బొమ్మల్కతలు-19

-గిరిధర్ పొట్టేపాళెం

       ప్రతి మనిషికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో తనకి తెలియని దాన్ని శోధించి తెలుసుకుని సాధించాలని పడే తపనా, చేసే ప్రయత్నాల వెంట కృషి తోడై తాననుకున్న దానికన్నా ఎక్కువగా సాధించిన సందర్భాలు కొన్నైనా ఉండి ఉంటాయి. వెనుదిరిగి చూసినపుడల్లా అప్పుడున్న పరిస్థితుల్లో ఇది నేనే చేశానా అని అనిపిస్తూ అబ్బురపరుస్తూ ఆ సందర్భాలు గుర్తొచ్చినపుడల్లా మదిలో మళ్ళీ మళ్ళీ అద్భుతంగా సందడి చేస్తూనే ఉంటాయి.
 
          పెయింటింగ్ వెయ్యాలన్న ఆలోచనా తపనల తపస్సు చాలించి కృషి మొదలు పెట్టిన నా టీనేజి రోజులవి. ఎక్కడా ఎవరినీ అడిగి తెలుసుకునే అవకాశం లేకున్నా పట్టు వదలక, అప్పుడు మేముంటున్న “కావలి” లో, నేను చదువుతున్న “విజయవాడ” లో  పుస్తకాల షాపుల వెంటపడి అడిగి, వెతికి పట్టుకో గలిగిన ఒక అరడజను రంగుల “క్యామెల్” పోస్టర్ కలర్స్ సెట్, ఒకటీ రెండు బ్రషులు తప్ప ఇంకేమీ పెద్దగా ఆర్ట్ మెటీరియల్ లేకుండానే పయనం సాగించిన రోజులవి. ఒక్కొకసారి అడిగిన షాపుకే మళ్ళీ వెళ్ళి అదే మెటీరియల్ కోసం అడిగిన సందర్భాలూ ఉన్నాయి. “నిన్ననే అడిగావు, లేవని చెప్పా కదా” అన్నా, మళ్ళీ వెళ్ళి నిన్న అడిగిన అతను కాకుండా ఇంకో అతను ఉన్నాడేమో చూసి అక్కడే అవే మెటీరియల్ ఉన్నాయా అని అడిగిన సందర్భాలూ అనేకం.
 
          ఏదైనా మంచి బొమ్మ చూసినా, గ్రీటింగ్ కార్డు లేదా పత్రికల్లో ప్రింట్ అయిన మంచి ఫొటో చూసినా ఎప్పటికైనా వాటిని పెయింటింగ్స్ వెయ్యాలి అని సేకరించి దాచుకునే అలవాటు చిన్నప్పట్నుంచీ ఉండేది. ఒకసారి చిన్నమామయ్య దగ్గరున్న ఫొటో క్యాలెండర్ లో ప్రింట్ అయిన ఫొటోలు చూడగనే తెగ నచ్చేసి మళ్ళీ తెచ్చిస్తాను అని అడిగి ఇంటికి తెచ్చుకున్నా. అందులో ప్రింట్ అయిన రెండు ఫొటోలు “కాశ్మీర్” లో తీసినవి. ఒకటి వింటర్ లో పగటిపూట ఎండలో మంచు, ఇంకొకటి సమ్మర్ సాయంత్రం పూట అందమైన సరస్సు. రెండిటి మీదా మనసు పారేసుకున్నా. అడిగి తెచ్చుకున్నాను కనుక కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేయాలి. ఇప్పట్లా క్లిక్ మనిపించి పాకెట్లో పెట్టుకునే ఫోన్ కెమెరాల్లేవు. ఆ క్యాలెండర్ ముందు పెట్టుకుని చూసి పెయింటింగ్ మొదలు పెట్టటం ఒక్కటే మార్గం, అంతే, మొదలుపెట్టేశాను. మూడు రోజుల వ్యవధిలో రెండు ఫోటోలనీ పెయింటింగ్స్ వేసేశాను. మూడు రోజుల్లోనే వేశానన్న విషయం నిజానికి గుర్తులేకున్నా పెయింటింగ్ కింద సంతకం పెట్టిన డేట్లు ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అసలప్పట్లో అలా ఎలా వేశానన్న ఆశ్చర్యం ఒక పక్కైతే, మూడు రోజుల్లోనే మళ్ళీ ఇంకొకటా అన్న ఆశ్చర్యం మరో పక్క, ఇవి రెండూ పక్కపక్కన చూసినపుడల్లా పక్కా పొందే ఆ అనుభూతిని మాటల్లోనే కాదు లెక్కల్లోనూ చెప్పలేను.
 
