలాకు ఆ గదులలోని వెచ్చదనం, మృదువైన వెలుగు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి., సంగీత గదిలోకి ప్రవేశించిన పౌలా తన చలి దుస్తులను విప్పి పక్కన పెట్టి, రాబోయే పరిణామాలకు ఎదురుచూస్తూ సర్దుకుని కూర్చుంది. ఆ గదిలో కళ్ళ ముందు కనిపిస్తున్న అద్భుతమైన స్టీన్వే పియానో వైపు ఆశగా చూసింది. ఆమె చేతి వేళ్ళు ఆ మెట్లను మీటడానికి తహతహలాడాయి. గదిలో గాలితో కలిసిన పూల పరిమళాలు రాబోయే అందమైన అనుభూతులకు మత్తుగా చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నాయి. మెట్ల పై ఇంటి భాగంలో నుండి స్త్రీల దుస్తుల రెపరెపలు, ఇంట్లో వారి మాటలు ఉండి ఉండి వినిపిస్తున్నాయి.

ఇంతలో ఓ యువకుడు ఆ డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించాడు. అతను కాలేజీ విద్యార్ధిలానే ఉన్నాడు. ఉత్సవానికి సిద్దం అయిన ఆ గదిలోని ప్రతి వస్తువును యజమాని వలే నిశితంగా పరిశీలించాడు. ఇంకా మెరుగుపర్చాల్సిన కొన్ని సున్నితమైన విషయాలను గమనించాడు. అక్కడే ఉన్న నిలువుటద్దంలో తన దృఢమైన ఆకృతిని సంతృప్తిగా, తదేకంగా చూసుకుంటున్న అతనికి అందులో మెరుస్తున్న నీలి కళ్లతో నవ్వుతూ తననే చూస్తున్న పౌలా కనిపించింది.

“ఓరి దేవుడా” అంటూ ఆశ్చర్యంతో ఆమె దగ్గరకు తిరిగి వెళ్లి, “క్షమించండి మిస్ మిస్…” అంటూ తడబడుతున్న అతనితో “వాన్ స్టోల్జ్స్” అంటూ తనను తాను పరిచయం చేసుకుంది పౌలా.

“మిస్ వాన్ స్టోల్డ్స్” అంటూ పలకరిస్తూనే, సాధారణ వస్త్రధారణతో, చేతుల్లో సంగీత స్వరాలతో ఉన్న కాగితాలను పట్టుకుని ఉన్న ఆమె అక్కడ ఎందుకుందో అర్ధం చేసుకున్నాడతను. “నేను లోపలికి రాగానే మిమ్మల్ని గమనించలేదు. మీరు చాలా సేపటి నుంచి ఇక్కడే ఒంటరిగా ఉన్నారా? అది మీకు ఇబ్బంది కలిగించి ఉంటుంది.” అన్నాడు

“పర్లేదు.. నేను వచ్చి కొన్ని నిముషాలే అయింది. నాకే ఇబ్బంది కలగలేదు”

“అది నేను ఒప్పుకోలేను” అంటూ, కళ్ల నిండా ప్రశంస నింపుకుని, పరిచయం పెంచుకోవాలన్న ఆసక్తితో ఆమెను సమీపించాడతను. తన సంగీతం నోట్శ్ ను పౌలా చదవడానికి వీలుగా, ఆ పక్కనే ఉన్న ఒక లాంతరు బ్రాకెట్ లోని గాస్ ను అతను వెలిగిస్తుండగా , ఆ గదిలోకి ఆకర్షణియంగా అలంకరించుకున్న మిసెస్, బ్రైనార్డ్ ఆమె కూతురు ప్రవేశించి పౌలాను మృదు మధురంగా, మర్యాదపూర్వకంగా పలకరించారు.

