
నీహార పథం – భాగం-2
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
నీహార పథంలో ఇప్పటిదాకా….
అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ గారు పెండ్యాల కౌసల్యాదేవి మహిళా మండలిని స్థాపించి స్త్రీల సాధికారత కోసం కృషి చేసిన విషయాన్ని, వరంగల్ జిల్లా మొట్టమొదటి ఎం.పీ.గా సేవలు అందించిన నాన్నగారు పెండ్యాల రాఘవరావు ఆనాటి పోరాట సమయంలో వారి స్పీచ్ కాగానే కాళోజీ నారాయణరావు ఏమన్నారో చెప్పిన విషయం అంతా రాశారు. ఆకాశవాణి ప్రభావం, పెద్ద కుటుంబ ఆహ్లాదం, యశోదమ్మకు కృష్ణుడు నోరు చూపించినట్టు వాళ్ళ అమ్మ గారికి ఎందుకు నోరు తెరిచి చూపించారో చెప్పిన కథనం తర్వాత….
***
ఇక చదవండి….
కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని కొన్ని దృశ్యాలు హృదయంలో ముద్రించుకునిపోతాయి. ఎందుకు..ఏమిటి… ఎలా… అనేది అనుభవాల్లోనే తెలుస్తుంది. నాకు కొన్ని విషయాలు మనసు తెరను వెండితెరగా చేసాయి. బహుశా బాల్యాన్ని పదేపదే గుర్తు చేసుకోవడం, తోబుట్టువుల మధ్య ఆరోగ్య కరమైన చర్చలు రావడం వల్లనో, కన్నతల్లిదండ్రులు మరువనివ్వకపోవడం వల్లనో కావచ్చు. ఇవి ఎవరికైనా బాల్య సంఘటనల విషయాలే కాదు, ఆ తర్వాత కాలంలో జీవితాంతం.. .. ఏవైనా కూడా స్నేహితుల వల్లనో, బంధువుల వల్లనో వాళ్ళ వాళ్ళ హృదయాలకు దగ్గరైన వాళ్ళ వల్లనో కొన్ని అలా నిలిచిపోతాయి.
“దేవుడూ… నా దేవుడేడి…? ” అని అమ్మ అనగానే మంచం కింద దాక్కుని ఉన్న నేను, కాసేపు నిశ్శబ్దంగా ఉండి, మరో పిలుపుకే “అమ్మా.. ఇక్కున్నా… ఇక్కల…. ” అనేదాన్నట! అమ్మ తొంగి చూస్తే పెదాలపై వేలు పెట్టకుని silence సంజ్ఞతో ఉండేదాన్నట. మా అమ్మ ఈ విషయాన్ని ఎన్ని సార్లు చెప్పిందో!! “నీ కళ్ళు మెరుస్తుండేవి బిడ్డా… నేను దొరకబట్టొద్దనుకుంటే అలా సమాధానం ఎందుకిచ్చేదానివో అని నవ్వుకునేదాన్ని” అని చెప్పేది.
ఇంతకూ నేను మంచం కింద కూర్చుని చేస్తున్న నిర్వాకం ఏంటో తెలుసా? నేను చెప్తాగా… అదిగో మీలో ఆసక్తి పెరుగుతోంది కదూ… మన్ను తినేదట! అవును! మీరు విన్నది… కాదు కాదు చదివింది నిజమే!
” అమ్మా మన్ను తినంగనే శిశువునో ? యాకొంటినో? వెర్రినో….. తప్పైన దండింపవే!” అంటూ పోతన గారు శ్రీ కృష్ణునితో ఎందుకు చెప్పించారోగానీ .. నేను ఆ లెవెల్ కాదనుకోండి.. అయినా, నోరు తెరిచి” ఆ..” అని ఏమీ తెలియనట్టు చూపించానట!
