కథా మధురం

జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’ 

-ఆర్.దమయంతి

ఇది కథే అయినా, కథ లా వుండదు. నిజం  లా వుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంటుంది. 

 కథలో పాత్రలు మనకు బాగా తెలిసినవారే కావడం ఈ కథలోని ప్రత్యేకం.   

ఇంతకీ కథేమిటంటే :

ఒక తండ్రి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు. ఒక కూతురు. ఇద్దరూ జీవితం లో స్థిరపడతారు. అయితే, అల్లుడి కి కుదుటపడని అనారోగ్యం కారణంగా కూతురు తన సంసారంతో సహా పుట్టింటికి చేరుతుంది.  అప్పుడేమీ అనుకోడు ఆ కొడుకు. అతను నగరం లో మంచి ఉద్యోగస్థుడే. ఆ తర్వాత కాలం లో తండ్రి చని పోతూ ఆస్థి లో సగ భాగం కూతురికి రాసిస్తాడు. అప్పుడూ ఏమీ అనుకోడు మాధవ రావు.

తల్లి తన పొలాన్ని, తను వుంటున్న ఇంటినీ కూడా కూతురికే ఇచ్చేస్తుంది. అప్పుడు కూడా పెద్ద గా కదలిపోడు. కానీ ‘నీకు అన్యాయం జరిగిందని తెలుస్తోందా?’ అని లోకం మాట చెవిన పడటంతో అతని మనసులో తల్లితండ్రుల పట్ల, సోదరి పట్ల కూడా ద్వేషం మొదలౌతుంది. – 

ఆ కోపం చివరికెంత దూరం వచ్చిందంటే, తల్లితో మాట్లాడటం మానేసేంత వరకు. – ఆమె తల్లడిల్లుతుంది.

ఆశ్చర్యం ఏమిటంటే, ఇలాటి పరిస్థితుల్లో ఏ భార్య అయినా, సహజంగా అత్తింటివారిని దుమ్మెత్తి ధూళెత్తుతుంది. కానీ మాధవరావ్ భార్య జనని మంచి మాటలతో అతనికి  హితవు పలుకుతుంది.   

అయినా అవేం అతని చెవికెక్కవు.

ఫలితం గా  ఆ వూరి తో, ఆ ఇంటితో సంబంధాలు తెంపుకుని, శాశ్వతం గా దూరం కావాలని స్థిర నిర్ణయం తీసుకుంటాడు. తన కు దక్కిన ఆస్థి ని అమ్మేస్తాడు. డబ్బు కూడా తీసుకుంటాడు. రిజిస్ట్రేషన్ కోసమని బయల్దేరతాడు. 

తన ఊరికి వెళ్లడం ఇష్టం లేక, రెండు మైళ్ళ ముందున్న వూర్లోని తన ఫ్రెండింట్లో దిగుతాడు.

ఆ రాత్రి ఏమౌతుందంటే..

ఈ కథా మృతాన్ని  గ్రోలితే తెలుస్తుంది కథలోని మధురిమ ఏమిటో!  

***

కథలోని స్త్రీ పాత్రలు, ఉన్నత వ్యక్తిత్వాలు :

* జనని (మాధవ రావు భార్య) : పేరు కి తగిన వనిత. సౌమ్యురాలు. భర్త మనసుని క్షుణ్నం గా  చదివి, బాగా అర్ధం చేసుకున్న తెలివైన స్త్రీ. 

భార్య అనే స్థానానికి ఒక ఉన్నతమైన నిర్వచనం లా అగుపిస్తుంది. 

ఎందుకంటే – మొండితనం తో వ్యవహరిస్తున్న భర్త వైఖరి ని మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఇల్లాలిగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. చురుకైన తర్కం కనిపిస్తుంది ఆమె మాటల్లో.  ఆమె ఒక భార్య గా కాకుండా అతనికొక స్నేహితురాలన్నట్టు హిత బోధ చేస్తుంది.   

ఇంటి ఆడపడుచు తో   తెగతెంపులు చేసుకోవడం మంచి పద్ధతి కాదని సూచిస్తుంది.

భర్త కోపం కొద్దీ, పొలాన్ని అమ్మేసి, ఇక అక్కడితో అన్ని సంబంధాలు తెంచుకునేందుకు సిధ్ధపడుతున్నాడని తెలిసి, బాధ పడుతుందీ ఈ ఇల్లాలు.

తన మొగుడు తనకు మాత్రమే సొంతమనే స్వార్ధ బుధ్ధి గల స్త్రీలకి భిన్నం గా, తన మొగుడు అందరి వాడై వుండాలని ఆశించే ఔన్నత్యం గల ఉదాత్త గుణాన్ని మనం జనని లో చూస్తాం.