అయ్యో జార్జ్ ఆ గాస్ ఆర్పేయి. నువ్వు కొవ్వొత్తుల వెలుగుల అందాన్ని పాడు చేస్తున్నావు. అన్నది తల్లి అసహనంగా. “కాని అమ్మా ఇది లేక పోతే మిస్ వాన్ స్టోల్జ్ కు తన సంగీత స్వరాలను చదవడం కుదరదు కదా” బదులిచ్చాడు అతను.

“మిస్ వాన్ స్టాల్జ్ కు తన పాటల ట్యూన్ లు అన్నీ కంఠతా వచ్చి ఉంటాయనడంలో నాకే సందేహం లేదు” అంగీకారం కోసం పౌలాను చూస్తూ అతనికి జవాబిచ్చింది మిసెస్ బ్రైనార్డ్.

“లేదండి. నాకు నాట్యానికి సంబంధించిన సంగీతాన్ని వాయించడంలో అనుభవం లేదు. ఇది నాకు పూర్తిగా కొత్త” అంటూ ర్యాక్ మీద జార్జ్ తన సౌకర్యం కోసం ఉంచిన నోట్శ్ ను చూసుకుంటూ జవాబిచ్చింది పౌల

“అయ్యో అవునా. అనుభవం లేదా? భయంతో ప్రశ్నించింది మిస్ బ్రైనార్డ్. “కాని మిస్టర్ సోహ్మిర్ నువ్వు మమ్మల్నందరినీ సంతృప్తిపరచగలవని చెప్పారే.” అడిగింది ఆదుర్దాగా.
తన సేవలతో వారికి పూర్తి సంతృప్తిని కలిగించలగలనని తీవ్రంగా భయపడిపోయిన ఆ యువతికి నమ్మకం కలిగించబోయింది పౌలా.

ఇంతలో కాలింగ్ బెల్ విరామం లేకుండా మ్రోగసాగింది. మెట్ల గుండా ఓపెరా వస్త్రాలు ధరించిన ఆకారాలు తడబడుతూ పైకి వచ్చాయి. వారి వెనుక నల్లని వస్త్రాలలో పరిచారకులున్నారు. కోరుకున్న పురుష సాంగత్యం ప్రేరణగా అమ్మాయిల గుంపు చేసే సందడితో అక్కడి గదులన్నీ నిండిపోయాయి. కచేరి ప్రారంభించమని ఎవరూ తనను అడగక ముందే పౌలా వాల్ట్శ్ నృత్యానికి సంబంధించిన ప్రారంభ రాగాలను పియానో మీద పలికించసాగింది.

***

కొన్నిగంటల త్తర్వాత, నృత్యం నుండి కాస్త విరామం తీసుకుని, పురుషులు విసనకర్రలు, రూమాళ్ల కోసం వెతుక్కుంటున్న సమయంలో, ఆడపిల్లలు అలసిపోయినట్లు అందమైన భంగిమలలో సెదతీరుతుండగా, అవిశ్రాంతంగా శ్రమించే కొద్ది మందిని మినహాయిస్తే, మిగిలిన వారందరూ కోలాహలంగా విన్నపాలతో కూడిన ఓ బలమైన ప్రతిపాదనను తీసుకువచ్చారు. దానితో జార్జ్ తన బాంజో ను తీసుకుని వారి ముందుకు రాక తప్పలేదు. ఆ గదిలో ఒక అహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంది. ప్రదర్శన తర్వాత ఆ యువకుడి నైపుణ్యానికి తగిన ప్రశంసల జల్లు కురిసింది. ఆ వాయిద్యాన్ని వాయించడంలోని అతని నైపుణ్యంతో అక్కడి ప్రేక్షకులకు మునుపెన్నడూ పరిచయం లేదు. అది అతని వెనుక, అతని తలపై గడియారం లో పెండ్యులంలా గాలిలో ఊగుతూ ఉత్తేజపరిచే
మధురమైన ద్వనులను వెలువరిస్తోంది. అతని ప్రదర్శన ఎంత స్పూర్తిదాయకంగా ఉండిందంటే, నృత్యంలో నిపుణురాలిగా పేరు పొందిన దేవకన్య లాంటి ఓ నల్ల కళ్ళ అమ్మాయి, జార్జ్ పట్ల ప్రత్యేక అభిమానంతో, దక్షిణ ప్రాంతంలోని ఒక తోటలో ప్రత్యక్ష్యంగా చూసి అధ్యయనం చేసిన వర్జీనియా నృత్యరీతిని కొన్ని సార్లు వాయించి తన వంతు సహకారం కూడా అందించింది. ప్రేక్షకుల కరతాళ ద్వనులతో అభినందనల నడుమ ఆ ప్రదర్శన ముగిసింది.

