
“నెచ్చెలి”మాట
“దుఃఖాన్ని జయించడం ఎలా?”
-డా|| కె.గీత
“దుఃఖాన్ని జయించడం ఎలా?” అన్న అన్వేషణతోనే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇక మనమెంత!
“దుఃఖానికి మూలం కోరికలు. కాబట్టి కోరికల్ని జయించాలి”
వినడం ఎంత సులభమో ఆచరణ అంత కష్టాతికష్టమైన ఇటువంటి గంభీరమైన జీవితసత్యాల వరకూ వద్దు గానీ ఒక చిన్న చిట్కా ఉంది.
చిట్కా అంటే అల్లం, నిమ్మరసం గోరువెచ్చటి నీట్లో కలుపుకు తాగడం అనుకునేరు! అబ్బే అందువల్ల ఉపశమించేంత సులభమైంది కాదు దుఃఖం.
అబ్బా ఈ దుఃఖోపశమన మంత్రం తెలుసుకునేసరికి దుఃఖం వచ్చేటట్లు ఉందా?
లేదులెండి. అసలు విషయమేవిటంటే-
ఇలా
“అయినదానికీ కానిదానికీ ముందు దుఃఖపడడం మానేసి, అసలు ఎందుకు దుఃఖమో ఆలోచించడం”
మొదటి మెట్టు-
ఇంకా ఎన్ని మెట్లున్నాయి తల్లీ అనుకుంటున్నారా! ఎన్నయినా మీ ఇష్టం- మొత్తానికి చేరాల్సింది
దుఃఖానికి పై మెట్టు!!
రెండోది అసలుదీ ఏవిటంటే-
ఊపిరి బాగా లోపలికి, బయటికి వదుల్తూ వినండేం!
ఉహూ.. అంటే యోగాసనం వెయ్యడమో, ప్రాణాయామం చెయ్యడమో కాదు.
“పని”-
మీరు సరిగ్గానే చదివారు “పని” ని కల్పించుకోవడం-
“An idle brain is a devil’s workshop”
అని చిన్నప్పుడెప్పుడో ఇంగ్లీషు క్లాసులో విని మర్చిపోయేం కదూ!
అదన్న మాట సంగతి!
దుఃఖపడే అవకాశం మనసుకి ఇవ్వకుండా పనిని కల్పించుకోవాలన్నమాట-
మరి పనంటే ఏం పని?
ఏదైనా- మనసుకి నచ్చిన పనన్నమాట.
పన్లో పనిగా ఆ పని వల్ల మనకే కాకుండా మరెవరికైనా కూడా ఉపయోగం ఉందనుకోండి, అది జీవిత పరమార్థమై, మీ దుఃఖంతో పాటూ పలువురి దు:ఖాన్నీ తుడిచేదై లోక కల్యాణానికి తొలిమెట్టవుతుంది.
కాబట్టి దుఃఖాన్ని జయించడం కాదు, దరి చేరనివ్వకండి –
అదేనండీ ఓ చిర్నవ్వుతో!
ఏదీ మరి కళ్లు తుడుచుకుని నెచ్చెలి వైపో చిర్నవ్వు రువ్వండి!!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

గీతా దుఃఖానికి విరుగుడు పని కలిపించుకోవటం చాలా మంచి మాట చెప్పావు . ఆచరించి చూడవలసిన సలహా ఇది. చికిత్స కన్నా నివారణ మేలు అది ఆరోగ్యం విషయంలోనే కాదు దుఃఖ మ్ విషయం లో కూడా అని చక్కగా చెప్పావు.
థాంక్స్ ఆంటీ!
పని లో పడితే అన్నీ వదిలేయగలగటం వస్తుంది నిజమే ! నెచ్చెలి రధసారధి మీరు విజయవంతంగా నడిపిస్తుంన్నందుకు అభినందనలు.
థాంక్యూ సో మచ్ వసుధగారూ! శ్రద్ధగా చదవడమే కాకుండా కామెంట్ పెడుతున్నందుకు, మీకు నెచ్చెలి నచ్చుతున్నందుకు.