ఈ పాత్ర  మనస్తత్వం ఎలాటిదో, కథారంభంలో ఒక్క వాక్యం లో చెబుతారు రచయిత. “ఆమె మీ అమ్మ లాగా లేదూ?” అని రైల్వే స్టేషన్ లొ ఒకామెని చూపిస్తూ, భర్తతో అంటుంది జనని.

తల్లి పేరు చెబితేనే అతనికి చికాకు. ఆ విషయం ఆమెకి తెలుసు. అయినా, అతని మనసు కదులుతుందని, ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆమె ఆశ.

అత్త గారి పట్ల ఆమెకున్న గౌరవానికి ఇదొక నిదర్శనం. భర్త ఆలోచనలు అర్ధం లేనివని తెలిసినా, కఠినం  గా వ్యవహరించదు. సున్నితం గా వ్యతిరేకిస్తుంది. పై పెచ్చు, ఆడపడుచు పరిస్థితి పట్ల జాలిచూపించే కరుణ గల హృదయిని. ఆమె అసహాయురాలై పుట్టింటిని ఆశ్రయించిన ప్పుడు, ఆమె కుటుంబ క్షేమం కోసం ఆస్థిని కేటాయించడం సమంజసమే అంటూ,  అత్తమామలు చేసిన పనిని సమర్ధిస్తుంది.

అంతే కాదు  మావగారు కష్టపడి సంపాదించిన పొలాన్ని సాగు చేస్తూ సంసారాన్ని పోషించుకుంటున్న ఆడపడుచు పడుతున్న శ్రమని ప్రశంసింస్తుంది.  స్త్రీ ధర్మ నిరతికి జనని ఒక ఉదాహరణ గా నిలుస్తుంది.

కుటుంబ బంధాలు బలహీన పడకుండా  వుండాలీ అంటే అందుకు బలం గా నిలబడాల్సింది కేవలం స్త్రీలు మాత్రమే..

 కుటుంబ ఐకమత్యాన్ని, శ్రేయస్సుని కోరుకునే ఉన్నత వ్యక్తిత్వం గల స్త్రీ గా జనని పాత్ర – ఎందరో స్త్రీలకి స్ఫూర్తి నిస్తుంది.

 సాటి స్త్రీ లోని మంచి గుణాలని గుర్తించడం, కష్టాన్ని అర్ధం చేసుకుని ఆదరించడం వల్ల సమాజం లో మహిళల సమస్యలు చాలా వరకు పరిష్కారమౌతాయి.  ఆ మార్పు కుటుంబం నించే మొదలవాలి అనే సందేశాన్ని జేరేస్తుంది జనని పాత్ర !

భర్తని రైలెక్కించడానికి వచ్చిన ఆ ఇల్లాలు, మరో సలహా కూడా చెబుతుంది. నేరుగా ఆడబడుచు ఇంటికెళ్ళి, ఆ కుటుంబంతో కలిసి గడిపి రమ్మని. ఎంత గొప్ప విశాల హృదయం!

ఆడబడుచు అంటే చాలామందికి పడదు. ఎంత దూరం గా వుంటే అంత మంచిదనుకుంటారు. కానీ ఇక్కడ జనని అలా భావించకపోగా, అన్నా చెల్లెళ్లను కలిపే ప్రయత్నం చెస్తోంది. 

కోడలు మంచిదైతే, కులమంతా మంచిదంటారు అందుకే నేమో! కథలో అయినా, నిజం లో అయినా ఆమె – ఇరుప్రక్కల బంధాలను తెంపేసే పదునైన పరికరం కాకూడదు. 

రెండు తీరాలను కలిపే వంతెన లా మారాలి.  ఆ స్త్రీ రాకతో ఇల్లు వృధ్ధి చెందాలి. నూతన ఆత్మీయానందాలు వెల్లి విరియాలి. అందుకు –  ఇంటి కోడలు జనని లావుండాలి. అని అనిపిస్తుంది కథలో ఈమెని చూసాక. చదివాక. 

కుటుంబ ఆర్ధిక లాభనష్టాలలోనే నే కాదు, హార్ధిక సాధక బాధకాలలో కూడా భర్తకి  కార్యేషు మంత్రి లా ఒక భార్య ఎలా వ్యవహరించాలో జనని పాత్ర బోధిస్తుంది.

కథలో పాఠకులను అమితం గా ఆకర్షించుకుని ఆకట్టుకునే ఉన్నతమైన పాత్ర జనని.

సీతమ్మ : అందరి తల్లులకి మల్లేనె, ఈవిడకీ కొడుకంటే ప్రాణం. అందులో ఒక్కడే కొడుకేమో, మరింత ప్రేమ జాస్తే. 

