ఇట్లు  మీ వసుధా రాణి 

సహన సముద్రం మా అమ్మ-3వ భాగం

-వసుధారాణి                  

పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోయి గత రెండు నెలలుగా ధారావాహికగా రాస్తున్న అమ్మ కథ ముగించాలని అనుకుటుంటేనే ఏదో బాధ.మన అందరి ఆరంభం కదా అమ్మ ముగింపు ఏమిటి అని మనసులో ఓ మూల కలుక్కుమంటున్ననొప్పి.కానీ తప్పదు మొదలు పెట్టింది ముగించాలి కదా.నిజానికి నా జీవితంలో అమ్మ ముగిసిపోలేదు,ఎక్కడికీ వెళ్ళలేదు.ఎందరో రూపంలో వస్తూనే ఉంది నా తల ఆప్యాయంగా నిమురుతూనే ఉంది.

ఎనిమిదిమంది పిల్లలు,ముగ్గురు పెద్దవాళ్ళు ,నాన్నగారు జబ్బుతో మంచాన.పిల్లల పెళ్లిళ్లు,పేరంటాలు,పురుళ్ళు ఇలా అమ్మకి దాదాపు ఏభై ఐదేళ్ల వయసు వచ్చేవరకూ ఇలాగే జీవితం వెళ్ళిపోయింది. నా పదహారవ ఏట నాన్న గారు చనిపోయారు.అంత పెద్ద కుటుంబంలో నేను,అమ్మ ,అమ్మమ్మా మిగిలాము.అప్పుడు కొంచెం నాకు అమ్మ దగ్గర కొంత చనువు వచ్చింది.దేచవరంలో ఆవిడ చిన్నప్పుడు బడికి వెళ్లిన విషయాలు ,ఇసుకలో బడిపంతులు అక్షరాలు దిద్దించిన కబుర్లు చెప్పేది. చొప్పగడ్డి వేసి కందికాయలు ,గెనుసుగడ్డలు ఎలా కాల్చుకుని తినేవారో.ఊరులో ఎవరికైనా జ్వరం వస్తే ఊరందరిలో అమ్మమ్మా వాళ్ళ ఇంట్లోనే వరి అన్నం తినే వారేట, అందుకని జ్వరం వచ్చిన వారు వరన్నం కోసం ఎంత పెద్ద ఆసాములైనా గిన్నె పట్టుకు మా ఇంటికి రావాల్సిందే అట. జొన్నఅన్నం, సజ్జన్నం ,సంకటి ఎలా వండాలో చెప్పేది.

అప్పుడప్పుడు జొన్నసంకటి ,గోంగూర పులుసుకూర అమ్మచేత  చేయించుకుని తినేవాళ్ళం మేముకూడా ఆ రోజు అదో పెద్ద స్పెషల్ లాగా.ఇక్కడ శ్రీనాధుల వారి పద్యం గుర్తుకు రావడం లేదూ .

చిన్న చిన్న రాళ్లు చిల్లరదేవళ్ళు

నాగులేటి నీళ్లు నాపరాళ్లు

సజ్జ జొన్నకూళ్ళు  సర్పబులును దేళ్లు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రాకముందు పల్నాడుసీమ అంతా ఇలాగే ఉండేది.

నా పద్దెనిమిదవ ఏట అమ్మమ్మ కూడా కింద పడి తొంటి ఎముక విరగటం వలన మంచంకే పరిమితం అయింది. నేను చేతికి అంది వచ్చాను కనుక నేను, పనిమనిషి కలిసి అమ్మమ్మ పనులు అన్నీ చేసేవాళ్ళం అమ్మకు శ్రమ లేకుండా. అలా ఓ ఆరునెలలు మంచంలో ఉండి నా పెళ్లి కుదిరింది అన్న వార్త విని అమ్మమ్మ చనిపోయింది.

పెళ్లి చేసుకోవటం అన్న సంతోషం కన్నా ఇంతమంది మధ్య ఉన్న , ఇంతమంది పిల్లలను కన్న అమ్మ ఒంటరిగా అయిపోతుందే అన్న ఆలోచన నన్ను ఎక్కువ బాధపెట్టేది. పెళ్లి తర్వాత  మిగిలిన అక్కయ్యలు అందరిలోకి వీలైనంత వరకు నేనే ఎక్కువగా అమ్మ దగ్గరికి వెళుతుండే దాన్ని.