ఇది గొప్ప ప్రదర్శన అనుకుంటే దాని తర్వాత మిస్ బ్రైనార్డ్ సభికులను అలరించడానికి ఫాస్ట్ ‘జువెల్ సాంగ్’ ను ఆలాపించిన విధానానికి అది ఉచిత నాంది మాత్రం కాదని అంగీకరించాలి. మిస్ బ్రైనార్డ్ కు స్వర జ్ఞానం ఉందనేది, ఆమె పసిబిడ్డగా మాట్లాడటం మొదలెట్టిన రోజుల నుంచే ఆ కుటుంబంలో నాటుకున్న నమ్మకం. వారందరి మాటల నడుమ, ప్రేమతో ఆమెను వినడానికి అలవాటుపడిన చెవులు ఆమెలోని కళా ప్రతిభను తమకు తామే అంగీకరించాయి. కాలం అవివేకంగా ఆమె ప్రతిభను నిర్ధారించింది.

ఎందరో ‘ఎంగ్‌ఫెల్డర్లు’ తమ సాధారణ నిరసనలతో, అణచివేయడానికి పూనుకున్నా కానీ, ఆమె ప్రతిభను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాలేదు మరి…  మిస్ బ్రైనార్డ్ గానం ధ్వని పరంగా చూస్తే అక్కడ అద్భుతమైన విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఆ విజయపు గర్వంతో ఉప్పొంగిపోతూ, ఆమె ఎంతో దయతో “ఏదైనా వాయించండి కాసేపు” అని పౌలాని అడిగింది.

పౌలా వినయంగా అంగీకరించి, ఆధునిక క్లాసిక్ నుండి ఒక భాగాన్ని ఎంచుకుంది. అక్కడ ఆమెను వింటున్నవారెవరూ జీవితకాలం ఆమె చేసిన అధ్యయనం, కఠోర శిక్షణతో తన ప్రతిభను సాన పెట్టుకున్న ఆమె నైపుణ్యాలను గుర్తించి అభినందించగల స్థాయివాళ్లు కారు. ఆమె తన నైపుణ్యానికి కళాత్మకతను, కళాకారిణిగా తన వ్యాఖ్యానాన్ని సైతం జోడించి ఆ భాగాన్ని ప్రదర్శించింది. ఆమెను వింటుంటే
అజ్ఞానం కూడా నిశ్శబ్ద భావోద్వేగంతో ఆమె ప్రతిభకు నివాళులర్పించేలా ఆ ప్రదర్శన సాగింది.

ప్రదర్శన పూర్తయ్యి ఆమె పైకి లేచాక, ఆ గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ఎప్పుడూ అవకాశం కోసం కాచుకుని ఉండే ఆ నళ్ళ కళ్ళ దేవకన్య ముందుకొచ్చి చాలా తేలికగా, “ఎంత అందంగా ఉంది అంటూ ఆ తన్మయత్వాన్ని భగ్నం చేసింది.”, ఇక “చాలా మనోహరంగా ఉంది” అంటూ మరొకరు; “అలా వాయించగలడానికి నేను ఏమైనా ఇచ్చుకోగలను” అని ఇంకొకరు ముఖస్తుతిగా స్పందించారు. ఆ అర్ధరహిత పొగడ్తలన్నీ పౌలా ఉత్సాహంపై నీళ్లు చిలకరించాయి.

