అతడు – ఆమె

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-యస్వీకృష్ణ

          ”అతను… నేను కలలు కన్న రాకుమారుడు కాదు. కనీసం బంధాలకి, మమతలకి విలువిచ్చే మంచిమనిషి కూడా కాదు. ఏదో… రైలు ప్రయాణంలో ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చుని ప్రయాణించే ప్రయాణీకుల్లాగే సాగేది మా సంసారం! అతను… బాగా చదువు కున్న విద్యావంతుడే! కానీ, ఆ విద్య అతడికేం నేర్పిందో- బహుశా, అతడికే తెలీదను కుంటా! నిలువెల్లా పురుషాహంకారం, అణువణువునా ఆధిపత్య ధోరణి, ‘తానే గొప్ప, తన వైఖరే కరెక్టు’ అనే గర్వం మాత్రం మెండుగా నిండిపోయిన వ్యక్తి అతను! నేనూ చదువు కున్న దాన్నే… నా చదువూ, విజ్ఞానం, నా ఆలోచనా- వివేచనా జ్ఞానాలతో జీవితాన్ని అందంగా మలచుకోవాలనీ, ఆనందమయం-అనుభూతిమయం చేసుకోవాలనీ ఆశపడ్డ దాన్నే! కానీ, కానీ…”

          – చలికి వణికిపోతున్నట్లుగా భుజాలపైనున్న శాలువాని రెండుచేతుల్తోనూ పట్టు కుని ఒంటిచుట్టూ కప్పుకుంటూ రెండు క్షణాలు ఆగింది.

          ”ఊఁ… ఆపారేం? చెప్పండి…” సానుభూతిగా చూస్తూ, ఆసక్తిగా అడిగాడతను.

          ”…నా పట్ల అతని వైఖరీ, మాటతీరు చూస్తుంటే ఏనాడో నన్నావహించిన దౌర్భాగ్యం లా అన్పించేది. నాకంటూ ఓ అస్థిత్వం లేనట్లు, నాకసలు ఆత్మాభిమానమే ఉండనట్లు అతడు నన్ను హీనంగా చూస్తూ, నాపట్ల హేయంగా ప్రవర్తిస్తూంటే… భరించలేక, సహించ లేకపోయేదాన్ని. నా పుట్టింట్లో అమ్మానాన్న, చెల్లెళ్ళ మధ్య హాయిగా, అమాయకంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పెరిగిన నాకు- అతని దగ్గర ఏమాత్రం వ్యక్తిత్వం లేనిదానిలా, ఓ పనిమనిషిలా, ఓ కట్టుబానిసలా ఉండాల్సిరావడం నేను జీర్ణించుకోలేకపోయాను. అతని తో మాట్లాడాలంటే ఏదో భయం, అతని సమక్షంలో ఉండాలంటే ఇంకేదో తెలీని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ నన్ను ఆవరించేవి. అవమాన భారంతో రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు… అతడి నుంచి దూరంగా, చా..లా.. దూరంగా పారిపో వా..ల..న్పిం..చే…” గొంతుకి దుఃఖం అడ్డంపడడంతో మాట పెగలలేదామెకి.

          తన ముఖంలోని భావాలను దాచుకోవడానికి తల వంచుకోవడంతో- కంటి నుంచి చెక్కిళ్ళ మీదకి జారిన కన్నీటి చుక్కలు అక్కడ్నుంచి ఆమె ఎదమీదుగా కప్పుకున్న ఉలెన్‌ శాలువా పై పడి అట్నుంచి ముత్యాల్లా ఎగిరి నేలమీదకి దూకుతూ ఇంకిపోయాయి.

          ”ప్లీజ్‌… ప్లీజ్‌… కంట్రోల్‌ యువర్‌సెల్ఫ్‌!” అనునయంగా అన్నాడతను.

          ”సారీ… అయామ్‌ వెరీసారీ!” అంటూ తనను తాను సంభాళించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూంటే… కాసేపు మౌనంగా ఆమెవంకే చూస్తూ ఉండిపోయాడు.

          ఆ తర్వాత అడిగాడు –

          ”మీపట్ల అతడి వైఖరి ఎందుకలా ఉంది? వరకట్న సమస్యల్లాంటి కారణాలేమైనా ఉన్నాయా? అంటే నా ఉద్దేశ్యం… మీ పెళ్ళప్పుడు వాళ్ళడిగిన మొత్తంలో మీవాళ్ళేమైనా తక్కువచేశారా? లేక, అదనపు కట్నం కోసమేమైనా ఇలా వేధిస్తున్నాడా?”

