
అలసిన కాళ్ళ పయనం
थके पैरों का सफ़र
హిందీ మూలం – సుభాష్ నీరవ్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
శివప్రసాద్ ఒక్కసారిగా బాంబు పేలినట్లు మండిపడ్డాడు. కోపంతో ఆయన సన్నని శరీరం కంపిస్తోంది. ఎదురుగా కింద నేలమీద గోడకి ఆనుకుని ముద్దుగా బిట్టీ అని పిలుచుకునే ఆయన కూతురు సుషమ కూర్చుని ఉంది. వాళ్ళకి ఎదురుగా పుస్తకాలు, నోటుబుక్కులూ చెదిరిపోయి పడిఉన్నాయి. కోపంతో జేవురించిన తండ్రి ముఖాన్ని, ఆయన ఆగ్రహాన్ని చూసి తను వణికిపోయింది. కొంత సమయం ముందే ఆయన ఆఫీసు నుంచి వచ్చాడు. ఉన్నట్టుండి ఆయనకి ఏమయిందో బిట్టీకి అర్థం కాలేదు. కాని, ఆయన కోపానికి కారణం తెలియడానికి తనకి ఎక్కువ సమయం పట్టలేదు. ఇంక తను తలని మోకాళ్ళలో దాచుకుని ఏడుస్తోంది.
భర్త అరుపులు, కేకలు చెవుల్లో పడినప్పుడు వాళ్ళ ఆవిడ వంటింట్లో ఉంది. ఆయనకోసం టీ పెట్టడానికి నీళ్ళు వేడిచేస్తోంది. పరుగెత్తుకుని వీధిగదిలోకి వచ్చి చూస్తే ఆయన కూతురిమీద అదేపనిగా అరిచి కేకలు పెడుతున్నాడు.
“ఇంతకీ చదువు పేరుతో వెలగబెడుతున్నదంతా ఇదన్నమాట… ప్రేమవ్యవహారం నడుస్తోంది…. లవ్ లెటర్లు రాసుకుంటున్నారు. అంతేనా, మాట్లాడవేం?” ముందుకి వచ్చి నాలుగైదు దెబ్బలు తగిలించాలని ఆయనకి అనిపిస్తోంది. ఆయాసపడుతూ దూరంగా ఉండే అరుస్తున్నాడు- “చూడటానికి ఇదే నాకు మిగిలింది ఈరోజుకి. వృద్ధాప్యంలో తండ్రి గౌరవాన్ని మంటకలిపేస్తోంది ఈ రాజకుమారి.”
ఇప్పుడు ఆయన తన చూపులు కూతురివైపు నుంచి భార్యమీదకు మళ్ళించాడు. “నీకేమన్నా తెలుస్తోందా అసలు? ఈ యింట్లో ఏం జరుగుతోందన్నది చూస్తున్నావా! రోజంతా కూర్చుని ఏం చేస్తున్నావు నువ్వు?”
భార్య బిక్కచచ్చిపోయింది. ఆవిడ ఇంతకుముందు ఎప్పుడూ ఆయన ఇలా ఇంత కోపంగా ఉండటం చూడలేదు.
“బయట ఊళ్లోవాళ్ళు ఈసడించుకుంటే అప్పుడే నీకు తెలుస్తుంది. చూడు నీ ముద్దులకూతురు ఏం నిర్వాకం చేస్తోందో.” ఒక చిన్న కాగితం తీసి ఆవిడకి అందిస్తూ అన్నాడు.
అది స్కూలు పుస్తకాల్లోని ఒక రూళ్ళనోట్ బుక్ కాగితంలో రాసిన ఒక ప్రేమలేఖ. శివప్రసాద్ తన కూతురి పుస్తకాల్లో ఒకటి తీసి యాదాలాపంగా పేజీలు తిరగేస్తున్నప్పుడు దొరికింది. ఆ ఉత్తరం చదివి ఆయనలో అగ్నిజ్వాలలాగా ఆగ్రహం భగ్గుమంది. కోపం కట్టలు తెంచుకుంది. బిట్టీమీద ఆయన విరుచుకుపడ్డాడు.
