నేను

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– ములుగు లక్ష్మీ మైథిలి

నేను లేని ఇల్లు లేదు
నేను లేక ఈ జగతి లేదు
ప్రతి ఇంట్లో
అనుబంధాల పందిరి వేస్తాను
మన ఆడపడుచుల పొత్తిళ్ళ నుండి
చెత్త కుప్పలోకి విసిరేసే
కర్కశత్వానికి సవాల్ ను నేను

కొలతలు తప్ప
మమతలు తెలియని మృగాళ్ళు
ఉన్న జనారణ్యంలో
సమానతలంటునే
సమాధి చేస్తారు
ఎన్నో మైళ్ళ పురోగమనంతో
అలుపెరగని పయనాన్ని
బాధ్యతల బరువును మోస్తూ
ఏ నిశిరాత్రికో నిదుర పోతాను

మళ్ళీ ఉదయసింధూరాన్ని
నుదుటి పై దిద్దుకుని
పాదాలకు
పరుగు లేపనం అద్దుకుంటాను
అవును ఆడపిల్లనే
నేనెప్పుడూ
చావు అంచుల మీదే ఉంటాను

నా గెలుపుకు అడ్డొస్తే
పసితనపు పిడికిలి
మళ్ళీ బిగుసుకుంటుంది
ఇకనైనా… నన్ను
ఆత్మ విశ్వాసంతో ఎదగనివ్వండి
మీ ఆలోచనను, ఆచరణను
మీ వ్యవస్థను మార్చుకోండి
నన్ను నన్నుగా బతకనివ్వండి!

*****

Please follow and like us:

One thought on “నేను (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)”

  1. చేయి తిరిగిన రచయిత్రి. ‘కొలతలు తప్ప, మమతలు తెలియని’..అద్భుత ప్రయోగం. చిన్నదైన చిక్కని కవిత. మైథిలి గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.