నడక దారిలో-40

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్షల తర్వాత బాబు చని పోయాడు. ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజిలో చేరి హార్డిల్ రేసులా ఒడిదుడుకులతో బియ్యీడీ పుర్తిచేసి, రెండు స్కూల్స్ లో తాత్కాలికంగా పనిచేసి, ఎట్టకేలకు ఆర్టీసి హై స్కూల్ లో చేరాను. తెలుగుదేశం ప్రభుత్వంలో వీర్రాజుగారు బిజీ తట్టుకోలేక స్వచ్ఛంద విరమణ చేసారు. కొంత అనారోగ్యం పాలు అయ్యారు. తర్వాత—

***

          నిమ్స్ లో వీర్రాజు గారికి గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ వరుసగా చేయటం మొదలుపెట్టారు. బీపీ క్రమక్రమంగా కంట్రోల్ లోకి వచ్చింది. ఆంజియోగ్రామ్ చేసారు. రెండు నాళాల్లో 60-70 శాతం వరకూ మూసుకుపోయాయన్నారు. “ఆంజియో ప్లాష్టీ చేయాలి” అని నిమ్స్ లో అప్పటి కార్డియాలజిష్ట్ సోమరాజుగారు బొమ్మలు వేసి మరీ వివరించారు. అప్పటికి హాస్పిటల్ లో చేరి వారం రోజులు అయ్యింది. పగలంతా నేను ఉంటున్నాను. అప్పట్లో కాంటీన్ గానీ ,పేషెంట్లకు ఆహారం ఇవ్వటం అనేది లేదు. నేనే రోజూనాకూ, ఆయనకు భోజనం ఇంటి దగ్గర చేసి తీసుకు వచ్చేదాన్ని. పల్లవి సాయం త్రం వచ్చినప్పుడు ఫ్లాస్క్ లో పాలు , జావా ఇటువంటివి చేసి తీసుకు వచ్చేది. రాత్రి మాత్రం నాళేశ్వరం శంకరం, ఆశారాజు, వారాల కృష్ణమూర్తిగారు, మా పెద్దమరిది రామకృష్ణ ఒక్కొక్క రోజు వంతులు వేసుకుని ఉండేవారు. వారందరూ ఆ వారం రోజులూ స్వంత సోదరులుగా సహకరించారు.
         
          సాయంత్రం పూట శివారెడ్డిగారో, గోపీగారో, కందుకూరి శ్రీరాములుగారో ఇలా కవి మిత్రులు అందరూ వచ్చి కబుర్లు చెప్పేవారు. కానీ వీర్రాజు గారికి మనసునిండా భయం నిండిపోయి ఎంతగా డైవర్ట్ చేయబోయినా దిగులు ముఖంతో వుండేవారు.
 
          ఇంకా ఆంజీయో ప్లాష్టీ ఆపరేషన్ అనే సరికి సుమారుగా పాతిక ముప్పై వేల వరకూ అవుతుందనీ డబ్బు గురించి ఆలోచన మొదలైంది. అందరూ జీతాలు మీద బతికే వారే. అందుకని “డబ్బు త్వరలో సర్దుబాటు చేసుకుని అప్పుడు మళ్ళా చేరి చేసుకోవచ్చా” అని డాక్టర్ ని అడిగారు. జాగ్రత్తగా మందులు వేసుకుని, కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారం తినకుండా డైట్ ప్లాన్ ఇచ్చారు. ఇక సరేనని డిస్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. కాని థ్రెడ్ మీల్, ఈకో వంటి కొన్ని టెస్ట్ లు వచ్చి చేయించుకోమన్నారు.
 
          హాస్పిటల్ లో టెస్టులకు వాళ్ళు చెప్పిన  సమయానికి వెళ్ళేవాళ్ళం. మాతోపాటు వారాల కృష్ణమూర్తిగారు, ఆశారాజుగారూ కూడా వచ్చేవారు. తీరా టెస్ట్ చేయబోయేసరికి వీర్రాజుగారికి భయంతో బీపీ పెరిగి పోవటం,టెస్ట్ చేయకుండానే పంపించేయటం రెండు మూడు సార్లు జరిగింది. ఆఖరుకు ఎలా అయితేనేం టెస్టులు జరిగాయి.
 
          సెకెండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది అని కృష్ణమూర్తిగారు, ఆశారాజుగారూ ఆంధ్రమహిళాసభ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన మరింత భయపెట్టి “ఆపరేషన్ జరిగినా మళ్ళా మళ్ళా బ్లాక్స్ వస్తూనే వుంటాయి “అనేసరికి అప్పటికే ఒకసారి ఆంజియోప్లాస్టీ చేయించుకున్న కృష్ణమూర్తిగారి ముఖం నెత్తురుచుక్క లేనట్లుగా పాలి పోయింది. ముగ్గురూ ముఖం నిండా భయం పూసుకొని ఇంటికి వచ్చారు.
 