ఆ ఉత్తరం చదివి వాళ్ళ ఆవిడ కూడా క్రుద్ధురాలయింది. భగవంతుడా! ఇంటిగౌరవం మంటకలిసిపోవడానికి సిద్ధంగాఉంది. కాని వాళ్ళకి అదేమీ ఇంతవరకూ అసలు తెలియనేలేదు. ఆమె తన కూతురువైపుకు ఆడసింహంలా విరుచుకుపడింది. ఆవిడ కుడిచెయ్యి, వదులుగా ఉన్న అమ్మాయి జుట్టువైపుకి వేగంగా సాగింది. జుట్టు పట్టుకుని గుంజగానే అమ్మాయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.
“ఎప్పుడు చూసినా సింగారించుకోవడం ఎందుకో ఇప్పుడు అర్థమయింది. అందుకే కదా నిత్యం అద్దంముందు నిలబడి మహారాణి ముఖం అక్కడినుంచి ఎందుకు తప్పుకోదో, కదలదో బాగా తెలిసింది.” అమ్మాయి జుట్టు ఇంకా ఆవిడ చేతుల్లోనే ఉంది. తల్లి బలమైన చేతుల్లోంచి తన కేశాలని విడిపించుకోవడానికి చేతనైనంత ప్రయత్నం ఆ పిల్ల చేస్తోంది.
“ఈ ముదనష్టపు దానికి ఈడు వచ్చేసింది. ప్రేమ ఒక్కటే తక్కువయింది దీనికి…. ఎప్పటినుంచి నడుస్తోందో ఈ నాటకం!” చాలా సేపు వంతులుగా ఒకరితరువాత ఒకరు భార్యాభర్తలిద్దరూ ఆ అమ్మాయి మీద అరుస్తూ ఉన్నారు. శివప్రసాద్ ఊరుకుంటే వాళ్ళావిడ అందుకుంటోంది. ఉండివుండి ఇద్దరూ తమ కర్మని తిట్టుకుంటూ ఉన్నారు. పెద్దమ్మాయి గురించిన దిగులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రెండోది ఈ మరో సంకటం తెచ్చిపెడుతోంది తల్లిదండ్రుల నెత్తిమీదకి!
రాత్రి చాలాసేపు శివప్రసాద్ కి నిద్ర పట్టలేదు. ఇటూఅటూ ఒత్తిగిల్లుతూ కాలం నడుస్తోంది. ఆయన బుర్రలో ఎన్నో విషయాలు అలజడి చేస్తున్నాయి. ఒకటి వస్తూ ఉంటే మరొకటి వెళ్ళిపోతోంది. పిల్లలని తాము ఎంత మమకారంగా చూసుకుంటూ వస్తున్నారు! బిట్టీ అంటే కాస్త ఎక్కువగానే అనుబంధం ఏర్పడింది వాళ్ళకి. కాని, మితిమీరి చూపించిన గారాబం ఫలితమే ఇదంతా.
దగ్గరగానే ఉన్న మంచం మీద వాళ్ళావిడ కూడా ఉండివుండి ఇటూ-అటూ ఒత్తిగిల్లుతోంది. బహుశా ఆవిడకి కూడా నిద్ర రావడంలేదు.
శివప్రసాద్ భార్యవైపుకి తిరిగి నెమ్మదిగా అన్నాడు- “మెలకువగా ఉన్నావా?”
“ఊఁ.” ఆవిడ జవాబు ఇచ్చింది.
“ఎవరీ కుర్రాడు?” శివప్రసాద్ తెలుసుకునేందుకు ఆదుర్దాగా ఉన్నాడు.
“అదే, రెండో నెంబరు వీధిలోని లక్ష్మి కొడుకు. వాళ్ళాయన పోయిన సంవత్సరం యాక్సిడెంటులో వెళ్ళిపోయాడు.”