అలా గోడ గిల్లి మన్ను తినడాన్ని ఆపాలని మా అమ్మ చేసిన ఎన్నో ప్రయత్నాలలో ఒకటేంటంటే…. కొన్ని స్పెషల్ స్పాట్స్ ఉండేవట.. ఆయా చోట .. అచ్చోట …యేమి సేతును యేమి సేతును అని యామె సాలోచనచేసి … హ … ( అమ్మో… ఇదేంటి భాష ఇలా అయ్యిందేంటో!) వేపాకు దంపి, పసరు తీసి, గోడలకు రుద్దించేదట అమ్మ! కొట్టొద్దు కదా పిల్లలను! ఆమె పెట్టుకున్న ప్రిన్స్పుల్ అన్నట్టు.. !! సాధారణంగా అలా ఉండరెవ్వరు. కొట్టి భయపెడతారు కదా! కాని మా అమ్మ మమ్మల్ని ఎప్పుడూ ఏ విషయానికీ ఎన్నడూ కొట్టలేదు, తిట్టలేదు. ఎంతో ఓపికగా నచ్చ చెబుతూ ఏవేవో ఉదాహరణలు చెబుతూ మాకు జీవితాన్ని నేర్పించింది. ఇది చెప్పడానికి చిన్న విషయమే కావచ్చు… కానీ చాలా లోతైన భావం ఇందులో దాగి ఉంది. నాకు మా అక్కయ్యకూ చాలా పొడవాటి జుట్టు ఉండేది. ఇద్దరికీ ప్రొద్దు,మాపు చక్కగా తలలు దువ్వి , నొప్పి పుట్టకుండా చిక్కులు తీసి, జడలు వేసి తయారు చేసేది. రకరకాల జడలు.. కొత్త కొత్త జడలు …పూల జడలు… అలా ఎన్నో ఫ్యాషన్స్ తో వేసేది. మాకు రిబ్బన్ ల డబ్బా, గాజుల డబ్బాలుండేవి. గాజులాయిన సైకిల్ మీద ఓ పెద్ద బుట్ట పెట్టుకొని వచ్చేది . మార్కెట్ లోకి కొత్త వెరైటీలు ఏవైనా వచ్చాయంటే చాలు అవి మాకు తెచ్చిచ్చేవాడు. మా అమ్మ అతనికి డబ్బులు ఇవ్వడమే కాదు కడుపునిండా భోజనం పెట్టి పంపేది. పండుగల సందర్భంగా చేసే పిండివంటలనూ ప్యాక్ చేసి ఇచ్చేది.
చాలా వరకు అక్కయ్య కూ నాకూ ఒకే రకం డ్రెస్ లు కుట్టించేది. మేర వెంకటమ్మ మా టైలర్! ఆమె భర్త మేర యాదగిరి అన్నయ్య వాళ్ల కు కుట్టేది. వీళ్ళ పిల్లలు మమ్మల్ని అక్కయ్యా, అన్నయ్యా అని పిలిచేవాళ్లు.
రిబ్బన్స్ , గాజులైతే చాలానే ఉండేవి కానీ డ్రెస్సులు ఎక్కవ ఉండేవే కాదు. ముఖ్యమైన పండుగలకు, పుట్టిన రోజుకూ కొత్త బట్టలు తీసుకునేవాళ్ళు. అవీ ఎంతో ఎక్కువ ధరవి కాదు. అసలు ఆ రోజు ల్లో రొక్కం ఉండడమే తక్కువ! మనం వేసుకున్న బట్టలే కాదు, మాట్లాడే మాట కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పకుండానే చెప్పింది అమ్మ!