          ఇంకా ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బుకావాలి. చేయించుకున్నా మళ్ళా బ్లాక్స్ వస్తాయంటే ఎలా తర్జన భర్జనలు జరిగాయి.
 
          అంతకు నెలరోజుల ముందే నా స్నేహితురాలు ఉమారాణి చౌకలో కొనటానికి స్థలం ఎవరి ద్వారానో తీసుకుంటుంటే మేము కూడా అక్కడ కొనటానికి పదివేలు ఇచ్చాము . అది రద్దు చేసుకుని డబ్బు తిరిగి తీసుకున్నాం. అయితే వీర్రాజు గారు చాలా భయపడు తున్నారు. ఏం చెయ్యాలో అర్థంకాలేదు.
 
          మా క్రింద అపార్ట్మెంట్ లో ఉంటున్న సంగీతం టీచరు యజ్ణప్రభ గారు వారి కుటుంబమిత్రులు హోమియో & అల్లోపతి డాక్టర్ రమణారావు దగ్గరకు పంపారు. రమణ్రావు గారు రిపోర్టులు చూసి ” ఏం పరవాలేదు రాజుగారూ. నేను మందు ఇస్తాను. అంతా తగ్గిపోతుంది. ఆరునెలల్లో ఎవరెస్ట్ ఎక్కేయగలరు” అంటూ సరదాగా మాట్లాడే సరికి వీర్రాజుగారి ముఖం తేటపడింది.హోమియో మందు వాడుతూనే నిమ్స్ డాక్టర్ చెప్పిన డైట్ ప్లానుతో ఇంగ్లీష్ మందులు కూడా వాడటం మొదలెట్టారు. క్రమంగా యథా విధిగా తన కార్యక్రమాలు కొనసాగించారు.
 
          1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత చరమదశగా చెప్ప వచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. ఈ కాలంలో కూడా ఎన్టీఆర్ నాలుగు సినిమాలలో నటించడం విశేషం. తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 లో పెళ్ళి చేసుకోవడం ఆయన వ్యక్తిగత జీవితం లోని కీలకమైన మలుపు. అప్పటి నుండి  నీడలు కమ్ముకున్నట్లుగా పార్టీ, కుటుంబం అంతా భావించారు.
 
          1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఎన్‌టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదే రోజున ఆంధ్రప్రదేశ్‌ లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు పై సంతకం చేయటం విశేషం. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు 1995 కుట్రదారుల నుండి పతనం కాకుండా తెలుగుదేశం పార్టీని కాపాడినవాడుగా పరిగణించబడటం  జరిగింది. తదనం తరం నాటకీయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు.
 
          ఆ రోజుల్లోనే దూరదర్శన్ లో రామానందసాగర్ రామాయణాన్ని ఒక  మంత్ర జాలంలా ప్రదర్శించి జనాన్ని టీవీలకు కట్టిపడేసాడు. అది పూర్తికాగానే బి.ఆర్ చోప్రా మరింత భారీగా గొప్ప నాణ్యతతో మహాభారతం మంత్రజాలంలా జల్లి జనాన్ని  ఆకర్షిం చేలా తీసాడు. ఆదివారం నేను ఎమ్మెస్సీ క్లాసులకు వెళ్ళే హడావుడిలోనే కొంతసేపు చూసి వెళ్ళిపోయేదాన్ని.
 
          టీవీ టవర్ ఉన్న గుట్ట ఎక్కి దిగి మూసారాం బాగ్ దగ్గర యూనివర్సిటీ కి వెళ్ళే బస్ ఎక్కే దాన్ని.
 
          ఎనభైల నుండి తెలుగు సాహిత్యంలో విరసంతో అనుబంధంగా ఒక స్త్రీ చైతన్యంతో అంతకు ముందు ఎవరూ తీసుకోని ప్రతీకలతో కవిత్వం రావటం మొదలైంది. అంతకు ముందే ఓల్గా తన రచనలతో కొంత సంచలనం, కొంత ఆలోచనా కల్పించటం వలన సాహిత్య రంగం ఉలికి పడింది. ఆంధ్రజ్యోతి ఆదివారం పేపరులో చేరాశీర్షిక ” చేరాతలు “లో రాస్తున్న వ్యాసాలు స్త్రీవాదంకి వెన్నుదన్నుగా ఉండటమే కాక అందులో ప్రస్తావిం చిన కవులూ, కవయిత్రులూ తమ కవిత్వానికి తాతాచారి ముద్ర పడినట్లు పరమానంద భరితులయ్యేవారు.
 