          అప్పటి దాకా రంగుల్లో చిత్రీకరించిన ఆకాశం నా బొమ్మల్లో లేదు, నీళ్ళూ లేవు. అలాంటిది రెండూ కలిపి ఒకే పెయింటింగ్ లో వెయ్యటం చాలా పెద్ద సవాల్ నాకపుడు. ఇప్పటికీ అప్పటిలానే ఏ బొమ్మైనా వేసే ముందు వెయ్యగలనా అన్న సంశయంలాంటి చీకటిలో సందేహంతోనే  నా పయనం మొదలవుతుంది, ఎక్కడో వెయ్యగలను అన్న చిన్న మెరుపు తళుక్కుమని మెరిసి నన్ను పట్టి ముందుకి లాగి నడిపిస్తుంది. అప్పుడ పుడూ ఆ మెరుపు ఉరుమై గర్జించి మేఘమై వర్షించి తుఫాను లా అలజడి సృష్టిస్తూ ఇబ్బంది పెడుతుంది. అయినా పట్టు సడలక నేను వేసే అడుగుల్తో చివరికి తనే ప్రశాంతించి వెలిసి వెలుగునిచ్చి, వర్షం వెలిశాక వెలిసే సూర్యకాంతిలో మెరిసే ప్రకృతిలా నా మనసుని ఉరకలు వేయిస్తూ నాతో ఆ బొమ్మని పూర్తి చేయిస్తుంది. వేసే ప్రతి బొమ్మ పయనమూ ఇలాగే ముందుకి సాగుతుంది.
 
          అలా సందేహిస్తూనే మొదలు పెట్టిన ఆ క్షణాలింకా గుర్తున్నాయి. దీనికి రెండ్రోజుల ముందు వేసిన “కాశ్మీర్ మంచు” పెయింటింగ్ ఒకింత ధైర్యాన్నిచ్చినా, వెను వెంటనే విభిన్నమైన రంగుల్లో మరో కాశ్మీర్ పెయింటింగ్, ఈసారి ముందున్న ఛాలెంజ్ – ఆ ఆకాశం, సాయంసంధ్యాకిరణాలు పడి ఆ సరస్సు నీళ్ళు సంతరించుకున్న బంగారు వన్నెలు, అక్కడక్కడా పిల్లగాలికి నీటిలో చిన్నపాటి కదలికలు, ఆ కదలికలపై ఆహ్లాదంగా విహరిస్తున్న పడవలూ, సరస్సు చుట్టూ ఉన్న పచ్చని చెట్లూ, వాటి ప్రతిబింబాలూ… ఇలా ఇందులో ప్రతిదీ సవాలే. తడబడకుండా ఓపిగ్గా వేసుకుంటూ పోయానంతే. వాటర్ కలర్ కి ముందు పెన్సిల్ తో స్కెచ్ గీసుకోవచ్చన్న టెక్నిక్ నాకప్పుడు తెలీదు. బ్రష్ తో రంగులు వేస్తూ పోవటమొక్కటే తెలుసు. అన్ని లిమిటే షన్స్ నీ అధిగమించి వేసింది నేనేనా అనిప్పుడున్న ఆశ్చర్యం వెనుక అప్పుడున్న తపనా, దీక్షా గుర్తుకొస్తుంటాయి.
 
          అప్పటి నా పెయింటింగ్స్ లో ఈ రెండు “కాశ్మీర్ పెయింటింగ్స్” చాలా చాలా ప్రత్యేకం. పోర్ట్రెయిట్స్ మాత్రమే కాదు, ప్రకృతినీ బానే చిత్రీకరించగలననే ధైర్యాన్ని చ్చాయి. ఆ రోజుల్లో వేసిన ప్రతి పెయింటింగ్ నీ మా ఇంట్లో బీరువా పక్కనుండే ఒక టేబుల్ పైన గోడకానించి పెట్టేవాడిని. అదే నా ఆర్ట్ గ్యాలరీ, అమ్మ అన్న ఇద్దరే వీక్షకులు. అలా అలా నా ఆర్ట్ గ్యాలరీలో వేసిన ప్రతి బొమ్మా ఒకటి రెండు రోజులుంచి మళ్ళీ మళ్ళీ చూసుకుని పొంగిపోయేవాడిని. తర్వాత నాతో వీటినీ అమెరికాకి తెచ్చుకుని ఫ్రేముల్లో పెట్టి వాల్ పైన కొన్ని సంవత్సారాలుగా పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఫ్రేముల్లోంచి బయటికొచ్చి నా ఆర్ట్ పోర్ట్ ఫోలియో లో భద్రంగా ఉన్నాయి. ఏప్పుడన్నా అది తిప్పుతుంటే ఎదురై సున్నితంగా నన్ను పలకరిస్తాయి. అప్పుడప్పుడూ బయటికి తీసి మాసిన పేపర్ అక్కడక్కడా కొంచెం నలిగిన మడతలు అరిచేతితో తాకితే, కాలంతో నలిగిన ఆ మడతల్లో ఉన్నది మాత్రం తడి ఆరిన ఆ రంగులూ, తడి ఆరని నా జ్ఞాపకాలూ… 
 
“తడి ఆరిన రంగుల్లో ఆరని జ్ఞాపకాలే జీవన చిత్రాలు.”
 
“Kashmir Lake”
Poster colors on Paper (7″ x 10″)
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.