అలాటి కొడుకు – మాట్లాడటం మానేస్తే ఆ తల్లి పడే బాధ ఎంత నరకం గా వుంటుందో ఈ పాత్ర లో జీవించిన సీతమ్మ చెబుతుంది. 

ఆస్తి వుంటం వల్ల కలిగే  సంతోషం కంటే, వాటి పంపకాల విషయం లోకలిగే స్పర్ధలు,  కలతలే అధికం గా వుంటాయి. కడుపున పుట్టిన పిల్లలే, తల్లి అనీ తండ్రి అనీ కూడా చూడకుండా శతృ వు ని చేస్తుంటె, అప్పుడా క్షణం లో తల్లి పడే హృదయ క్షోభ ఎంత తీవ్రం గా వుంటుందో, కథలో సీతమ్మ పాత్ర లో చూస్తాం. 

పుల్లం పేట నేత చీర కట్టుకుని, కొంగు భుజం చుట్టూ కప్పుకుని కొడుకు ముందు నిలబడిన ఆ మాతృమూర్తి దీన వదనం ఈ పాత్రలో మనకు కనిపిస్తుంది. ‘ఇంకా నా మీద కోపం పోలేదురా నానా?” అంటూ కొడుకు చేయి పట్టుకుని అడుగుతున్నప్పుడు, ఆమె కళ్ళే కాదు, చదువురుల కళ్ళూ  వర్షిస్తాయి. 

ఇవాళ కాకపోతే రేపైనా తన కొడుకు మారతాడు అని ఆశ పడుతున్న ఆ తల్లి మనసు ఈ తెగతెంపుల  వార్త విని తల్లడిల్లిందేమో..కొడుకుని కలిసి మాట్లాడుతుంది.

ఇదొక విషమ పరిస్థితి ఏ తల్లికైనా. స్త్రీలు జీవితం లో  అంచెలంచెలు గా, స్థాయీల వారీగా ఎదుర్కొనే అనేకానేక సమస్యలలో ఇదీ ఒక సమస్యే .  చివరి మజిలీలో సయితం, ఎదురయ్యే ఎన్నో చిత్రవిచిత్రమైన కష్టాలలో ఒక పెద్ద కష్టం –  కొడుకులు. కూతుళ్ళు ఆస్తి పంపకాల కారణం గా దూరమైపోవడం, శాశ్వతంగా బంధాలను తెంచుకోవడం ఒక దుర్భరమైన శోకం. ఆ శోకానికి ప్రతీక గా కనిపిస్తుంది సీతమ్మ. 

అయితే, కరుడు కట్టిన కొడుకు హృదయాన్ని ఆమె మార్చగలిగిందా, లేదా అనే నిజాన్ని కథ చదివి తెలుసుకోవాల్సిందే.

 తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వున్న ధైర్యమూ సీతమ్మలో కనిపిస్తుంది. తల్లి కి పిల్లలలందరూ సమానమే అయినా, అస హాయులైన   అల్లల్లాడుతున్న సంతానం పట్ల తల్లి కరుణ మెండుగా వుంటుందనడానికి నిదర్శనం – సీతమ్మ. 

కూతురి కాపురాన్ని నిలబెట్టడం కోసం, కొడుకు ప్రేమకు దూరమైన ఒక తల్లి హృదయాన్ని చూస్తాం. 

ఎన్ని కష్టాలొచ్చినా, ఆపదలో వున్న కూతురికి అండ గా నిలిచి, ఆదుకున్న ఆ తల్లి  గుండె నిబ్బరం, నిజాయితీ గుణం మనకు నచ్చుతుంది.

***

* అనురాధ (మాధవరావు చెల్లెలు) : స్త్రీ అదృష్టం అంతా వైవాహిక జీవితం లో తెలిసిపోతుందని పెద్దలు అంటుంటారు. ఇదిగో, ఈ కథలో అనురాధ జీవితం కూడా ఆ కోవకు చెందినదనే చెప్పాలి. 

 సాఫీగా సాగిపోతున్నా సంసారం లో భర్త అనారోగ్యం  ఒక పిడుగుపాటు లా మారుతుంది. నయం కాని జబ్బు గా తేల్చేస్తారు డాక్టర్లు.  ఉద్యోగం పోయి కుటుంబం బయటపడిపోతుంది. ఎలాటి ఆధారం లేనప్పుడు, తన మీద పిల్ల భారం కూడా తోడైనప్పుడు ఆ  ఇల్లాలికి జీవితం ఎంత దుర్భరం గా మారుతుంది కదూ? పుట్టింటికి చేరుతుంది.  

ఆమె విషాద పరిష్తితి చూసి, పాపం! ఆ తండ్రి దిగులుతో మరణిస్తాడు. 