          ”అహహఁ… అలాంటిదేమీ లేదు. విచిత్రమేమిటంటే… అసలు మాది పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు… ప్రేమ వివాహం! మాకు కట్నకానుకలిచ్చే స్తోమత లేదని తెలిసీ… పైసా కట్నం ఆశించకుండా నన్ను కోరిమరీ పెళ్ళి చేసుకున్నాడాయన!” అంది.

          అప్పటి వరకూ భర్త గురించి ‘అతడు’ అంటూ చెప్పుకొచ్చిన ఆమె- ఇప్పుడు ‘ఆయన’ అని అనడం గమనిస్తూనే- ”దాందేముందీ… ‘ప్రేమ మైకం’లో కట్నకానుకలు గుర్తొచ్చివుండవు. పెళ్ళయిన కొన్నాళ్ళకి- అందరి మగవాళ్ళలాగే భార్య పై ‘మోజు’ తగ్గి పోయి, ‘ఈజీ మనీ’ పై ఆసక్తి పెరిగివుండొచ్చుగా?!” అన్నాడు.

          ”లేదు, లేదు… ఇన్నాళ్ళ మా సంసారంలో నేను చూసిన అతడి వైఖరికీ, నా పట్ల అతడి ప్రవర్తనకీ కారణం- ఆర్థికపరమైనది మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను…” అని, రెండు క్షణాలాగి ఆ తర్వాత మళ్ళీ చెప్పసాగింది –

          ”పెళ్ళికి ముందు భార్యాభర్తల అనుబంధం గురించీ, వివాహబంధంలోని అనురాగం గురించీ ఎన్నో అందమైన కలలు, ఇంకెన్నో మధురమైన ఊహలు కన్నాను. కానీ, ఉహుఁ… అతడితో వైవాహిక జీవితం నాకు కొరుకుడు పడలేదు. అయినా నా సహనాన్ని చూసైనా అతడు మారతాడేమోనన్న ఆశతో అన్నీ భరించాను… సహిస్తూ గడిపాను. కానీ, అతనిలో మార్పు రాలేదు. మారలేదు సరికదా… రాన్రాను మరింత విపరీతంగా ప్రవర్తించసాగాడు, నా పరిస్థితి క్రమంగా దిగజారిపోసాగింది…”

          ”ఆత్మహత్య చేసుకోవాలని ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా అన్పించిందా..?” ఆమె పరిస్థితిని గమనించి, విషయాన్ని కాస్త ఏమార్చడానికన్నట్లుగా అడిగాడతను.

          అతడి వైపు చూస్తూ ఓ జీవం లేని నవ్వు నవ్విందామె –

          ”…చెప్పలేనన్ని సార్లు! కానీ, మాతృత్వం- అదే… ‘కన్నపేగు’ నన్ను కట్టిపడేసింది. మనసులో మిగిలిన చిట్టచివరి ఆశారేఖల్లాంటి నా ఇద్దరు పిల్లలూ, వారి సాన్నిధ్యంలో నా గుండెలోని అలజడినీ, మనసులోని ఆవేదననీ అణిచేసుకున్నాను. పెళ్ళికి ముందు అనంతమైన ప్రేమసాగరం లాంటి నా హృదయమంతా ‘భర్త’ అనే అందమైన మధుర భావనని నింపుకున్న నేను- పెళ్ళయ్యాక అతడితో సంసారం, అతడి సాహచర్యంలో నిరాశా, నిస్పృహల వడగాల్పులు వీచే ఎడారిలా మారాను. ‘భర్త’ అనే భావనని చెరిపేసి, మనసుని ఛిద్రం చేసుకోవాలని అనిపించిన ప్రతిసారీ… నా బిడ్డల చిట్టిచేతులే నన్ను ఆపేవి, నన్ను అడ్డుకునేవి. ఆ పిల్లల చిన్నిచేతుల్లోనే నా ముఖాన్ని దాచుకుని ఎన్నో సార్లు ఏడ్పుని దిగమింగుకునేదాన్ని!”