ఇక ఇంటికి వెళ్లడానికి ఎక్కాల్సిన ఆఖరి కారు గురించి పౌలాలో ఆందోళన మొదలయింది. ఆమె పక్కనే నిలబడి ఉన్న జార్జ్ తన గడియారం చూసి, చివరి కారు వెళ్లిపోయి అప్పటికి సరిగ్గా అరగంట అయి ఉంటుందని తెలియజేస్తూ, “మీ కోసం వచ్చేవారెవరూ లేనట్లయితే మీరెవరికోసమూ ఎదురు చూడట్లేదంటే, నేను సంతోషంగా మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను” అని అన్నాడు.

“నేను ఎవరి కోసమూ ఎదురు చూడట్లేదు. ఇక్కడ నుండి వెళ్ళే కార్ ఎక్కితే అది నన్ను మా ఇంటి గుమ్మం దగ్గర దింపేసి ఉండేది,” అంటూనే ఆ ఇబ్బందికరమైన పరిస్థితికి తలవొగ్గి, ఆమె జార్జ్ ప్రతిపాదనను మౌనంగా అంగీకరించింది. ఇది ఇంతకు ముందెన్నడూ ఆమె ఎదుర్కోని పరిస్థితి. ఆ నిశబ్దరాతి, అందమైన యువకుడి పక్కన నడవడం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అతను ఎంతో స్వేచ్ఛగా, ఆహ్లాదకరంగా ఆమెతో సంభాషించాడు. తనకు రక్షణగా, వసున్న ఆ దృఢమైన యువకుని సాన్నిధ్యంలో ఆమెకు ఎంతో ఓదార్పు లభించింది. వణికించే గాలుల తాకిడిని తట్టుకోలేక అతన్ని గట్టిగా అతుక్కుని నడుస్తున్నప్పుడు ఉక్కులా ఉన్న అతని చేతుల కండరాలను ఆమెను స్పృశించాయి. ఆమెకు అప్పటిదాకా తెలిసిన మగవారందికన్నా ఇతను భిన్నంగా కనిపించాడు. సహ పియానో
​​వాద్యకారుడైన పోల్డార్ఫ్‌ పొట్టి, గుండ్రని శరీరానికి కారణం మితిమీరిన బీరు సేవించడమేనని ఆమెకు తెలియకపోయి ఉంటే, ఇప్పుడు ఇతని ముందు అతను తక్కువగా అనిపించేవాడు కాడు. తన పొడవాటి జుట్టు, కళ్ళద్దాలు, అస్తవ్యస్తంగా వదులైన శరీరాకృతితో ఉండే ఓల్డ్ ఇంగ్ఫెల్డర్ ను ఇతనితో పోల్చాలనుకున్నా ఇతని కాలిగోటికి అతను సరితూగలేడు. తన ‘హార్మొనీ’ గురువు, ప్రతిభావంతుడైన స్వరకర్త, మాక్స్ కుంట్లర్‌ తో పోల్చి చూస్తే జార్జ్‌తో అతనికి ఏ పోలికా లేదనే అస్పష్టమైన, సాధారణమైన, అభ్యంతరం తప్ప, ఆ క్షణంలో ఆమెకు మరొకటేదీ తట్టలేదు. కొత్తగా ఆమెలో చిగురించిన ఈ అభిమానం మాటున కూడా అతను బాంజో వాయించడంలో సరైన నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోవడం అన్నది జరగకుండా ఉంటే బావుండేదనే విషయం ఆమె చెవులకు వినిపిస్తూనే ఉంది.

వారిద్దరూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ నడిచారు. ఆమె ఉంటున్న వీధి మలుపు తిరిగినప్పుడు, ఇంటి గుమ్మం ముందు డాక్టర్ సిన్ కు చెందిన బగ్గీ నిలిచి ఉండడాన్ని పౌలా చూసింది. నడకలో వేగం పెంచుతూ, “ఓహ్! అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించినట్లుంది; వాళ్ళు డాక్టర్‌ని పిలిచారు,” అని చెప్తున్నప్పుడు, ఆశ్ఛర్యాందోళనలతో ఆమె శరీరం వణకడం బ్రెనార్డ్‌కు స్పష్టంగా కనిపించింది.