అత్తారింట్లో ఆనందం గా కాపురం చేసుకోవాల్సిన ఆడపిల్ల, కష్టాలతో పుట్టిల్లు చేరినప్పుడు ఏ తల్లి తండ్రుల గుండెలైనా పుట్టెడు విషాదం తో  నిండిపోతాయి.

ఇలాటి పరిస్థితుల్లోనే స్త్రీలు ధైర్యం చేసుకుని బ్రతకాలని  పరోక్షం గా చెబుతుంది అనురాధ. తల్లి రాసిచ్చిన ఇంట్లో వుంటూ, ఆస్తి అనుభవిస్తూ,   ఆమె సుఖపడుతూ కుర్చోలేదు. జనని మాటల్లో చెప్పాలంటే, ఆమె కష్ట జీవి. కష్టపడి పొలం పండిస్తుంది. వచ్చిన ఆదాయం తో పిల్లలని చదివిస్తోంది. రోగిష్టి భర్తని కనిపెట్టుకునే వుంది.

సంపాదిస్తేనే మొగుడు..అని అనుకోని ఒక ఉదాత్త స్వభావం గల స్త్రీ పాత్ర కి రూపకల్పన చేసారు. 

అనుకోనివి జరగడమే జీవితం. జరిగాక, సమస్యల పరిష్కార దిశగా నడవడమే లక్ష్యం గా ముందుకు సాగాలని చెబుతుంది ఈ పాత్ర.

కథలో ముగ్గురి స్త్రీ పాత్రలని ఎంతో ఉదాత్తం గా చిత్రీకరించారు.  నిండైన వ్యక్తిత్వాన్ని నింపారు. 

రచయితకు ధన్యవాదాలు.

రచన లో గల ప్రత్యేకత ఏమిటంటే : కథ లోని  సంఘటనలు చదువుతుంటే, తెరమీద ఒకో సన్నివేశాన్ని చూస్తున్న ఇంప్రెషన్ ని కలిగిస్తుంది.  

కథ రాసేటప్పుడు రైటర్ విభిన్న అవతారాలెత్తుతాడు. లొకేషన్ చిత్రించుకునే ఆర్టిస్ట్, సెట్టింగ్ డిజైనర్, కాస్ట్యూం డిజైనర్, స్క్రీంప్లే, మాటల రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, ఇలా  అన్నీ తానే అవ్వాల్సిన అవసరం వుంటుంది 

అయితే, ఈ కథలో రచయిత చక్కని కెమరా మాన్, సౌండ్ ఇంజినీర్ గా కూడా మారారు అని అనిపించింది. రచనలో సన్నివేశానికి ఇచ్చిన ఆ ఎఫెక్ట్స్  మంచి ఫలితాలనిచ్చాయి..అని చెప్పాలి. ముఖ్యం గా, రైల్వే స్టేషన్ లో…కాకి ని చూస్తున్నప్పుడు, తల్లి మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు..ఈ రచయిత ప్రయోగించిన ఈ నూతన ప్రయోగాత్మక విధానాన్ని మనం కనిపెట్టవచ్చు. 

తెలుగు కథా సాహిత్యం లో పది కాలాలు నిలిచిపోయే కథలను అందించిన డా.కె.వి.రమణరావు గారి ‘పుట్టిల్లు ‘ అనే కథా సంపుటి నించి ఈ కథని మీకు అందిస్తున్నాను.

మంచి కథ రాసిన రచయితకు అభినందనలు.

వచ్చేనెల మరో కథామృతం తో కలుద్దాం!

‘నెచ్చెలి ‘ ప్రేమికులందరకీ నా హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో.. 

ఆర్.దమయంతి.

 ******

 కలలోని నిజం

– డా. కే.వి. రమణరావు

     “ఆమె మీ అమ్మలాగా లేదూ” దూరంగా బెంచిమీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని. ఆవిడ తన మనమడికి కాబోలు మురిపెంగా అరటిపండు తినిపిస్తోంది. 

     అటువైపోసారి చూసి తలతిప్పుకున్నాడు రైల్లో కిటికి పక్కన కూర్చున్న మాధవరావు. భర్తకి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికి పక్కన ప్లాట్ ఫాం మీద నిలబడి ఉంది జనని. అతను స్వంత ఊళ్లో అమ్మిన చివరి నాలుగెకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పనిమీద నెల్లూరు నుంచి రాజంపేటకి వెళ్తున్నాడు. ఉదయం పదిగంటలవుతూంది. రైల్వేస్టేషన్ లో పెద్దగా జనం లేరు. భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని.

     “యిక మన వూరు యెప్పుడోగాని వెళ్లరు. రిజిస్ట్రేషన్ రేపుగదా, రాత్రికి మన వూరెళ్లి మనింట్లో వుండండి” అనునయంగా చెప్పింది జనని. 