భార్య చెప్పిన సమాధానం విని శివప్రసాద్ పడుకుని ఉండే ఎగిరిపడ్డాడు. “క్షత్రియులమైన మన ఠాకుర్ ల పిల్లకి తక్కువ కులం కుర్రాడితో ప్రేమా!… దేవుడా… ఇటువంటి రోజు కూడా చూపిస్తున్నావా తండ్రీ!”
మళ్ళీ చాలాసేపు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఇద్దరిమధ్యలో ఒక నిశ్శబ్దం కొంతసేపు తాండవించింది. ఆ మౌనాన్ని చివరికి ఆవిడే భంగం చేసింది.
“నేననేది, తొందరగా దీనికోసం అబ్బాయినెవరినైనా చూడండి. చదువూ గిదువూ మాన్పించేసి దీనిక్కూడా పెళ్ళి చేసెయ్యండి. ఇది బీయే, గీయే చేసి ఏమీ ప్రయోజనం లేదు… పిల్ల చేతిలోంచి జారిపోయేలా కనిపిస్తోంది.”
శివప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. కేవలం వింటూమాత్రమే కూర్చున్నాడు. ఆవిడ నిజమే చెబుతోందని ఆయనకి అనిపించింది. అమ్మాయికి పెళ్ళి చేసెయ్యడమే నయం. ఎక్కువ తాత్సారం చేస్తే గౌరవం మంటకలిసిపోతుంది. ఎక్కడా తల ఎత్తుకునికూడా తిరగడం సాధ్యం కాదు. ఈరోజుల్లో ఆడపిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో ఏమీ తెలియదు.
మర్నాడే, ఏడాదిలో ఎప్పుడైనా రెండు-మూడురోజులు సెలవు తీసుకునే శివప్రసాద్ ఆఫీసునుంచి ఒక్కసారిగా పదిహేను రోజులకి సెలవు తీసుకున్నాడు. ఆడపిల్లకి వరుడిని వెతకాలంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళక తప్పదు. బంధువర్గంలో కుర్రవాడిని వెతకటం ఈరోజుల్లో తేలికైన పనేమీ కాదు. పెద్దమ్మాయికోసం ఎక్కడెక్కడ తిరగవలసివచ్చిందో ఇంకా మరిచిపోలేదు. ఉత్తరదక్షిణాలనుంచి, తూర్పుపడమరలనుంచి, ఎక్కడినుంచి సమాచారం ఏది తెలిసినా పరుగెత్తుకుని వెళ్ళి అక్కడికి చేరుకునేవాళ్ళు. చుట్టాలు-పక్కాలు, బంధుబాంధవులెంతమంది దగ్గరికో వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా పరుగులు తియ్యాలేమో. ఆ పదిహేను రోజులూ నిలిచినచోట నిలువకుండా విశ్వప్రయత్నం చేశారు. అన్నిదిక్కులకూ, తెలిసిన అన్నిచోట్లకీ పరుగులు పెట్టారు. వెళ్ళగలిగిన అన్నిచోట్లకి వెళ్ళారు. కాని అన్ని పరుగులు పెట్టినాకూడా ఎక్కడా పని జరుగుతుందన్న అవకాశం కనిపించలేదు. వాళ్ళు ఎంతోమంది కుర్రవాళ్ళని చూశారు. ఒకచోట ఇల్లూవాకిలీ సరిగా కనిపించలేదు. ఒక్కోచోట కుర్రవాడు నచ్చలేదు. మనకి తొందరగా ఉందని పిల్లని నూతిలోకో గోతిలోకో తోసెయ్యలేముకదా.
పెద్దపిల్లకి ఎంత జాగ్రత్తగానో బంధువర్గాన్ని అంతటినీ విశదంగా సంప్రదించి సంబంధం కుదుర్చుకున్నారు. ఆసమయంలో వాళ్ళు ఆవిధంగా ఏమాత్రం అనిపించలేదు. యాభైవేలతో వ్యవహారం మొదలై చివరికి ముఫ్పైఅయిదు వేలకి ఒప్పందం కుదిరింది. భార్యదగ్గర కొద్దిగా ఉన్న నగలన్నింటినీ చెడగొట్టించి కూతురి కోసం కొత్త వస్తువులు చేయించారు. ఆయన తన ఫండులోనుంచి `ఫైనల్ విత్ డ్రాల్’ గా పాతికవేలు తీసుకున్నాడు. మిగిలిన అప్పువందకి నాలుగురూపాయల వడ్డీతో అలాగే ఉంది. ఇంతవరకూ తీరలేదు.
