దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

తుఫాను వెలిసింది. నావ తీరాన్ని సమీపించింది. దేవి కిటికీ తెరిస్తే ప్రభాత కిరణాలు పలకరించాయి.

“ఈనాటి సుప్రభాతం ఎంతో ఆహ్లాదంగా వున్నది కదా!” అన్నది దేవి.

“సుప్రభాతం నిశి” అన్నది దివ.

నిశి కొంటెగా నవ్వుతూ “అవునా, ఇది అపరాహ్ణ సంధ్య, నీది అవసానము నాది ఆరోహణము అని అనుకున్నానులే!” అన్నది.

“లేదు, నువ్వు అవసానములో వున్నావు, నేను ఆరోహణలో వున్నను” అన్నది దివ.

దేవి ప్రశాంతంగా “నా అవసానమే నాకు సుప్రభాతం. నేడు చౌధురాణికి సుప్రభాతమే! ఎందుకంటే గతంకు అవసానమే కదా! ఈవేళ నాకు వాస్తవమైన ప్రశాంతత లభించింది. ఇప్పటి దాకా నా గుండెలలో రగిలిన జ్వాల చల్లారింది” అన్నది.

నిశి కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయింది. తర్వాత నవ్వుతూ “ఈవేళ దేవి మరణించింది. ప్రఫుల్ల మాత్రం అత్తవారింటికి వెళ్తున్నది.”

“అందుకు ఇంకా సమయం వున్నది. నావను తీరానికి చేర్చమని చెప్పు” అన్నది దేవి.

నిశి వెళ్లి నావికులను ఆదేశించి వచ్చింది.

రంగరాజును పిలిచి “ఇప్పుడు ఎక్కడ వున్నామో తెలుసుకో. రంగాపురం, భూత్నాధ్ ఎంత దూరమో కనుక్కో” అన్నది దేవి.

రంగరాజు వచ్చి “రంగాపురం ఇక్కడి నుండి చాల రోజుల ప్రయాణం. భూత్నాధ్ ఒక రోజు ప్రయాణం వుంటుంది” అన్నాడు.

“ఇక్కడ పల్లకీలు, దారికాచే బంటులు దొరుకుతారా?”

“నేను ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు.”

“మావగారిని స్నానం చెయ్యమని చెప్పే సాకుతో నావ నుండి దించండి” నిశితో అన్నది దేవి.

“ఇంత తొందారేమిటో!” అన్నది దివ.

“ఆ మాత్రం అర్థం కాలేదా? రాకుమారుడు సప్తసాగరాలు దాటి వచ్చాడు. అయినా రాకుమారి దొరకక రాత్రి బయట బల్లపైన పడుకున్నాడు” అంటూ పరిహసించింది నిశి. నిశి రంగరాజుని తీసుకుని బయటకు వెళ్లింది. హరివల్లభ రాయ్కి వినబడేటట్టుగా, “లెఫ్టినెంట్ సాహబ్ని ఉరి తియ్యాలి” అన్నది.

హరివల్లభ రాయ్ “మరి నా సంగతి” అంటూ వాపోయాడు.

“బ్రాహ్మడు కదా, ఉరి తీయకూడదు శూలం వెయ్యాలి. వెళ్లి స్నానం చెయ్యమని చెప్పు” అని రంగరాజుని ఆదేశించింది నిశి.

రంగరాజు వెళ్లి హరివల్లభ రాయ్ని నావనుండి దించి సంధ్య వార్చుకొమ్మని చెప్పాడు.

దేవి నిశికి ఒక చిన్న సంచి ఇస్తూ “ఇందులో వంద మొహిరీలు వున్నాయి. అవి లెఫ్టినెంట్ సాహబ్కి ఇచ్చి, రంగాపురం తిరిగి వెళ్లమని చెప్పు” అన్నది.

నిశి రంగరాజుతో చెప్పి ఏర్పాటు చెయ్యించింది. రంగరాజు వెళ్లి క్రింద ఘాట్ మీద వున్న హరివల్లభ రాయ్కి వినబడేటట్టుగా, లెఫ్టినెంటుని గట్టిగా “లే” అని ఆదేశించాడు.

“ఏం, నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోతారు?”

“ఇప్పుడు నువ్వు మాకు ఖైదీవి. చెప్పినట్టు చెయ్యి.” లెఫ్టినెంట్ సాహబ్ కిక్కురుమనకుండా రంగరాజు వెంట వెళ్లి ఘాట్ మీదకు దిగాడు. అప్పుడే స్నానానికి దిగిన హరివల్లభ రాయ్ “సాహబ్ని ఎక్కడకు తీసుకు వెళ్తున్నారు?” అని అడిగాడు.

“ఎదురుగా కనబడుతున్న అడవిలోకి”

“అక్కడకు తీసుకెళ్లి ఏం చేస్తారేమిటి?”

“ఉరి తీస్తాం.”

హరివల్లభ రాయ్ కంపించి పోయాడు. గాయత్రి మంత్రం మర్చిపోయాడు, సంధ్య కూడా సరిగ్గా వార్చుకోలేదు. అడవిలోకి వెళ్లిన తరువాత రంగరాజు లెఫ్టినెంటుతో “మేము ఎవరినీ ఎప్పుడూ ఉరి తియ్యలేదు. అలాగే మేము డాకూ, దోపిడీలు చేసేవాళ్లము కూడా కాదు. మా రాణి ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యలేదు, చేయించలేదు. వెళ్లు, నీ ఇంటికి పో. నిన్ను విముక్తుడిని చెస్తున్నా” అన్నాడు. కొన్ని క్షణాలు ఆగి “ఎలా వెళ్దామని అనుకుంటున్నావు” అని ప్రశ్నించాడు.

“ఎలాగో ఒకలాగా వెళ్తానులే.”

“పడవ కట్టించుకో, లేకపోతే అటు వుండే గ్రామానికి వెళ్లి గుఱ్ఱం కట్టించుకో. ఇదిగో, రాణి నీకు దారి ఖర్చుల కోసం వంద మొహిరీలు ఇచ్చింది” అంటూ సంచి అందిచాడు రంగరాజు. లెఫ్టినెంటుకి దేవి వ్యవహారం అంతుబట్టలేదు. సంచిలో నుంచి ఐదు మొహిరీలు తీసుకుని “ఇవి చాలు, ఇది కూడా అప్పుగానే తీసుకుంటున్నాను” అన్నాడు.

“ఈ డబ్బు ఇచ్చింది తిరిగి తీసుకోవటం కోసం కాదు. నీ సిపాయిల కొంతమంది గాయపడి వుంటారు, ఎవరన్నా మరణించి వుంటారు కూడా. వాళ్లకి ఇవ్వు. నీ సిపాయలకి ఇంకేమన్నా అవసరం వుంటే వచ్చి రాణిని ప్రాధేయపడమని చెప్పు” అన్నాడు రంగరాజు.

“ఎందుకు?”

“రాణి ఆదుకుంటుంది కాబట్టి.”

లెఫ్టినెంటుకి అంతా వింతగా వున్నది. రంగరాజు చెప్పింది పూర్తిగా నిజమేనా అంటూ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతూనే మారుమాట లేకుండా వెనుదిరిగి వెళ్లిపోయాడు. రంగరాజు దగ్గర వున్న గ్రామానికి వెళ్లి పల్లకీని వెంట బెట్టుకుని నావ వద్దకు బయల్దేరాడు.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.