     “అది మన యిల్లు కాదు, అనురాధది” కోపంగా అన్నాడు మాధవరావు. 

     “అనూరాధ మీ చెల్లెలేగదా యెవరో అన్నట్లు మాట్లాడతారేం?” 

     “ఆ బంధం అప్పుడే తెగిపోయింది” 

     “వాళ్ల పరిస్థితి బాగుండకేగదా, మీ అమ్మ వాళ్లకి ఇల్లు పొలం యిచ్చింది. అయినా యెవరికి ఇచ్చింది మీ వొక్కగానొక్క చెల్లెలికేగా మీరు ఆ యింటిగడపతొక్కి రెండేళ్లైంది. ఆస్తికోసం రక్తసంబంధం తెంచుకుంటామా” జనని వదల్లేదు. 

     మాధవరావు మాట్లాడలేదు. ఓ కాకి గోడమీద కూర్చొని అవతలి ప్లాట్ ఫాం మీద అఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్ నే చూస్తోంది. దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది.

     “ఆమెకివ్వబట్టేగదా ఆ ఆరెకరాల పొలమైనా మన కుటుంబంకింద సాగులో వుంది. మీనాన్న ఆ పొలాన్ని తయారుచేయడానికి యెంత కష్టపడ్డాడు. అనూరాధ అడమనిషైనా కాయకష్టం చేసి వ్యవసాయం చేయిస్తోంది. మనవాటా మనమేంచేశాం బంగారం పండే మాగాణి అమ్మి ఈ నగరం కొసానెక్కడో యిళ్ల స్థలాలు కొని కంపచెట్లకూ తొండలకూ వదిలేశాం”.

     మాధవరావు భార్యవైపు కోపంగా చూశాడు. గోడమీద కాకి అన్నంపొట్లం దగ్గరకొచ్చి భయం భయంగా అటు ఇటూ చూసి తినకుండానే వెళ్లి మళ్లీ గోడమీద కూర్చుంది. కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది. రైలు కూత వేసి బయల్దేరడానికి సిద్ధపడింది.

     “చెల్లిలిమీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నర్సింహులింట్లో పడుకోకండి. అతను ఫ్యాక్షన్ మనిషి. యెప్పుడు యెవరు దాడిచేస్తారో తెలీదు. సాయంత్రం చల్లపొద్దున రెండుమైళ్లు నడిస్తే మనవూరొస్తుంది. యింటికెళ్లండి. అందరూ సంతోషిస్తారు” కదుల్తున్న రైల్తోపాటు నడుస్తూ చేప్పింది జనని. రైలు ముందుకి నడుస్తూంటే మాధవరావు ఙ్ఞాపకాలు వెనక్కి పరుగెత్తాయి.

     * * *

     మాధవరావు వాళ్లది రాజంపేటకి పడమరగా పదిమైళ్లదూరంలో చెయ్యేటి గట్టుమీది అనుంపల్లె. ఏటికిటూ అటూ ముక్కారు పండే మాగాణి. తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా టీచరైనా ప్రవృత్తిరీత్యా వ్యవసాయదారుడు. అనువంశికంగా వచ్చిన పన్నెండెకరాల మెట్టభూమిని కాయకష్టం చేసి మాగాణిగా మార్చాడు. మాధవరావు, అనూరాధ ఇద్దరే సంతానం. ఇద్దరికీ తల్లి సీతమ్మే లోకం. మాధవరావు తిరుపతిలో ఎంఏ్ ముగించుకుని ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే అనూరాధ పెళ్లైంది. కుర్రాడికి ఆస్తిపాస్తులు అట్టే లేకపోయినా చెన్నైలో మంచి కంపెనిలో ఉద్యోగమని మొగ్గు చూపారు. అనూరాధకి తొలిచూలు ఆడబిడ్డ. మాధవరావు పెళ్లినాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది.

     అంతా సవ్యంగా నడూస్తూందనుకున్నంతలో ఓ రోజున కారుప్రమాదంలో అనూరాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణంపోయినంత పనైంది. చెన్నైలోని పెద్ద పెద్ద అసుపత్రులు, డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాదిపాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు. అతనికున్న ఆ కాస్త ఆస్తీ హరించుకుపోయింది. కాంతయ్య తనకు చేతనైనంతా చేశాడు. అల్లు్డు పూర్తిగా మామూలు మనిషి కానేలేదు. ఉద్యోగానికి పనికిరాడన్నారు. భర్త, పిల్లల్తో అనూరాధ పుట్టిల్లు చేరింది.

     కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది. కాంతయ్య మంచం పట్టాడు. ఆపై ఆయన ఎక్కువరోజులు బతకలేదు. అయన పోతూ పోతూ భార్య సలహామీద సగం ఆస్తి కూతురికిచ్చి పోయాడు. సీతమ్మ కూడా తనపేరుతో ఉన్న పొలమూ, ఇల్లూ కూతురికే ఇచ్చింది. మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు. రాను రాను వాళ్లూ వీళ్లూ అనడం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని, ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందని అభిప్రాయానికొచ్చాడు. మొదట్లో వాదించాడు, తర్వాత తల్లీ చెల్లెలితో మాట్లాడ్డం మానేశాడు. ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది.

     మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది. ‘అనూరాధకు వేరే జరుగుబాటు లేదు, ఇవ్వడానికి ఇల్లూ భూమి తప్ప తల్లిదగ్గర మరేమీ లేదు. ఎవరున్నా లేకున్నా భూమైతే కన్నతల్లిలా కడుపులో పెట్టుకు కాపాడుతుంది, భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చెయ్యదు, కనీసం కలో గంజో ఇస్తుంది. మనకేం మీకు మంచి ఉద్యోగం ఉంది’ ఇలా జనని ఎంత నచ్చచెప్పినా మాధవరావు తలకెక్కలేదు. మంకుపట్టులో మార్పులేదు. ఆకోపంతోనే ఊళ్లో తన వాటాకొచ్చిన పొలమంతా క్రమంగా అమ్మేశాడు. మిగిలిన భౌతిక బంధాన్ని తెంచుకుని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు.

     రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరింది. తన ఊరికెళ్లడానికిష్టపడని మాధవరావు రెండుమైళ్ల ముందే నర్సింహులుంటున్న కోసూర్లో బస్సు దిగిపోయాడు. ఆ రాత్రికి నర్సింహులింట్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. 

     నర్సింహులు ఇల్లు అవడానికి డాబా అయినా నాలుగువేపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి. ముందువైపు వీధిలోకి ద్వారానికిరుపైపులా పెద్ద అరుగులు. రాత్రి భోజనం తర్వాత నర్సింహుల్తో పిచ్చాపాటీ మాట్లాడాక వీధి అఫుగుమీద పక్క పరిపించుకున్నాడు మాధవరావు. ఇంట్లో పడుకోమన్నా వినలేదు. ఈ ప్రాంతాల ఆరుబయట గాలి పీలుస్తూ, వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలాకాలమైందన్నాడు.

     వీధి పొడవునా చెదురుముదురుగా కలిసిపోయిన ఇళ్లూ, చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటితో నిశ్శబ్దంగా దోబూచులాడుతోంది. అప్పుడప్పుడూ చల్లిని గాలి సడిచేయకుండా వీస్తోంది. తన ఊరికి అంతదగ్గర్లో తన ఊరుగాని మరో ఊళ్లో ఈ అరుగుమీద ఇలా ఒంటరిగా పడుకోవడం… అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రపట్టింది.

     * * * 

     నిద్రపోతున్న మాధవరావును ఎవరో మెల్లగా స్పృశించి నిద్ర లేపినట్టయింది. కళ్లు తెరచి చూశాడు. అంతా మసగ్గా ఉంది. రాత్రి ఏ ఝామో తెలియలేదు. ఎదురుగా తన కాళ్లపక్కన వీధివైపు ఎవరో ఆడమనిషి కూర్చుని ఉంది. తేరిపార చూశాడు. ఐ్తలో ఎక్కడినుంచో కొంచెం వెలుతురు ఆమెమీద పడింది. ఆమె తన తల్లి సీతమ్మ. చిత్రంగా ఆ గుడ్డి వెల్తుర్లోనూ ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. పుల్లంపేట నేత చీర కట్టుకుని కొంగు భుజంచుట్టూ కప్పుకుంది. తనవైపే ఆప్యాయంగా చూస్తోంది. అదేమిటి ఇంతరాత్రివేళ ఇక్కడికొచ్చింది. ఎలా వచ్చిందసలు. అతనికంతా అయోమయంగా ఉంది. దాహంగా ఉంది. గొంతు పూడుకుపోయింది. కష్టంమీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు.

     “యేమిటిట్లా వచ్చావు, యింతరాత్రప్పుడు” ఎలాగో గొంతు పెగుల్చుకున్నాడు. 

     “నీకోసమే. యింకా నామీద కోపం పోలేదురా నాయనా” ఆమె గొంతులో ఏదో శీతల మార్ధవం. గడ్డకట్టిన బాధ. 

