
కాదేదీ కథకనర్హం-16
కార్యేషు మంత్రి
-డి.కామేశ్వరి
ఇంటర్వల్ లో బయటికి వెళ్ళి రెండు కూల్ డ్రింకులు తెస్తున్న రమేష్ తాము కూర్చున్న సీటు వెనకే వున్న ప్రభావతిని చూసి షాక్ తగిలినవాడిలా ఒక క్షణం వుండిపోయాడు. ప్రభావతి సుమతి బెస్ట్ ఫ్రెండ్. ఇందాకటి నించి తనని, జయని చూసే వుంటుంది. ఆమె తనవైపే చూడడం గుర్తించి చకచక వెళ్ళి సీటులో కూర్చుండిపోయాడు. ముఖంలో గాభరా, చెమటలు, అతని ఉత్సాహం అంతా అరక్షణంలో దిగిపోయింది.
జయ తనమీద వాలి మాట్లాడుతుంటే, ఇందాకటి వరకు అతి మధురంగా వినిపించింది ఇప్పుడు …..అక్కడ నించి ఎలా తప్పించుకోడం అన్నట్టు ముళ్ళ మీద కూర్చున్నాడు. ఏదో పాతసినిమా ఎవరూ వుండరు అని వస్తే ఈవిడగారు ఇక్కడ అందులో తన వెనక సీటులో దాపరించాలా. ఇందాకటి నుంచి తమ ఇద్దరి మధ్య జరిగిందంతా గమనించే వుంటుంది. ఇంటికి వెళ్ళాక సుమతితో చెప్పకుండా వుండదు. ఆలోచిస్తే అతనికి గాభరా అన్పించింది. సినిమా చూడలేకపోయాడు. ఆఖరికి ఇంకా సినిమా అరగంట వుండగానే తలనొప్పి అని వంకపెట్టి లేచి పోయాడు.
జయని వాళ్ళింటి రోడ్డు మీద డ్రాప్ చేసి ఇల్లు చేరాడు. సుమతి ముఖం చూడాలంటే సిగ్గుగా అన్పించింది. గత ఏడెనిమిది నెలలుగా జయతో తిరుగుతున్నా ఏనాడు అన్పించనిది ఈరోజు ఏదో తప్పు చేసినవాడిలా ముఖం తప్పించుకున్నాడు. ప్రభావతి ఈరాత్రి ఫోను చెయ్యకపోయినా రేపు తప్పక చేస్తుంది. సుమతి అడిగితె ఏం చెప్పాలి? రాత్రంతా అదే ఆలోచన అయి కంటి మీద కునుకు పట్టలేదు అతనికి.
ఈ టెన్షన్ లో గత మూడు రోజులుగా జయ దగ్గరకే వెళ్ళాలనిపించలేదు. సుమతి వారం రోజులయినా ఏ ప్రసక్తి తీసుకురాకపోవడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ముందు జాగ్రత్తగా వుండాలని నిర్ణయించుకున్నాడు. సుమతి ఏం అడగలేదు కానీ ఎందుకో కాస్త ముభావంగా వుందనిపించింది. ముఖంలో కాస్త కళ తగ్గిందనిపించింది.
ఓరోజు రాత్రి భోజనం చేస్తూ -” ఏం అలా వున్నావు . ఒంట్లో బాగోలేదా?” అడిగాడు భార్య ముఖం చూస్తూ. సుమతి తలెత్తి “ఏంలేదే బాగానే వున్నాను” అంది కాస్త నవ్వి. “ఏమో డల్ గా అనిపిస్తే…. అందుకే అడిగాను” అని కాసేపాగి – ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్య? మీ ఫ్రెండు కూడా వస్తున్నట్టు లేదే….” కూపీ లాగాడు.