          ”మరి- అంతటి సహనంగా, ఓర్పుగా వున్న మీరు- ఇలాంటి పనికి ఎందుకు పూను కోవాల్సి వచ్చింది?” నెమ్మదిగా, నిదానంగానే అన్నా- చాలా స్పష్టంగా, సూటిగా అడిగాడ తను- ఆమె ఉద్వేగాన్ని కొంతైనా అదుపుచేసే ప్రయత్నంలో భాగంగా.

          దీర్ఘంగా నిట్టూరుస్తూ… పేలవంగా నవ్వేసి, చెప్పింది –

          ”లోకంలో ప్రతిదానికీ ఉన్నట్లే సహనానికీ, ఓర్పుకీ కూడా ఓ హద్దంటూ వుంటుం దండీ! ఆ పరిధి దాటిపోయింది నా విషయంలో! అయినా నేను ఆడదాన్ని కదా… కలలూ, ఆశలూ ఎప్పటికప్పుడు చిగురిస్తూనే వుంటాయి. నా మరణమైనా నా అస్థిత్వం తాలూకు ఉనికిని అతనికి తెలుపుతుందేమోననీ, నా ఆత్మహత్య అయినా అతడిలో మార్పుకి కారణమవు తుందేమోననీ… ఓ చిన్ని ఆశ! కానీ, నా ఆశ అడియాశేమోనని ఇప్పుడు అనిపిస్తోంది!”

          ”అంటే..?”

          ”ఉహుఁ… అతడిలో మార్పు రాదు, అతడు మారడు!” మనసులో స్థిరపడిన నిస్పృహ పూర్తిగా ముఖంలో ప్రతిఫలిస్తూండగా… పెదవి విరిచేస్తూ అంది.

          ”ఎందుకలా అనుకుంటున్నారు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?” కాస్త ఆసక్తిగా, ఆమె ముఖంలోకే నిశితంగా చూస్తూ అడిగాడతను.

          ”నేను అతడి భార్యను కనుక!” అని- తలతిప్పి అతడివైపు వింతగా చూస్తూ…

          ”అంత అమాయకంగా అడుగుతారేమిటీ? నేను కాకపోతే అతడి గురించి ఇంత ఖచ్చితంగా ఇంకెవరు చెప్పగలరండీ… మీరు మరీనూ!” అంటూ నవ్వేసింది. అసంకల్పితంగానే అయినా హృదయంలోంచి వెలికి వచ్చిన ఆ కొంచెం నవ్వుకే మనసు కాస్త తేలికపడ్డట్లయిందామెకి.

          ఆ తర్వాత, అతడు బదిలివ్వకుండా తనవంకే దీక్షగా చూడడం గమనించి –

          ”ఏమిటండీ- అలా చూస్తున్నారు?” అనడిగింది.

          ‘నవ్వుతూ వుంటే మీరు చాలా బావుంటారు!’ అన్న భావం పెదవి దాటకుండా అతి కష్టమ్మీద అదుపు చేసుకుని, ”నేనేమీ అమాయకంగా అడగలేదండీ… అనుభవపూర్వకం గానే అడిగాను!” అన్నాడతను.

          ”అంటే..?” అతడి వంక ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూసింది.

***

          ”ఒక వ్యక్తి వ్యక్తిత్వం, ప్రతిభా పాటవాలూ, మనోభావాలూ లోకం మొత్తం గుర్తించి గౌరవిస్తున్నా… అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న జీవితభాగస్వామి మాత్రం ఏ మాత్రం అర్థం చేసుకోని జీవితాలూ, అలాంటి సంసారాలూ ఉంటాయని మీకు తెలుసా?”

          ”అంటే..?”

          ”ఇందాక మీరే అన్నారుగా… భార్యగా మీ భర్త గురించి, అతడి వైఖరి గురించి మీ కంటే ఇంకెవరూ కరెక్టుగా చెప్పలేరని! మీరన్నది నిజమే కావొచ్చు కానీ- భర్త గురించి అస్సలు పట్టించుకోకుండా, అతడి భావాలు, అభిలాషల గురించి ఏ మాత్రం ఆలోచించ కుండా, అతడిని రవ్వంతైనా అర్థం చేసుకోకుండా ప్రతిరోజూ తమ మాటలతో, ప్రవర్తనతో, వైఖరితో భర్తని  వేధిస్తూ… ఇంటి వాతావరణాన్ని నరకప్రాయం చేస్తూ- భర్తని నిరంతరం ‘గృహహింస’కి గురిచేసే భార్యలు కూడా ఉంటారని మీకు తెలుసా?”