అయితే ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచేది , ఇంతమంది మధ్య ఊపిరాడని పని, కష్టసుఖాల మధ్య ఎంతో బిజీగా గడిపిన ఆవిడ ఒక్కతే ఉన్నప్పుడు అసలు గత జీవితం వాసనలే లేకుండా ఆవిడ పుట్టినప్పటి నుంచి ఒక్కతే ఉన్నదా అన్నంత మామూలుగా ఉండేది. ఎన్నో ఏళ్ల నుంచి మా ఇంట్లో పనిచేసే ఒక సహాయకురాలు మాత్రం ఉండేది. తనతో ఆవిడకి కావాల్సిన పనులు చేయించుకునేది.

ఆవిడకి నచ్చిన, చేయాలనుకున్న ధర్మకార్యాలు అన్నీ హాయిగా చేసుకుంది. కొన్నింటిని నా చేతులమీదుగా చేయటం నా అదృష్టం. ఇంతమంది కూతుళ్ళకు, అల్లుళ్లు, వియ్యలవారు ఏవొక్కరి దగ్గరా ఒకచిన్న మాట అనిపించుకోకుండా వారిని గౌరవంగా చూసుకుని ,తన గౌరవం నిలబెట్టుకుంది. తామరాకుమీద నీటి బొట్టులా ఆవిడ ఇంతమంది మధ్య ఎక్కడా ఏమీ అంటకుండా అంటించుకోకుండా ఉండటం మా అక్క చెల్లెళ్ళ అత్తగార్లకి కూడా ఆశ్చర్యంగా ఉండేది. ఒకవేళ మేమెన్నా అత్తఇంటి చాడీలు చెప్పినా వినేది కాదు, విన్నా మాజీవితాన్ని మేమే ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పి వదిలేసేది.

ఆవిడ చదివిన  అపారమైన సాహిత్యం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలగటం వలన అనుకుంటాను ఎంత సమస్య అయినా నిబ్బరంగా ఉండేది. ఇంత మంది మనవళ్లు, మనవరాళ్లు ఎవరినీ ఎక్కువ ముద్దు చేయలేదు, ఎవరినీ తక్కువ చేయలేదు అందరినీ సమానంగా చూసేది. వాళ్ళతో బోలెడంత సరదాగా ఉండేది. మా పిల్లలు అల్లరి తక్కువ చేసేవాళ్ళు, బుద్ధిగా కూడా ఉండేవాళ్ళు అందుకని నన్ను అనేది వీళ్ళలా నువ్వు ఎక్కడ ఉన్నావు తెగ అల్లరి చేసి ఏడిపించే దానివి అని.

నేను అమ్మని అయిన తర్వాత నాకు మా అమ్మ విలువ ఎక్కువ తెలిసింది. బహుశా: అందరికి అంతేనేమో.

చక్కటి చీరలు కొనుక్కునేది మ్యాచింగ్ జాకెట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలంటే, నా వల్ల అయ్యేది కాదు మిగిలిన ఆవిడ పనులు అన్నీ చేసేదాన్ని కానీ ఈ పని మాత్రం మా పద్మక్క చేసేది. మాకు కూడా చక్కటి, మాకు నప్పే డ్రసింగ్ చేసుకోవటం నేర్పింది అమ్మే. ఇలా ఉండండి అని చెప్పకుండానే చెప్పేది చిత్రంగా. ఏరోజూ ఎంత గొప్ప పని చేసినా ఎక్కువ పొగిడేది కాదు. బాగా నచ్చితే రైట్ అనేది. అలా అని ఎప్పుడూ తగ్గించి ఏమీ అనేది కాదు.

మాలో ఎవరం ఏపని సమర్ధవంతంగా చేయగలమో ఆ పని గుర్తించి చెప్పేది, అలాగే బలహీనతల్ని కూడా తెలియపరిచేది , ఇంత కంటే పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు ఎందుకు ? 

అమ్మమ్మలు ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధురాళ్ళు అమ్మకూడా గుంటూరులో, బాపట్లలో  ఆలిండియా కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు వాలంటీర్ గా చేసిందట. ఆ కబుర్లు పిల్లలకి చెప్పేది. చిన్న చిన్న చీటీలలో సభలకు సంబంధించిన రహస్యాలను చిన్న  పిల్లలయిన అమ్మా వాళ్ళకి ఇచ్చి ఒకళ్లనుంచి ఒకళ్ళు విషయాలను పంచుకునే వారట నాయకులు. అందుకోసం పిల్లలకి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేవారట. అప్పటి గేయాలు, చిన్న చిన్న చమక్కులు చెపుతుండేది. ఇలా ఉద్యమంలో పని చేస్తిన్న  పిల్లలందరినీ గుర్తించి గుంటూరు సబ్ జైల్లో పెట్టారట కొన్ని గంటల తర్వాత వదిలి వేశారట. అప్పుడు ఆవిడ పేరు ఆ సబ్ జైలు రిజిష్టర్ లో రికార్డ్ అయ్యింది. తర్వాత కాలంలో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్లలో కనుక్కోగలిగిన వాళ్ళను  పిలిచి సన్మానం చేశారు. అప్పుడు నాకు ఎంత గర్వంగా అనిపించిందో చెప్పలేను.

