
“నెచ్చెలి”మాట
“క్లిష్టాతిక్లిష్టమైనదేది?”
-డా|| కె.గీత
అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏది?
ఆగండాగండి!
ఇదేదో ధర్మసందేహంలా ఉందా?
అవును, పక్కా గసుంటి సందేహమే!
సరే ప్రశ్నలో కొద్దాం.
ఈ ప్రశ్నకి సమాధానం “పూర్తిగా వైయక్తికమూ, సందేహమూను” అని దాటవేయకుండా ఆలోచిస్తే
ఆ… తట్టింది.
“కాలిఫోర్నియాలో రోజల్లా కరెంటు పోవడం!”
చాల్లేమ్మా చెప్పొచ్చేవు, వేసవి మొత్తం కరెంటన్నదే ఎరగం మా “సౌభాగ్య వంత”మైన పల్లెటూళ్లో అనుకుంటున్నారా?
కాలిఫోర్నియా లోనే కాదు అసలు ఇప్పటిరోజుల్లో కరెంటు పోవడమంటే నిత్యజీవితం స్థంభించిపోవడమే!
కరెంటుతో ముడిపడ్డ స్టవ్వులు, ఫ్రిజ్జులు, ఓవెన్లు …. వంట, తిండి సంగతి సరేగానీ ఇంటర్నెట్టు ,
ఫేసుబుక్కు, వాట్సాపు…. ఇవన్నీ లేకపోతే అయ్యబాబోయ్ ఇంకేవైనా ఉందా! కొంపలు ములిగి పోవూ?!
“సర్లేమ్మా, ఇవేవీ లేకుండా కూడా జీవితాలు నడవడం లేదా?” అంటున్నారా!
ఏమో మరి! సందేహమే!!
పోనీ ఇంకోటి చెప్తా!
సమయానికి ఆఫీసుకి వెళ్లడానికి సిటీ బస్సెక్కే సాహసం చెయ్యడం!
కాదా?
నగరంలో “నీళ్ల ట్యాంకు ఎప్పుడొస్తుందా, స్నానమెప్పుడు చేద్దామా” అని ఎదురు చూడడం!!
ఉహూ….
పోనీ
ముదురుతున్న దోమలతో పోటీపడి ధూపాల్లో ముక్కు మూసుకుని రాత్రంతా గడపడం!!!
అయ్యో ఇదీ కాదా!
అవును…
అహాహా…. కాదు కాదు…
చెప్పెయ్యనా మరి! చెప్పేస్తున్నా!!
అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏదో తెలుసా?
“జీవించడమే”
అవునండీ, మీరు సరిగ్గానే విన్నారు.
జీవితం
అనుదినం
అనేకానేక కష్టాల, నష్టాల పాల్జేసినా
తట్టుకోవడమే కష్టమైనది!
తిరిగి నిలబడడమే క్లిష్టమైనది!
ధైర్యంగా జీవించడమే సంక్లిష్టమైనది!!!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