          ”అసలు- ఎవరి గురించండీ… మీరు మాట్లాడుతోంది?”

          ”నేను నా భార్య గురించి చెబ్తున్నాను…”

          ”ఓహ్‌… అలాగా! ఊఁ… చెప్పండి…” భుజాల మీదున్న శాలువాని ఓ సారి వదులు చేసి మళ్ళీ ఒంటిచుట్టూరా బిగుతుగా కప్పుకుంటూ ఆసక్తిగా అతడి ముఖంలోకి చూసిం దామె.

          ”మా అమ్మానాన్నలకి నేను ఒక్కగానొక్క కొడుకుని. చిన్నప్పట్నుంచీ నన్ను అల్లారుముద్దుగా పెంచారు. వాళ్ళిద్దరూ దిగువ తరగతి కుటుంబాల్లోంచి ఎంతో కష్టపడి చదువుకొని పైకొచ్చి ప్రభుత్వోద్యోగాలు పొందినవారే! తమ కష్టార్జితంతో కాస్తో కూస్తో ఆస్తిపాస్తులూ, సమాజంలో గౌరవప్రదమైన హోదా సంపాదించినవారే! వాళ్ళది కూడా ప్రేమ వివాహమే కాబట్టి నా ప్రేమని అర్థం చేసుకున్నారు. ఇద్దరివీ విశాల దృక్పథాలే కాబట్టి- నేను ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించానని తెలిశాక- అందరి తల్లిదండ్రుల్లా నా పెళ్ళికి అభ్యంతరం తెలపకుండా పెద్దమనసుతో ఆదర్శంగా ఆలోచించి, ఎటు వంటి కట్నకానుకలు కోరకుండా, ఇంకెలాంటి లాంఛనాలూ, ఆడంబరాలూ ఆశించకుండా మా పెళ్ళి జరిపించారు.”

          ”అంతా బాగానేవుంది కదా… ఇంకేమిటి సమస్య?” ఆశ్చర్యంగా అడిగింది.

          ”ఆగండాగండీ… అసలు సమస్య పెళ్ళయ్యాకే మొదలైంది?”

          ‘ఏమిటది?’ అన్నట్లుగా కుతూహలంగా ముందుకి వంగి అతడి ముఖంలోకి చూసింది.

          ”పెళ్ళికి ముందు నా భార్య ఓ మంచి కవయిత్రి! ఆమె రాసిన కవితలూ, గేయాలూ అప్పట్లో చాలా పత్రికల్లో అచ్చవు తుండేవి. చాలా పోటీల్లో తనకు బహుమతులు కూడా వచ్చాయి. అసలు… మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది కూడా అక్కడే!” అంటూ ఓ క్షణం ఆగాడతను.

          ”అరెఁ… భలే ఇంట్రెస్టింగ్‌గా వుందే! చెప్పండి!” అంది.

          ”చిన్నప్పట్నుంచి తెలుగు భాష, సాహిత్యాలంటే నాకు ఇష్టమైన వ్యాపకాలు కాబట్టి పత్రికల్లో అచ్చయ్యే ఆమె కవితలూ, గేయాలూ చదివి ఆమెని అభిమానించాను. ఓ సాహిత్య కార్యక్రమంలో ఆమెతో పరిచయమై… ఆ పరిచయం కాస్తా క్రమంగా స్నేహంగా, ప్రేమగా మారి- నా తల్లిదండ్రుల అంగీకారంతో మా పెళ్ళి కూడా జరిగిపోయింది…”

          ”మరి, సమస్యేమిటండీ..? పెళ్ళయ్యాక తన అత్తామామల్తో- అదే… మీ అమ్మా నాన్నతో తరచూ గొడవ పడేదా?”

          ”అహఁ… అలాంటిదేం లేదు!”

          ”మరి, ప్రాబ్లమేమిటీ?”

          ”పెళ్ళయిన తర్వాత తను రచనలు చేయటం మానేసింది!”

          ”ఎందుకూ..?”

          ”అదే… తెలీదు నాకు!”

          ”అంటే..?”

