పండుటాకు పలవరింత

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– డా. సమ్మెట విజయ

వసంతం వచ్చేసింది
పూలవనం పానుపు వేసింది
గుత్తుల గుత్తుల పూలని చూసి
గతం తాలూకు గమ్మత్తులను
మనసు పదే పదే పలవరిస్తుంది
జ్ఞాపకాల హోరు నాలో నేనే
మాట్లాడుకునేలా చేయసాగాయి
చెవులు వినిపించక కంటి చూపు ఆనక
జీవన అవసాన దశలో ఉన్నాను నేను
కర్ర సాయం లేనిదే అడుగు ముందుకు పడటం లేదు
ఎప్పుడు పిలుపు వస్తుందా అని
ఆకాశం వేపు పదే పదే చూస్తున్న నేను
ఒకప్పుడు ఆకాశంలో విహరించిన అందాల పావురాన్నే
కాలు నేల మీద నిలపక వయ్యారంగా
నడకలు వేసిన నాట్య మయూరాన్నే
నలుగురినీ కలుపుకుని మాటల గలగలల సెలయేరునీ నేనే
పద్మరేకుల కళ్ళు పెదాల పై చెరగని నవ్వు
వెను తిరిగి చూస్తూ వెళ్ళే వారే అంతా
నేను కదలి వస్తే కనకాంబరాలు
పలకరిస్తే సుగంధ పరిమళాల మల్లెల గుభాళింపు
అంటూ నా మీద వర్ణనల వర్షం కురిపించేవారు
నాతో ఎంత పెద్ద సమూహం ..
నీకెప్పుడూ మనుషులు కావాలి
నీ చుట్టూ పెద్ద బలగమే నంటూ నవ్వే వారంతా
ఇప్పుడా నవ్వుల పువ్వులేవి
మాటల మకరందాలేవి
మనుషుల ఆనవాలేవి…
నన్నో మూలగదిలో పడేసి
నా మానాన నన్ను వదిలేసి
తప్పనిసరి పరిస్థితులలో ఓ ముద్ద పడేసి
నా దగ్గరకు ఎవరొచ్చినా
ఎక్కువ సమయం వెచ్చించనివ్వక
ముసలి తనానికి లేని రోగాలంటగట్టి
మాస్కులు తొడిగి చేతులు కడిగి
నన్నో అంటరానిదాన్ని చేసేసారు..
వీళ్ళ ఒళ్ళంతా రుద్ది రుద్ది కడిగి స్నానాలు పోసాను
తిప్పిచ్చి తిప్పిచ్చి తంటాలు పెట్టినా
వెంటపడి నోట్లో ముద్దలు పెట్టాను
చేయి కడిగాక తుడుచుకునే కొంగు ఆనాడు ఆనందమైంది
ఈనాడు బతుకుపోరాటంలో పనికి రాని గుడ్డపీలికైంది
నేడు ..నేనొక ఒంటరి పక్షిని ..
ఒక్క పలకరింపు కోసం పడిగాపులు కాసే ఎండమావిని
ఏ చల్లని సమీరం నా దరికి రాదు
వాడిన జీవితపు పండుటాకును కదా
ఎప్పుడు రాలిపోతుందా అని ఎదురు చూసే వారే అంతా
ఎన్ని ప్రేమలు ఎంత మమకారం
నేనల్లుకున్న బంధనాల భావనలన్నీ బూటకాలై
నన్ను వెక్కిరిస్తున్నాయి..
అవసరం కోసం ఏర్పరచుకున్న ప్లాస్టిక్ ప్రేమలు
రంగు విహీనమై రేకలు ఊడిన కాడలయ్యాయి
ఇంతచేసి బతుకు మీద ఆశే
మనిషి పుట్టుక కదా …
అందరి పై ప్రేమా ఆరాటం చావదే
ఏ పలకరింపుకోసమో గుండె పలవరింత
ఏదేదో ఎవరెవరికో చెప్పాలనే ఆరాటమే
వినేవారెవరైనా ఉన్నారా
వింటున్నారా … సమాధానం శూన్యం
దీపం కొడిగట్టుతుంది
వెలుగు తాలుకు రేకలు ముసిమి వయసు పెదాల పై
చెరగని ముద్రలై పరుచుకున్నాయి
బంధాలు అనుబంధాలు కంటి పొరల మధ్య మసకబారుతున్నాయి
ఎవరితో మాట్లాడుతుందో అనుకుని తొంగి చూసాక తెలిసింది
ఆమె మరణంతో మాట్లాడుతుందని ..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.