ఇల్లు చేరుకోగానే తాళం వేయకుండా ఉన్నముందు తలుపును ఆమె ఒక్కసారిగా బలంగా తెరిచింది. అతను సంకోచిస్తూ ఆమె వెనకే నిలబడిపోయాడు. ఆ చిన్న హాలులోని గ్యాస్ దీపం పూర్తి వెలుగుతో మండుతోంది; మెట్ల పైభాగంలో నిశ్శబ్దంగా, భయం నిండిన కళ్లతో క్రిందకు చూస్తున్న బెర్టా ఆమెకు కనిపించింది. పౌలా కు ఆ ఇంటి పొరుగున ఉండే వ్యక్తి గబుక్కున అడ్డు వచ్చాడు. ఇక్కడి స్థితి తెలియని ఆమె ఆ ఇంట్లో ఆనందంగా పియానో వాయిస్తున్న ఘడియల్లో, విధి ఆమెకు కలిగించిన దారుణమైన విషాదాన్ని ఒక్కసారిగా ఆమె చూసి తట్టుకోలేదని, దానికి ముందు ఒక్క క్షణమైనా ఆమెను కాస్త ఆపి నెమ్మదింపజేయాలనే సదుద్దేశంతో, ఆమె పట్ల ఆందోళనతో ఆ వ్యక్తి ఆమెకు ఎదురుగా వచ్చి నిల్చున్నాడు.

***

కన్నతల్లిని, తనను ఎంతో ప్రేమించే వ్యక్తిని పౌలా కోల్పోయిన రెండో సందర్భాన్ని ఆమె జీవితంలోకి మోసుకొచ్చిన ఆ కాళరాత్రి తర్వాత, కొన్ని నెలలు మెల్లిగా గడిచిపోయాయి. దుఃఖం కలిగించిన తొలి దిగ్భ్రాంతి సమిసిపోయాక, తన తల్లిదండ్రులు తాను ఏ సంగీత ప్రపంచపు ఉన్నత స్థానం దక్కించుకోవాలని కలలు కన్నారో, దాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో, పౌలా తన శక్తులన్నింటినీ పూర్తిగా పనిపై కేంద్రీకరించింది. అదే చిన్న ఇంట్లోని సగభాగాన్ని మాత్రమే తన అధీనంలో ఉంచుకుని నమ్మకస్తురాలయిన బెర్తా సహాయంతో ఇంటిని చక్కదిద్దుకుంటూ పౌలా రోజులు గడిపింది.

ఆ బాధితురాలి పట్ల స్నేహితులు దయతోనూ, శ్రద్ధతోనూ వ్యవహరించేవారు. వారందరి నడుమ ఇద్దరు ఆమె పట్ల ప్రదర్శించే ఆరాధన, వారిలో ఆమె పట్ల ఉన్న స్నేహాన్ని మించిన లోతైన ఆసక్తిని తెలియజేసేది. పౌలా పట్ల మాక్స్ కుంట్లర్‌కు ఉన్న ప్రేమ, అతని ప్రశాంతమైన మధ్యవయస్సుకు ఓ చెక్కుచెదరని బలాన్నిచ్చింది. ఆమె అతని ప్రేమను తిరస్కరించినా, అది అతనిలో ఏ మాత్రం సడలలేదు. స్నేహితుడిగానే ఉండడానికి ఆమె అనుమతి తీసుకుని, ఆ స్నేహబంధం ఇచ్చిన సున్నితమైన, శ్రద్దాపూరిత హక్కులను పాటిస్తూనే, ఆమె అంగీకారం ఆశిస్తూ తన ప్రేమను ఆమెపై బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని అతను విరమించుకున్నాడు.