          అప్పట్లోనే జయప్రభ, కొండవీటి సత్యవతి కలిసి “లోహిత” అనే పేరిట ఒక స్త్రీవాద బులిటెన్ కొంతకాలం తీసుకు వచ్చారు. మరి ఎందుచేతనో అది ఆగిపోయింది. తర్వాత కొండవీటి సత్యవతి ” భూమిక” స్త్రీవాద మాసపత్రిక ప్రారంభించింది. భూమిక ఆఫీస్ బాగ్ లింగంపల్లిలో మా స్కూల్ కి దగ్గరగా ఉండటం వలన భూమిలో పనిచేస్తున్న సజయ స్కూల్ కి వచ్చి భూమిక కోసం నేను రాసిన రచనలు తీసుకొని వెళ్ళేది.
 
          ఓల్గా సంపాదకత్వంలో స్త్రీవాద కవయిత్రుల కవితలు ” నీలిమేఘాలు” సంకలనం గా వచ్చాయి. ఆ సంకలనం తెలుగు కవిత్వ రంగాన్ని ఒక్కసారిగా కుదుపు కుదిపేసింది. కవులూ, రచయితలూ కూడా సంఘీభావంగా రచనలు రాస్తే మరికొందరు ఆ కవితల్ని తీవ్రంగా విమర్శిస్తూ రాయటం జరిగింది.
 
          అప్పట్నుంచి కొందరు కవిమిత్రులు మీ కవిత నీలిమేఘాలులో ఉందా అని అడుగుతూనే ఉన్నారు. అప్పటికే నా కవితాసంపుటాలు మూడు వచ్చినా బహుశా నా కవితలు అతివాద కవితలు కానందుకు తీసుకొని ఉండరులే అనుకుని మరి పట్టించుకో లేదు. అదిగాక నాకు స్కూల్ పనేకాక ఎమ్మెస్సీ చదువు, ఇంట్లో తరుచూ వచ్చిపోయే అతిథులు , ఇవికాక సాహిత్యపఠనం, రచనలూ వీటన్నిటితో తలమునకలుగా సతమతమయ్యే దాన్ని. అప్పట్లో సాహిత్య సమావేశాలకు కూడా ఎక్కువగా వెళ్ళటానికి కుదిరేది కాదు.
 
          నా పరీక్షలు సాధారణంగా స్కూల్ ఆఖరిపనిదినమో, లేదా స్కూల్ తెరిచిన రోజుకో వచ్చేది. నన్ను ఇబ్బంది పెట్టటానికి క్యాజువల్ లీవులు ఉన్నాసరే ఎర్న్డ్ లీవులు కట్ చేయటం చేసేవారు. అయినాసరే నేను వాదనలకు దిగి పరీక్ష మూడ్ పాడుజేసుకోవట మెందుకని మౌనంగా ఊరుకునేదాన్ని. అయినా మొదటి ఏడాది ఒక పేపర్ ఫెయిల్ అయ్యాను.
 
          స్కూల్లో సైన్స్ టీచర్ హెచ్చెమ్ అయ్యాక ఆవిడ పోష్టులో  లెక్కల టీచర్ కి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. ఆమెకి ఇంకా ఒక్క ఏడాదిలో రిటైర్ అవుతారు హమ్మయ్య ఇంక నాకు ప్రమోషన్ కి లైన్ క్లియర్ అయినట్లే అనుకున్నాను.
 
          మా పెద్దాడబడుచు రెండో కూతురు సంగీత అత్తగారింట్లో తగువు పెట్టుకొని వచ్చే సిందట. మా పెదనాన్న కొడుకు లక్ష్మణరావుగారు వీర్రాజుగారికి పెద్ద ఉత్తరం రాస్తూ ఆ అమ్మాయి రాసిన కొన్ని ఉత్తరాల్ని జత చేసి పంపించాడు. ఆ అమ్మాయి తన తండ్రిని కూడా అగౌరవంగా తన ఉత్తరాల్లో పేర్కొంటూ రాయటం ఆశ్చర్యం అనిపించింది. కళ్ళసమస్య ఉన్నా పెద్ద ఉద్యోగంలో కొనసాగుతూ వీళ్ళ అభివృద్ధికి కారణమైన తండ్రినే గౌరవించని సంగీత తన అత్తగారింట్లో వాళ్ళని ఏ మాత్రం గౌరవించి ఉంటుందా అనుకు న్నాము.
 
          ” ఆ పిల్లని పెంచిన విధానమే బాగులేదు. మీ యింటికి పంపుతాను. సమస్య ఏమిటో కనుక్కోండి” అని చివరకు రాసి, సంగీతని మా యింటికి పంపారు.
 