     “యెందుకొచ్చావు, నేనంటే నీకిష్టం లేదు… చెల్లలంటేనే యిష్టం” 

     “నా ప్రాణాలన్నీ నువ్వేరా. తల్లికి బిడ్డల్లో తేడా వుంటుందా నాయనా” ఆమె కంఠంలో వేదన. కళ్లు ధారగా వర్షిస్తున్నాయి. ఆమె ఇంకా ఏదేదో మాట్లాడుతోంది, సగం స్వగతంలా. 

     ఆమె ముందుకు వంగి అతని చెయ్యి పట్టుకుంది. ఆమె చెయ్యి చల్లగా ఉంది. ఆ చల్లదనం అతని ఒళ్లంతా ప్రవహించింది. అతనికి తన శరీరంలోపల ఉన్నదంతా కరిగిపోయి శూన్యమేర్పడినట్టూ ఒళ్లు తేలికైనట్టూ అనిపించింది. 

     “యింత చిక్కిపోయినావేంరా… అన్నం సరిగ్గా తింటున్నావా?” ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మె తడికళ్లలో ఉన్న ప్రేమను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. 

     “యింటికి రాకుండా యిక్కడ పడుకున్నావేం బాబూ. యీ నర్సింహులున్నాడే వీడికి ముఠాకక్షలున్నాయి. వాడనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలుగ్గబట్టుకుని వచ్చినాను నాయనా. యింటికి రాకపోతే పోతివి, వెళ్లి లోపల పడుకో… యీవేళప్పుడు యిక్కడొద్దు. నీకు చెప్పిపోదామని వచ్చినాను నాయనా” ఆందోళనగా, ఆర్తిగా చెప్పిందామె. అప్పుడప్పుడూ భయంతో అటూ ఇటూ చూస్తోంది. మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తల ఉపాడు. 

     “వస్తానురా, చాలా దూరం పోవాలి కోడలూ పిల్లలూ జాగ్రత్త నాయనా వెళ్లి లోపల పడుకో” అంటూ ఆమె లేచి అరుగుదిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్లిపోయింది.

     తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు. కానీ గొంతులోంచి మాట బయటికి రావడంలేదు. లేచి తల్లి దగ్గరికి పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ చేతులూ కాళ్లూ కదలటంలేదు. కళ్లల్లో నీళ్లు కారిపోతున్నాయి. బలంగా చేతుల్ని, కాళ్లనీ విదిలించాడు. స్థంభానికి చెయ్యి తగిలి ‘అబ్బా’ అని అరిచాడు.

     * * * 

     నిద్రలో విసరగా చెయ్యి స్థంభానికి గట్టిగా తగలడంతో మాధవరావుకి మెలకువ వచ్చింది. ఒళ్లంతా సన్నగా కంపిస్తోంది. చెమటలు పట్టాయి. కాసేపు ఏమీ అర్థంకాలేదు. చెయ్యి నొప్పి తెలుస్తోంది. వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వెనెల పలచబడింది. లేచి కూర్చున్నాడు. తల విదిలించాడు. కొంత సృహలోకొచ్చాడు. 

     తన తల్లి కనిపించడం, మాట్లాడ్డం అంతా కలలో జరిగిందన్నమాట. కానీ ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్టే ఉంది. నెమ్మదిగా స్ఫురణకోస్తోంది. తల్లి చనిపోయి మూడేళ్లైంది. ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు. కానీ ఎంతో భౌతికంగా జరిగినట్టుంది. ఆమె ఆత్మ వచ్చిందా? తనకలాంటి వాటిమీద నమ్మకంలేదు. రాత్రంతా ఆ విషయాలే ఆలోచిస్తూ నిద్రపోయాడు. అందుకే తల్లి కలలోకొచ్చింది. కానీ అదంతా కల అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు. అంత స్పష్టంగా జరిగింది.

     అరుగు దిగి వీధిలోకొచ్చి చూశాడు. దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్తోంది. పరిగులాంటి నడకతో వెళ్లి చూశాడు. అక్కడెవరూ లేరు. ఇదికూడా భ్రమేనా. తిరిగి వచ్చి అరుగుమీద కూర్చునాడు. శరీరం వణుకు తగ్గి పూర్తి స్వాధీనంలోకి వచ్చింది. అతనిలో ఇన్నాళ్లూ గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి ప్రక్షాళన అయినట్టనిపించింది. తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది. ముల్లును ముల్లుతోనే తీసినట్టు. వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవాల్సొస్తుందని ఇన్నేళ్లూ తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా? లోకం దృష్టిలో కోడళ్లకంటే కొడుకులు మంచివాళ్లుగా చెలామణి అవుతున్నారు. కొన్ని నిజాలు ఎప్పుడోగాని బయటపడవు. తల్లిని ఎంత బాధ పెట్టాడు. దీనికి నిష్కృతి ఉంటుందా!