          ”అదే మరి! కారణమేంటో తెలీదు కానీ, పెళ్ళయ్యాక మాత్రం తను రాయటం మానే సింది. ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా చెప్పిచూశాను. అయినా లాభం లేదు. తనని ప్రోత్సహించడానికి, తను మళ్ళీ రాసేట్లుగా చేయడానికి నానా రకాలుగా ప్రయత్నిం చాను… అయినా ప్రయోజనం లేకపోయింది. ఇరవై నాలుగ్గంటలూ ఇంటిపనీ, వంటపనీ, పిల్లల పనుల్లో మునిగిపోవడమే కానీ- రోజులో… కాదు, కాదు- వారంలో కనీసం ఒక్క గంటైనా రాయటానికీ, రచనా వ్యాసంగానికీ కేటాయించదు. అప్పటికీ నా బలవంతం మీద పెన్నూ, ప్యాడూ చేతిలోకి తీసుకుని ఏదో రాసినట్లు నటిస్తుందే తప్ప- అదేంటో చూపించదు. రాసే ఆ కథో, కవితో ఎప్పటికీ, ఏ నాటికీ పూర్తికాదు. విసిగివేసారి పోయానను కోండి… ఆమె వైఖరితో!” అని, తనలోని అసహనాన్ని అదుపు చేసుకోవడానికన్నట్లుగా రెండు క్షణాలు ఆగాడు.

          ”అదేంటీ..? ఆశ్చర్యంగా వుంది… తను ఎందుకలా చేస్తున్నట్లు? కారణం ఏమై వుండొచ్చూ..?”

          ”బద్ధకం! అలవి కాని, అదుపు చేసుకోలేని, మానుకోలేని బద్ధకం!!”

          కసిగా, కోపంగా బదులిచ్చిన అతడి వంకే వింతగా చూస్తూ ”అసలు తీరిక వేళల్లో తను ఏంచేస్తుందీ?”

          ”ఏం చేస్తుందీ… ఒళ్ళు తెలీకుండా నిద్రపోతుంది!”

          ”బహుశా… ఇంటి పనుల్లో తను పూర్తిగా అలసిపోతోందేమో! ‘ఇల్లాలు’ అనే బాధ్యత నిర్వహించడంలో ఎంత కష్టం ఉంటుందో మగవాళ్ళకి తెలీదు. ఇలా మీరెప్పుడూ ఆలోచించలేదా?”

          ”అలా అంటారేమిటీ? అంతగా అలసిపోయే ఇంటిపనులేమున్నాయనీ?! అత్తా మామలకీ, మరదులకీ, మరదళ్ళకీ వంటావార్పూ చేసిపెట్టాల్సిందేమైనా వుందను కుంటున్నారా? మా అమ్మానాన్నకి నేను ఒక్కగానొక్క కొడుకుని. మా నాన్న ఇంకా సర్వీసు లోనే ఉన్నారు కాబట్టి అమ్మానాన్న విజయవాడలో వుంటారు. ఇంట్లో నేనూ, మా ఆవిడా, మా ఇద్దరు పిల్లలూ తప్ప ఇంకెవరూ లేరు. బంధువులు కూడా ఏడాదికొక్కసారైనా మా ఇంటికొచ్చే సందర్భాలు లేవు. బట్టలుతకడానికీ, అంట్లు తోమడానికీ పనిమనిషి ఎలాగూ వుందాయె! తనకీ, నాకూ, మా ఇద్దరు పిల్లలకీ ఇంత వండిపెట్టి- నన్ను ఆఫీసుకీ, పిల్లల్ని స్కూలుకీ పంపించేసరికి ఆవిడగారు అలసిసొలసి పోయి, అంతగా ఆదమరచి నిద్ర పోతుందనా మీ ఉద్దేశం? అయినా… నా కొలీగ్స్‌లో ఎంత మంది ఆడవాళ్ళు ఇంట్లో అత్తా మామలకీ, ఆడబిడ్డలకీ, మరదులకీ, భర్తకీ, పిల్లలకీ అన్నీ అమర్చిపెట్టి టైముకి ఆఫీసు కొచ్చి డ్యూటీలు చేసుకోవడం లేదూ? అలాంటి పరిస్థితి తనకి లేదు కదా?!”

          తన భార్య గురించి చెప్తూంటే… కసి, కోపం, అసహనాలు వ్యక్తమైన అతడిలో ఇప్పుడు కన్పిస్తున్న నిస్సహాయతని గమనిస్తూ నిదానంగా అడిగిందామె –

          ”మరి, తను ఎందుకలా చేస్తోందన్న ఆలోచన మీకు రాలేదా? ఆమెని అడగలేదా?”

