యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

సహనమే వరమయ్యిన వేళ

సహన  అసలు సిసలైన మధ్యతరగతి కుటుంబంలో, పెద్దపట్నమూ పల్లె కాని ఊళ్ళో పుట్టింది. ఓపికకి పెట్టినది పేరు. కష్టసుఖాలు బాగా అర్థంచేసుకోగల తత్వం. ఎవరితోనైనా బాగా కలిసిపోతుంది. అందరిలో మంచిపేరు. ఇక ఇంటి పనులు, వంటపనులు చక్కగా చెయ్యగల నేర్పరి. చెల్లెలిని, తమ్ముడిని బాధ్యతగా చూసుకుంటుంది. 

పెళ్ళివయసు వచ్చిందని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అనుకోకుండా పక్కవూరిలోనే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న సుధీర్ సంబంధం కుదిరింది. గవర్నమెంట్ ఉద్యోగం, పక్కవూరే కావడంతో కూతురిని మధ్యమధ్యలో చూసుకుంటూ వుండచ్చని అనుకున్నారు. అది కాకుండా ఎంతో కొంత ఆస్తి వుంది.  పెళ్ళి వాళ్ళతాహతుకు తగినట్లుగా చేశారు. పెళ్ళయిన కొన్నాళ్ళకే ఉన్నచోటు నుంచి ట్రాన్స్ ఫర్ వచ్చింది. రోజులు ఎంతలో గడుస్తాయి అన్నట్లుగానే ఆరేళ్ళు గడిచిపోయాయి. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. 

సుధీర్ చేసేది పేరుకి గవర్నమెంట్ ఉద్యోగమే కానీ పేకాట, తాగుడు అలవాట్లు ఉండడంతో ఇంటికిచ్చే డబ్బు తక్కువే వుండేది. అలవాట్లు మానుకోమని చెప్పలేకపోయేది.  పిల్లలని పెంచడం కష్టంగా వుంది. ఇక ఇలా కాదని తను ఎప్పుడో నేర్చుకున్న టైలరింగ్ మీద దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులు పెట్టి ఒక మిషను, అవసరమైన సామగ్రి కొనుక్కుని బట్టలు కుట్టడం మొదలు పెట్టింది. ఏపనయినా జాగర్తగా చెయ్యడం అలవాటు కాబట్టి అందరి బట్టలు చక్కగా కుట్టి, అన్న టైముకి ఇచ్చేది. తొందరలోనే మంచిపేరు సంపాదించుకుంది. మెల్లగా ఇంకో మిషను కొనుక్కుని ఒకమ్మాయికి నేర్పించి తనకి సహాయంగా పెట్టుకుంది. 

భర్త నుంచి ఒక్క సహాయం వుండేది కాదు. తాగడం వల్ల ఆరోగ్యం సరిగా వుండేది కాదు. మాటి మాటికీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ కారణాల వల్ల ఇద్దరి మధ్యా గొడవలైతేే వుండేవి కాదు కానీ, జీవితం మీద విరక్తి వచ్చేది. ఎక్కడికైనా పారిపోదామనుకునేది. తనని తాను సంబాళించుకుని, ముగ్గురు ఆడపిల్లలని చూసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చేది.

మొత్తానికి తన డబ్బులు, భర్త ఇచ్చిన కొద్ది మొత్తంతో సంసారాన్ని నెట్టుకుని వస్తోంది. పిల్లలు తెలివైన వాళ్ళు కావడంతో చక్కగా చదువుకున్నారు. డిగ్రీలు పూర్తయ్యాయి.

పెద్దమ్మాయి శిరీషని మేనత్త కొడుకు శివుడు ఇష్టపడ్డాడు. సరే అయిన సంబంధం, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు సుఖపడుతుందని అనుకున్న వెంటనే పెళ్ళి చేసేశారు. అలా పెద్దమ్మాయి బాధ్యత తీరిపోయింది.

ఇక రెండో అమ్మాయి సుగుణని వాళ్ళు అద్దెకుంటున్న ఇల్లుగలవాళ్ళబ్బాయి రమేష్ ఇష్టపడ్డాడు. అది సంతోషంగానే అనిపించింది. వాళ్ళతో మా పరిస్థితులు అంతత మాత్రమే, మేము మొన్నే పెద్దమ్మాయి పెళ్ళిచేసి ఇంకా కోలుకోలేదు ఇప్పుడే చెయ్యలేం అన్నారు. కానీ వాళ్ళు మీరవేం ఆలోచించకండి పెళ్ళి ఖర్చంతా మేము పెట్టుకుంటామని సుగుణని వాళ్ళబ్బాయి రమేష్ కి ఇచ్చి వైభవంగా పెళ్ళిచేశారు. అనుకోకుండా ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళవడంతో సుమన ఊపిరి పీల్చుకుంది. భర్తమాత్రం ఎప్పటిలాగే పట్టించుకోకుండా తన అనారోగ్యంతో ఇబ్బది పెడుతూనే వున్నాడు. 

ఆలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మూడోకూతురు మాలిని బెంగుళూరులో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయింది. తల్లిని బట్టలు కుట్టడం మానెయ్యమని తను నెలకి కొంత డబ్బులు పంపించడం మొదలు పెట్టింది. అయితే మాలిని చేసే పనికి ఆఫీసుల మంచి పేరు వచ్చింది. త్వరలోనే మంచి పదవిని పొందింది. తల్లితండ్రులకి సాయం చేస్తూనే వుంది. 

మాలినికి దూరపు బంధువు, మేనత్త వరస అయిన వెంకాయమ్మగారు ఒకసారి సుమనని కలిశారు. వెంకాయమ్మగారిని మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. ఆమాటా ఈమాటా మాట్లాడిన తర్వాత అమ్మా సుమనా మీ మూడో అమ్మాయిని ఒకసారి పిలు అన్నారు. తను బెంగుళూరులో ఉద్యోగం చేస్తోందండీ అంది. 

అవునా… అయితే మా అబ్బాయి రాము కూడా బెంగుళూరులోనే ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళిచేస్తే బావుంటుంది కదా… అన్నారు. సుమనకి నోట మాట రాలేదు. కాళ్ళ దగ్గిరకి వచ్చిన సంబంధాన్ని వద్దనుకోవడం ఎందుకు. పైగా బంధువులు. సుధీర్ కూడా ఇంట్లోనే వుండడంతో అలాగేనండీ అబ్బాయి, అమ్మాయిల అభిప్రాయం తెలుసుకుని అలాగే చేద్దాం అంది. 

సుమన మాలినికి విషయం వివరించింది. మాలిని తల్లిమాటకి అడ్డు చెప్పలేదు. రాము, మాలినల పెళ్ళి జరిగిపోయింది. రాము కూడా బాధ్యత కలవాడవడంతో మాలిని చాలా సంతోషించింది. పెళ్ళయిన కొన్ని రోజులకి ఇద్దరూ ఉద్యోగాల మీద అమెరికా వెళ్ళిపోయి బాగా సెటిల్ అయ్యారు. మాలిని తల్లితండ్రులకి ఇల్లు కొనిపెట్టింది. ఆడపిల్లలు ముగ్గురూ తల్లితండ్రులని ఎటువంటి లోటూ లేకుండా చూసుకుంటున్నారు.  

సుమన అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తెలిసిన వాళ్ళందరూ నీ సహనమే నీకు వరమయ్యిందమ్మా. పిల్లలు ముగ్గురూ చక్కగా సెటిల్ అయ్యారు. ఇక ప్రశాంతంగా జీవించండి అన్నారు.      

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.