          వీర్రాజు గారు ‘ సంగీతతో మాట్లాడి విషయం తెలుసుకో ‘ అని నా మీద బాధ్యత పెట్టేసి ఆయన తప్పుకున్నారు.
 
          మామూలుగా మాట్లాడుతూనే ఏవో సినిమాలు చూస్తూ సందర్భంగా యథాలాపంగా అడిగినట్లుగా అడిగాను.
 
          సంగీత టాలెంట్స్ వాళ్ళెవరూ పట్టించుకుని పొగడటం లేదట. అది విని నవ్వు వచ్చింది. ఆ పిల్ల వున్నప్పుడే వీర్రాజుగారి మిత్రుడు చాలా కాలం తర్వాత వచ్చారు. ఆయన మంచి గాయకులు. ఆయన తన పాట వినిపించటమే కాకుండా, “సుభద్రగారూ మీ పాట ఎప్పుడో మీ పెళ్ళయిన కొత్తలో విన్నాను. పాడండి” అని అడిగాడు. నేను పాటలు పాడి చాలా కాలమే అయ్యింది. అయినా గొంతు సవరించుకుని పాట పాడాను.
 
          ఆ తర్వాత  “నీకు పాటలు వచ్చునని నాకు అసలు తెలియదు అత్తా ” అంది సంగీత.
 
          అప్పుడు “నువ్వు ఇరవై ఏళ్ళుగా వచ్చి వెళ్తున్నావు. కానీ నీకే నేను సంగీతం నేర్చు కున్నానని తెలియదు. ఎవరూ పాడమని అడగరు. మన అభిరుచులు  ఆగిపోకూడదను కుంటే ఇలా ఎప్పుడో ఒకప్పుడు తడుముకుంటుండాలి. నీలో నువ్వు సమయం దొరికి నప్పుడల్లా పాడుకోవటమో, బొమ్మలు వేసుకోవటమో చేయొచ్చు కదా! వాళ్ళకి అది తెలియక పోవచ్చును. ఎప్పుడో ఒకప్పుడు గుర్తిస్తారు”అన్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు.
 
          సంగీత ఆడపడుచు వీళ్ళ ఎదురు అపార్ట్మెంట్ లోనే నివసిస్తుంది. ఆమె ఉద్యోగిని కావటాన వచ్చేసరికి ఆరు దాటుతుందిట. ఆమె పిల్లలు స్కూల్ నుంచి సరాసరి సంగీతా వాళ్ళయింటికి వస్తారట. వాళ్ళకి తినేందుకు అక్కడే ఏమైనాఇస్తే తిని, పాలు తాగి ఆడు కుంటారుట. అది సంగీతకు నచ్చలేదు. ‘ఆడపడుచు పిల్లలకు ఆ సేవలన్నీ నేనెందు కు చేయాలి ‘ అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది.
 
          రెండేళ్ళకోసారి కుటుంబ సహితంగా నెలరోజులపాటు మా యింటికి వచ్చేసేవారు. నేను నిండునెలలతో అందరికీ వంటలేకాక బట్టలు కుడుతున్నా ఏనాడూ వాళ్ళమ్మ సాయం చేయలేదు. దానికి తోడూ ఆర్థిక పరిస్థితి బాగు లేకపోయినా బట్టలు పెట్టి మర్యాదలు చేసేదాన్ని. అప్పుడు నేను కూడా ‘వీళ్ళందరికీ నేనెందుకు చాకిరీ చేయాలని అనుకొనుంటే…’ అవన్నీ వీళ్ళకు గుర్తురాలేదా అనుకున్నాను. సంగీతకు డైరెక్ట్ గా కాకపోయినా సున్నితంగా చెప్పాను.
 
          రెండు నెలలు మాయింట్లోనే ఉండి మధ్యలో ఓ రెండు రోజులు మా మరిది ఇంటికి వెళ్ళి ఆ తర్వాత భువనేశ్వర్ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఏమయిందో తెలియదు కానీ ఢిల్లీ వెళ్ళిపోయింది. అయితే వేరింటి కాపురం పెట్టారని  విన్నాను. తర్వాత సంగీత కూడా టీచర్ గా ఉద్యోగంలో చేరింది. 
 
          మళ్ళీ నేను రొటీన్ పనిలో పడ్డాను.
*****
Please follow and like us:

One thought on “నడక దారిలో(భాగం-40)”

  1. నలభై భాగాలు చదివాను. సరళమైన భాషలో ఆసక్తికరంగా సాగింది. రాయ వలసింది ఇంకా ఎంతో ఉందని తెలుస్తోంది. ఎలా ముగుస్తుందో అనే ఉత్కంఠతతో చదివిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.