          ”వచ్చింది… తనని అడిగాను కూడా!”

          ”ఏమని బదులిచ్చింది?”

          ”నిద్ర, బద్ధకం వదిలించుకోలేని తన బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి- తన వైఖరికి కారణం… తనపట్ల నా ప్రవర్తనే అని చెప్పింది!”

          ”అంటే..?” అర్థం కానట్లుగా చూసింది.

          ”తనని ఓ వ్యక్తిత్వం లేనిదానిలా, ఆత్మాభిమానం లేనిదానిగా నేను చూస్తున్నానట! తనకి నేనసలు విలువే ఇవ్వటం లేదట! పెళ్ళికి ముందు తన మీద నాకున్న ప్రేమ- పెళ్ళయ్యిం తర్వాత మాయమైపోయిందట! తనపట్ల నేను చాలా హీనంగా, హేయంగా బిహేవ్‌ చేస్తున్నానట! తన మీద నాకు మోజు తగ్గిపోయిందట! కథలూ, కవితలూ రాసే ఇతర ఆడవాళ్ళ పట్ల నేను మోజు పెంచుకుని తనని నిర్లక్ష్యం చేస్తున్నానట! వీటన్నిటికీ కారణం… పైసా కట్నం తీసుకురాకుండా తను నా జీవితంలోకి రావడమేనట!!”

          అతడి పట్ల అతడి భార్యకున్న ఆరోపణల్ని సిన్సియర్‌గా చెప్తున్న అతడి వంకే కొన్ని క్షణాల పాటు విస్తుబోయి చూస్తూండిపోయిందామె. తర్వాత మరికాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఓ తీర్మానానికి వచ్చినట్లు అతడి కళ్ళలోకే నిశితంగా చూస్తూ అడిగింది –

          ”మరి, అవన్నీ నిజమేనా?” అనడిగింది.

          వెంటనే బదులిచ్చాడతను –

          ”లేదు, లేదు… అలాంటిదేం లేదు. అవేవీ నిజాలు కావు. నేను తనని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానండీ! మా పెళ్ళయి ఇప్పటికి ఎనిమిదేళ్ళవుతోంది. ఇన్నేళ్ళలో తనంటే నా మనసులోని ప్రేమ వెయ్యింతలు పెరిగిందే తప్ప- రవ్వంత కూడా తగ్గింది లేదు. నా బాధల్లా… పెళ్ళికి ముందు తనలో ఏ ప్రత్యేకత చూసి ఆమెపట్ల నేను ఆకర్షితుడి నయ్యానో, ప్రేమించానో- పెళ్ళయ్యాక ఆమె దాన్ని పూర్తిగా మర్చిపోయింది, వదిలేసింది. తను ఓ రచయిత్రి అనీ, కవయిత్రి అనీ తన పై నాకు కలిగిన ఇష్టమే… నా ప్రేమకి పునాది! పెళ్ళయ్యాక ఆమె తనలోని ఆ ప్రత్యేకతనే కోల్పోతూంటే- బాధతో, ఆవేదనతో నయానా, భయానా చెప్పి చూశాను. ఆమెలోని రచయిత్రిని మేల్కొలపడానికి సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ఉపయోగించాను. ఆ ప్రయత్నంలో తనపట్ల నా ప్రవర్తన, వైఖరీ కాస్త తీవ్రంగానే ఉందేమో! అంతేకానీ, తన పై నాకు ప్రేమ తగ్గడం వల్ల మాత్రం కాదు…”

          నిజాయితీగా చెప్తున్నట్లు కుడిచేతి అరచేతిని ఎడమ వైపు ఛాతీ పై ఆన్చి మళ్ళీ  చెప్పాడు –

          ”ఇన్ని చేసినా ఆమెలోని రచయిత్రి మేల్కోలేదు, తన బద్ధకాన్ని వదిలించుకోలేదు సరికదా- పత్రికల్లో, సాహితీ సభల్లో కనిపించే ఏ రచయిత్రినో, కవయిత్రినో నేను కాస్త ప్రశంసించినా, మాటవరసకి వాళ్ళ రచన బాగుందని కొంచెం పొగిడినా… అస్సలు సహించేది కాదు. పైగా…” అని, ఓ క్షణం ఆగాడతను.

          ”ఆఁ… చెప్పండీ…” అందామె ఎగ్జయిటింగ్‌గా.