ఒక సాయంత్రం, పౌలా కొన్ని సంగీత స్వరాల మార్పులపై తన చిన్న గదిలో పనిచేస్తూ ఉండగా బైట తలుపు చప్పుడయింది. ఆ వెంటనే హాలులో వినిపించిన అడుగుల చప్పుడు, ఆమె చేతులను, హృదయాన్ని వణికించింది. గదిలోకి జార్జ్ బ్రైనార్డ్ ప్రవేశించాడు. ఆమె లేచి అతనికి స్వాగతం పలికేలోగా అతను ఆమె పక్కనే ఉన్న ఖాళీ కుర్చీలో వచ్చి కూర్చున్నాడు.

“అలుపనేదే లేకుండా ఎంత పని చేస్తావు నువ్వు?” అన్నాడు ఆమె రాస్తున్న స్వరాల దిశగా చూపు సారించి. “నా ఉనికి నీకు అంతరాయం కలిగిస్తుందన్నది నాకు తెలుసు. అయినా, కొన్నిసార్లు ఒక వివేకవంతమైన అంతరాయం నీకు అత్యంత హితకరమైన, అవసరమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది”.

“నేను దానికోసమే శిక్షణ పొందానన్న విషయం మీరు మర్చిపోతున్నారు. నా వృత్తికి నేను తగినట్టుగా నన్ను నేను మలచుకోవాలి. విశ్రాంతి కోరుకుంటే క్షీణించక తప్పదు,” అని అతని ముఖంలోకి నవ్వుతూ చూస్తూ అంది ఆమె.

“మరేదైనా వేరే వృత్తిని చేపట్టడానికి ప్రయత్నించలేవా?” అంటూ, తన నల్లని, అందమైన కళ్ళలో అసాధారణమైన గాంభీర్యం తొణికిసలాడుతుండగా ఆమెను చూస్తూ అతను అడిగాడు.

“లేదు ఎప్పటికీ చేయలేను”

“ ప్రేమ అనే శ్రమను మాత్రమే కోరుకునే ఓ మనసు పిలుపు కోసం కూడా అది చేయలేవా?

ఆమె దానికి ఏ జవాబు ఇవ్వలేదు. తన ముందున్న కాగితాలపై పెన్సిల్‌తో పిచ్చి గీతలు గీస్తూ అటే తన చూపులను నిలిపి ఉంచింది.

అతను అసహనంగా లేచి గదిలో పచార్లు చేయడం మొదలెట్టాడు. తర్వాత ఆమె పక్కకు వచ్చి హఠాత్తుగా “పౌలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు శారీరక స్పృహ లేకపోతే తప్ప, నేను చెప్పేదేదీ నీకు తెలియని విషయం కాదు. ఈ రోజు, అదంతా మాటల్లో చెప్పాలని ఏదో శక్తి నన్ను ప్రేరేపిస్తోంది” తన ముందు పరుచుకున్న పనిపైకి వంగి ఉన్న ఆమె ముఖంలోకి చూడటానికి ప్రయత్నిస్తూ అతను ఇలా కొనసాగించాడు “నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుండి, నా పట్ల శ్రద్ధ చూపిస్తున్నావనే ఒక అందమైన భ్రమలో, నేను స్వర్గంలోని ఉన్నతమైన లోకాలలో విహరిస్తూ వచ్చాను. కానీ ఈ
రోజెందుకో, ఒక భయంకరమైన భావన నన్ను ఆవహిస్తోంది. కేవలం ఒకే ఒక మాటతో నన్ను శాశ్వతంగా దుఃఖం అనే అగాధంలోకి నెట్టేస్తావేమోనన్న భయం వేస్తోంది. పౌలా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నావని నేను నమ్ముతున్నాను, అయినా నీ సమాధానం కోసం ఎన్నో సందేహాలతో ఎదురుచూస్తున్నాను.”

ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు అతను. ఆమె ప్రతిఘటించలేదు. “ఎందుకు మౌనంగా ఉన్నావు? నాతో ఏదో ఒకటి ఎందుకు చెప్పవు” అడిగాడతను అసహాయత ద్వనిస్తూ…

“ఆనందంతో పాటు దుఃఖం కలగలిసి నాకు మాటలు రావడం లేదు,” ఆమె బదులిచ్చింది. “మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం నాకు జీవితాంతం సరిపోయేంత ఆనందాన్ని ఇస్తోంది. మనం విడిపోవలసిన సూచనను కూడా మీరే అందించడం నాకు చాలా బాధగా ఉంది.”

“నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అయినా విడిపోవడం గురించి మాట్లాడుతున్నావు. లేదు. నువ్వు నా భార్యవి అవుతావు. ఈ క్షణం నుండి మనం ఒకరి కోసం ఒకరుగా ఉందాం. ఓ నా పౌలా” ఆమెను దగ్గరకు తీసుకుంటూ అతనన్నాడు “నా అస్తిత్వాన్ని నీ సంతోషానికే అంకితం చేస్తాను”.

“నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను” ఆమె మెల్లిగా అతని చేతిని తన నడుం నుండి తప్పిస్తూ అంది.

“ఎందుకని?” అతను దెబ్బతిన్నట్లు అడిగాడు. వాళిద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు.

“ఎందుకంటే, అది నా జీవిత ఉద్దేశంలో భాగం కాదు కాబట్టి.” అంది ఆమె

“నీ జీవితంలో దేన్నీ వదులుకోమని నేను నిన్ను అడగడం లేదు. కేవలం, దాన్ని నీతో పంచుకునే అవకాశం నాకు ఇవ్వమని మాత్రమే నేను నిన్ను వేడుకుంటున్నాను.”
తన భావాలను బయటపెట్టలేని అమెరికన్ మహిళల కుమార్తెకు ప్రతినిధిగానే జార్జ్‌కు పౌలా పరిచయం. ఆమెలో పురుషుడైన తండ్రికి సంబంధించిన భావోద్వేగ స్వభావం మేల్కోవడాన్ని అతను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఆమె చెంపలు ఎర్రబడ్డాయి, తీవ్రమైన భావావేశంతో ఆమె నీలి కళ్లు దాదాపు నల్లగా మారిపోయాయి.

‘ఉష్ “నన్ను ఇంకా ప్రలోభపెట్టకండి” అంటూనే వాళ్లు నుంచున్న బల్ల ముందు ఆమె మోకాళ్ల పై కూర్చుండిపోయింది. దానిపై ఉన్న స్వరాలకు సంబంధించిన కాగితాలన్నిటినీ సేకరించి, వాటిని బొత్తిగా చేతుల్లోకి తీసుకుని తన వెచ్చటి ముఖాన్ని వాటిపై ఆనించింది.

“నా జీవితం గురించి మీకేం తెలుసని” ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడటం మొదలెట్టింది. “దాని గురించి మీరేం ఊహించగలరు? మీకు సంగీతం అంటే, తీరిక సమయాల్లోని ఆహ్లాదకరమైన కాలక్షేపం తప్ప మరేమైనా ఉందా? నా విషయానికొస్తే అది నా నరాల్లో రక్తంతో పాటు ప్రవహిస్తుందని మీరు గ్రహించగలరా? అది నా ప్రాణం కంటే, సంపద కంటే, చివరికి ప్రేమ కంటే కూడా ఎంతో ప్రియమైనదని మీరు అర్ధం చేసుకోగలరా?” ఆమె గొంతులో తీవ్రమైన ఆవేదన తొంగి చూసింది.

“పౌలా నా మాట విను. పిచ్చిదానిగా మాట్లాడకు.”

ఆమె ఒక్కుదుటున పైకి లేచి తనకు దగ్గరగా వస్తున్న అతన్ని నివారించడానికి తన చేయి అడ్డుపెట్టింది.