పెళ్ళి అయిన నాలుగైదు నెలలకే పెళ్ళికొడుకుతరఫువారు తమ అసలు స్వరూపంలోకి వచ్చారు. అమ్మాయి పుట్టింటికి వచ్చినప్పుడల్లా అక్కడినుంచి ఏమైనా పట్టుకువస్తుందని ఆశించసాగారు. ఆ తరువాత ఏమీ తీసుకురాకపోతే దానికి బదులుగా శారీరికంగా, మానసికంగా బాధలు పెట్టే క్రమం ప్రారంభమయింది. గడిచిన రెండేళ్ళలో ఎన్నిరకాలుగా వాళ్ళు బిడ్డని యాతనలకి గురిచేశారో లెక్కలేదు. గత కొద్ది నెలలుగా అమ్మాయి దగ్గరనుంచి విడవకుండా తన బాధని వెళ్ళగక్కుకుంటూ రాసిన ఉత్తరాలు వస్తున్నాయి వాళ్ళకి. కన్నీళ్ళతో రాసిన తమ కూతురి ఉత్తరాలు చదివి వాళ్ళు అశాంతికి గురి అవుతున్నారు, లోలోపలే కుంగిపోతున్నారు. పెట్టుకున్న ఆశలన్నీ వమ్మయిపోతున్నాయి. కన్నకలలన్నీ భగ్నం అయిపోతున్నాయి. భరించలేని కోపంతో తిట్లు లంకించుకుంటున్నారు. వాళ్ళందరూ దయాదాక్షిణ్యాలులేని క్రూరమృగాలు…తోడేళ్ళు…పులులు…సింహాలు…దానితోపాటు తమనుతాము చాలా నిస్సహాయులుగా తెలుసుకుని మిగిలిపోతున్నారు. అంతకన్నా ఏం చెయ్యగలరు? చాలా సార్లు వెళ్ళి స్వయంగా మాట్లాడారు. చేతులు జోడించి వేడుకున్నారు. కాని వాళ్ళమీద ఏమాత్రం ప్రభావం పడలేదు. దున్నపోతులమీద కుంభవృష్టి కురిసినట్లుగా. పైగా వీళ్ళ అమ్మాయిని ఇంకా నరక యాతనలకు గురిచేయసాగారు. నీచులు! దురాశాపరులు! ఇది కావాలి, అది కావాలి అంటూ. రూపాయలచెట్టు ఏమన్నాఉందా వీళ్ళయింట్లో అన్నట్లుగా. కావాలన్నప్పుడల్లా వాళ్ళకి కావలసింది ఏదోఒకటి తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక కూతురు ఉండి ఉంటే వాళ్ళకీ తెలిసేది పరాయి ఇంటినుంచి వచ్చిన పిల్లని కష్టాలు పెట్టడం అంటే ఏమిటో… అప్పుడప్పుడూ వాళ్ళిద్దరూ చాలా కంగారు పడుతున్నారు. మర్నాడు ఏం జరుగుతుందో ఏమాత్రం తెలియదు. పేపరు చదివితే ఎక్కడెక్కడో కట్నం ఆశతో, పేరాశతో కోడలిని ప్రాణం ఉండగానే కాల్చి చంపుతున్నారన్న వార్తలుచదివి వాళ్ళు తీవ్రంగా వణికిపోతున్నారు. కొంపతీసి వాళ్ళ కూతురిని కూడా…
పెళ్ళిఅనే పేరుతో, కల్యాణం అనే పేరుతో బహిరంగంగా వ్యాపారం జరుగుతోంది. పెళ్ళికొడుకులకి వాళ్ళకి కావలసినంత వెల కడుతున్నారు… యాభై వేలు…అరవై వేలు… డభ్భై వేలు…వింటూ ఉంటేనే శివప్రసాద్ కి చెమటలు కారిపోతున్నాయి. ఇంత సొమ్ము వాళ్ళు ఎక్కడినుంచి తేగలరు. రిటైర్ కావడానికి ఇంకా అయిదారేళ్ళు ఉంది. కొద్ది సంవత్సరాల్లోనే మూడో పిల్ల కూడా పెళ్ళికి తయారవుతుంది. ఇంత అప్పు ఎవరిస్తారు. భగవంతుడా. ఈకాలంలో పేదవాడికి ఆడపిల్లనివ్వకు తండ్రీ.