          ”తనపట్ల నా ప్రవర్తనకీ, వైఖరికీ- ఆమె మాటల్లో చెప్పాలంటే- నేను తనని అంతగా వేధించడానికి కారణం… తను పైసా కట్నం తీసుకురాకుండా నన్ను పెళ్ళిచేసుకోవడమే నట! తనలోని బద్ధకాన్నీ, నిద్రనాపుకోలేని తన లోపాన్నీ కవర్‌ చేసుకోవ డానికి ‘డిఫెన్స్‌’గా తనకు తాను ఆమె కల్పించుకున్న కారణమది!” దీర్ఘంగా నిట్టూరుస్తూ ముగించాడతను.

          ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.

          ఆమె నుంచి బదులు రాకపోయేసరికి అతడు కూడా అంతర్ముఖుడయ్యాడు.

          కొన్ని నిమిషాలపాటు వాళ్ళ మధ్య మౌనం రాజ్యమేలింది.

          ఆ తర్వాత ఉన్నట్లుండి అడిగిందామె –

          ”మీ ఆవిడ తన తప్పు తెలుసుకుని, తన బద్ధకాన్ని వదిలేసి ఓ మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్‌గా ప్రయత్నిస్తే, కృషి చేస్తే… మీరామెను మునుపటిలా ప్రేమించగలరా? ఆమె మనసు నొచ్చుకోకుండా మసలుకోగలరా?”

          అది వింటూనే అనాలోచితంగా నవ్వేశాడతను.

          ”నేనామెని ఎప్పుడు ప్రేమించలేదండీ? అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ప్రేమిస్తూ నే వున్నాను. పెళ్ళికి ముందు ఆమెలో ఏం చూసి నాలో ప్రేమ కలిగిందో- పెళ్ళయ్యాక అది ఆమెలో కనుమరుగైంది కాబట్టే నా ప్రేమ బయటకి వ్యక్తం కాకుండా నాలోనే ఇంకి పోయింది. మీరన్నది జరిగితే- నిజంగా నాకు అంతకంటే ఆనందం కలిగించే విషయం మరోటుండదు. కానీ, ప్చ్‌… అది జరిగే పని కాదు, ఆమెలో మార్పు రాదు…” నిర్లిప్తంగా తల దించుకుంటూ తనలో తానే బాధగా అన్నాడు.

          ”ఎందుకలా అనుకుంటున్నారు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?” కాస్త ఆసక్తిగా, అతడి ముఖంలోకే నిశితంగా చూస్తూ అడిగిందామె.

          ”నేను ఆమె భర్తను కనుక!” అని- తలెత్తి ఆమెవైపు వింతగా చూస్తూ…

          ”అంత అమాయకంగా అడుగుతారేమిటీ… నేను కాకపోతే ఆమె గురించి ఇంత ఖచ్చితంగా ఇంకెవరు చెప్పగలరండీ? …మీరు మరీనూ!” అంటూ నవ్వేశాడతను. అసంకల్పితంగానే అయినా హృదయంలోంచి వెలికివచ్చిన ఆ కాస్త నవ్వుకే మనసు కొంచెం తేలికపడినట్లయిందతడికి.

          ”ఏవిటీ… ఇందాక నేను మావారి గురించి చెప్తూ అన్నమాటలకి రిటార్టా ఇది?” అంది.

          ”అహఁ… అలాంటిదేం కాదండీ! నేను నిజంగానే అన్నాను!” అని చెప్పాడు.

          ఆ తర్వాత, ఆమె బదులివ్వకుండా తన వంకే దీక్షగా చూడడం గమనించి –

          ”ఏమిటండీ- అలా చూస్తున్నారు?” అనడిగాడు.

          ‘మీరలా నవ్వుతూవుంటే మీవంకే చూస్తూ ఉండాలనిపిస్తోంది!’ అన్న భావం పెదవి దాటకుండా అతికష్టమ్మీద నిగ్రహించుకుంటూ, ”నేనేమీ అమాయకంగా అడగలేదండీ… అనుభవపూర్వకంగానే అడిగాను!” అంది.

          ”ఇది ఇందాక మా ఆవిడ గురించి చెప్పబోతూ నేనన్న మాటలకి మీ రిటార్టా?” అన్నాడు.

          ” లేదు, లేదు… నేను నిజాయితీగానే అడిగాను!” అందామె.