“ఆ ఎందుకు రావడం లేదు. మూడు నాలుగు రోజుల క్రితం వచ్చి వెళ్ళింది….ఫోనూ చేస్తుంది” సుమతి భర్త ముఖంలోకి చూసింది. గతుక్కుమన్నాడు రమేష్, వచ్చిందంటే చెప్పకుండా వుంటుందా, చెప్పిందేమో. అందుకే సుమతి కాస్త ముభావంగా వున్నట్టుంది. తగ్గిన టెన్షన్ మళ్ళీ మొదలైంది అతనిలో. భార్య ఇంక ఏం అనకపోవడంతో ఇంకేం ప్రశ్నలు వెయ్యలేదు. భార్యకి తెల్సిందా లేదా అన్నది అతనికి ఓ పెద్ద సస్పెన్సు అయి కూచుంది. తెలిస్తే ఎందుకడగకుండా ఊరుకుంది అన్నది ఇంకా పెద్ద సస్పెన్సు! అసలు సంగతి ఎలా రాబట్టడం అన్నది ఒక సమస్య అయింది.
ఆరోజు ప్రభావతి వస్తూనే స్నేహితురాలి మీద విరుచుకుపడింది. “నీ కసలు బుద్ధుందా?” అంటూ దండయాత్రకి నాందిగా మొదలుపెట్టింది. “నీ మొగుడనేవాడు అసలు ఏం చేస్తున్నాడో నీకసలు తెలుస్తుందా….” తెల్లపోయి చూస్తున్న సుమతిని “ఏమిటా వెర్రి చూపు . నిన్ను వెర్రిదాన్ని చేసి నీ మొగుడు నీ వెనక ఏం ఆటలు ఆడుతున్నాడో తెలుసా?” ఆవేశంగా అంది.
సుమతి ప్రభావతి ఆవేశానికి కారణం అర్ధం అయి చిన్నగా నవ్వింది. “ఏం చేస్తున్నారు…… అమ్మాయిలతో తిరుగుతున్నారు అవునా….” ఈసారి తెల్లపోవడం ప్రభావతి వంతయింది. ‘అంటే తెలిసీ ఊరుకుంటున్నావా….. నీకిదంతా తెలుసా” నమ్మలేనట్లడిగింది.
‘అంతా అంటే ఏంటో నాకు తెలియదు. కానీ, ఏదో వుందని తెలియనంత వెర్రిదాన్ని కాదులే….ఆ మధ్య అయన ఆఫీసులో పనిచేసే టైపిస్టు అమ్మాయి సరళ కూరల మార్కెట్ లో కన్పించింది….పాపం ఆ అమ్మాయితో నాతో ఏదేదో చెప్పాలనుకుని చెబితే ఏం అనుకుంటానని, చెప్పకుండా వుండలేక సతమతమయింది.
“ఏం చెప్పింది?” కుతూహలంగా చూసింది ప్రభావతి. “మేడమ్ ….మిమ్మల్ని….. మీతో పెద్ద పరచయం లేదు… మిమ్మల్ని ఆ పద్మావతి గారింట్లో పేరంటంలో చూశాను. మా బాస్ మిసెస్ అని తెలుసు అంటూ పరిచయం చేసుకుంది. నేను మీకు ఎలా చెప్పాలో, చెప్పడం తప్పో ఒప్పో . అందువల్ల మా బాస్ కోపం ఎదుర్కోవాలని తెల్సినా తోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే, అందులో మహాలక్ష్మీలా వున్న మిమ్మల్ని చూసి ఆగలేక చెప్తున్నాను – మీ వారిని జాగ్రత్త పెట్టుకోండి …. పూర్తిగా చేజారిపోకముందే మేల్కోండి…… నేనూ ఒకరికి భార్యని. నా భర్తే ఇలా చేస్తే అన్న ఆలోచనలో ఇందంతా చెప్తున్నాను. అయన జయలక్ష్మీ అనే అమ్మాయితో చాలా క్లోజ్ గా….చాలా దూరం వెళ్తున్నారు ఇద్దరూ. అంటూ చెప్పలేక చెప్పింది పాపం ఆ అమ్మాయి.”