ఆ కాలంలో ఇంటి ముందుకు “మాదాకాలం తల్లో…” అంటూ బిచ్చగాళ్లు వచ్చేవాళ్ళు. వాళ్ల కొరకు అమ్మ అన్నం తప్పకుండా పక్కకు తీసి పెట్టేది. ఆ మాట వినగానే “అలా ఎందుకు అంటారను అమ్మా?” అంటే “మాధవకబళం ” అంటే వండినదాంట్లోంచి ఎవరూ ఎంగిలి చేయకముందే కొద్దిగా అన్నం, కూరనో, పప్పో పక్కకు తీసిపెట్టి దాన్ని ఎవరైనా అడుక్కునే వాళ్ళ కు పెట్టడం అన్నట్టు. యాచకులలో భగవంతుని దర్శించి అన్నం పెట్టడమన్నట్టు” అని చెప్పింది. అయితే ఇలా తీసిపెట్టడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మిగిలిన అన్నమో, బియ్యమో వేసే వాళ్ళు. ఉన్నవాళ్లు ధనరూపేణా ఇస్తారు. రొక్కం అంటే డబ్బు లు, చిల్లర పైసలు ఉండడమే కష్టం ! తర్వాత కాలంలో ఓ 5 పైసల బిళ్ళో , 10 పైసల బిళ్లో ఇచ్చేవాళ్లం. ఇది అందరూ చేస్తారు కదా ఇందులో విశేషం ఏముంది అనిపించొచ్చు, ఏంటంటే…. సాధారణంగా అందరూ ఎలా మాట్లాడుతారు? “బిచ్చపోడు.. “,”బిచ్చపుది ..” అంటారు కదా! కానీ,”బిచ్చ పాయన” , “బిచ్చపామె” అనేది మా అక్కయ్య ! మమ్మల్నీ అలాగే అనమనేది. ” ఇంకానయమే ‘బిచ్చపువారు‘ అనమనలేదు ” అనికూడా వెక్కిరించే వాళ్ళు అక్కయ్యను. ఎవరిగురించైనా గౌరవంగా మాట్లాడాలి అని నేర్చుకున్నాను అక్కడే. అలా అని ఎవ్వరినీ “అరే …”,”తురే …” అనకుండా ఉన్నామా? లేదు . అన్నాము.. అంత చనువు ఉన్నోళ్లనూ, స్థాయిలో తక్కువ ఉండేవాళ్ళనూ అనలేదా? అనేవాళ్ళం. కానీ ఎవరి మర్యాద వాళ్ళదే! అవమానపరిచే ఉద్దేశ్యంతో కాదు. వాళ్ళు దీన్నీ గౌరవంగానే భావించారు కానీ తక్కువ చేస్తున్నారని అనుకోలేదు.
ఇంకా చెప్పాలంటే… “నీ బాంచెను చిందొర్సానీ… నీ కాల్మొక్త..” వంటి మాటలు విని ఎంత బాధపడేవాళ్లమో! నేనైతే వెంటనే ఖండించేదాన్ని! ఇవన్నీ పోవాలనే కదా మా బాపు తన తండ్రినే ఎదిరించి, హరిజనులను ఇంట్లోకి తీసుకొచ్చి భోజనాలు పెట్టారు, సహపంక్తి భోజనాలు చేసారు! “మార్పు మన ఇంట్లోనే తేలేకపోతే బయట ప్రపంచానికి ఏం నీతులు చెప్తాం? చెప్పింది చెయ్యాలి చెయ్యగలిగేదే చెప్పాలి, మాట వేరు నడత వేరు ఉండొద్దు” అని తాతయ్యను ఎదిరించి మార్చినవాడు మా నాన్న! కాలాన్ని బట్టి ఆ మార్పులు కూడా జరిగాయి . సామాజిక కోణంలో ఆలోచించడం అనేది చాలా చిన్న వయసు నుంచే అమ్మ వాళ్ళు నేర్పించారు. కులాల ప్రసక్తి తీసుకురావద్దు అనేవాళ్ళు. ఎదుటి వాళ్ళ కులం ఏంటో ఎందుకు నీకు అవసరం లేదు అని చెప్పారు. మేము అలాగే పాటించాం. కానీ, ఈ మధ్యకాలంలో నేను, ఒకరు… ఒకరేంటి … కొందరు చెప్పగా విన్నాను. ….ఏంటంటే, కులాలు అడగకుంటే వాళ్ళ తాహత్తు , శక్తి ఎలా తెలుస్తుంది? వాళ్ళ నేపథ్యం ఎలా తెలుస్తుంది ? ఏ కష్టాల కుటుంబం నుంచి వాళ్ళు వచ్చారో తెలిస్తేనే కదా వాళ్లకు తగినట్టుగా నేర్పించగలిగేది, మాట్లాడగలిగేది అని! ప్రత్యేకంగా ఇది టీచర్ల విషయంలో తప్పనిసరి అనిచెబితే విని, నేను ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను. బహుశా ఈ సామాజిక తారతమ్యాల వల్ల ఏర్పడిన ఒకానొక అనిశ్చిత స్థితి నుంచి బయటపడేయాలనుకున్న మా నాన్న లాంటి వాళ్లు ఆనాడు పోరాటాలు చేశారు కాబట్టి అలా అప్పుడు కులాలు అడగొద్దన్నారేమో! ఇప్పుటి పరిస్థితులు వేరు ఇంకొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులు వేరు , మా నాన్న వాళ్ళు ఆనాడు వెట్టి చాకిరీ నిర్మూలన చేసిన పరిస్థితులు వేరు. కాలాన్ని బట్టి మారాలి, మార్పులను స్వీకరించాలి. ఇంత వయసు వచ్చినా ఇంకా తెలియని కొత్త విషయాల ఉన్నాయి .. తెలుసుకోవాల్సిందే అని అనిపిస్తుంది ఇప్పుడు!