ఈలోగా, బిట్టీ వాళ్ళ అమ్మకళ్ళు కప్పి రెండుసార్లు తన ప్రియుడిని కలుసుకుంది. ఇది తెలిశాక ఆవిడ దాన్ని గదిలో బంధించి కర్రతీసుకుని ఎముకలు విరిగిపోతాయా అన్నట్లుగా చావగొట్టింది. కాని అమ్మాయి ఇంకా మొండితేరిపోతోంది. దెబ్బలకి ఏమీ ఫలితం కనిపించడం లేదు. దాన్ని కాలేజీ మాన్పించేశారు. శివప్రసాద్ చెప్పినమీద వాళ్ళావిడ రోజంతా పిల్లని దృష్టిలో ఉంచుకుంటోంది. అది ఏం చేస్తోంది, ఏం చూస్తోంది, ఏం చదువుతోంది, ఇవన్నీ ఆవిడ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆ అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మని విసిగించడంలో ఆనందం కలుగుతోంది. ఇప్పుడు ఆపిల్ల కావాలని ఒకసారి ఈ గదిలోకి, ఒకసారి ఆ గదిలోకి వెడుతోంది. బాత్ రూంలోకి దూరితే చాలా సేపు అక్కడే ఉండి అప్పుడు బయటికి వస్తుంది. ఒక్కోసారి ఇంట్లోనుంచి బయటికి వచ్చి నిలబడుతుంది. కారణం లేకుండానే నవ్వడం మొదలుపెడుతుంది. వాళ్ళ అమ్మ లోలోపలే ఆహతురాలవుతోంది. పిల్ల చేసే పనులతో వ్యాకులత చెందివ్యథితురాలవుతోంది.
శివప్రసాద్ ఆఫీసుకి వెళ్ళేముందు భార్యకి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెడుతున్నాడు. ఆఫీసునుంచి తిరిగివచ్చినప్పుడు రోజంతా ఏమేం జరిగిందో భార్యనోటి నుండి విని వ్యాకులపడుతున్నాడు. ఈమధ్య ఆయన రక్తపోటు కూడా పెరుగుతోంది. అంతకుముందు రోజు రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయనకి మెలకువ వచ్చి చూస్తే అమ్మాయి తన పక్కమీద లేదు. ఆయన లేచి భార్యని లేపాడు. రెండు గదుల్లోనూ చూశారు. బాత్ రూం అన్నీ కూడా చూశారు. పిల్ల ఎక్కడా లేదు. ఇద్దరూ ఎంతగానో కంగారు పడిపోయారు. వాళ్ళకి తమ గౌరవం మంటకలిసిపోతున్నట్లు అనిపించింది. కొంతసేపట్లోనే అమ్మాయి దొడ్డివైపునుంచి లోపలకి వచ్చింది. ఏం మాట్లాడకుండా తన పక్కమీదికి వెళ్ళి పడుకుంది. దంపతులిద్దరూ కోపంతో పళ్ళు కొరుక్కుంటూ ఉండిపోయారు. వాళ్ళు కూతురిని ఏమీ అనలేదు. రాత్రివేళ అరిచి కేకలు పెడితే బాగుండదు. ఆతరువాత వాళ్ళిద్దరికీ రాత్రంతా నిద్రపట్టలేదు. తెల్లవార్లూ మెలకువగా ఉండి కాపలా కాస్తూ కూర్చున్నారు.
శివప్రసాద్ ఇబ్బంది ఎక్కువైపోతోంది. ఎప్పుడు చూసినా ఆయన పరధ్యానంగా ఉంటూ బాధపడుతూ ఉంటున్నాడు. ఆఫీసు పనిలో కూడా మనస్సు లగ్నం కావడంలేదు. ఫలితంగా ఏవో ఒక తప్పులు జరిగి ఆఫీసరుచేత చివాట్లు తింటున్నాడు. ఇంటికి వచ్చినాకూడా ఏదో ఒక విషయానికి భార్యమీద విసుక్కుంటున్నాడు. ఏమీ తినాలనికాని తాగాలనికాని అనిపించడంలేదు. ఆకలి అనేది ఎక్కడ మాయమై పోయిందో తెలియదు. ఆయనకి నిద్ర అనేది అసలు రావడంలేదు. వచ్చినాకూడా నిద్దట్లో పీడకలలు వస్తున్నాయి. పెద్దకూతురు నిప్పుమంటల్లో చిక్కుకుపోయినట్లుగానూ, రక్షించమని కేకలు పెడుతున్నట్లూ కలల్లో కనిపిస్తోంది. ఆయన ఎదురుగా ఉండికూడా తన కూతురిని కాపాడుకోలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి ఆయనకి బిట్టీకి బలవంతంగా ఎక్కడో పెళ్ళి చేస్తున్నట్లూ, పెళ్ళివారికోసం ఎదురుచూస్తున్నట్లూ కనిపిస్తోంది. ఏర్పాటులన్నీ పూర్తి అయ్యాయి కాని ఉన్నట్టుండి హాహాకారాలు, ఆర్తనాదాలు మొదలయ్యాయి. ఆయన కూతురు సీలింగు ఫ్యాన్ కి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి కలలు చూసి ఆయన కంగారుపడి లేచికూర్చుంటున్నాడు. తీవ్రమైన ఉచ్ఛ్వాస-నిశ్వాసలతో ఆయన ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. ఇంక మిగిలిన రాత్రంతా ఆయనకి నిద్రపట్టడంలేదు. ఆయన మధ్యమధ్యలో లేచి మంచినీళ్ళు తాగుతున్నాడు.
ఆరోజు కూడా ఆయనకి నిద్ర కళ్ళకి చాలా దూరంగా ఉంది. ఆయన ఆలోచనాచక్రం వేగంగా తిరుగుతోంది. ఏంచెయ్యాలో, ఏంచెయ్యకూడదో దిక్కుతెలియని పరిస్థితి ఆయనలో ఏర్పడింది. అమ్మాయి రోజురోజుకీ సిగ్గూ-శరం లేకుండా పోతోందని ఆయన గమనించాడు. ఇరుగుపొరుగు ఇళ్ళలో వాళ్ళ అమ్మాయి గురించి చెవులు కొరుక్కుంటున్నారు. బంధువర్గంలో అమ్మాయికి పెళ్ళిచెయ్యాలనే ఆయన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. కులంలో పెళ్ళి చేయడం అంటే ఇంక వాళ్ళ తాహతుకి సరిపోయేది కాదు. పోనీ అప్పో సొప్పో చేసి పెళ్ళి చేద్దామంటే పిల్ల సుఖపడుతుందని గ్యారంటీ ఎక్కడ ఉంది. అయితే మరి కులాన్ని, బంధువర్గాన్ని కాదని అమ్మాయికి పెళ్ళి చేసేద్దామంటే? ఆ తక్కువ కులం కుర్రాడితో, కులంకాని కులంలోని కుర్రవాడితో… జనం ఏమనుకుంటారు? కులంలో, జాతిలో అందరూ అసహ్యించుకుంటారు. కాని, కులంలోనే చేసినా ప్రయోజనం ఏముంది? పెద్దమ్మాయికి కులంలోనే కదా పెళ్ళి చేసింది. ఇంత ఖర్చు పెట్టికూడా ఏం లభించింది? బాధ, దిగులు, వ్యాకులత తప్ప మరేం మిగిలింది!
అమ్మాయిని కట్నం కావాలనే దురాశతో రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు, దాన్ని చంపుకు తింటున్నప్పుడు, లేదా ప్రాణాలు తీసుకోవడం తప్ప గత్యంతరం లేదని అనిపించేలా చేస్తున్నప్పుడు ఈ చుట్టాలు, పక్కాలు, బంధువులు… వీరంతా ఏమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ముందుకి వచ్చి నిలబడి ఎవరు సహాయపడుతున్నారు? ఈ అత్యాచారాలని ఎదిరించి ఆడపిల్ల తల్లిదండ్రుల బాధని తమ బాధగా భావించి ఎవరు తమ గొంతు విప్పుతున్నారు? వెళ్ళి ఆ క్రూరమృగాలకి ఎవరూ నచ్చజెప్పరు. వాళ్ళని ఎవరూ కులంలోనుంచి వెలి వెయ్యరు. వాళ్ళని ఎవరూ అసహ్యించుకోరు… అలా ఎంతసేపు మనస్సులో ప్రశ్నల ప్రభంజనం ఆయన్నిఅతలాకుతలం చేస్తోందో తెలియదు.
ఆయన లేచి సమయం చూసుకున్నాడు. రాత్రి పన్నెండు ఇరవైఅయిదు అవుతోంది. అంటే మరోరోజు మొదలయిందన్నమాట. ఆయన లేచి మంచినీళ్ళు తాగాడు. మళ్ళీ మంచం దగ్గరికి వచ్చాడు. ఆయన భార్య కూడా మెలకువగానే ఉంది.
ఉన్నట్టుండి శివప్రసాద్ అడిగాడు- “లక్ష్మి కొడుకుని చూశావా నువ్వు? ఎలా ఉంటాడు?”
ఈ ప్రశ్న విని ఆయన భార్య ఆయనవంక చూడసాగింది. ఆయన అడిగినదానికి ఆవిడ నిశ్చేష్టురాలయింది.
“చూడటానికి బాగానే ఉన్నాడు”, ఆయన భార్య తగ్గించిన గొంతుకతో అంది, “కాని…”
“కాని ఏమిటి?”
“కులం కానివాడు.”
“ఇంకో కులంవాడయితే ఏమయింది, కుర్రాడు బాగుంటే…” శివప్రసాద్ కి తన కంఠస్వరం ఒక్కసారిగా పెరిగినట్లనిపించింది అప్రయత్నంగానే.
“ఊళ్ళోవాళ్ళు ఏమనుకుంటారు? మన పరువు పోదా?”
“ఒకవేళ పిల్ల ఆ కుర్రాడితో లేచిపోయి వెళ్ళిపోతే ఏమన్నా మిగులుతుందా పరువు?”
“చూడండి మరి. చుట్టాలందరిలో అసలు గౌరవం లేకుండా పోతాం.”
“అలా అయితే అవనీ. చుట్టాలందరూ అసహ్యించుకుంటే అసహ్యించుకోనీ. ఇప్పుడు మాత్రం మనకి ఏం సహాయపడుతున్నారు గనుక. కట్నం ఏర్పాటుచేసుకోకపోతే పిల్ల పెళ్ళికాకుండా అలా కన్యలాగానే ఉండిపోతుందా? మనకులంలో, మనసముదాయంలో పెద్దమ్మాయికి పెళ్ళి చేసి చూశాంకదా, దానికేమంటావు నువ్వు?” శివప్రసాద్ మాట్లాడుతూ పోతున్నాడు.