‘చెప్పాక కూడా అలా చూస్తూ ఊరుకున్నావా….. అసలా అమ్మాయి ఎవరట? నీకేమన్నా తెలుసా. ఇవాళ సినిమా హాలని కూడా లేకుండా వాళ్ళ ఇకఇకలు పకపకలు. ఒకరి మీద ఒకరు వాలి పోవడాలు…..చ ఛ. ఏదో కాలేజీ కుర్రాడిలా…… నలబై ఏళ్ళు వచ్చి ఇద్దరు పిల్లల తండ్రి అయి వుండి, ఎంత లేకిగా…… ఛీ… ఛీ….” ప్రభావతి జుగుప్సగా అంది. “అదేవర్తే …..ఇలా పెళ్ళయిన వాడని తెలీదా దానికీ?”
“జయలక్ష్మీట. అందంగానే వుంటుంది గాబోలు. ఎమ్.కామ్ . చదివిందిట. ఈయనకి పర్సనల్ అసిస్టెంటట. పెళ్ళి కాలేదు. పాతికేళ్ళు పరువం గల అమ్మాయి కనపడగానే ఈయనలో సెకండ్ యవ్వనం విజ్రుంభించేసి వుంటుంది. ఈయనగారి తళుకు బెళుకులు పెద్ద హోదా, కారు గట్రా చూసి ఆ అమ్మాయి ఈయన మాటలకి బోల్తా పడినట్లుంది.”
“ఇన్ని తెలిసి కూడా….. నిలేసి ముఖం కాల్చకుండా ఊరుకున్నావా, పైగా పెద్ద పతివ్రతలా మొగుడి గారి ప్రేమాయణం గురించి కూల్ గా చెప్తున్నావా…’ ప్రభావతిలో కోపం కంటే ఆశ్చర్యం కనపడింది.
సుమతి అదోలా నవ్వింది. “ఏం అని అడగమంటావు, అడిగాననుకో, ముందు లేదని బుకాయిస్తారు. వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు విని నన్నే అనుమానిస్తున్నావా అంటారు. ఇంకా గట్టిగా నిలేస్తే తెగించి నా ఇష్టం అంటారనుకో….. అప్పుడు దానికి నా దగ్గిరేం జవాబుంది…..’ సుమతి ప్రభావతి వంక సూటిగా చూస్తూ అంది జవాబు చెప్పమన్నట్టుగా.
“నా ఇష్టం అంటే చెల్లిపోతుందా…..పెళ్ళాం ఉన్నవాడు తనిష్టం వచ్చినట్టు తిరుగుతుంటే చచ్చినట్టు నోరు మూసుకోవాలా…..అలా పడి వుండడానికి నీవేం పాతకాలం ఆడదానివా ….అలా తిరిగే హక్కు నీకేం లేదని చెప్పలేవా?”
“ప్రభా…… పాతకాలం ఆడదయినా కొత్తకాలం ఆడదయినా…..ఓ మొగుడు ఓ మగమహారాజు నా ఇష్టం అంటే ….భార్యకి రెండే త్రోవలున్నాయి……ఒకటి – వేరే దారి లేకపోతే చచ్చినట్టు సహించి పడుండటం, రెండు – తెగించి మొగుడ్ని వదిలిపోవడం – ఈ రెండింటిలో ఏది చెయ్యమంటావు నన్ను?”
“మొగుడ్ని వదిలిపోవడం నీకేం ఖర్మ…..ఉండి అతనికి పట్టిన తీట వదిలించాలిగానీ’ కోపంగా అంది ప్రభావతి.
‘అదే…..ఎలా అంటావు….?”
“ఎలాగేమిటి, నీ తిరుగుళ్ళు చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వాలి?”
“ఇస్తాను, అరుస్తాను, అలుగుతాను, తిడతాను – ఏడుస్తాను …..వీటివల్ల నేనేధన్నా సాధించగలుగుతానంటావా- నేను తిట్టినకొద్దీ ఆయనకి నాపట్ల కోపం, ద్వేషం పెరుగుతుంది. అటుపక్క మోజు మరింత పెరుగుతుంది. పెళ్ళాం రాక్షసిలాగ, ప్రియురాలు ప్రేమమూర్తిలా మరింతగా అటు ఆకర్షితులౌతారు. ఇంకా నేను అరుస్తూ వుంటే, ఉంటే వుండు పోతే పో అనచ్చు. అప్పుడు నా సంగతి ఏమిటి? నాకున్న ఈ డిగ్రీతో ఈ పిల్లలని పోషించి, చదువులు చెప్పించి ప్రయోజకులని చేయగలనా- అటు మావాళ్ళు నన్నేకాక నా పిల్లలని ఆదుకునేంత గొప్పవాళ్ళెం కాదు. ఇన్నాళ్ళూ నేను, పిల్లలూ అందరం ఓ స్థాయికి అలవాటు పడ్డాం. పిల్లలు ఈ సుఖాలకి దూరమై, నేను తెచ్చే వెయ్యో, రెండు వేలతో సరిపెట్టుకుని బతకడానికి ఒప్పుకుంటారా? తండ్రిని దూరం చేసినందుకు ఇంకాస్త పెద్దయ్యాక నన్ను క్షమిస్తారా. ఎదిగీ ఎదగని ఈ పిల్లలని పెట్టుకుని నేను ఒంటరిగా బతకగలనా? నాకా ధైర్యం వుందా? పోనీ పిల్లలని వదిలిపోతే నేను వుండగలనా? ఆవేశంలో పెట్టె సర్దుకు పోవడానికి, మిషను కుట్టి పిల్లలని పోషించడానికి ఇది సినిమానా! ఒకసారి గనక నేను ఇల్లు వదిలి బతకలేక మళ్ళీ వస్తే మరింత లోకువవనా?”
‘అంటే, నీ భర్త ఆఫీసరుహోదా , బంగళా, కారు కోసం అన్నీ తెలిసి కూడా సహించి పడుంటావా….అంతకి దిగజారి సర్దుకు బతుకుతానంటావా”
“ప్రభా ! కోపం తెచ్చుకోకుండా ఆలోచించు. భార్యగా ఆయన ఈ ప్రవర్తన నాకు బాధ కలిగించడం లేదనా నీ ఉద్దేశం. కట్టుకున్న మొగుడు ఇంకో ఆడదాని ఆకర్షణలో పడితే ఆ అవమానం, హింస నాకు లేదంటావా? ఈ పిల్లలు గనక లేకపోతే ఇల్లు కదలడానికి అరక్షణం ఆలోచించేదాన్ని కాదేమో. ప్రభ ఆయన్ని ఎదిరించి బతికే ధైర్యం, అవకాశం నాకు లేనప్పుడు బయటపడి ఆయనచేత మాటలు పడేకంటే తెలియన్నట్లు ఊరుకుంటే ఆయన గిల్టీ ఫీలింగు ఆయన్ని తినేస్తుంది. ఈ పైపై వ్యామోహాలు ఎన్నాళ్ళు ఉంటాయి అంటావు? కొత్త బొమ్మ చేతికొస్తే ముందు రోజు విడవకుండా ఆడతారు పిల్లలు. మర్నాటి నుంచి దాని ముఖం చూడరు. ఈ మగాళ్ళు అంతే, అందనంతవరకే ఆరాటం, ఈ దొంగచాటు వ్యవహారాల థ్రిల్ అంతా అందేవరకూ….’
“ఏమిటి నీ వాదన? ఆయనగారు మోజు తీరి ఎలాగో మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు. నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుందంటావా……ఛీ ….ఛీ కాస్తో కూస్తో చదువుకున్న మనం కూడా అలా ఆలోచించ బట్టే మన గతి ఇలా వుంది. పెద్ద సతీసుమతివి. వెళ్ళు మొగుడ్ని ఆవిడ ఇంటికి తీసికెళ్ళి అప్పగించు….’ ప్రభావతి కోపంగా లేచిపోయింది.
‘దాని ఇంటికి ఎందుకు, ఆవిడనే ఇక్కడికి రమ్మందామునుకుంటున్నాను.” చిలిపిగా నవ్వింది. “ఈ దొంగచాటు ఎందుకు…..ఇంటికే తెచ్చుకుంటే సరిపోతుంది అని చెపుతాను”
ప్రభావతి నోరెళ్ళ బెట్టింది. సుమతి నవ్వుతూ ఆ నోరు మూసి –” నాకేం మతి పోలేదే….ఇప్పుడింక నీ నోరు విప్పకు. ఇంకో వారం తరువాత మాట్లాడుదువుగాని నేను చేసింది చూశాక” అంది.