హరిజనుల కోసం ఇండ్లు కట్టించిచ్చారు . వాళ్ళకే కాదు ఆర్థికంగా నూ బలహీనం గా ఉన్న ఇతర కులస్తులున్నారు. వాళ్ళ కూ భూదానం చేసారు, ఆర్థికంగా ఆదుకున్నారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.
మా బడి “ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల” వెనుక భాగంలో హరిజన వాడ ఉండేది. బడికి వాళ్ళ పిల్లలూ కొందరు వచ్చేవాళ్ళు అని తెలుసు.
అయితే, క్లాస్ లో స్కూల్ లో మమ్మల్ని కాస్త ప్రత్యేకమైన గౌరవభావంతోనే చూసేవాళ్లు. బహుశా బాపు పిల్లలం గానో, మేమూ అందరితో సభ్యతతో మాట్లాడడం వల్లనో ! మంచిగా చదవడం వల్లనో ఏమో … !
ఉదయం ప్రార్థనా గీతం పాడడం, ఏవైనా జాతీయ ఉత్సవాలు వస్తే దేశభక్తి గీతాలు పాడడం పద్యాలు చదవడం , ఏడవ తరగతి వరకు వచ్చేసరికి చిన్న చిన్న ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి బాధ్యత తో చేసేదాన్ని. మా అక్కయ్య అన్నయ్య చదువుకున్నప్పుడు 5వ తరగతి వరకే మా ఊర్లో ఉండేది. 6 నుండి స్టేషన్ ఘణపూర్ లోనే! ఇప్పుడు మా బడి ఉన్నత పాఠశాల అయిపోయింది. దశాబ్దం క్రితం 2017 లో బాపు ‘శత జయంతి ఉత్సవాలు’ నిర్వహించడానికి చిన్నపెండ్యాలకు వెళ్ళినప్పుడు చూశాను చాలా మార్పులు వచ్చాయి. మా బడి లోనే సభను నిర్వంచాం . పిల్లలు గ్రామస్థులంతా వచ్చారు. బడి ముందు బాపు విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఆ రోజు పిల్లలకు బాపు జీవితం చరిత్ర పుస్తకాలు ఇస్తే బాగుంటుంది అన్నారు. “నా ప్రజా జీవితం- పెండ్యాల రాఘవరావు” అని 2007 లో ప్రచురించిన పుస్తకం 1000 కాపీలు ఎప్పుడో అయిపోయాయి. అంత అర్జెంట్ గా ఆ పెద్ద పుస్తకం మళ్లీ ప్రింట్ చేయించలేము. ” పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం” అని నేను రచించాను. ఇది తెలుగు అకాడమీ వాళ్ళు 2014 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాయించారు, ప్రచురించారు. . అవి మన దగ్గర ఉండవు. ఏం చేయాలి? అని ఆలోచించి, అప్పటికప్పుడు ఓ 30,35 పేజీల చిన్న పుస్తకం రాసాను .. క్లుప్తంగా బాపు గురించి. అవి ప్రింట్ చేయించి ఆ రోజు అందరికీ ఇచ్చాం. ఆ సభలో మహామహులు పాల్గొన్నారు. తర్వాత ఈ వివరాలు రాస్తాను.
*****
( ఇంకా వుంది )

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .
