లేఖాస్త్రం కథలు-1

అపరాధిని

– కోసూరి ఉమాభారతి

 

ప్రియమైన అమ్మక్కా,

          నీతో మాట్లాడి నాలుగేళ్ళవుతుంది. ఇన్నాళ్ళూ ఇలా తటస్థంగా ఉన్నందుకు కూడా నేను నిజంగా అపరాధినే. ఏమైనా, నాకు నీవు తప్ప ఎవరూ లేరన్నది నిజం. అందుకే  ధైర్యాన్ని కూడగట్టుకుని నా సమస్యలు, సంజాయిషీలు నీ ముందుంచుతున్నాను.  నువ్వూహించని పని ఒకటి చేయబోతున్నాను. నా జీవితాన్ని మార్చబోతున్నాను అమ్మక్కా..

          ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కూడా నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకి  నీవే కారణమయ్యావు. ఐదేళ్ళప్పుడు అమ్మ బంధం, అమ్మతో అనుబంధం నన్ను వీడి పోయినప్పుడు, నాన్న నన్ను పట్టించుకోకుండా బాధ్యతల నుండి తప్పించుకోసాగి నప్పుడు, చనిపోయిన మా అమ్మకి తోబుట్టువైన నీవు నన్ను ప్రేమగా చేరదీసావు. నా చేత ‘అమ్మక్కా’ అని పిలిపించుకుని మురిసిపోయావు. అమ్మలేని లోటు తీర్చావు. నీ లాలనలో సేద తీరాను. తండ్రిలా ఆదరించిన పెదనాన్నకి చేరువయ్యాను.

          కానీ నాకు పన్నెండేళ్ళప్పుడు నీవు, పెదనాన్న నన్ను విడిచి అమెరికా వెళ్ళి పోయారు. అప్పుడు నా గురించి ఆలోచించలేదే? నీవు నన్నలా వదిలిపోయినప్పుడు …నేనెంత బాధపడ్డానో నీవు ఊహించగలవా?

          పదివేల మైళ్ళ దూరం నుండి నన్ను పలకరించే నీ ఫొన్ కాల్స్, అప్పుడప్పుడు నీవు పంపే కానుకలు నీ ప్రేమకి ప్రత్యమ్నాయం కాలేకపోయాయి. నన్ను సమాధానపరచలేక పోయాయి. అందుకే నీ మీద ప్రేమ ఉన్నా కోపం పెరిగింది. నేనంటే ఇష్టం లేనట్టు నన్ను వదిలి వెళ్ళిపొయేవాళ్ళని ఎలా ప్రేమించగలను చెప్పు. చేసేది లేక నా కోపాన్ని దిగమింగుకున్నాను.

          నాన్న ఉన్నా లేనట్టే కనుక… నీవు వెళ్ళిపోయాక నాకు ఆలంబన లేదు.  అడ్డూదాపూ లేదు.. ఆకాశమే హద్దయింది. తరువాత పదేళ్ళ పాటు యధేచ్చగా  యిష్టాను సారం నడుచుకున్నాను. అందరూ నాకు అతిశయం అన్నారు. అణుకువ లేదన్నారు. నన్ను ‘ఆడపులి’ అన్నారు. ‘ఆటంబాంబ్’ అన్నారు. కానైతే స్కూల్లో, కాలేజీలో ఆడ, మగ కూడా నా వెంటే తిరిగేవారు. నా చిరునవ్వు కోసం, నా స్నేహం కోసం పాకులాడేవారు.  మధ్యతరగతి అమ్మాయినే అయినా … నా రంగు, రూపు మూలంగా అందరినీ ఆకట్టుకుని అవసరాలకి వాడుకునేదాన్ని.. స్నేహితులని  కనుసైగలతో శాసించాను. మధుపానం, ధూమపానం కూడా చేసాను.. 

          మొత్తానికి ఇరవైరెండేళ్ళప్పుడు…. మళ్ళీ నీవే కదా అమ్మక్కా… కల్పించుకుని వద్దంటున్నా వినకుండా…’డాక్టర్, మంచివాడు, మనవాడు’ అంటూ పరంధామతో నా పెళ్ళి జరగడానికి కారణమయ్యావు. నాకిష్టంలేని వాడితో ఎలా జీవించాలి? నీవు నాకు మేలు చేసాననే అనుకుంటావు. కానీ అమ్మక్కా.. నిజానికి నీవు నా కోసం చేసినదేదీ నాకు పనికిరాలేదు. అమ్మలేని కొరత తీరుస్తావనుకుంటే నట్టేట వదిలేశావు. కట్నమిచ్చి మరీ ఇష్టం లేని పెళ్ళి చేసావు. నా బాగు కోసమే అంటూ …పూనుకుని మమ్మల్ని అమెరికా పిలిపించావు. మీకు దగ్గరిలోనే  కాపురం పెట్టించావు. 

          అయినా ఏమయింది? నిస్సారమైన మా కాపురాన్ని చూసి నిరాశ చెందావు.  చాల దన్నట్టు పరంధామకి కార్ ఆక్సిడెంటయ్యి కదలిక కోల్పోయి వీల్-చైర్ కి పరిమితమ య్యాడు. అతని పరిస్థితి ఎప్పటికి మెరుగయ్యేనో తెలియదు. అతనికి మెడికల్ బిల్లిం గులో ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కల్పించావు. నా పై జాలితో నీకు తెలిసిన ఓ సర్జన్, అవినాష్ శర్మవద్ద నన్ను ఉద్యోగానికి పెట్టావు.

          అమ్మక్కా… నీ ఆ జాలే నాకు శాపమయ్యిందని తెలుసా? ఇష్టం లేని వివాహం, ప్రేమ కరువైన దాంపత్యం, సరిపెట్టుకోలేని మనస్థత్వంతో బతుకుతున్న నన్ను, నా బలహీనతనలని గుర్తించిన ఆ సర్జన్ నన్ను సులువుగా లోబర్చుకున్నాడు. తన భార్య నుండి విడాకలు తీసుకున్నానని చెప్పాడు. నేనూ అతని పట్ల ఆకర్షితురాలనయ్యాను.  అక్రమ సంబంధం కొనసాగిస్తూ పాపభీతి లేకుండా అతడి ప్రేమలో ఓలలాడాను.యేడాది పాటు నన్ను మురిపించి, మరిపించి పరంధామతో విడాకులు తీసుకునేంత వరకు అతడు నిద్రపోలేదు. నన్ను నిద్ర పోనివ్వలేదు. 

          అమ్మా, నాన్న, నీవు నన్ను ఎలా వదిలేశారో… అచ్ఛంగా అలాగే నేను పరంధామని వదిలేశాను. అది తెలిసేగా అప్పట్లో ఓ రోజు షాపింగ్ మాల్లో నీవు నన్ను నిలదీస్తే కిమ్మన కుండా ముఖం చాటేసాను! అప్పటికే నా కోసం అవినాష్ తీసుకున్న అపార్ట్మెంట్ లోకి మారాను. 

          ఆ తరువాత కొన్నాళ్ళకి, క్రమేపీ అవినాష్ లో ప్రేమకి బదులు నా పై అనుమానం, అలసత్వం కనబడసాగాయి. నన్ను ఓ బానిసలా చూడసాగాడు. నాకు విలువ లేనట్టుగా ప్రవర్తించసాగాడు. అప్పటికే చరిత్రహీనురాలను అవడంతో అతన్ని నిలదీయలేక పోయాను. ఎవరితోనూ చెప్పుకోనూ లేక క్రుంగిపోయాను. నా వ్యక్తిత్వాన్ని, స్వాభిమానన్ని దెబ్బతీసాడు ఆ  మృగాడు. నా హీరో అనుకున్న అవినాష్ నాకు నరకం చూపిస్తున్నాడు.  శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. 

          గర్భవతినైన నన్ను ప్రలోభ పెట్టి, అబార్షన్ చేయించాడు. దాంతో నా ఓపిక నశించింది. మనసు పగతో రగిలింది. నాకంటూ ఏమీ మిగలలేదు. ఎందుకు పుట్టానో, ఎవరి కోసం ఉండాలో తెలియదు. 

          అమ్మక్కా, ఇవాళ నా ఇరవైయేడవ పుట్టినరోజు. సాయంత్రం ఆరయ్యింది. అవినాష్ డిన్నర్ ఆర్డర్ చేసాడు. ఇద్దరికీ ఇష్టమైన వైన్, కేక్ కూడా డెలివర్ చేయించాడు..  కాక  తనకిష్టమైన బాదాంకీర్  చేయమన్నాడు.  

          అతనికి ఇష్టమైన పింక్ షిఫాన్ చీర, స్లీవ్లెస్ బ్లౌజ్ కూడా సింగారించాను. అమ్మక్కా, ఈ భూమ్మీద ఇది నా ఆఖరి రోజు. నా బాధలని, క్షోభలని, వ్యధలని…క్లినిక్ నుండి తస్కరించిన పాయిజన్ తో రంగరించి బాదాంకీర్ లో కలిపి అవినాష్ తో కలిసి సేవించా లని నా ప్లాన్. అంతిమ యాత్రకి నేను సిద్దంగా ఉన్నాను. నాకు తోడుగా అవినాష్ కూడా రావాల్సిందే కదా!

          ఇక ఉంటాను అమ్మక్కా. ఈ లెటర్ రేపు పొద్దుట నీకు అందేలా స్పెషల్ డెలివరీ షెడ్యూల్ చేసాను. అప్పటికి అంతా ముగిసిపోతుంది. ఈ హత్యా, ఆత్మహత్యలకి బాధ్యత వహిస్తూ, నా గురించిన ఏ సమాచారమైనా దగ్గరి బంధువైన నీకే తెలియజేయమని కూడా రాసే పెట్టాను. కనుక నీకే పోలీస్ ఫోన్ చేస్తారు. బాధపడకు అమ్మక్కా. నన్ను క్షమించు.

నీ ప్రియమైన

 వెన్నెల

***

          వెన్నెల ఆకస్మిక మరణం, ఆమె నుండి అందిన  ఉత్తరంలోని సారాంశం… శారదని విపరీతంగా కృంగదీశాయి. వారం రోజులుగా నిద్రాహారాలు మాని, మాటా పలుకు లేకుం డా నిర్లిప్తంగా ఉండిపోయిన ఆమెని…. తమకి యేళ్ళగా తెలిసిన డాక్టర్. వాణి మీనన్ వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్ళారు ఆమె భర్త రామ్, కొడుకు సాయి. విషయం వివరించి, చనిపోయేముందు వెన్నెల… శారదకి రాసిన ఉత్తరాన్ని కూడా  డాక్టర్ చేతిలో పెట్టారు. 

***

          ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండు మార్లు చదివింది, న్యూయార్క్ సైకియాట్రిస్ట్, డాక్టర్ వాణి. కౌన్సెలింగ్ రూములో తన ఎదురుగా కూర్చుని మౌనంగా రోదిస్తున్న స్నేహితురాలు శారదని చూసి బాధపడింది డాక్టరమ్మ. 

          “చూడు మిత్రమా… వెన్నెల ఇలా లోకాన్ని వీడిపోవడం నిజంగానే చాలా శోచ నీయం. ఆ అమ్మాయి గురించి అప్పుడప్పుడు నీవు చెప్పగా విన్న విషయాలు ఇప్పుడు నా మనసులోనూ మెదులుతున్నాయి. చావుపుట్టుకలు మన చేతుల్లో లేవు కదా శారదా. నీవు చాలా ఒత్తిడికి లోనయ్యావని నీ భర్త వారం క్రిందటే నాకు చెప్పాడు. వెన్నెల అంత్య క్రియలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు నీవు కాస్త నిమ్మళంగా ఉండాలి.” అంటూ డాక్టర్ వాణి ..తన  సీటు నుండి లేచి వెళ్ళి .. శారద పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.

          కళ్ళు తుడుచుకుని తలెత్తి చూసి, కొద్ధి  క్షణాలకి ..నోరు విప్పింది శారద. “నా ఈ ఆవేదనకి .. నీకు తెలియని ఇతర కారణాలు ఉన్నాయి వాణి. సమర్ధించలేని, సమర్ధించు కోలేని ఆ విషయాలు నన్ను నిద్రపోనివ్వడం లేదు. కొన్ని సున్నితమైన విషయాలని నా వెన్నెల నుండి దాచి చాలా తప్పు చేసాను.” అంటూ దుఃఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నించింది శారద. 

          “ఏడవకు శారదా ..  మీ మధ్య తల్లీ-కూతుళ్ళ బంధం ఇంతలా బలపడినప్పుడు… ఆ అమ్మాయిని దత్తత తీసుకుని మీతోపాటు అమెరికాకి తెచ్చేయవలసింది కదా! అప్పటికే నీవు ఏడేళ్ళుగా వెన్నెలని సాకుతున్నావు కూడా. ఆ ఆలోచన రాలేదా?” అడిగిం ది వాణి.

          బేలగా చూసింది శారద.  “అయ్యో… అక్కడే .. ఆ మా ప్రయత్నాలు బెడిసికొట్టాయి వాణి. వెన్నెలని దత్తత తీసుకుంటామని అడగటానికి, గంపెడంత ఆశతో మా బావగారిని కలిశాము. మాతో పాటు అమెరికా తీసుకుని వెళ్ళి వెన్నెలకి బంగారు భవిష్యత్తునిస్తామని చెప్పాము. 

          కానైతే, వెన్నెలకి మాకూ మధ్యన ఉన్న బంధాన్ని తెగ్గొట్టేందుకే కంకణం కట్టు కున్నఆయన…మా ప్రతిపాదన విని ఉగ్రరూపం దాల్చాడు.

          మా అభ్యర్ధనని ఒక అవమానంగా భావించాడు ఆ మహానుభావుడు. ససేమిరా అన్నాడు… “పెద్దమ్మవని, ఆడపిల్లని సరీగ్గా పెంచుతావని, ఇన్నాళ్ళూ నీ వద్ద ఉండ నిచ్చాను. ఇప్పుడు చేతికందిన పిల్లని నాకు కాకుండా ఎగరేసుకుపోవాలని చూస్తారా మీరు. తండ్రిని నేను ఉన్నానుగా. నాకు పనులు చేసిపెడుతూ నా కూతురిగా ఇక్కడే ఉంటుంది. ఇలాటి ప్రతిపాదనలతో నా వద్దకు రాకండి.” అంటూ మమ్మల్ని అవమాన పరచి పంపేశాడు.” అంటూ కళ్ళు తుడుచుకుంది శారద.

          ఆశ్చర్యపోవడం డాక్టరమ్మ వంతయ్యింది. “నిజమా? మరి వెన్నెల ఏమనలేదా?  తండ్రిని ఎదిరించ లేకపోయిందా?” అడిగింది వాణి..

          “ఖర్మ. వాణి… నా ఖర్మ. జరిగిన విషయం వెన్నెలకి అసలు తెలియకూడదని… లేకుంటే పర్యవాసానం విపరీతంగా ఉంటుందని మమ్మల్ని బెదిరించాడాయన.  చేసేది లేక… కృంగిపోయిన మనసులతో  ఇల్లు చేరాము.

          ఆ తరువాత ఆ పసిదానికి నేను ఒక మనసు లేని మరబొమ్మలా అనిపించానే తప్ప … అమ్మలా నన్ను చూడలేకపోయింది. నన్నెలా అర్ధం చేసుకోవాలో తెలియక అల్లాడి పోయుంటుంది నా బంగారు తల్లి. ఆ ఎడబాటు నుండి బయటపడేందుకే… దానికి ఇరవైయొక్కేళ్ళు నిండగానే, మావారికి దగ్గరి బంధువు, సంస్కారవంతుడు అయిన పరంధామకి, వెన్నెలతో పెళ్ళి చేసాను. నా బంగారుతల్లి నా కళ్లెదుట ఉంటుందని ఆశపడ్డాను … కానీ నా ప్రయత్నాలన్నీ శాపాలుగా మారి దాన్ని కాటేస్తాయని అనుకో లేదు.” అంటూ వాపోయింది శారద.

          “మరో విషయం తెలుసా? తనకి పదిలక్షలు కానుకగా ఇస్తేనే తన కూతురి పెళ్ళి  మాటలు సాగనిస్తానని, పరంధామతో వెన్నెల వివాహం జరగనిస్తానని … తండ్రిగా తన అనుమతికి మా వద్ద లంచం కూడా తీసుకున్నాడు మా బావగారు.” మళ్ళీ భోరుమంది శారద.

          ముఖం తుడుచుకోమన్నట్టుగా శారద భుజం పై తట్టి, టిష్యు అందించి తిరిగి వెళ్ళి  తన సీటులో కూర్చుంది డాక్టర్  వాణి.

          “చూడు శారదా, నిజానికి ఇటు వంటి సమస్యలని నా ప్రాక్టీసులో చూస్తూనే ఉంటాను శారదా. బలహీనపడిన మానసిక స్థితి వల్లే… ఇలా హత్యలు, ఆత్మహత్యలు, ఘోరమైన నేరాలు జరుగుతుంటాయి. యువతలో ఈ పర్యవసానం కాస్త ఎక్కువగానే కనబడుతుంది. 

          వెన్నెల విషయానికి వస్తే …. మీ  ప్రాపకంలో చక్కని వ్యక్తిత్వం ఉన్న యువతిగా ఎదగవలసిన ఆ అమ్మాయి లేత మనసు భావోద్వేగాలకు అతిగాలోనయి, కొంత  సమతుల్యతని కోల్పోయింది. అందువల్లే వెన్నెల నిబద్దత లేని ఆలోచనలతో పోరాడిం ది, అలాగే వ్యవహరించింది కూడా.

          అందుకే కని పెంచే తల్లితండ్రులైనా, పెంపకం బాధ్యతలు చేపట్టే వారైనా, పిల్లల గురించి, వారి మనస్థత్వాల గురించి చాలా సూక్ష్మంగా ఆలోచించి, వ్యవహరించాలి.   ప్రేమ, ఆత్మీయతలతో పాటు బాధ్యతాయుతమైన పెంపకం అవసరం. అప్పుడే కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడే పౌరులుగా … పిల్లలు ఎదుగ గలుగుతారు. మన వెన్నెల జీవితం…  నేటి సమాజంలోని తల్లితండ్రులకి, యువతకి కూడా సందేశాత్మకం అవుతుంది శారదా.” అంటూ బాధగా నిట్టూర్చింది డాక్టర్ వాణి.            

*****

Please follow and like us:

3 thoughts on “లేఖాస్త్రం కథలు-1 – అపరాధిని”

  1. ఉమా భారతి గారి రచన అపరాధిని ‘ కథ కాదు వాస్తవం అన్నట్టు గా అనిపించింది. చాలా బాగా రాశారు. వర్తమాన సమాజానికి బుద్ది చెప్పగల రచనల. రచయిత్రికి హృయపూర్వకంగా అభినందనలు

    1. మిక్కిలి ధన్యవాదాలు సుగుణ గారు..

    2. సుగుణ గారు .. మీ స్పందనకి మిక్కిలి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.