* * *
‘చూడండి ….మీ పేరు జయ కదా. నేను మిసెస్ రమేష్ ని. అంటే మీ బాస్ గారి భార్యను.” రూములో పుస్తకం చదువుతున్న జయ గాభరాగా లేచింది. “ఫరవాలేదు ఏం భయపడకు. నిన్నేం తిట్టడానికో, కొట్టడానికో రాలేదు. అలా చెమటలు పడుతున్నాయేమిటి? ముందు కూర్చో. మనం సావకాశంగా మాట్లాడుకుందాం.
నువ్వు నాకెలా తెలుసా అన్నది, నీ ఇల్లెలా తెలిసింది లాంటి చిన్న ప్రశ్నలొద్దు. సూటిగా పాయింట్ మాట్లాడుకుందాం.” సుమతి తను కూర్చోని బిత్తరపోయి చూస్తున్న జయ చెయ్యి పట్టుకు కూర్చోబెట్టింది చనువుగా.
‘చూడమ్మా , నీవు నాకంటే చిన్నదానివి. నన్ను నీ అక్క అనుకో. ఇప్పుడు చెప్పేదంతా నీ మంచి కోసమే అన్నది అర్ధం చేసుకో. నీకు…..మావారికి మధ్య జరుగుతున్నది నాకు తెలియదనుకోకు. ఇలాంటి విషయాలు ఎన్నాళ్ళో దాగవు. చూడు జయా! నీవు పెళ్ళి కావాల్సినదానివి. ఇలా పెళ్ళయిన మగాడితో సంబంధం పెట్టుకునే ముందు ఒక్కక్షణం ఆలోచించావా? ఈయన నిన్నేమన్నా పెళ్ళి చేసుకుంటా నన్నారా? అని వుండరు.
ఎందుకంటే ఈ మగాళ్ళకి చాటుగా ఓ ఆడదానితో తిరిగి రొమాన్స్ జరపడం ఓ త్రిల్లు గానీ, పెళ్ళాం వుండగా మరొకర్తిని తెచ్చి పెట్టుకుని పెళ్ళాడే దమ్ములుండవు. వాళ్ళు పరువు ప్రతిష్టలతో పాటు భార్య , పిల్లల సంసారం ఏదీ వదలడానికిష్టపడరు. ఈ రెండో ఆడది ఓ డ్రింక్ లాగానో, ఓ పేకాట లాగానో టైంపాస్ కో, థ్రిల్ లో, కిక్కుకో కావాలి వాళ్ళకి. ఆయనకి భార్య పిల్లలున్నారని తెలిసే ఆయనతో సంబంధం పెట్టుకున్నావనుకుంటాను” సుమతి జయ కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగింది. అప్పటికే జయ బాగా చెదిరిపోయింది. సిగ్గుతో, అవమానంతో, చితికిపోతూ, హఠాత్తుగా అలా రమేష్ భార్య వచ్చి అలా నిలేస్తుంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయింది.
“పిచ్చిపిల్లా, నీ స్థితి నాకర్ధం అయింది. ఆయన స్మార్ట్ నెస్, ఆయన హోదా, అంతస్తు చూసి, ఆయన వల్లించిన కల్ల బొల్లి ప్రేమకబుర్లకి మెత్తపడిపోయావు. ఉద్యోగం నీ అవసరం. బాస్ ని ఇంప్రెస్ చెయ్యాలన్న ఆరాటంతో నీ లిమిట్స్ మర్చిపోయావు. ఈ ఇంటేమసీ పెళ్ళికి దారితీయదని తెల్సినా జరిగినన్నాళ్ళూ జరగనీ అనుకుని దానివల్ల వచ్చే లబ్ధి పొందాలనుకున్నావు. నీవు ఒంటరిగా ఈ ఊర్లో ఉండడం, పెద్ద వాళ్ళ దగ్గర లేకపోవడం, ఈ రోజుల్లో దొరికే ఫ్యామిలీ ప్లానింగ్ లు అందుబాటులో వుండడంతో భయపడ్డానికి ఏమిలేదని స్వేచ్ఛగా తిరిగావు. అంతేనా”
జయ తల దించుకుంది. కళ్ళమ్మట నీరు కారసాగింది. నల్లబడ్డ ముఖం పైకి ఎత్తి ప్రాధేయపూర్వకంగా సుమతి వంక చూసింది. “క్షమించండి…..ప్లీజ్…..పొరపాటయింది….ఇంత దూరం ఆలోచించలేదు నేను…..ఇంక నేను……’ వణుకుతున్న గొంతుతో ఏదో అనబోయింది.
