అమ్మ ముచ్చట ( కవిత)

-కందుకూరి శ్రీరాములు

అమ్మ
ఆచ్ పిట్టయ్యి ఎగిరిపోయింది
ఇక్కడ గూడూ లేదు
మనిషి నీడా లేదు
తను ఎటో వెళ్ళిపోతానని తెలియక
తన తనువు ఎటో మాయమైందోనని తెలియక

పండుగకో పబ్బానికో కట్టుకోవటానికి పెట్టెలో భద్రంగానే దాచుకుంది
మూటచుట్టిన పట్టు చీర !

ఎన్నెన్ని ముల్లెలు కట్టుకుందో
ఆకలైతే ఆంప్రో బిస్కెట్ ప్యాకెట్!
అరగకపోతే సోడా సొంపు ప్యాకెట్!

ఎంత క్రమశిక్షణతో ఉన్నా
ఎప్పుడూ ఏదో ఒక నలత !
ఒక్కతే మంచానికే అంకితం !
ఎవ్వరైనా ఎంతసేపని మాట్లాడుతారు ?
ఎవరైనా ఎంతసేపని జాలి చూపిస్తారు ?
అందరున్నా ఎప్పుడూ ఎవరూ ఉండరు
ఒంటరి బతుకు జైలు కన్నా కఠినం !

గోడ గడియారం తిరుగుతూనే ఉంది
అది ఎప్పుడు ఆగిపోతుందో
ఎట్లా తెలుస్తుంది ?

ఎన్నిసార్లు చెప్పినా
ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో
ఎన్ని వేసుకోవాలో తెలియదు

ఎన్ని గుర్తులు పెట్టి ఎన్ని పొట్లాలు కట్టినా
తను వేసుకున్నది మనం ఇచ్చినా నష్టమే
తను వేసుకోంది మనమియ్యకున్నా నష్టమే.

ఈడు జోడు అంటాం !
పెళ్లప్పుడేనా ?
అవసానదశలో అక్కర్లేదా ?

ఓహో!
ఇప్పుడు తోడూ నీడా అంటున్నాం కదా !
బాగానే ఉంది
తోడు ఎగిరిపోయాక
నీడకు జాడెక్కడ? వాడెక్కడ ?

ముద్దు వేరు ముచ్చట వేరు !
ఇప్పుడు
ముద్దులేని ముసలమ్మ
ముచ్చట ఎవరు వింటారు ?

రాత్రంతా ముచ్చట
ఎవరితో చెప్పిందో ఏమోగానీ
తెల్లారి చూస్తే మాటా లేదు ముచ్చటా లేదు

తట్టి చూస్తే ఏముంది
పిట్ట ఎగిరిపోయింది

అలా తేరిపార చూస్తున్నానో లేదో
అమ్మ చేతిలో ముచ్చటగా
నాన్న ఫోటో కనిపించింది !!

(90 ఏళ్ళ మా అమ్మ తను సాధించిన సందర్భంగా)

*****

Please follow and like us:

One thought on “అమ్మ ముచ్చట ( కవిత)”

  1. అమ్మ గురించి శ్రీరాములు గారు కవితాత్మకంగా చెప్పిన అమ్మ ముచ్చట చాలా బాగుంది. మనిషి జీవితాన్ని పిట్టతో పోల్చి అమ్మ గురించి, వ్యాపకాల గురించి అద్భుతంగా చెప్పారు. అలాగే శ్రీరాములు గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published.