“మీరు ఒక కాన్వెంట్ కు వెళ్ళి జీవితకాలం నన్ గా బ్రతుకుతానని, దేవుని సేవకే అంకితం అవుతానని ప్రతిజ్ఞ తీసుకున్న స్త్రీని మీకు భార్యగా ఉండమని అడగగలరా?”

“అడుగుతాను. ఆ నన్ నన్ను ప్రేమించి ఉంటే, నా భార్యగా మారడం ఆమెకు తన పట్ల, నా పట్ల ఆ దేవుని పట్ల కూడా బాధ్యతే అవుతుంది”.
తనలోని భావోద్వేగ తీవ్రత తగ్గిన తర్వాత పౌలా సోఫాలో కూర్చుండిపోయింది. అతను ఆమె పక్కకే వచ్చి కూర్చున్నాడు. “నన్ను ప్రేమిస్తున్నావని మాత్రమే చెప్పు, పౌలా,” అని అతను పట్టుదలగా అడిగాడు.

“నేని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అంది ఆమె పాలిపోయిన పెదాలతోలో గొంతుకతో.

అతను ఆమెను చేతుల్లోకి తీసుకుని, నిశ్శబ్ద పరవశంతో గుండెకు హత్తుకుంటూ, ఆమె తెల్లని పెదవులకు తిరిగి ఎర్రని జీవం పోస్తూ ముద్దుపెట్టుకుని అడిగాడు

“నువ్వు నా భార్యవి అవుతావా?”

“దానికి మీరు కాస్త వేచి ఉండాలి. ఒక వారం తర్వాత తిరిగి రండి, అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తాను.”

ఇక అతనికి ఆగక తప్పలేదు .

విధించిన పరీక్షా కాలం ముగియడంతో, జార్జ్ తన సమాధానం కోసం పౌలా ఇంటికి వెళ్లాడు. పై అంతస్తులో నివసించే వృద్ధురాలు అతనికి ఆ సమాధానాన్ని ఇచ్చింది. “అయ్యో దేవుడా, మిస్ వాన్ స్టాల్జ్ అప్పుడే లీప్‌జిగ్‌కు బయలుదేరి వెళ్ళిపోయారుగా…”

ఇదంతా జరిగి ఎన్నో సంవత్సరాలు కాలేదు. గృహ జీవితంలోని ప్రశాంతమైన దినచర్యలో మునిగిపోయి కొంచెం లావు అయినప్పటికీ , జార్జ్ బ్రైనార్డ్ ఎప్పటిలాగే ఇంకా అందంగా ఉన్నాడు. ఒకప్పుడు నైపుణ్యం గల బాంజో వాద్యకారుడిగా అతనికి పేరు తీసుకొచ్చిన సంగీతం పట్ల అభిరుచిని అతనిప్పుడు పూర్తిగా పోగొట్టుకున్నాడు. జరిగిన నష్టానికి అతని నళ్ల కళ్ల భార్య ఇప్పటికీ విచారిస్తుంది. ఆమె కూడా మీద పడుతున్న వయసుకు, పరిస్థితులకు సర్దుకుపోయి, భార్యగా వైవాహిక జీవితంలోని బాధ్యతలకు సరిపోవని భావించి, వర్జీనియాకు సంబంధించిన తన పాత ఇష్టాలను ఎప్పుడో విడిచిపెట్టేసింది.
సుప్రసిద్ధ పియానిస్ట్, ఫ్రాలైన్ పౌలా వాన్ స్టోల్ట్జ్, సుదీర్ఘమైన , లాభదాయకమైన తన సంగీత కచేరీ పర్యటన తర్వాత లీప్‌జిగ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని మీరు ఉదయపు వార్తాపత్రికలో చూసి ఉండవచ్చు. ప్రొఫెసర్ మాక్స్ కుంట్లర్ కూడా చివరకు విజయాన్ని సాధించిపెట్టే, తన ఎడతెగని సంకల్పంతోనూ, మొక్కవోని సహనంతోనూ ఇంకా లీప్‌జిగ్‌లోనే ఉన్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.