“నెచ్చెలి”మాట

“క్లిష్టాతిక్లిష్టమైనదేది?”

-డా|| కె.గీత 

 

అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏది?

ఆగండాగండి! 

ఇదేదో ధర్మసందేహంలా  ఉందా? 

అవును, పక్కా గసుంటి సందేహమే! 

సరే ప్రశ్నలో కొద్దాం.  

ఈ ప్రశ్నకి సమాధానం “పూర్తిగా వైయక్తికమూ, సందేహమూను” అని దాటవేయకుండా ఆలోచిస్తే  

ఆ… తట్టింది. 

“కాలిఫోర్నియాలో రోజల్లా కరెంటు పోవడం!” 

చాల్లేమ్మా చెప్పొచ్చేవు, వేసవి మొత్తం కరెంటన్నదే ఎరగం మా “సౌభాగ్య వంత”మైన పల్లెటూళ్లో అనుకుంటున్నారా? 

కాలిఫోర్నియా లోనే  కాదు అసలు ఇప్పటిరోజుల్లో కరెంటు పోవడమంటే నిత్యజీవితం స్థంభించిపోవడమే! 

కరెంటుతో ముడిపడ్డ స్టవ్వులు, ఫ్రిజ్జులు, ఓవెన్లు …. వంట, తిండి సంగతి  సరేగానీ ఇంటర్నెట్టు , 

ఫేసుబుక్కు, వాట్సాపు…. ఇవన్నీ  లేకపోతే అయ్యబాబోయ్ ఇంకేవైనా ఉందా! కొంపలు ములిగి పోవూ?!

“సర్లేమ్మా, ఇవేవీ లేకుండా కూడా జీవితాలు నడవడం లేదా?” అంటున్నారా! 

ఏమో మరి! సందేహమే!! 

పోనీ ఇంకోటి చెప్తా!

సమయానికి ఆఫీసుకి వెళ్లడానికి సిటీ బస్సెక్కే సాహసం చెయ్యడం!

కాదా? 

నగరంలో “నీళ్ల ట్యాంకు ఎప్పుడొస్తుందా, స్నానమెప్పుడు చేద్దామా” అని ఎదురు చూడడం!! 

ఉహూ….

పోనీ 

ముదురుతున్న దోమలతో పోటీపడి ధూపాల్లో ముక్కు  మూసుకుని రాత్రంతా గడపడం!!! 

అయ్యో ఇదీ కాదా! 

అవును… 

అహాహా…. కాదు కాదు… 

చెప్పెయ్యనా మరి! చెప్పేస్తున్నా!! 

అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏదో తెలుసా? 

“జీవించడమే”

అవునండీ, మీరు సరిగ్గానే విన్నారు. 

జీవితం 

అనుదినం 

అనేకానేక కష్టాల, నష్టాల పాల్జేసినా 

తట్టుకోవడమే కష్టమైనది!

తిరిగి నిలబడడమే క్లిష్టమైనది! 

ధైర్యంగా జీవించడమే సంక్లిష్టమైనది!!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.