ఆయన భార్య మౌనంగా ఉంది. ఏమీ మాట్లాడలేదు. తన భర్త చెబుతున్నది ఏమీ కొట్టిపారేసే విషయం కాదు. ఆమె కళ్ళముందు పెద్ద కూతురి కళాకాంతులు లేని ముఖం కదలాడింది. క్రూరజంతువులకి అప్పగించాం దానికి పెళ్ళిచేసి. ఇప్పుడు ఏ చుట్టం-పక్కం మనకి ముఖం చూపించడు. ఎవరూ వాళ్ళకి నచ్చజెప్పరు. కులం వాళ్ళందరికీ తలకాయలు మొద్దుబారిపోయాయి… భగవంతుడా, నా బిడ్డని రక్షించు తండ్రీ. ఆవిడ మనస్సులోనే ప్రార్థన చేసుకోసాగింది.
శివప్రసాద్ భార్య మౌనాన్ని అంగీకరించినట్లుగా భావించి అన్నాడు- “అయితే సరే, లక్ష్మి వాళ్ళ ఇంటికి రేపు ఇద్దరం వెడదాం. ఇంక పడుకో.” ఆయన లేచి లైటు ఆర్పేశాడు. వచ్చి మంచంమీద పడుకుని నిద్రపోవడానికి ఉపక్రమించసాగాడు.
***
సుభాష్ నీరవ్ – పరిచయం
27 డిసెంబరు 1953 న మురాద్ నగర్, ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన శ్రీ సుభాష్ నీరవ్ (అసలు పేరు : సుభాష్ చంద్ర) హిందీ కథారచయితగా, కవిగా, పంజాబీ-హిందీలమథ్య అనువాదకర్తగా గత 42 సంవత్సరాలనుంచి ప్రసిద్ధి చెందినవారు. ఇప్పటివరకు వీరి 9 కథాసంకలనాలు, 3 మినీకథాసంకలనాలు, 3 కవితాసంకలనాలు, 2 బాలకథాసంకలనాలు, వెలువడ్డాయి. 6 కథాసంకలనాలకి సంపాదకత్వం చేశారు. కొన్ని కథలు విద్యాసంస్థల వేరువేరు స్థాయి కోర్సులలో పాఠ్యాంశాలుగా చోటు చేసుకున్నాయి. వీరు పంజాబీ నుంచి ఇంచుమించు 700 కథలు, 200 మినీకథలు, 500 కవితలను అనువదించారు. ఇవికాక వివిధప్రక్రియలలో 60 కన్నా ఎక్కువ సాహిత్యగ్రంథాలను పంజాబీనుంచి అనువదించారు. పంజాబీ కవితలకు ఒక హిందీఅనువాదసంకలనం సాహిత్య అకాడమీ, ఢిల్లీనుండి ప్రచురితమయింది. ప్రసిద్ధ హిందీపత్రికలు `కథాదేశ్’, `చేతన’, `మంతవ్య’ యొక్క పంజాబీ కథల ప్రత్యేక సంచికలకి సంపాదకత్వం మరియు పంజాబీనుండి అనువాదం చేశారు. ఉత్తమసాహిత్యసృజనకు భారతీయ అనువాద పరిషత్, రాజస్థాన్ పత్రిక, ఇండియా నెట్ బుక్స్ మొ. ద్వారా గణనీయమైన సన్మానాలు పొందారు. 2024 లో వీరు అందుకున్న `అమర్ ఉజాలా శబ్ద సమ్మాన్’, `హిందీ అకాడమీ అనువాద్ సమ్మాన్’, `వేలీ ఆఫ్ వర్డ్స్ బుక్ అవార్డ్’ కూడా విశిష్టమైనవి. జూలై 2025 లో ఇంటర్నేషనల్ ట్రాన్స్ లేషన్ అకాడమీ, కొచ్చిన్ వారు అనువాదానికి మొదటి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో వీరిని సన్మానించారు. కేంద్రప్రభుత్వంలో అండర్ సెక్రటరీ పదవినుంచి డిసెంబరు 2013లో రిటైర్ అయినతరువాత పూర్తిగా సాహితీవ్యాసంగానికి సమయం ఇస్తున్నారు. వీరు న్యూఢిల్లీ వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