“నా మొగుడ్ని వదిలేయి. నాకు పతిభిక్ష పెట్టు, నా కాపురం నిలబెట్టు అని అడగడానికి వచ్చాననుకుంటున్నావా ? నా మొగుడ్ని కలవద్దు అని ఆంక్షలు పెట్టడానికి రాలేదు జయా” జయ తెల్లబోతూ చూసింది.
“నీవు , ఆయన ఇలా దొంగచాటుగా తిరగడం ఎందుకు? తిన్నగా మా ఇంటికే వచ్చేసి అక్కడే ఉందువు గాని అని నీకు చెప్పి తీసుకు వెడదామని వచ్చాను.”
“సుమతిగారూ” జయ భోరుమంది. “ప్లీజ్ సుమతిగారూ! నన్ను క్షమించండి. ఇదంతా నేను కావాలని చెయ్యలేదు. మీ కాపురం పాడు చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏమిటో నాకు తెలుయకుండానే ఇన్వాల్ అయిపోయాను. ఆయన బాస్, ఇంప్రెస్ చెయ్యాలన్న ఆరాటంలో ఆ ఆకర్షణనించి తప్పించుకోలేకపోయాను….. అసలే సిగ్గుతో చితికిపోతున్నాను. ఇంకా మీ ఔదార్యంతో, దయతో నన్ను చంపకండి. ప్లీజ్, తిట్టండి, కొట్టండి చెప్పుతో బుద్ది వచ్చేట్టు” అంటూ ఏడవడం ఆరంభించింది జయ.
“ఇంక ఆయన ముఖం చూడను. ఐ ప్రామిస్. ఆయన్ని కలవను, మాట్లాడను” జయ ఆవేశంగా అంది. సుమతి నవ్వింది.
“దాంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అవదు జయా! నేను నీ దగ్గరికి వచ్చి నానా మాటలు అని మీ ఇద్దరినీ విడదీశానని నామీద కక్ష పెంచుకుని, నీమీద సానుభూతితో నీకు మరింత దగ్గరౌతారు తప్ప ఏం లాభం? జయా నీవు నిజంగా పశ్చాత్తాపపడుతుంటే , చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే నాతో సహకరించాలి”
“చెప్పండి….మీరేం చెప్పినా చేస్తాను”
‘చూడమ్మా ! ఏ వస్తువైనా మనకు అందనప్పుడే అది కావాలనిపిస్తుంది. అందగానే ఏ విలువా కనపడదు. మగాడికి ఆడదీ అంతే! నీతో ఇలా దొంగచాటు రొమాన్సు ఆయనకి థ్రిల్లు ఇస్తుంది. అదే నీవు మా ఇంటికి వచ్చి ఆయనతో వుంటే పది రోజుల్లో నీమీద ముఖం మొత్తుతుంది. నీ మీద ఎంత ప్రేమ, ఆసక్తి వుందో నీకే అర్ధం అవుతుంది. తొందరపడి నీవు ఆయనని ఎలా నమ్మావో నీకే తెలుస్తుంది. ఆయన అసలు రూపు నీకే తెలుస్తుంది.