          ”అసలు… ఓ పురుషుడు స్త్రీలో ఏ అంశాన్ని చూసి ఆమెను ప్రేమిస్తాడో- దాన్ని ఆ స్త్రీ కోల్పోకుండా కాపాడుకుంటూ వున్నంతకాలం ఆమెపట్ల అతడికున్న ప్రేమ రోజు రోజుకీ పెరుగుతూనే వుంటుంది తప్ప- రవ్వంత కూడా చెక్కుచెదరదు. పైగా, ఆమెకి అతడు దాసోహమైపోతాడంటాను నేను. మీరేమంటారు… అవునా? కాదా?” అన్నాడతను- ప్రశాంతమైన నవ్వుతో ఆమెనే చూస్తూ.

          ఓ నిముషం తర్వాత బదులిచ్చిందామె- ”మీరు చెప్పింది పురుషుడి పట్ల వాస్తవమో, కాదో నాకు తెలీదు కానీ… స్త్రీల పట్ల మాత్రం అక్షరాలా వాస్తవం!”

          ”అంటే..?” ఆమె వంక ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశాడు.

***

          సరిగ్గా వారం రోజుల తర్వాత…

          ”ఏమాలోచించారు..?”

          ”మీరు..?”

          “వారం రోజుల క్రితం మీ మాటలు వినేంత వరకూ నేను కూడా ఓ విషయం గమనించలేదు. నిజమే… మీకు మీ భార్య పట్ల ఎలాంటి ఆరోపణలున్నాయో- సరిగ్గా నా భర్తకి కూడా నా పట్ల అలాంటి ఆరోపణలే ఉన్నాయి. పెళ్ళికి ముందు నేనొక మంచి సింగర్ ని! నిజానికి నా పాటలు వినే ఆయన నన్ను ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. పెళ్ళయ్యాక పాడటం పూర్తిగా మానేశాను. పాడమంటూ ఎన్నోసార్లు నన్నడిగేవాడు, చాలా సార్లు రిక్వెస్ట్ కూడా చేసేవాడు. నేనే పెద్దగా పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. పాటలు పాడటం ఓ హాబీగానే ఫీలయ్యాను తప్ప- మా ఇద్దరి మధ్యా ఇంతటి అగాధం ఏర్పడటా నికి అదే కారణమౌతుందని ఏమాత్రం ఊహించలేదు నేను. తప్పు నాదేనేమోననిపిస్తోం ది. మరి, మీ విషయం? “

          “ఔను… మీ భర్త పట్ల మీకున్న ఆరోపణలే సరిగ్గా నా పట్ల నా భార్యకి కూడా ఉన్నాయి. పెళ్ళయ్యాక ఓ స్త్రీకి సహజంగా ఏర్పడే మానసికపరమైన బరువూ, బాధ్యతల కారణంగా నా భార్య రచనావ్యాసంగాన్ని కాస్త నిర్లక్ష్యం చేసివుండవచ్చు, అదే క్రమంగా అలవాటై రచనను పూర్తిగా వదిలేసివుండవచ్చు! అది అర్థం చేసుకోకుండా కవితలూ, కాకరకాయలూ రాయమంటూ నేను ఒత్తిడి చేయకుండా ఉండాల్సింది! నా ఒత్తిడి కొంచెం తీవ్రంగా ఉండేసరికి తన మనసు గాయపడి, తనకి తెలీకుండానే పంతం కొద్దీ రచనలు చేయడం మానేసిందేమో… తప్పు నాదేనేమోనని ఇప్పుడనిపిస్తోంది.”

          “అయితే… ఏం చేద్దామంటారు?”

          “మీరే చెప్పండి!”

          “ఏముందీ… ఆలోచించుకోవడానికి వారం రోజుల వ్యవధి తీసుకున్నట్లే- మన తప్పుల్ని సరిదిద్దుకుని, మన జీవితభాగస్వాముల పట్ల సానుకూలంగా ప్రవర్తించి, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఓ ఆర్నెల్లపాటు సమయం తీసుకుని, సిన్సియర్ గా ప్రయత్నిద్దాం. అప్పటికీ వాళ్ళు మారకపోతే…”

          “ఆ… అప్పటికీ వాళ్ళలో మార్పు రాకపోతే?”

          రెండు క్షణాల తర్వాత చెప్పిందామె –

          “వాళ్ళ నుంచి విడిపోయి, మనం కలసి జీవితం సాగిద్దాం!”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.