తెనాలిలో చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన పిల్లగా ఉన్న లక్ష్మీరాధ, బాల్యవితంతువులైన ఇద్దరు అక్కచెల్లెళ్ల దగ్గరికి పెంపకానికి వచ్చి పూర్తిగా తన తల్లిని, తోబుట్టువులను మర్చిపోయి ఇక్కడే ఉండిపోయి.ఇంతమంది పిల్లలని, పెద్దవారిని బాధ్యతగా నెరవేర్చి , ఇన్ని బాధ్యతల మధ్య  తన జీవితాన్ని, తన అభిరుచులను కూడా నిలుపుకుని,  మొత్తం పిల్లలందరికీ తన ఆస్తికి సమాన హక్కుదార్లుగా చేసి ఒక పరిణితి తో కూడిన జీవితం, ఆదర్శ జీవితం గడిపింది మా అమ్మ.

బీకాంప్లెక్స్ ఇంజక్షన్ రియాక్షన్ (లక్షలో ఒకరికి వస్తుందట) ఇవ్వటం వలన లివర్ పూర్తిగా దెబ్బతింది హఠాత్తుగా. వెంటనే వైద్యం అందించినా లాభం లేకపోయింది. కొన్ని రోజులే ఇంటికి తీసుకు వెళ్లమన్నారు డాక్టర్లు. అప్పుడు కూడా ఆవిడ ఎంత నిబ్బరంగా ఉందంటే, అందరూ ఒక్కసారి ఉండద్దు ఇళ్లల్లో ఇబ్బంది పడతారు ఒక్కొక్కరుగా ఉండి చూసుకోండి చాలు అంటూ ఆ టైంలో కూడా మమ్మల్ని, మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడని ఆలోచించింది.

కార్తీకమాసం చిలుకుద్వాదశి రోజు, త్రయోదశి ఘడియలు సమీపించిన కొన్ని క్షణాలకి సాయంత్రం ఆరుగంటలకి దీపాలవేళ  వాకిట్లో తులసికోట ముందు అందరం కూతుళ్ళం ఆమె దగ్గర కూర్చుని విష్ణుసహస్రనామం చదివిన తర్వాత, మా పద్మక్క వొళ్ళోఆవిడ తల  పెట్టుకుని మా ఉమక్క నారాయణ మంత్రం చెపుతుండగా కళ్లలోంచి ఆవిడ ప్రాణాలు ఆకాశంలోకి ప్రయాణించాయి. అసలు ఆ సమయంలో ఆవిడ చనిపోతుంది అన్న జ్ఞానం మాకు ఎలా కలిగిందో, లక్ష్మి అక్కయ్య ఇక్కడ తులసి ముందు అమ్మని పడుకో పెడదాము అని ఎందుకు అందో నాకు ఇప్పటికీ శేష ప్రశ్న గానే ఉంది.

వచ్చే సంచికలో మా నాన్నగారి కబుర్లు చెప్పుకుందాం. ఎటువంటి పరిస్థితులలో ఐనా సంతోషంగా ఉండగలగటం , తనమీద తను జోకులు వేసుకోగలగటం మా నాన్న ప్రత్యేకలక్షణాలు.ఇప్పటి వారికి తెలియని బోలెడన్ని వింత విషయాలతో వచ్చే సంచికలో కలుద్దాం .

*****

Please follow and like us:

4 thoughts on “ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ-3వ భాగం”

  1. పిల్లలకు తల్లి పెంపకం ఎంత ముఖ్యమౌతుందో చెప్పకనే చెప్పే కథనం .సంక్లిష్టమైన పరిస్థితులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి ,మనం దానిని ఎదుర్కొనే విధానమే మారింది. మంచి రచన వసుధా రాణిగారూ

    1. అవును కల్యాణి గారు ముందుతరం పెద్దలు ఇది అని చెప్పకుండానే వారు ఆచరించి ,పిల్లలు ఆచరించేలా పెంచారు.

  2. అమ్మ చివరి ఘడియలు మరిచిపోలేము రాణెమ్మా. అదేదో సినిమా అనిపంచేలా ప్రశాంతంగా హుందాగా వెళ్ళిపోయింది.

Leave a Reply to వసుధారాణి Cancel reply

Your email address will not be published.