     మాధవరావు పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్లు తాగాడు. నెమ్మదించిన శరీరాన్ని మళ్లీ పక్క మీదకు చేర్చాడు. అంతలో అతనికి కలలో తన తల్లి చివరిమాటలు గుర్తొచ్చాయి. భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చుట్టుకొని వెళ్లి లోపల పడుకునే ఉద్దేశంతో వీధితలుపు తట్టాడు.

     * * * 

     ఉదయాన్నే లేచి మొహం కడుక్కుని హల్లో కూర్చున్నమాధవరావుకి నర్సింహులు కాఫీ తెచ్చిస్తూ “మనం రాజంపేటకు పదిగంటలకు బయల్దేరితే చాలు. ఒంటిగంటకు రిజిస్ట్రాఫీసులో పనైపోతుంది. నువ్వు రెండుగంటల బండికి వెళ్లిపోవచ్చు” అన్నాడు.

     నర్సింహులూ, నువ్వేముకోకుండా వుంటే వొక మాట. నేను యీ మిగిలిన నాలుగెకరాల భూమిని అమ్మే వుద్దేశ్యం మానుకున్నాను. నీదగ్గర తీసుకున్న అడ్వాన్సు డబ్బంతా వాపసు యిచ్చేస్తాను. నువ్వు కాదనకు” అన్నాడు మాధవరావు నెమ్మదిగా. 

     నర్సింహులు ఆశ్చర్యపోయి సరే నీ యిష్టం. నీమాట కాదనలేను. తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే యెవురికైనా బాధే. అయినా మాధవా నువ్వు టౌన్లో సెటిలైపోయినావు, రాధమ్మతో మాటల్లేవు, మీవూరికొచ్చేదే మానుకున్నావు. సేద్యం చెయ్యలేకేగదా అమ్మినావు. మరి యిప్పుడు మిగిల్చుకొని యేంజేస్తావు? అన్నాడు.

“మా చెల్లెలికి కౌలుకిస్తాను. కౌలు డబ్బు దాని పిల్లల పేర్తోనే బ్యాంకులో వెయ్యమంటాను” అని నివ్వెరపోయిన నర్సింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్లీ అన్నాడు మాధవరావు “యింకో మాట, నువ్వు మరో పదివేలు చేబదులుగా యివ్వు. యిద్దరం రాజంపేట పోయి మా చెల్లెలికి బావకూ పిల్లలకూ మంచి బట్టలు తీసుకుని మావూరెళ్దాము” 

——-

(ప్రచురణ – ఈనాడు ఆదివారం, 02.08.2009)

 రచయిత పరిచయం :

డా.కె.వి. రమణరావు స్వంతవూరు కడపజిల్లా తిమ్మసముద్రం గ్రామం. చదువుసాగింది కడప, తిరుపతిలలో. వృక్షశాస్త్రంలో పిహెచ్ డి అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, ఉన్నత విద్యా మండలిలో, రాజీవ్ గాంధీ యూనివర్సిటిలో పనిచేసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు. 

శ్రీమతి పేరు సుభద్ర. వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరూ స్థిరపడ్డారు.

చిన్నప్పటినుంచి సాహిత్యం పట్ల మక్కువ. కాలేజిరోజుల్లో ప్రసిద్ధ ఆంగ్ల, తెలుగు రచనలతో పరిచయం. గురజాడ, చాసో, చలం, శ్రీశ్రీ, జాషువ, కుటుంబరావు, రావిశాస్త్రి, బుచ్చిబాబు, తిలక్, చండీదాస్, విశ్వనాథరెడ్డి రచనలనుంచి స్పూర్తి పొంది 2005 నుంచి కథలు రాయడం ప్రారంభించారు.

 *డా. రమణరావు కథలు ఇప్పటిదాకా 45 కి పైగా అన్ని ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. 

 * సాహిత్య విమర్శ, ఉన్నతవిద్యకు సంబంధించి అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 

*విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ఇతని 26 కథలను ‘పుట్టిల్లు’ పేరుతో సంకలనంగా 2013 లో ప్రచురించారు.     * 2016లో ప్రతిష్టాత్మకమైన ‘చాసో స్పూర్తి ‘ అవార్డు ప్రదానం చేసారు. 2019 లో ఇతని కథలమీద ‘కథారూప లక్షణాలు’ అనే విమర్శక గ్రంధాన్ని డా. టి.జి.ఆర్. ప్రసాద్, డా. వి. శ్రీధర్ లు వెలువరించారు. 

కొన్ని వ్యాసాలుకూడా ప్రచురింపబడ్డాయి. 

డా. రమణరావు రచనావ్యాసంగాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. రచనలు సామాజిక మార్పుకి దోహదపడాలని విశ్వసిస్తారు.

 *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.