ఇదంతా నేను నా కోసం కాదు నీ కోసం చేస్తున్నాను. ఈ విషయంలో నాకట్టే నష్టం జరగదు. నాలుగు రోజులు నీతో తిరిగి ముఖం మొత్తి నా దగ్గరికే వస్తారు. భార్యగా సంఘంలో, ఆ ఇంట్లో నా స్థానం చెక్కు చెదరదు. నాలుగు రోజులు సహిస్తే నా సమస్య సమసిపోతుంది. కానీ నీలాంటి చదువుకున్న అమ్మాయిలు నాలాంటి ఇల్లాళ్ళు కలిసి ఈ మగాళ్ళకి బుద్ది చెప్పాలి. ఆడదానికి ఆడదే శత్రువు కాబట్టి మగాళ్ళు ఆట చెల్లుతుంది. వాళ్ళేదో చేశారని అనే ముందు తోటి ఆడదానికి శత్రువవకూడదు.”
జయ కళ్ళు తుడుచుకుంది. మెచ్చుకోలుగా చూసి “చెప్పండి, నన్నేం చెయ్యమంటారో” అంది సుమతి మరో పావుగంట కూర్చుని జయతో మాట్లాడింది.
***
“ఇప్పుడు చెప్పు ప్రభా! నేనింకా నీ కళ్ళకి తెలివితక్కువ మొద్దులాగానే కనపడుతున్నానా ‘ సుమతి చిలిపిగా నవ్వింది.
ప్రభావతి మరోసారి నోరెళ్ళబెట్టింది. “ఏం చేశావే , ఎలా చేశావ్ చెప్పు” ఆరాటంగా అడిగింది.
“చెప్పడానికి ఏముంది వెరీ సింపుల్. ఇదివరకు చెప్పాను చూడు – చిన్నపిల్లాడు – కొత్త బొమ్మ….ఆమాత్రం అప్లై చేశాను. జయని ఇంటికి తీసుకురాగానే ఆయన ముఖం చూడాలి. ఆ గాభరా , భయం చూడాలి. అంత మానవుడూ నీళ్ళు కారిపోయాడు. “దొంగచాటు కర్మ మీకెందుకు? నలుగురి నోళ్ళల్లో పడకుండా ఇంట్లోనే సాగించండి’ అనగానే దిమ్మెరపోయారు.
నామీద ఎగిరారు. జయని తిట్టారు నీకెలా బుద్ది , సిగ్గు లేకుండా వచ్చావని. ‘ఆ అమ్మాయిని అలా వాడుకుని వదిలేస్తే ఊరుకోనని, జరిగిందేదో జరిగింది ఆమె మెళ్ళో తాళి కట్టండి. ఇద్దరం కల్సి వుంటాం’ అనగానే చూడాలి ఆయన ముఖం – గదిలో కాళ్ళు పట్టుకున్నంతపని చేశారు.
“జనం ముఖం మీద ఉమ్మేస్తారు. నా పరువు ఏం కావాలి? నీకిదెం బుద్ది? పెద్ద పతివ్రతననుకుని మొగుడికి రెండో పెళ్ళి చేస్తావా……’ అంటూ ఆయన గోల చూడాలి. నేను జయని అలంకరించి గదిలోకి పంపితే గదిలో పాము వున్నట్టు బయటకి పరిగెత్తారు. వారం రోజుల్లో మానవుడు పిచ్చెత్తిపోయాడు. కంటికి నిద్ర తిండి లేక మనిషి, సగం అయిపోయాడు. అటు జయ, ఇటు నా ముఖం చూడలేక, గదిలోంచి బయటికి రాక మనిషి సిగ్గుతో చితికిపోయాడు. ఆఖరికి నన్ను కౌగలించుకుని ఏడిచేశారు అంత మగాడు. జయ వెళ్ళేవరకు పిచ్చేత్తిన వారిలా అయిపోయారనుకో”-సుమతి నవ్వింది.
“భలేదానివే, ఎంత తెలివే నీకు? నిన్నేదో పిచ్చి మొహం అనుకున్నాను.”
-ప్రభావతి అంది మనస్పూర్తిగా స్నేహితురాలిని మెచ్చుకుంటూ.
(స్వాతి)
*****

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
