అనుసృజన

వంటావిడ – ఇంటావిడ

మూలం: కుమార్ అంబుజ్

అనుసృజన: ఆర్ శాంతసుందరి

ఆమె బుల్ బుల్ పిట్టగా ఉన్నప్పుడు వంట చేసింది
తర్వాత లేడీగా ఉన్నప్పుడు
పూల రెమ్మలా ఉన్నప్పుడు
గాలితో పాటు లేత గడ్డిపరకగా నాట్యమాడుతున్నప్పుడు
అంతటా నీరెండ పరుచుకున్నప్పుడు
ఆమె తన కలల్ని మాలగా అల్లుకుంది
హృదయాకాశంలోని నక్షత్రాలని తెంపి జోడించింది
లోపలి మొగ్గల మకరందాన్ని మేళవించింది
కానీ చివరికి ఆమెకి వినిపించింది
కంచం విసిరేసిన చప్పుడు
 
మీరు ఆమెతో అందంగా ఉన్నావని అంటే
ఆమె వంట చేసింది
పిశాచి అని తిట్టినా వంట చేసింది
పిల్లల్ని గర్భంలో ఉంచుకుని వంట చేసింది
మళ్ళీ వాళ్ళని చంకనేసుకుని వంట చేసింది
మీ కలల్లో కూడా వంటే చేసింది
ముందు లతలా ఉన్నప్పుడు వంట చేసింది
తర్వాత ఆకారం మారినా వంట చేసింది
సముద్రాలలో స్నానమాడి వచ్చాక
నక్షత్రాలని తాకి వచ్చాక వంట చేసింది
చాలా సార్లు ఒకే ఆలుగడ్డ, ఉల్లిపాయతో వంట చేసింది
ఇంకా ఎన్నో సార్లు ఓర్చుకుంటూ వంట చేసింది
నడుంనొప్పి ఉన్నా జ్వరంతో కాలిపోతున్నా
బైట తుఫానులే ఉన్నా
లోపల వరదలే పొంగుతున్నా
ఆమె వంట చేసింది
ఇక వాత్సల్యంతో నిండి భావాతిరేకంతో వంట చేసింది
 
మీరు ఆమె చేత అర్థ రాత్రి వంట చేయించారు
ఇరవై మందికి వంట చేయించారు
పరిచితులూ, అపరిచితులూ అయిన
ఎందరో స్త్రీలని ఉదాహరణగా చెప్పి వంట చేయించారు
ఎన్నో సార్లు కళ్ళెర్ర చేసి
మరెన్నో సార్లు కాలితో తన్ని తర్వాత నువ్వు ఆడదానివి అంటూ వంట చేయించారు
 
మీరు అరిచారు
‘అబ్బ ఇంత ఉప్పగా ఉందేం?’
కానీ నేల మీదకి జారే ముందు
కంచాల్లోనూ, గిన్నెల్లోనూ జారిపడిన
కన్నీళ్ళని మరిచిపోయారు మీరు
 
పోయిన బుధవారం అరుపులూ కేకలూ లేకుండా
భోజనం చేసారని
ఒక వారమంతా ఆమె ఆనందంగా గడిపింది
వంటని మెచ్చుకున్నందుకు
కడుపునిండా తిని ధన్యవాదాలు తెలిపినందుకు
ముద్ద నోట్లో పెట్టుకోకుండానే
ఆ మరో వ్యక్తికి కూడా భోజనం బావుందని అబద్ధం ఆడిన ఆమె..
వంటావిడ – ఇంటావిడ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.